Jump to content

దేవికారాణి

వికీపీడియా నుండి
(దేవికా రాణి నుండి దారిమార్పు చెందింది)
దేవికా రాణి

తన భర్త రష్యన్ చిత్రకారుడు రోరిచ్ చిత్రించిన దేవికారాణి చిత్రం
జన్మ నామందేవికా రాణి చౌదరి
జననం (1908-03-30)1908 మార్చి 30
మరణం 1994 మార్చి 9(1994-03-09) (వయసు 85)
బెంగుళూరు, భారతదేశం
ఇతర పేర్లు The Dragon Lady
క్రియాశీలక సంవత్సరాలు 1925 - 1943 (నటిగా)
భార్య/భర్త హిమాంశు రాయ్ (1929 - 1940 His Death)
Svetoslav Roerich (1945 - 1993 His Death)

దేవికా రాణి (Devika Rani) (మార్చి 30, 1908 - మార్చి 9, 1994) సుప్రసిద్ధ భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

ఈమె విశాఖపట్టణంలో జన్మించారు. ఈమె తండ్రి భారతదేశపు తొలి సర్జన్ జనరల్ కల్నల్ ఎం.ఎన్.చౌదరి. శాంతి నికేతన్లో విద్యాభ్యాసం తర్వాత ఉపకార వేతనం మీద లండన్ వెళ్ళి అక్కడ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్, మ్యూజిక్లో సంగీతం, నటనలో శిక్షణ పొందారు.

జర్మనీలో ప్రసిద్ధ సినీ నిర్మాతగా పేరుపొందిన హిమాంశు రాయ్తో పరిచయం ఏర్పడి తర్వాత అది ప్రేమగా మారి 1929లో పెళ్ళి చేసుకున్నారు. బెర్లిన్ లోని యు.ఎఫ్.ఎ. స్టూడియోలో దేవికని చేర్పించి మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ మొదలైన విభాగాల్లో శిక్షణ ఇప్పించారు.

స్వదేశానికి తిరిగివచ్చి స్వంతంగా "కర్మ" (1933) అనే చిత్రాన్ని నిర్మించారు. దేవికారాణి నాయికగా, హిమాంశురాయ్ నాయకునిగా దీనిని హిందీలోకి అనువదించి విడుదల చేయగా ఘనవిజయం సాధించింది.

1934లో "బాంబే టాకీస్" అనే సంస్థను స్థాపించి ఎందరో ఔత్సాహిక కళాకారుల్ని చేర్చుకొని వివిధ రంగాల్లో శిక్షణనిచ్చారు. బాంబే టాకీస్ తీసిన చిత్రాలలో దేవికారాణి, అశోక్ కుమార్ ల జంట హిట్ పెయిర్ గా పేరుపొందారు. ఈమె నటించిన 16 చిత్రాలలోని చాలా పాత్రలు సంఘర్షణాత్మకమైనవి. సమాచ వివక్షతకు గురయ్యే హరిజన యువతిగా అచూత్ కన్య (1936) లో, తల్లికాలేని గృహిణిగా నిర్మల (1939) లో, అనాథగా దుర్గ (1939), తిరగబడిన మహిళగా సావిత్రి (1937) లో విధివంచితురాలైన బ్రాహ్మణ యువతిగా జీవన్ ప్రభాత్ (1937) లో ఆమె నటన అనితర సాధ్యమైనది.

1940 మే 19లో హిమాంశు రాయ్ హఠాన్మరణం పొందడంతో బాంబే టాకీస్ నిర్వహణ బాధ్యత ఆమె చేతిలో పడింది. తర్వాత తీసిన బసంత్, కిస్మత్, అంజానా మొదలైన చిత్రాలు ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టాయి.

తర్వాత బాంబే టాకీస్ స్టుడియోను దర్శించడానికి వచ్చిన సుప్రసిద్ధ రష్యన్ చిత్రకారుడు స్వెతస్లోవ్ రోరిక్ (Svetoslav Roerich) తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి 1945లో వివాహానికి దారితీసింది. తర్వాత ఆమె సినీరంగానికి దూరమయ్యారు.

ఆమె సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1958లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నెలకొల్పిన తొలిసారి ఆమెకు 1969లో ప్రకటించారు. చివరిరోజుల్లో బెంగుళూరులో గడుపుతూ 1994 మార్చి 9 తేదీన పరమపదించారు.

పద్మశ్రీపురస్కారం

మూలాలు

[మార్చు]
  • వెండితెర వెన్నెల రాణి 'దేవికా రాణి', ఫాల్కే అవార్డు విజేతలు, హెచ్. రమేష్ బాబు, చిన్నీ పబ్లికేషన్స్, 2003.

బయటి లింకులు

[మార్చు]