Jump to content

డబ్బు భలే జబ్బు

వికీపీడియా నుండి
డబ్బు భలే జబ్బు
దర్శకత్వంకె.ఎస్.రాజేంద్ర
తారాగణంగొల్లపూడి మారుతీరావు ,
సుమలత
సంగీతంగంగై అమరన్
నిర్మాణ
సంస్థ
అల్లు ఆర్ట్స్
విడుదల తేదీ
సెప్టెంబరు 19, 1992 (1992-09-19)
సినిమా నిడివి
130 నిమిషాలు
భాషతెలుగు

డబ్బు భలే జబ్బు 1992 లో విడుదలైన ఒక కుటుంబ కథా చిత్రం.[1] ఈ సినిమాలో గొల్లపూడి మారుతీ రావు, రావు గోపాలరావు ప్రధాన పాత్రలు పోషించారు.

చిత్రంలోని ఒక సన్నివేశం. ఈ సన్నివేశంలో రావుగోపాలరావు, అచ్యుత్, సుమలత, మహర్షి రాఘవ తదితరులు ఉన్నారు

కుటుంబరావు (గొల్లపూడి మారుతీరావు) డబ్బు కన్నా కుటుంబానికి ఎక్కువ విలువనిచ్చే వ్యక్తి. రావుగోపాల రావు అందుకు విరుద్ధంగా ప్రపంచంలో డబ్బుకు మించింది లేదనే భావంతో ఉంటాడు. కుటుంబరావుకు నలుగురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. ఆయన పదవీ విరమణ చేసేనాటికి ఆఖరి కూతురికి తప్ప మిగతా వారికంతా పెళ్ళై ఉంటుంది. విరమణ తర్వాత ఆయనకు కొంత డబ్బు చేతికందుతుంది. పెళ్ళైన ఇద్దరు కొడుకులు, కూతురు ఆ డబ్బును వేర్వేరు అవసరాల కోసం కావాలంటారు. అందుకు ప్రతిఫలంగా వాళ్ళ నాన్నకు నెలకు ఐదు వందలు ఇచ్చేలాగా ఒప్పిస్తారు. ఆ విధంగా తన పిల్లల సంతోషమే తన సంతోషమని తన డబ్బంతా వారి కోసం ఖర్చు చేసేస్తాడు.

రావు గోపాలరావు డబ్బును అంతగా ప్రేమించడం, మానవ సంబంధాలకు అంతగా విలువ ఇవ్వకపోవడం వెనుక బాధాకరమైన కథ ఉంటుంది. ఆయన కొడుకు రాజా, హేమ (సుమలత) అనే అనాథను పెళ్ళి చేసుకుని వచ్చేసరికి వారి కుటుంబంలో ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటారు. రాజాకు దివాకర్ (రాజ్ కుమార్) అనే తమ్ముడు కూడా ఉంటాడు. అతను బాధ్యత లేకుండా ఉంటాడు. రాజా తన కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత హేమకు అప్పజెపుతాడు. దివాకర్ కుటుంబరావు ఆఖరి కూతురైన లక్ష్మిని ప్రేమిస్తుంటాడు.

తమ అవసరాలు తీరగానే కుటుంబరావు కొడుకులు ఆయనను, భార్యను నెమ్మదిగా నిర్లక్ష్యం చేయడం మొదలుపెడతారు. వారిని తమ ఇంట్లో అన్ని పనులు చేసిపెట్టే పనివారిగా భావిస్తుంటారు. కుటుంబరావుకు ఈ పద్ధతి నచ్చక పెద్ద కొడుకును నిలదీస్తాడు. దాంతో అన్నదమ్ములిద్దరు కలిసి తల్లిదండ్రులును విడదీస్తారు. కుటుంబరావు చిన్నకొడుకు ఇంటికి వెళ్ళినా అవమానమే ఎదురవుతుంది. దాంతో ఆయన ఇద్దరు కుమారులును వదిలేసి కూతుర్ని తీసుకుని రావు గోపాలరావు సాయంతో చిన్న గుడిసెలోకి మారతాడు. తండ్రి ఇబ్బందులు గమనించిన లక్ష్మి దివాకర్ ని పెళ్ళి చేసుకుంటుంది.

హేమ ఎంత ప్రయత్నించినా రావుగోపాలరావు మనసు మారకపోవడంతో భర్తతో కలిసి వేరు కాపురం పెట్టడానికి వెళ్ళిపోతుంది. దివాకర్ కూడా కుటుంబం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అన్న వదినలతో ఉండటానికి వెళ్ళిపోతాడు. చివరగా రావుగోపాలరావు కూడా మారి తన కుటుంబంతో కలిసిపోతాడు.

కుటుంబరావు తనకు జరిగిన అన్యాయానికి నిరసనగా కొడుకులిద్దరికీ లాయరు నోటీసులు పంపిస్తాడు. వారిద్దరి ఆఫీసుల్లో ఈ విషయం తెలిసి వ్యవహారం కోర్టు బయటే తేల్చుకోమని హెచ్చరిస్తారు. దాంతో వాళ్ళు తల్లిదగ్గరకు వచ్చి తండ్రి తమపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోమని తండ్రికి చెప్పమంటారు. కానీ అందుకు కుటుంబరావు అంగీకరించడు. చివరికి ఎలాగో ఒప్పుకుని లాయర్ దగ్గరికి మాట్లాడ్డానికి వెళ్ళి వచ్చేసరికి వసుంధర ఆత్మహత్యాప్రయత్నం చేస్తుంటుంది. ఆయన వారించి అదే కోపంతో బయటకు వెళుతుండగా లారీ కింద పడి ఆస్పత్రిపాలవుతాడు. అప్పుడు వసుంధర తన భర్త పడుతున్న బాధలు చూడలేక కొడుకులను కూడా దగ్గరికి రానివ్వదు. అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళి బతుకుదామంటుంది. కానీ రావుగోపాలరావు వచ్చి కొడుకులు తప్పు తెలుసుకున్నారు కాబట్టి వారిని మన్నించి వారితోనే కలిసి ఉండమని అభ్యర్థించడంతో కథ ముగుస్తుంది.

పాత్రలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "డబ్బు భలే జబ్బు". Archived from the original on 2018-07-01. Retrieved 2018-07-26.