మృణాళ్ సేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మృణాళ్ సేన్
మృణాళ్ సేన్
జననం(1923-05-14)1923 మే 14
ఫరీద్ పూర్, బెంగాల్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం బంగ్లాదేశ్)
మరణం2018 డిసెంబరు 30(2018-12-30) (వయసు 95) [1]
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
మరణ కారణంగుండెపోటు
జాతీయతభారతీయుడు
వృత్తిసినిమా నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1955–2002
జీవిత భాగస్వామిగీతా షోం (1952– died 2017)
పురస్కారాలుపద్మభూషణ్ పురస్కారం (1983)
ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్(2000)

మృణాళ్ సేన్ (14 మే 1923 - 30 డిసెంబర్, 2018 ) భారతీయ సినీ దర్శకుడు. సమకాలీకులైన సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్ లతో కలిపి భారతీయ సమాంతర సినిమాకు ప్రపంచ వేదికపై గొప్ప ప్రతినిధిగా పేరొందారు.[2] సినిమా ద్వారా సామాజిక వాస్తవాన్ని వ్యాఖ్యానించడం, కళాత్మకంగా ప్రతిబింబించడం వంటివాటికి ఆయన పేరొందారు. మృణాళ్ సేన్ అంతర్జాతీయ, జాతీయ వేదికలపై పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, గౌరవాలు పొందారు.

తొలినాళ్ళు[మార్చు]

మృణాళ్ సేన్ 14 మే 1923న అవిభాజ్య భారతదేశంలో (ప్రస్తుతం బంగ్లాదేశ్ లో) ఫరీద్ పూర్ లో హిందూ కుటుంబంలో జన్మించారు. ఫరీద్ పూర్లో హైస్కూల్ విద్య పూర్తిచేసుకుని, కళాశాల విద్యార్థిగా కలకత్తా వెళ్ళారు. సుప్రసిద్ధ స్కాటిష్ చర్చ్ కళాశాలలో భౌతిక శాస్త్రం చదువుకున్నారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలానికి ఆకర్షితులై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సాంస్కృతిక విభాగంతో అనుబంధం ఏర్పరుచుకున్నారు. పార్టీ సభ్యత్వం స్వీకరించకున్నా సోషలిస్ట్ ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ తో ఆయనకి సన్నిహిత సంబంధాలుండేవి.

ఉద్యోగం[మార్చు]

విద్యార్థి దశ నుంచి సినీరంగంపై ఆసక్తి, అభినివేశం ఉన్నా ఆర్థిక స్థితిగతుల కారణంగా మెడికల్ రిప్రజంటేటివ్ గా ఉద్యోగం స్వీకరించాల్సివచ్చింది. ఆ ఉద్యోగం కారణంగా కలకత్తాకు దూరంగా వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇది ఎంతో కాలం పాటు సాగలేదు. కొన్నాళ్ళకే తిరిగివచ్చి కలకత్తాలోని ఓ సినిమా స్టూడియోలో ఆడియో టెక్నీషియన్ గా ఉద్యోగం స్వీకరించారు, క్రమంగా సినీ జీవితం ప్రారంభమైంది.

సినీరంగం[మార్చు]

దర్శకుడిగా తొలి చిత్రం రాత్ భోరేని 1955లో రూపొందించారు, తర్వాతికాలంలో అత్యున్నత నటునిగా పేరుపొందిన ఉత్తమ్ కుమార్ ఇందులో నటించారు. సినిమా అంతగా విజయవంతం కాలేదు. రెండవ సినిమా నీల్ ఆకాశేర్ నీచేతో బెంగాల్ సినీ పరిశ్రమలో చెప్పుకోదగ్గ గుర్తింపు సంపాదించుకున్నారు. మూడవ చిత్రం బైషే శ్రావణ్తో అంతర్జాతీయం గుర్తింపు పొందడం ప్రారంభమైంది. మరో ఐదు సినిమాలు తీశాకా 1969లో తీసిన భువన్ షోమ్ చిత్రం విజయం అతని సినీ జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ సినిమా ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ సినిమాగా అవార్డు పొందింది. భారతీయ సమాంతర సినిమాలకు కూడా ఈ సినిమా ముఖ్యమైన మైలురాయి. భువన్ షోమ్ ద్వారా తొలిసారి జాతీయ పురస్కారాల్లో ఉత్తమ దర్శకునిగా అవార్డు అందుకున్నారు.[3]

అభివ్యక్తి, శైలి[మార్చు]

మృణాళ్ సేన్ దర్శకత్వం వహించిన చిత్రాలు ప్రధానంగా బలమైన రాజకీయ దృక్పథాన్ని వెల్లడిస్తూంటాయి. ఈ కారణంగా ఆయనకు మార్క్సిస్ట్ కళాకారునిగా పేరొచ్చింది.[4] ఆయన కెరీర్ తొలినాళ్ళలో బెంగాల్లో బలమైన రాజకీయ ఉద్యమాలు, అనిశ్చితి నెలకొంది. బెంగాల్లో ప్రారంభమైన నక్సల్బరీ ఉద్యమం దేశాన్ని కుదిపేసింది. ఈ నేపథ్యంలో ఆయన తొలినాళ్ళ సినిమాల్లో వామపక్ష రాజకీయం, అనిశ్చితి ప్రతిబింబించాయి. రాజకీయ దశ మారాకా మృణాళ్ సేన్ తీసిన సినిమాలు మధ్యతరగతిని విశ్లేషిస్తూ, మధ్యతరగతి మనస్తత్వంలోని ద్వంద్వాలని వెల్లడిస్తూన్న కథాంశంతో సాగాయి.

మరణం[మార్చు]

వయసు పెరగడంతో శారీరక సమస్యల కారణంగా కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మృణాళ్ 2018, డిసెంబర్ 30 ఆదివారం ఉదయం 10.30 గంటలకు కోల్‌కతాలోని భవానిపూర్‌లో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచాడు.[3]

పురస్కారాలు, గౌరవాలు[మార్చు]

మృణాళ్ సేన్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు గౌరవాలు పొందారు. 1982లో బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జ్యూరీ సభ్యునిగా వ్యవహరించారు. 1983, 1997ల్లో మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు జ్యూరీ సభ్యునిగా వ్యవహరించారు. జాతీయ చలన చిత్ర పురస్కారాలు పలుమార్లు పొందారు, అంతర్జాతీయ స్థాయిలో బెర్లిన్, కేన్స్, వెనిస్, మాస్కో, మాంట్రియల్, చికాగో, కైరో వంటి అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పలుమార్లు పొందారు. అంతర్జాతీయ ఫిల్మ్ సొసైటీల సమాఖ్యకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

పురస్కారాలు[మార్చు]

జాతీయ స్థాయి[మార్చు]

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-ఉత్తమ చిత్రం
 1. 1969: భువన్ షోమ్
 2. 1974: కోరస్
 3. 1976: మృగయా
 4. 1980: అకలేర్ సంధానే
జాతీయ చలనచిత్ర పురస్కారాలు-రెండవ ఉత్తమ చిత్రం
 1. 1972: కలకత్తా 71
 2. 1980: ఖరిజ్
జాతీయ చలనచిత్ర పురస్కారాలు-ఉత్తమ బెంగాలీ చిత్రం
 1. 1961: పునశ్చ
 2. 1965: ఆకాశ్ కుసుమ్
 3. 1993: అంతరీన్
జాతీయ చలనచిత్ర పురస్కారాలు-ఉత్తమ తెలుగు చిత్రం
 1. 1977: ఒక ఊరి కథ

జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ప్రత్యేక జ్యూరీ పురస్కారం/ప్రత్యేక ప్రశంస (చలనచిత్రం)

 1. 1978: పరాశురం
జాతీయ చలనచిత్ర పురస్కారాలు-ఉత్తమ దర్శకుడు
 1. 1969: భువన్ షోమ్
 2. 1979: ఏక్ దిన్ ప్రతీదిన్
 3. 1980: అకాలేర్ సంధానే
 4. 1984: ఖాందార్

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-ఉత్తమ స్క్రీన్ ప్లే

 1. 1974: పదాతిక్
 2. 1983: అకాలేర్ సంధానే
 3. 1984: ఖరిజ్

అంతర్జాతీయ స్థాయి[మార్చు]

మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం - సిల్వర్ ప్రైజ్

1975 కోరస్ 1979 పరశురామ్

కార్లోవై వేరీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం - ప్రత్యేక జ్యూరీ బహుమతి

1977 ఒక ఊరి కథ

బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

ఇంటర్ ఫిల్మ్ అవార్డ్
1979 పరశురామ్
1981 ఆక్లేర్ సంధానే
గ్రాండ్ జ్యూరీ బహుమతి
1981 ఆక్లేర్ సంధానే

కేన్స్ చలనచిత్రోత్సవం - జ్యూరీ బహుమతి

1983 ఖరిజ్

వల్లడోలిడ్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం - గోల్డ్ స్పైక్

1983 ఖరిజ్

చికాగో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం - గోల్డ్ హ్యూగో

1984 ఖాంధార్

మాంట్రియల్ ప్రపంచ చలనచిత్రోత్సవం - ప్రత్యేక జ్యూరీ బహుమతి

1984 ఖాంధార్

వెనిస్ చలనచిత్రోత్సవం - ఓసీఐసి అవార్డ్ - మర్యాదపూర్వక ప్రశంస

1989 ఏక్‌ దిన్ అచానక్

కైరో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం - ఉత్తమ దర్శకుడు, సిల్వర్ పిరమిడ్

2002 ఆమర్ భుభన్

మూలాలు[మార్చు]

 1. Rakesh Sharma (December 30, 2018). "The Dadasaheb Phalke award-winning film director Mrinal Sen Passed away on Sunday at the age of 95". Bollywood Galiyara. BollywoodGaliyara.com. Archived from the original on 2019-01-01. Retrieved December 30, 2018.
 2. "Memories from Mrinalda". Rediff. Rediff.com. February 1, 2005. Retrieved January 27, 2010.
 3. 3.0 3.1 నమస్తే తెలంగాణ, జాతీయ వార్తలు (31 December 2018). "సుప్రసిద్ధ సినీ దర్శకుడు మృణాల్‌సేన్ అస్తమయం". Archived from the original on 7 January 2019. Retrieved 7 January 2019.
 4. Thorval, Yves (2000). Cinemas of India. Macmillan India. pp. 280–282. ISBN 0-333-93410-5.

బయటి లంకెలు[మార్చు]