కర్ణ పర్వం - తృతీయాశ్వాసం

వికీపీడియా నుండి
(కర్ణ పర్వము తృతీయాశ్వాసము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


కర్ణ పర్వము తృతీయాశ్వాసం

[మార్చు]

కర్ణుడు తన చేత చిక్కిన ధర్మరాజును వదిలి సుయోధనుడిని రక్షించడానికి వెళ్ళాడని తెలియగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! కర్ణుడు అలా బుద్ధి లేని పని ఎందుకు చేసాడు. చేత చిక్కిన ధర్మరాజును చంపక ఎందుకు వదిలాడు ? సుయోధనుడు అంత మాత్రం భీమునితో యుద్ధం చేయ లేడా ? కర్ణుడు మోసం చేసాడంటావా ? సరేలే తరువాత ఏమి జరిగిందో చెప్పు అన్నాడు.

ధర్మరాజు శిబిరముకు వెళ్ళుట

[మార్చు]

కర్ణుడి చేత విడువ బడిన ధర్మరాజు శిబిరానికి చేరి మెత్తటి శయ్య మీద పరుండి. తన శరీరానికి తగిలిన బాణములు తీయించు కుంటూ తనకు జరిగిన పరాభవానికి బాధపడ సాగాడు. ఇంతలో నకుల సహదేవులు లోనికి వచ్చారు. ధర్మరాజు వారిని వెంటనే భీమునకు సాయంగా వెళ్ళమని చెప్పాడు. నకుల సహదేవులు భీముడికి సాయంగా వెళ్ళారు. అర్జునుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అర్జునుడు వేస్తున్న తీవ్రమైన బాణములు ఎదుర్కొంటూ అశ్వత్థామ అర్జునుడి మీద గదను విసిరాడు. ఆ గదను ముక్కలు చేసి వెంటనే అర్జునుడు అశ్వత్థామ శరీరంలో పది వాడి అయిన బాణములు గుచ్చి అతడి సారధిని చంపాడు. ఆగ్రహించిన అశ్వత్థామ కృష్ణార్జునుల మీద బాణవర్షం కురిపించాడు. అర్జునుడు ఆ బాణములు మధ్యలో తుంచి అశ్వత్థామ రధాశ్వముల పగ్గములను తెంచాడు. పగ్గములు తెగిన అశ్వములు రధమును ఎటో లాక్కుని వెళ్ళాయి. అది చూసి పాండవ సేనలు జయజయ ధ్వానాలు చేసాయి. కౌరవసేన పారిపోయింది.

కర్ణుడు భార్గవాస్త్రాన్ని ప్రయోగించుట

[మార్చు]

కురుసేనల వెనుకడుగు చూసి సుయోధనుడు " కర్ణా ! నీవు యుద్ధరంగమున ఉండగా కురుసేనలకు ఈ దుర్గతి ప్రాప్తించింది. నీవు సరిగా యుద్ధము చేసిన పాండవులు నీకు లెక్క కాదు. నీ వివిధాస్త్రాలను ప్రయోగించి నీ పరాక్రమాన్ని చూపించు " అని పురికొల్పాడు. అప్పుడు కర్ణుడు " శల్యా ! చూసావుగా సుయోధనుడి మాటలు మన రథమును అర్జునుడి వద్దకు పోనిమ్ము. అర్జునుడిని వధించి ఈ సువిశాల సామ్రాజ్యానికి సుయోధనుడిని చక్రవర్తిని చేసి నా ప్రతాపం లోకానికి తెలియజేస్తాను " అని వెంటనే విల్లు ఎక్కు పెట్టి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రము నుండి వివిధ ఆకృతులలో ఆయుధాలు వచ్చి పాండవ సేనను నాశనం చేస్తోంది. రధములు విరుగుతున్నాయి. హయములు, ఏనుగులు గుట్టలుగా చచ్చి పడుతున్నాయి. రధములు విరుగుతున్నాయి. ఆ అస్త్రప్రభావానికి తాళ లేని పాండవసేనలు పరుగులు పెట్ట సాగాయి.

శ్రీ కృష్ణుడు తెలివిగా ప్రవర్తించమని అర్జునుడికి చెప్పుట

[మార్చు]

అది చూసిన కృష్ణుడు " అర్జునా ! అర్జునా ! కర్ణుడి కోపజ్వాల చూసావుగా ! ఇది నీవు ఆగ్రహించ వలసిన తరుణం కాదు. వివేకం ప్రదర్శించ వలసిన తరుణం . తెలివిగా ప్రవర్తించాలి " అన్నాడు . అర్జునుడు " నిజమే కృష్ణా ! రథమును వెనుకకు మరల్చు " అన్నాడు. అప్పుడు కృష్ణుడు భీమసేనుడి వైపు చూసాడు. భీముడు కర్ణుడితో యుద్ధము చేస్తున్నాడు. భీముని చూసి పాండవసేనలు ధైర్యము తెచ్చుకుని ముందుకు వచ్చాయి. అది చూసి శిఖండి , ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, ఉపపాండవులు కర్ణుడిని చుట్టుముట్టారు. అర్జునుడు విశ్రాంతి కోరుకుంటున్నాడని తెలుసుకుని కృష్ణుడు రధమును దూరంగా తీసుకు వెళ్ళి " అర్జునా ! మనము అశ్వత్థామతో యుద్ధం చేసే సమయంలో కర్ణుడు ధర్మరాజును చిక్కించుకున్నాడు. అతడికి ఏమైందో తెలియదు. కర్ణుడితో మనవాళ్ళు యుద్ధం చేస్తున్నారు కనుక మనం ధర్మరాజు క్షేమము కనుక్కుని వచ్చి కర్ణుడితో యుద్ధం చేస్తాము " అన్నాడు. అర్జునుడు నలు దిశలా ధర్మరాజు కొరకు చూసి కనిపించక భీముని వద్దకు వెళ్ళి అడిగాడు. భీముడు " అర్జునా ! నేను కౌరవులతో యుద్ధము చేస్తున్నప్పుడు కర్ణుడు ధర్మరాజు శరీరం నిండా బాణాలు వేసాడు. అన్నయ్య యుద్ధ భూమిని విడిచి శిబిరానికి వెళ్ళాడు. కృష్ణుడు మన చెంత ఉండగా అన్నయ్యకు ఏమీ కాదు " అన్నాడు. అర్జునుడు భీమునితో " భీమా ! నేను కర్ణుడితో యుద్ధము చేస్తాను నీవు వెళ్ళి అన్నయ్య క్షేమము కనుక్కుని రా " అన్నాడు. భీముడు " అలాంటి పని నీవు చేస్తావేమో కాని నేను చెయ్యను. భీముడు యుద్ధ భూమి నుండి భయపడి పారిపోయాడని లోకులు అనుకుంటారు. అదుగో సంశక్తులు వస్తున్నారు. నేను వారిని ఎదుర్కొంటాను. నీవు వెళ్ళి అన్నయ్య క్షేమం కనుక్కో " అన్నాడు. ఇక చేసేది లేక అర్జునుడు " కృష్ణా ! మన రథమును త్వరగా ధర్మరాజు శిబిరానికి పోనిమ్ము నాకు అన్నయ్యను చూడాలని ఆతురతగా ఉంది " అన్నాడు.

అర్జునుడు ధర్మజుని కొరకు శిబిరముకు వెళ్ళుట

[మార్చు]

అర్జునుడి మాటని అనుసరించి కృష్ణుడు రధమును ధర్మరాజు శిబిరానికి పోనిచ్చాడు. అర్జునుడు లోనికి ప్రవేశించగానే ఒంటరిగా శయ్య మీద పవళించిన ధర్మరాజు కనిపించగానే మనసు కుదుటపడింది. అర్జునుడు ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు. అర్జునుడు కర్ణుడిని సంహరించి తన ఆశీర్వాదము కొరకు వచ్చాడనుకుని ధర్మరాజు సంతోషంగా " కృష్ణార్జునులారా ! దేవతలకు కూడా జయింప శక్యముకాని కర్ణుడిని, పరశురామ అస్త్రప్రసాదిత కర్ణుడిని, మహాబల వంతుడైన కర్ణుడిని సంహరించి విజయులై వచ్చినందుకు కృష్ణార్జునులను అభినందిస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకూ కర్ణుడికి జరిగిన యుద్ధములో కర్ణుడు నా సారథిని చంపి, పతాకమును విరిచి, నా శరీరం నిండా శరములతో నింపాడు. ఆ సమయంలో భీముని చేత చిక్కి నిరాయుధుడైన సుయోధనుడిని రక్షించడానికి వెళ్ళాడు. నేను శిబిరానికి వచ్చాను. అర్జునా ! కర్ణుడు నాకు చేసిన ఘోరావమానానికి నీ వంటి తమ్ముడు ఉన్నందు వలన అవమానభారం తీరింది. కర్ణుడిని ఎలా సంహరించావు. అతడి వెంట అతడి తమ్ములు కుమారులు అతడి బంధువులు సేనలు ఎప్పుడూ వెన్నంటి ఉంటారు కదా ! నీవు ఏమాత్రం గాయపడకుండా కర్ణుడిని చంపి నీ పరాక్రమము లోకానికి నిరూపించావు. అనాడు ద్రౌపదిని అన్న మాటలు నా చెవిలో ఇంకా మారు మ్రోగు తున్నాయి. అర్జునా ! ద్రౌపది పరాభవాగ్నిని చల్లార్చావు. అత్యంత గర్వసమున్నతమైన అతడి తలను ఎలా ఎగురగొట్టావు. అతడు నీ మీద శరప్రయోగం చేస్తున్నప్పుడు నీవు అతడి గుండెలకు గురిపెట్టి కొట్టగా చచ్చాడా " అన్నాడు.

ధర్మజుడు అర్జునుడిని నిందించుట

[మార్చు]

అన్నయ్యా ! నేను సంశక్తులతో యుద్ధము చేస్తున్నప్పుడు అశ్వత్థామ తన సేనలతో నన్ను చుట్టుముట్టాడు. నేను ఆ సేనలోని అయిదువందల రధాలను విరిచి రణభూమిని వారి శవాలతో నింపాను. అశ్వత్థామ నన్నూ నా రధాన్ని కనిపించనంతగా శరములతో కప్పి నాకు దిక్కు తోచకుండా చేసాడు. ఆ తరువాత నేను అతడిని తరిమి కొట్టాను. నీ కొరకు వెదికాను నీవు కనపడ లేదు భీమసేనుడు నిన్ను గురించి చెప్పాడు. నీ యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చాను నా మనస్సు శాంతించింది. ఇక నేను యుద్ధ భూమికి వెళ్ళి నీ మనస్సు ఆనందించేలా కర్ణుడిని వధించి తిరిగి వస్తాను " అన్నాడు. కర్ణుడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడని తెలుసుకుని ధర్మరాజు కోపంతో ఊగి పోయాడు. " అర్జునా ! నేను రణభూమి నుండి తిరిగి వచ్చి మీకు అందరికి చులకన అయ్యాను. నేనే కాదు భీముడు, నకులసహదేవులు కర్ణుడి చేత ఓడి పోయారు. ఆఖరికి నీవూ కృష్ణుడు కూడా కర్ణుడి చేతిలో ఓడి పోయారు. ఇక మనకు యుద్ధ భూమిలో పని లేదు. మనమంతా తిరిగి అడవులకు పోయి తాపస వృత్తి స్వీకరిస్తాము. లేకున్న సుయోధనుడి వద్దకు వెళ్ళి అతడి చెప్పుచేతలలో ఉంటాము " అన్నాడు. ఆ మాటలకు అర్జునుడి కళ్ళు నిప్పులు కక్కాయి. ధర్మరాజు తిరిగి " అర్జునా ! నీవు ఇంతటి వాడివి అని తెలిసిన మనము యుద్ధముకు దిగక మనకు తోచిన పని చేసే వాళ్ళము. ముందుగా నీవు నాకు కర్ణుడిని చంపడం చేతకాదని చెప్పి ఉంటే ఈ యుద్ధానికి ఎందుకు అంగీకరిస్తాను. అప్రయోజకులమైన మనకు రాజ్యమెందుకు రాజ్య పాలన ఎందుకు ? యుద్ధముకు ముందు కర్ణుడిని వధిస్తానని చెప్పి ఇప్పుడు ఓడి పోయి వచ్చి నన్ను అవమానాలపాలు చేసావు. అసలు నన్ను ఆకాశానికి ఎక్కించి నాలో ఆశలు కల్పించి పాతాళంలోకి నెట్టడ మెందుకు. ఆ రోజు కృష్ణుడి ముందు నీవు చెప్పినవన్నీ అసత్యములేనా ! నీవు పుట్టినప్పుడు గొప్ప వీరుడివి ఔతావని శత్రువులను నిర్జిస్తావని ఆకాశవాణి, మహా మునులు చెప్పారు. నీవున్నిటినీ వమ్ము చేసావు. నీవు కర్ణుడిని చంపలేవని తెలియక సుయోధనుడితో వైరము పెట్టుకున్నాను. అర్జునా ! నీకేమి తక్కువ. దేవత లిచ్చిన రధము ఆశ్వములు ఉన్నాయి. నీ ధ్వజము మీద కపిధ్వజము ఉన్నది. నీచేత తిరుగులేని గాండీవం ఉంది. అక్షయ తుణీరము ఉంది. అన్నిటికీ మించి దేవదేవుడైన శ్రీకృష్ణుడు సారధిగా నిన్నెప్పుడూ వెన్నంటి ఉన్నాడు. నీవు కర్ణుడి చేతిలో ఎలా ఓడి పోయావో నాకు అర్ధము కాలేదు. సుయోధనుడు నీవు కర్ణుడిని జయించలేవని ఎప్పుడో చెప్పాడు. కాని నేను నమ్మలేదు నీ పరాక్రమాన్ని నమ్మి భంగపడ్డాను. కోరి కష్టాలు తెచ్చుకున్నాను. మన ఇద్దరినీ మిత్ర రాజులు నమ్మి అనవసరంగా తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు " అని అనేక నిష్టూరోక్తులు పలికినా అర్జునుడు ఏమీ పలుక లేదు. ధర్మరాజు ఇంకను శాంతించక " కృష్ణా ! ఇక లాభం లేదు కర్ణుడిని జయించడం మన శక్యము కాదని తెలిసింది. సుయోధనాది శత్రురాజుల ముందు ఘోరావమానం పాలయ్యాను. భీముని దయ వలన ప్రాణాలతో బయట పడ్డాను. పాపం భీముడు ఒక్కడే అర్జునుడిలా పారి పోక ప్రాణాలకు తెగించి యుద్ధము చేస్తున్నాడు " అని తిరిగి " అర్జునా ! ఈ రోజు అభిమన్యుడు, ఘతోత్కచుడు ఉంటే బాగుండేది. అయినా చేసిన పాపాలకు వాళ్ళు మనకు ఎందుకు దక్కుతారు. చుట్టము అంటే ఆపదలో ఆదుకునే వాడు. శ్రీ కృష్ణుడి వంటి చుట్టము ఉండగా నీవు యుద్ధ భూమి నుండి ఎందుకు వచ్చావు. ఒక్క పని చేయి నీ గాండీవం కృష్ణుడికిచ్చి నీవు రధము తోలు. ఒక్క క్షణంలో కర్ణుడిని వధించి సుయోధనుడి రాజ్యం అపహరించ గలడు. నీవు కుంతీ గర్భాన ఉండగానే గర్భస్రావం అయి ఉంటే ఇంతటి దుర్గతి పట్టి ఉండదు కదా ! " అన్నాడు.

అర్జునుడు ధర్మజుని వధించుటకు కత్తి దూయుట

[మార్చు]

అన్ని మాటలు మౌనంగా భరించిన అర్జునుడు అఖరున ధర్మరాజు " నీ గాండీవాన్ని కృష్ణుడికి ఇచ్చి నీవు రధాన్ని తోలు " అన్న మాటలు సహించ లేక పోయాడు. పక్కనే ఉన్న కత్తి తీసుకుని ధర్మరాజును నరకబోయాడు. కృష్ణుడు అర్జునుడి చేయి పట్టుకుని వారించి " అర్జునా ఇక్కడ కత్తితో పని ఏమి? ఇక్కడ మనకు శత్రువులు ఎవరూ లేరు కదా ? మనం ఇక్కడకు ధర్మజుడు క్షేమంగా ఉన్నాడా లేడా అని చూడ వచ్చాము. క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్నాము. ఇది సంతోషించ వలసిన సమయం కాని కోపం తెచ్చుకొనవలసిన సమయం కాదు " అని అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! నా గాండీవాన్ని ఎవరికైనా ఇమ్మని అన్న వారి తల నరుకుతానని నా ప్రతిజ్ఞ. ధర్మజుని మాటలు విన్నావు కదా ! అలాంటి మాటలు అన్న వాడిని నరకడం ధర్మమే కాని అధర్మమం అంటావా  ! కనుక నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుని అసత్యదోషం నెరవేర్చుకుంటాను. పోనీ నీవు లోకజ్ఞానం కలవాడివి కదా నేను ఏమి చేయాలో చెప్పు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! చాలు వ్యర్ధప్రేలాపనలు ఆపు. ధర్మాధర్మ విచక్షణ తెలిసిన వారు నీ వలె పలుకరు. ఎవరైనా వింటే నీకు పెద్దల ఎడ గౌరవం లేదని అనుకోగలరు. ఏది ధర్మమో ఏది కాదో తెలుసుకుని మాట్లాడు " అన్నాడు. సత్యము అహింస పరమ ధర్మములు. ఆ సత్యమే అహింసాచరణకు తోడ్పడాలి కాని హింసను ప్రేరేపంచ కూడదు. మనం చేసే కర్మలలో ధర్మము సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. కర్మను ఉచితానుచితాలు తెలుసుకుని చేయాలి. నీ అన్నయ్య, నీహితము కోరే వాడు, ధర్మము తెలిసిన వాడు, మనకు మహారాజు అతడిని చంపబూనడం ధర్మం అనిపించుకుంటుందా ! తెలిసీ తెలియని వయసులో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవటానికి ఈ వయసులో ధర్మాధర్మ విచక్షణ మరవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. పెద్దలు ఇందుకు అంగీకరించరు. ధన, మాన, ప్రాణాలకు ముప్పు వాటిల్లినపుడు అసత్యము పలుకుట దోషం కాదు ఇందుకు నీకు ఒక దృష్టాంతం చెప్తాను " అన్నాడు.

కౌశికుని కథ

[మార్చు]

పూర్వము కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. వాడికి పెద్దలు చెప్పిన మాటలు వినే అలవాటు లేదు. తాను నమ్మిందే ఆచరిస్తాడు. అతడు ఒక సారి తన ఆశ్రమంలో తపస్సు చేసు కుంటున్నాడు. కొంత మంది దొంగలు దారిన పోయే బాటసారులను తరుముకుంటూ వస్తున్నారు. బాటసారులు తమ తమ ధనము ఆభరణముల మూటలతో ఆశ్రమ సమీపములోని పొదలలో దాక్కున్నారు. బాటసారులను వెదుక్కుంటూ వచ్చిన దొంగలు తాము తరుముతూ వస్తున్న బాటసారులు ఎక్కడ ఉన్నారని కౌశికుని అడిగారు. కౌశికుడు ధర్మాధర్మ విచక్షణ లేని వాడు కావడం చేత తనకు అసత్యదోషం చుట్టుకుంటుందని అనుకుని వారు పొదల మాటున దాక్కున్న విషయం చెప్పాడు. దొంగలు బాటసారులను చంపి వారి ధనమును దోచుకున్నారు. మరణానంతరం కౌశికుడు ఘోరనరకానికి పోయారు. కనుక అర్జునా !

అర్జునుడు శాంతించుట

[మార్చు]

హింసకు కారణమయ్యే సత్యము ధర్మం అనిపించు కోదు. సత్యాసత్యం, ధర్మాధర్మం గురించిన విచక్షణ పెద్దల చేత నిర్ణయించ బడాలి కాని ఎవరికి వారు వారికి తోచినట్లు చేయకూడదు. కనుక నీవు నీ అన్న ధర్మరాజును వధించుట ధర్మం కాదు " అన్నాడు. అప్పటికి శాంతించిన అర్జునుడు " కృష్ణా ! నన్ను మన్నించు. తల్లీ తండ్రి వలె నాకు హితవు చెప్పి నేను అనుచిత కార్యము చేయకుండా కాపాడావు. లేకున్న ఘోరం జరిగి పోయేది. కాని కృష్ణా ! జనులు నన్ను చేసిన ప్రతిజ్ఞ కాపాడని వాడని నిందించకుండా నాకు , నా అన్న ధర్మజునుకి ఆపద వాటిల్లని చక్కని మార్గం సూచించు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! ధర్మజుడు కర్ణుని వాడి బాణములతో బాధించడమే కాక నీచమైన మాటలతో నిందించాడు కనుక ఆ బాధ భరించ లేక ఏవో మాటలు అన్నాడే కాని నీ మీద ప్రేమ లేక కాదు. నీకు అన్న ప్రభువు. మిమ్ములను తండ్రి వలె కాపాడే వాడు. అతడు నిన్ను అనకూడదా ! నీవు పడకూడదా ! అతడి వంశోద్ధారకులైన నీవు, భీముడు, నకులసహదేవులు అతడి వశంలో ఉంటారు కదా ! మీ మీద కోపం ఎందుకు ఉంటుంది. ఆయనను చంపడానికి నీవు కత్తి ఎత్తావు కదా ! ఆ భావన మనసులో ఉంచుకుని నీ అన్నయ్యలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ నిందించు. కాని ఆ మాటలు మనసులో పెట్టు కోవద్దని వినయముగా నమస్కరించు. ఆ తరువాత నీకు అనృత దోషం పోయి నీ మనస్సు శాంతపడుతుంది. ఆ పై మనం కర్ణుడిని చంపడానికి వెళదాము.

అర్జునుడు ధర్మజుని నిందించుట

[మార్చు]

అర్జునుడు ధర్మరాజును నిందిస్తూ " ఓ ధర్మజా ! అత్యంత పరాక్రమంతుడైన భీముడు అంటే పడతాను కాని కర్ణుడికి వెనుదిరిగి బెదిరి వచ్చిన నీవు అంటే సహిస్తానా ! నా పరాక్రమమేమిటో తెలిసీ నన్ను ఇలా నిందించిన నీ నాలుక వేయి చీలికలు కాదేమి. నన్ను నా పరాక్రమాన్ని నిందించిన నీకు ఏపాటి పరాక్రమము ఉంది. ఎప్పుడైనా ఎవరితోనైనా యుద్ధము చేసి గెలిచావా ! నకుల సహదేవుల పాటి కూడా యుద్ధము చేయలేని నీవు ఇన్ని మాటలు అన్నావు. కాని వారు అలాంటి ప్రేలాపనలు ప్రేలరు. ఆ నాడు జూదము ఆడి ఓడి మమ్ము అరణ్యాలపాలు చేసింది నీవు కాదా ! లేకున్న ఈ మారణ హోమం ఎందుకు ఇన్ని కష్టాలు అవమానాలు ఎందుకు. ఇంత చేసి సిగ్గు లేకుండా నన్ను నిందించావు. అవునులే చేతకాని వాడికి ఓరిమి ఒక కవచం. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని దుర్బుద్ధులు మాని పౌరుషం చంపుకుని నోరు మూసుకుని ఉండు. నీ వల్ల ఇన్ని కష్టములు పడ్డాము ఇక నీ మాటలు సహించి ఉండము " అని నిందించి మనసులో ఎంతో సంతాపం చెందాడు. మరలా ఒరలో నుండి కత్తి తీసాడు. కృష్ణుడు కంగారు పడి " మరలా కత్తి ఎందుకు తీసావు " అన్నాడు. అర్జునుడు " ఆ మహానుభావుని ఇన్ని మాటలు అన్నందుకు నాతల నరికి అతడి పాదాల చెంత పెడతాను " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! దానికీ ఒక ఉపాయం ఉందయ్యా ! నిన్ను నీవు పొగుడుకుంటే అది ఆత్మహత్యతో సమానం. కనుక నిన్ను నీవు పొగుడుకో " అన్నాడు. అర్జునుడు " ధర్మజా ! నా పరాక్రమం నీకు తెలియనిదా ! నేను సంశక్తులను నాశనం చేసాను. నా చేత మరణించిన కౌరవ సేనలను ఒక్కతరి పరికించు " అని గర్వంగా పలికి. అంతలోనే అన్నయ్యకు సాష్టాం దండప్రమాణం ఆచరించి " అన్నయ్యా ! నేను నీతో ఏవో కారుకూతలు కూశాను అందుకు నన్ను మన్నించు. వాటిని నీవు పట్టించుకొనక ఎప్పటిలా నన్ను ఆదరించుము. ధర్మజా ! నేను సత్యము పలుకుచున్నాను వినుము నా తనువు, నా ప్రాణం, నా జీవితం నీ ఆధీనములు. అక్కడ భీముడు ఒంటరిగా పోరాడుతున్నాడు. అతడికి సాయంగా వెళ్ళుటకు నాకు అనుజ్ఞ ఇమ్ము. నేను వెళ్ళి కర్ణుని వధించి కౌరవ సేనలను నాశనం చేసి సుయోధనుడి గర్వము అణచాలి. ఈ రోజు కర్ణుడి తల్లి రాధకైనా పుత్రశోకం కలగాలి లేక మన తల్లి కుంతికైనా పుత్రశోకం కలగాలి " అన్నాడు.

ధర్మజుడు తనను తాను నిందించు కొనుట

[మార్చు]

అర్జునుడి మాటలు విన్న ధర్మరాజు " అర్జునా ! నీవు పలికినది సత్యమే ! కుంటుంబ పెద్దగా మీ యోగ క్షేమములు చూడ వలసింది పోయి మిమ్ము అనేక కష్టములకు గురి చేసాను. నీవు నన్ను చంపక పోయినా నేను ప్రాయశ్చితం చేసుకుంటాను. నేను ఇప్పుడే సర్వసంగ పరిత్యాగినై అడవులకు పోతాను. మీరు హాయిగా జీవించండి. నా లాంటి పిరికివాడికి, బలహీనుడికి, యుద్ధమంటే భయపడే వాడికి రాజ్యమెందుకు? భీమసేనుని ఈ కురుసామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడిని కావించుము " అని పలికి చకచకా తాను కూర్చున్న ఆసనము దిగి వనవాసం పోవుటకు ఉపక్రమించాడు. అది చూసిన కృష్ణుడు ధర్మజుడి పాదాలకు నమస్కరించి " ధర్మజా ! అర్జునుడి ప్రతిజ్ఞ గురించి నాకు తెలియదు. నీవు గాండీవిని నిందించి నందుకు నిన్ను చంపక పోతే అతడి ప్రతిజ్ఞా భంగం ఔతుంది. చంపితే ఘోరం జరుగుతుంది. కనుక పెద్దలను దూషించుట వారిని చంపడంతో సమానము కనుక నిన్ను దూషించమని అర్జునుడికి చెప్పాను. అందుకు నీవు మనస్తాపం చెందావు. నీ పాదాలు పట్టుకుని చెప్తున్నాను. అర్జునుడిని నన్ను మన్నించు. నేను సత్యము పలుకుతున్నాను వినుము ఈ రోజు అర్జునుడి చేతిలో కర్ణుడు మరణించుట తధ్యము " అన్నాడు. ధర్మజుడు కృష్ణుని లేవనెత్తి అతడి ఎదుట చేతులు జోడించి " మహాత్మా ! కృష్ణా ! ఏమాత్రము విచక్షణా జ్ఞానము లేక నోటికి వచ్చిన కారు కూతలు కూశాను. నా హృదయం కలకబారింది. నన్ను క్షమించి నాకు హితబోధ చేసిన నిన్ను ఎన్నటికీ మరువజాలను " అన్నాడు. కృష్ణుడు తలదించుకుని ఉన్న అర్జునుడిని చూసి " అర్జునా ! నీ అన్న ప్రసన్నుడైనాడు. అతడి అనుమతి తీసుకుని మనం యుద్ధానికి వెడదాము. కర్ణుని చంపడమే మన ప్రథమ కర్తవ్యము. రణరంగమున వీరవిహారమొనరించి కర్ణుని వధించి ధర్మజుడి మనసుకు ఆహ్లాదం కలిగించు . అసలు విషయం తెలుసుకొనక ధర్మజుడు తొందర పడి నిన్ను నిందించినందుకే కదా ఇలా జరిగింది. ఆ మాటలకు కోపించి నీవు నీ అన్నను చంపిన ఏమయ్యి ఉండేది. దైవానుగ్రహం వలన ఘోరం జరుగకుండా ఆగి పోయింది " అనగానే అర్జునుడు కళ్ళ వెంట ధారాపాతంగా నీరు కారుతుండగా ధర్మజుడి కాళ్ళ మీద పడ్డాడు. ధర్మరాజు కూడా అర్జునుడిని పైకి లేవనెత్తి కన్నీళ్ళు తుడుచుకుంటూ గట్టిగా అర్జునుడిని హృదయానికి హత్తుకుని " అర్జునా ! ఆ కర్ణుడు నా విల్లు రథము విరిచి ములుకులవంటి మాటలతో నా మనసు గాయపరిచాడు. నాశరీరాన్ని తన వాడి అయిన బాణాలతో బాధించాడు. అలాంటి దుర్మార్గుని నీవు చంపక ఉన్న నేను బ్రతికి ఉండి ఏమి ప్రయోజనము " అన్నాడు. అర్జునుడు " మహారాజా ! నేను ఈ రోజు కర్ణుడిని చంపి నేలను పడవేయక నీ ముఖము చూడను. కృష్ణుడిని సారథిగా పొందిన అర్జునుడు ఆడిన మాట తప్పడు " అని కృష్ణుడిని చూసి " కృష్ణా! ఈ రోజు అర్జునుడు కర్ణుడిని చంపుతాడు అని నీ మనసున సంకల్పించు ఆ సంకల్ప బలంతో నేను కర్ణుడిని సంహరిస్తాను " అన్నాడు. కృష్ణుడు " తధాస్తు " అన్నాడు. కృష్ణుడు " ధర్మజా ! నీ తమ్ముడు అర్జునుడిని దీవించి పంపు " అన్నాడు. ధర్మరాజు " అర్జునా ! అనాలోచితంగా నేను అన్న మాటలకు బాధపడకు. శ్రీకృష్ణుడి అనుమతితో నీవు నన్ను అన్న మాటలకు నేను బాధపడను. విజయా ! నీవు కర్ణుడిని గెలిచి విజయుడివి అన్న పేరును సార్థకం చేసుకుని తిరిగిరా " అన్నాడు.

కర్ణవధ కొరకు సంకల్పించుట

[మార్చు]

కృష్ణార్జునులు రధారూఢులై రణరంగముకు బయలుదేరారుకాని అర్జునుడి మనసులో భీతి బెరుకు ఆవహించాయి. అది గమనించిన కృష్ణుడు " అర్జునా ! నీవు అమరులకు అజేయుడవు. నీకు భుజబలము, అస్త్రబలము దైవ బలము ఉన్నాయి. నీ పరాక్రమానికి తట్టుకోలేక భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. ద్రోణుడు ప్రాణాలు విడిచాడు. సైంధవుడు రూపు మాసి పోయాడు. ఇక మిగిలింది కర్ణుడు అతడిని చంపి సుయోధనుడి నమ్మకాన్ని వమ్ము చెయ్యి. అతడిని నమ్మే సుయోధనుడు ఈ ఘోర నరమేధానికి దిగాడు. ఇంకా కృపాచార్యుడు, అశ్వథ్థామ, శల్యుడు, కృతవర్మ కూడా చావ వలసిన వారే. కృపాచార్యుడిని, అశ్వత్థామను బ్రాహ్మణులని వదిలినా కృతవర్మను నా బంధువని వదలకు. శల్యుడు మీ మేన మామ. అతడు పరుల పక్షాన ఉన్నందున చంపతగిన వాడే. కర్ణుడు మీ కష్టాలకు మూల కారకుడు. లక్షాగృహ దహనము, కపటజూదము, పాండవసతికి జరిగిన అవమానము, ఇంకా సుయోధనుడు చేసిన సమస్త అకృత్యములకు మూలము అతడే. కర్ణుడు సభలో ద్రౌపదిని అన్న మాటలు దుస్సహము అవి నీవింకా మరువ లేదు కదా " నీ మగలు నిన్ను జూదమున ఓడి చేత కాక చేతులు ముడిచి కూర్చున్నారు. ఈ కురు సభలో మగటిమి గల మగవాడిని మగనిగా ఎన్నుకో " అన్నది కర్ణుడే. నేను సంధికై వెళ్ళిన సమయాన సుయోధనుడికి అతడి తమ్ములకు నా పై పగ రగిల్చి నన్ను బంధింప వచ్చుటకు కారణం కర్ణుడే. లోక భీకరంగా పోరు సల్పుతున్న నీ కుమారుడు అభిమన్యుడి విల్లు విరిచి అతడి మరణానికి కారకుడైంది కర్ణుడే. నీవు కర్ణుడిని చంపిన మిగిలిన రాజులు చావగా మిగిలిన దృతరాష్ట్ర కుమారులు నీ ఎదుట ఇక నిలువరు. విజయలక్ష్మి మిమ్ము వరించగలదు " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! నీ తోడు ఉండగా నాకిక కావలసినది ఏముంది. ఈ రోజు నా చేతిలో కర్ణుడి చావు తధ్యము. నా ప్రతాపానికి సుయోధనాదులు కపటజూదం ఆడించినందుకు విచారించాలి. కర్ణుడి మరణం చూసి నాడు విదురుడి మాట విననందుకు కలత పడాలి. ధృతరాష్ట్రకుమారులు కర్ణుడి వధ చూసి రాజ్యం మీద ఆశ వదులు కోవాలి. కర్ణవధ విన్న నా అన్న ధర్మజుడి ముఖంలో ఆనందం చూడాలి " అన్నాడు.

భీమసేనుని మనోగతము

[మార్చు]

అప్పటికి వారు రణరంగం సమీపించారు. యుద్ధం ఘోరంగా జరుగుతుంది. ఇరుపక్షముల వారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కర్ణుడి కుమారులలో ఒకడు ఉత్తమౌజుడి చేతిలో మరణించాడు. అది చూసిన కర్ణుడు ఉత్తమౌజుని రధాశ్వములను, కేతనమును నరికాడు. ఉత్తమౌజుడు కత్తి తీసుకొని తనకు అడ్డంగా వచ్చిన కృపాచార్యుడి రధాశ్వములను నరికి వెంటనే శిఖండి రధము ఎక్కాడు. ఇంతలో అశ్వత్థామ కృపాచార్యుని తన రధము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. భీమసేనుడి పరాక్రమానికి తట్టుకోలేక కౌరవ సేనలు పారిపోసాగాయి. అది చూసి భీముడు తన సారధి విశోకుడితో " విశోకా ! అన్న ధర్మజుడు రణభూమి నుండి తొలగి పోయాడు. అన్న క్షేమం కనుగొనుటకు వెళ్ళిన అర్జునుడు కూడా రాలేదు. వారిరువురికి ఏమి జరిగిందో తెలియరాలేదు. వారికి కీడు కలిగిన ఈ యుద్ధముతో ప్రయోజనమేముంది. అయినా నేను శత్రు వినాశనం చేయక తప్పదు. అది సరే మనకు సరిపడా బాణములు ఉన్నాయి కదా! విశోకా అటు చూడు ఆ కేతనమును చూసి అందు ఉన్న రథికులను పోల్చగలవా ! " అన్నాడు. బదులుగా విశోకుడు " భీమసేనా ! మనకు అస్త్రశస్త్రల గురించి చింత లేదు. అవి విస్తారంగా ఉన్నాయి. మన వెనుక వచ్చు బండిలో ఆయుధములు ఇసుమంతైనా తరగ లేదు. నీ చేత గద ఉండగా నీకు ఈ ఆయుధములతో పని లేదు కదా ! నీ చేతి గద చాలదా శత్రు నిర్మూలనకు " అన్నాడు. ఆ మాటలకు భీముడు సంతోషించాడు. అంతలో విశోకుడు " భీమసేనా ! అటు చూడు నీ తమ్ముడు అర్జునుడు ఏనుగుల సమూహాన్ని తరుముతున్నాడు " అన్నాడు. అది విని భీముడు సంతోషంతో ఉప్పొంగి పోయి " విశొకా ! మన రథమును అర్జునుడి వద్దకు పోనిమ్ము " అన్నాడు. వెంటనే విశోకుడు రధమును అర్జునుడి వైపు పోనిచ్చాడు. రణరంగ ప్రవేశం చేసిన అర్జునుడు కౌరవసేనలను దునుమాడి తన పరాక్రమంతో వాటిని తరముతున్నాడు. మరొక వైపు భీముడు కూడా శత్రు సైన్యములను దునుమాడుతున్నాడు. అది చూసి సుయోధనుడు " భీముడు చస్తే కాని పాండవసేన పారిపోదు. ముందు వీడిని చుట్టుముట్టి చంపండి " అన్నాడు. కౌరవసేనలోని ప్రముఖవీరులు భీముని చుట్టుముట్టి ఎదుర్కొన్నారు. భీముడు విచక్షణారహితంగా శత్రుసేనను చంపుతున్నాడు. శకుని భీముని ఎదుర్కొని అతడి వక్షస్థలానికి గురిపెట్టి బాణంతో కొట్టాడు. భీముడు శకుని విల్లు విరిచాడు. శకుని వేరొక విల్లందుకుని భీముని సారధిని, రధాశ్వములను పదునారు బాణములతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. భీముడు కోపించి శక్తి ఆయుధమును శకుని మీద ప్రయోగించాడు. శకుని లాఘవంగా శక్తి ఆయుధమును పట్టుకుని తిరిగి భీముని మీదకు విసిరాడు. అది భీముని చేతిని గాయపరిచింది. అది చూసి కౌరవసేనలు ఆనందించాయి. వెంటనే భీముడు విల్లందుకుని శకుని శరీరం అంతా శరములతో నింపాడు. శకుని రధము మీద కూలిపోయి మూర్ఛిల్లాడు. అది చూసిన సుయోధనుడు శకునిని తన రధము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు.

కర్ణుడి విజృంభణ

[మార్చు]
కేకయ రాకుమారుడైన విశొకుడిని చంపుతున్న కర్ణుడు- రాజ్మానామా నుండి ఒక దృశ్యం

భీముడు శిఖండి , ధృష్టద్యుమ్నుడు, ఉపపాండవుల సాయంతో కర్ణుడిని ఎదుర్కొన్నాడు. నకులసహదేవులూ భీమునికి సాయంగా వచ్చి చేరారు. అందరూ కర్ణుని ఎదుర్కొన్నా కర్ణుడు వెరువక వీర విహారం చేస్తున్నాడు. కర్ణుడి పరాక్రమానికి పాండవ సేనలు పారిపోసాగాయి. కర్ణుడి పరాక్రమానికి పాండవ యోధులు ఆశ్చర్యపోతున్నారు. వారంతా తమతమ సేనలతో కర్ణుడిని చుట్టుముట్టారు. కాని కర్ణుడు వెరువక తనను చుట్టుముట్టిన పాంచాల, ఛేది, మత్స్యదేశ సేనలను నాశనం చేసి రణరంగాన్ని పీనుగుల పెంట చేస్తున్నాడు. కర్ణుడికి తోడుగా కృపాచార్యుడు, అశ్వత్థామ, సుయోధనుడు, దుశ్శాసనుడు, కృతవర్మ, మొదలగు వారుచేరి పాండవసేనలో మారణ హోమం సృష్టిస్తున్నారు. మరొక పక్క భీముడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, నకులసహదేవాదులు చేరి కౌరవసేనను తుదముట్టిస్తున్నారు. ఇరు వైపులా నష్టం అపారంగా ఉంది. అర్జునుడి రధము చూసి శల్యుడు " కర్ణా ! అడుగో అర్జునుడు ఇటే వస్తున్నాడు. అతడిని ఎదుర్కొన లేక కౌరవసేన పారిపోతుంది. ఇది సరి అయిన తరుణం అర్జునుడిని గెలిచి సుయోధనుడి ఋణం తీర్చుకో " అని ప్రోత్సహిస్తూ శల్యుడు తమ రధమును అర్జునుడి ఎదుట నిలిపాడు. ఇంతలో భీముడు అర్జునుడిని కలుసుకున్నాడు. అర్జునుడు ధర్మరాజు క్షేమసమాచారం భీముడికి చెప్పి తాను కర్ణుడిని ఎదుర్కోడానికి పోతూ కౌరవసేనల మీద తీవ్రమైన దాడి చేసాడు. ఇంతలో నీ కుమారులు పది మంది అర్జునుడి మీద దాడి చేసారు. అర్జునుడు వారిని అందరినీ యమసదనానికి పంపాడు. అది చూసి కౌరవ వీరులు తొంభై మంది అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు వారందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క బాణంతో సంహరించి మిగిలిన వారిని తరుముతున్నాడు. ఇంతలో కురుసేనలు పదమూడు వందల మంది తమ గజ సైన్యముతో అర్జునుడి చుట్టుముట్టారు. అర్జునుడు భీముని సాయంతో గజసైన్యమును తుదముట్టించ సాగాడు. భీముడు తన గదతో ఏనుగుల కుంభస్థలాలను పగులకొడుతున్నాడు. వారు భీముని వదలక వెంటాడసాగారు. భీముని గదా ఘాతానికి అర్జునుడి పదునైన బాణాలాకు ఆగ లేని కౌరవసేనలు భయపడి కర్ణుడి వెనుక దాక్కున్నాయి. కర్ణుడు కూడా విజృంభించి భీముడి కుమారుడు నకులుని కుమారుల విల్లులను విరిచి కేకయరాజ కుమారుని చంపాడు. కేకయరాజు కోపించి కర్ణుడి కుమారుడైన ప్రషేణుడిని చంపాడు. పుత్రశోకంతో కర్ణుడు కేకయరాజును చంపాడు. సాత్యకి మరొక రధము ఎక్కి కర్ణుడి మనుమడైన సుషేణుని ఎదుర్కొని అతడి హయములను చంపి అతడిని చంపడానికి శరప్రయోగం చేసాడు. అప్పుడు కర్ణుడు ఒరేయ్ సాత్యకీ " చచ్చావురా " అని అరుస్తూ సాత్యకి మీద ఒక నిశిత శరమును వేసాడు. ఆ శరమున అడ్డుకున్న శిఖండి కేతనమును కర్ణుడు విరిచి, ద్రుపద కుమారుడైన సుదేవుడిని చంపాడు. అది చూసి పాంచాల సేనలు కర్ణుడిని చుట్టుముట్టాయి. భీముడు అర్జునుడు కర్ణుడిని సమీపించారు. ఉత్తమౌజుడు, యుధామన్యుడు, జనమేజయుడు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు అర్జునుడిని దాటుకుంటూ కర్ణుడిని ఎదుర్కొన్నాడు. కర్ణుడు వారందరిని సమర్ధవంతంగా ఎదుర్కొని వారి ధ్వజములను, రధములను, విల్లులను విరిచి హయములను, సారధులను చంపాడు. ఇంతలో ద్రౌపది కుమారులు కర్ణుడిని చుట్టుముట్టారు. వారి పక్కనే సాత్యకి నిలబడి కర్ణుడు వేసే బాణాలను తుంచుతూ సుయోధనుడి శరీరం నిండా శరములు నాటాడు. అర్జునుడు సుయోధనుడికి సాయంగా వచ్చిన వారందరినీ తరిమి కొట్టాడు.

భీముడు దుశ్శాసనుడిని వధించుట

[మార్చు]
దుశ్శాసనుని రక్తం త్రాగుతున్న భీముడు

ఇంతలో దుశ్శాసనుడు భీమునితో తలపడ్డాడు. భీముడు " తమ్ముడా దుశ్శాసనా ! నాడు కౌరవ సభలో నాడు కురుసభలో నీవు చేసిన అకృత్యములకు వడ్డితో సహా ముట్టచెప్పడానికి తరుణం వచ్చింది. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకునే సమయం ఆసన్నమయ్యింది. అందుకే భగవంతుడు నిన్ను నా ఎదుట నిలబెట్టాడు " అన్నాడు. దుశ్శాసనుడు హేళనగా నవ్వుతూ " ఓ భీమసేనా ! ఏమిటీ అప్పుడే మరిచావా ! మేము మిమ్ము లక్క ఇంట్లో పెట్టి తగులబెట్టడం, నీ అన్నతో మాయా జూదం ఆడించి మీ రాజ్యం కొల్లగొట్టడం, మిమ్ము అడవులకు వెళ్ళ గొట్టడం, దిక్కులేని వారి వలె మీరు విరాటరాజు కొలువులో తలదాచు కోవడం మరిచావా ! ఇంతకంటే దైన్యమూ అవమానం ఉంటాయా ! ఇన్ని జరిగినా తగుదునమ్మా! అని యుద్ధానికి వచ్చావా ! అవన్నీ మీరు మరిచినా ! నేనెలా మరువ గలను " అన్నాడు దుశ్శాసనుడు. ఆ మాటలకు బదులుగా భీముడు దుశ్శాసనుడి కేతనమును, వింటిని విరిచి, సారధిని చంపి దుశ్శాసనుడి నుదుటన బాణం నాటాడు. తన రధము తానే నడుపుతూ దుశ్శాసనుడు మరొక విల్లు తీసుకుని భీముని విల్లు విరిచి భీముని సారధిని కొట్టాడు. భీముడు మరొక విల్లు తీసుకుని దుశ్శాసనుడి శరీరంలో ఏభై బాణములు నాటాడు. వెంటనే దుశ్శాసనుడు భీముని రధాశ్వములను చంపాడు. భీముడు తన గధ చేతబట్టి రధము మీద నుండి కిందకు దూకి దుశ్శాసనుడి రధము దగ్గరకు వచ్చి రధాశ్వములను చంపి, రధమును విరిచాడు. దుశ్శాసనుడు కూడా గద చేత పట్టి తటాలున రధము దిగి భీముని మీద తోమరం వేసాడు. భీముడు ఆ తోమరాన్ని విరిచాడు. దుశ్శాసనుడిని దగ్గర నుండి చూడగానే తాము పద మూడేళ్ళు పడిన పాట్లు గుర్తుకు వచ్చి కోపంతో రగిలి పోయాడు. నాడు కురుసభలో తాను చేసిన ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చింది. తన బలం అంతా కూడగట్టుకుని దుశ్శాసనుడి తల మీద బలంగా మోదాడు. ఆ దెబ్బకు కింద పడిన దుశ్శాసనుడి మీద పడ్డాడు భీముడు. దుశ్శాసనుడి మెడ మీద కాలు పెట్టి నులుముతూ " ఒరేయ్ దుశ్శాసనా ! నాడు కురుసభలో మమ్ము అవమానం చేసింది చాలక చావడానికి నన్ను వెదుకుతూ వచ్చావా ! ఈ రోజు నీ చావు తప్పదు " అంటూ దుశ్శాసనుడి గొంతు మీద కాలు పెట్టి తొక్కుతుంటే ఉభయ సేనలూ భయభ్రాంతులతో చూస్తూ దూరంగా పోయాయి. భీముడు దుశ్శాసనుడి శరీరాన్ని పైకెత్తి పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి బాదాడు. దుశ్శాసనుడి శరీరాన్ని కాలితో ఎగసి ఎగసి మోదసాగాడు. దుశ్శాసనుడి మెడ మీద మోకాలు పెట్టి అదిమి పైకి లేచాడు. దుశ్శాసనుడు బ్రతికున్నాడో చచ్చాడో చూడక వికట్టాట్టహాసం చేస్తూ మోకాళ్ళ మీద కూర్చుని " ఒరేయ్ దుశ్శాసనా! ఈ రోజు నీగుండెలు చీల్చి నీ రక్తం తేనెలా తాగుతాను. పిలవరా ! నీ వాళ్ళను పిలువు ఎవరు అడ్డం వస్తారో చూస్తాను " అంటూ ఒక గండ్రగొడ్డలి తీసుకుని దుశ్శాసనుడి ముఖం మీద ఆడించాడు. ఆ తరువాత నాడు హిరణ్యకశిపుని పొట్టను నరసింహస్వామి చీల్చినట్లు అమిత రౌద్రంతో దుశ్శాసనుడి గుండెలలో తన గోళ్ళు జొనిపి చీల్చాడు. దుశ్శాసనుడి గుండెల నుండి రక్తం పెల్లుబికింది. ఆ రక్తం దోశిలితో పట్టి ఆస్వాదించి మిగిలిన రక్తం శరీర మంతా పూసుకుని తిరిగి దుశ్శాసనుడి ముఖంలోకి చూస్తూ వికట్టాట్టహాసం చేస్తూ పైకి లేచి పూనకం వచ్చినట్లు ఊగుతూ ఎగురుతూ " ఒరేయ్ దుశ్శాసనా ! నీ రక్తం ఎంత రుచిగా ఉందిరా ! ఈ రోజుకు నా దాహం తీరింది. నా ప్రతిజ్ఞ నెరవేరింది " అంటూ అరుస్తున్నాడు. గంతులు వేస్తూ భుజాలు చరుచుకుంటున్నాడు. అతడు మానవుడా ! రాక్షసుడా ! అని అక్కడ ఉన్న వారికి భ్రమ కలిగి శిలా ప్రతిమలవలె నిలిచారు. భీముడు పైకి లేచి నిలిచాడు.శరీరం రక్తమయమై ఉంది. ప్రళయకాల యముని వలె విజృంభించి కౌరవసేనలను తరమ సాగాడు. భీముని చూసి కౌరవసేనలు పారిపోయాయి. భీముడు తిరిగి దుశ్శాసనుడి వద్దకు వచ్చి " ఒరేయ్ పశువా ! అలా పడి ఉన్నావేమి. పిలవరా నన్ను అడ్డుకునేవాడేవడో పిలువు " అని అంటూ దుశ్శాసనుడి ముందు కూర్చుని " ఒరేయ్ పశువా ! నా మీద మీకు అంత కోపం ఎందుకురా ! నేను మీకు చేసిన అపకారమేమి ? నాకు విషం పెట్టారు, నీళ్ళలో తోసారు, పాములచేత కరిపించారు. అందరి ముందు మమ్ము అవమాన పరచింది, ద్రౌపదిని సభకు ఈడ్చుకు వచ్చింది ఇందుకేనా ! నాడు మాయా జూదం ఆడించి నందుకు ఫలితం ఇదేరా ! అనుభవించు " అంటూ పైకి లేచాడు. తనకు దగ్గరగా వస్తున్న కౌరవయోధులను చూసి " చూడండి ఈ దుశ్శాసనుడి దుర్గతి. వీడి వలన వీడి తండ్రి ధృతరాష్ట్రుడు పరువు పోగొట్టు కొని అవమాన పడ్డాడు. నాడు కురుసభలో ముందుగా మందలించి ఉండిన ఇంతటి దుర్గతి పట్టి ఉండదు కదా ! ఒరేయ్ నాడు కురు సభలో ద్రౌపదిని చూసి " నీకు మగడు లేడు అన్నావు కదా ! ఇప్పుడు చూడరా ! ద్రౌపదికి భర్త ఉన్నాడురా ! నేనేరా ద్రౌపది భర్తను. కానీ మీకౌరవుల భార్యలందరికీ భర్తలు లేకుండా చేస్తానురా ! వారు తమ భర్తల కొరకు భోరున ఏడవాలిరా ! ఒరేయ్ దుశ్శాసనా ! నా ప్రతిజ్ఞ ఒకటి నెరవేరిందిరా ! నీ అన్న సుయోధనుడి తొడలు విరిచి తల తన్నడం మిగిలింది ఆ ప్రతిజ్ఞ నెరవేర్చు కొనుటకు పోతానురా ! " అంటూ ఉంగిపోతూ దుశ్శాసనుడి శరీరాన్ని గదతో మోది చిత్రవధ చేసాడు. పరస్త్రీని అవమానించి నందుకు ఏమి శాస్తి జరుగుతుందో లోకానికి చాటుతూ దుశ్శాసనుడు మరణించాడు. భీముని భయంకర ఆకృతి చూసిన కర్ణుడు సుయోధనుడు భయంతో కంపించారు. ఎవరికీ కాలూ చేయీ ఆడలేదు. కాని ధృతరాష్ట్ర కుమారులైన కవచి, నిషంగి, పాశి, దండధారుడు, ధనుర్ధ్రహుడు, అలోపుడు, సహుడు, వాతవేగుడు, షండుడు, సువర్చనుడు భీమసేనుడిని ఎదుర్కొన్నారు. భీమసేనుడు పది భల్లబాణాలతో వారి తలలు తుంచాడు. అది చూసిన కర్ణుడు దిక్కు తోచక అటూ ఇటూ చూస్తున్నాడు.

శల్యుడు కర్ణుడిని హేళన చేయుట

[మార్చు]

దుశ్శాసనుడి మరణంతో అచేతనుడై నిలిచిన కర్ణుడితో శల్యుడు " కర్ణా ! ఏమైంది భయపడ్డావా ! నీలో పిరికితనం ఆవహించిందా ! నీ మిత్రుడు సుయోధనుడు కూడా దుశ్శాసనుడి మరణం చూసి తన వంతు ఎప్పుడు వస్తుందో నని భయపడు తున్నాడు. నువ్వూ భయపడితే ఎలా ! కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైన వీరులు నీ ఆజ్ఞ కొరకు నిరీక్షిస్తున్నారు. సైన్యమును కూడ గట్టుకుని యుద్ధముకు ఉపక్రమించు. నీ కుమారుడు వృషసేనుడు పాండవులను ఎదుర్కొంటున్నాడు. నీవు అర్జునుడిని ఎదిరించు. యుద్ధభారాన్ని సుయోధనుడు నీ భుజస్కంధాల మీద ఉంచాడు. నీవిలా నిర్వీర్యుడివి కావడం తగదు " అన్నాడు. ఈ మాటలతో చైతన్యం తెచ్చుకుని కర్ణుడు యుద్ధసన్నద్ధుడయ్యాడు.

వృషసేనుడి పరాక్రమము

[మార్చు]
వృషసేనుని వధ - రాజ్మానామా నుండి ఒక దృశ్యం

కర్ణుడికుమారుడు వృషసేనుడు భీముని ఎదుర్కొన్నాడు. నకులుడు అడ్డుపడి వృషసేనుడి విల్లు తుంచి, కేతనమును విరిచి, ఛత్రమును విరిచాడు. వృషసేనుడు వేరొక విల్లందుకొని నకులుడి అశ్వములను చంపి, రథము విరుగకొట్టాడు. నకులుడు కత్తి డాలు తీసుకుకొని వృషసేనుడిని ఎదుర్కొన్నాడు. వృషసేనుడు నకులుని ఖడ్గం తుఇంచి నకులుని శరీరం నిండా బాణములు నాటాడు. అది చూసిన యుధామన్యుడు, ఉత్తమౌజుడు, శిఖండి, జనమేజయుడు, ఉపపాండవులు, సాత్యకి రౌద్రంగా వృషసేనుడిని ఎదుర్కొన్నారు. ఇంతలో సుయోధనుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని వృషసేనుడికి సాయంగా వచ్చాడు. భీముడు వారందరిని తరిమి కొట్టాడు. నకులుడి కుమారుడు కౌరవ సేనలోని గజ సైన్యమును నాశనం చేయసాగాడు. అది చూసి వృషసేనుడు నకులుని కుమారుడి రథసారథిని చంపాడు. అది చూసి అర్జునుడు వృషసేనుడిని ఎదుర్కొన్నాడు. వృషసేనుడు జంకక అమిత పరాక్రమంతో భీమార్జునుల మీద శరవర్షం కురిపించి శతానీకుడి మీద బాణ ప్రయోగం చేసి నకులుడి మీద ఏడు బాణములు కృష్ణుడి మీద పన్నెండు బాణాలు వేసాడు. అర్జునుడు వేసిన బాణములు మధ్యలోనే త్రుంచి అర్జునుడి మీద పది బాణములు కృష్ణుడి మీద తొమ్మిది బాణములు వేసాడు. వృషసేనుడి విజృంభణ చూసిన అర్జునుడు ఆగ్రహించి వృషసేనుడి విల్లు తుంచి, అతడి భుజములు విరుగకొట్టాడు. మరొక బాణంతో అతడి తల నరికాడు. తన ఎదుటనే తన కుమారుడిని అర్జునుడు చంపడం చూసిన కర్ణుడు తల్లడిల్లి పోయి అర్జునుడి ఎదుట రథముతో నిలిచాడు.

కర్ణార్జునుల యుద్ధ సమారంభం

[మార్చు]

అప్పుడు అర్జునుడు కర్ణుడు ఒకరికి ఒకరు ఎదురుగా నిలబడి ఉన్నారు. అప్పుడు కర్ణుడు శల్యుని చూసి " మద్రరాజా ! అర్జునుడు నన్ను జయించిన మీరు ఏమి చేస్తారు ? " అన్నాడు. నేను కృష్ణార్జునులతో యుద్ధము చేస్తాను " అన్నాడు శల్యుడు. అక్కడ అర్జునుడు కూడా " కృష్ణా !కర్ణుడు నన్ను జయించిన నువ్వేమి చేస్తావు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! సూర్యుడు పశ్చిమాన ఉదయించినా కర్ణుడి చేతిలో నీవు ఓడి పోవుట జరగదు. నీ ప్రశ్నకు సమాధానం అవసరం లేదు. విధి వక్రించి అలా జరిగితే అలాంటి దురవస్థను నేను నవ్వులాటకైనా భరించ లేను. కౌరవవంశం నిర్మూలించి ఆ కర్ణుడిని, శల్యుని ఒంటి చేత వధించి ఈ కురు సామ్రాజ్యానికి ధర్మరాజును చక్రవర్తిని చేస్తాను. ఇది నిశ్చయము " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! నేను నవ్వులాటకు అన్నాను కాని నీదాకా రానిస్తానా! నాడు కురు సభలో ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొనక వదులుతానా ! ఆ త్రిమూర్తులు అడ్డుపడినా నేడు నా చేతిలో కర్ణుడు చావడం తధ్యం. కర్ణుడు తల నా చేత నరకబడటం నీవు వినోదంగా చూడు. కర్ణుడి భార్యను శల్యుడి భార్యను విధవలుగా చేస్తాను " అన్నాడు. ఇరు పక్షముల వారు ఎదురు ఎదురుగా నిలిచారు. కర్ణుడికి అర్జునుడికి మధ్య లోకోత్తర యుద్ధము జరుగ బోతుందని దేవతలు సహితము యుద్ధము కనులారా చూడటానికి ఆకాశంలో కూడారు.

అశ్వత్థామ సుయోధనుడి వద్ద సంధి ప్రస్థావన తెచ్చుట

[మార్చు]

కర్ణార్జునులు ఒకరితో ఒకరు సమరానికి సిద్ధపడిన సమయానఅశ్వత్థామ సుయోధనుడితో " సుయోధనా ! భీష్ముడు అంతటి వాడు అర్జునుడి చేత ఓడి పోయాడు. ఈ కర్ణుడు అంతకంటే గొప్పవాడా ! అర్జునుడి ముందు నిలువగలడా ! నేను అర్జునుడిని సమాధానపరుస్తాను నీవు కర్ణుడిని అనునయించు. మనం అందరం ధర్మరాజుతో సంధి చేసు కుంటాము. వ్యవహారం చక్కబడుతుంది. భీముడు నకులసహదేవులు ధర్మరాజు చెప్పిన మాట వింటారు. నా మాట విన్న నీవు, నీ సహోదరులూ, సకల రాజన్యులు, సాధారణ జనం క్షేమంగా ఉంటారు. నీవు నన్ను కృపాచార్యుడిని, కర్ణుడిని నమ్ముకున్నావు. నేను కృపాచార్యుడు ఎవరి చేతిలో చావమని అర్జునుడిని గెలువ గలమని అనుకోవడం పొరపాటు. భీష్ముడు, ద్రోణుడు అరివీర భయంకరులనీ వారిని ఎవరు ఓడించ లేరని అనుకున్నారు. కాని కృష్ణుడి సాయంతో అర్జునుడు వారిని గెలువలేదా ! వారు మరణించ లేదా ! మేమూ అంతే కదా ! కనుక పాండవులతో సంధి చేసుకోవడం ఉత్తమం. కృష్ణుడు రాయబారిగా వచ్చినప్పుడు మనం ఏదేదో అన్నామని ఇక సంధి అసాధ్యమని అనుకోవద్దు. నీ తండ్రి ధృతరాష్ట్రుడిని ధర్మరాజు చక్రవర్తిగా అంగీకరిస్తాడు. అతడి పాలనలో మనమంతా హాయిగా ఉంటాము. కర్ణుడు కూడా నా మాట వింటాడు. మాకు నీవు బ్రత కడం కావాలి. బ్రతికి ఉంటే సుఖములు అనుభవించ వచ్చు కదా! చచ్చి ఏమి సాధిస్తావు ! కనుక అసూయా ద్వేషాలు మాని సంధికి ఒండంబడుట మంచిది. అందరికీ శ్రేయోదాయక మైన సంధికి అంగీకరించక ఉన్న సాము చేస్తున్న త్రాటి నుండి పడినట్లు అధఃపాతాళానికి పోతావు జాగర్త " అన్నాడు.

సంధికి సుయోధనుడి నిరాకరణ

[మార్చు]

అశ్వత్థామ మాటలు సావధానంగా విన్న విరక్తిగా నవ్వి " అశ్వత్థామా ! నీవు ఎంత వెర్రి వాడవయ్యా ! నా తమ్ముడు దుశ్శాసనుడిని చంపి ఒక శపథం నెరవేర్చు కున్న భీముడు నన్ను చంపి రెండవ శపథం నెరవేర్చక మానతాడా ! ఇంత జరిగిన తరువాత సంధి ఏమి బాగుంటుంది. ఈ సమయంలో కర్ణుడు యుద్ధము మానగలడా ! కానున్నది కాక మానదు. నీ ప్రయత్నము విరమించుట మంచింది. అర్జునుడిప్పుడు బాగా అలసి ఉన్నాడు. కర్ణుడు అవక్రపరాక్రమంతో విలసిల్లు తున్నాడు. ఇప్పుడు కర్ణుడి చేతిలో అర్జునుడి వధ తధ్యం " అన్నాడు. సుయోధనుడు తన సేనలను ఉత్సాహ పరిచాడు.

కర్ణార్జునుల యుద్ధం

[మార్చు]

కర్ణుడు అర్జునుడు ఢీకొన్నారు. యుద్ధం తీవ్రం అయింది. అర్జునుడితో కృష్ణుడు " అర్జునా ! అడుగో కర్ణుడు నీ ప్రతాపం చూపించు. కర్ణుడి శరీరం నిండా శరములు నాటు. కర్ణుడు నీకు ఎందులో సరి రాడు. అర్జునా ! విజృంభించి కర్ణుడిని వధించు " అన్నాడు. కర్ణుడిని కూడా కౌరవ వీరులు ఉత్సాహ పరుస్తున్నారు. " కర్ణా ! ఇన్నాళ్ళు అడవులలో మృగముల మాదిరి తిరిగిన పాండవులు ఇప్పుడు యుద్ధానికి వచ్చారు. నువ్వు అర్జునుడిని చంపితే మిగిలిన పాండవులు తిరిగి అడవులకు పోతారు. సుయోధనుడు కురుసామ్రాజ్యాధిపతి ఔతాడు. నీ శక్తిని అంతా ఉపయోగించి అర్జునుడిని చంపు " అన్నాడు. కర్ణుడు అర్జునుడి శరీరంలో పది బాణములు నాటాడు. అర్జునుడు కర్ణుడి శరీరంలో పందొమ్మది బాణములు నాటాడు. కర్ణుడు అర్జునుడి మీద తొమ్మది పదునైన బాణములు ప్రయోగించాడు. అతడు కృష్ణుడిని కూడా వద లేదు. అది చూసిన అర్జునుడు తన బాణములతో కర్ణుడిని రక్తం కారేలా కొట్టాడు. కర్ణుడు కోపించి కృష్ణార్జునులను పదునైన బాణములతో గాయపరిచాడు. అర్జునుడు కర్ణుడి సారధిని, అశ్వములను కొట్టి కర్ణుడి మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. కర్ణుడు వారుణాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేసాడు. అర్జునుడు కర్ణుని మీద మేఘాస్త్ర ప్రయోగం చేసి కౌరవ సేనలను మేఘాలతో కప్పి అంధకారం సృష్టించాడు. కర్ణుడు అనిలాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేసాడు. ఇంతలో అర్జునుడు ఇంద్రశక్తిని ప్రయోగించాడు. కర్ణుడు మంత్రశక్తితో ఇంద్రశక్తిని నిర్వీర్యం చేసి అర్జునుడి మీద పదునైన బాణములు వేసాడు. అది చూసిన భీముడు " తమ్ముడా అర్జునా ! ఈ కర్ణుడు ఈ రోజు మనతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చాడు. నీ ప్రతిజ్ఞా భంగం కాకుండా నీవు చంపుతావా ! లేక నాగదా ఘాతంతో అతడి తల ముక్కలు చెక్కలు చేయనా ! " అన్నాడు. అది చూసి కృష్ణుడు " అర్జునా ! నీవు ప్రయోగించిన దివ్యాస్త్రాలను కర్ణుడు తిప్పి కొడుతున్నాడు. పైగా నిన్ను తీవ్రంగా తన బాణములతో గాయపరుస్తున్నాడు. నీ పరిస్థితి కౌరవసేనలో ఉత్సాహాన్ని పాండవసేనలో నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. కారణం తెలియక ఉంది. నా చక్రాన్ని ఇస్తాను దానిని ప్రయోగించి కర్ణుడి తల తుంచు " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! అంత పని వద్దులే నేను కర్ణుడి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను " అని బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. అది కర్ణుడి మీదకు వేగంగా రాసాగింది. కర్ణుడు బెదరక నిశ్చలంగా నిలబడి తన మంత్రశక్తితో దానిని నిర్వీర్యం చేసి కృష్ణార్జునులను తన బాణములతో గాయపరిచాడు. అర్జునుడు కర్ణశల్యులను మీద తొమ్మిదేసి బాణములను ప్రయోగించాడు. కర్ణుడు అర్జునుడి వింటి నారిని తెంచాడు. అర్జునుడు నారిని సరి చేసుకుని కర్ణుడి వింటి నారిని తెంచాడు. అర్జునుడి ధాటికి తాళ లేని కర్ణుడి చక్రరక్షకులు పారి పోయారు. అది చూసి సుయోధనుడు అర్జునుడిని చంపమని తన సైన్యమును ప్రోత్సహించాడు. సుయోధన బలగాలు అర్జునుడిని చుట్టుముట్టాయి. అర్జునుడు వాడి అయిన బాణములు ప్రయోగించి వారిని చెదరగొట్టాడు. ఇరు పక్షముల వీరులు యుద్ధం వదిలి కర్ణార్జునుల యుద్ధం వీక్షించసాగారు. సుయోధనుడు " యోధులారా ! కర్ణుడు అత్యంత పరాక్రమంతో పోరుతుండగా మీరు చూస్తూ ఉండటం భావ్యమా ! పోయి కర్ణుడికి సాయపడండి " అన్నాడు. ఆమాటలకు రోషపడి కౌరవ వీరులు అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు పదునైన బాణములు వేసి వారి కేతములు, రధములు, ధనస్సులను విరిచి అశ్వములను పంపాడు. ముందుకు పోతే అర్జునుడు చంపు తున్నాడు. వెనక్కు పోతే సుయోధనుడు హెచ్చరిస్తున్నాడు. కౌరవ వీరులు అయోమయ అవస్థకు లోనయ్యారు.

అర్జునుడి మీద కర్ణుడు నాగాస్త్రమును ప్రయోగించుట

[మార్చు]

కర్ణుడు తన వద్ద ఉన్న సర్పముఖాస్త్రాన్ని బయటకు తీసాడు. ఆ అస్త్రానికి అధిపతి తక్షకుని కొడుకైన అశ్వసేనుడు. దానిని అర్జునుడిని చంపడానికే దాచి ఉంచాడు. ఇప్పుడు దానిని తీసి సంధించాడు. అర్జునుడి కంఠానికి గురిపెట్టాడు. కాని గురి కొంచెం కిందకు ఉండటం గమనించిన శల్యుడు " కర్ణా ! నీ గురి తప్పుతుంది. అర్జునుడి కంఠానికి సూటిగా గురిపెట్టు " అన్నాడు. తన గురిని అక్షేపించిన శల్యుని మీద ఆగ్రహించిన కర్ణుడు " శల్యా ! నా గురిని ఆక్షేపించే అర్హత నీకు లేదు. చూస్తూ ఉండు ఈ అస్త్రధాటికి అర్జునుడి తల తెగి నేల మీద పడుతుంది " అంటూ సర్పముఖాస్త్రాన్ని ప్రయోగించాడు. తమ వంక నిప్పులు కక్కుతూ వస్తున్న అస్త్రాన్ని చూసి కృష్ణుడు తన బలమంతా ఉపయోగించి రధమును భూమిలోకి అయిదు అంగుళాలు కూరుకుపోయేలా తొక్కాడు. అర్జునుడి కంఠానికి గురిపెట్టిన అస్త్రము గురి తప్పి అర్జునుడి తల మీదగా దూసుకుపోతూ కిరీటాన్ని ఎగురగొట్టింది. ఆ కిరీటాన్ని బ్రహ్మ దేవుడు దేవేంద్రునికి బహూకరించాడు. దేవేంద్రుడు నివాత కవచులను సంహరించిన సమయంలో అర్జునుడికి బహూకరించాడు. ఆకిరీటమే అర్జునుడికి కిరీటి అనే నామాన్ని ఇచ్చింది. ఇప్పుడది నాగాస్త్ర ప్రభావానికి ధ్వంసం అయింది. అర్జునుడు వెంటనే తెల్లని పాగాను కిరీటంలా చుట్టుకున్నాడు. అర్జునుడి కిరీటమును నేలపడేసిన అస్త్రము తిరిగి అర్జునుడి వైపు దూసుకు వస్తుంది. అది చూసిన అర్జునుడు " ఈ నాగాస్త్రం ఎవరు ఇది నన్ను ఎందుకు తరుముతుంది " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! అప్పుడే మరిచావా ! ఖాండవ వనదహన సమయంలో తక్షకుడి కుమారుడు నాగ తన తల్లిని రక్షించుకు పోతున్న సమయంలో నీవు ఆ నాగకన్యను చంపావు. ఆ తరువాత తక్షకుడి కుమారుడు అశ్వసేనుడిగా నిన్ను చంపడానికి కర్ణుని వద్ద నాగముఖాస్త్రంగా పూజలందుకుంటూ ఉన్నాడు . ఇప్పుడు నీవు నీ దివ్యాస్త్రాలతో ఆ అశ్వసేనుడిని సంహరించు " అన్నాడు. వెంటనే అర్జునుడు అశ్వసేనుడిని సంహరించి నాగాస్త్రాన్ని ముక్కలు చేసి కర్ణుడి శరీరం మీద పన్నెండు బాణాలు వేసాడు. తాను ప్రయోగించిన నాగాస్త్రం కృష్ణుడి కారణాన గురి తప్పిందని తెలుసుకుని కర్ణుడు పదమూడు బాణాలను కృష్ణుడి మీద నూరు బాణాలను అర్జునుడి మీద ప్రయోగించాడు. అర్జునుడు ఒకే బాణంతో కర్ణుడి కుండలములు కొట్టాడు. కర్ణుడు బెదరక అర్జునుడిమీద శరవర్షం కురిపించసాగాడు. కర్ణుడి శరములు మధ్యలోనే తుంచి వేస్తున్నాడు అర్జునుడు. కర్ణుడి శరీరం రక్తసిక్తం అయింది. సూర్యుడు అస్తమించే సమయమూ ఆసన్న మైంది. అప్పుడు యమధర్మరాజు అక్కడకు వచ్చి అదృశ్యరూపంలో ఉండి ఆకాశం నుండి " ఇప్పుడు కర్ణుడి రథం భూమిలోకి కుంగి పోతుంది. కర్ణుడికి అవసాన సమయం ఆసన్నమైంది " అన్నాడు. అది విన్నా కర్ణుడు ధైర్యమును వీడక భార్గవాస్త్రాన్ని స్మరించాడు. కాని అతడికి అప్పుడది గుర్తుకు రాలేదు. పరశురామ శాపం పనిచేయడం మొదలైంది అని తెలుసుకున్నాడు. కర్ణుడు మనసులో " నేను ధర్మపరుడిని ధర్మం నన్ను రక్షిస్తుంది అనుకున్నాను కాని అది అసత్యం అయింది " అనుకున్నాడు. అర్జునుడు కర్ణుని మీద శరములు గుప్పిస్తున్నాడు. కర్ణుడు తన బాహుబలాన్ని నమ్ముకున్నాడు. కర్ణుడు అర్జునుడు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అర్జునుడు ఇంద్రాస్త్రంతో దానిని అడ్డుకున్నాడు ఇంతలో అర్జునుడు రౌద్ర అనే అస్త్రం జపించ సాగాడు.ఇంతలో కర్ణుడి రథచక్రం భూమిలోకి కుంగి పోయింది.

కర్ణుడు చేసిన నేరములు కృష్ణుడు గుర్తు చేయుట

[మార్చు]
తన రథచక్రం భూమిలో దిగబడిపోయిందని అర్జునిని అడుగుతున్న కర్ణుడు

కర్ణుడు రథం దిగి " అర్జునా ! ప్రస్తుతం నేను విరధుడను. నా రధ చక్రం భూమిలోకి కుంగి పోయింది. నేను దానిని ఎత్తుకొన వలెను. భూమి మీద ఉన్న నా మీద రథం మీద నుండి నీవు బాణప్రయోగం చేయడం ధర్మము కాదు. కనుక రధచక్రం తీసేదాకా నా మీద బాణ ప్రయోగం చేయకుము. ఇది కేవలం నీకు యుద్ధ ధర్మం తెలియ జేయడానికి చెప్తున్నాను కాని నీకు కృష్ణుడికి భయపడి కాదు " అన్నాడు. కృష్ణుడికి సమయం చిక్కింది కర్ణుడిని చూసి నవ్వుతూ " అదేమిటి కర్ణా ! నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేయడం ఎప్పటి నుండి ? నీకు ఆపద కలిగింది కనుక ధర్మం గుర్తుకు వచ్చిందా ! అహంకారంతో విర్రవీగు సమయాన ధర్మం గుర్తుకు రాలేదా ! ధర్మమార్గాన పయనించే పాండవులకు జయం తధ్యం. అధర్మమార్గాన చరించే కౌరవులకు అపజయం అనివార్యం. నీవు నీ అనుంగు మిత్రునితో కలిసి చేసిన అకృత్యములు మరచినట్లు ఉంది. పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చిన సమయాన అతడిని ప్రేరేపించింది నీవు కాదా ! అప్పుడది నీకు అధర్మం అనిపించ లేదా ! నీకు ఇప్పుడు మాత్రం ధర్మం గుర్తుకు వచ్చిందా ! కపటజూదం ఆడించి నప్పుడు, ద్రౌపదిని అవమానాల పాలు చేసి అనరాని మాటలు అన్నప్పుడూ,

కర్ణుని మరణం

పాండవులను కించపరచినప్పుడూ గుర్తుకు రాని ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా ! పాండవులను అడవులలో ప్రంశాంతంగా బ్రతక నీయక ఘోషయాత్రకు సుయోధనుడిని పురికొల్పినప్పుడు గుర్తుకు రాని ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా ! అభిమన్యకుమారుని ఒంటరిని చేసి చుట్టుముట్టి పలువురు దాడి చేసి చంపినప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా ! ఇవి అన్ని ప్రత్యక్షంగా చేసింది సుయోధనుడే అయినా పరోక్షంగా కారణం నీవు కాదా! " అన్నాడు. కృష్ణుడి ఒక్కొక్క మాట అర్జునుడికి ఆగ్రహం తెప్పించింది. దయాదాక్షిణ్యం లేక కర్ణుడి మీద శరములు గుప్పించాడు. కర్ణుడు కూడా నేల మీద ఉండే అర్జునుడు వేసే బాణములు ఎదుర్కొంటూ అర్జునుడి మీద బాణములు వేస్తున్నాడు. అర్జునుడు కర్ణుని పతాకం విరుగకొట్టాడు. కర్ణుడు మహా కోపంతో అర్జునుడి మీద కృష్ణుడి మీద పదునైన బాణములు వేస్తూ మధ్యమధ్యలో రథచక్రం తీయ ప్రయత్నించినా అది విఫలం అయింది. కృష్ణుడు అర్జునుడికి కర్ణుడిని సంహరించమని చెప్పాడు. అర్జునుడు అత్యంత శక్తివంతమైన మహాస్త్రాన్ని ఎక్కుపెట్టి మనసులో " నేనే కనుక తపస్సు చేయడంలో దానధర్మాలు చేయడంలో గురువులను సేవించడంలో లోపం లేక చరించిన వాడనై బ్రాహ్మణులను గురువులను తృప్తిపరచిన వాడినై అను నిత్యం పుణ్య కర్మలు ఆచరించే వాడినై ఉంటే ఈ అస్త్రం కర్ణుడిని సంహరించుగాక " అని సంకల్పించి గాండీవాన్ని ఆకర్ణాంతం లాగి అస్త్రప్రయోగం చేసాడు. ఆ దివ్యాస్త్రం నిప్పులు కక్కుతూ వచ్చి కర్ణుడి శిరస్సు ఖండించింది. కర్ణుడి శరీరం నుండి అందరూ చూస్తుండగా ఒక తేజం బయటకు వెడలి సూర్యునిలో కలిసి పోయింది. కర్ణుడి మరణంతో బ్రాహ్మణ శాపం అంతమై అప్పటి వరకు భూమిలో కూరుకు పోయి ఉన్న రథచక్రము భూమిలో నుండి పైకి లేచి భూమి మీద నిలబడింది. సూర్యుడు అస్తమించాడు.

శల్యుడు కర్ణుని మరణం సుయోధనుడికి వివరించుట

[మార్చు]

కర్ణుడి మరణం పాండవ సేనలో ఆనందోత్సాహాలు నింపాయి. జయజయ ధ్వానాలు మిన్నంటాయి. కర్ణుడు లేని రథమును తోలుకుని శల్యుడు వెళ్ళి పోయాడు. భీముడు కర్ణుడి మరణానికి ఆనందించి పెద్దగా అరుస్తూ కేకలు వేసాడు. శల్యుడు సుయోధనుడిని చేరి " సుయోధనా ! ఎన్నో యుద్ధాలు చూసాను కాని ఈ రోజు జరిగిన కర్ణార్జునుల యుద్ధం లాంటిది చూడ లేదు. ఒక దశలో కృష్ణార్జునులు సైతం కర్ణుడి పరాక్రమానికి భయపడ్డారు. కాని విధి బలీయం కనుక అంతటి బలశాలి కర్ణుడిని బలి తీసుకుంది. కృషార్జునుల శంఖధ్వానాలు వింటున్నావు కదా! సూర్యాస్థమయం అయింది ఈ రోజుకు యుద్ధం చాలించడం మంచిది " అన్నాడు. కర్ణుడి మరణ వార్త సుయోధనుడిని నిశ్చేష్టుడిని చేసింది. అంతలో కర్ణుడి మరణ వార్త తెలుసుకుని అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, శకుని, సుశర్మ విషణ్ణ వదనాలతో అక్కడకు చేరారు. సుయోధనుడి దుఃఖానికి అవధులు లేవు. " కర్ణా ! కర్ణా ! " అని అరుస్తూ శిబిరానికి చేరుకున్నాడు.

కృష్ణార్జునులు ధర్మజునుకి కర్ణుని మరణ వార్త ఎరిగించుట

[మార్చు]

కృష్ణార్జునులు కూడా యుద్ధంచాలించమని తమ సేనలకు చెప్పారు. అందరూ తమతమ శిబిరములకు చేరారు. అందరూ తమ ధర్మరాజు శిబిరానికి వెళ్ళి అన్న మాట నిలబెట్టు కున్నందుకు ధర్మరాజును అభినందించారు. కృష్ణుడు ధర్మరాజుతో " ధర్మజా! కర్ణుడు ఈరోజు మహా పరాక్రం ప్రదర్శించాడు. నీ ఆగ్రహజ్వాలలే కర్ణుడిని దహించాయి. కర్ణుడి చావుతో నీకు కౌరవుల బాధ తీరింది. నీవు ఇక నిశ్చింతగా ఉండు " అన్నాడు.ధర్మరాజు " అది సత్యము కాదు. నీ అనుగ్రహమే మాకు విజయాన్ని చేకూర్చింది. కాని మరేది కాదు " అన్నాడు. కృష్ణుడు " ధర్మజా! నేను కేవలం నిమిత్త మాతృడను. నీ తమ్ములు , బావలు అత్యంత పరాక్రమ వంతులు. అందరి సమిష్టి కృషి వలనే మీకు విజయం చేకూరింది " అని అన్నాడు.

ధర్మజుడు కర్ణుడిని రణభూమిలో చూచుట

[మార్చు]

ధర్మరాజు కర్ణుడి మరణానికి ఆనందించి " ఒకసారి రణ భూమికి వెళ్ళి కర్ణుడిని చూడవలెనని కోరికగా ఉంది అన్నాడు. ధర్మరాజు బంధు మిత్రులు తోడురాగా సపరివార సమేతంగా రణ భూమికి వెళ్ళి కర్ణుడు మరణించడం చూడడానికి వెళ్ళాడు. రణభూమిలో తలతెగి పడి ఉన్న కర్ణుడిని అతడి పుత్రులను చూసి ఇక తనకు పునర్జన్మ కలిగినంతగా సంతోషించాడు ధర్మరాజు " అన్నాడు సంజయుడు.

వనరులు

[మార్చు]