ఋష్యేంద్రమణి
ఋష్యేంద్రమణి ప్రముఖ తెలుగు రంగస్థల, సినిమా నటి.
ఈమె చిన్నతనంలోనే సంగీతాన్ని, నాట్యాన్ని అభ్యసించింది. కొమ్మూరి పట్టాభిరామయ్య యొక్క లక్ష్మీవిలాస నాటక సభలో చేరి కపిలవాయి రామనాథశాస్త్రి, పువ్వుల రామతిలకం వంటి ప్రసిద్ధ నటుల వద్ద శిక్షణ పొందింది. ఆనాడు రాజారావు నాయుడు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో సత్యభామ పాత్రను పోషించింది. ఆ చిత్రం అపజయం పొందడంతో తిరిగి నాటకరంగంలో ప్రవేశించి ప్రహ్లాద, రాధాకృష్ణ, చింతామణి, తులాభారం మొదలగు నాటకాలలో ప్రముఖ పాత్రలు ప్రతిభావంతంగా పోషించింది. ఆనాడు కడారు నాగభూషణం, పసుపులేటి కన్నాంబ నడిపిన రాజరాజేశ్వరీ నాట్యమండలి బృందముతో మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించింది.
ఋష్యేంద్రమణి తన భర్త జవ్వాది రామకృష్ణారావు మాతృభూమి అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడానికి చెన్నై రావడంతో తానుకూడా చెన్నై చేరి పాండురంగ విఠల్ అనే చిత్రంలో దేవకన్య పాత్ర పోషించింది. అదే సమయంలో గూడవల్లి రామబ్రహ్మం తమిళ పంచ మహాకావ్యాలలో ఒకటైన శిలప్పాడికరం ఆధారంగా నిర్మించిన పత్ని చిత్రంలో కణగి పాత్ర ధరించింది. ఆ సినిమాలో కోవలన్ పాత్రను తెలుగులో సుప్రసిద్ధ దర్శక నిర్మాత కోవెలమూడి సూర్యప్రకాశరావు ధరించాడు. కణగి పాత్రను ఆమె అత్యద్భుతంగా పోషించింది. ఆ తరువాత చెంచులక్ష్మిలో ఆదిలక్ష్మి పాత్ర, సీతారామ జననంలో కౌసల్యగాను, సేతుబంధన్ లో ఇంద్రాణిగా, భక్త సిరియాళలో కథానాయకి పాత్రను ధరించి మెప్పించారు. ఈమె వీర, రౌద్ర రసాలను ఎంత ఉత్తేజంగా అభినయిస్తుందో, శోకభరిత కరుణారస ప్రధానమైన సాత్విక పాత్రలు కూడా అంతే ప్రతిభావంతంగా పోషించేది. మల్లీశ్వరిలో తల్లి పాత్రనూ, విప్రనారాయణలో వేశ్య పాత్రనూ, మాయాబజార్, జగదేకవీరుడు, అగ్గిరాముడు, కృష్ణ సత్య, పాండురంగ మహత్మ్యం మొదలగు ఘనమైన చిత్రాలలో వివిధ ప్రధాన పాత్రలు పోషించింది.
ఋష్యేంద్రమణి గారు 17 ఆగష్టు 2002 రోజున చెన్నైలో శాశ్వతంగా కన్నుమూశారు.
గాయనిగా ఋష్యేంద్రమణి[మార్చు]
ఈమె చలనచిత్రాలలోకి వచ్చేప్పటికి, నటీనటులకు వేరేవారు గాత్రంతో పాటలుపాడటఅనికి సాంకేతిక అభివృద్ధి జరుగలేదు. దాదాపుగా అందరు నటీనటులు తమ పాటలు తామే పాడుకొనేవారు. అదే వరవడిలో, ఋష్యేంద్రమణి తన పాటలను తానే పాడుకొనేది. గాయనిగా మంచి పేరు వచ్చింది. మాయాబజారు సినిమాలో అభిమన్యునితోపాటుగా వళ్తున్నప్పుడు వీరెవరో తెలియక ఘటోత్కచుడు వీరి మీద దాడిజరిపినప్పుడు, ఈమె పాడిన పద్యం/పాట ఇప్పటికికూడ ఎంతగానో ప్రాజదరణపొందుతున్న పాత పాటలలో ఒకటి.
నటించిన సినిమాలు[మార్చు]
- 1935: కృష్ణ తులాభారం (సత్యభామ)[1]
- 1944: సీతారామ జననం (కౌసల్య)[2]
మూలాలు[మార్చు]
- ↑ డైలీహంట్ (ఈనాడు), సినిమా (26 May 2020). "జనానికి ఇవేమీ అక్కర్లేదు". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 9 August 2020.
- ↑ The Hindu, Cinema (25 February 2012). "Blast From The Past: Sri Sita Rama Jananam (1944)" (in ఇంగ్లీష్). M.L. Narasimham. Archived from the original on 18 September 2019. Retrieved 29 September 2020.
బయటి లింకులు[మార్చు]
- CS1 ఇంగ్లీష్-language sources (en)
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- తెలుగు సినిమా నటీమణులు
- తెలుగు సినిమా గాయకులు
- 1917 జననాలు
- 2002 మరణాలు
- తెలుగు రంగస్థల నటీమణులు
- కృష్ణా జిల్లా రంగస్థల నటీమణులు
- కృష్ణా జిల్లా సినిమా నటీమణులు
- కృష్ణా జిల్లా మహిళా గాయకులు