బి.నాగిరెడ్డి

వికీపీడియా నుండి
(బొమ్మిరెడ్డి నాగిరెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బొమ్మిరెడ్డి నాగిరెడ్డి
బి.నాగిరెడ్డి
జననంబొమ్మిరెడ్డి నాగిరెడ్డి
డిసెంబర్ 2, 1912
కడప జిల్లా [[[పొట్టిపాడు (కొండాపురం)|పొట్టిపాడు]]
మరణంఫిబ్రవరి 25, 2004
ఇతర పేర్లుబి.నాగిరెడ్డి
ప్రసిద్ధితెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.
పిల్లలుబి. వెంకట్రామరెడ్డి (కుమారుడు)[1]

బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (డిసెంబర్ 2, 1912 - ఫిబ్రవరి 25, 2004) తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన డిసెంబర్ 2, 1912న కడప జిల్లా, కొండాపురం మండలంలోని పొట్టిపాడు గ్రామంలో అమ్మమ్మ ఇంట, రైతు కుటుంబంలో జన్మించాడు. ఈయన స్వస్థలం, సింహాద్రిపురం మండలంలోని ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై.కొత్తపల్లె) గ్రామం.[2] ఆ పల్లెటూరి వీధిబడిలో రామాయణ మహాభారతాలు, భాగవతంలాంటి పురాణగ్రంథాలను మాత్రమే బోధించేవారు. ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో ఉపాధ్యాయుడు పిల్లలకు రోజూ చెప్పేవాడు. ప్రాచీన గ్రంథాల్లోని సూక్తులను, సుభాషితాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవాడు. ఆ ఉపాధ్యాయుడి వద్ద చదువుకున్న నాగిరెడ్డి పది, పన్నెండేళ్ళు వచ్చేనాటికే పురాణేతిహాసాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకోగలిగాడు. అవన్నీ ఆయన ఆలోచనావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి.

ఆ తర్వాత ఆయన మద్రాసు (ఈనాటి చెన్నై) నగరాన్ని చేరుకుని కొన్నేళ్ళపాటు పాఠశాల విద్య అభ్యసించాడు. పాఠశాల విద్య పూర్తి కాకుండానే ఆయన తన కుటుంబం నడుపుతున్న ఎగుమతి వ్యాపార బాధ్యతలు చేపట్టవలసివచ్చింది.

యువకుడుగా అతని స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నాడు. కానీ వ్యాపార నిమిత్తం బర్మా వెళ్ళవలసి వచ్చింది. అయితే రెండవ ప్రపంచయుద్ధసమయంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. ఆయన మళ్ళీ జీవితం కొత్తగా ప్రారంభించవలసివచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించాడు. క్రమంగా ప్రచురణారంగప్రవేశానికి అదే దోహదం చేసింది. ఆంధ్రజ్యోతి అనే సామాజిక-రాజకీయ పత్రికను ప్రారంభించాడు.

అప్పుడే చక్రపాణి సాహచర్యం లభించింది. ఇద్దరూ కలిసి పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పత్రికను తీసుకురావాలనుకున్నారు. దేశం స్వాతంత్ర్యం పొందడానికి ఒక నెల ముందుగా చందమామ ఆవిర్భావం జరిగి దినదినప్రవర్ధమానం కాసాగింది. ఆ తర్వాత ఆయన సినిమా నిర్మాణరంగప్రవేశం చేశాడు.

1974లో ఆయన దృష్టి వైద్యరంగం మీదికి మళ్ళింది. మద్రాసులో రెండు ఆసుపత్రులను నెలకొల్పాడు. కఠినశ్రమ, నిరాడంబరత, వినయం, నిర్దిష్ట పథకాలు రూపొందించడం, ఆయన సహజ గుణాలు. ఆయన పలికే ప్రతి మాటలోనూ, చేసే ప్రతి పనిలోనూ భారతీయ తాత్వికదృష్టి, ముఖ్యంగా భగవద్గీత ప్రబోధించే కర్మసిద్ధాంతప్రభావం స్పష్టంగా కనిపించేది.

ముద్రణ, ప్రచురణ, సినిమా రంగాల నుంచీ; ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలనుంచీ ఎన్నో అవార్డులూ, సత్కారాలూ ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. విశ్వవిద్యాలయాలు గౌరవడాక్టరేట్లతో సత్కరించాయి.

చిత్రరంగంలో[మార్చు]

మొదట్నుంచి నాగిరెడ్డికి పబ్లిసిటీ విభాగం పట్ల ఆసక్తి ఉండేది. ఆయన తన అన్నగారైన బి.ఎన్.రెడ్డి స్థాపించిన వాహినీ సంస్థలో భాగస్వామిగా చేరాడు. రెండవప్రపంచయుద్ధ కాలంలో (1941లో) వాళ్ళ సరుకు తీసుకువెళ్తున్న ఓడ బాంబుదాడిలో ధ్వంసం కావడంతో పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది. ఆ పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించలేక తన స్వగ్రామమైన ఓరంపాడు చేరాడు. ఆ తర్వాత వాహినీ వారి భక్తపోతనకు దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి నాగిరెడ్డిని మద్రాసుకు పిలిపించి ఆ చిత్రం తాలూకు పబ్లిసిటీ వ్యవహారాలు అప్పజెప్పాడు. సరిగ్గా అదే సమయంలో జెమినీ వారి బాలనాగమ్మ విడుదలైంది. జెమినీ వారు తమ చిత్రాలకు పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తారు. దానికి దీటుగా ఉండడానికి నాగిరెడ్డి మద్రాసులో హనుమంతుడి భారీ కటౌట్లు పెట్టించి వినూత్న రీతిలో ప్రచారం చేయించాడు. ఆ పబ్లిసిటీ చిత్ర విజయానికి బాగా తోడ్పడింది. దాంతో కె.వి.రెడ్డి ఆయనకు 500 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. ఆ మొత్తంతో నాగిరెడ్డి ఒక ఆస్టిన్ కారు కొన్నాడు.

విజయా సంస్థ[మార్చు]

తర్వాత 1950లో నిర్మాతగా మారి చక్రపాణితో కలిసి విజయా ప్రొడక్షన్స్ స్థాపించాడు. ఉన్నతమైన ప్రమాణాలతో పండితపామర జనరంజకంగా సినిమాలు తీసిన విజయా సంస్థ తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించింది. 1950లో వచ్చిన షావుకారుతో మొదలైన ప్రస్థానం 1962లో వచ్చిన గుండమ్మ కథ వరకు ఉచ్ఛస్థితిలో కొనసాగింది. విజయుడనేది మహాభారత వీరుడు అర్జునుడి పేర్లలో ఒకటి. గెలుపును సూచించే ఆ పేరునే నాగిరెడ్డి తమ సంస్థకు ఎన్నుకున్నాడు. ఆ పేరు విజయా సంస్థకు సార్థకం కావడమే గాక పత్రికా ప్రచురణ, వైద్యం లాంటి ఇతర రంగాల్లో కూడా ఆయన్నే అంటిపెట్టుకుని ఆయన్ను విజయాధినేతగా మార్చింది. అర్జునుడి పతాకంపై పర్వతాన్ని మోసుకొస్తున్న హనుమంతుడి బొమ్మ ఉంటుంది. "జెండాపై కపిరాజు(హనుమంతుడు)" అని అందుకే అంటారు. అర్జునుడి ఆ పతాకమే విజయావారి లోగోలోనూ ఉంటుంది. లోగోలో "క్రియా సిద్ధి స్సత్వే భవతి" అనే ఆర్యోక్తి ఉంటుంది.

విజయావారి సినిమాలు[మార్చు]

షావుకారు : విజయా ప్రొడక్షన్స్ వారి మొదటి సినిమా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన షావుకారు (1950). ఇది తెలుగులో మొట్టమొదటి అభ్యుదయ చిత్రంగా, తెలుగు సినిమాకు పునాదిరాయిగా కీర్తి అందుకొంది. సినిమా రచనలో అంతకు మునుపెరుగని వాస్తవికతను సాధించడమే ఈ కీర్తికి కారణం. ఐతే అప్పటి ప్రేక్షకులు ఆ సినిమాలోని కొత్త భావాలను ఆదరించలేకపోయారు. ఈ సినిమా అనుకున్నంతగా విజయవంతం కాకపోవడంతో తర్వాతి ప్రయత్నంగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో పాతాళభైరవి తీశారు.

పాతాళభైరవి : 1951లో వచ్చిన ఈ సినిమాను జనం విరగబడి చూశారు. మళ్ళీ మళ్ళీ చూశారు. ఇది అంతకు ముందు ఎవరూ కనీ వినీ ఎరుగని ఘనవిజయం సాధించింది. దాంతో ఈ సినిమాను తర్వాత హిందీ, తమిళ భాషల్లో కూడా తీశారు. ఈ సినిమాలోని పాత్రలు తోటరాముడు, నేపాళమాంత్రికుడు, అంజిగాడు, సదాజపుడు, వాళ్ళ కోసం పింగళి నాగేంద్రరావు రాసిన సంభాషణలతో సజీవంగా ప్రజల మనసుల్లో స్థిరనివాసమేర్పరచుకొన్నారు. ఈ సినిమాతో ఎస్వీ రంగారావు లోని గొప్పనటుడు బయటకొచ్చాడు. ప్రేక్షకాదరణలో ఈ సినిమాను అధిగమించగలిగింది మాయాబజార్ ఒక్కటే!

విజయావారి మూడవ సినిమా పెళ్ళిచేసిచూడు. ఇది భారీగా లాభాలనార్జించింది. దీంట్లో ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రిలతో బాటు బాలనటుడిగా నటించిన మోహన్ కందాకు మంచి పేరొచ్చింది.

తర్వాత తమ సంస్థలో దర్శకత్వశాఖలో సహాయదర్శకుడుగా పనిచేస్తున్న కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1954లో చంద్రహారం తీశారు. ఇది గొప్ప చిత్రంగా విమర్శకుల ప్రశంసలు పొందింది కానీ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు.

ఆ తర్వాత వారు తీసిన సినిమాలే నేటికీ తెలుగులో వినోదాత్మక సాంఘిక చిత్రాల్లో మేటిగా కీర్తించబడే మిస్సమ్మ, దాని తర్వాత మాయాబజార్. నిస్సందేహంగా ఇది ప్రపంచస్థాయి చిత్రం. వీటి తర్వాత వచ్చిన రెండు విజయవంతమైన విజయావారి సినిమాలు అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మ కథ. గుండమ్మ కథతో ఒక శకం ముగిసినట్లైంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ - ఆఖరుకు విజయావారి తర్వాతి సినిమాలు కూడా - ఆ స్థాయిని అందుకోలేకపోయాయి.

విజయావారి ఇతర సినిమాలు[మార్చు]

చక్రపాణి మరణం తర్వాత సినిమాలు తీయడం మానుకున్న నాగిరెడ్డి ఆ తర్వాత చాలా కాలానికి 1990లలో విజయా బ్యానర్ మీదే "విజయ" అనే సినిమా తీశాడు. దీంట్లో రజనీకాంత్ నటించాడు.

విజయా సంస్థలో ముఖ్యులు[మార్చు]

నటీనటులు:విజయాసంస్థ ఏర్పడిన నాటి నుంచి 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ' వరకు వారి ప్రతి సినిమాలోనూ హీరో ఎన్.టి. రామారావు గారే. ఆయనతో బాటు విజయావారి ఆస్థాన నటులుగా ఉన్నవాళ్ళు ఎస్వీ.రంగారావు, సూర్యకాంతం, రేలంగి, రమణారెడ్డి తదితరులు. వీరి నటనాప్రతిభ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ కాలంలో నటులు ఇతర సంస్థలు తీసే సినిమాల్లో హీరో వేషం వేయడం కంటే విజయావారి సినిమాల్లో ఎక్స్‌ట్రా వేషం వేయడమే మిన్నగా భావించేవారు. చాలా మంది నటులకు విజయావారి సినిమాల్లో నటించాలనే కోరిక మాయాబజార్తో తీరింది. ఆ సినిమాలో నాటి చిత్రరంగంలోని నటులందరూ కనిపిస్తారు. అక్కినేని నాగేశ్వరరావుకు విజయావారి సినిమాల్లో నటించే అవకాశం మొదట మిస్సమ్మ సినిమాతో వచ్చింది. చిత్రరంగంలో అడుగుపెట్టడమే హీరోగా అడుగుపెట్టిన ఆయన ఆ సినిమాలో పూర్తిస్థాయి హాస్యపాత్ర పోషించాడు. మాయాబజార్ తర్వాత ఆయనకు గుండమ్మకథలో సహనాయకుడి పాత్ర వేసే అవకాశం వచ్చింది. అది ఆయనకు నూరవ సినిమా కూడా. అది గొప్ప అదృష్టంగా భావించిన ఆయన ఆ సినిమాకు పారితోషికం తీసుకోలేదు. కానీ నాగిరెడ్డి ఆయనకు ఇవ్వవలసిన మొత్తాన్ని ఒక విద్యాసంస్థకు విరాళంగా ఇచ్చేశాడు.

తెరవెనుక నిపుణులు: దర్శకులు: ఎల్వీ ప్రసాద్ (షావుకారు, పెళ్ళిచేసిచూడు, మిస్సమ్మ) ; కె.వి.రెడ్డి (పాతాళభైరవి, మాయాబజార్, జగదేకవీరునికథ, మొ), కమలాకర కామేశ్వరరావు (చంద్రహారం, గుండమ్మకథ)

కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు లిద్దరూ మొదట్నుంచి విజయ-వాహినీ సంస్థల్లోనే పనిచేస్తున్నారు. ఇద్దరికీ ఒకరిమీద ఇంకొకరికి అచంచలమైన విశ్వాసముండేది. ఇద్దరిలో ఎవరికి దర్శకుడిగా అవకాశమొచ్చినా ఇంకొకరిని సహాయదర్శకుడిగా తీసుకోవాలనుకున్నారు. ఆ అవకాశం మొదట కె.వి.రెడ్డికే వచ్చింది.

రచయితలు: విజయావారి ఆస్థాన రచయిత తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత జనరంజకమైన మాటలు-పాటలను రాసిన పింగళి నాగేంద్రరావ."ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?" (మాయాబజార్ లో) అంటూ ఆయన ఏదైనా కనికట్టో, మ్యాజిక్కో చేసేటప్పుడు నేడు చిన్నపిల్లలు సైతం పలికే మాట "హాంఫట్"తో బాటు మరెన్నో మాటలు పాతాళభైరవిలో సృష్టించాడు. ఆ రసగంగాప్రవాహం మాయాబజార్ తో సహా విజయావారి ఎన్నో సినిమాల్లో ప్రవహించింది.

డి.వి.నరసరాజు (గుండమ్మకథ,...)

కెమెరామాన్ మార్కస్ బార్‌ట్లే (వెన్నెల పాటలు చిత్రీకరించడంలో ఈయన ప్రతిభ అనన్యం. "లాహిరి లాహిరి లాహిరిలో", "ఎచటనుండి వీచెనో ఈ చల్లనిగాలి" - ఇలా ఎన్నో చిత్రాలలో ఆయన చాయాగ్రహణం ఇప్పటికీ అద్భుతముగా అనిపిస్తుంది. అందుకే విజయా వారి చాలా చిత్రాలలో పాటలు ఇప్పటికీ వెన్నెలలు చల్లుతూనే ఉన్నాయి)

కళాదర్శకుడు మా గోఖలే

ఇతర భాషల్లో[మార్చు]

విజయా సంస్థ తమిళంలో పాతాళభైరవి, కళ్యాణం పన్ని పార్ (పెళ్ళి చేసి చూడు), చంద్రహారం, మిస్సియమ్మ (మిస్సమ్మ), మాయాబజార్, గుండమ్మ కథ, ఎంగవీట్టు పిళ్ళై (సురేష్ ప్రొడక్షన్స్ వారి తొలి సినిమా రాముడు-భీముడు) ; హిందీలో పాతాళభైరవి, మిస్ మేరీ (మిస్సమ్మ), రాం ఔర్ శ్యాం (రాముడు-భీముడు), జూలీ; కన్నడ, సింహళీ భాషల్లో కూడా కొన్ని సిన్మాలు తీశారు.

నాగిరెడ్డి తమిళంలో గుండమ్మ కథ, ఎంగ వీట్టు పిళ్ళై సినిమాలకు తనే దర్శకత్వం వహించాడు.

ఆసక్తికరమైన విశేషమేమిటంటే నాగిరెడ్డి 'రాముడు-భీముడు' రీమేక్ హక్కులు కొని తమిళ, హిందీ భాషల్లో ఎంగవీట్టుపిళ్ళై, రాం ఔర్ శ్యాం తీశాక హిందీలో అలాంటిదే సీతా ఔర్ గీతా అనే సినిమా వచ్చింది. అది వీళ్ళ సినిమాకు కాపీ అని కొందరు ప్రచారం చేశారు. ఐతే ఆ సినిమాను చూసిన నాగిరెడ్డి అది బాగుందని దాన్నే తెలుగులో గంగ-మంగ పేరుతో తీశాడు.

విజయ-వాహిని స్టూడియో[మార్చు]

పత్రికలు-ప్రచురణ రంగం[మార్చు]

తన స్వగ్రామం నుంచి కెవి రెడ్డి పిలుపందుకుని చెన్నైకి తిరిగొచ్చాక భక్తపోతనకు పనిచేస్తున్న కాలంలోనే తన తమ్ముడైన బి.ఎన్. కొండారెడ్డి పేరు మెద బి.ఎన్.కె. ప్రెస్సు ప్రారంభించాడు నాగిరెడ్డి. ఆ ప్రెస్సు నుంచే ఆయన ఆంధ్రజ్యోతి అనే సాంఘిక-రాజకీయ పత్రిక మొదలుకొని అనేక పత్రికలు ప్రచురించాడు. వాటిలో అగ్రగణ్యమైనది చందమామ. ఇతర పత్రికలు:

  • జూనియర్ చందమామ: తొమ్మిదేళ్ల లోపు పిల్లల కోసం చందమామ ప్రత్యేకంగా ఆంగ్లంలో ప్రచురిస్తున్న మాస పత్రిక .

కొంతకాలం నడచి ఆగిపోయిన పత్రికలు:[మార్చు]

  • విజయ చిత్ర, సినిమా వారపత్రిక,
  • వనిత, మహిళల మాసపత్రిక
  • జూనియర్ క్వెస్ట్, పిల్లలకోసం ఇంగ్లీషులో
  • స్పూత్నిక్, పిల్లలకోసం ఇంగ్లీషులో
  • ది హెరిటేజ్, మనోజ్ దాస్ సంపాదకత్వంలో భారతీయ సాంస్కృతిక వైభవాన్ని గురించి తెలియజేసే ఆంగ్ల మాసపత్రిక.

ఆసుపత్రులు-ఆరోగ్యరంగం[మార్చు]

ఆయన చెన్నై వడపళనిలో విజయా హాస్పిటల్, విజయా హార్ట్ ఫౌండేషన్, విజయా హెల్త్ సెంటర్ స్థాపించాడు. బెంగుళూరులోని ప్రసిద్ధ కంటి అసుపత్రి శంకర నేత్రాలయ కూడా విజయా హాసిటల్ ఆవరణలోనే ప్రారంభమైది.

గుర్తింపు-గౌరవాలు[మార్చు]

నిర్వహించిన పదవులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి, సినిమా (24 February 2018). "నేటి సినిమాలో శృంగారం తక్కువ.. అంగారం ఎక్కువ". andhrajyothy.com. Archived from the original on 17 September 2020. Retrieved 17 September 2020.
  2. నర్రెడ్డి, తులసిరెడ్డి. "వినోద విజ్ఞానాల కృషీవలుడు". ఆంధ్రజ్యోతి. No. 25-02-2017. Retrieved 28 November 2017.[permanent dead link]

బయటి లింకులు[మార్చు]

  • చందమామ పత్రిక ఏప్రిల్ 2004 సంచికలో ప్రచురించిన నివాళి