స్త్రీ పర్వము ద్వితీయాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ద్వితీయాశ్వాసం

[మార్చు]

వైశంపాయన మహర్షి జనమేజయునకు చెప్పిన మహా భారతకథను సూతుడు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులకు చెప్పసాగాడు. ఆ ప్రకారంగా ద్రౌపదిని ఓదార్చిన తరువాత యుద్ధభూమికి వెళ్ళింది. వ్యాసమహాముని కరుణ వలన ఆమెకు కళ్ళకు గంతలు ఉన్నా యుద్ధ భూమి సవిస్తరంగా కనిపించసాగింది. సుదూరంలో ఉన్న దృశ్యాలు దగ్గరగా కనిపించసాగాయి. గాంధారి యుద్ధభూమి అంతా పరికిస్తూ ముందుకు నడుస్తుంది. ఆమె కళ్ళు సుయోధనుడి శవం కొరకు గాలిస్తున్నాయి. విరిగిన రథాలు, ముక్కలైన ధ్వజాలు, చచ్చిన ఏనుగులు, గుర్రాలకళేబరాలు గుట్టలుగా పడి ఉన్నాయి. చనిపోయిన సారధులు, సైనికుల శవాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. తల ఒక చోట ఉంటే మొండెం మరొక్క చోట ఉంది. అది చూసి గాంధారి మనసు కలత చెందింది. మహా మహా సామ్రాజ్యాలు ఏలిన మహారాజులు నోళ్ళు తెరచుకొని శవాలై పడి ఉన్నారు. వారి శరీరాల నుండి కారిన రక్తం కాలువలై ప్రవహిస్తుంది. వారు ధరించిన విల్లులు, అంబులు, కత్తులు మొదలైన ఆయుధములు గుట్టలుగా పడి ఉన్నాయి. కొంత మంది శరీరాలు గుర్తించ వీలు లేని విధంగా ఉన్నాయి. వాటి కొరకు వచ్చిన రాబందులు, గద్దలు, అక్కడక్కడా ఎగురుతూ దొరికిన శవాన్ని దొరికినట్లు పీక్కు తింటూ తిరుగుతున్నాయి. తోడేళ్ళు స్వైర విహారం చేస్తూ శవాలని చీల్చి కండలు ఊడబెరికి తింటున్నాయి.

గాంధారి బాధ

[మార్చు]

ఇదంతా చూసిన గాంధారి మనసు బాధతో విలవిల్లాడింది. తన కుమారుడి మూర్ఖత్వం ఇంతటి మారణహోమానికి దారి తీసిందని బాధపడింది. వ్యాసుడు ధృతరాష్ట్రుడితో శవాలన్నింటికీ సామూహిక దహనకాండలు జరిపించమని చెప్పి వెళ్ళి పోయాడు. పాండవులు, శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడిని నడిపించుకుంటూ తీసుకు యుద్ధభూమికి తీసుకు వచ్చారు. గాంధారి కోడళ్ళు అందరూ తమ తమ భర్తల శవాల కొరకు యుద్ధ భూమి అంతా కలియ తిరుగుతున్నారు. ఇతర హస్థినాపుర స్త్రీలు కూడా తమ భ్యర్తల కళేబరాల కొరకు తిరుగుతున్నారు. అందరూ బిగ్గరగా ఏడుస్తూ, కుమారులనూ, భర్తలను పిలుస్తూ తూలుతూ నడుస్తున్నారు. కొంత మంది తమ సోదరులు, భర్తలు, కుమారులు, బంధువులు శవాలుగా పడి ఉండటం చూసి సహించ లేక హాహాకారాలు చేస్తూ మూర్ఛ పోయారు. మరి కొంత మంది చని పోయిన వారి గురించి తలచుకుంటూ వారి గురించి చెప్పుకుంటూ తలలు బాదుకుంటున్నారు.

గాంధారి కృష్ణుడితో చెప్పి విలపించుట

[మార్చు]

ఇది చూసిన గాంధారి మనసు కకావికలు కాగా దూరంగా ఉన్న కృష్ణుడిని దగ్గరకు పిలిచి " కృష్ణా ! చూడవయ్యా ధృతరాష్ట్ర మహారాజు కోడళ్ళు ఎలా ఏడుస్తున్నారో చూడు. వారి భర్తల శవాల కొరకు ఎలా వెదుకుతున్నారో చూడు. ఒకరి భర్తల శరీరాలను ఒకరు వెతుకుతూ ఏడుస్తూ వారి వారి భార్యలను ఏడుస్తూ ఎలా పిలుస్తున్నారో చూడవయ్యా ! నా కుమారుల మీద కసి ద్వేషం పెంచుకున్న వారి కళ్ళు ఈ దృశ్యాలు చూసి చల్లబడ్డాయా ! వీరంతా ఏమి పాపపం చేసారని వీరికి ఈ శిక్షవేసారయ్యా మీరు. అడుగో ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, ద్రుపదుడు వీరంతా చనిపోయినా ముఖంలోని కళ తగ్గకుండా ఎలా వెలిగిపోతున్నారో చూడవయ్యా ! అత్యంత భోగాలను అనుభవించిన ఆ మహానుభావులు ఎలా పడి ఉన్నారో చూడవయ్యా ! వంది మాగధులు కైవారముతోగాని నిద్ర లేవని ఈ మహా మహులు ఈ రోజు నక్కల ఊళల మధ్య అచేతనంగా పడి ఉన్నారయ్యా ! హంస తూలికా తల్పమున గాని శయనించని రాజాధిరాజులు కటిక నేలన పడి ఉన్నారయ్యా ! నానా విధ సుఘంధ లేపనాలతో శరీరాలను అలంకరించుకునే రాజాధిరాజులు ధూళి దూసరిత రక్తమయ భూమిలో దొర్లుతున్నారు చూడవయ్యా ! కృష్ణా ! ఇవన్నీ చూసి ఎలా ఊరుకున్నావయ్యా ! ఇదంతా నీవు సాధించిన ఘనకార్యం కాదా ! అటు చూడవయ్యా ! కొంత మంది కౌరవ కాంతలకు తమ భర్తల తలలు కానక ఎలా విలపిస్తూ వెతుకుతున్నారో చూడవయ్యా ! మరి కొందరు తలలు చేత పట్టి మొండెములు కానక అల్లాడుతున్నారయ్యా ! మరి కొందరు ముక్కలై పోయిన తమ భర్తల శరీరభాగాలను ఒకటిగా చేర్చి కుమిలి కుమిలి ఏడు స్తున్నారయ్యా ! మరి కొందరు నక్కలు తోడేళ్ళు చిందర వందర చేయడంతో శరీరాలను కానక క్షోభిస్తున్నారయ్యా ! ఇటువంటి దురవస్థలను చూడడానికి నేను ఈ జన్మలో ఏపాపపం చేసానో కృష్ణా ! నా కొడుకులను, కోడళ్ళను, తమ్ముళ్ళను, బంధువులను ఇలాంటి దుస్థితిలో చూస్తున్నాను " కాని కృష్ణుడు మాటాడక నిశ్శబధంగా గాంధారి వెంట నడుస్తున్నాడు.

గాంధారి సుయోధనుడిని చూసి విలపించుట

[మార్చు]

ఇంతలో దూరంగా సుయోధనుడి శవం పడి ఉండటం చూసింది. దిక్కు లేకుండా పడి ఉన్న అభిమానధనుడైన సుయోధనుడి శవం చూసి గాంధారి కుప్పకూలి పోయింది. తన కుమారుడి శవం మీద పడి రోదిస్తూ " నాయనా సుయోధనా ! ఏమిటిది సుయోధనా ! నీ శరీరం దుమ్ము ధూళిలో పడి దొర్లడం ఏమిటయ్యా ! నీ తల్లి గాంధారిని వచ్చాను నన్ను చూసి కూడా లేచి నిలబడవా నాయనా ! కృష్ణా ! చూడవయ్యా నా కుమారుని చూడు. వీడు యుద్ధముకు వెళుతూ నా ఆశీర్వాదం కొరకు వచ్చాడయ్యా ! నాకు పాదాభివందనం చేసాడయ్యా ! అప్పుడు నేను ధర్మమం జయిస్తుందని ఆశీర్వదించాను. అలా ఎందుకు ఆశీర్వదించానో తెలుసా కృష్ణా !నాడు కురు సభలోజూదక్రియ తరువాత పాండవులకు జరిగిన అవమానము ద్రౌపదికి జరిగిన ఘోర పరాభవం కళ్ళారా చూసిన వారు " ఎప్పటికైనా ధర్మం జయిస్తుంది. కౌరవులకు నాశనం తప్పదు " అనుకోవడం నా మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తుంది. అందుకే నా కుమారుడని ఉపేక్షించక అలా దీవించాను. కృష్ణా ! నేను ఇంకా ఇలా అన్నాను యుద్ధంలో వెనుతిరిగి పోవడం కంటే వీరమరణం పొందడమే మేలు అన్నాను. అప్పుడే వీరస్వర్గం లభిస్తుంది. వస్తే విజయలక్ష్మితో తిరిగి రా ! లేకున్న వీరమరణాన్ని వరించి వీరస్వర్గం అనుభవించు అన్నానయ్యా ! నా కుమారుడు రెండవది నిజంచేసాడు. ఇప్పుడు నేను కడుపు తీపితో ఏడుస్తున్నానే కాని వేరు కాదు. వాడి మరణానికి నేను ఏడవడం లేదు. వీరోచితంగా పోరాడి వీర మరణం పొంది వీరస్వర్గం చేరిన నాకుమారుడి గుర్తించి ఎందుకు దుఃఖిస్తాను. ఈ ముదిమివయసులో నాకూ నా భర్తకు కొడుకుల ఆసరా లేక పోయిందేనన్నదే నా బాధ. కృష్ణా ! నా కుమారుడు అభిమానధనుడు అష్టైశ్వర్య సంపన్నుడు అలాంటి వాడికి ఇలాంటి మరణమా అన్నదే నా బాధ. ఏమి చేస్తాం విదురుడు ఎంతో చెప్పాడు. నా భర్తకు నా కుమారుడికి ఎన్నో విధముల చెప్పాడు. మదించిన గర్వంతో వారా మాటలను పెడచెవిన పెట్టారు. విదురుడి మాట ఒక్కటి విన్నా దుర్మరణాలు తప్పేవి కదా ! పదకొండు అక్షౌహినుల సైన్యమున్న నా కుమారుడు ఇలా ఒంటరి చావు చచ్చాడయ్యా ! నా భర్త కుమారుడు ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన కురుసామ్రాజ్యం పరుల హస్తగతం అయిందయ్యా ! అది చూసే దౌర్భాగ్యం నాకు పట్టింది " అని

గాంధారి వైరాగ్యంతో కోడళ్ళను చూసి దుఃఖించుట

[మార్చు]

కృష్ణా ! పోయిన కొడుకులు ఏటూ పోయారు. బతికి ఉన్ననా కోడళ్ళ దుఃఖమును చూడ లేక పోతున్నానయ్యా ! ఇలాంటి మనో వేదన అనుభవించడానికి వారు చేసిన పాపమేమిటి ! రాజకీయాలేమిటో యుద్ధం ఎందుకు సంభవించిందో ఎరుగని వారికీ ఘోర శిక్ష ఏమిటి. అలా చూడు నా పెద్ద కోడలు భానుమతి భర్త శవాన్ని చూసి ఎలా ఏడుస్తూ తల బాదుకుంటుందో చూడవయ్యా ! కడుపున పుట్టిన కుమారుడి ముఖాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తుందయ్యా ! నా కుమారుడు, ఆమె కుమారుడి శవాలు ఆమె కన్నీటితో తడుస్తున్నాయి చూడవయ్యా ! కురులు విరబోసుకుని పిచ్చి వారిలా తిరుగుతున్న నా కోడళ్ళను చూడవయ్యా ! వాళ్ళేమి చేసారని వారికి ఈ చిత్తక్షోభ. నా కుమారుడు సుయోధనుడి సరసన విరాజిల్లిన భానుమతి ముఖాన్ని ఇలా శోకతప్త ముఖంతో నేను ఎలా చూడగలను. నా కుమారులకేమి చచ్చి హాయిగా స్వర్గాన ఉన్నారు. నా కోడళ్ళు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు చూడవయ్యా ! వీరి దుఃఖముకు అంతు లేదా ! భీముని చేతిలో హతులైన నాకుమారుల శవాలు చూసి నాకోడళ్ళు భోరు భోరున రోదిస్తున్నారయ్యా ! పాలరాతి భవనాల్లో చందనచేర్చిత ముఖాలతో కళ కళ లాడే వారి ముఖాలు ఈ రోజు మరణించిన భర్తల కొరకు కటిక నేల మీద పడి పొర్లి రోదిస్తున్నారయ్యా ! ఇంకా ముద్దు ముచ్చటలు తీరని లేత వయస్కులైన నా కోడళ్ళ్కు పట్టిన దుర్గతి చూసావా ! ఇదంతా నేను నా భర్తా చేసిన పాప ఫలితం కాక పోతే ధర్మరాజు నా కుమారులను సంహరిస్తాడా ! అని గాంధారి పలు విధముల విలపిస్తుంది. కృష్ణుడు ఆమె పక్కన నిలబడి మౌనంగా చూస్తున్నాడు. ఆమె మనసులో ఉన్న బాధ, దు!ఖం బహిర్గతమైతే కాని దుఃఖోపశమనం కలుగదని అనుకున్నాడు.

గాంధారి దుశ్శాసనుడి కొరకు దుఃఖించుట

[మార్చు]

ఇంతలో గాంధారి దుశ్శాసనుడి శవాన్ని చూసి మహోద్వేగంతో " కృషా ! వీడేనయ్యా నా కుమారుడు దుశ్శాసనుడు. మహాబలసంపన్నుడు. భీముడి గదా ఘాతానికి బలి అయి ఇలా దిక్కు లేకుండా నేల పడి ఉన్నాడు. భీముడు వీడి గుండెలుచీల్చి రక్తంత్రాగిన తరువాత నిర్జీవుడయ్యాడు. వీడు నా కోడలు జుట్టు పట్టి సభకు ఈడ్చినందుకు ఫలితం అనుభవించాడయ్యా ! భీముడి గుండెలు మండేలా ద్రౌపది ఏడుస్తుంటే వీడు నా కుమారుడు సుయోధనుడికి, అంగరాజు కర్ణుడికి ప్రీతి కలిగించడానికి ద్రౌపది వలువలు ఊడదీయ ఉద్యుక్తుడైన వీడి పాపం ఊరికేపోతుందా ! అందుకే దిక్కు లేని చావు చచ్చాడు. వీడి విషయం విని నేను సుయోధనుడితో " కుమారా ! ఈ ద్రౌపది తన అన్న కృష్ణుడి సంరక్షణలో ఉన్న విషయం నీకు తెలుసా ! ఆమెను ఇంత నీచంగా అవమానించడం మీకు మంచిది కాదు. ఇందుకు పర్యవసానం తెలిసే మీరు ఈ పనికి ఒడిగట్టారా ! భీముడి బలపరాక్రమాలు తెలిసే అతడి భార్య ద్రౌపదిని అవమానించారా ! తక్షణమే ఆమెను విడిచి పెట్టండి. కౌరవకులకాంత ద్రౌపదిని గౌరవించండి. నా తమ్ముడైన శకుని అత్యంత నీచుడు, క్రూరుడు, దౌర్భాగ్యుడు వాడి మాట వినకు వాడి స్నేహం వదులు కౌరవవంశాన్ని రక్షించు " అని ఎన్నో విధముల సుయోధనుడికి చెప్పాను. అయినా నా మాటను ఎవరు వినక ఇలా చచ్చారయ్యా కృష్ణా ! విధిరాతను తప్పించ ఎవరి తరం కృష్ణా !

గాంధారి భీముని నిందించుట

[మార్చు]

కృష్ణా ! ఆ భీముడు నాడు కురుసభలో ఎన్ని మాటలన్నా ! ఎంత అవమానించినా ! సహించాడు భరించాడు. సమయం కొరకు పగబట్టిన త్రాచు పాములా కాచుకుని ఉన్నాడు. యుద్ధంలో అవకాశం రాగానే నా కుమారులందరినీ తన గధతో మోది చంపాడు. పగతీర్చుకోవడం న్యాయమే ఇలా గుండెలు చీల్చడం న్యాయమా ! మహా వీరుడైన భీముడికి ఇది తగునా ! ఇందు వలన భీముడికి కీర్తి కలుగుతుందా ! చూడవయ్యా కృష్ణా ! నా కొడుకు దుశ్శాసనుడు ఎలా ఉన్నాడో చూడు. చెల్లాచెదురైన అవయవములను చూడు. సింహం గోళ్ళతో చీల్చినట్లు ఆ భీముడు నా కుమారుడి గుండెలు ఎలా చీల్చాడో చూడు. కనిపెంచిన కొడుకు శరీరం ఇలాంటి స్థితిలో చూసిన తల్లి మనస్సు కుమిలి పోకుండా ఎలా ఉంటుంది కృష్ణా !

గాంధారి వికర్ణుడి కొరకు దుఃఖించుట

[మార్చు]

అయ్యో ! వికర్ణుడు ఇక్కడున్నాడు చూడవయ్యా ! ఆ ఏనుగుల కళేబరాల మధ్య వికర్ణుడి భార్య నా కోడలు గుండెలు అవిసేలా ఎలా రోదిస్తుందో చూసావా కృష్ణా ! వికర్ణుడి శరీరం మీద పొడుచుకు తినడానికి వాలు తున్న గద్దలను రాబందులను తోలుతూ భర్త శరీరం మీద పడి రోదిస్తుంది చూడవయ్యా ! కృష్ణా ! ఇలాంటి స్థితిలో కొడుకులను కోడళ్ళను చూసే ధౌర్భాగ్యురాలిని ఎక్కడైనా చూసావా ! ఎలాంటి వీరుడినైనా అవలీలగా ఎదుర్కునే దుర్ముఖుడు అలాంటి వీరుడు భీముడి గధాఘాతానికి ఎలా బలి అయ్యాడో చూసావా ! నా కొడుకు శూరసేనుడిని చూసావా ! అతడి భార్యలను చూడు భర్త శవం చుట్టూ చేరి ఎలా రోదిస్తున్నారో చూడయ్యా ! కాకులూ గద్దలూ పొడుచుకు తిన్న అతడి శరీరం గుర్తించ వీలు కావడం లేదయ్యా ! కృష్ణా ! నా కుమారుడిని వివిశంతిని చూసావా ! వీడికి సంగీతం అంటే ప్రాణం. ఎప్పుడూ సంగీత విద్వాంశులైన స్త్రీలు సంసేవిస్తుండగా గానామృతంలో తేలియాడే వివిశంతి ఇప్పుడు నక్కల ఊళలు వింటున్నాడు. అని పరిపరి విధముల కుమారుల మరణానికి గాంధారి విలపిస్తుంది.

గాంధారి అభిమన్యుని కొరకు విలపించుట

[మార్చు]

కుమారుల కొరకు విలపిస్తున్న గాంధారి అభిమన్యుడి మృతదేహాన్ని చూడగానే భావోద్వేగానికి లోనయ్యింది. ఆమె మనసు బాధతో " కృష్ణా ! వాడేనయ్యా అభిమన్యుడు శత్రు దుర్భేద్యమైన పద్మవ్యూహమును ఛేదించి అరి వీర భయంకరుడైన సుయోధనుడిని ఎదిరించిన మహావీరుడు అభిమన్యుడు. చివరకు ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, శల్య, కృపాది యోధాను యోధులందరూ అతడిని చుట్టు ముట్టి కడతేర్చారయ్యా ! చావు కళ ఇసుమంతైనా లేక నిద్రిసతున్నట్లున్న సుభద్రా పుత్రుడి ముఖం చూడవయ్యా ! అందుకే ఉత్తర అతడి ముఖం మీద ముఖం పెట్టి నిద్రలేవమని భర్తను ప్రార్థిస్తుందయ్యా ! అభిమన్యుడిని అల్లంత దూరంలో చూడగానే పారి పోయే ఆ సుకుమారి. ఇప్పుడు పది మంది ముందు భర్త శరీరాన్ని కౌగలించుకుని నెత్తీ నోరూ బాదుకుంటూ రోదిస్తుందయ్యా ! ఉత్తర ఏమని ఏడుస్తుందో వినవయ్యా ! " ఓ అభిమన్య కుమారా ! మీ అమ్మ సుభద్ర, మీ నాన అర్జునుడు ఎదురు చూస్తున్నారు వారిని వదిలి ఎక్కడకు వెళ్ళావు ? నీ మేనమామ కృష్ణుడు వచ్చాడు లేవవయ్యా ! ఇన్ని మాట్లాడుతున్నా ఒక్క మాటైనా మారు పలుకవేమి ఆర్యపుత్రా ! అయ్యో దైవమా ! గురువుగారు ద్రోణుడు, కృపాచార్యుడు, అంగరాజు కర్ణుడు, గురుపుత్రుడు అశ్వత్థామ న్యాయం ధర్మం తెలిసిన ధర్మాత్ములు ఒంటరి వాడివైన నిన్ను ఒక్కసారిగా దాడి చేసి చుట్టిముట్టి తుద ముట్టించడం న్యాయమా ! ధర్మమా ! వారిదీ మగతనమేనా ! ఇంతటి నీచ కార్యానికి పాల్పడుటకు వారికి మనసెలా ఒప్పిందో ! తాను లేని సమయాన ఆ దుర్మార్గులు నిన్నిలా అధర్మమంగా వధించినందుకు నీ తండ్రి అర్జునుడి మనసెంత రగిలి పోయిందో ! నీ మరణం కలిగించిన దుఖం శత్రురాజులను జయించి రాజ్యలక్ష్మిని కైవంశం చేసుకున్నా ఉపశమించ లేదు కదా ! నన్ను విడిచి స్వర్గానికి వెళ్ళి అక్కడి అప్సరసలతో సుఖించడానికి నీకు మసెలా ఒప్పింది " అంటూ ఉత్తరను చూడు కృష్ణా ! ఇంత చిన్న వయసులో భర్తృవియోగం ఉత్తర ఎలా సహించగలదు. మహావీరుడైన ఉత్తర తండ్రి విరాటుడు ఆయన పక్కన చేరి సుధేష్ణ ఎలా రోదిస్తుందో చూడవయ్యా ! ఆ పక్కన ఆమె కుమారుడు ఉత్తర కుమారుడు పడి ఉన్నాడు. ఆ అభాగ్యురాలు మరణించిన భర్త కోసం ఏడుస్తుందా చచ్చిన కుమారుడి కొరకు విలపింస్తుందా ! చెప్పవయ్యా కృష్ణయ్యా !

గాంధారి కర్ణుడి కొరకు దుఃఖించుట

[మార్చు]

కృష్ణా ! అదుగో చూడు కర్ణుడి కళేబరం వద్ద అతడి భార్యలు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా ! ఈ కర్ణుడిని నమ్ముకునే నా కుమారుడు ఈ ఘోర యుద్ధానికి శ్రీకారం చుట్టి తుదకు దుర్మరణం పాలైంది. అటు చూడవయ్యా ! కర్ణుడి ధర్మపత్ని వృషసేనుడి తల్లి అటు భర్త మరణానికి ఇటు కుమారుడి మరణానికి ఎలా విలపిస్తుందో చాడవయ్యా ! అమె రోదన వినవయ్యా ! " నాధా ! పరశురాముని శాపం, బ్రాహ్మణుడి శాపం, అర్జునుడి బాణాలు నిన్ను బలిగొన్నాయా ! " అంటూ విలపిస్తుందయ్యా ! అడుగో మహావీరుడు బాహ్లికుడు, చచ్చినట్లు ఉన్నాడా ! ఘాఢ నిద్రలో ఉన్నట్లు ఉన్నాడయ్యా ! కృష్ణా !

గాంధారి సైంధవుడి కొరకు దుఃఖించుట

[మార్చు]

కృష్ణా ! అటు చూడు నా అల్లుడు దుస్సల భర్త జయద్రధుడు. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞకు బలి అయిన అభాగ్యుడు. నాడు అరణ్యమున ద్రౌపదిని కామించిన నాడే సగం చచ్చాడు. కాని ఆ నాడు పాండవులు చెల్లెలి భర్త అని వదిలారు. ఈ నాడు చెల్లెలి భర్త అన్న కనికరం మాని చంపారు కదయ్యా ! పాపం దుస్సల భర్త శిరస్సు కొరకు వెదుక్కుంటుందయ్యా ! కుమార్తెను ఇలాంటి దుస్థితిలో చూడడం కంటే దురదృష్టం తల్లికి మరేమి కలదో చెప్పవయ్యా ! కృష్ణా ! నీకు తెలుసో లేదో అర్జునుడు ప్రతిజ్ఞ గురించి విన్న దుస్సల భర్తకు ఎంతగా నచ్చచెప్పిందో " అర్జునుడికి ఈ ముల్లోకాలలో తిరుగు లేదు. నా మాట విని ధర్మరాజు ను శరణు వేడిన అతడు నిన్ను తప్పక కాపాడగలడు " అని పరి పరి విధముల వేడుకున్నా ! సైంధవుడు వినక తన మరణమును తానే కొని తెచ్చుకున్నాడు. " ఏ శుభకార్యానికి వెళ్ళ లేకుండా చేసారని దుస్సల ఎంతగా పాండవులను నిందిస్తుందో వినవయ్యా ! కృష్ణా ! అయినా సైంధవుడు చేసిన అపరాధం ఏమిటి ? యుద్ధధర్మం ప్రకారం భీమ, నకుల, సహదేవ, ధర్మరాజు లను అభిమన్యుడికి సహకరించకుండా ఆపాడు. అయినా ! బాలుడైన అభిమన్యుడు యోధానుయోధులైన భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, శల్యులను ఒంటరిగా ఎదుర్కోవడం అతడి దసుస్సాహసం కాదా ! అతడి తొందరపాటే అతడి మరణానికి కారణమైంది. చంపిన వారిని వదిలి అడ్డగించిన సైంధవుడిని చంపుట న్యాయమా ! ధర్మమా అర్జునుడికే అది తెలియాలి. కృష్ణా ! మహావీరుడైన శల్యుడు ధర్మనిరతిలో ధర్మరాజుతో సమానుడు అటూవంటి వాడు దుర్యోధన పక్షం చేరి కర్ణుడికి సారథ్యం వహించి అతడిని సూటి పోటీ మాటలతో వేధించి అతడి ధైర్యాన్ని నీరుకార్చి అతడి మరణానికి ఒక కారణమయ్యాడే ! అలాంటి శల్యుడూ మరణించక మాన లేదు. శల్యుని చుట్టూ చేరి అతడి బంధువులు ఎలా విలపిస్తున్నారో చూడవయ్యా ! కృష్ణా ! మహేంద్రుడిని కూడా గెలువగలిగిన భగదత్తుడిని చూడు అర్జునుడి మీద ప్రేమతో ఇతడిని దారుణంగా చంపింది నువ్వే కదా !

గాంధారి భీష్మ ద్రోణుల కొరకు రోదించుట

[మార్చు]

అడుగో కోరి మరణం కొని తెచ్చుకున్న భీష్ముడు శరతల్పం మీద ఎలా పడుకుని ఉన్నాడో చూసావా ! అతడు అలా మరణాన్ని కోరి ఉండక ఉన్న అతడిని జయించడం మానవమాతృల తరమా ! కృష్ణా ! అతడికి నిజమైన శిష్యుడు అర్జునుడు. అతడిని శరతల్పం మీద పరండజేసి అతడికి పాతాళ గంగ తీసుకు వచ్చి దాహార్తి తీర్చిన మహా వీరుడు అర్జునుడే కదా ! సూర్యుడే భూమి మీదకు దిగి వచ్చి శరతల్పం మీద విశ్రమించినట్లు ఉంది. అలాంటి భీష్ముడు మరణిస్తే కురు కుమారులకు దిశా నిర్ధేశం చేయగల సమర్ధుడెవ్వడు. ఇంద్రుడితో సమానమైన ద్రోణుడు వేదవేదాంగపారతుడు. ధనుర్వేదం ఔపాశన పట్టాడు. ఎందరో రాకుమారులకు విద్యనేర్పిన వాడు. నేడు దిక్కులేకుండా పడి ఉన్నాడు. విధి ఎంత క్రూరమైంది కృష్ణా ! భీష్మ, ద్రోణులను నమ్ముకునే నా కుమారుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయినా అతడి తలను ద్రుపదపుత్రుడు దృష్టద్యుమ్నుడు దారుణంగా నరికాడు. ఇది ఎలా సంభవించింది. ద్రోణుడి భార్య భర్తశవం పక్కన కూర్చుని ఎలా రోదిస్తుందో చూడు. ద్రోణుడి శిష్యులు అతడిని దహించడానికి కట్టెలు దొరకక అమ్ములు విల్లులు పోగు చేసి చితి పేరుస్తున్నారు చూడు. కృపి మొదలైన వారు ద్రోణుడికి అపసవ్యంగా ప్రదక్షిణ చేసి స్నానం చెయ్యడానికి వెళుతున్నారయ్యా !

గాంధారి అర్జునసాత్యకులను నిందించుట

[మార్చు]

కృష్ణా ! సాత్యకి అమానుషంగా తల నరికిన భూరిశ్రవసుడిని చూడు. అతడి శరీరాన్ని నక్కలు గద్దలు ఎలా పీక్కు తింటున్నాయో చూడు. ఆ భూరిశ్రవసుడి పక్కన అతడి తల్లి, కుమారులు, భార్య ఎలా రోదిస్తున్నారో చూడు. కృష్ణా ! అర్జునుడు భూరిశ్రవసుడి భుజము నరికాడు. సాత్యకి తల నరికాడు. అయినా ! కృష్ణా ! మహావీరులైన అర్జునుడు, సాత్యకి మీద ప్రేమతో ఇలా చేసి ఉంటాడంటావా ! సాధువు మంచి వాడు అయిన భూతిశ్రవసువును చంపినందువలన అర్జునుడికి ఏమి ఒరిగింది కృష్ణా ! సాత్యకి సాధించినది ఏమిటి అపకీర్తి మూటకట్టుకోవడం తప్ప. కృష్ణా ! ఇదంతా నీ కళ్ళ ముందే జరిగింది. భూరిశ్రవసుడు సాత్యకితో యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు సిగ్గుమాలి అతడి చేయి నరకవచ్చునా ! అర్జునుడు చేసిన పని నీవు హర్షిస్తావా ! కృష్ణా ! " అని పరిపరి విధముల విలపించసాగింది గాంధారి.

గాంధారి శకునిని నిందించుట

[మార్చు]

కృష్ణుడు ఒక్క మాట కూడా మాటాడక కుండా గాంధారి ని అనుసరిస్తున్నాడు. ఇంతలో గాంధారికి శకుని కళేబరం కనిపించింది. అది చూడగానే ఆమె ముఖం కోపంతో జేవురించింది. గాంధారి " కృష్ణా ! తన మేనల్లుడు నకులుని చేతిలో చచ్చిన నా తమ్ముడు శకునిని చూసావా ! వీడొక మాయావి వీడి మాయలు నీ ముందు పని చేయలేదు. నాడు మాయా జూదంలో ధర్మరాజును అడవులకు పంపాడు. ఇప్పుడు యుద్ధమనే జూదంలో తన ప్రాణాలు ఒడ్డి ఒడిపోయాడు. కురుపాండవులకు మధ్య శత్రుత్వానికి ముఖ్య కారకుడు ఇతడే కృష్ణా ! మేలు చేస్తున్నానని నమ్మించి నాకుమారుని నట్టేట ముంచాడు. వీడు మాత్రం బాగుపడింది ఏముంది. పుత్ర పౌత్రులతో నాశనం అయ్యాడు. అసలు నాకొడుకులకు బుద్ధి అనేది ఉంటే మాయావి అయిన వీడి మాటలు నమ్ముతారా ! అందుకు తగిన ఫలితం అనుభవించారు

గాంధారి మిగిలిన వారి కొరకు రోదించుట

[మార్చు]

కృష్ణా ! అదుగో కళింగ దేశాధిపతి, ఇదుగో మగధ దేశాధిపతి, ఇతడు కోసల దేశాధిపతి బృహద్బలుడు. తమ తమ రాజ్యాలలో సకల భోగములను అనుభవించిన వారు నేడు దిక్కులేకుండా పడి ఉన్నారు. వారి చుట్టూ చేరి వారి భార్యా బిడ్డలు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా ! ఇలాంటి రోదనలు ఎక్కడైనా విన్నామా కృష్ణా ! ఇరుగో కేకయ రాజులు. ద్రోణాచార్యుని చేతిలో హతులైనట్లున్నారు. అడుగో పాంచాల రాజు ద్రుపదుడు తన సహాద్యాయి ద్రోణుడి చేతిలో హతుడైనాడు. చిత్రం చూసావా ! అతడి స్వేత చ్ఛత్రం ఇంకా అతడి మీద ఎండ పడకుండా నిలిచి ఉంది. అటు చూడవయ్యా ! కృష్ణా ! ఆ మహారాజుల భార్యలు కొడుకులూ వారికి దహనక్రియలు గావించి మైల స్నానాలు చేయడానికి వెళుతున్నారు. ఇంకా కొంత మంది మమకారం వీడక వారి తలలను ఒడిలో పెట్టుకుని రోదిస్తున్నారు. కృష్ణా ! ఇతడిని గుర్తు పట్టావా ! వీడే నీ మేనత్త కొడుకు శిశుపాలుని కుమారుడు దుష్టకేతువు '. అతడి కుమారుడు సుకేతుడు. తాండ్రి కొడుకులిద్దరూ మరణించారయ్యా ! తండ్రి కొడుకుల మరణానికి వారి భార్యలు తల్లులు బంధువులు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా ! కృష్ణా ! అవంతీ పాలకులు విందానువిందులను చూడు. పెను గాలికి కూలిన వృక్షములవలె ఎలా కూలి పోయారో చూడు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక సందేహం కలుగుతుంది కృష్ణా !

గాంధారి కృష్ణుడిని నిందించి శపించుట

[మార్చు]

భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, భూరిశ్రవసువు, కృపుడు, సైంధవుడు, కృతవర్మ నా కుమారుడు సుయోధనుడు వీరంతా అతిరధ మహారధులు. వీరందరితో యుద్ధం చేసి కూడా నువ్వు, నీ తమ్ముడు సాత్యకి, పాండవులు నిరపాయంగా ఎలా బయట పడ్డారయ్యా ! మహాఆద్భుతంగా ఉంది కదూ ! నాకు నమ్మ బుద్ధి కావడం లేదు కృష్ణా ! అపారమైన దైవ బలం ఉంటే కాని ఇది సాధ్యం కాదు. కాని ఆ దైవం కూడా దయమాలి నా నూరుగురు కుమారులకు అన్యాయం చేసిందంటే నా మనస్సు క్షోభిస్తుందయ్యా ! ఏమి చెయ్యగలను నా కుమారులందరిని పోగొట్టుకుని అనాథను అయ్యాను. ఈ ముదిమి వయస్సులో నాకు ఆసరాగా ఒక్క కొడుకుని కూడా మిగల్చలేదయ్యా ! ఆ భీముడు. భీముడు మాత్రం ఏమి చేస్తాడులే ! అంతా నేను నా కొడుకులు చేసుకున్న ప్రారబ్ధం. ఆ నాడు నువ్వు రాయబారానికి వచ్చినప్పుడు విన్నట్లైతే ఇంత జరిగేదా ! నువ్వే కాదు భీష్ముడు, విదురుడు కూడా ఎన్నో హితోక్తులు చెప్పారే ! నేను నా భర్త నాకుమారులు ఆమాటలు వినక పెడచెవిన పెట్టి ఫలితం అనుభవిస్తున్నాము. కృష్ణా ! నాడు కురుసభలో నీవు పలికిన పలికులు నిజమైయ్యాయి. ఈ సర్వనాశనానికి నువ్వే కారకుడవు. ఊరకే హితవులు చెపుతూ కూర్చుని ఉండక నువ్వు నా కుమారులు పాండవుల మీద అసూయతో చేస్తున్న అకృత్యములు ఆపే ప్రయత్నం ఎందుకు చేయ లేదు. నువ్వు తలచిన ఈ యుద్ధం ఆపలేక పోయే వాడివా ! నాడు కొలువులో ఎంత మంది పెద్దలు ఉన్నారు. మానవీయ వాక్చాతుర్యం కలిగిన వాడవు ధర్మవేత్తవు నీవు ఉన్నావు. మీరందరూ కలసి ఈ ఘోరకలికి కారకులయ్యారు. కృష్ణా ! నీవు సుయోధనుడిని నాశనం చేయడానికి ఈ రాయబారనాటకం ఆడి ఎందరో రాజులను ఈ రణభూమికి బలి ఇచ్చావు. ఇందుకు ప్రతిగా అంతకు అంతా నువ్వు అనుభవిస్తావు కృష్ణా ! ఇదిగో ఇదే నీకు నా శాపం. నేను నా జీవితాంతం సంపాదించుకున్న పాతివ్రత్య పుణ్యఫలాన్ని ఫణంగా పెట్టి పలుకుతున్నాను. నీవు ఎలాగైతే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో దాయాదులను ఒకరి చేత ఒకరిని చంపించావో అలాగే నీ వారంతా తమలో తాము కలహించుకుని దారుణ మరణానికి గురి ఔతారు. నువ్వు కూడా సరిగ్గా నేటికి సరిగ్గా ఒక్క సంవత్సరం ముప్పైఆరు దినములకు అతి కౄరంగా దిక్కు లేని చావుచస్తావు. నేడు నా వాళ్ళు ఎలా ఏడుస్తున్నారో నాడు నీ వాళ్ళు అలాగే భర్తలను, కుమారులను, బంధువులను పోగొట్టుకుని ఏడుస్తారు. ఇదే నా శాపం అనుభవించు " అని ఘోరంగా శపించింది గాంధారి. శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు.

గాంధారికి కృష్ణుడు సమాధానం చెప్పుట

[మార్చు]

అమ్మా ! గాంధారీ ! నీవు ఈ రోజు ఇచ్చిన శాపం నాకు కొత్త కాదు. అది ఇంతకు ముందు ఉన్నదే. ఇది వరలో యాదవులు మహా మునిని అవహేళన చేసిన కారణంగా ఆ మహాముని ఇదే విదంగా శపించాడు. నీ నోట ఆమాటలే ఈ రోజు వెలువడ్డాయి. యాదవులకు ఎవరి చేతిలోనూ చావు లేదు. అందు వలన వారు వారిలో వారు కలహించుకుని మాత్రమే అంతమొందగలరు. నీ శాపం అందుకు ఉపకరిస్తుంది " అని పలికాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలు విని పాండవులు కంపించిపోయారు. శ్రీకృష్ణుడు లేకున్న తాము జీవించి ఉండడం వృధా అనుకుని తమ జీవితముల మీద ఆశలు వదులుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు గాంధారిని చూసి " అమ్మా ! ఇక లే ! చని పోయిన వారికి దహనక్రియలు జరిపించాలి " అని పలికాడు. గాంధారి పైకి లేచింది ఆమెను పట్టుకుని శ్రీకృష్ణుడు నడిపిస్తూ " అమ్మా ! నీకుమారుడు సుయోధనుడు, దుశ్శాసనుడు చేసిన దుర్మార్గపు పనులు నీవు ఎరుగవా ! నీ కుమారుడి దుష్కృత్యములు నేను కానీ, భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ , కడకు నీ భర్త ధృతరాష్ట్రుడు కాని మాన్పలేక పోయాము కదమ్మా ! వారి దుర్నయముల వలన కదమ్మా ! ఇంతటి చేటు దాపురించింది. అందుకు నన్ను నిందించి ప్రయోజనమేమిటి ! ఇక నైనా శోకం మాను. ఇలా శోకిస్తుంటే నీ శోకం రెండింతలు ఔతుంది. నీవు వీరమాతవు. మహావీరులను పుత్రులుగా పొందావు. వారి మరణానికి శోకించతగదు " అన్నాడు. ఈ మాటలకు గాంధారి చింతించడం మానుకుంది.

ధృతరాష్ట్ర ధర్మరాజులు ఉత్తర క్రియలు గురించి చర్చించుట

[మార్చు]

ధృతరాష్ట్రుడు ధర్మరాజును చూసి " కుమారా ! ఇరు పక్షముల లోని సైన్యముల లెక్క నీకు తెలుసు కదా ! ఇరుపక్షములలో సైన్యం ఎంత మంది మరణించారో చెప్పగలవా ! " అని అడిగాడు. ధర్మరాజు సమాధానంగా " తండ్రీ ! మన సైన్యంలో ఉత్తమ క్షత్రియులు 76 కోట్ల ఇరవై వేల మంది. మిగిలిన సైనికులు 24 వేల మంది యుద్ధంలో చని పోయారు. వీరందరూ యుద్ధంలో చనిపోయారు కనుక వీరస్వర్గం అలంకరించాడు. కాని కొంత మంది భయపడి పారిపోయారు. వారు గుహ్యకలోకానికి వెళతారు. కాని యుద్ధంలో ఏవిధంగా మరణించినా నరకలోకముకు వెళ్ళరు " అన్నాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడు " ధర్మజా ! యుద్ధంలో చనిపోయిన వారిలో అనాధలు అయిన వారు ఉన్నారు కదా ! వారికి అగ్నికార్యం చెయ్యడంలో తప్పేమి లేదు కదా ! " అని అడిగాడు. ధర్మరాజు " మహారాజా ! ఈ యుద్ధమే ఒక మహా యజ్ఞం. ఈ మహా యజ్ఞంలో ఆహుతి అయిన వారందరూ అగ్నికార్యముకు అర్హులే ! ఇక్కడ మరణించిన అనాధలకు అగ్నికార్యం నెరవేర్చి ఉత్తమ గతులు ప్రాప్తించేలా చేద్దాము " అని పలికాడు.

యోధులకు దహన క్రియలు జరిపించుట

[మార్చు]

ధర్మరాజు వెంటనే విదురుడు, సంజయుడు, తన పురోహితుడు ధౌమ్యుడిని పిలిపించి భరతవంశ సంజాతకులకు తప్ప మిగిలిన వారికి దహనసంస్కారం చెయ్యమని చెప్పి అందుకు కావలసిన చందనము, అగరు, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యములను తదితర సామగ్రిని కావలసిన మనుషులను అప్పగించాడు. తరువాత ధర్మరాజు బ్రాహ్మణ సంఘాల తోడ్పాటుతో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శల్య మొదలైన వారికీ అభిమన్య, ఘటోత్కచ, విరాట, దుష్టకేతు వంటి ప్రముఖులకు నానా దేశాధీశులకు చితులు పేర్పించి అగ్ని కార్యం నిర్వహించాడు. అనాథలుగా మిగిలిన రాజుల కళేబరములకు వేలకు వేలుగా ప్రోగులుగా పెట్టించి సామూహిక దహన క్రియ జరిపించాడు. అందుకు కావలసిన కట్టెలు దొరకక విరిగిన రథములు, బాణములు, ధనస్సు మొదలైనవి సేకరించి దహన క్రియ నిర్వహించాడు. తరువాత ధర్మరాజు ధృతరాష్ట్రుడు అంతఃపుర కాంతలతో కలిసి స్నానములు ఆచరించారు. కౌరవులందరికీ ధృతరాష్ట్రుడు తర్పణములు విడిచాడు.

కుంతీ దేవి కర్ణుడు తన కుమారుడని చెప్పుట

[మార్చు]

ఆ సమయంలో కుంతీ దేవి కన్నీటితో అందరూ వింటుండగా " అయ్యా ! అందరూ వినండి. కౌరవులకు పెట్టని కోటగా విరాజిల్లిన కర్ణుడు రాధేయుడిగా లోకానికి తెలిసి ప్రసిద్ధి చెందిన కర్ణుడు నిజంగా రాధేయుడు కాదు. కర్ణుడు నా కుమారుడు, కౌంతేయుడు మీకందరికి అగ్రజుడు. నేను కన్యగా ఉన్నప్పుడు మంత్ర ప్రభావం వలన భాస్కర ప్రభావంతో సహజ కవచకుండల శోభితుడు కర్ణుడు జన్మించాడు. కనుక మీరు కర్ణుడికి తిలోదకాలు ఇవ్వండి " అని ధర్మరాజుతో చెప్పింది.

ధర్మరాజు కర్ణుడి మరణానికి విలపించుట

[మార్చు]

ఆ మాటలకు ధర్మరాజు వివశుడయ్యాడు. మిగిలిన వారు అమిత దుఃఖముకు లోనయ్యారు. ధర్మరాజు ఎలాగో మాట పెగల్చుకుని " అమ్మా ! కర్ణుడు నీకు జ్యేష్టపుత్రుడు, మాకు అన్నగారు కొంగున నిప్పు కట్టుకున్న చందాన ఈ నిజం ఇంత కాలం ఎలా దాచావమ్మా ! ఈ లోకములో ఒక్క అర్జునుడు తప్ప కర్ణుడిని గెలువ గలవారెవ్వరు. అమ్మా ! కర్ణుడిని తొలి చూలిగా ఎందుకు కన్నావమ్మా ! నీకు దుర్వాసుడు ఇచ్చిన వరం మా పట్ల శాపంగా పరిణమించి మాకు అంతులేని శోకాన్ని మిగిల్చింది కదమ్మా ! అమ్మా ! అభిమన్యుడు మరణించినప్పుడు కూడా ఇంత దుఃఖం పొందలేదమ్మా ! ద్రుపదుడి కుమారులు, ధృతరాష్ట్రుడి కుమారులు చని పోయినప్పుడు కూడా ఇంతటి వ్యధ చెందలేదు కదమ్మా ! అమ్మా కర్ణుడు మా అన్న అని తెలిసిన ఈ యుద్ధం జరిగేది కాదు ఈ మారణ హోమం జరిగేది కాదు కదమ్మా ! " అని పరి పరి విధముల వాపోయాడు ధర్మరాజు. వెంటనే ధర్మరాజు కర్ణుడి గోత్ర నామాలు చెప్పి తిలోదకాలు ఇచ్చాడు. తరువాత భీమ, అర్జున, నకుల, సహదేవులు కూడా తిలోదకాలతో తర్పణములు వదిలారు. కర్ణుడు కుంతీ కుమారుడు అని తెలియగానే పాండవ, కౌరవ కాంతలలో హాహాకారాలు చెలరేగాయి. ధృతరాష్ట్రుడు కూడా గాంధారితో చేరి కుంతీ దేవితో కలిసి ఉదక కర్మ చేయించాడు. వెంటనే ధర్మరాజు కర్ణుని పట్ల సోదరభావంతో కర్ణుడి భార్యలను అతడి బంధువులను పిలిపించి సముచిత రీతిన గౌరవించి ఓదార్చాడు. వారితో కర్ణుడికి ఉత్తమ లోకప్రాప్తి కొరకు అనేక దానధర్మములు చేయించాడు. తరువాత బంధుమిత్రులు అందరితో కలిసి ధర్మరాజు గంగా నదిని దాటి అక్కడ అనేక దాన ధర్మములు చేయించాడు.

వనరులు

[మార్చు]