అక్కిరాజు ఉమాకాంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్కిరాజు ఉమాకాంతం

తెలుగు, సంస్కృతము, ఆంగ్లములలో పండితుడైన అక్కిరాజు ఉమాకాంతం (1889-1942) [1] తెలుగు సాహితీ విమర్శను చాలా ప్రభావితము చేసిన రచయిత.

వీరు వంగదేశం (బెంగాల్) లో నవద్వీప సంప్రదాయాన్ని అనుసరించి భాష్యాంతంగా సంస్కృత వ్యాకరణం, తర్కశాస్త్రం అభ్యసించారు. అక్కడి సాహిత్యవేత్తలతో సాహచర్యం వలన, వంగ సాహిత్యాభ్యుదయానికీ గల కారణాలను వివేకంతో సూక్ష్మంగా పరిశీలించడం వలన తనకు కలిగిన జ్ఞానాన్ని ఆధారంగా తీసుకొని తన మాతృభాష తెలుగును పరామర్శించడం ప్రారంభించారు.

1916లో వావిలికొలను సుబ్బారావు ప్రారంభించిన త్రిలింగ పత్రికకు సంపాదకులుగా ఉన్నారు.[2] 1920 నుండి 1936 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు శాఖకు అధ్యక్షులుగా పనిచేశారు.[3]

1910లో 'త్రిలింగ కథలు' ప్రచురించాడు. 1911లో అక్కిరాజు ఉమాకాంతం మొట్టమొదట 'పల్నాటి వీరచరిత్ర' యొక్క ప్రతులు సంపాదించి, సంస్కరించి అచ్చువేయించాడు. అదే ఇతివృత్తంలోని పలువురు వీరుల కథలను ఆధారం చేసుకుని పల్నాటి వీరుల కథలు రాశారు. 1928 లో ఆధునిక కవిత్వములో ప్రమాణాలు లేకపోవడాన్ని విమర్శిస్తూ 'నేటి కాలపు కవిత్వం' రచించాడు. ఈయన విమర్శకుడే కాక రచయిత కూడా.[4] 1913లో టిప్పూ సుల్తాన్ జీవత చరిత్ర ఆధారముగా రచించిన నవల ప్రముఖమైనది. ఇవే కాక 'షేక్స్పియర్ నాటక కథలు' చక్కని శైలిలో రచించారు. వీరి రచనలలో అలంకార శాస్త్రానికి సంబంధించిన 'రసమీమాంస', 'ఆంధ్ర చంద్రాలోక వివరణం', 'సంస్కృత వ్యాకరణ ప్రదీపానికి ఆంధ్ర వరణం', పాణినీయం', 'నైషధ తత్త్వ జిజ్ఞాస', 'తెలుగు దేశమందలి చండాలురు' అనేవి మరికొన్ని.[5]

భావకవిత్వపు ప్రభంజనంలో మునిగి తేలుతున్న ఆంధ్ర దేశపు కవులను తట్టిలేపే నిమిత్తం, "నేటి కాలపు కవిత్వం" అనే విమర్శనా గ్రంథం వ్రాసి. అందులో 1926 కు ముందు వచ్చిన కవిత్వంపై చేసిన విమర్శ ఈనాటికీ హేతుబద్ధంగా, నిత్యసత్యంగా నిలచే ఉంది. అక్కిరాజు ఉమాకాన్తమ్ తన విమర్శతో అభిమానులకంటే వ్యతిరేకుల్నే పెంచుకొన్నాడు. కవిజన వ్యతిరేకి అన్న అపఖ్యాతిని తెచ్చుకున్నాడు. అయితే ఈయన చేసిన విమర్శలకు ఇంతవరకు ఎవ్వరూ సరైన ప్రతివిమర్శను చెయ్యకపోవటం గమనించదగినది.[6]

మూలాలు[మార్చు]