గుణసుందరి కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుణసుందరి కథ
దర్శకత్వంకె.వి.రెడ్డి
రచనపింగళి నాగేంద్రరావు (కథ, మాటలు)
స్క్రీన్ ప్లేకె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, పింగళి
తారాగణంగోవిందరాజు సుబ్బారావు, జూనియర్ శ్రీరంజని, కస్తూరి శివరావు, శాంతకుమారి, మాలతి, రేలంగి
ఛాయాగ్రహణంమార్కస్ బార్ట్లీ
కూర్పుఎమ్.ఎస్.మణి
సంగీతంఓగిరాల రామచంద్రరావు, అద్దేపల్లి రామారావు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1949 డిసెంబరు 14 (1949-12-14)
భాషతెలుగు

గుణసుందరి కథ 1949 లో కె. వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో గోవిందరాజులు సుబ్బారావు, జూనియర్ శ్రీరంజని, కస్తూరి శివరావు, శాంతకుమారి, మాలతి, రేలంగి ముఖ్య పాత్రలు పోషించారు. వాహిని పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. షేక్సిపియర్ రచించి ప్రముఖ ఆంగ్ల నాటకం కింగ్ లియర్ నాటకం ప్రేరణతో నిర్మితమైన చిత్రం ఇది.[1][2]

చిత్ర కథ[మార్చు]

ఈ కథ పార్వతి శివుడు విహారం చేస్తూ వెళుతుండగా మొదలౌతుంది. ఒక యువతి ఏడుస్తూ దేవిని ప్రార్థిస్తూ ఉండటం ఆమె ప్రక్కన ఒక ఎలుగు కూర్చొని ఉండటం చూసి పార్వతి ఆమె కథ వివరించమని పరమేశ్వరుని వేడుకొంటుంది. ఆయన ఆ కథను వివరిస్తాడు. ధారానగరాన్ని పరిపాలించే రాజు ఉగ్రసేనునికి హేమసుందరి, రూపసుందరి, గుణసుందరి అనే ముగ్గురు కుమార్తెలు ఉంటారు. గుణసుందరి (శ్రీరంజని) కి జన్మనిస్తూ ఆమె తల్లి చనిపోవడంతో రాజు మళ్ళీ వివాహం తలపెట్టక ముగ్గురు కుమార్తెలనూ అల్లారు ముద్దుగా పెంచుతుంటాడు. ముగ్గురు కుమార్తెలూ యవ్వనవతులైన తర్వాత ప్రజలకు పరిచయం చేసేందుకు సభకు తీసుకొస్తాడు. అక్కడ వారిని తనగురించి చెప్పమన్నపుడు పెద్దకుమార్తెలు తండ్రిని తాము అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తామని, గౌరవిస్తామని చెపుతారు. గుణసుందరి తాను తండ్రిపై గౌరవం అభిమానం ఉన్నాయని కాని తను తన భర్తనే అందరి కంటే అధికంగా ప్రేమిస్తానని చెబుతుంది. దానితో కోపం వచ్చిన రాజు, నీ భర్త ఎవరైనా ప్రేమిస్తావా అని అడుగుతాడు. ప్రేమిస్తానని చెప్పటంతో రాజ్యంలోని కుంటీ, గుడ్డీ, మూగ, చెవిటి వాళ్ళనందరినీ తెప్పించి వారిలో అన్ని అవలక్షణాలు కలిగిన ఒక ముసలి (కస్తూరి శివరావు) ని ఇచ్చి ఆమెకు వివాహం జరుపుతాడు. అదే మూహూర్తంలో ఆమె అక్కలకు తన మేనల్లుళ్ళతో వివాహం జరుపుతాడు.

గుణ సుందరి కథ సినిమా నుండి ఒక సన్నివేశము
గుణ సుందరి కథ సినిమా నుండి ఒక సన్నివేశము

తదనంతరం ఒకానొక సందర్భంలో ఆ ముదుసలి వినికిడి, వాక్కు బాగా ఉన్నవాడని తెలియడం, అతడు తన మేనల్లుళ్ళతో వాదనలకు దిగటం చూసిన రాజు వాళ్ళ ఉనికి సహించలేనివాడై ఇంటినుండి పొమ్మంటాడు. ఆ సందర్భంలో ముసలివానిని కొట్టబోయి పట్టు తప్పి మెట్ల పైనుండి పడి కాలుకు బలమైన గాయాలు తగులుతాయి. గుణసుందరి భర్తకు జరిగిన అవమానంతో అతడితో కలసి అతడి పల్లెకు వచ్చేస్తుంది. భర్తతో కలసి సామాన్యజీవితం గడుపుతూ ఉంటుంది. ఒకరోజు నీటికై చెరువుకు వెళ్ళిన ఆమెను ఒక యువకుడు వెంబడించి ఆమెను వివాహం చేసుకొంటానని చెబుతూ చేయి పట్టుకొంటాడు. ఆమె అతడిని చెంబుతో నుదుటిపై కొడుతుంది. ఇంటికి వచ్చి భర్తతో జరిగింది చెపుతుంది. తరువాత భర్త నుదుటన కూడా గాయం ఉండటం చూస్తుంది. ఒకనాడు భర్త ఆమె ఎప్పుడూ చదువుతుండే పతివ్రతల పుస్తకంలో ఆమె కథను రాసి ఆమెను వెంటాడిన యువకుని బొమ్మ వేస్తాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయి మీరు సామాన్యులు కాదు, మారురూపాన ఉన్న ఎవరో గొప్పవారు, నన్ను పరీక్షీంచక నిజం చెప్పమని కోరుతుంది. అతడు చెరువు దగ్గర వెంటాడిన తన నిజరూపంలో ఆమెకు కనిపిస్తాడు. తన పేరు వీరసేనుడని, తను ఒక రాకుమారుడనని చెప్పి తను తన గురువు కారణంగా శాపానికి గురియైన వైనం చెప్పి, దానిని భార్యకు తప్ప పరులు ఎవరికీ తెలియనివ్వరాదని తెలిసిన క్షణం తాను ఎలుగుబంటిగా మారిపోతానని ఎవరికీ తెలియనివ్వనని మాట తీసుకొంటాడు. గుణ సుందరి ఇంటినుండి వెళ్ళిన కొద్ది కాలానికి ఆమె తండ్రి కాలు గాయాలు పెద్దవై అధిక బాధ పడుతుంటాడు. కూతుళ్ళు అతడికి సేవచేయక సూటి పోటి మాటలని తమ భర్తల సహాయంతో తండ్రి కాలు తీసేయించే ప్రయత్నం చేస్తారు. కూతుళ్ళ గురించి నిజం తెలిసి భయపడిన రాజు మంత్రికి చెప్పి తన కాలు బాగుచేయించే మార్గం చూడమంటాడు. అంజనం ద్వారా మహేంద్రమణి తెచ్చి తాకిస్తే తగ్గుతుందని చెపుతారు పండితులు. అది తెచ్చిన వారికి తనరాజ్యాన్ని ఇస్తానని ప్రకటించమంటాడు రాజు.

గుణసుందరి కథ సినిమా నుండి ఒక సన్నివేశము

తండ్రి అనారోగ్యం గురించి తెలిసిన గుణ సుందరి తన భర్తను ఆ మణిని తీసుకొచ్చి తన తండ్రి అనారోగ్యాన్ని తొలగించమని వేడుకొంటుంది. వీరసేనుడు ముసలి రూపంలోనే మణి కోసం బయలుదేరుతాడు. ఇటు రాజు పెద్ద అల్లుళ్ళు కూడా బయలుదేరుతారు. వీరసేనుడు మణి సాధనలో తన తెలివితేటలతో దారిలో ఎదురైన ఆపదలను గట్టెక్కి, అక్కడ ఉన్న యక్షిణులను గెలిచి తన తోడల్లుళ్ళతో పాటు అక్కడకు చేరుకొని అక్కడ యక్షిణి ద్వారా మంత్రం నేర్చి మహేంద్రమణిని సాధిస్తాడు. అందరూ తిరిగి వస్తుండగా ఒక రాత్రి నిద్రిస్తున్న వీరసేనుడి తలపై మోది అతడిని బావిలో తోసి మణి తీసుకొని పారిపోతారు అతడి తోడల్లుళ్ళు ఇద్దరు. ఇక్కడ పల్లెనుండి గుణసుందరి రాజును వెళ్ళి చూసేందుకు వెళ్ళగా ఆమె అక్కలు ఆమెను అవమానించి ఆమె భర్త గురించి అవమానంగా మాట్లాడటంతో ఆవేశంలో నిజం చెప్పేస్తుంది. అక్కడ బావిలో వీరసేనుడు బల్లూకంగా మారిపోతాడు. మణిని తీసుకొని వచ్చిన రాజు అల్లుళ్ళు దాని మంత్రం మరిచిపోవడంతో గాయాలను మాన్పలేకపోతారు. బల్లూకంగా మారిన వీరసేనుడు జనాలు తరుముతుంటే పల్లెకు వస్తాడు. గుణసుందరి దానిని జనాలనుండి కాపాడి తన ఇంటికి తీసుకుపోయి క్షమించమని ఆవేశంలో చెప్పేసానని ఏడుస్తూ దేవిని ప్రార్థిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు ఆమె ప్రార్థనకు మెచ్చి కోయరూపాలలో ఆమెను, బల్లూకాన్ని వెంటబెట్టుకొని రాజు దగ్గరకు వచ్చి వీరసేనునికి పూర్వరూపం ఇచ్చి అతడి గురించి అందరికీ వివరించి గుణసుందరి పాతివ్రత్యకారణంగానే తాము మెచ్చి భువికి వచ్చామని చెప్పి నిజరూపాలతో అందరికీ దర్శనమిచ్చి అదృశ్యమవుతారు.

నిర్మాణం[మార్చు]

కథా చర్చలు[మార్చు]

దర్శకుడు కె. వి. రెడ్డి అప్పుడే రూపుదిద్దుకుంటున్న సినీ నిర్మాణ సంస్థ వాహినీ స్టూడియోస్ వద్దకు వచ్చి వేమన మీద చిత్రం తీయాలనుకున్నాడు. కానీ వారు తాము మొదటి చిత్రం మంచి విజయవంతమైన చిత్రంగా ఉంటే బాగుంటుందని భావించారు. పింగళి నాగేంద్రరావును తమ రచయితగా ఎన్నుకున్నారు. ఆయన షేక్స్‌పియర్ రాసిన కింగ్ లియర్ నాటకం నుంచి ప్రధాన అంశాన్ని తీసుకుని, దానికి మార్పులు చేసి ఒక కథ రూపొందించాడు. ఆ తర్వాత కె. వి. రెడ్డి, పింగళి, కామేశ్వరరావులు కలిసి స్క్రిప్టును తయారు చేశారు.[3]

చిత్ర కథాచర్చల్లో పాల్గొన్న చక్రపాణికి కథనంలో ఒక విషయం నచ్చలేదు. కథానాయకుడు ఒక రాజకుమారుడు అనే విషయం ముందుగానే ప్రేక్షకులకు తెలిస్తే బాగుంటుందని ఆయన భావించాడు. కానీ కె. వి. రెడ్డి అందుకు అంగీకరించలేదు. అలా తెలియక పోతేనే సస్పెన్స్ ఉంటుందనీ, కథానాయికపై సానుభూతి ఉంటుందనీ భావించాడు.

నటీనటుల ఎంపిక[మార్చు]

కథానాయకుడిగా హాస్యనటుడు కస్తూరి శివరావును ఎంపిక చేశారు. కథానాయికల తండ్రి ఉగ్రసేన మహారాజుగా గోవిందరాజుల సుబ్బారావును ఎన్నుకున్నారు. కథానాయికగా జూనియర్ శ్రీరంజనిని ఎంపిక చేశారు.[3]

చిత్రీకరణ[మార్చు]

ఈ చిత్రం అవుట్‌డోర్ చిత్రీకరణ మద్రాసుకు సుమారు అరవై మైళ్ళ దూరంలో ఉన్న తడ అనే గ్రామంలో జరిగింది.

నిర్మాణానంతర కార్యక్రమాలు[మార్చు]

పాత్రలు - పాత్రధారులు[మార్చు]

వివరాలు[మార్చు]

పాటలు[మార్చు]

 1. అదియే ఎదురై వచ్చేదాకా పదరా ముందుకు పడిపోదాం - రేలంగి, పామర్తి
 2. అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా మమ్ము మా పల్లే పాలింపవమ్మా - ఘంటసాల వెంకటేశ్వరరావు
 3. ఈ వనిలో కోయిలనై కోయిల పాడే గానమునై గానము కోరే - టి.జి. కమలాదేవి
 4. ఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా అపరాధములన్ని మరచి - పి. లీల
 5. ఒహరే ఒహరే ఓ ఒహరే బ్రహ్మదేవుడా నీవెంత వంతకారివయ్యా - కస్తూరి శివరావు
 6. ఓ మాతా రావా నా మొరవినవా నీవు వినా దక్కెవరే ఓ రాజరాజేశ్వరి - పి. లీల
 7. ఓ ఓహొ చారుశీల లేజవరాలా సొగసు భళా - వి. శివరాం
 8. కలకలా ఆ కోకిలేమో పలుకరించే వింటివా - కె.మాలతి, శాంతకుమారి
 9. కల్పగమ తల్లివై ఘనత వెలసిన గౌరి కల్యాణ హారతిని - పి.లీల
 10. చల్లని దొరవోయ్ ఓ చందమామా - కె.మాలతి, శాంతకుమారి
 11. చిటి తాళం వేసినంటే చిట్టంటుడు చేసినంటే - కస్తూరి శివరావు, పి.లీల
 12. శ్రీతులసి ప్రియతులసి జయమునీయవే జయమునీయవే - పి. లీల
 13. హరహరహర ఢమరుక నాదం ...తెలుసుకోండయా - టి.జి. కమలాదేవి బృందం

మూలాలు[మార్చు]

 1. M. L, Narasimham (29 September 2012). "Gunasundari Katha (1949)". The Hindu. Retrieved 31 December 2018.
 2. Radhakrishnan, Sruthi (2018-04-23). "400 years later, Shakespeare still remains relevant in Indian cinema". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-12-14.
 3. 3.0 3.1 "గుణసుందరి కథ - ఆంధ్రభూమి". andhrabhoomi.net. Retrieved 2021-12-14.
 4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.

బయటి లింకులు[మార్చు]

కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య