Jump to content

ఆఖరి పోరాటం

వికీపీడియా నుండి
(ఆఖరిపోరాటం నుండి దారిమార్పు చెందింది)
ఆఖరి పోరాటం
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
రచనయండమూరి వీరేంద్రనాథ్ (కథ), జంధ్యాల (మాటలు)
నిర్మాతసి. అశ్వనీదత్
తారాగణంనాగార్జున,
శ్రీదేవి,
సుహాసిని,
కైకాల సత్యనారాయణ,
అమ్రీష్ పురి
ఛాయాగ్రహణంకె. ఎస్. ప్రకాష్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
మార్చి 12, 1988 (1988-03-12)
సినిమా నిడివి
145 ని
దేశం భారతదేశం
భాషతెలుగు

ఆఖరి పోరాటం 1988లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇందులో అక్కినేని నాగార్జున, శ్రీదేవి, అమ్రిష్ పురి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించాడు. ఇళయరాజా సంగీతం అందించాడు.[1] ఈ సినిమాకు ఆధారం యండమూరి వీరేంద్రనాథ్ ఇదే పేరుతో రాసిన నవల. ఈ సినిమాను 12 వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో మెయిన్ స్ట్రీం విభాగంలో ప్రదర్శించారు. ఇది బాక్సాఫీసు వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది.[2]

సిబిఐ డిప్యూటీ కమీషనర్ ప్రవల్లిక అనంతానంత స్వామి పేరుతో మారురూపులో ఉన్న మాఫియా డాన్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఓ నాటక ప్రదర్శన సందర్భంగా మంత్రి సూర్యారావు మీద హత్యకు అనంతానంత స్వామి పథకం వేస్తున్నాడనని తెలిసి ప్రవల్లిక అక్కడికి వెళుతుంది. దుండగులు సూర్యారావు మీద కాల్పులు జరపడానికి ప్రయత్నించగా ప్రవల్లిక వారిని అడ్డుకుంటుంది. వారు ప్రవల్లిక మీదకు ఎదురుదాడి చేయగా ఆమెకు నటుడు విహారి సహాయం చేస్తాడు. నిజానికి సూర్యారావు మీద సానుభూతి కోసం అనంతానంత స్వామే అలా చేయించాడని తర్వాత తెలుస్తుంది. మరోసారి స్వామి బడికి వెళుతున్న పిల్లల బస్సును అపహరించి, ప్రవల్లిక తన ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే పిల్లల్ని చంపేస్తామని బెదిరిస్తారు. ఒక పిల్లాడిని కూడా చంపేస్తారు. ప్రవల్లిక, విహారి ఇద్దరూ కలిసి ప్రాణాలకు తెగించి పిల్లలను కాపాడతారు.

ఒకసారి విహారి తన ఇంటికి వచ్చినపుడు ప్రవల్లిక సరదా కోసం తానే మగవాడిలా వేషం మార్చి, ప్రవల్లికను పెళ్ళిచేసుకోబోతున్నట్లు చెబుతుంది. అది నిజమే అని విహారి నమ్మేస్తాడు. కానీ ప్రవల్లిక మాత్రం విహారిని ప్రేమించడం మొదలు పెడుతుంది. విహారికి ఫోన్ చేసి అనామక ప్రేమికురాలిగా పరిచయం చేసుకుంటుంది. అది ఎవరా అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు. విహారి స్నేహితుడు పద్మాకర్ అది సునాదమాల అని నిర్ధారిస్తాడు. విహారి సునాదమాలని ఫోన్ చేసింది తానే అని ఒప్పుకోమంటాడు. కానీ ఆ అమ్మాయి అంగీకరించదు.

సూర్యారావు కేంద్రమంత్రి అవుతాడు. కానీ విహారి అతను మోసగాడనీ, అతను అనంతానంత స్వామి సాయంతో తన మీద తానే దాడి చేయించుకుని సానుభూతితో మంత్రి అయ్యాడని చెబుతాడు. కానీ ప్రజలు ఎవరూ నమ్మరు. అనంతానంత స్వామి విహారిని బెదిరించాలని చూస్తాడు కానీ విహారి తెలివిగా అతన్ని బోల్తా కొట్టించి, బురదలో పడదోసి ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడని హెచ్చరిస్తాడు. విహారితో ప్రవల్లిక స్వామిని అంతం చేయడం అంత సులువు కాదని చెబుతుంది. అతనికి ఒక క్రిమినల్ లాయరు సాయం ఉందని చెబుతుంది. ఒక రహస్యమైన దీవిలో ఆయుధాలు తయారు చేస్తున్నట్లు చెబుతుంది. స్వామి తన లాయరు పరమేశ్వరాన్ని పిలిచి తనకు అవమానం చేసిన విహారిని నాశనం చేయమని చెబుతాడు. లాయరు పరమేశ్వరం సాక్షాత్తూ విహారి తండ్రి. గతంలో ఓ రైలు ప్రమాదంలో చనిపోయాడనుకున్న భర్త తిరిగి వచ్చాడని విహారి తల్లి వర్ధనమ్మ ఆనందపడుతుంది. కానీ పరమేశ్వరం తనకు భార్య తరపు నుంచి ఆస్తి దక్కదని తెలిసి స్వామి పంచన చేరి దేశంలోనే పేరు మోసిన క్రిమినల్ లాయరు అవుతాడు. కానీ స్వామి కోరిక నెరవేర్చడం కోసం తన స్వంత కొడుకునే నాశనం చేయడానికి పూనుకుంటాడు లాయర్ పరమేశ్వరం. ప్రవల్లిక పరమేశ్వరం క్రిమినల్ చరిత్ర అంతా తెలుసుకుంటుంది. కానీ విహారికి ఆ విషయం చెప్పడానికి ఆమె మనస్కరించదు. విహారి ఆడే నాటకంలో తన స్నేహితుడు పద్మాకర్ ని చంపే సీన్ లో నకిలీ తుపాకీ తీసేసి నిజం తుపాకీ పెట్టి కొడుకుని జైలు పాలు చేయాలనుకుంటాడు. కానీ సమయానికి ప్రవల్లిక వచ్చి ప్రమాదం జరగకుండా అడ్డుకుంటుంది.

నటీనటులు

[మార్చు]

ఈ చిత్రం లోని పాటల వివరాలు

[మార్చు]

ఈ చిత్రంలో ని అన్ని పాటలు వేటూరి సుందరరామ్ముర్తి గారు రాసారు. ఇళయరాజా సంగీతం అందించాడు.

  • అబ్బ దీని సోకు సంపంగిరేకు - (ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర)
  • ఎప్పుడు ఎప్పుడని - (ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర)
  • గుండెలో తకిట తకిట - (ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర)
  • స్వాతిచినుకు సందెవేళలో - (ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.జానకి)
  • తెల్ల చీరకు తకథిమి - (ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, లత మంగేష్కర్)

మూలాలు

[మార్చు]
  1. "Nagarjuna-RGV movie first look postponed". The Times of India. 25 February 2018.
  2. "Directorate of FilmFestival" (PDF). iffi.nic. Archived from the original (PDF) on 31 December 2017. Retrieved 30 September 2014.