Jump to content

హిడింబి

వికీపీడియా నుండి
హిడింబి
భీముడు, హిడింబి, రవివర్మ గీసిన చిత్రం
అనుబంధంరాక్షస దేవత
నివాసంకామ్యక వనం
భర్త / భార్యభీముడు
తోబుట్టువులుహిడింబ
పిల్లలుఘటోత్కచుడు
పాఠ్యగ్రంథాలుమహాభారతం

హిడింబి మహాభారతంలో భీముని భార్య. ఘటోత్కచుడు ఆమె కుమారుడు. ఆదిపర్వంలోని 18 వ ఆశ్వాసంలో హిడింబి భీముని కలుసుకుంటుంది. ఈమెకే పల్లవి అనే పేరు కూడా ఉంది.

పాండవులు లక్క ఇంటి నుంచి తప్పించుకుని ఒక దట్టమైన అడవిలోకి వెళతారు. చాలా సేపు నడచి అలసిపోయి ఆ రాత్రి ఒకచోట విశ్రమిస్తారు. అందరూ నిద్రపోతుండగా భీమసేనుడు కాపలాగా ఉంటాడు. వారికి సమీపంలో రాక్షస జాతికి చెందిన హిడింబి, తండి అనే అన్నా చెల్లెళ్ళు ఉంటారు. తండి పాండవుల వాసనను పసిగట్టి అక్కడ బాగా బలిష్టంగా ఉన్న భీముని ఆకర్షించి ఆహారంగా తీసుకుమ్మని హిడింబిని పంపిస్తాడు. కానీ హిడింబి భీముణ్ణి మోహిస్తుంది. ఒక అందమైన స్త్రీ రూపం ధరించి తనను పెళ్ళాడమని భీముని కోరుతుంది. భీముడు అందుకు అంగీకరించడు. ఆమె తన నిజస్వరూపం ధరించి తన అన్న చెప్పిన పని గురించి చెబుతుంది. భీముడు తండితో యుద్ధానికి తలపడతాడు. ఆ పోరులో భీముడు తండిని సంహరిస్తాడు.[1][2][3]


సోదరుని మరణంతో తనమీద ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని భీముడు హిడింబిని కూడా చంపబోతాడు. ధర్మరాజు అడ్డుకుంటాడు. తరువాత హిడింబి తను ఒంటరిదానను కాబట్టి పెళ్ళి చేసుకోమని భీముడిని ఒప్పించమని కుంతీదేవిని వేడుకుంటుంది. ఆమె కుమారుణ్ణి హిడింబిని పెళ్ళాడమని ఆజ్ఞాపిస్తుంది. అయితే భీమసేనుడు ఆమెను పెళ్ళాడిన తరువాత విడిచి వెళ్ళడానికి ఆమె అనుమతిస్తేనే అందుకు అంగీకరిస్తానంటాడు. హిడింబి అందుకు అంగీకరించి భీముని పెళ్ళాడుతుంది. వారికి ఘటోత్కచుడు అనే కుమారుడు కలిగిన తరువాత పాండవులు అక్కడినుండి నిష్క్రమిస్తారు. తల కుండ లాంటి ఆకారంతో ఉండటం వల్ల ఘటోత్కచుడికి ఆ పేరు వచ్చింది. ఘటోత్కచుడు పెరిగి పెద్దైన తరువాత మంచి యోధుడవుతాడు. మహాభారత యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషిస్తాడు. అతని మంత్ర తంత్ర విద్యలకు తను తప్ప ఇంకెవ్వరూ సాటి రారని శ్రీకృష్ణుడు వరం ప్రసాదిస్తాడు.

హిమాచల్ ప్రదేశ్ లో హిడింబాదేవిని దేవతగా ఆరాధిస్తారు. మనాలిలో ఆమెకు ఓ ఆలయం కూడా ఉంది.[4]

మూలాలు

[మార్చు]
  1. Halperin, Ehud (2019-10-15). The Many Faces of a Himalayan Goddess: Hadimba, Her Devotees, and Religion in Rapid Change (in ఇంగ్లీష్). Oxford University Press. p. 119. ISBN 978-0-19-091360-1.
  2. Puranic Encyclopedia: a comprehensive dictionary with special reference to the epic and Puranic literature, Vettam Mani, Motilal Banarsidass, Delhi, 1975.
  3. Sinha, Seema; Bhattacharya, Kumar Sankar (2025-03-13). An Alternative Reading of the Other in The Mahabharata: Celebrating the Marginal (in ఇంగ్లీష్). Taylor & Francis. ISBN 978-1-040-32567-4.
  4. Velugu, V6 (2019-06-13). "వనదేవత హిడింబి". V6 Velugu. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-07-18.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=హిడింబి&oldid=4821396" నుండి వెలికితీశారు