శాంతకుమారి

వికీపీడియా నుండి
(పి.శాంతకుమారి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శాంతకుమారి

శాంతకుమారి తెలుగు సినిమా నటి, దర్శకుడు పి.పుల్లయ్య సతీమణి. ఈవిడ 1936లో 'శశిరేఖా పరిణయం' సినిమాతో నటజీవితం ప్రారంభించి వందకు పైగా సినిమాల్లో నటించారు.

బాల్యం

[మార్చు]

శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. సుబ్బమ్మ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు లో మే 17, 1920 సంవత్సరంలో వెల్లాల శ్రీనివాసరావు గారికి జన్మించారు. శ్రీనివాసరావు గారికి కళలు అంటే ఎంతో ఇష్టం. అందుకనే కూతురైన సుబ్బమ్మను మద్ర్రాసులో ఉన్న ప్రొ.పి. సాంబమూర్తి గారి వద్దకు కర్ణాటక సంగీతం, వయొలిన్ నేర్చుకోవటానికి దరఖాస్తు చేయించారు. డి.కె.పట్టమ్మాళ్ సుబ్బమ్మ యొక్క సహాధ్యాయిని. పదమూడేళ్ళ వయసులోనే సుబ్బమ్మ కర్ణాటక సంగీతం లో ఉత్తీర్ణురాలయ్యింది. పదహైదేళ్ళ వయసులో వయొలిన్ లో ఉత్తీర్ణురాలైంది. తరువాత గురువుగారితో కలసి దక్షిణ భారతదేశం అంతా ఎన్నో కచేరీలు చేసింది. పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది.

సినీ జీవితం

[మార్చు]

సుబ్బమ్మ కచేరి చూసిన దర్శక-నిర్మాత పి.వి.దాసు మాయాబజార్ (1936) లేదా శశిరేఖ పరిణయం సినిమాలో శశిరేఖ పాత్రను ఇచ్చారు. కానీ సుబ్బమ్మ సినిమాలలో నటించటానికి ఆమె బామ్మ నిరాకరించడంతో, పి.వి.దాసు, అతని మేకప్ మనిషైన మంగయ్య వప్పించడానికి ఎంతో ప్రయత్నించారు. సుబ్బమ్మను శశిరేఖ వేషంలో చూసిన ఆమె బామ్మ చివరకు ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకొంది. దాసుగారు సుబ్బమ్మ కొంచెం పాతగా ఉందని పేరును శాంతకుమారిగా మార్చారు.

శాంతకుమారీగా మారిన నట-గాయక సంచలనం తరువాత సినిమా సారంగధర (1937). ఇందులో ఆమె చిత్రాంగి అనే దుష్టపాత్రను ఎంతో ఉత్సాహభరితంగా నటించింది. ఈ చిత్ర దర్శకుడైన పి.పుల్లయ్య గారిని ఇష్టపడి పెళ్ళిచేసుకొంది. పెళ్ళిచేసుకొన్న తరువాతకూడ ఆమె నట జీవితం సాఫీగా సాగిపోయింది. శాంతకుమారి పి.పుల్లయ్య దంపతులకు రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శాంత కుమారి సినిమా జీవితం మొదట్లో అన్నీ పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు. యశోద గా కూడా నటించిన ఈమె కృష్ణుని ముద్దుచేస్తూ "చిరు చిరు నగవులు చిందే తండ్రి" అనే మధురమైన పాటను అద్భుతంగా పాడారు.

శాంతకుమారికి మెదటి సాంఘిక చిత్రం ధర్మపత్ని. అందులో అక్కినేని నాగేశ్వరరావు విద్యార్థిగా నటించారు. అక్కినేనికి శాంతకుమారికీ మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉండేది. అక్కినేనిని ఆమె అప్యాయంగా చిన్న తమ్ముడిని పిలచినట్లు అబ్బి అనే వారు. మాయలోకం సినిమాలో అక్కినేనికి ప్రక్క కథానాయికగా నటించిన శాంతకుమారి, జయభేరి సినిమాలో వదినగా నటించారు, అర్థాంగి సినిమాలోనైతే సవతి తల్లిగా నటించారు. ఎన్.టీ.ఆర్ కు కూడా తల్లా పెళ్ళామా సినిమాలో బామ్మగా నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలైన ఎన్‌.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తమిళ సినీ ప్రముఖులు శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ తదితరులకు చాలా చిత్రాల్లో శాంతకుమారి తల్లిగా నటించారు.

పద్మశ్రీ పిక్చర్స్‌, రాగిణి పిక్చర్స్‌ పేరుతో సొంతంగా ఇరవైకి పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్‌గా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలనే మళ్లీ తీసినపుడు తల్లి పాత్రల్లో నటించిన అరుదైన రికార్డు శాంతకుమారి సొంతం.

సినిమాలలో నటించడం మానేసిన తరువాత ఆమె మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడే పాటలను వ్రాసి, స్వరపరిచే వారు.

నటించిన సినిమాలు

[మార్చు]
  1. మాయాబజార్ లేదా శశిరేఖాపరిణయం (1936)
  2. సారంగధర (1937)
  3. రుక్మిణీ కల్యాణం (1937)
  4. భక్తజయదేవ (1938)
  5. శ్రీ వేంకటేశ్వరమహత్యం (1939)
  6. ధర్మపత్ని (1941)
  7. పార్వతీ కల్యాణం (1941)
  8. కృష్ణప్రేమ (1943) (రాధ పాత్ర)
  9. మాయాలోకం (1945)
  10. గుణసుందరి కథ (1949) (గుణసుందరిదేవి దుష్ట బుద్ధిగల అక్కగా)
  11. షావుకారు (1950)
  12. ధర్మదేవత (1952) (కాత్యాయిని పాత్ర)
  13. అర్ధాంగి (1955)
  14. సారంగధర (1957)
  15. జయభేరి (1959) (అన్నపూర్ణ పాత్ర)
  16. శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960) (వకుళ పాత్ర)
  17. సిరిసంపదలు (1962)
  18. ప్రేమించి చూడు (1965)
  19. ప్రాణమిత్రులు (1967)
  20. బంగారు పిచ్చుక (1968)
  21. అక్కాచెల్లెలు (1970) (జడ్జి రామచంద్రరావు గారి తల్లి)
  22. అల్లుడే మేనల్లుడు (1970) - జానకి
  23. ప్రేమనగర్ (1971)
  24. కొడుకు కోడలు (1972)
  25. సోగ్గాడు (1975)
  26. అందరూ బాగుండాలి (1976)

బహుమతులు

[మార్చు]
  • 1999వ సంవత్సరానికి గాను ఆమె 'రఘుపతి వెంకయ్య అవార్డు'ను అందుకున్నారు.
  • ఎన్‌టిఆర్‌ జయంతి సందర్భంగా సినీ కళాకారులకు ఇచ్చే 'కళా నీరాజన' పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు.

మరణం

[మార్చు]

తెలుగు చిత్ర పరిశ్రమ ఆప్యాయంగా 'అమ్మ' అని పిలుచుకునే నటి శాంతకుమారి జనవరి 17 2006 తదీ మధ్యాహ్నం 12.30 గంటలకు దీర్ఘకాలిక అస్వస్థత తరువాత చెన్నై లోని స్వగృహంలో మరణించింది.

వనరులు

[మార్చు]