సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ద్వితీయాశ్వాసము

[మార్చు]

పాండవశిబిరంలో జరిగిన మారణ కాండను ధర్మరాజుకు ఎరిగించుట

[మార్చు]

నైమిశారణ్యంలో సత్రయాగ సందర్భంగా సూతుడు శౌనకాది మహామునులకు వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన భారతకథను సవిస్తరంగా చెప్పసాగాడు. మరునాడు తెల్లవారగానే ధర్మరాజు తన సోదరులు భీమార్జున నకులసహదేవులు, కృష్ణుడు, సాత్యకి పరివేష్టించి ఉండగా ధృష్టద్యుమ్నుని రథసారథి పరుగెత్తుకుని వచ్చి సాష్టాంగ దండప్రమాణం ఆచరించి చేతులు కట్టుకుని " ధర్మరాజా ! నిన్న అర్ధరాత్రి మన శిబిరాలలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ప్రవేశించారు. కృతవర్మ, కృపాచార్యుడు ముఖద్వారమున ఉండగా అశ్వత్థామ మాత్రం ధృష్టద్యుమ్నుడిని అతి దారుణంగా చంపాడు. ఆ తరువాత అతడి సోదరులను, కుమారులను పాంచాలరాకుమారులను, అర్ధరాత్రివేళ అతి క్రూరంగా చంపాడు. తరువాత ప్రభద్రక, మత్స్య, చేది సైన్యములను నిశ్శేషంగా చంపాడు. ఆ తురువాత అతడిని ఎదుర్కొన్న శిఖండి, ఉపపాండవులను ఒక్క తృటిలో వధించాడు. అసురుడి వలె చెలరేగిన అశ్వత్థామ ఎదుట మన సైన్యములు గజములు, హయములు ఆగలేక పోయాయి. అశ్వత్థామ దయాదాక్షిణ్య రహితంగా అందరిని చంపాడు. అతడి చేతిలో తప్పించుకుని వెళ్ళిన వారిని కృపాచార్య, కృతవర్మలు చిత్రవధ చేసారు. ముగ్గురూ అతి క్రూరంగా మన శిబిరాలను పీనుగుల పెంటగా చేసారు. నేను కృతవర్మ చేతికి చిక్కాను. నేను అతడి కాళ్ళు పట్టి వేడగా నన్ను కనికరించి వదిలాడు. ఈ విషయం మీకు విన్నవించడానికి నేను మీ వద్దకు వచ్చాను " అన్నాడు.

ధర్మరాజు విలపించుట

[మార్చు]

ఈ విషయం విని ధర్మరాజు మూర్ఛ పోయాడు. అందరూ అతడికి శైత్యోపచారాలు చేసారు. మూర్ఛ నుండి తేరుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ " యుద్ధంలో మరణించడం సహజమే ! కాని నేన్ము విజయంసాధించి విజయోత్సాహంలో ఉన్న తరుణంలో ఈ దారుణం ఏమిటి ? సముద్రం దాటి పిల్ల కాలువలో పడి మరణించి నట్లయింది నా పరిస్థితి. అసలే తండ్రిని పోగొట్టుకున్న ద్రౌపది, తన కుమారుల మరణం, సోదరుల మరణం తట్టుకుని జీవించ కలదా. ద్రౌపదికి ఈ విషయం ఎరుక చెయ్యండి.

ద్రౌపదికి సందేశం పంపుట

[మార్చు]

ఆ సమయంలో ద్రౌపది సుభద్రతో సహా విరాటనగరంలో ఉంది. ముందు ద్రౌపది తన తండ్రి మరణానికి చింతిస్తున్న తన తల్లిని ఓదార్చుటకు పాంచాల నగరానికి వెళ్ళింది. తరువాత సుభద్రా సహితంగా విరాటరాజు, ఉత్తరుల మరణానికి కుమిలి పోతున్న సుధేష్ణను ఓదార్చడానికి విరాట నగరం వెళ్ళింది. అక్కడి నుండి ద్వారకకు వెళ్ళాలని విరాటనగరంలోనే ఉంది. ద్రౌపది విరాటనగరం నుండి ఉపప్లావ్యం వచ్చింది. ధర్మరాజు " నకులుడిని చూసి నీవు తక్షణం ఉపప్లావ్యం వెళ్ళి ద్రౌపదిని మిగిలిన స్త్రీలను నీ వెంట తీసుకురా " అని ఆజ్ఞాపించాడు. అన్నగారి ఆజ్ఞ నకులుడు అనుసరించి ఉపప్లావ్యం వెళ్ళాడు. ధర్మరాజు అమిత దుఃఖంతో రోదిస్తూ కృష్ణ, సాత్యకులు వెంట రాగా పాండవశిబిరాలకు వెళ్ళాడు. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న తన కుమారుల బంధువుల శవాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. కృష్ణార్జునులు ఎంత ఓదార్చినా అతడి దుఃఖం ఆగ లేదు. కొంతసేపటికి తేరుకుని తన కొడుకులకూ, బంధు మిత్రులకూ దహనకార్యములు నెరవేర్చాడు. ద్రౌపది కొరకు నిరీక్షిస్తూ ఒక ప్రదేశంలో కూర్చున్నాడు.

ద్రౌపది విలపించుట

[మార్చు]

ధర్మరాజు ఆదేశము మేరకు నకులుడు ఉపప్లావ్యం వెళ్ళి ద్రౌపదికి ఈ విషయం చెప్పాడు. తన సోదరుల, కుమారుల మరణానికి ద్రౌపది కుప్పకూలి పోయింది. వెంటనే నకులుడి రథం ఎక్కి పాండవ శిబిరాలకు వచ్చింది. రథం దిగింది కాని నడవ లేక పోయింది. దుఃఖభారంతో ఆగలేక నేల మీద కూర్చుండి పోయింది. భీముడు దగ్గరగా వచ్చి ద్రౌపదిని పట్టుకుని ధర్మరాజు వద్దకు తీసుకు వచ్చాడు. మహారాజా ధర్మనందనా ! ఏమిటీ విధి వైపరీత్యం. రాజ్యలక్ష్మిని కైవశం చేసుకున్న మీకు కుమారుల ముద్దు ముచ్చట చూసుకునే అదృష్టం లేదా ! నాడు అభిమన్యుడు, నేడు కుమారులు ఈ గర్భశోకానికి అంతం లేదా ! " అంటూ బిగ్గరగా ఏడ్చింది. ఇంతలో అశ్వత్థామ తన కుమారులను అర్ధరాత్రి సమయాన గాఢ నిద్రలో ఉండగా చంపాడని గుర్తుకు వచ్చి కోపంతో ఊగి పోయింది. " మహారాజా ! నా కుమారులు గాఢ నిద్రలో ఉన్న సమయాన గురుపుత్రుడు అశ్వత్థామ అత్యంత క్రూరంగా చంపాడు. అది నా మనస్సులో ఆరనిచిచ్చును రేపింది. అశ్వత్థామను చంపుటకంటే వేరు మార్గం లేదు. మహారాజా ! ధర్మనందనా ! ఇప్పుడే నేను భీముడిని పంపి క్రూరాత్ముడైన అశ్వత్థామను చంపిస్తాను. లేని ఎడల ప్రాయోపవేశం చేసి నా ప్రాణత్యాగం చేయడం కంటే వేరు మార్గం లేదు " అని ఘోరమైన ప్రతిజ్ఞ చేసింది. వెంటనే ధర్మరాజు ఆమెను ఓదార్చాడు. " ద్రౌపదీ ! క్షత్రియులు యుద్ధంలో మరణించడం సహజమే కదా ! అలాగే నీ సోదరులూ కుమారులూ మరణించి వీరస్వర్గం అలంకరించాడు. అందుకు నీవు ఇంతటి కఠోరనిర్ణయం తీసుకొన వచ్చునా ! మనశ్వినీ ! శాంతించు, నీ శోకం తగ్గించుకో . నీ కోపం, శోకం అశ్వత్థామను చంపితే కాని పోదని నాకు తెలుసు. కాని అశ్వత్థామ అడవుల పాలై ఉంటాడు. అతడిని చంపినా మనకు ఎలా తెలుస్తుంది " అన్నాడు లౌక్యంగా.

అశ్వత్థామను చంపమని ద్రౌపది భీమసేనుని పంపుట

[మార్చు]

ధర్మరాజు మాటలు విన్న ద్రౌపది " అశ్వత్థామకు సహజ శిరోభూషణమైన రత్నమును తీసుకు వచ్చి చూపిన నేను విశ్వసించి బ్రతుకగలను " అన్నది. పక్కనే ఉన్న భీమసేనుడిని చూసి " భీమసేనా ! నీవు క్షత్రియ ధర్మమును గుర్తు తెచ్చుకుని వెంటనే ఆ పాపాత్ముడు అశ్వత్థామను పట్టిచంపి నా మనసుకు శాంతి చేకూర్చు. నాడు లక్క ఇంట్లో మిమ్ము పెట్టినపుడు ఉన్న పౌరుషం, హిండింబాసురుడిని చంపినప్పుడు ఉన్న శౌర్యమూ, యక్షులతో యుద్ధం చేసినప్పుడు ఉన్న ధైర్యము, కీచకుడిని వధించినప్పుడు ఉన్న పరాక్రమము గుర్తు తెచ్చుకో జనులందరూ నిన్ను పొగిడేలా ఆ హంతకుని హతమార్చు " అన్నది క్రోధంతో. ఆమాటలకు భీముడు పౌరుషంతో బుసలు కొడుతూ వెంటనే తనరథం తీసుకుని బయలుదేరాడు. నకులుడు భీమునికి సారథిగా రథం తోలుతున్నాడు. ఇద్దరూ కురుక్షేత్రం వైపు వెళ్ళారు. అక్కడ ఉన్న వారిని అశ్వత్థామ కృపాచార్యుడు, కృతవర్మలతో కలిసి హస్థినాపురం వెళ్ళాడని కాని మరలా తిరిగి వచ్చి గంగానది వైపు వెళ్ళారని, దారి మధ్యలో కృపాచార్యుడు, కృతవర్మ అశ్వత్థామను విడిచి ఎటో వెళ్ళారని అశ్వత్థామ మాత్రం వ్యాసాశ్రమం వెళ్ళాడని చెప్పారు. వెంటనే భీముడు వ్యాసాశ్రమానికి బయలుదేరాడు.

కృష్ణుడు భీముని కాపాడమని ధర్మజునికి చెప్పుట

[మార్చు]

భీముడు వెళ్ళిన తరువాత కృష్ణుడు ధర్మరాజుతో ఇలా పలికాడు " ధర్మనందనా ! భీముడు ఒక్కడే అశ్వత్థామ ను ఎదుర్కోవడానికి వెళ్ళాడు. భీముడు ఒక్కడే అశ్వత్థామ పరాక్రమం ముందు చాలడు. మీరందరూ వెళ్ళడం మంచిది. మరొక్క మాట ద్రోణుడు తన కుమారునికి బ్రహ్మశిరోనామాస్త్రమును తన కుమారుడు అయిన అశ్వత్థామకు ప్రీతితో ఇచ్చాడు. ఆ అస్త్రం అశ్వద్దామ వద్ద ఉన్నది. అశ్వత్థామకు ద్రోణుడు దానిని ప్రయోగించడమే కాని ఉపసంహారం చెప్ప లేదు. ద్రోణుడు దానిని జనావాసాల మీద ప్రయోగించవద్దని ఎంత ఆపద వచ్చినా వేరు అస్త్రముల సాయంతో కాపాడుకొమ్మని కట్టడి చేసాడు. అశ్వత్థామ మహా కోపిష్టి, గర్విష్టి, దురహంకారి, పొగరుబోతు ఎంతటి వారైనా లక్ష్యం లేదు ఇక తండ్రి మాట వింటాడా ! " అన్నాడు.

అశ్వత్థామ కృష్ణుని చక్రాయుధము అడుగుట

[మార్చు]

కృష్ణుడు ధర్మరాజుతో అశ్వత్థామ గురించి ఇంకా చెప్తూ " మీరు వనవాసంలో ఉన్నప్పుడు అశ్వత్థామ ఒక సారి నా వద్దకు వచ్చి " కృష్ణా ! పూర్వం అగస్త్యుడు తాను బ్రహ్మ వద్ద నుండి పొందిన బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని నా తడ్రి ద్రోణుడికి ఇచ్చాడు. నా తండ్రి దానిని నాకు ఇచ్చాడు. కృష్ణా ! నేను దానిని నీకు ఇస్తాను నీ చక్రా యుధమును నాకు ఇస్తావా !" అని అడిగాడు. నాకు అతడి అహంకారం అర్ధమైనా " నేను నా వద్ద ఉన్న ఆయుధములు గద, ఖడ్గం, ధనస్సు, చక్రము చూపి వీటిలో నీకు ఏది కావాలో నీకు దేనిని ధరించి ప్రయోగించడానికి శక్తి ఉన్నదో దానిని తీసుకో అన్నాను. నీవు నాకు మిత్రుడవు నీవద్ద నుండి నేను ఏదీ తీసుకొనుట ధర్మం కాదు " అన్నాను. సమాధానంగా అశ్వత్థామ " నాకు చక్రాయుధం కావాలి అన్నాడు. నేను " సరే తీసుకో " అన్నాను. అశ్వథ్థామ అమితమైన గర్వంతో ముందు ఏడమచేత్తో సుదర్శనచక్రాన్ని ఎత్తాడు అది కదల లేదు. తరువాత కుడి చేత్తో ఎత్తాడు అది ఇసుమంతైనా లేవ లేదు. చివరకు రెండు చేతులతో ఎత్తి ప్రయత్నించి లేపలేక అలసి పోయి విఫలమై నిలబడ్డాడు.

చక్రాయుధ మహిమ

[మార్చు]

నేను అశ్వత్థామను చూసి " అశ్వత్థామా ! నేను హిమవత్పర్వతాల మీద రిక్మిణీసమేతంగా ఉండి కూడా కఠోరబ్రహ్మచర్యం అవలంబించి, పన్నెండు సంవత్సరాలు ఉగ్ర తపమాచరించి అత్యంత మహిమాన్వితమైన ఈ చక్రాయుధమును పొందాను. దీని ప్రభావం ముందు దేవ, దానవ, గంధర్వాది సమస్త భూతములు సాటి రావు. నా వద్ద ఉన్న చక్రాయుధమును నా అన్న బలబద్రుడు కాని, నా కుమారుడు ప్రద్యుమ్న సాంబులు కాని మిగిలిన యాదవ శ్రేష్టులు కాని అడుగ లేదు. తన తపోదీక్షతో అర్జునుడు గాండీవము, శ్వేతాశ్వములు, కపిధ్వజం పొందాడు. తరువాత పరమశివుని మెప్పించి పాశుపతం పొందాడు. అటువంటి అర్జునుడు నాకు ప్రాణ సమానుడు అడిగిన నేను ఇవ్వనిది ఏమీ లేదు. అర్జునుడు కూడా ఈ చక్రాయుధమును తనకు ఇమ్మని అడగ లేదు. భరతవంశసంజాతులకు గురువైన ద్రోణుడి కుమారుడవైన నీవు దీనిని అడుగ వచ్చా ! అయినా ఈ చక్రాయుధముతో నీవు ఎవరితో యుద్ధం చేయనెంచి నన్ను అడిగావు " అని అడిగాను.

అశ్వత్థామ మనోగతం

[మార్చు]

అశ్వత్థామ " కృష్ణా ! నీవు ఈ చక్రాయుధమును నాకు ఇచ్చిన ఏడల నేను ఎలాగైనా నీకాళ్ళు పట్టి అయినా నిన్ను పోరుకు పిలిచి దీనిని నీ మీద ప్రయోగించాలని అనుకున్నాను. కాని ఈ చక్రాయుధమును నీవు నాకు ఇచ్చుట లేదు కదా ! నాకు ఎటువంటి హాని లేదులే. దీనిని నీ దగ్గరే ఉంచుకో. ఎలాగూ మహాభారతయుద్ధంలో నువ్వు నాతో యుద్ధం చేస్తావు కదా ! " అన్నాడు. నాకు నవ్వు వచ్చింది కాని బ్రాహ్మణుడు అడిగాడు కదా అని నేను అతడికి నాకు తోచిన బహుమానములు ఇచ్చి పంపాను. అతడి అహంకారముకు కారణం అతడి వద్ద ఉన్న బ్రహ్మశిరోనామాస్త్రం. క్రూరుడైన అశ్వత్థామ చేతిలో మన భీముడు బాధపడకూడదన్నదే నా కోరిక " అన్నాడు కృష్ణుడు.

కృష్ణాదులు అశ్వత్థామ వద్దకు వెళ్ళుట

[మార్చు]

కృష్ణుడు సహదేవుడిని, సాత్యకిని ద్రౌపదికి తోడుగా ఉంచి తానూ ధర్మరాజూ, అర్జునుడూ కలిసి భీముడు వెళ్ళిన వైపు వెళ్ళాడు. దారిలో వారు భీముని కలుసుకున్నారు. భీముని అడిగి అశ్వత్థామ ఉన్న చోటు తెలుసుకున్నారు. అందరూ వ్యాసాశ్రమం వెళ్ళి అక్కడ ఒంటినిండా విభూది పూసుకుని నిశ్చలంగా కూర్చుని తపస్సు చేసుకుంటున్న అశ్వత్థామను చూసి భీముడు మిన్నంటిన కోపంతో " ఓరీ అశ్వత్థామా ! కపటసన్యాసీ ! బ్రాహ్మణాధమా ! క్రూరాత్ముడా ! నిన్న రాత్రి అంతటి దారుణమారణకాండ జరిపి ఏమీ ఎరుగని విధమున ఇంత త్వరగా తాపసవృత్తిని ఎలా అవలంభించావు. తాపసివైనంత మాత్రాన చావుతప్పదు. చేసిన తపస్సు చాలు లేచి నాతో యుద్ధానికి రా ! " అని సింహం వలె భీముడు గద్దించాడు. అశ్వత్థామ భీముని అతడి పక్కన ఉన్న అర్జునుడిని చేసాడు. అర్జునుడి శస్త్రసంపద ఎరిగిన వాడు కావున పక్కన ఉన్న రెల్లుగడ్డిని తీసుకుని అభిమంత్రించి బ్రహ్మశిరోనామును దాని మీద ఆవహింప చేసి " అపాండవ మగుకాక " అని సంకల్పించి భీమార్జునుల మీదకు ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. పెద్ద విస్పోటం జరిగింది.

అర్జునుడు బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రయోగించుట

[మార్చు]

కృష్ణుడు అర్జునుడిని చూసి " అర్జునా ! ఇది బ్రహ్మశిరోనామాస్త్రం. ఇది అత్యంత భయంకర మైంది. దీనికి సాటి మరియొకటి లేదు. దీనిని మరే అస్త్రం నిరోధించ లేదు. నీవు కూడా నీకు ద్రోణాచార్యుడు ప్రసాదించిన బ్రహ్మశిరోనామాస్త్రం ప్రయోగించి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రమును నిరోధించి నిన్ను నీ సోదరులను కాపాడుకో ! " అని తొందర పెట్టాడు. వెంటనే అర్జునుడు రధము దిగి తన గురువు ద్రోణాచార్యుని మనసులో తలచి గాండీవమును తీసుకున్నాడు. బ్రహ్మశిరోనామాస్త్రమును ఎక్కు పెట్టాడు. అర్జునుడు తనలో " ఈ మహాస్త్రమును నేను అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రమును నిరోధించుటకు మాత్రమే ప్రయోగిస్తున్నాను. ఈ అస్త్రము వలన నాకు కాని, నా సోదరులకు కాని, గురుపుత్రుడు అశ్వత్థామకు కాని హాని కలుగకుండు గాక " అని ప్రార్ధించి అస్త్రప్రయోగం చేసాడు. అర్జునుడు ప్రయోగించిన అస్త్రం అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని నిరోధించ ప్రయత్నించింది. రెండు అస్త్రాలు ఒక దానిని ఒకటి ఢీ కొట్టడంతో సముద్రాలు పొంగాయి. ఆకాశం నుండి ఉల్కలు రాలాయి, భూమి కంపించింది, సూర్యుడు కాంతిని కోల్పోయాడు, ఆకాశం నుండి పిడుగులు పడ్డాయి, రాళ్ళ వర్షం పడుతుంది. ఈ ఉత్పాతాలు చూసి జనం భయంతో కంపించి పోతూ అటూ ఇటూ పరుగులెత్త సాగారు. ప్రజల ముఖాలలో ఆశ్చర్యాందోళనలు, భయం భీతి కనిపిస్తున్నాయి.

నారదుడి రాక

[మార్చు]

ఈ ఉత్పాదనలు చూసి నారదుడు పరుగు పరుగున వ్యాసుడి వద్దకు వచ్చాడు. నారదుడు వ్యాసుడితో కలిసి కృష్ణార్జునులు ఉన్న చోటుకు వచ్చి అర్జున అశ్వత్థాల మధ్య నిలిచి " ఓ అకల్మషులారా ! ఇంతకు ముందు ఎంతో మంది వీరులు, భుజబలసంపన్నులు, శూరులు ఈ పుడమి మీద జన్మించారు గతించారు. వారెవ్వరూ బ్రహ్మశిరోనామాస్త్రమును జనావాసాల మీద ప్రయోగించ లేదు. మీరెందుకు ఈ సాహసానికి ఒడి గట్టారు. " అని ఆడిగాడు వ్యాసుడు. అర్జునుడు వ్యాసుడు నారదులకు నమస్కరించి " ఓ మహాత్ములారా ! అశ్వత్థామ పాండవవంశ నిర్మూలనకై సంకల్పించి బ్రహ్మశిరోనామాస్త్రము ప్రయోగించాడు. శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు ఆ అస్త్రమును నిరోధించుటకు మాత్రమే నేను అదే అస్త్రమును ప్రయోగించాను కాని జనావాసాల మీద ప్రయోగించాలన్న క్రూరమైన తలంపు నాకు లేదు. తమరు ఆజ్ఞాపిస్తే నేను నా అస్త్రమును ఉపసంహరిస్తాను. కాని అలా చేస్తే ఆదుర్మార్గుడు తాను ప్రయోగించిన అస్త్రముతో మమ్ములను అందరినీ దహిస్తాడు మీరు మా క్షేమం కూడా ఆలోచించాలి " అని వినయంగా పలికి అర్జునుడు తాను ప్రయోగించిన బ్రహ్మశిరోనామాస్త్రమును అవలీలగా ఉపసంహరించాడు.

వ్యాసుడు అశ్వత్థామ అస్త్రమును ఉపసంహరించమని కోరుట

[మార్చు]

వ్యాసుడు అశ్వత్థామను చూసి " అశ్వత్థామా నీవు కూడా నీవు ప్రయోగించిన మహాస్త్రమును నిరోధించు " అన్నాడు. అశ్వత్తామ తాను ప్రయోగించిన బ్రహ్మశిరమును ఉపసంహరించాలని ప్రయత్నించాడు కాని సాధ్యం కాలేదు. అప్పుడు అశ్వత్థామ వ్యాసుడితో " మహాత్మా ! ఈ భీమసేనుడు సిగ్గు లేకుండా సుయోధనుడిని అక్రమ మార్గమున చంపాడు. అంతటితో ఆగక మునివృత్తి అవలంబించిన నాతో యుద్ధానికి దిగాడు. అందుకని కోపంతో ప్రాణభీతితో వివేకం కోల్పోయి ఈ అస్త్ర ప్రయోగం చేసాను కాని నాకు ఈ అస్త్రాన్ని ఉపసంహరించడం తెలియదు. ఇది పాపం పాండవులను దహించి వేస్తుంది అని తెలిసినా తప్పనిసరి పరిస్థితిలో దాన్ని నేను ప్రయోగించాను " అన్నాడు. అశ్వత్థామ మాటలను సావదానంగా విన్న వ్యాసుడు " అశ్వత్థామా ! నీ తండ్రి ద్రోణుడు తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి ప్రీతితో బ్రహ్మశిరమును ఇచ్చాడు. కనుక అర్జునుడు నీకు కీడు తలపెట్టడు. నీవు ప్రయోగించిన అస్త్రమును ఆపడానికే తాను అస్త్ర ప్రయోగం చేసానని చెప్పాడు. మేము కోరినంతనే ఉపసంహరించాడు. ఇంతటి అస్త్ర విద్యా వైభవం కలిగిన అర్జునుడిని వధించడానికి నీ తరం కాదు. ఈ బ్రహ్మశిరోనామాస్త్రమును గురించి చెప్తాను విను " ఇది ప్రయోగించిన దేశంలో పన్నెండేళ్ళు అనావృష్టి సంభవిస్తుంది. కనుక నిన్ను పాండవులను రక్షించడానికి ఈ ఉపాయం చెప్పాను. కనుక తాపస వృత్తిని అవలంబించానని అంటున్నావు కనుక ఈ మహాస్త్రమును ఉపసంహరించి కోపం విడిచి నీ వద్ద ఉన్న శిరోణ్మణిని ఇతడికి ఇవ్వు నిన్ను సంహరించినంతగా సంతోషపడి నిన్ను విడిచిపెడతారు. ఇది అందరికి ఆమోదయోగ్యమైనది. ఆ ప్రకారం చెయ్యి " అన్నాడు.

అశ్వత్థామ మాట నెగ్గించుకొనుట

[మార్చు]

అశ్వత్థామ వ్యాసుని చూసి " పాండవులకు రత్నములు కొత్తా ! కౌరవనాధుడి భండాగారమంతా కొల్లగొట్టాడు కదా ! ఇంకా వాళ్ళకు నా రత్నం కావలసి వచ్చిందా మహాత్మా ! ఈ రత్నము ఎవరి దగ్గర ఉందో వారికి చోరభయము, రాక్షస భయము, దేవతల భయము లేదు. అదిగాక అది కలిగిన వారికి ఆకలి, దప్పిక, నిద్ర, రోగము మొదలైనవి ఉండవు. ఏ రత్నమును ఎలా ఇవ్వగలను. కాని నీ మాటను మన్నించి ఈ రత్నమును మీకు సమర్పిస్తున్నాను. కాని ఇప్పుడు చెబుతున్నాను వినండి. నేను ప్రయోగించిన అస్త్రం పాండవపత్నుల గర్భములను విచ్ఛిత్తిచేసి పిదప శాంతి చెందుతుంది " అన్నాడు. వ్యాసుడు " అశ్వత్థామా ! తథాస్తు, అంతటితో తృపిపడు వేరే దానికి ఆశించకు " అన్నాడు. అశ్వత్థామ ఆలోచనలో పడ్డాడు. " ప్రస్తుతం పాండవపత్నులు ఎవ్వరూ గర్భం ధరించి లేరు. కనుక తన మాటలు వృధా ఔతాయి " అని ఎంచి వెంటనే మాట మార్చి " మహాత్మా ! పాండవేయ రాగపాత్రల గర్భములనిన తత్సంతాన గర్భములని నా అభిప్రాయం. కనుక పాండవ సంతానముల వలన కలిగిన గర్భములన్నింటినీ విచ్ఛితి చేసి శాంతి పొందుతుంది " అన్నాడు. అది విన్న వ్యాసుడు హతాసుడు అయ్యాడు.

పాండవ వంశమున ఒక్కరిని నిలుపమని కృష్ణుడు అశ్వథ్థామకు చెప్పుట

[మార్చు]

వారి సంభాషణ విలాసంగా తిలకిస్తున్న కృష్ణుడు " ఈ అశ్వత్థామ వ్యాసుడి మాట అబద్ధం చేసి తన మాటను నెగ్గించుకున్నాడు. ఇప్పుడు నేను వీడి అడ్డుపడక తప్పదు " అనుకున్నాడు. కృష్ణుడి ఆంతర్యం అర్ధం చేసుకున్న వ్యాసుడు మిన్నకుండి పోయాడు. కృష్ణుడు అశ్వత్థామతో " అశ్వత్థామా ! పాండుకుమారులను చంపి పాపం మూట కట్టుకున్నావు. ఇప్పుడు వారి సంతానం వారి వారి సంతానముల గర్భవిచ్ఛిత్తికి పాల్పడ్డావు. ఇది మహాపాపం. కాని నేను వారి సంతానంలో ఒకే ఒక్క గర్భమును కాపాడాలని నిశ్చయించాను. పాండవ వంశాన్ని నిలబెట్టడానికి ఒకేఒక్క గర్భమును నిలిపి మిగిలిన గర్భములను దహించు " అన్నాడు. ఆ మాటలకు అశ్వత్థామకు కోపంవచ్చి " కృష్ణా ! పాండవ పక్షపాతివి కనుక అలా మాట్లాడావు. కాని నేను అలా ఎందుకు చేస్తాను. నీవు విరాట రాజకుమారి ఉత్తరా గర్భాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు. నీవు ఆ పని చేస్తే నేను ఆ గర్భమును కూడా విచ్ఛిత్తి చేస్తాను " అన్నాడు. అందుకు కృష్ణుడు " అసంభవం అశ్వత్థామా ! అది ఎన్నటికీ జరగదు. అభిమన్యుని మహాతేజము ఉత్తర గర్భములో దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతుంది. నీవే కనుక ఆ గర్భముకు హాని కలిగిస్తే నేను దానికి దీర్ఘాయువు ఇస్తాను " అన్నాడు. ఆ మాటలకు అశ్వత్థామ " అస్త్ర దగ్ధుడికి నీవు దీర్గాయువు ప్రసాదిస్తావా ! అది అసంభవం కాని మీరిరువురు ప్రయత్నించండి " అంటూ విలాసంగా నవ్వాడు. కృష్ణుడు " ఇందులో నా ప్రమేయం ఏముంది. ఒక నాడు త్రికాల వేదుడైన బ్రాహ్మణుడు ఉపప్లావ్యంలో ఉన్న ఉత్తర వద్దకు వచ్చి ఆమెను చూసి అమ్మా ! నీపూర్వ పుణ్య ఫలము వలన నీకు ప్రాణములు పరీక్షీణమైన పుత్రుడు జన్మిస్తాడు. ఆ కారణంగా అతడు పరీక్షిత్తు అను నామంతో ఈ భూమిని పాలిస్తాడు. అని పలికాడు. కనుక అశ్వత్థామా ! ఆ బ్రాహ్మణుడి మాటలు అసత్యములు కావు కదా ! కనుక పాండవ వంశమును నీవు నిర్మూలించ లేవు. ఉత్తర గర్భమున జన్మించే వాడు వంశకరుడు ఔతాడు " అన్నాడు.

కృష్ణుడు అశ్వత్థామను శపించుట

[మార్చు]
తన శిరోరత్నాన్ని కోల్పోయిన అశ్వత్థామ

ఉత్తర గర్భమును రక్షించాండు కాని కృష్ణుడికి అశ్వత్థామ మీద కోపం చల్లారలేదు " అశ్వత్థామా ! బాల ఘాతకా ! బాలురూ యువకులూ అని లేకుండా అర్ధరాత్రి సమయంలో ఘాఢనిద్రలో ఉన్న వారిని దారుణంగా హత్య చేసినందుకు నీకు ఇదే నా శాపం అనుభవించు నేటి నుండి నీకు అన్నం దొరకదు నీకు ఎవరూ సహాయం చేయరు. నీ ఒంటి నిండా చీమూ నెత్తురు కారుతుంటుంది. ఈ ప్రకారం 3000 సంవత్సరాలు దేశ దిమ్మరివై తిరుగుదువు గాక ! కాని నా చేత రక్షింపబడిన ఉత్తరా గర్భ సంజాతుడు కృపాచార్యుడి వద్ద ధనుద్విద్య నేర్చుకుని అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. అతడి కుమారుడు జనమేజయుడు నీ కళ్ళ ముందే జనరంజకంగా రాజ్య పాలన చేస్తాడు. ఇది సత్యం " అని పలికాడు. ఆ మాటలు విన్న వ్యాసుడు " గురుకుమారా ! నీవు బ్రాహ్మణవంశంలో జన్మించినా క్షాత్రం అవలంబించావు. దారుణమారణ కాండకు పాల్పడ్డావు. ధర్మాధర్మ విచక్షణ మరచి బ్రహ్మశిరోనామాస్త్రమును ప్రయోగించావు. నా మాట కూడా లక్ష్య పెట్ట లేదు. కనుక కృష్ణుడి మాటలు అక్షరాల జరిగి తీరుతాయి " అని పలికాడు. అందుకు అశ్వత్థామ కోపించి " వ్యాస మునీంద్రా ! నీవు కూడా మా లాంటి మనుష్యుల మధ్యనే జీవించు. ఇది నా ప్రతి శాపం " అని చెప్పి తన శిరోరత్నమును పాండవులకు ఇచ్చి తాను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళాడు. పాండవులు కృష్ణుడు వ్యాసుడికి నమస్కరించి ద్రౌపది ఉన్న చోటుకు వచ్చారు. భీముడు అశ్వత్థామ శిరోరత్నమును ద్రౌపదికి ఇచ్చి " ద్రౌపదీ ! శత్రుకార్యం పూర్తి అయింది. గురుపుత్రుడు అయినందున అర్జునుడు [అశ్వత్థామ ను చంపనిచ్చగించ లేదు. అందుకని అతడి శిరోరత్నమును తీసుకొని అతడి కీర్తిశరీరమును పడగొట్టాము. ఇక అతడు బ్రతికీ చచ్చినట్లే. ఇక నీ దుఃఖమును మాని ధర్మరాజు దుఃఖమును పోగొట్టుము " అన్నాడు. ద్రౌపది మహిమాన్వితమైన ఆ రత్నమును చేత పట్టుకుని ధర్మరాజుతో " ఈ రత్నమును పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనిని పొందుటకు మీరు అర్హులు అని ఆ రత్నమును ధర్మరాజు కు ఇచ్చింది. ధర్మరాజు కూడా తనకు అశ్వత్థామ మీద ఉన్న గౌరవప్రపత్తులకు నిదర్శనంగా ఆ రత్నమును శిరస్సున ధరించాడు. అప్పుడు ధర్మరాజు అందరూ వినేలా తాము అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిన తరువాత జరిగినది అంతా ద్రౌపది కి, సహదేవుడికి మిగిలిన వారికి వివరించాడు. బ్రహ్మశిరోనామాస్త్ర ప్రభావం చేత అప్పటి వరకు నిలిచిన పాండవకుమారుల పత్నుల గర్భములు విచ్ఛిన్నమయ్యాయి. కాని ఉత్తరగర్భము యధాతధంగా ఉన్నది. ఈ విషయం ఉత్తరకు తెలియదు.

ధర్మరాజు సందేహం

[మార్చు]

అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో " కృష్ణా ! బలంలో శౌర్యంలో ద్రౌపదీ పుత్రులు అత్యంత బలవంతులు కదా ! అశ్వత్థామ ఒక్కడే వారినందరిని ఎలా చంపగలిగాడు. అతడికి అంతటి శక్తి సామర్ధ్యాలు ఎలా వచ్చాయి. అజేయబలవందతుడు శక్తిసంపన్నుడైన దృష్టద్యుమ్నుడు అశ్వథ్థామ చేతిలో దారుణంగా చని పోవడానికి కారణమేమిటి ? నాకు వివరించవా ! " అని అడిగాడు. కృష్ణుడు ధర్మనందనా ! ప్రాణికోటి జన్మించుటకు, జీవించుటకు, లయించుటకు కారణ భూతుడైన పరమశివుని తత్వం నాకు బాగాతెలుసు అతడు సంకల్ప మాత్రమున ఈ జీవకోటిని జన్మింప చేయగలడు లయింప చేయగలడు. కాని అతడు భక్త సులభుడు. భక్తితో తప్ప ఇతర మార్గమున అతడిని ప్రసన్నుడుని చేసుకొనుట అసాధ్యము. కనుక అతడి శక్తి ఇంత అని చెప్పుట అసాధ్యము.

బ్రహ్మ ప్రాణికోటిని సృష్టించుట

[మార్చు]

తొలుత బ్రహ్మదేవుడు ఈ ప్రాణి కోటిని సృష్టించ వలెనన్న తలంపుతో మహాశివుని వద్దకు వెళ్ళి తన కోరికను చెప్పాడు. అప్పుడు మహాశివుడు " బ్రహ్మదేవా ! ఏకార్యం సిద్ధించుటకైనా తపస్సు ముఖ్యం. తపస్సుతో సాధించ లేని కార్యం ఈ జగతిన ఏదీ లేదు. అందుకని ముందు నేను తపస్సు చేస్తాను " అన్నాడు. తరువాత శివుడు నీటిలో మునిగి తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచి పోయినా పరమ శివుడు ఎంతకీ బయటకు రాలేదు. బ్రహ్మదేవుడికి విసుగు పుట్టి తుదకు శివుడి సహాయం లేకుండా తన తపః ప్రభావంతో దక్షప్రజాపతిని సృష్టించాడు. బ్రహ్మ " దక్షప్రజాపతీ ! నీవు నా ఆజ్ఞ మీద ప్రజోత్పత్తిని సాగించు " అన్నాడు. దక్షుడు " నా కంటే అధికులు లేకున్న నీవు చెప్పినట్లే సృష్టి కార్యం నిర్వహిస్తాను " అన్నాడు. " దక్షప్రజాపతీ ! శివుడు జలమున మునిగి అనేక వేల సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నాడు. కనుక నీవే ఈ సృష్టిని సాగించు అన్నాడు. తరువాత దక్షుడు దేవతలను, అసురులను, తిర్యగ్జాతులను మొదలగు భూతములను సృష్టించాడు. కాని వాటికి ఆహారం సృష్టించ లేదు. అప్పుడు ప్రాణులు ఆకలితో దక్షుని భక్షించుటకు ప్రయత్నించాయి.

ప్రాణికోటికి బ్రహ్మ ఆహారం సృష్టించుట

[మార్చు]

అప్పుడు దక్షుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి " ప్రాణి కోటి అంతా ఆహారం కొరకు అలమటిస్తూ నా వెంట పడుతున్నాయి. వీటికి ఆహారం సృష్టించి నన్ను వీటి భారి నుండి రక్షించు " అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఓషధులను, ఫలములు, కందమూలములు మొదలైన భక్ష్య ములకు మూలమైన వృక్షములను, పొదలను, లతలను సృష్టించి ప్రాణి కోటికి ఆహారం సమకూర్చాడు. బహీనమైన జంతువులను బలవంతమైన ప్రాణులకు ఆహారంగా సమకూర్చాడు. ప్రాణులన్నీ ఆనందంగా వెళ్ళి పోయాయి. అప్పటి నుండి సృష్టి నిరాఘాటంగా కొనసాగుతుంది. అప్పటికే సృష్టించబడిన ప్రాణులకు సంతానోత్పత్తి జరుగుతుంది.

మహాశివుడి ఆగ్రహం

[మార్చు]

ఈ ప్రకారం సృష్టి క్రమం జరుగుతుండగా మహాశివుడు తపస్సు ముగించుకుని జలము నుండి బయటకు వచ్చి లోకమంతా సృష్టి జరగటం, ప్రాణులకు సంతానం కలగడం సృష్టి నిరాఘాటంగా జరగడం చూసాడు. మహాశివుడికి కోపం వచ్చింది సృష్టించడానికి పనికి రాని లింగం నాకెందుకని లింగము తీసి భూమి మీద పెట్టాడు. అది చూసిన బ్రహ్మ " మహాదేవా ! ఏమిటిది ఎందుకు ఇలా చేసావు " అని అడిగాడు. " బ్రహ్మదేవా ! నేను ప్రాణులను సృష్టించడానికి నేను నీళ్ళలో మునిగి అత్యంత ఉగ్రమైన తపస్సు చేసాను. ప్రాణులను సృష్టించడానికి పనికిరాని ఈ లింగం నాకేల " అని పలికి కోపంతో ఊగి పోతూ మాల్యవంతానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. మహాశివుని చేత భూమి మీద పెట్టబడిన లింగం బ్రహ్మాది దేవతలకు మహా ప్రకాశవంతంగా సుందరంగా కనిపించింది. ఇంద్రాది దేవతలు దానికి పూజాదికాలు చేయసాగారు. అలాచాలా కాలం గడిచింది.

దేవతల నిరీశ్వర యాగం

[మార్చు]

దేవతలంతా ఒక యాగం తలపెట్టారు. యజ్ఞముకు కావలసిన వస్తువులన్నీ సమకూర్చుకున్నారు. యజ్ఞభాగం అందుకోవడానికి తగిన దేవతలను నియమించారు. కాని ఈశ్వరుడికి మాత్రం యజ్ఞభాగం కల్పించ లేదు. యజ్ఞం మొదలైంది. ఈ విషయం తెలిసిన శివుడు ఆగ్రహించి ఒక పొడవైన వింటిని సృష్టించాడు. ఆ వింటిని ధరించి మహోగ్రుడై దేవతలు యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు. మహాశివుని కోపానికి భూమి దద్ధరిల్లింది. ఆకాశం ఘర్జించింది. పర్వతాలు పెకిలించబడ్డాయి. సూర్యచంద్రులు కళ కోల్పోయారు. దేవతలంతా పరుగులు తీసారు. యజ్ఞానికి ఆధ్వర్యం వహిస్తున్న దేవతలు చిత్తరువులయ్యారు. మహాశివుడు ఊగ్రంగా ఆ యజ్ఞమును కొట్టాడు. అక్కడ వేల్చుతున్న అగ్ని పారిపోయింది. యజ్ఞం ఆగిపోయింది. మహాదేవుడు పూషుని పళ్ళు విరుగకొట్టాడు, సవిత్రుని చేతులు విరిచాడు. భృగుడి కళ్ళు పొడిచాడు. అక్కడ ఉన్న దేవతలు భయభ్రాంతులై అక్కడ ఉన్న యజ్ఞోపకరణములు తీసుకుని తలా ఒక దిక్కుకు పారి పోయారు. కాని మహాశివుడు వారిని పారిపోకుండా అన్ని వైపులా తానే అయి విల్లు సంధించి నిరోధించాడు. దేవతలు చేసేది లేక మహాశివుడి కాళ్ళ మీద పడ్డారు. పారిపోయిన యజ్ఞం అగ్నితోసహా వచ్చి మహాశివుని కాళ్ళ మీద పడింది. మహాశివుడు శాంతించాడు. తన కోపమును ఒక సరస్సులో వేసాడు. ఆ కోపానికి ఆ సరస్సు ఎండి పోయింది. పరమేశ్వరుడి దయ వలన సవితకు చేతులు, పూషుడికి పళ్ళు, భృగుడికి కళ్ళు వచ్చాయి. దేవతలంతా పరమశివుని భక్తితో కొలిచి అతడికి ఆ యజ్ఞంలో భాగం ఇచ్చారు. దేవతల యజ్ఞం నిర్విజ్ఞంగా నెరవేరింది.

పరమ శివుని మహత్యం

[మార్చు]

ధరరాజా ! పరమేశ్వరుడి లీలలు ఇలా ఉంటాయి. ఆ మహాదేవుడు కోపిస్తే ముల్లోకాలు భస్మం ఔతాయి. ఆ దేవదేవుడు కరుణిస్తే లోకాలు సుభిక్షంగా ఉంటాయి. అశ్వత్థామకు దేవదేవుడు తోడుగా ఉండబట్టి ఉపపాండవులను, శిఖండిని, ధృష్టద్యుమ్నుడిని సంహరించగలిగాడు. కాని ఇది అశ్వత్థామ పరాక్రమం కాదు. ఈ యుద్ధంలో మీరు భీష్ముడిని పడగొట్టడం, ద్రోణ, కర్ణ, శల్యులను చంపడం, సుయోధనుడిని చంపడం, భీముడు తన ప్రతిజ్ఞ నెరవృచుకోవడం ఈశ్వర లీల. అంతే కాని మీ పరాక్రమం కాదు. కనుక సాధించిన విజయానికి ఆనందపడు. కారణాలు వెతక్కు " అన్నాడు కృష్ణుడు.

బయటి లింకులు

[మార్చు]