Jump to content

విమల

వికీపీడియా నుండి

విమల తెలుగు చలన చిత్రం 1960 ఆగస్టు 11 విడుదల. పక్షిరాజా వారి ఈ చిత్రానికి సంగీతం,దర్శకత్వం ,తో పాటు నిర్మాతగా ఎస్.ఎం . శ్రీరాములు నాయుడు వ్యవహరించాడు .నందమూరి తారక రామారావు సావిత్రి ప్రదాన పాత్రలు పోషించారు.

విమల
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు
నిర్మాణం ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి
సంగీతం ఎస్.ఎం. సుబ్బయ్యనాయుడు
నిర్మాణ సంస్థ పక్షిరాజా స్టూడియోస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

నందమూరి తారక రామారావు

సావిత్రి

గుమ్మడి వెంకటేశ్వరరావు

రేలంగి వెంకట్రామయ్య

సంధ్య

సూర్యకాంతం


చిత్రకథ

[మార్చు]

ఆనంతగిరి సంస్థానం యువరాజు విజయకుమార్ (రామారావు) లంక పర్యటనకు వెళ్ళినప్పుడు బందిపోటు ఉగ్రసింహుడి (రాజనాల) కి బందీగా చిక్కుతాడు. లక్ష రూపాయలు ఇస్తే, యువరాజును విడుదల చేస్తానని, విజయ్ బంటు ద్వారా సంస్థానానికి కబురు పంపుతాడు, ఉగ్రసింహుడు. అయితే దురదృష్టవశాత్తూ ఆ బంటు అడవిదారిలో కౄరమృగాల పాలబడి చనిపోతాడు. అనంతగిరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో, ఉగ్రసింహుడు యువరాజు విజయ్ చెవులు కత్తిరించి సంస్థానానికి పంపిస్తానని ఆ విధంగా డబ్బు రాబట్టు తానని వెల్లడించి, యువరాజు పెడరెక్కలు విరిచిపట్టుకోమని అనుచరులను ఆదేశిస్తాడు. ఆ సమయంలో విమల (సావిత్రి)  విజయ్‌ను బంధించిన గుహ వద్దకు వచ్చి, బందీలను విడుదల చేయవలసినదిగా ఉగ్రసింహుడిని అభ్యర్థిస్తుంది. గతంలో తనను విమల పోలీసులనుంచి కాపాడినదన్న కృతజ్ఞతాభావంతో, ఉగ్రసింహుడు యువరాజును విడుదల చేస్తాడు. అస్వస్థుడిగా ఉన్న విజయ్‌ను, విమల తన గృహానికి తీసికెళ్ళి సపర్యలు చేస్తుంది. యువరాజు విమలను ప్రేమిస్తాడు. విమల తండ్రి రాజేశ్వరప్రసాద్ (గుమ్మడి) తో విజయ్,  విమలను వివాహం చేసుకోవాలన్న తన అకాంక్షను వెల్లడిస్తాడు. విమల ఒక అంటరాని స్త్రీ అని, విజయ్ రాజవంశపు రాకుమారిని వివాహం చేసుకోవాలని రాజేశ్వరప్రసాద్ తన మాటగా చెప్పి, వారిని మరువాలని యువరాజుని అభ్యర్థిస్తాడు. మనసు నిండా విమలపై ప్రేమ నింపుకుని, యువరాజు అనంతగిరి వెళ్తాడు.

విమల ఒక సాయంత్రం తోటలో ఉన్నప్పుడు ఉగ్రసింహుడు వచ్చి తన ప్రేమను వ్యక్త పరిచి, తనను వివాహం చేసుకోవాలని తన మనసులోని మాట బయటపెడ్తాడు. విమల ఈ విషయాన్ని తన తండ్రితో చెపుతుంది. ఉగ్రసింహుడు చాల కౄరుడని, అతని నుంచి తమకు హాని కలుగుతుందని, విమల, రాజేశ్వరప్రసాద్ ఒక పడవలో పారిపొయే ప్రయత్నంలో, ప్రమాదవశాత్తూ విడిపోతారు. సముద్రపు ఒడ్డున స్పృహలేని స్థితిలో ఉన్న విమలను, అనంతగిరి సంస్థానపు రాణి రాజ్యలక్ష్మి (సంధ్య) గమనించి, ఆమెను రక్షించి, తన ఆస్థానానికి తీసుకెళ్తుంది. స్పృహ వచ్చాక రాజ్యలక్ష్మే తన తల్లి అని లలితకుమారి (విమల అసలు పేరు) గుర్తిస్తుంది కాని, ఆ విషయాన్ని గోప్యంగా వుంచుతుంది. రాజేశ్వరప్రసాద్, వారి అన్నగారు అనంతగిరి సంస్థానపు రాజులు. పెద్దరాజావారు అవిటివాడు కావటంతో చిన్నరాజావారే సంస్థానం మంచి చెడులు, పాలన నిర్వహించేవారు. ఒకరోజు పెద్దరాజావారు, చిన్నరాజావారు ఏదో విషయంలో విభేదిస్తారు. మరుసటిరోజే పెదరాజావారి హత్య జరుగుతుంది. రాజేశ్వరప్రసాద్ పై హత్యానేరం ఆపాదింపబడి, లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయమూర్తి రాజేశ్వరప్రసాద్‌కు ఉరిశిక్ష వేస్తాడు. జైలు నుంచి తప్పించుకుని రాజేశ్వరప్రసాద్, లలితకుమారిని తనతో తీసుకుని లంకకు పారిపోతాడు. తనపై హత్యానేరం ఉంది కనుక రాజేశ్వరప్రసాద్ తమ విషయాలను ఎవరికీ చెప్పవద్దని విమలతో చెప్తాడు. విమలను ప్రేమించిన యువరాజు విజయ్, రాజ్యలక్ష్మి తమ్ముడే. ఈ నేపథ్యంలో విమల, యువరాజుతో తాను వివాహం చేసుకోలేదని  రాజ్యలక్ష్మితో చెప్తుంది.

విమల మనోవేదన అర్థం చేసుకున్న విజయ్ పెదరాజావారిని ఎవరు హత్యచేసారన్న విషయంపై, విమల సాగిస్తున్న గూఢచారి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తూ, చివరకు అసలు హంతకులను పట్టుకుంటారు. ఎలాగైనా రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలన్న దుష్ట కోరికతో ఉన్న, ఇంటిదొంగలైన, హంతకుడు రాజా అప్పలరాయుడు బహద్దూర్ ను, అతనికి సహకారం అందించిన వెంకటప్పయ్య (రమణారెడ్డి), బట్లర్ (రేలంగి) లను పట్టుకోవడముతో, రాజేశ్వరప్రసాద్ అజ్ఞాతం ముగుస్తుంది. లలితకుమారి, యువరాజు విజయ్ కుమార్ ల వివాహంతో కథ సుఖాంతం.

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలో మొత్తం 7 పాటలను ముద్దుకృష్ణ వ్రాసారు. నేపథ్య గాయకులు: ఘంటసాల, మాధవపెద్ది సత్యం, పి.నాగేశ్వరరావు, జమునారాణి, జయలక్ష్మి, కోమల.

01. కన్నుల భేళుకే కలువలురా , ఘంటసాల , రాధా జయ లక్ష్మీ

02. కన్నులో నీ బొమ్మ, ఘంటసాల, రాధా జయ లక్ష్మీ

03. చిన్ని లతవొలె, కె. జమునా రాణి, ఎ. పి. కోమల బృందం

04. ఎర్ర ఎర్రాని దాన ఎంతో చక్కని దానా,మాధవపెద్ది, ఎ. పి. కోమల

05. కావవె అమ్మ దేవి నిను పూజా చేతునే , రాధా జయలక్ష్మీ, రచన: తోలేటి

06. నీలి వెన్నెల కాయసాగే చల్లగాలి తగిలి తీగలుగా, రాధా జయలక్ష్మి

07. టక్కరి దాన టెక్కులదాన చుక్కలకన్నా , పిఠాపురం, కె . జమునా రాణి.

"నా కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు" పాట మధురంగా ఉంటుంది. ఘంటసాల, జయలక్ష్మి ఈ పాట పాడారు.

బట్లర్ (రేలంగి), చెలికత్తె (చంద్రిక) ల మధ్య యుగళ గీతం "టక్కరి దానా, చుక్కలకన్నా చక్కని దానా, చిక్కాను నీకేలే,

ఒంటరి రాజా, తింటావు కాజా"  ప్రజాదరణ పొందింది.   

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గాళామృతం , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి.

"https://te.wikipedia.org/w/index.php?title=విమల&oldid=4227879" నుండి వెలికితీశారు