Jump to content

మాయాబజార్

వికీపీడియా నుండి
(మాయా బజార్ నుండి దారిమార్పు చెందింది)
మాయాబజార్
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి.రెడ్డి
నిర్మాణం నాగిరెడ్డి & చక్రపాణి
రచన పింగళి నాగేంద్రరావు
తారాగణం నందమూరి తారక రామారావు ,
అక్కినేని నాగేశ్వరరావు,
ఎస్.వి.రంగారావు ,
సావిత్రి ,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
ఋష్యేంద్రమణి ,
ఛాయాదేవి ,
సంధ్య ,
సి.ఎస్.ఆర్
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు,
సాలూరు రాజేశ్వరరావు
గీతరచన పింగళి నాగేంద్రరావు
విడుదల తేదీ 27 మార్చి 1957 (1957-03-27)(తెలుగు విడుదల)
12 ఏప్రిల్ 1957 (1957-04-12)(తమిళం విడుదల)
30 జనవరి 2010 (2010-01-30)(రంగుల తెలుగు విడుదల)
నిడివి 181 నిమిషాలు
భాష తెలుగు
పెట్టుబడి 33 లక్షలు (సుమారు)
వసూళ్లు 80 లక్షలు (సుమారు)
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మాయాబజార్ తెలుగు చలనచిత్ర రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఒక సినిమా. సిఎన్‌ఎన్-న్యూస్18 టీవీ చానెల్ నిర్వహించిన సర్వేలో భారతీయ సినిమాల్లో సార్వకాలిక అత్యుత్తమమైన సినిమాగా మాయాబజార్ ఎంపికైన సినిమా. ఈ చిత్రం ఆంధ్ర దేశమంతటా 1957, మార్చి 27 వ తేదీన విడుదలై అద్భుత విజయం సాధించింది. 2017 మార్చి నాటికి  60 ఏండ్లు పూర్తిచేసుకొన్న ఈ సినిమాపై వివిధ టెలివిజన్ ప్రసార వాహినులు (ఛానళ్ళు), వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రత్యేక వ్యాసాలు అందించాయి.

షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ తెలుగు సినీ అభిమానులకందించిన మరొక అపురూప కళాఖండం ఇది. భక్త పోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి, దొంగరాముడు మొదలగు చిత్రములను రూపొందించిన కె వి రెడ్డి ఈ చిత్రానికి కూడా దర్శకుడు.

బలరామ (గుమ్మడి వెంకటేశ్వరరావు) కృష్ణుల (ఎన్.టి.రామారావు) చెల్లెలు, అర్జునుడి భార్య సుభద్ర (ఋష్యేంద్రమణి) తన కొడుకు అభిమన్యుడితో పాటుగా పుట్టిల్లు అయిన ద్వారక వస్తుంది. బావా మరదళ్ళైన అభిమన్యుడు, శశిరేఖ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఆప్యాయంగా మసులుకొంటూంటారు. బల పరాక్రమాల్లో పాండవుల వారసునిగా నిరూపించుకుంటూన్న అభిమన్యుడిపై ముచ్చటపడిన సందర్భంలో కృష్ణుడి ప్రోద్బలంతో సుభద్ర అన్నగారు బలరాముడిని వరం కోరుకుని తన కుమారుడు అభిమన్యునికి, శశిరేఖను ఇచ్చి పెళ్ళి చేసే విషయంలో మాట తీసుకుంటుంది. ఆపైన సుభద్ర, అభిమన్యుడు ఇంద్రప్రస్థానికి తరలి వెళ్ళిపోతారు.

ఇంద్రప్రస్థంలో వైభవోపేతంగా జరిగిన రాజసూయ యాగంలో అగ్రతాంబూలం అందుకుని వెనుదిరిగి వచ్చిన కృష్ణుడు, తోడు వెళ్ళిన సాత్యకి ధర్మరాజు పంపిన సత్యపీఠాన్ని బలరాముడికి, అభిమన్యుడు పంపిన ప్రియదర్శినిని శశిరేఖ (సావిత్రి)కి ఇస్తాడు. అప్పటికి పెరిగి పెద్దదైన శశిరేఖకు ఎవరి ప్రియవస్తువు వారికి కనిపించే ప్రియదర్శిని పేటికలో తన ప్రియుడైన అభిమన్యుడు (అక్కినేని నాగేశ్వరరావు) కనిపిస్తాడు.

రాజసూయ యాగంలో పాండవుల వైభవాన్ని, తనకు జరిగిన పరాభవాన్ని తలుచుకుని అసూయచెందే దుర్యోధనుడికి (ముక్కామల) శకుని (సి.యస్.ఆర్. ఆంజనేయులు) తన పాచికల విద్య ప్రదర్శించి, జూదంలో పాండవులను ఓడిద్దామని సలహా ఇస్తాడు. మాయా జూదంలో పాండవులు రాజ్యాన్ని, సంపదనీ, తమనీ, చివరికి ద్రౌపదిని కూడా ఒడ్డి ఓడిపోయి ద్రౌపదికి తీవ్ర అవమానం జరుగుతుంది. ఆపైన రాజ్యం కోల్పోయి 12 ఏళ్ళ వనవాసానికి వెళ్తారు. రాజ్యసంపదలు కోల్పోయి సుభద్ర అభిమన్యుడితో సహా తన పుట్టిల్లు - ద్వారక తిరిగి వస్తుంది.

దానికి ముందే కృష్ణుడి ద్వారా ఈ వివరాలు తెలిసిన బలరాముడు హస్తినాపురం వెళ్ళి కౌరవులను మందలించి, పాండవుల రాజ్యాన్ని వారికి ఇప్పిస్తానని ఆగ్రహావేశాలతో బయలుదేరుతాడు. బలరాముని మనస్తత్వం తెలిసిన శకుని - దుర్యోధనుడు, దుశ్శాసనుడు (ఆర్.నాగేశ్వరరావు), కర్ణుల (మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి)తో సహా ఆయనను అతిగా ముఖస్తుతి చేసి, పాండవులు బలరాముని అవమానిస్తూ మాట్లాడారని కల్పించి తమ విజయం ధర్మ ద్యూతంలో జరిగిన విజయమేనని నమ్మిస్తారు. అంతేకాక రానున్న రాజకీయ స్థితిగతుల్లో యాదవులను, కృష్ణుణ్ణి తమవైపు తిప్పుకుందుకు పన్నాగం వేస్తాడు. దాని ప్రకారం దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడు (రేలంగి) తనకు శశిరేఖను ఇచ్చి వివాహం చేయమని వరం కోరుకుంటాడు, అప్పటికే పొంగిపోయివున్న బలరాముడు అంగీకరిస్తాడు.

పాండవుల రాజ్య సంపదలు పరుల పాలయ్యాయని, శశిరేఖ ఏ వైభవం లేకుండా ఉండాల్సి వస్తుందని భయపడుతున్న రేవతి (ఛాయాదేవి) ఈ వార్తతో సంతోషిస్తుంది. తన కూతురు శశిరేఖ, బావ అభిమన్యుడితో తిరగకుండా కట్టడి చేయడం ప్రారంభిస్తుంది, వీరి కన్నుగప్పి శశిరేఖ అభిమన్యుడు విహరిస్తూనే ఉంటారు. చివరకు అందరి నడుమ శశిరేఖను దుర్యోధన చక్రవర్తి కుమారుడు లక్ష్మణ కుమారునికి ఇచ్చి వివాహం చేసేందుకు వాగ్దానం చేసినట్టు బలరాముడు, రేవతి అంగీకరిస్తారు. దీన్ని శశిరేఖ, సుభద్ర, అభిమన్యుడు ప్రతిఘటిస్తారు. కానీ కృష్ణుడు మాత్రం అప్పటికి తాను అన్నగారి పక్షమే అయినట్టు కనిపిస్తాడు. వాగ్వాదం జరిగి సుభద్ర, అభిమన్యులు దారుకుని రథంపై ద్వారక విడిచి వెళ్ళిపోతారు. అయితే కృష్ణుడు రహస్యంగా దారుకునికి వీరిద్దరినీ అడవిలోని ఘటోత్కచుని ఆశ్రమానికి తీసుకుపొమ్మని ఉపదేశిస్తాడు.

ఘటోత్కచుడు (ఎస్.వి. రంగారావు) రాక్షస వంశీకురాలైన హిడింబి (సూర్యకాంతం), పాండవుల్లో రెండవ వాడైన భీమసేనుల కుమారుడు. అతను అడవిలో ఆశ్రమం నిర్మించుకుని, తన అనుయాయులకు నాయకత్వం వహిస్తూ, పాండవులకు అవమానాలు చేసిన కౌరవులపై ద్వేషం పెంచుకుని జీవిస్తూంటాడు. అతని ఆశ్రమం సమీపంలోకి అభిమన్యుడు, సుభద్ర ఉన్న రథం రాగానే ఎవరో నరులు అనుకుని వెంటనే తన రాక్షస వీరుల్ని పంపి చిత్తుచేయబోతాడు. తర్వాత స్వయంగా తానే వీరిని ఎదుర్కొన్నా, ఆమె తన బాబాయి అర్జునుడి భార్య సుభద్రాదేవి అన్న సంగతి తెలుసుకుని సగౌరవంగా తీసుకువెళ్తాడు. వారిద్దరికీ అతిథి సత్కారాలు జరిపించాకా, సుభద్రకు జరిగిన అవమానాన్ని తెలుసుకుని శశిరేఖను తీసుకువచ్చేందుకు ద్వారకకు బయలుదేరుతాడు.

అర్థరాత్రి ద్వారకకు చేరుకుని అక్కడ శశిరేఖ ఎవరో తెలియక కళవళపడి, చివరకు మాయావేషంలోని కృష్ణుడిని కలుసుకుంటాడు. కృష్ణుడు నిజరూపంలో కనిపించి అతనికి ఉపాయం ఉపదేశిస్తాడు. కృష్ణుడు చెప్పినదాని ప్రకారం నిద్రిస్తున్న శశిరేఖను తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు, తానే మాయా శశిరేఖ(సావిత్రి)గా రూపం ధరించి వచ్చి ద్వారకలో ఆమె శయ్యపై నిద్రిస్తాడు. అలానే తన అనుచరుడైన చిన్నమయ్య, లంబు, జంబులను తీసుకువచ్చి కౌరవులకు ఓ మాయా నగరాన్ని విడిదిగా సృష్టించమని సూచిస్తాడు. తమ తరఫున కురువృద్ధులకు అనారోగ్యంగా ఉందని వంకలు చెప్పి దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులతో పాటుగా వందమంది తమ్ములతో, భార్య భానుమతితో లక్ష్మణ కుమారుని వివాహానికి తరలివస్తారు. ముందుగా పెళ్ళికూతురుని చూడాలని పిలిపించిన లక్ష్మణ కుమారుని ఆటపట్టించి, శకునినీ, భానుమతీ దేవినీ అల్లరిపెడుతుంది మాయా శశిరేఖ.

పెళ్ళికొడుకు తరఫున వచ్చిన శర్మ, శాస్త్రి, సారధి వంటివారిని కనికట్టు చేసి, మాయ చేసి బాధలు పెడతారు చిన్నమయ్య, లంబు, జంబు. మాయా శశిరేఖ రూపం విడిచిపెట్టి ఘటోత్కచుడు పెళ్ళి భోజనం అంతా ఒక్కడే తినేస్తాడు, తిన్న భోజనం లేదనుకునేలోపు మళ్ళా సృష్టిస్తాడు చిన్నమయ్య. కౌరవులు, హస్తినాపురి జనాలు మాయాబజారులో రకరకాల వస్తువులు తీసుకుంటారు.

ద్వారకలో మాయా శశిరేఖ, లక్ష్మణ కుమారుడితో పెళ్ళి వేడుకల్లో కాలు తొక్కేప్పుడు, చేయి పట్టుకునేప్పుడు మోటుగా చేసి బాధలు పెడుతుంది. అంతేకాక పీటల మీద జీలకర్రా బెల్లం పెట్టాల్సిన సమయానికి, తాళి కట్టే వేళకు కోతిలా, కొండముచ్చులా, దెయ్యంలా కనిపించి జడిపిస్తుంది. కౌరవులకు, యాదవులకు వాగ్వాదం ప్రారంభమై, చివరకు సత్యపీఠాన్ని తెప్పించి దానిపై నించోబెట్టగానే దాని ప్రభావంతో శకుని తాము చేసిన అకృత్యాలు, ఈ పెళ్ళి విషయంలో చేసిన పన్నాగాలు బయటపెడతాడు. అంతటితో ఆ వివాహం రసాభాసగా ముగియడంతో, ఘటోత్కచుడు నిజరూపం ధరించి కౌరవులు ధరించిన మాయాబజార్ వస్తువులన్నీ పాములైపోగా, తన మాయతో దుష్టచతుష్టయాన్ని కట్టకట్టి హస్తినాపురికి పంపిస్తాడు.

మరోపక్క ఘటోత్కచుని ఆశ్రమంలో శశిరేఖకు, అభిమన్యుడికి సలక్షణంగా వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి బలరాముడు, రేవతీదేవి, కృష్ణుడు, రుక్మిణీ, ఘటోత్కచుడు తదితరులు తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదిస్తారు.

తారాగణం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

మాయాబజార్ కథాంశంలో పలు పాత్రలు మహాభారతంలోనివే అయినా మహాభారతంలో ఈ కథ ఎక్కడా కనిపించదు. ఈ కథ భారతీయ సినిమాలో దాదాపు పదిసార్లు వచ్చింది. 1957లో విజయా వారి మాయబజార్ రాకముందు, వచ్చిన తర్వాత తెలుగు సహా పలు భారతీయ భాషల్లో శశిరేఖా పరిణయం కథాంశంగా సినిమాలు వచ్చాయి.

  1. మూగసినిమాల కాలంలో "మాయాబజార్" లేదా "సురేఖా హరన్" - 1925లో విడుదలయ్యింది. బాబూరావు పైంటర్ దర్శకత్వంలో వచ్చింది. ఇందులో కథానాయకుడు శాంతారాం.
  2. అదే పేరుతో 1932లో నానూభాయి పటేల్ దర్శకత్వంలో వచ్చింది.
  3. అదే సినిమా తమిళంలో "మాయాబజార్" లేదా "వత్సల కళ్యాణ్"గా వచ్చింది. తమిళ రూపకానకి ఆర్.పద్మనాభన్ దర్శకుడు.
  4. పి.వి.దాసు దర్శకత్వంలో 1935లో "మాయాబజార్" లేదా "శశిరేఖా పరిణయం" పేరుతో తెలుగు సినిమాగా వచ్చింది. ఇందులో శశిరేఖగా శాంతకుమారి నటించింరది.
  5. మరాఠీ మాయాబజార్ జి.వి.పవార్ దర్శకత్వంలో 1939లో వచ్చింది.
  6. ధర్మదత్తాధికారి దర్శకత్వంలో "మాయాబజార్" లేదా "వత్సలా హరన్"గా 1949లో హిందీ, మరాఠీ భాషలలో తీశారు.
  7. నానాభట్ సినిమా "వీర ఘటోత్కచ" లేదా "సురేఖా హరన్" 1949లో వచ్చింది. ఇందులో శశిరేఖగా మీనాకుమారి నటించింది.
  8. తెలుగు, తమిళ భాషలలో కె.వి.రెడ్డి దర్శకత్వంలో 1957లో వచ్చిన ప్రఖ్యాత "మాయాబజార్" దీనిని 1971లో హిందీలోకి డబ్బింగ్ చేశారు.
  9. బాబూభాయి మిస్త్రీ 1958లో తీసిన మాయాబజార్‌లో కథానాయిక అనితా గుహా. తరువాత ఈ సినిమా "వీర ఘటోత్కచ" పేరుతో తెలుగు, తమిళ, కన్నడ భాషలలోకి అనువదింపబడింది.
  10. శాంతిలాల్ సోనీ హిందీలో "వీర్ ఘటోత్కచ" సినిమా తీశాడు.
  11. హిందీలోను, గుజరాతీలోను 1984లో బాబూభాయి మిస్త్రీ "మాయాబజార్" చిత్రం రంగులలో నిర్మించాడు.

నటీనటుల ఎంపిక

[మార్చు]

చిత్రీకరణ

[మార్చు]

పోస్ట్ ప్రొడక్షన్

[మార్చు]

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి మొదటగా సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకులుగా నియమితుడయ్యాడు. 4 యుగళగీతాలకు (చూపులు కలసిన శుభవేళా, నీవేనా నను తలచినది, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునది) స్వర కల్పన చేసాక, కారణాంతరాల వలన ఆయన తప్పుకోగా సంగీత దర్శకుడిగా ఘంటసాల నియమితుడయ్యాడు. రాజేశ్వరరావు కట్టిన బాణీలకే వాయిద్య సంగీతాన్ని సమకూర్చి రికార్డు చేసాడు ఘంటసాల. ఘంటసాల, పి.లీల, పి.సుశీల, మాధవపెద్ది సత్యం మొదలగు వారి నేపథ్య గానంలో వచ్చిన, నీవేనా నను తలచినది, చూపులు కలసిన శుభవేళా, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునదీ, సుందరి నీవంటి, ఆహ నా పెళ్ళీ అంటా, వివాహభోజనంబు వంటి గీతాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. చమత్కారమేమిటంటే ఈ పాటల పల్లవులను తర్వాతి కాలంలో సినిమా పేర్లుగా వాడుకున్నారు. ఆలాగే లాహిరి లాహిరి లాహిరిలో అన్న ఒకే పాటకు ముగ్గురు నటులకు (ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, గుమ్మడి వెంకటేశ్వరరావు) ఘంటసాల పాడటం ఒక ప్రత్యేక విశేషం. చూపులు కలిసిన శుభవేళ పాట బదులు ఆ సందర్భానికి మరో చక్కని పాట "కుశలమా నవ వసంత మధురిమా" అన్నది సాలూరు ట్యూన్ చేశాడు కానీ సినిమాలో వాడలేదని సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు చెప్పాడు.[2]

కె.వి.రెడ్డితో వచ్చిన విభేదాల వలన సాలూరు తప్పుకొనగా మిగిలిన సంగీతాన్ని ఘంటసాల అందించాడు. అయితే సినిమా టైటిల్స్‌లో సాలూరు రాజేశ్వరరావు పేరు చూపలేదు.

పాటలు, పద్యాల జాబితా

[మార్చు]

ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:పింగళి నాగేంద్రరావు; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు.

పాటలు
సం.పాటగానంపాట నిడివి
1."అఖిల రాక్షస మంత్ర తంత్ర" (పద్యం)ఋష్యేంద్రమణి 
2."అల్లి బిల్లి ఆటలె లల్లిలలా పాటలె పింగళి" (మహిషాసుర మర్ధిని స్తోత్రం)పి సుశీల 
3."అష్టదిక్కుంభి కుంభాగ్రాలప" (పద్యం)మాధవపెద్ది సత్యం 
4."అహ నా పెళ్ళియంట-ఓహో నా పెళ్ళియంట"ఘంటసాల వెంకటేశ్వరరావు, సుశీల 
5."ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు"  
6."చూపులు కలసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము"ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల 
7."జై సత్య సంకల్ప జై శేషతల్పా() పింగళి" (పద్యం)మాధవపెద్ది సత్యం 
8."దయచేయండి దయచేయండి"ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల, సుశీల, మాధవపెద్ది సత్యం 
9."దురహంకార మదాంధులై ఖలులు విద్రోహంబు కావించిర" (పద్యం)మాధవపెద్ది సత్యం 
10."నీకోసమె నే జీవించునది"ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల 
11."నీవేనా నను తలచినది"ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల 
12."భళి భళి భళి దేవా"మాధవపెద్ది సత్యం 
13."లాహిరి లాహిరి లాహిరిలో"ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల 
14."వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మా"ఎం. ఎల్. వసంతకుమారి 
15."విన్నావటమ్మా ఓ యశోదమ్మా"పి.లీల, సుశీల, స్వర్ణలత 
16."వివాహ భోజనంబు వింతైన వంటకంబు"మాధవపెద్ది సత్యం 
17."శకునియున్న చాలు శనియేల అని గదా" (పద్యం)సి.ఎస్.ఆర్.ఆంజనేయులు 
18."శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా"బృందగానం 
19."సుందరి నీవంటి దివ్య స్వరూపము"ఘంటసాల వెంకటేశ్వరరావు, సావిత్రి 
20."స్వాతిశయమున త్రుళ్ళు" (పద్యం)మాధవపెద్ది సత్యం 

విడుదల

[మార్చు]

ప్రచారం

[మార్చు]

మాయా బజార్ చిత్రం విడుదల సందర్భంగా చందమామలో ఈ సినిమా పూర్తి కథను చక్కటి భాషలో ప్రచురించారు.

స్పందన

[మార్చు]

ప్రాచుర్య సంస్కృతిలో

[మార్చు]

మాయాబజార్ సినిమా కోసం పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు అజరామరంగా నిలిచాయి. ఈ చిత్రంలో రచయిత పింగళి నాగేంద్రరావు తస్మదీయులు, దుష్టచతుష్టయం, జియ్యా, రత్న గింబళీ, గిల్పం, శాకంబరి దేవి ప్రసాదం, వంటి కొత్త పదాలను మనకు రుచి చూపిస్తాడు. రసపట్టులో తర్కం కూడదు, భలే మామా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం, ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి, వేసుకో వీరతాడు వంటి సంభాషణలు ప్రజల స్మృతిలో నిలిచాయి.

అప్పటి సినిమా పోస్టరు [1]

సినిమా తెలుగునాట క్లాసిక్ స్థాయికి చేరింది. సాధారణ ప్రేక్షకుల నుంచి సినిమారంగ ప్రముఖుల వరకూ ఎందరెందరో మాయాబజార్ తమ అభిమాన చిత్రంగా చెప్తూంటారు. సినిమా విడుదలైనప్పుడు విజయా సంస్థ నందమూరి తారక రామారావు నటించిన కృష్ణుని పాత్ర ఆహార్యంతో 40వేల క్యాలెండర్లు ముద్రించి అమ్మారు. రాష్ట్రమంతటా ఇళ్లలో, షాపుల్లో ఆ క్యాలెండర్లకు ఫ్రేము కట్టించి పెట్టుకున్నారు.[3] మాయాబజార్ సినిమాలో కృష్ణుని పాత్ర (ఎన్టీ రామారావు), ఘటోత్కచుని పాత్ర (ఎస్.వి. రంగారావు), మాయా శశిరేఖ పాత్ర (సావిత్రి) ఆహార్యం ప్రజల్లో నిలిచిపోయాయి. మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుని పాత్రలోని ఎస్వీరంగారావు విగ్రహాన్ని ధవళేశ్వరం గ్రామంలో నిర్మించగా, విశాఖపట్టణం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లోనూ, అమెరికాలోని కాలిఫోర్నియాలోని వెస్ట్-కోలిన్ లోనూ, లాస్ ఏంజిలిస్ లోనూ ఎన్టీఆర్‌ కృష్ణుని వేషంలో ఉన్న విగ్రహాలు నెలకొల్పారు.[4][5] మాయాబజార్ సినిమాపై తనకున్న అభిమానంతో ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత జంధ్యాల తన సినిమాలకు మాయాబజార్ లోని పాటల శీర్షికలను అహ నా పెళ్ళంట, చూపులు కలసిన శుభవేళ, వివాహ భోజనంబు అంటూ పేర్లుగా పెట్టుకున్నారు.[6] వై.వి.ఎస్.చౌదరి నిర్మించి, దర్శకత్వం వహించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాకి ఆ పేరును కూడా మాయాబజార్ సినిమాలో అదే శీర్షికతో ఉన్న పాట నుంచి తీసుకున్నారు.

రంగుల మాయాబజార్

[మార్చు]

నలుపు తెలుపులో ఉన్న ఈ చిత్రాన్ని గోల్డ్‌స్టోన్ అనే సంస్థ రంగుల్లోకి మార్చగా, 2010 జనవరి 30 న విడుదల చేశారు. మాయాబజార్ పాత ఫిల్ములో సౌండ్ ట్రాక్‌లన్నీ పూర్తిగా అరిగిపోవడంతో వినసొంపుగా లేవు. అందుకని మూలం చెడకుండా నేపథ్య సంగీతం మొత్తం రీరికార్డింగ్ చేశారు. దాని తర్వాత సినిమాను 70 ఎం.ఎంకి మార్చి డీటీఎస్ కి మార్చారు. ఇందుకోసం 165 మంది నిపుణులు దాదాపు ఏడాది సమయం పాటు పనిచేశారు.[7] పాత మాయా బజార్ కు కొత్త మాయా బజార్ కు తేడాలు:
చాలా సన్నివేశాలు, పాటలు పూర్తిగా తొలగించడం గాని, పాక్షికంగా తొలగించడం గాని జరిగింది.

  • లల్లి లలా - కొంత భాగం
  • చూపులు కలసిన శుభవేళ - పూర్తిగా
  • భళి భళి దేవా - పూర్తిగా
  • విన్నావా యశోదమ్మా - కొంత భాగం
  • మోహిని భస్మాసుర నృత్యనాటిక - పూర్తిగా
  • శకుని పై చిత్రించిన పద్యం - పూర్తిగా
  • రేలంగి - పెళ్ళికి రిహార్సిల్స్ - పూర్తిగా
  • పాండవ బంధుకోటి బంధు - పద్యం - పూర్తిగా

ఇంకా, కొద్ది పాటి మార్పులు ఉన్నాయి. అయినా, ఈ ప్రయత్నం కూడా బహుళ ప్రజాదరణ పొందింది. 50 రోజుల పండుగ కూడా జరుపుకుంది.

మాటలు లేని చోటుల్లో కెమెరా మరింత అద్భుతంగా పనిచేస్తుంది. ఉదాహరణకు చిన్న పిల్లగా ఆడుకుంటున్న శశిరేఖ ఉద్యానవనంలో ఒక కొలని గట్టున అలవోకగా కూర్చుంటుంది. కెమెరా ఆమె మొహమ్మీదనుంచి మెల్లగా పాన్ అయి కొలనులోని తామరమొగ్గను చూపిస్తుంది. గడచి పోతున్న కాలానికి గుర్తుగా కొలనులో అలలు రేగడమూ, ఆ మొగ్గ మెల్లగా విచ్చుకోవడమూ, ఆ తర్వాత కెమెరా మెల్లగా వెనక్కి తిరిగి శశిరేఖ మొహాన్ని చూపడమూ జరుగుతాయి. ఇప్పుడక్కడ నవయవ్వనవతి యైన శశిరేఖ అంటే సావిత్రి ఉంటుంది!

పాత్రలు వాటి స్వభావాలు, పాత్రధారులు

[మార్చు]
ధవళేశ్వరం సమీపంలో మాయాబజార్ సినిమాలోని ఘటోత్కచుని ఆహార్యంలో ఎస్వీ రంగారావు విగ్రహం
ఘటోత్కచుడు
మొదటిసారి చూసినప్పుడు అభిమన్యుడెవరో తనకు తెలియకపోయినా "బాలకా! నీ మీద ఏలనో ఆయుధము ప్రయోగించడానికి చేతులు రావడము లేదు" అని అనురాగం ప్రకటిస్తాడు. రాక్షస విద్యార్థులు 'దుష్టచతుష్టయం' అనే మాటలో ఒత్తులు సరిగా పలకలేక విడివిడిగా 'దుసట చతుసటయం' అని పలుకుతూంటే ఆ తప్పుని సరిదిద్దక దుర్యోధనాదుల్ని గుర్తు చేసుకుని పళ్ళు కొరుకుతూ "వాళ్ళనలాగే విడివిడి చేసి పొడిపొడి చేసెయ్యాలి." అని సమర్థిస్తాడు.
"వివాహభోజనంబు" పాటయ్యాక ఘటోత్కచుడు పెళ్ళివంటకాలన్నీ చూసి ఆత్రం పట్టలేక తొందరగా తినెయ్యాలని గద పక్కన పెట్టి వొళ్ళు పెంచి కూర్చుంటాడు. అన్నీ ఖాళీ చేశాక గద కోసం తడుముకుంటే అది చేతికందనంత చిన్నదిగా ఉంటుంది. ఆ సందర్భంలో ఆ రాక్షసుడు ముందు తికమక పడి, నిదానంగా విషయం అర్థమైనట్లు తలాడిస్తాడు. అలాగే చివరి ఘట్టంలో తన అనుచరులు కౌరవులను చావబాదుతున్నప్పడు "ఆహా! ఆర్తనాదములు శ్రవణానందముగానున్నవి" అని తన రాక్షస ప్రవృత్తిని ప్రకటిస్తాడు.
రేవతి
సాత్యకి రాజసూయ యాగం నుంచి తిరిగొచ్చి మయసభ గురించి వర్ణిస్తూంటే, రేవతి "వనాలూ, తటాకాలూ కూడా మణిమయాలేనా?" అని ఆశగా, ఆశ్చర్యంగా అడుగుతుంది. ప్రియదర్శినిలో ఆమెకు ప్రియమైన వస్తువులుగా మణులు, బంగారం కనిపిస్తాయి. అయితే, ఆ నెపాన్ని రుక్మిణి మీదకు నెట్టేస్తుంది: "ఏమో, నాపక్కన నువ్వున్నావు. నువ్వనుకున్నది కనిపించిందేమో?" అని. పాండవులు రాజ్యం కోల్పోగానే, వాళ్ళ సంబంధం వదులుకోవడానికి ఏ మాత్రమూ సంకోచించని దానిగా ఆమె ధనాశను, అవకాశవాద తత్వాన్ని ఇక్కడ ఈ రెండు మాటల్లోనే సూచించారు.

అప్పటిలో ఈ సినిమాకు 26 లక్షలు రూపాయలు ఖర్చు అయ్యింది. అంత ఖర్చు పెట్టి తీయడం విజయావారికే సాధ్యమయ్యింది. విజయావారి సినిమాలో నటించడం నటీనటులకొక ప్రతిష్ఠాత్మక విషయంగా భావించేవారు. చాలా మంది కోరిక ఈ మాయాబజార్ సినిమాతో సఫలమయ్యంది.

మరిన్ని 'మాయ'లు

[మార్చు]

ఇక స్క్రిప్టు ప్రేక్షకుల్ని తల తిప్పుకోనీయకుండా చేస్తే మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం, హర్బన్స్ సింగ్ స్పెషల్ ఎఫెక్టులూ రెప్ప వాల్చనీయకుండా చేస్తాయి. ఈ చిత్రానిది ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమమైన చిత్రానువాదం అని గుమ్మడి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. "లాహిరి లాహిరి లాహిరిలో" పాటను చూసి తెలుగు సినిమా చరిత్ర లోనే వెన్నెలనింత అందంగా ఇంకెక్కడా చూడలేదు' అనుకున్న వారు ఆ పాటను మండుటెండలో తీశారని తెలుసుకుని తెల్లబోయారు. ఇక స్పెషల్ ఎఫెక్టులా లెక్కపెట్టలేనన్ని. మచ్చుకు కొన్ని:

  • అభిమన్యుడి దగ్గరకు తొలిసారి వచ్చినప్పుడు ఘటోత్కచుడు కొండ మీద దూకగానే ఆ అదటుకు కొండకొమ్ము విరిగి పడడమూ,
  • మాయామహల్లో కంబళి లా కనిపించే గింబళి తనంతట తనే లోపలికి చుట్టుకోవడం,
  • తల్పం లాంటి గిల్పం గిరగిరా తిరిగి క్రిందపడదోయడం లాంటి విడ్డూరాలు,
  • ఘటోత్కచుడి "వివాహభోజనం"బు షాట్లు

కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ షాట్లు ఎలా తీయగలిగారనేది తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

  • అభిమన్యుడి పెళ్ళి చుట్టూ మూడు గంటల సేపు కథ నడిస్తే పాండవులెక్కడా కనిపించకపోయినా వాళ్ళేమయారనే అనుమానమెక్కడా ప్రేక్షకులకు రాలేదంటే అది దర్శకుడు పన్నిన మాయాజాలమే. కానీ ఒక్క చోట ద్రౌపది లీలగా కనిపిస్తుంది (విన్నావటమ్మా, ఓ యశోదా పాట చివరిలో)
  • "అహ నా పెళ్ళంట.." పాటలో తధోంధోంధోం తధీంధీంధీం అనే బిట్ ని పాడింది మాధవపెద్ది సత్యం కాదు. ఘంటసాల.
  • "దురహంకార మదాంధులై.." అనే పద్యానికి ముందు వచ్చే "విన్నాను మాతా విన్నాను.." అనే సుదీర్ఘమైన డైలాగ్ ను పలికింది రంగారావు, మాధవపెద్ది సత్యం కాదు.
  • ఈ సినిమాలో కర్ణుడికి అసలు కవచ కుండలాలే లేవు.
  • ఈ చిత్రంలో ప్రముఖ నేపథ్య గాయకులు మాధవపెద్ది సత్యం, భళి భళి భళి భళి దేవా గీతంలో రథసారథి పాత్రలో కనిపిస్తారు.

మరికొన్ని విశేషాలు

[మార్చు]
తపాలా బిళ్ళపై మాయాబజార్ పాత్ర
  • 2013 లో సిఎన్‌ఎన్-న్యూస్18 టీవీ చానెల్ నిర్వహించిన సర్వేలో భారతీయ సినిమాల్లో సార్వకాలిక అత్యుత్తమమైన సినిమాగా మాయాబజార్ ఎంపికైంది.[8]
  • కంప్యూటర్ రంగంలో వినియోగానికి వచ్చిన లాప్ టాప్ అనే పరికరాన్ని, వీడియోకాలింగ్ అనే సౌకర్యాన్ని పోలివున్న ప్రియదర్శిని అనే పరికరాన్ని 1957లోనే మాయాబజార్ సినిమా ఊహించగలిగింది.[9]
  • మార్చి 2007లో ఈ సినిమాకు 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్రముఖ టెలివిజన్ ఛానళ్ళు ప్రత్యేక కార్యక్రమాలను సమర్పించాయి. పత్రికలు విశేష వ్యాసాలు ప్రచురించాయి. పత్రికలలో వచ్చిన శీర్షికలు ఇలా ఉన్నాయి - "యాభై ఏళ్ళ 'మాయా'బజార్", "మనయింటి బంగారం మాయాబజార్", "తెలుగు సినిమాకు పెద్దబాల శిక్ష మాయాబజార్", "అర్ధ శతాబ్ది అద్భుత అనుభూతి మాయాబజార్"
  • భారతీయ సినిమా 100 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రభుత్వపు తపాలాశాఖ 2013 మే 3వ తేదీన ఎస్.వి.రంగారావు స్మారక తపాలాబిళ్ళను విడుదలచేసింది. ఆ స్టాంపులో మాయాబజార్ చిత్రంలో రంగారావు వేసిన ఘటోత్కచుడి పాత్రను చొప్పించడం విశేషం.
  • మార్చి 2017 నాటికి ఈ సినిమా 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా తెలుగు వికిపిడియా మాయబజార్ కి ప్రేమతో అనే శీర్షిక తో రవీంద్ర భారతి లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం  జరిగింది. 
  • ఎస్.వి.కృష్ణారెడ్డి ఒకసారి టీవీ ఇంటర్వ్యూలో అన్నది - "ప్రేక్షకులు వైవిధ్యం కోరుకుంటారు. మంచి సినిమాలు మాత్రమే ప్రేక్షకులు చూస్తారంటే ఇక మాయాబజార్ తరువాత వేరే సినిమా రానక్కరలేదు"
  • ఈ సినిమాలో హీరో ఎవరు? అని తెలుగు సినిమా వజ్రోత్సవ సందర్భంలో టీవీ యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు అక్కినేని నాగేశ్వరరావు ఇలా జవాబు చెప్పాడు - "డ్యూయెట్ పాడినవాడు హీరో అయితే నేను హీరోను. ఫైట్లు చేసినవాడయితే ఎస్.వీ.రంగారావు. మగవాడు కాని హీరో సావిత్రి...."
  • 'కిన్నెర ఆర్ట్ థియేటర్' వారు మే 2007లొ మాయాబజార్ స్వర్ణోత్సవం సభ ఏర్పాటు చేసి, ఆ సినిమాలో నటించిన నటులను సత్కరించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ప్రఖ్యాత కవి రాళ్ళబండి కవితాప్రసాద్ మాయాబజార్ సినిమా ఇంత ఆదరణ పొందడానికి కొన్ని కారణాలను విశ్లేషించాడు.
    • పాత్రల ప్రవర్తన: మాయాబజార్‌లో పాత్రలు, వాటి స్వభావాలు మన నిత్యజీవనంలో ఇరుగుపొరుగువారి ప్రవర్తనకు చాలా దగ్గరఱగా ఉన్నాయి. కనుక ఆ పాత్రలతో ప్రేక్షకులకు ఒక అనుబంధం ఏర్పడింది.
    • పాత్రల పేర్లు: మాయాబజార్ లో పాత్రల పేర్లను కూడా ఒక పరమార్ధంతో పెట్టినట్లుగా తోస్తుంది. అభిమన్యుడిని అడ్డుకోవటానికి ఘటోద్గజుడు తన అనుచరుడైన ఒక రాక్షసుడిని పంపిస్తాడు. ఆ రక్కసుడు తన మాయజాలంతో గోడగా మారి అభిమన్యుని రథానికి అడ్డుగా నిలుస్తాడు. ఆ రాక్షసుని పేరు కుడ్యాసురుడు.
    • భాష: మాయాబజార్‌లో పాత్రలు మాట్లాడిన భాష గ్రాంధికంలా అనిపించదు. అలాగని ఫక్తు నేటి వ్యావహారికం కాదు. అందుకే ప్రేక్షకులకు ఆ సినిమాలో ప్రతి డైలాగు సుపరిచితమయ్యింది.

దృశ్యమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
  2. "వజ్రోత్సవ మాయాబజార్". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2017-03-26. Retrieved 2019-02-05.
  3. బి., నాగిరెడ్డి (మార్చి 2009). జ్ఞాపకాల పందిరి. చెన్నై: బి.విశ్వనాథ రెడ్డి.
  4. "అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ". సాక్షి. 7 జూలై 2015. Retrieved 25 July 2015.
  5. Special, correspondent (14 July 2015). "NTR statue unveiled at pushkar ghat". The Hindu. Retrieved 25 July 2015.
  6. పులగం, చిన్నారాయణ (ఏప్రిల్ 2005). జంధ్యా మారుతం (I ed.). హైదరాబాద్: హాసం ప్రచురణలు.
  7. ఫిబ్రవరి 14, ఆదివారం 2010 ఈనాడు సంచికలో ప్రచురించిన శీర్షిక ఆధారంగా...
  8. "'Mayabazar' is India's greatest film ever: IBNLive poll". CNN-News18. 12 May 2013. Archived from the original on 7 June 2013. Retrieved 4 February 2015.
  9. "16 things about Mayabazar, The greatest indian cinema ever". southreport.com. Archived from the original on 21 ఏప్రిల్ 2015. Retrieved 12 June 2015.

బయటి లింకులు

[మార్చు]
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య