Jump to content

ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము

వికీపీడియా నుండి
(ఆశ్రమవాస పర్వము నుండి దారిమార్పు చెందింది)


ప్రధమాశ్వాసము

[మార్చు]

ధర్మరాజు చేసిన అశ్వమేధయాగము గురించి విన్న జనమేజయుడు వైశంపాయనుడిని " మహర్షీ ! అ విధముగా పితృపితామహుల నుండి సంక్రమించిన రాజ్యసంపదను స్వీకరించిన పాండవులు ధృతరాష్ట్రుని పట్ల ఏవిధముగా ప్రవర్తించారు. కుమారులు, మిత్రులు, అమాత్యులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు, అష్టైశ్వర్యాలు పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు ఆయన భార్య గాంధారి ఏ విధంగా ప్రవర్తించారు వివరించండి " అని అడిగాడు.

ధర్మరాజు ధృతరాష్ట్రుడి పట్ల వహించిన శ్రద్ధ

[మార్చు]

వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! ధర్మరాజు అతడి తమ్ములు ధృతరాష్ట్ర గాంధారులను ఏ లోపము లేకుండా గౌరవప్రదంగా చూసుకుంటున్నారు. పాండవులు రోజూ ధృతరాష్ట్రుడిని కలుసుకుని ఆయన ఆదేశాలను స్వీకరిస్తున్నారు. విదురుడు, యుయుత్సుడు ఆయనను ఏమరక సేవిస్తూ అతడికి కావలసినవి అడిగి అందిస్తున్నారు. ధృతరాష్ట్రుడు గాంధారి కూడా పాండవుల పట్ల ప్రేమాభిమానాలతో ప్రవర్తిస్తున్నారు. కుంతీదేవి కూడా అక్క గాంధారిని ప్రతి రోజూ వచ్చి పలకరిస్తూ ఉంది. ద్రౌపది, సుభద్ర అత్తగారైన గాంధారిని సేవిస్తున్నారు. ఆమెకు విలువైన కానుకలను సమర్పిస్తున్నారు. ఉలూపి, చిత్రాంగదలు కూడా గాంధారిని సేవిస్తున్నారు. ధర్మరాజు అనుమతితో ధృతరాష్ట్రుడు ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నాడు. దేవాలయములు కట్టించాడు, సత్రములు నిర్మించాడు, చెరువులు తవ్వించాడు, బ్రాహ్మణులకు అగ్రహారాలు, మిగిలిన జాతుల వారికి గ్రామములు నిర్మించాడు. చక్రవర్తి ధర్మరాజును చూడవచ్చే సామంతరాజులు ముందుగా ధృతరాష్ట్రుడిని చూసి తరువాత ధర్మరాజును చూసే వారు. ధర్మరాజు కూడా అందుకు ఎంతో సంతోషించేవాడు. పెదనాన్నకు కుమారులు లేని కొరత లేకుండా ధర్మరాజు ఎంతో జాగ్రత్తవహించ సాగాడు. అది కాక ధర్మరాజు తన తమ్ములకు, అమాత్యులకు, సైన్యాధిపతులకు ఇలా ఆదేశాలు ఇచ్చాడు. " పెదనాన్న, పెదతల్లి గారు పుత్రులను పోగొట్టుకుని దుఃఖంతో ఉన్నారు. వారికి ఏ లోటు రాకుండా చూడండి. నాకు ఏవిధమైన గౌరవ మర్యాదలు ఇస్తారో అదే విధమైన గౌరవ మర్యాదలు వారికి ఇవ్వండి " అని ఆదేశించాడు. ధర్మరాజు మాటలను తమ్ములు, అమాత్యులు, సేవకులు పాటించారు.

ధృతరాష్ట్రుడి పట్ల భీముడి ప్రవర్తన

[మార్చు]

ధర్మరాజు మీద ఉన్న గౌరవంతో భీముడు ధృతరాష్ట్రుని మీద గౌరవము ఉన్నట్లు నటించినా మనసుమాత్రము ధృతరాష్ట్రుని చూడగానే ఉడికిపోయేది. ధృతరాష్ట్రుడిని చూడగానే భీముడికి మాయాజూదము వలన తాము పడిన బాధలు, అరణ్య అజ్ఞాత వాసముల వలన తాము అనుభవించిన బాధలు గుర్తుకు వచ్చేవి. మనసు మండి పోయేది. భీముడు మాత్రము ధృతరాష్ట్రుడిని చూడగానే మండిపడే వాడు. ధర్మరాజు మాత్రము అందుకు భిన్నంగా ఉండేవాడు. సుయోధనుడు అతడి తమ్ములకు శ్రాద్ధకర్మలు ఆచరించే సమయములో ధృతరాష్ట్రుడి చేత అనేక దానధర్మములు చేయించే వాడు. ధృతరాష్ట్రుడికి తనకుమారులు ఉన్నప్పటికంటే ఇప్పుడు రాచమర్యాదలు అధికంగా జరిగేవి. ధర్మరాజు ధృతరాష్ట్రుడి వలన అతడి కుమారుల వలన తాము అనుభవించిన కష్టాలను, వారి తమకు చేసిన అపకారాలను మనసులోకి రానిచ్చేవాడు కాదు. ధర్మరాజు మనసెరిగి మిగిలిన వారు ధృతరాష్ట్రుడి గురించి కాని, అతడి కుమారుల గురించి కాని, వారి దుష్ప్రవర్తన గురించి కాని చెడ్డగా చెప్పేవారు కాదు. ప్రజలు కూడా ధృతరాష్ట్రుడికి ధర్మరాజుకు బేధము చూపక ఇరువురిని సమానంగా గౌరవించే వారు. ధృతరాష్ట్రుడు కూడా క్రమముగా తన కుమారులను మర్చిపోయి ధర్మరాజు మీద ప్రేమాభిమానాలు కురిపించే వాడు. కాని భీముడిని చూసినప్పుడు ధృతరాష్ట్రుడి గుండె మండిపోయేది. కారణము భీముడు తన కుమారులను చంపాడని అతడు మరచి పోలేకపోవడమే. వారిరువురు ఒకరి మీద ఒకరు మండి పోతున్నా పైకి మాత్రము మర్యాదగా మాట్లాడుకునే వాళ్ళు. అయినా భీముడు మాత్రము ఒక్కోసారి ధృతరాష్ట్ర గాంధారులు వింటూ ఉండగా " ఈ గుడ్డివాడి కొడుకులందరిని చంపేశాను. నా పాలబడ్డ వాడు ఎవడైనా చావకుండా బయట పడ్డాడా. ఆ కౌరవులు బుద్ధిలేక మాతో యుద్ధానికి వచ్చారు కాని నా సంగతి తెసినవారు ఎవరైనా మాతో పెట్టుకుంటాడా ! సుయోధన, దుశ్శాసనులను మట్టు పెట్టిన ఈ భుజాలను నేను పూజచేస్తాను. కౌరవులను సమూలంగా నాశనము చేయడానికి అనుకూలించిన ఆదైవానికి శతకోటి వందనాలు " అని అంటూ ఉండేవాడు. భీముడు అలా అంటూ ఉండేవాడని ధర్మరాజుకు, అర్జునుడికి, కుంతీదేవికి, ద్రౌపదికి తెలియదు. నకులసహదేవులు మాత్రము భీముని మాటలకు సంతోషించే వారే కాని ధర్మరాజుకు భయపడి బదులు చెప్పేవారు కాదు. ధృతరాష్ట్ర, గాంధారులు మాత్రము ఏమీ అనలేక మనసులో బాధపడుతూ ఊరుకుండే వారు.

ధృతరాష్ట్రుడి పశ్చాత్తాపము

[మార్చు]

ఈ విధంగా 15 సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు ధృతరాష్ట్రుడు " తన బంధువులను, మిత్రులను, ధర్మరాజును సమావేశపరచి వారితో " ఆర్యులారా ! నా వలనే నాకుమారులు నాశనము అయ్యారు అని మీకు బాగాతెలుసు. నా కుమారుడు సుయోధనుడు లోభి, అతిక్రూరుడు, దాయాదులకు ద్రోహము చేసేవాడు. అయినా అతడిని ఈ కురుసామ్రాజ్యానికి చక్రవర్తిని చేసాను. రాయబార సమయాన శ్రీకృష్ణుడు చెప్పిన మంచి మాటలు కూడా సుయోధనుడు పెడచెవిన పెట్టాడు ఫలితము అనుభవించాడు. ఒక్క కృష్ణుడే కాదు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సంజయుడు ఎన్నో విధాలుగా నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. చివరకు నా భార్య గాంధారి కూడా నన్ను నిందించింది. కాని నాకు హితవు చెప్పిన అందరి మాటలను నేను పెడచెవిన పెట్టాను. ఇది తలచుకున్న నా మనసు బాధపడుతుంది. చివరకు నా కుమారులు యుద్ధమును కోరుకుని యుద్ధములో ఓడి పోయి యుద్ధభూమి నుండి తిరిగి రాకుండానే అక్కడే మరణించారు. యుద్ధములో మరణించి వీరస్వర్గము అలంకరించిన నాకుమారుల కొరకు నేనిక చింతించడము లేదు " అన్నాడు.

ధృతరాష్ట్రుడి వానప్రస్థ ప్రస్తావన

[మార్చు]

జరిగిన దానికి పశ్చాత్తాప పడిన ధృతరాష్ట్రుడు ధర్మరాజును దగ్గరగా పిలిచి " ధర్మనందనా ! నీ దయవలన నేను సుఖజీవితమును గడుపుతున్నాను. నాకుమారులకు శ్రాద్ధకర్మలు ఆచరించు సమయంలో దానధర్మాలు చేసి నాకుమారులకు పుణ్యలోక ప్రాప్తి కలుగునట్లు చేసావు. నా వలన నువ్వు నీ తమ్ములు ఎన్నో కష్టాలు అనుభవించారు. నీ భార్య ద్రౌపది అలవి కాని అవమానము చవిచూసింది. నిన్ను, నీ తమ్ములను, నీ భార్యను ఇన్ని అవమానములు చేసిన నా కుమారులను నీ తమ్ములు చంపడము సమంజసమే కనుక దానిని నేను తప్పుపట్టను. అవన్ని మరచి నువ్వు మా పట్ల ఎంతో గౌరవమర్యాదలు చూపిస్తున్నావు. ఈ సందర్భములో నేను నీకు ఒక విషయము చెప్పాలని అనుకుంటున్నాను. ఈ రాజ్యంలో ప్రజలు ఏమి చెప్పాలనుకున్నా రాజుకు చెప్పి అనుమతి తీసుకుని చేయడమే ధర్మము. అందుకనే నేను నీతో చెప్పుకుంటున్నాను. మాకు ముసలితనము వచ్చింది. ఇక ఎక్కువ రోజులు బ్రతకము. క్షత్రియుడన్న వాడు యుద్ధభూమిలో మరణించాలి. లేకున్న తపస్సుచేసి తనువు చాలించాలి. మాకు రెండవ మార్గమే శరణ్యము. మన పూర్వీకులు అనేక మంది వార్ధక్యములో తపస్సుచేసి ముక్తిపొందారు. కనుక నేనుగాంధారి అడవులకు వెళ్ళి నారచీరలు ధరించి కంద మూలములు తింటూ తపస్సు చేసుకుంటూ నిన్ను దీవిస్తుంటాము " అని అన్నాడు.

ధర్మరాజు ఆవేదన చెందుట

[మార్చు]

ధృతరాష్ట్రుడి మాటలు విన్న ధర్మరాజు " పెదనాన్న గారూ ! మీరూ పెదతల్లి గారూ అడవికి వెళ్ళి కందమూలములు తింటూ అరణ్యవాసము చేస్తూ ఉంటే ఇక్కడ నేను రాజ్యసుఖములు అనుభవించగలనా. ఈ రాజ్యపాలన నాకు సుఖాన్ని ఇస్తుందా ! పెదనాన్న గారూ ! నాకు తెలుసు ఇక్కడ మీరు పైకి సుఖముగా ఉన్నట్లు కనిపిస్తున్నా సుఖముగా లేరు. దుఃఖముతో పరితపిస్తున్నారు. మీ మాటలు నన్ను చాలా బాధపెడుతున్నాయి. మీరు లేని నాకు ఈ రాజ్యము అక్కర లేదు. పెదనాన్న గారూ నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ మీరే అనుకున్నాను. అటువంటి మీరు అడవులకు పోతే నేను హస్థినాపురములో ఎలా ఉండగలను. ఒక పని చేస్తాము. తమరి కుమారుడు యుయుత్సుడికి రాజ్యాభిషేకము చెయ్యండి. నేను కూడా మీతో అడవులకు వస్తాను. మనము అందరము అక్కడే ఉందాము. యుయుత్సుడు సాక్షాత్తు మీ కుమారుడు ఈ రాజ్యాన్ని పాలించడానికి అర్హుడు. అతడు పరాయివాడు కాదు కదా ! పెదనాన్న గారూ ! నేను ఇప్పటికే యుద్ధములో బంధువులను, మిత్రులను కోల్పోయాను. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక పోతున్నాను. మీరు కూడా వెళ్ళారంటే నేను ఎలా ఉండగలను. పెదనాన్నా ! ఈ రాజ్యము మీది మీరే ఈ రాజ్యానికి రాజు. మీకు అనుమతి ఇవ్వడానికి నేను ఎవరిని. మీరు నీ కుమారులు చేసిన దురాగతములు గుర్తుపెట్టుకున్నారు కాని నేను మాత్రము మరచిపోయాను. అవన్నీ కర్మవశాన జరిగినవే కాని ఎవరూ చేసినవి కాదు. అమ్మా గాంధారీమాతా ! నాకు నాతల్లి కుంతీదేవి నీవూ ఒకటే ఇద్దరినీ ఒకేలా పూజించి గౌరవిస్తాను. అటువంటి మీరు లేకున్న నేను హస్థినలో ఎలా ఉండగలను. ఇన్ని చెప్పినా మీరు వినక పోతే నేను కూడా మీతో చస్తాను. నిజము చెప్తున్నాను. ఇలా మనసు కష్టపెట్టుకుని అడవులకు పోతే నేనిక్కడ రాజ్యసుఖాన్ని అనుభవించ లేను. మీకు కలిగిన పుత్రశోకము, నష్టములు అన్నీ విధివశాత్తు కలిగినవే. కనుక వాటిని మరచి హాయిగా సుఖముగా ఉండండి. అరణ్యవాస ఆలోచన ఇక మరవండి. బంధుమిత్రులను పోగొట్టుకున్న దుఃఖాన్ని నేను మీ ఇద్దరినీ సేవించుకుంటూ మరచి పోదామని అనుకుంటూ ఉంటే మీరిలా నన్ను విడిచి వెళ్ళడము తగునా ! కనుక నా ప్రార్థన మన్నించి ఈ అరణ్యవాస ఆలోచన మానుకుని నా దుఃఖాన్ని దూరము చెయ్యండి " అంటూ ధర్మరాజు ధృతరాష్ట్రుడి పాదముల మీద పడి ప్రాధేయపడ్డాడు.

ధృతరాష్ట్ర గాంధారులు ధర్మరాజును ఓదార్చుట

[మార్చు]

ధృతరాష్ట్రుడు ధర్మరాజును పట్టుకుని పైకెత్తి కౌగలించుకుని " నాయనా ధర్మనందనా ! నీవు నాకు ఎంతో భక్తితో సేవలు చేస్తున్నావు. నేను కాదనకుండా స్వీకరిస్తున్నాను. నాకు వయసు వచ్చింది. ఈ వయసులోనైనా తపస్సు చేసుకో వద్దా ! ఇన్ని రోజులు రాజ్యపాలన చేసినందుకు నాకూ ప్రజల పాపాలలో భాగము ఉంటుంది కదా ! ఈ వయసులో నైనా నేను తపస్సు చేసుకుని ఆ పాపాలు పోగొట్టుకోవాలి కదా ! " అని ధృతరాష్ట్రుడు విదురుడిని, సంజయుడిని, కృపాచార్యుడిని చూసి " అయ్యా ! మీరైనా దయచేసి ధర్మరాజుకు చెప్పండి. నాకిక మాట్లాడే శక్తి లేదు " అంటూ శోషవచ్చి గాంధారి మీద పడిపోయాడు. అది చూసిన ధర్మరాజు దుఃఖించి " అయ్యో ! వెయ్యి ఏనుగుల బలము కల ధృతరాష్ట్రుడు కూడా ఒక అబలను ఆసరా చేసుకుని పడిపోయాడు కదా ! ఎంతటి వారికైనా ఈ దుర్దశ తప్పదు కదా " అని విలపించాడు. గాంధారి " నాయనా ధర్మనందనా ! మీ పెద తండ్రిగారికి వయసు అయిపోయింది. ఆయన వానప్రస్థము పోవాలని అనుకుంటున్నారు. నిద్రాహారాలు మాని ప్రతిరోజు అదే ఆలోచిస్తున్నారు. అందుకని ఆయనను అరణ్యాలకు పోవడానికి అనుమతి ఇవ్వు " అన్నది. అందరూ కలసి ధృతరాష్ట్రుడి మీద నీళ్ళు చల్లారు. తేరుకున్న ధృతరాష్ట్రుడు తిరిగి ధర్మరాజుతో " ధర్మనందనా ! నేను ఎలాగైనా తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళవలసినదే. ఈ విషయము తేలే వరకు నేను అన్నపానాలు ముట్టను " అన్నాడు. ఇంతలో అక్కడకు వచ్చిన వ్యాసుడికి అందరూ నమస్కరించారు.

వ్యాసుడు ధృతరాష్ట్రుడి ప్రస్థావనను బలపరచుట

[మార్చు]

వ్యాసుడు " ధర్మనందనా ! మీ పెదనాన్న మాటను మన్నించు. ఆయనను తపస్సు చేసుకోవడానికి వెళ్ళనివ్వు. వృద్ధుడు, బంధువర్గమును పొగొట్టూకున్న వాడు అయిన మీ పెదనాన్న అడవులకు వెళ్ళి పోవాలని తపస్సు చేసుకోవాలని అనుకోకుండా ఊరుకుంటాడా ! గాంధారి కూడా పుత్రశోకమును ఇన్నిరోజులు మనసులోనే అణచుకున్నది. ఆమె మనసుకు ప్రశాంతత కావాలి. ఆమెకు కూడా తన భర్త తపస్సు చేయాలని కోరిక ఉండదా ! అది చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. వీళ్ళను అడవులకు పోనివ్వు. వారు తపసు చేసి ఉత్తమగతులు పొందగలరు. అది అందరికి శ్రేయస్కరము. ధర్మనందనా ! నీవు ఇన్ని రోజులూ వీరికి సేవ చేసావు. ఇకనైనా వీరిని తమకు ఇష్టము వచ్చిన విధముగా జీవించనివ్వు. ధర్మనందనా ! క్షత్రియులకు యుద్ధభూమిలో మరణించడమో లేకున్న తపమాచరించి ఆ ధ్యానములో తనువు చాలించడమో ఉత్తమము. అంతే కాని సంసారసాగరాన పడి వ్యాధులతో మరణించడము అధమము. మీ పెదనాన్న అలా అధమముగా మరణించడము నీవు కోరుకుంటావా ! " అన్నాడు. ధర్మరాజు ఇక మారుమాటాడ లేక " మహాత్మా ! నీ మాట మాకు శిరోధార్యము. నీ ఆజ్ఞ ప్రకారమే నేను చేస్తాను. అయినా మీ అనుమతి లభించిన తరువాత నా అనుజ్ఞ ఏపాటిది. అయినా లాంఛనప్రాయంగా పెదనాన్న అరణ్య వాసముకు అనుమతి ఇస్తున్నాను " అని అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన వ్యాసుడు " కుమారా ధర్మనందనా ! నీ తండ్రి పాండురాజు తన అన్నగారైన ధృతరాష్ట్రుడిని సింహాసనము మీద కూర్చుండబెట్టి అతడిచేత ఎన్నో యజ్ఞయాగములను, పుణ్యకార్యములను చేయంచాడు. తాను రాజ్యభారము వహించి అన్నగారి చేత రాచరికపు భోగములను అనుభవింప చేసాడు. తన అన్నగారిని భక్తితో సేవించాడు. నీవూ కూడా నీ తండ్రి అడుగు జాడలలో నడచి ఈ కురు సామ్రాజ్యాన్ని విస్తరింపజేసావు. ఆయన కుమారులు నీకు, నీ తమ్ములకు చేసిన దుర్మార్గము అన్నీ మరచి నీవు నీ పెదనాన్నను ఇన్ని రోజులు సేవించావు. ఇన్ని రోజులు రాజభోగములు అనుభవించాడు. ఇకనైనా తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇవ్వు. అది నీ ధర్మము " అని అన్నాడు. ఆ మాటలను చెప్పి వ్యాసుడు తనదారిన తాను వెళ్ళాడు. ధర్మరాజు ధృతరాష్టృడితో " పెదనాన్న గారూ ! మీరు ఏమి చేయాలను అనుకున్నారో, విదురుడు, సంజయుడు, యుయుత్సుడు, కృపాచార్యుడు ఏమి చేయాలని అనుకున్నారో అది చేయండి. నాకు అభ్యంతరము లేదు. ఇప్పుడు మీ రంతా అలసి పోయి ఉన్నారు. పోయి భోజనము చేయండి " అని ప్రాధేయపడ్డాడు. ధర్మరాజు మాట మన్నించి ధృతరాష్ట్రుడు గాంధారితో సహా లోపలకు వెళ్ళాడు. అయన వెంట సంజయుడు, విదురుడు, యుయుత్సుడు, కృపాచార్యుడు కూడా వెళ్ళారు.

ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు రాజనీతిని బోధించుట

[మార్చు]

ధృతరాష్ట్రుడి వానప్రస్థముకు తగిన ఏర్పాటులు జరుగుతున్నాయి. మరునాడు ధర్మరాజును ధృతరాష్ట్రుడు ఏకాంతమందిరము లోనికి తీసుకుని వెళ్ళి " ధర్మనందనా ! ఈ రాజ్యము ఏడు అంగములతో కూడి ఉంది. రాజ్యపాలన ధర్మబద్ధంగా చెయ్యాలి. అది చాలా కష్టము. నాకు తెలిసినంత వరకు రాజనీతి గురించి నీకు చెప్తాను. ధర్మనందనా ! నీవు ఎప్పుడూ విద్యావంతులను, వృద్ధులను సేవిస్తూ వారికి తగిన ధనసహాయము చేసి వారి ప్రీతికి పాత్రుడవున కమ్ము. పెద్దలు చెప్పిన నీతులను విని ఆ విధముగా ఆచరించు. రాజ్యము ఎంత జాగ్రత్తగా చూస్తావో ఇంద్రియములను కూడా అలాగే అదుపులో ఉంచుకో. నీ ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటే అవి నిన్ను కాపాడతాయి. ఇక మంత్రులను నియమించే సమయంలో వారి పూర్వచరిత్రలను, నిజాయితీని పరిగణకు తీసుకోవాలి. ఇంద్రియ నిగ్రహము కలవారినే మంత్రులుగా నియమించాలి. ఇక రాజ్యపాలనలో ఎంతో మంది శత్రువులు ఉంటారు. వారి యొక్క కదలికలు, నడవడికలు, వారి యొక్క ఆప్తులు, బంధుమిత్రులు వారి కదలికలను అనుక్షణము జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండాలి. ధర్మనందనా ! ఇక పుర రక్షణావ్యవస్థను, శాంతి భద్రలతను పటిష్ఠము చేయాలి. నీకు నమ్మకమైన వారిని నీకు భోజనసమయంలో నీకు సహాయకులుగా నియమించాలి. ఆడవాళ్ళ రక్షణ చాలా ముఖ్యమైనది కనుక వారి రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలి. ధర్మనందనా ! నీవు ఏమి చేయాలన్నా మంత్రులందరిని ఆలోచించి నిర్ణయము తీసుకోవాలి. నీవు నీ మంత్రులతో కలసి రహస్యముగా తీసుకున్న నిర్ణయాలను రహస్యముగా ఉంచాలి. ధర్మనందనా ! రాజు తీసుకునే నిర్ణయాలు బయటకు తెలిస్తే జరిగే నష్టాన్ని నివారించడము కష్టము కనుక మంత్రివర్గ నిర్ణయాలు గోప్యముగా ఉంచాలని మంత్రులకు నొక్కి చెప్పాలి. ఇక న్యాయ నిర్ణేతలుగా బాగా చదువుకున్న వారిని నియమించాలి. అపరాధులను శిక్షించే సమయంలో వారు చేసిన అపరాధము ఏ పరిస్థితిలో చేసాడో, ఆ నేరము ఎంత తీవ్రతరమైనదో గుర్తించి దానికి తగినంత శిక్షను విధించాలి. రాజు ఉదయాన లేచి దేవతార్చన చేసి తరువాత క్రిందటి రోజు ఆదాయవ్యయాలు చూడాలి. తరువాత భోజనము చెయ్యాలి. సాయంత్రము వేళలో ప్రజలకు దర్శనము ఇవ్వాలి. వారి బాధలు వినాలి. రాత్రి వేళలో గూఢాచారులను దూతలను కలసి మంతనాలు సాగించాలి. ఏదైనా కొత్త సంగతి, అత్యవసరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆలస్యము చేయక బద్ధకించక దానిని వెంటనే పరిస్కరించాలి. ఆలస్యము చేయడము తగదు. ధర్మనందనా ! ఈ విధముగా పరిపాలన సాగిస్తూ రాజ్యపాలనకు కావలసిన ధనమును నీవు ధర్మబద్ధంగానే సంపాదించాలి. ప్రజలకు ప్రభుత్వానికి విఘాతము చేసే వాడిని కనిపెట్టి వారిని కఠినముగా శిక్షించి వారి ప్రయత్నమును వమ్ము చేయాలి. ధర్మనందనా ! ప్రభుత్వ కార్యాలయములో నేర్పు చూపే వారిని గుర్తించి వారిని ఆదరించాలి. వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటూ వారి జీవనోపాధి సక్రమముగా జరిగేలా ఏర్పాటు చేయాలి. వారు చేసిన మంచి పనులకు ప్రోత్సాహక బహుమతులను ఇచ్చి వారిని పదిమందిలో గౌరవించాలి. నీ మీద ప్రేమ, భక్తి, స్నేహము, శౌర్యము కలవారిని సేనాధిపతిగా నియమించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యముగా నిలిచే వారినే సేనాధిపతులను చెయ్యాలి. ప్రతి వారిలో తప్పులు ఉంటాయి. నీ తప్పును నీ కింద వారికి తెలియనివ్వక నీ కింద వారి తప్పులను గమనించి సరిదిద్దాలి.

శత్రుజయము

[మార్చు]

ధర్మనందనా ! నీ శత్రువు వద్ద బుద్ధిమంతుడు, నిజాయితీ పరుడు, పరాక్రమవంతుడు, శ్రమకోర్చి పనిచేసేవాడు ఉన్నట్లైతే వారిని నానా రకములైన బహుమతులు ఇచ్చి నీకు అనుకూలంగా పనిచేసేట్టు చేసుకో. సాధారణంగా పొరుగురాజులతో వైరము కలుగుతుంది. అటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండు. నీవు ఏమరుపాటుగా ఉన్నప్పుడు నీ మీద దాడి చేసే అవకాశము ఉంటుంది. నీతో సమానమైన నీ కంటే బలమైన శత్రువుతో సంధి చేసుకుని మిత్రులను చేసుకో. నీ కంటే బలహీనుడైన శత్రువును యుద్ధము చేసి ఓడించు. నీ కంటే బలహీనుడైన రాజు మిత్రుడైతే అతడిని సామంతుడిని చేసుకుని ఆదరించు. యుద్ధము రెండు రకాలు. ఒకటి కోటను ముట్టడించి శత్రుకు బయటి నుండి సహాయము అందకుండా చేసి బలహీనుడిని చేసి ఓడించడము. దీనిలో ప్రాణనష్టము తక్కువ. రెండవది నేరుకు నేరుగా నిలబడి యుద్ధముచేయడము. దీనిలో సైన్య నష్టము ఎక్కువే. ఈ రెండింటిలో దేనిని అనుసరించాలో నీవే సమయానుకూలముగా నిర్ణయించాలి. ఈ రెండింటికి సైన్యము పటిష్ఠముగా ఉండడము ముఖ్యము. నీ శత్రురాజ్యంలో మంత్రులు రాజుకు ఎదురు తిరిగినట్లు సమాచారము అందినప్పుడు నీవూ దానిని అదనుగా తీసుకుని వారిలో విభేదాలు కల్పించి శత్రువు మీద దాడి చేసి సులభంగా జయించాలి. ఎంత ప్రయత్నించినా నీ రాజ్యము లోని రహస్యాలు, నీ స్వంత రహస్యాలు బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త వహించు. పొరుగురాజులతో యుద్ధము చేసేకంటే సంధి ఉత్తమము. శత్రువును జయించడానికి అనువైన సమయము చూసి దాడిచేసి లోబరుచుకోవాలి. శత్రువును స్వేచ్ఛగా ఉండనిచ్చి అతడు ఆదమరచి ఉన్నప్పుడు దాడిచేసి ఓడించాలి. పొరుగురాజు మీద దండెత్తే ముందు అతడి బలము, సైన్యబలము, అతడి శక్తియుక్తులు, అతడి శత్రువులు, అతడి మిత్రులు, అతడి విశ్వాసపాత్రులు ఇవన్నీ తెలుసుకున్న తరువాత అతడి మీద దాడి చేసి జయించడానికి వ్యూహము పన్ని జయించాలి. రాజులకు రెండు విధములైన బలాలు ఉంటాయి. ఒకటి తన స్వంత బలము. అంటే స్వంత సైన్యము. రెండవది మిత్ర బలము. అంటే అతడికి కష్టసుఖాలలో అతడి వెంట ఉండి సహాయసహకారాలు అందించే మిత్రసైన్యాల బలము. కనుక నీవు నీ మిత్రులెవరో గ్రహించి వారికి ప్రాముఖ్యత ఇచ్చి వారిని అన్ని విధముల సంతోషపెట్టాలి. నీవు శత్రురాజ్యమును జయించినప్పుడు ఆ ప్రజలకు నీ మీద అభిమానము కలిగేలా ప్రవర్తించాలి. వారిని అన్ని విధాల ఆదుకున్నప్పుడు శత్రురాజ్యములో కూడా నీ కీర్తి పెరుగుతుంది. అంటే నీ రాజ్యములోని ప్రజలను శత్రురాజ్యంలోని ప్రజలను అందరినీ రాజు దయతో చూడాలి.

రాజధర్మము

[మార్చు]

ధర్మనందనా ! రాజైన వాడు వివిధశాస్త్రములను అభ్యసించి అందులో పారంగతుడు కావాలి. ప్రజలను వారి ఆస్తులను జాగ్రత్తగా కాపాడాలి. అందరి ఎడలా దయతో ప్రవర్తిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలగని విధముగా పన్నులు విధించాలి. అలా పాలించినప్పుడు రాజుకు ఆ రాజ్యము కామధేనువే ఔతుంది. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసే రాజు ఇహలోకసుఖాలతో పాటు పరలోకసుఖమూ ప్రాప్తిస్తుంది. ప్రజలను దయతో, ప్రేమతో, పక్షపాతము లేకుండా కన్నబిడ్డల వలె కాపాడే రాజుకు అశ్వమేధయాగము చేసిన ఫలితము కంటే అధిక ఫలితము లభిస్తుంది. నాయనా ధర్మనందనా ! ఇదివరకే నీకు నీ తాత భీష్ముడు, వ్యాసుడు, కృపాచార్యుడు ఎన్నో నీతివాక్యాలు చెప్పారు. నీవూ వాటిని శ్రద్ధగా విని పాటిస్తున్నావు. అయినా నీ మీద నాకున్న మమకారము వలన నేనునీకు నాకు తెలిసిన రాజనీతిని బోధించాను. అయినా నీకు తెలియని రాజనీతి ఏముంది. నిరంతరము పెద్దలను సేవిస్తూ ఉండు నీకు సకలశుభములు కలుగుతాయి " అని ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు రాజనీతి బోధించాడు. ధర్మరాజు " పెదనాన గారూ తాత భీష్ముడు ఇప్పుడు లేరు. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నాడు. ప్రస్తుతము మీరు తప్ప నాకు పెద్ద దిక్కు లేరు. తమరు ఉపదేశించిన రాజనీతి సూత్రాలను నేను అక్షరాల పాటిస్తాను " అన్నాడు. " ధర్మనందనా ! ఇక నీవు విశ్రాంతి తీసుకో అని చెప్పి ధృతరాష్ట్రుడు అంతఃపురానికి వెళ్ళాడు.

ధృతరాష్ట్రుడు హస్థినాపుర వాసుల వద్ద అనుమతి తీసుకొనుట

[మార్చు]

ధృతరాష్ట్రుడు అంతఃపురంలోకి వెళ్ళగానే గాంధారి " మనము అరణ్యముకు ఎప్పుడు వెళ్ళాలి " అని అడిగింది. " గాంధారీ ! మన అరణ్యవాసముకు వ్యాసమహర్షి అనుమతి ధర్మరాజు అనుమతి లభించాయి. ఇక ఆలస్యము చేయవలసిన పని లేదు. మనము వెంటనే అరణ్యముకు బయలుదేరవచ్చు. ఎన్నో పాపాలు చేసిన నీ కుమారులకు నేను తపమాచరించి ఉత్తమగతులు కలిగిస్తాను. మనము అరణ్యాలకు పోయే ముందు నీ కుమారులకు ఉత్తమగతులు కలిగేలా కలిగేలా కొన్ని దానధర్మాలు చేసి వెడదాము " అని అన్నాడు ధృతరాష్ట్రుడు. అరణ్యములకు వెళ్ళే ముందు ధృతరాష్ట్రుడు హష్తినాపుర వాసుల వద్ద అరణ్యావాసముకు అనుమతి తీసుకోవాలని అనుకున్నాడు. ధర్మరాజు అందుకు తగిన ఏర్పాట్లు చేసి హష్తినాపుర ప్రముఖులను రావించాడు. ధృతరాష్ట్రుడు వారితో " హస్థినాపుర వాసులారా ! ఇన్ని రోజులు మీరూ కౌరవులు కలసి ఉన్నారు. వయసు పైబడిన వారు వానప్రస్థము వెళ్ళడము ధర్మము. నేను కూడా వానప్రస్థము వెళ్ళాలనుకుంటున్నాను. మీ రంతా మంచి మనసుతో నన్ను దీవించండి " అని వేడుకున్నారు. ఆమాటలు హస్థినాపురవాసులు కళ్ళనీళ్ళ పర్యంతము అయ్యారు. వారిని చూసి ధృతరాష్ట్రుడు తిరిగి " ఈ హస్థినాపురమును మనకు తెలిసి శంతనమహారాజు పాలించాడు. తరువాత ఈ రాజ్యమును భీష్ముడు కాపాడి విచిత్రవీర్యుని రాజును చేసాడు. విచిత్రవీర్యుని కుమారుడనైన నేను పుట్టుగుడ్డిని కనుక ఈ రాజ్యము పాండురాజు చేత కాపాడబడినది. తరువాత దుర్మార్గులైన నా కుమారులు పాండవులతో యుద్ధముచేసి ఓడిపోయి వీరస్వర్గము అలంకరించారు. ఈ దుస్థితికి నిజానికి నేనే కారకుడిని. నన్ను క్షమించి అయినా నాకు అరణ్యవాసము చెయ్యడానికి అనుమతి ఇవ్వండి. నా భార్య గాంధారి వృద్ధురాలు. కుమారులను పోగొట్టుకున్నది. వృద్ధులమని తలచి అయినా మాకు అరణ్యవాసముకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. ఇప్పుడు ఈ హస్థినకు రాజు ధర్మరాజు. కురుసామ్రాజ్యానికి చక్రవర్తి. నాలుగు దిక్కులకు ప్రతినిధులుగా ఉన్న తన తమ్ముల మధ్య దేవేంద్రుడిలా వెలిగిపోతున్నాడు. ఇక మీరంతా ధర్మరాజుకు అనుగుణంగా నడవండి. ధర్మరాజు పాలనలో మీరంతా సుఖసంతోషాలతో జీవిస్తారని అనుకుంటున్నాను. నా వలన నేను నా వాళ్ళకు నష్టము కలిగించాను కాని మీకు మాత్రము ఎలాంటి హానికలిగించ లేదు. అందుకే ధర్మపరుడైన ధర్మరాజును సింహాసనము మీద ఉంచి నేను అరణ్యములకు వెడుతున్నాను. హస్థినాపుర వాసులారా నేను ఇంత వరకు మీకు ఎలాంటి హాని కలిగించలేదు. మీరు కూడా నాకు ఎలాంటి కష్టము కలిగించలేదు. ఇప్పుడు కూడా అలాగే నన్ను సాదరంగా అరణ్యవాసానికి పంపండి " అనగానే పురప్రముఖులు తమ దుఃఖాన్ని ఆపలేక పోతున్నారు. ధృతరాష్ట్రుడు తిరిగి " అయ్యలారా ! ఈమె నా భార్య గాంధారి సద్వర్తనురాలు. ఇన్ని రోజులు నన్ను నీడలా అనుసరించి ఉన్నది. ఈమెతో సహా అరణ్యవాసముకు వెళ్ళాడానికి నాకు అనుమతి ఇవ్వండి. వ్యాసుడు, ధర్మరాజు నాకు అరణ్యవాసానికి అనుమతి ఇచ్చారు. ఇక మీరు సంతోషముగా అరణ్యావాసానికి నన్ను సాగనంపండి " అని అన్నాడు.

హస్థినాపుర వాసుల ప్రతి స్పందన

[మార్చు]

ధృతరాష్ట్రుడి మాటలకు హస్థినాపురవాసులు భోరుమన్నారు. తరువాత పురప్రముఖులలో ఒకడు లేచి " ధృతరాష్ట్రమహారాజా ! భరతకులభూషణా ! పౌరులంతా నన్ను తమ ప్రతినిధిగా మాట్లాడమన్నారు. నా మాటలు సావధానంగా వినండి. కురువంశరాజులు ఎవరూ తగని పనులు చేయలేదు. ప్రజలను కన్న బిడ్డలవలె చూసుకున్నారు. ఆ మాటకు వస్తే సుయోధనుడు చేసిన అనర్హమైన పని ఏమిలేదు. దానికి మీరు చింతించ వలసిన పని ఏమిలేదు. తమరికి వ్యాసభగవానుడు ఆనతిచ్చినట్లు మీరు ఆచరించండి. అయినా మీ అరణ్యవాస ప్రతిపాదన మేము తట్టుకోలేక పోతున్నాము. తమ గుణగణములు తలచుకుంటూ మేము మీరు మామధ్య ఉన్నట్లు భావించుకుంటాము. మీ తాతగారు శంతనమహారాజు, మీ నాన్న విచిత్రవీర్యుడు, తమరు, తమరి కుమారుడు సుయోధనుడు అందరూ ప్రజారంజకంగానే పాలించారు. ఇందులో తమరిని కాని తమరి కుమారుడు సుయోధనుడిని కాని తప్పు పట్టవలసిన పని లేదు. ఇక యుద్ధము అంటారా అది విధిని అనుసరించి జరిగినది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, శల్యుడు, సుయోధనుడు, భీమార్జున నకులసహదేవులూ, దృపదుడు, విరాటుడు, ధర్మరాజు అందరూ విధిప్రేరణ వలననే ఒకరితో ఒకరు యుద్ధము చేసారు. అందులో కొందరు వీరస్వర్గము చేరారు. క్షత్రియకులమంతా సర్వనాశనము అయ్యింది. ఇందుకు ఎవరూ కర్తలు కాదు. తమరు ఎప్పుడూ ధర్మాన్ని పాటించారు కనుక మీకు ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుంది అనడములో సందేహము లేదు. ప్రస్తుతము మేము మా అదృష్టము వలన పాండవులపాలనలో ఉన్నాము. మూడు లోకములను పాలించడానికి సమర్ధులైన పాండవులకు ఈ పరిపాలనా బాధ్యతలు అప్పగించావు. అది చాలా సంతోషము. ధర్మరాజు ఎంతో ముందుచూపు కలవాడు. అతడి మంత్రులు సమర్ధులు. ధర్మరాజు శత్రువుకైనా అపకారము చేయజాలడు. ఇక మాకు అపకారము చేస్తాడని అనడము కల్ల. ధర్మరాజు తమ్ములు కూడా అన్న మాట జవదాటని ధర్మాత్ములే. ఇప్పటికే ధర్మరాజు దేవతలకు ధూపదీప నైవేద్యాలకు అగ్రహారాలు, బ్రాహ్మణులకు మాన్యాలు ఇచ్చాడు. పాండవులు మంచివారికి ప్రాణము ఇస్తారు. దుష్టులను కఠినంగా శిక్షిస్తారు. వారికి అహంకారము, మదము, మాత్సర్యము, లోభము మచ్చుకు కూడా లేవు. వారి తల్లి కుంతీదేవి, పాండవుల ధర్మపత్ని ద్రౌపదీదేవికి మామీద ఎనలేని ప్రేమ. వారు తరతమ భేధము లేక మా అందరిని ఆదరంతో పలకరిస్తారు. కనుక మేము అందరమూ పాండవుల చేతిలో వారి ధర్మపత్ని చేతిలో సుఖసంతోషాలతో జీవిస్తాము. మీరు మాగురించిన చింతవీడి మీకు తోచిన విధంగా అరణ్యములకు వెళ్ళండి " అని పురప్రతినిధి ధృతరాష్ట్రుడికి సభాముఖంగా విన్నవించాడు. ఆ మాటలకు ధృతరాష్ట్రుడు సంతోషించాడు. ఆ విధంగా ధృతరాష్ట్రుడు హస్థినాపుర వాసులకు వీడ్కోలు చెప్పారు.

ధృతరాష్ట్రుడి దానధర్మాల ప్రస్తావనను భీముడు అడ్డగించుట

[మార్చు]

మరునాడు ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిపించి " విదురా ! నేను మరణించిన బంధువులకు శ్రాద్ధకర్మలూ వారి ఆత్మశాంతి కొరకు దానధర్మాలూ చేయాలను అనుకుంటున్నాను. అవి చేసికాని నేను అరణ్యవాసానికి వెళ్ళను " అన్నాడు. విదురుడు ధర్మరాజుకు ధృతరాష్ట్రుడి అభీష్టము తెలియజేసాడు. ఆ మాటలు విన్న భీముడు కోపోద్రిక్తుడై ఏదో పలుకబోతున్న సమయంలో అర్జునుడు అతడిని వారించి " భీమసేనా ! శాంతించు. ధృతరాష్ట్రుడు మనకు రాజు. అతడిప్పుడు వయోవృద్ధుడు. యుద్ధములో భీష్ముడు, ద్రోణుడు మొదలైన ఎంతో మంది బంధువులు, మిత్రులు, పెద్దలు మరణించారు. వారికి శ్రాద్ధకర్మలు ఆచరించడానికి మనలను అర్ధిస్తున్నాడు. మనము అందుకు అంగీకరించక ఉన్న మనకు మనవంశముకు అపకీర్తి కదా ! ఇది ధర్మవిరుద్ధము కదా ! అన్నగారు సమ్మితించిన కార్యమును వ్యతిరేకించడము తగునా ! మనము అర్ధరాజ్యము కొరకు ధృతరాష్ట్రుడిని అర్ధించాము. ఇప్పుడు ఆ ధృతరాష్ట్రుడు కేవలము శ్రాద్ధకర్మలు చెయ్యడానికి మనలను అర్ధిస్తున్నాడు. మనము ఈ మాత్రము చెయ్యలేమా ! కనుక ధృతరాష్ట్రుడు చేయతలపెట్టిన శ్రాద్ధకర్మలను చేయించడము మన ధర్మము ఇందుకు నీవు అడ్డు చెప్ప వలదు " అన్నాడు. అర్జునుడి ధర్మనిరతికి ధర్మరాజు ఆనందించాడు కాని భీముడు మాత్రము శాంతించ లేదు అర్జునుడి మాటలు లక్ష్యపెట్ట లేదు " అర్జునా ! ఇంతకు ముందు చేసిన శ్రాద్ధకర్మలు, దానధర్మములు చాలవా ! భీష్ముడు వంటి పెద్దలకు శ్రాద్ధకర్మలు చెయ్యడనికి మనము లేమా ! ఆయన చెయ్యాలా ! అయినా ధృతరాష్ట్రుడు వంటి దుర్మార్గులు చేసిన శ్రాద్ధకర్మలను ధర్మాత్ములైన మన పితృదేవతలు స్వీకరిస్తారా ! అన్నయ్యా ! ఈ ధృతరాష్ట్రుడి వలన మనము అనుభవించిన కష్టాలు అప్పుడే మరిచావా ! మనము బాధలు పడుతున్నప్పుడు ఈ భీష్ముడు, బాహ్లికుడు ఏమి చేస్తున్నారు. ఒక్కరైనా ఇది ధర్మము కాదని ధృతరాష్ట్రుడిని నివారించారా ! అటువంటి బంధువులు అసలు బంధువులా ! వారికి శ్రాద్ధకర్మలు ఆచరించడము అవసరమా ! వారికి ఊర్ధ్వలోకాలు ప్రాప్తించకపోతే వచ్చే నష్టము ఏమిటి ? అంతగా అవసరము అనుకుంటే తన కుమారుడైన కర్ణుడికి కుంతీదేవి శ్రాద్ధకర్మలు చెయ్యచ్చు. అందులో దోషము ఏమీ లేదు. అయినా అన్నయ్యా ఆనాడు నిండు సభలో మన ద్రౌపదిని అవమానించిన విషయము, అన్న ధర్మనందనుడితో కలసి మనమంతా అడవులలో ఇడుములు పడిన విషయము అప్పుడే మరచి పోయి ఇప్పుడు తండ్రి అంటున్నావా ! మరి ఈ తండ్రి ఆరోజు ఎక్కడకు వెళ్ళాడు. సభలో కూర్చుని ఉన్నాడు కదా ! అలాంటి వాడు ఒక తండ్రేనా ! అప్పుడు భీష్ముడు మొదలైన పెద్దలు సభలో ఉన్నారు కదా ! అప్పుడు వారికి మనతో ఉన్న బంధుత్వము గుర్తుకు రాలేదా ! ఈ సంగతులు విదురిడికి తెలియవా ఈ రోజు ఈ విషయము చెప్పడానికి ఇక్కడకు వచ్చాడు " అలా సాగుతున్న భీముడి వాక్ప్రవాహాన్ని ధర్మరాజు వారించాడు. అర్జునుడు భీమసేనుడితో " అన్నయ్యా భీమసేనా ! ధృతరాష్ట్రుడు మనము గౌరవించ తగిన వాడు. ఇక ఒక్క మాట కూడా మాటాడ వద్దు. పెదనాన్న గారి కోరిక నెరవేర్చడము అన్నగారి అభిమతము. అన్నగారి అభిమతము నెరవేర్చడము మన కర్తవ్యము " అని భీముని వారించి విదురుడిని చూసి " పెదనాన్న ధృతరాష్ట్రుడు ఏవిధముగా శ్రాద్ధకర్మలు ఆచరించాలని అనుకుంటున్నాడో ఆ విధముగానే ఆచరించ వచ్చు. ఈ విషయము ధృతరాష్ట్రుడికి తెలియచేయ వచ్చు " అని చెప్పాడు. అర్జునుడి మాటలకు ధర్మరాజు సంతోషించి " విదురా ! మా పెదనాన్న ధృతరాష్ట్రుడు ఎంత ధనము వెచ్చించి అయినా శ్రాద్ధకర్మలు ఆచరించవచ్చని మా పెదనాన్న ధృతరాష్ట్రుడికి మనవి జెయ్యండి. విదురా ! అరణ్యములో పడ్డకష్టాలు తలచుకుని భీమసేనుడు ఏదో అన్నాడు. ఆ మాటలను మనసులో పెట్టుకోవద్దని ధృతరాష్ట్రుడికి మనవి చెయ్యి. అయినా భీమసేనుడు ఏమి అన్నా ఏమి ఔతుంది. ధృతరాష్ట్రుడు మాకు పరమదేవత. ఆయన నన్ను ఈ కురుసామ్రాజ్యానికి చక్రవర్తిని చేసాడు కనుక ఆయన మా తండ్రిగారు. ఆయన తనకు ఇష్టము వచ్చిన విధముగా శ్రాద్ధకర్మలను ఆచరించమని మనవి చెయ్యండి. అందుకు తగిన ఏర్పాట్లను అర్జునుడు చేస్తాడు. బ్రాహ్మణులకు అగ్రహారాలు, ధనము, ధాన్యాలు విరివిగా దానము చెయ్యమని చెప్పండి " అని చెప్పాడు.

ధృతరాష్ట్రుడు శ్రాద్ధకర్మలు నిర్వహించుట

[మార్చు]

విదురుడు పాండవులతో మాట్లాడిన తరువాత ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి " ధృతరాష్ట్ర మహారాజా ! నీకు నచ్చిన విధముగా భీష్మాదులకు శ్రాద్ధకర్మలు, దానధర్మాలు చెయ్యమని చెప్పాడు. నీ కుమారులు పుణ్యలోకాలు పొందేవిధంగా బ్రాహ్మణులకు బంగారము, రత్నములు, గ్రామములు, హయములు, గోవులు మిక్కుటముగా దానము చెయ్యమని చెప్పాడు. తరువాత భీముడు అన్న మాటలు కూడా చూచాయగా చెప్పి ధృతరాష్ట్ర మహారాజా ! నీవు భీముడు అన్న మాటలను లక్ష్యపెట్ట వద్దు. భీముడు దుర్మదుడు. అతడి మాటలు పట్టించుకోవలసిన పని లేదు. ఆ మాటలకు ధృతరాష్ట్రుడు సంతోషించాడు. కార్తికమాసములో పౌర్ణమి తిధియందు ధృతరాష్ట్రుడు పెద్దలకు శ్రాద్ధకర్మలు ఆచరించాడు. ధర్మరాజు బంగారముతో చేసిన వస్తువులను పంపించాడు. ధృతరాష్ట్రుడు ముందు బాహ్లికుడికి, భీష్ముడికి, సోమదత్తుడికి, ఆయన పుత్రులకు శ్రాద్ధకర్మలు ఆచరించాడు. ఆ తరువాత సుయోధనుడు మొదలైన నూరుగురు కుమారులకు శ్రాద్ధకర్మలు ఆచరించాడు. తరువాత సింధురాజు సైంధవుడికి అతడి బంధువులకు, మిగిలిన రాజులకు, ద్రోణుడికి తనకు తోచిన విధంగా శ్రాద్ధకర్మలు ఆచరించాడు. తనకు గుర్తు ఉన్న బంధువులు అందరికి శ్రాద్ధకర్మలు ఆచరించాడు. తరువాత 15 రోజులపాటు నిర్విరామంగా దాన ధర్మాలు చేసాడు. అందుకు తగిన నిధులు, సంభారాలు, బంగారము, రత్నములు, గోవులు, హయములు, వస్త్రములు, స్త్రీలు, గ్రామములు సమకూర్చాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడు చేసినవి కాకుండా ధర్మరాజు గ్రామములు బ్రాహ్మణులకు దానముగా ఇచ్చాడు. తరువాత అరణ్యములకు పోవడానికి తగిన సన్నాహములు చేసుకున్నాడు.

ధృతరాష్ట్రుడు అరణ్యవాసముకు బయలు దేరుట

[మార్చు]
గాంధారి ధృతరాష్ట్రులు తదితరులు వనవాసమునకు బయలుదేరుట-రాజ్మానామా నుండి ఒక దృశ్యం

ధృతరాష్ట్రుడు మరునాడు అరణ్యవాసానికి కావలసిన సన్నాహాలు చేసుకున్నాడు. మరునాడు ఉదవసీయము అనే యజ్ఞం చేసాడు. పాండవులకు మిగిలిన వారికి తాను అరణ్యాలకు పోతున్న విషయము తెలియజేసాడు. పట్టువస్త్రములను విడిచి గాంధారీ సహితముగా నారవస్త్రాలను ధరించాడు. ఆభరణాలు, ఆడంబరాలు విడిచిపెట్టాడు. పురోహితులు అగ్నిహోత్రముతో సహా వెంట నడువగా ధృతరాష్ట్రుడు గాంధారీ సహితముగా అరణ్యాలకు పోవడానికి సిద్ధము అయ్యాడు. ఆ సమయములో కుంతీదేవి అక్కడకు వచ్చింది. దుఃఖము ముంచుకు వస్తుండగా గాంధారీ వెంట నడచింది. ధృతరాష్ట్రుడు వెడుతున్న వంక చూస్తున్న ధర్మరాజు దుఃఖము తాళలేక కింద పడిపోయాడు. పక్కనే ఉన్న అర్జునుడు, భీముడు, నకులసహదేవులు, యుయుత్సుడు, సంజయుడు, ధౌమ్యుడు మొదలైన వారు కూడా దుఃఖముతో కుమిలిపోయారు. కుంతీదేవి గాంధారి భుజము మీద చెయ్యి వేసి నడుస్తూ ఉంది. ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద, ఉలూపి, ఉత్తర ఇంకా అంతఃపురజనాలు శోకిస్తూ నడుస్తున్నారు. కొంత మంది బిగ్గరగా రోదిస్తున్నారు. జూదము ఆడిన తరువాత ఏ విధముగా దుఃఖించారో ఆ విధంగా దుఃఖించసాగారు. వీధులకు అటూ ఇటూ నిలబడి చిన్నా, పెద్దా, ఆడా, మగా తేడా లేకుండా పౌరులంతా దుఃఖిస్తున్నారు. ధృతరాష్ట్రుడు పురద్వారము సమీపించగానే తనతో వస్తున్న వారిని నిలువమని ప్రార్థించాడు. విదురుడు కూడా ధృతరాష్ట్రుడితో అరణ్యానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. విదురుడితో పాటు సంజయుడు కూడా వారితో అరణ్యాలకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. యుయుత్సుడు, కృపాచార్యులు కూడా వెంట వస్తానని అంటే ధృతరాష్ట్రుడు వద్దని వారించి ధర్మరాజుకు అప్పగించాడు. తన కోడళ్ళను సముచితమైన మాటలతో అనునయించాడు. వారంతా ధృతరాష్ట్రుడికి గాంధారికి నమస్కరించి శలవు తీసుకున్నారు.

ధర్మరాజు శోకించుట

[మార్చు]

ధర్మరాజు కుంతీదేవిని చూసి " అమ్మా ! ధృతరాష్ట్రుడు నాకు పితృసమానుడు ఆయన అడవులకు వెడుతున్నాడు. నేను కూడా ఆయన వెంట వెళ్ళి ఆయనకు శుశ్రూషలు చేస్తాను. నీవు అంతఃపురవాసులను తీసుకు వెళ్ళు " అన్నాడు. కుంతీదేవి " కుమారా ! రాజ్యము చెయ్యవలసిన వాడవు నీవు తనతో రావడానికి నీ పెదతండ్రి అంగీకరిస్తాడా ! కనుక నీవు అంతఃపుర జనాలను తీసుకు వెళ్ళు. అక్కగారికి సేవచేయడానికి నేను వారితో వెడతాను. వారికి సేవలు చెయ్యడానికి నీకు తెలియదు. నేను స్త్రీని పైగా సమర్ధురాలను. కనుక నేను వారితో అడవులకు వెడతాను. ఇంత కాలము కలసి ఉన్నాము. ఇప్పుడు వారు అడవులకు వెడితే నా మనసు ఎలా ఒప్పుతుంది " అన్నది కుంతీదేవి. ఆ మాటలు విన్న పాండవులు అయిదుగురూ కుంతీదేవిని ఆపడానికి ఎంతో ప్రయత్నించారు. అయినా కుంతీదేవి వినక ధర్మరాజుతో " కుమారా ! నేను వీరితో అడవులకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. ఇక నీవేమి మాటాడకు. ఎవరు చెప్పినా నేను వినను. నకులసహదేవులను జాగ్రత్తగా చూసుకో. నా పెద్దకుమారుడు కర్ణుడిని మరువకు. నేను కపటబుద్ధితో కర్ణుడి జన్మరహస్యము మీకు చెప్పకుండా దాచి మహాపాపము చేసాను. దానిని తలచుకుంటూ నేను బాధపడని రోజు లేదు. నేను చేసిన పాపము తొలగి పోయేలా కర్ణుడి పేరు మీద విరివిగా దానధర్మములు చేయి. నా పెద్దకుమారుడు కర్ణుడు నా కుమారుడు అర్జునుడి చేతిలో దారుణముగా చంపబడ్డాడు అని తెలిసినా నా గుండెలు బద్దలు కాలేదు. నాది గుండెకాదు బండరాయి కదా ! నేను ఎంత కఠినాత్మురాలో కాదా ! నీవు నీ తమ్ములు సదా కర్ణుడిని తలచుకుంటూ ఉండండి. ధర్మనందనా ! నీ భార్య ద్రౌపదిని అనురాగంతో చూడండి. నీ తమ్ములు భీమార్జున నకులసహదేవుల మనసు తెలుసుకుని ప్రవర్తించు. వారికి కావలసినది వారు అడగకనే సమకూర్చు. ఇంటి విషయములలో పడి రాజ్యపాలన, ధర్మపాలనా మరువకు. నా నిర్ణయము మారదు. ఇంక మీరు తిరిగి వెళ్ళండి " అని కుంతీదేవి పలికింది. భీమార్జున నకులసహదేవులు కళ్ళలో ధారాపాతంగా నీరు కారుతుండగా తలలు వంచుకుని నిలబడ్డారు. ధర్మరాజు " అమ్మా ! ఏమిటిది ఇంత హటాత్తుగా ఈ నిర్ణయము తీసుకున్నావు. నిన్ను నేను ఎలా అడవులకు పంపగలను. చిన్నప్పటి నుండి మాకు మార్గోపదేశము చేసిన నీవు ఇప్పుడు కూడా అలాగే మా చేత రాజ్యపాలన చేయించు. అంతే కాని ఇలా అడవులకు వెడితే ఎలాగా ! నీవు కృష్ణుడు మమ్ములను అనుక్షణము కనిపెట్టి మార్గోపదేశము చేయక పోతే మేము ఇంత వారము అయ్యే వారిమా ! అమ్మా మమ్ము నీ కోడళ్ళను మనుమలను విడిచి అడవులలో ఎలా ఉండగలవు అమ్మా ! " అన్నాడు. అయినా కుంతీదేవి బదులు చెప్పకుండా గాంధారి వెంట నడచి వెడుతూనే ఉంది.

కుంతీ నిర్ణయమును భీములు వారించుట

[మార్చు]

ఇలా వీలుపడదని భీముడు కుంతీదేవికి అడ్డుపడి " అమ్మా అమ్మా ! ఏమిటమ్మా ఇది. నీవు మమ్ము వదిలిపెట్టి వెళ్ళడానికి కారణము ఏమిటమ్మా ! నీ ఆదేశము మీదనే మేముయుద్ధము చేసి శత్రువులను చంపి రాజ్యమును చేపట్టాము. సుఖించవలసిన తరుణములో ఇలా అడవులకు వెళ్ళడము భావ్యమా చెప్పు. అమ్మా ! నీవు అరణ్యములో ఏమి చెయ్యాలని అనుకుంటున్నావో అది ఇక్కడే చెయ్యమ్మా ! నీకు ఇష్టము వచ్చినట్లు దానధర్మాలు చెయ్యి. అమ్మా ! నీకు గుర్తుందా నకులసహదేవులు అరణ్యములలో ఎన్ని కష్టాలు పడుతున్నారో అని నీవు కుమిలి పోయావు కదా ! తిరిగి రాజ్యము సంపాదించడానికి మమ్మలిని యుద్ధానికి పురికొల్పావు కదా ! మేము యుద్ధము చేసి రాజ్యమును సంపాదించిన తరువాత మమ్మలిని వదిలి నీవిలా అరణ్యవాసానికి వెళ్ళడము తగునా ! " అని కుంతీదేవిని ఆపడానికి భీముడు ప్రత్నించాడు. భీముని మాటలు విని సుభద్ర, ద్రౌపది ఎంతో దుఃఖించారు. కుంతీదేవి పరిచారికల దుఃఖానికి అంతు లేకుండా పొయింది.

కుంతీ పరుషవాక్యములతో భీముని నివారించుట

[మార్చు]

వారందరినీ చూసి కుంతి కొంచము కఠినముగా మాట్లాడక పోతే వారు వెనుకకు మరలరు అని పరిచారికలతో మాట్లాడినట్లు " నిజమేనమ్మా ! నా కుమారులూ నా కోడళ్ళు నిండు కొలువులో అనుభవించిన అవమానాలను, వారు అరణ్యములో అనుభవించిన కష్టాలను చూసి సహించలేక వీరిని యుద్ధానికి పురికొల్పింది నేనే. అయినా లోకోత్తర పరాక్రమవంతులు అయిన నా కుమారులు ఆ విధముగా కష్టాలు అనుభవిస్తుంటే ఏ తల్లి అయినా ఓర్చుకుని ఉంటుందా ! చెప్పండి " అని చెప్పి పక్కనే ఉన్న ద్రౌపదిని ముందుకు త్రోసి ధర్మరాజుతో " చూడు ఈమె కుసుమకోమలి. ఈమెను తల్లిలా పూజించవలసిన ఈమె మరిది ఈమెను నిండు సభకు కొప్పు పట్టుకుని ఈడ్చుకు వచ్చి కొంగు పట్టుకుని లాగి ఘోర అవమానాలకు గురిచేసాడు. దానిని మీరు సహించారు. కాని నేను మాత్రము సహించలేక పోయాను. కురువంశ ప్రతిష్ఠ సర్వనాశనము ఔతుంటే సహించలేక పోయాను. అందుకే మిమ్ము యుద్ధముకు పురికొల్పాను. కృష్ణుడితో అలా మాట్లాడాను. అంతమాత్రాన భీమసేనుడు నన్ను ఈ రోజు ఇలా మాట్లాడుతూ నన్ను ఎత్తి పొడుస్తున్నాడు. నేనిక ఏమి చెప్పగలను " అన్నది. ఆ మాటలకు భీముడు సిగ్గుపడి బాధతో కుమిలి పోయాడు. అది చూసి సహించ లేక భీముడిని ధర్మరాజుకు చూపి " ధర్మనందనా ! నేను ఊరికే నవ్వులాటకు అన్నాను. అంతే కాని భీముని కించపరచడానికి కాదు. అయినా మీరు నాకు తక్కువేమి చేసారు. నేను కోరినట్లు దానధర్మాలు చెయ్యనిచ్చారు. నేను కూడా మీరు అశ్వమేధయాగము చేయడము కళ్ళారా చూసాను. ధన్యురాలను అయ్యాను. ఈ జన్మకు ఇక కావలసినది అనుభవించడానికి ఏమి ఉంది. నాకు ఈ రాజ్యసుఖముల మీద విసుగు పుట్తింది. అందుకని నన్ను వారితో అరణ్యాలకు వెళ్ళనివ్వు. జీవిత చరమాంకములో తపస్సు చేసుకుంటూ పుణ్యలోకాలకు పోతాను. ఆ పని నేను ఒంటరిగా చేయలేను కదా ! ఇప్పుడు నాకు గాంధారి, ధృతరాష్ట్రుడు తోడు దొరికారు. ఇంత కంటే నాకు కావలసినది ఏముంది. అందుకని నన్ను మీరు మనస్పూర్తిగా అడవులకు వెళ్ళనివ్వండి. నేనిక ధృతరాష్ట్రుడికి, గాంధారికి సేవ చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఈ శేషజీవితాన్ని ఆనందంగా, ప్రశాంతముగా గడుపుతాను " అని చెప్పింది.

ధర్మరాజు కుంతిని ధృతరాష్ట్ర గాంధారులకు అప్పగించుట

[మార్చు]

జరిగినదంతా దూరము నుండి చూస్తున్న విదురుడు ధృతరాష్ట్రుడికి విషయము వివరించాడు. ధృతరాష్ట్రుడు విదురుడితో " నీవు వెళ్ళి కుంతితో ధర్మరాజు చెప్పినట్లు చేయమని చెప్పు " అన్నాడు. విదురుడు, సంజయుడు కుంతీదేవి వద్దకు వచ్చి ఎంత నచ్చ చెప్పినా కుంతీదేవి వారి మాటలను వినలేదు. తన పట్టుదల వదలకుండా తన కొడుకులను కోడళ్ళను చూసి " మీరు ఎందుకు నా వెంట వస్తారు. నేను అడవులకు వెడుతున్నాను. మీరు ఇక మీమీ రాజభవనములకు వెళ్ళండి " అని చెప్పంది. ఇక కుంతి తన నిర్ణయము మార్చుకోదని వారికి తెలిసింది. వారందరూ ఆమెకు ప్రదక్షిణ చేసి నమస్కరించి అక్కడే దుఃఖిస్తూ నిలిచారు. పాండవులు మాత్రము ఆమెకు వీడ్కోలు చెప్పడానికి ఆమెతో కొంత దూరము నడచి ఆమెను ధృతరాష్ట్రుడి వద్దకు తీసుకు వెళ్ళి తరువాత ధర్మరాజు ధృతరాష్ట్రుడితో " మీరు అడవికి వెళుతున్నారని తెలిసి మా తల్లి కుంతీదేవి కూడా తమతో వస్తానని పట్టుపట్టింది. మేము ఎంత చెప్పినా వినడము లేదు. ఇక మా తల్లి బాధ్యత మీదే. ఆమెతో మీరు సేవలు చేయించుకోండి " అని తల్లి కుంతీదేవిని ధృతరాష్ట్ర గాంధారీలకు అప్పగించి భారమైన హృదయాలతో హస్థినాపురముకు తిరిగి వచ్చారు.

ధృతరాష్ట్రాదులు గంగాతీరము చేరుట

[మార్చు]

ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీ, విదురుడు, సంజయుడు అందరూ గంగాతీరము చేరుకున్నారు. అక్కడ విడిది చేసి గంగానదిలో స్నానము ఆచరించి సంధ్యావందనము మొదలైన నిత్యపూజలు చేసారు. అగ్నిహోత్రము వెలిగించి అగ్నిని పూజించి తరువాత భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నరు. ధృతరాష్ట్రుడు దర్భలతో చేసిన శయ్యమీద కూర్చున్నాడు. గాంధారి, కుంతి, విదురుడు, సంజయుడు కూడా తమతో వచ్చిన ఋత్విక్కులతో కలసి విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు ఉదయము తెల్లవారగానే ప్రాతఃకాల విధులు నిర్వర్తించారు. గంగానది దాటి కురుక్షేత్రములో ప్రవేశించారు. అక్కడ ఉన్న శతాయువు అనే రాజర్షి ధృతరాష్ట్రుడు గాంధారీ మొదలైన వారితో వచ్చాడని తెలిసి వారిని చూడడానికి వచ్చాడు. శతాయువు ధృతరాష్ట్రుడిని, గాంధారిని, కుంతిని, విదురుడిని, సంజయుడిని, ఋత్విక్కులను తన ఆశ్రమముకు తీసుకు వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రశాంతతను చూసిన ధృతరాష్ట్రుడు అక్కడే ఉండాలని కోరుకున్నాడు. అతడి కోరిక మీద వెంటనే అక్కడ పర్ణశాలలు నిర్మించారు. అందరూ వనవాసములో ఆచరించతగిన పద్ధతులు ఆచరించసాగారు. నారచీరలు కట్టుకుని కందమూలములు తింటూ పర్ణశాలలో నివసించసాగారు. కాలక్రమేనా ధృతరాష్ట్రుడు ఎముకలపోగుగా మారాడు. అతడి తపస్సు రోజురోజుకు తీవ్రరూపము తాల్చింది. అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడని సత్రయాగ సందర్భములో నైమిశారణ్యములో సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. ఇలా అడవిలో తపస్సు చేసుకుంటున్న ధృతరాష్ట్రుడిని చూడడానికి నారదుడు, పర్వతుడు, దేవలుడు, మౌంజాయనుడు అనే మహర్షులు వచ్చారు.

బయటి లింకులు

[మార్చు]