అశ్వమేధ పర్వము ప్రథమాశ్వాసము
ప్రధమాశ్వాసం
[మార్చు]భీష్ముని నిష్క్రమణ ధర్మరాజుని మరింత క్షోభకు గురిచేసింది. చిన్నప్పటి నుండి చేరదీసి మంచిబుద్ధులు నేర్పి, మంచిచెడు నేర్పి, తానుతన మరణానికి కారణమని తెలిసునా తనను మన్నించి తాను అడిగిన ధర్మసందేహాలన్నీ ఇసుమంత కూడా విసుగు చూపక ఓర్పుగా తీర్చిన భీష్ముడు ఉత్తరాయాణ పుణ్యకాలము రాగానే తనువు చాలించడం ధర్మరాజును కలచి వేసింది. అతడి శరీరం దుఖఃతో పటుత్వము తప్పిపోయి తూలుతుంది. క్రమంగా శరీరం కింద పడబోతున్న సమయంలో భీముడు పట్టుకుని మెల్లిగా కూర్చోపెట్టాడు. ఇది విన్న ధృతరాష్ట్రుడు ధర్మరాజు దగ్గరగా వచ్చి " ధర్మనందనా ! నీ నీవెదుకు ఇలా చింతిస్తున్నావు. నీవు నీ క్షాత్రధర్మము నెరవేర్చావు. ఇది నీవు చింతించ వలసిన సమయము కాదు. నీవిక నీ తమ్ములతో కలిసి రాజ్యాధికారము చేపట్టు. నేను కాని సుయోధనుడు కాని విదురుని మాటలు చెవి పెట్ట లేదు అందుకే నేనీనాడు పుత్రశోకంతో నిర్ధోషి అయిన గాంధారితో పుత్రశోకము అనుభవిస్తున్నాను. నా కుమారుడు తన తమ్ములతో చేరి హతుడైనాడు. ఇప్పుడు జరిగిన యుద్ధానికి జనక్షయానికి కారణం నేను నా కుమారుడే. ఇందులో నీ తప్పు ఇసుమంత కూడా లేదు. నాయనా ధర్మనందనా నేనూ గాంధారీ ఒంటరి వాళ్ళము అయ్యాము ఇక మాకు దిక్కు నీవే. మాఇద్దరినీ జాగ్రత్తగా చూసుకోవలసిన వాడివి నీవే " అని అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు ఏమీ బదులు పలుక లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! నీవిలా బాధపడినంత మాత్రాన పోయిన వారు తిరిగి రారు కదా ! నీవిలా శోకిస్తుంటే వారి ఆత్మ శాంతించదు కదా ! సుయోధనుడు వీరోచితంగాపోరాడి వీరస్వర్గము పొందారు. వారికొరకు శోకించుట తగదు. భీష్ముడు నీకు అనేక ధర్మసూక్ష్మాలు వివరించాడు కదా ! అవి విన్న తరువాత కూడా నీవిలా శోకించుట తగదు. భీష్ముడే కాదు నారదుడు, వ్యాసుడు చెప్పిన నీతి వాక్యాలు గుర్తుకు తెచ్చుకుని నీవు ఒక మహాయాగానికి కర్తవుకా! దేవతలకు, పితరులకు ప్రీతి కలిగించే విధంగా భక్తితో పూజలు, తర్పణాలు చేయించు. రాజ్యాధికారము చేపట్టి ప్రలను కాపాడు. అతిథి అభ్యాగతులను ఆదరించు. బంధుమిత్రులను ఆదరించు " అని ఓదార్చాడు. అప్పుడు ధర్మరాజు అక్కడే ఉన్న వ్యాసుడి ముఖము వంక చూసి " దేవా ! నీకు నా ఎడల ప్రేమ, దయా ఉన్నాయి కదా. నాయందు దయ ఉంచి నాకు వనవాసముకు అనుజ్ఞ ఇవ్వండి. లేకున్న నాకు నా తాత , భీష్ముడు నా అన్న కర్ణుడు మొదలైన వారిని చంపినపాపానికి నిష్కృతి ఎలా ఉంటుంది. నేను చేసిన మహాపాపలు పోయే మార్గము ఏమిటి? కనుక నాకు వనవాసముకు అనుజ్ఞ ఇవ్వండి " అని ప్రాధేయపడుతూ అడిగాడు.
వ్యాసుడు కోపించుట
[మార్చు]ధర్మరాజు మాటలకు వ్యాసుడు కోపించి " ధర్మనందనా ! ఇప్పటి వరకు నేనూ భీష్ముడు చెప్పిన ధర్మోపదేశాలన్నీ వరదలో కొట్టుకు పోయాయా ! గంగలో కలిసిపోయాయా ! మళ్ళీ మొదటికి వచ్చావు. నీ బుద్ధి ఒప్పుకున్నా లేకున్నా జరిగిన దానికి కర్తవు నీవు కాదు. ఈశ్వరుడే అందుకు కర్త. అతడే మానవాళికి శుభాశుభములు కలిగిస్తుంటాడు. ఇందులో నీ తప్పు ఏమీ లేదు. అయినా నీకు పాపము చేసానని శంఖ ఉంటే యజ్ఞయాగాదులు దానధర్మాలు చేసి పాపములు తొలగించుకో. అంతే కాని వెర్రివాడిలా వనవాసముకు పోతానని అనకు. నీవు అశ్వమేధ యాగము చేసి దానిలో ఘనంగా బ్రాహ్మణులకు దానధర్మములు చేసి వారిని తృప్తిపరచిన నీ దుఃఖం కొంత ఉపశమిస్తుంది " అన్నాడు. ఆమాటలకు ధర్మరాజు మనసు మార్చుకుని వ్యాసుడితో " మహాత్మా ! తమరు చెప్పినట్లే అశ్వమేధ యాగము చేస్తాను. కాని అశ్వమేధయాగ నిర్వహణకు దానధర్మాలు చేయడానికి అత్యధికంగా ధనము కావాలి కదా ! ప్రస్థుతము నా వద్ద అంత ధనము లేదు. జరిన యుద్ధములో సైనికులంతా చనిపోయారు వారి భార్యలు మాత్రమే ఉన్నారు. వారిమీద అధికమైన పన్నులు వేసి వేధించలేను. మామీద ఉన్న అసూయతో సుయోధనుడు దుర్మార్గులైన రాజులందరినీ చేరదీసి ధనమును దుర్వినియోగము చేసి ధనములను భూములను పాడు చేసాడు. ఇప్పుడు ధనాగారములో ధనము లేదు. ప్రస్థుతము ధనము సంపాదించే మార్గమేది లేదు. మీరే ఏదో మార్గము చెప్పి యాగమును జరిపించండి " అని అడిగాడు. వ్యాసుడు ధర్మరాజువంక ఆదరంతో చూసి " ధర్మనందనా ! పూర్వము మరుత్తు అనే మహారాజు యజ్ఞము చేసి మహా ధనరాశులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. బ్రాహ్మణులకు ఆ ధనము మిక్కుటమైంది. వారు ఆధనమును తమకు కావలసినది ఉంచుకుని మిగిలిన ధనమును దాచి పెట్టారు. వారు " ఈ నిధిని ఎవరు కనుగొంటారో వారే దానికి స్వంతదారులు ఔతారు " అని చెప్పి వారు దానికి వారసులను నిర్ణయించారు. ఆ ధనమును ఇంకా ఎవరూ తీసుకొనలేదు నీవు ఆధనమును స్వాధీనపరచుకుని యాగమును నిర్వహించ వచ్చు " అని చెప్పాడు.
మురుత్తు కథ
[మార్చు]ధర్మరాజు వ్యాసుడితో " మహాత్మా ! మరుత్తు ఆ ధనము ఎలా సంపాదించాడు. అది అక్రమసంపాదనా లేక సక్రమ సంపాదనా ? " అని అడిగాడు. వ్యాసుడు " ధర్మనందనా ! నీకు మరుత్తుకథ చెప్తాను అప్పుడే నీ సందేహాలు తీరగలవు. కృతయుగములో మనువుకు ప్రజాని అనే కుంమారుడు ఉండేవాడు. అతడి కుమారుడు క్షుతుడు. క్షుతుని కుమారుడు ఇక్ష్వాకు. ఇక్ష్వాకుకు నూరుగురు కుమారులు. వారిలో పెద్దవాడు వింశుడు. వింశుని కుమారుడు వివంశుడు. వివిశుంతుడికి 15 మంది కుమారులు. వారిలో పెద్ద వాడు ఖనీనేత్రుడు. అతడు అధికమైన బలము శౌర్యము కలవాడు కాని పరమదుర్మార్గుడు. అతడు 14 మంది తమ్ములనుచంపి రాజ్యాధికారము చేజిక్కించుకున్నాడు. ఖనీనేత్రుడు ఎవరినీ నమ్మేవాడు కాదు. ప్రజలను ద్వేషించే వాడు. అతడి ఆగడములను సహించ లేని మంత్రులు అతడి పదావీచ్యుతుడిని చేసి అతడి కుమారుడికి పట్టంకట్టారు. ఖనీనేత్రుడి కుమారుడు ఎంతో దయామయుడు. ధర్మపాటిస్తూ సదా సత్యము పలికే వాడు. అతడు ఉన్నంతా దాన ధర్మములు చేసి చివరకు దరిద్రుడు అయ్యాడు. కోశాగారంలో ధనములేక సైన్యములకు జీతభత్యములు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. సైన్యము క్షీణించింది అది తెలుసుకున్న శత్రురాజులు రాజ్యము మీద దండెత్తివచ్చి అతడిని రాజ్యభ్రష్టుడిని చేసారు. చివరకు అతడు తనవారితో అడవుల పాలయ్యాడు. కాని ఆరాజు ఏ మాత్రం చింతించక నియమ నిష్ఠలతో తపస్సు చేయనారంభించాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగి అతడి తపోఫలముగా అతడి ముందు అపారమైన సైన్యం ఉద్భవించింది. ఆ రాజు ఆసైన్యంతో వెళ్ళి శత్రువులను జయించి తన రాజ్యమును తిరిగి సంపాదించుకున్నాడు. ఆ రాజు ధర్మనిష్ఠతోనూ సత్యవాక్పరిపాలనతో జనరంజకంగా పాలన చేసాడు. అతడు అంగీరసుడిని ఉపద్రష్టగా పెట్టుకుని అనేక యజ్ఞయాగములు చేసాడు. ఆరాజు పేరు కరంధముడు అతడి మనుమడే మరుత్తు. అతడు ధర్మతత్పరుడు, కీర్తిమంతుడు, మహాబలవంతుడు, తేజస్సు కలిగిన వాడు, వేదవేదాంగ పారంగతుడు, విష్ణు సమానమైన వాడు. అతడు అశ్వమేధయాగము చేయతలపెట్టి యాగముకు కావలసిన సామానులను దాచి పెట్టడానికి పెద్ద పెద్ద బంగారు కుండలను తయారు చేయించాడు. ఆ యాగములో బ్రాహ్మణులకు అధికంగా దానములు చేశదూ. ఆయన తృప్తి పడలేదు. బ్రాహ్మణులకు దైనందిక జీవితానికి కావలసిన చెంబులను బిందెలను కూడా బంగారముతో చేయించి దానము చేసాడు. ఆ ధనము అతడికి ఎలా వచ్చిందో చెప్తాను. అతడి తాతైన కరంధముడు అధికంగా యాగములు చేసి సశరీరంగా స్వర్గలోకము చేరాడు. కరంధముడి కుమారుడు కూడా తండ్రి వలెనె ప్రజలను కన్న బిడ్డలవలె పాలించాడు. అతడిపెరే అవిక్షత్తు. అవిక్షత్తు కుమారుడే మరుత్తు.
మరుత్తు బృహస్పతిని యజ్ఞముకు ఉపద్రష్టగా ఆహ్వానించుట
[మార్చు]మరుత్తు ఇంద్రుడిని కూడా లెక్క చేయలేదు. అదిచూసి ఇంద్రుడు అసూయ చెందాడు. మరుత్తు ఒక యజ్ఞము చేయ తలపెట్టి ఆ యజ్ఞముకు ఉపద్రష్టగా బృహస్పతిని ఆహ్వానించినట్లు తెలుసుకున్న ఇంద్రుడు బృహస్పతి చెంతకు వెళ్ళి " మరూత్తు తాను చేయబోవు యజ్ఞముకు మిమ్ము ఆహ్వానించాలని అనుకుంటున్నాడు. దేవగురువైన మీరు ఒక మానవుడు చేయు యజ్ఞానికి ఉపద్రష్టగా వ్యవహరించడం అవమానంకాదా ! కనుక మీరు అతడికి యజ్ఞముకు ఉపద్రష్టగా ఉండాలనుకుంటే నన్ను మరచిపోయి అతడి దగ్గరే ఉండండి. లేకున్న ఇక్కడ ఉండండి " అన్నడు. బృహస్పతి " దేవేంద్రా! నాకు నువ్వే కావాలి. నేను మరొకరికి ఎలా యజ్ఞానికి ఆధ్వర్యం వహించ గలను నేను నిన్ను వదలను " అన్నాడు. తరువాత మరుత్తు బృహస్పతి వద్దకు వెళ్ళి " మహాత్మా ! నేను అశ్వమేధయాగము చెయ్యాలని అనుకున్నాను. మీరు దానికి ఉపద్రష్టగా ఉండి యజ్ఞాన్ని నిర్వహించండి. తమరు అంగీకరిస్తారని నేను అన్నీ ఏర్పాట్లు చేసాను " అని అడిగాడు. బృహస్పతి మరుత్తుతో " మరుత్తూ ! నేను రాలేను దానికి ఒక కారణం ఉంది. అదే సమయంలో ఇంద్రుడు ఒక యజ్ఞము చేయ తలపెట్టాడు. దానికి నేను ఉపద్రష్టగా ఉండి యజ్ఞ నిర్వహణ చేయాలి " అన్నాడు. మరుత్తు " మహత్మా ! అలా అంటే ఎలా. మీ తండ్రిగారు మా తాతగారైన కరంధముడికి మీ తండ్రిగారైన అంగీరసుడు ఉపద్రష్టగా ఉండి ! అనేక యజ్ఞయాగాలు చేయించాడు. అలాగే మీరు కూడా ఉపద్రష్టగా ఉండి ఎలాగైనా నేను చేయతలపెట్టిన యజ్ఞాన్ని నిర్విజ్ఞంగా జరిగేలా చూడండి " అని అర్ధించాడు. అందుకు బృహస్పతి " మరుత్తు మహారాజా ! నేను దేవతలకు ఉపద్రష్టగా ఉండి యజ్ఞము చేయిస్తాను. కనుక మానవుడివి అయిన నీకు ఉపద్రష్టగా ఉండ లేను. కనుక నీవు వేరు ఉపద్రష్టను నియమించుకుని యజ్ఞమును నిర్వహించండి " అని చెప్పాడు. ఇక మరుత్తు ఏమీ మాట్లాడ లేక అవమానభారంతో వెనుదిరిగాడు. మార్గమధ్యంలో నారదుడు కనిపించి " మరుత్తు మహారాజా ! ఎక్కడి నుండి వస్తున్నావు ఏ పనిమీద వెడుతున్నావు. అని అడిగాడు. మరుత్తు " నారదమహర్షీ ! నేను తలపెట్టిన అశ్వమేధయాగానికి ఉపద్రష్టగా ఉండమని అడగడానికి బృహస్పతి వద్దకు వెళ్ళి అర్ధించాను అందుకు అతడు తాను దేవతలకు ఉపద్రష్టగా ఉండి యజ్ఞ నిర్వహణ చేస్తుంటానని అందువలన మానవుడైన నాకు ఉపద్రష్టగా ఉండ లేనని నిరాకరించాడు. నేను అవమాన భారంతో తిరిగి వెడుతున్నాను. ఇంత అవమానం మోస్తూ బ్రతికి ఉండడం ఎందుకు ? " అని చెప్పాడు. నారదుడు " మరుత్తు మహారాజా ! బృహస్పతి కాకుంటే మరొకరు దొరకరా ! అంగీరసుడి చిన్న కుమారుడైన సంవర్తనుడిని అతడి అన్న అయిన బృహస్పతి అవమానించి ఇంటి నుండి తరిమి వేయగా అతడి విరాగి అయి దిగంబరంగా అడవుల వెంట తిరుగుతున్నాడు. నీవు ఎలాగైనా అతడిని అర్ధించి నీ యజ్ఞానికి ఉపద్రష్టగా నియమించుకుని యజ్ఞమును నిర్వహించ వచ్చు " అని సలహా ఇచ్చాడు. మరుత్తు " నారదా ! సరి అయిన సమయంలో సరి అయిన సలహా ఇచ్చి నన్ను ఆదుకున్నావు. ఆ సంవర్తనుడు ఎక్కడ ఉంటాడు. అతడిని ఎలా తీసుకు రావాలి నాకుచెప్పి తోడ్పడండి " అని అడిగాడు. నారదుడు " మరుత్తు మహారాజా ! సంవర్తనుడు కాశీ పట్టణంలో పిచ్చివాడిలా తిరుగుతుంటాడు. అతడిని గురించి తెలుసు కోవాలంటే నీవు ఒకపని చేయాలి. నీవు ఒక శవమును పెట్టుని కాశీనగర ముఖద్వారంలో నిలబడి ఉండు ఆ శవమును చూసి ఎవరు పారిపోతారో అతడే సంవర్తనుడని తెలుసుకో. నీవు అతడిని వెంబడించి ఏకాంత సమయం చూసి భక్తితో ప్రార్ధించి నీ యాగముకు ఉపద్రష్టగా ఉండమని అడుగు. అతడు తనను గురించి నీకు ఎవరు చెప్పారు అని ఆదిగినప్పుడు. నాకు నారదుడు చెప్పాడు అని చెప్పు. అతడు ఇప్పుడు నారదుడు ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు. నీవు నారదుడు ఈ సంగతి నాకు చెప్పి అగ్నిప్రవేశం చేసాడని చెప్పు " అని చెప్పాడు.
సంవర్తనుడు
[మార్చు]మరుత్తు నారదుడి మాట విని సంవర్తనుడి కొరకు కాశీపట్టణం వెళ్ళాడు. మరుత్తు కాశీపట్టణంలో ఒక శవమును పెట్టుకుని నగరముఖద్వారం వద్ద ఉన్నాడు. అక్కడకు ఒక వెర్రి వాడువచ్చి ఆశవాన్ని చూసి దెబ్బతిన్న జంతువులా పరిగెత్తసాగాడు. అతడే సంవర్తనుడని తెలుసుకున్న మరుత్తు అతడిని వెంబడించి కొంతదూరం వెళ్ళి అతడి ఎదురుగా నిలిచాడు. ఆ వెర్రివాడు మరుత్తు మీద దుమ్మెత్తి పోసి అతడిమీద ఊసి వెర్రివాడిలా ప్రవర్తించాడు. మరుత్తు కోపించక అతడిని వెంబడించాడు. నిర్జనప్రదేశానికి చేరుకున్న ఆ వెర్రివాడు ఒక వటవృక్షం కింద కూర్చున్నాడు. మరుత్తు అతడికి సాష్టాంగ నమస్కారం చేసి వినయంగా నిలిచాడు. సంవర్తనుడు " ఓయీ ! నిన్ను ఎవరు పంపారు. నువ్వు చెప్పింది నిజమైతే నీ కోరిక నెరవేరుతుంది. లేకున్న నీ తల వెయ్యిముక్కలు ఔతుంది " అని అన్నాడు. మరుత్తు " అయ్యా నాకు మీ గురించి నారదుడు చెప్పాడు " అనిచెప్పాడు. సంవర్తనుడు " ఇప్పుడు ఆ నారదుడు ఎక్కడ ఉన్నాడు " అని ఆడిగాడు. మరుత్తు " మహాత్మా ! నన్ను మీవద్దకు వెళ్ళమని చెప్పి నారదుడు అగ్నిప్రవేశం చేసాడు " అని చెప్పాడు. సంవర్తనుడు " ఇప్పుడు నీవు వచ్చిన పని ఏమిటి ? " అని అడిగాడు. మరుత్తు " మహాత్మా ! మీరు నేను చేయబోయే యజ్ఞముకు ఉపద్రష్టగా ఉండి యజ్ఞమును పూర్తిచేయండి " అని అర్ధింస్తూ " మహాత్మా ! నా పేరు మరుత్తు. మా తాత కరంధముడు. మీ తండ్రి అంగీరసుడు మా తండ్రికి ఉపద్రష్టగా ఉండి అనేక యజ్ఞములు చేయించాడు " అని చెప్పాడు. అప్పుడు మరుత్తు ముఖంలోకి ప్రీతితో చూస్తూ సంవర్తనుడు " మరుత్తు మహారాజా ! నీ గురించి నీవు చెప్పావు కదా ! ఇక నా గురించి చెప్తాను విను. నేను మా అన్న బృహస్పతి చేత అవమానించబడి నా ఇంటిని, సంపదను, అన్నను వదిలి ఇలా అడవుల వెంట విరాగిగా తిరుగుతున్నాను. నాబోటి పేదవాడు నీకు ఉపద్రష్టగా ఉంటే నీకు ఏమి గౌరవం ఉంటుంది. కనుక బృహస్పతిని ఉపద్రష్టగా ఉంచుకుని యాగమును పూర్తి చేసుకో. అలా కాకుండా నన్నే ఉపద్రష్టగా చేసుకోవాలంటే నీవు మా అన్నవద్ద అనుమతి తీసుకోవాలి. నాకు మా అన్న అంటే విపరీతమైన గౌరవం ఉంది " అన్నాడు. మరుత్తు " మహాత్మా ! నేను మీ వద్దకు వచ్చే పూర్వమే మీ అన్నను ఉపద్రష్టగా ఉండమని కోరాను. కాని అతడు నన్ను అవమానిస్తూ " దేవతలకు ఉపద్రష్టగా ఉన్న నేను మానవులకు ఉపద్రష్టగా ఉండలేను అని నన్ను తిప్పి పంపాడు. ఇప్పుడు నేను తిరిగి ఎలా బృహస్పతి వద్దకు వెళ్ళగలను " అని అన్నాడు. సంవర్తనుడు " సరే నేను నీకు ఉపద్రష్టగా ఉండి యాగము చేయిస్తాను. కాని ఏకారణంగా నైనా యాగము నీ భగ్నం అయినచో నేను నిన్ను శపించి నీకుకీడు కలిగించగలను. కనుక జాగ్రత్తవహించి యజ్ఞకార్యములు నిర్వహించు. నేను నీకు ఉపద్రష్టగా వ్యవహరిస్తున్నానని నా అన్నకు తెలిస్తే అతడు నిన్ను ద్వేషించి యజ్ఞముకు భంగంకలిగించి నిన్ను నా శాపానికి గురి చేయగలడు. కనుక జాగ్రత్తవహించడం మంచిది " అని చెప్పాడు. మరుత్తు " మహాత్మా ! నాకు నీ కృప లభించింది. నా కిక విచారములేదు. దేవేంద్రుడు, ఇంద్రుడే కాదు పరమేశ్వరుడే అడ్డువచ్చినా నేనిక చలించను. నేను నాప్రయత్నంలో విఫలమైతే సూర్యుడు, చంద్రుడు ఉన్నంత కాలం నాకు పుణ్యలోకాలు ఉండవు " అని శపధం చేసాడు. సంవర్తనుడు " మరుత్తు మహారాజా నేను నిన్ను ఆ మహేంద్రుడి కంటే ధనవంతుడిని చేసి నీ చేత యజ్ఞము చేయిస్తాను " అన్నాడు.
మరుత్తుని ధనవంతుని చేయుట
[మార్చు]సంవర్తనుడు తిరిగి " మరుత్తుమహారాజా నేను నిన్ను మహేశ్వరుని కంటే ధనవంతుని ఎలా చేయగలనని అనుకుంటున్నావు కదా ! నేను చెప్పేది శ్రద్ధగావిను. హిమాలయాలకు ఉత్తరభాగాన ఉన్న ముంజవంతం అనే పర్వతం ఉంటుంది. అక్కడ శివుడు, పార్వతితో కలసి దేవతలు, సిద్ధులు, గరుడులు, గంధర్వులు మొదలైన వారితో చేరి విహరిస్తుంటారు. అక్కడ ఆకలి దప్పులూ రోగాలు మొదలైనవి ఉండవు. అప్పుడు పూలుపండ్లు సమృద్ధిగా ఉంటాయి. ఆ కొండమీద బంగారు కొండలు బంగారు ఇసుక పుష్కలంగా లభిస్తుంది. మనం అక్కడకు పోయి శివపార్వతులను ప్రార్ధించి వారి కరుణతో బంగారురాళ్ళను ఇసుకను తీసుకు వస్తాము. రాజా నీవు సేవకులను సిద్ధం చేసుకో. ఎంత మందిని తీసుకు వెడితే అంత సంపదను తీసుకురావచ్చు " అని చెప్పాడు. సంవర్తనుడిని తీసుకువెళ్ళి మరుత్తు ఆ పర్వతం వద్దకు తీసుకు వెళ్ళి పార్వతీ, పరమేశ్వరులను ప్రార్ధించి ఆయన కరుణతో అంతు లేని సంపదలను తీసుకుని నగరానికి వచ్చారు. ఆవిధంగా మరుత్తు ధనవంతుడై యజ్ఞ వాటిక మొదలు సమస్తసామాగ్రి బంగారముతో చేయించి మహా విభవంతో యజ్ఞం ప్రారంభించాడు.
బృహస్పతి చింత
[మార్చు]ఇది గమనించిన బృహస్పతి తనలో తాను కృంగి కృశించి పోతున్నాడు. దేవేంద్రుడు ఇది గమనించి " గురువర్యా ! దేవతలకు గురువై ఉండి కూడా మీరిలా ఎందుకు శోకిస్తున్నారు. ఇందుకు కారణమైన వారు ఎవరో చెప్పినట్లైన వారిని నేను కఠినంగా శిక్షిస్తాను " అన్నాడు. బృహస్పతి " దేవేంద్రా ! మరుత్తు చేసే యజ్ఞానికి నా విరోధి అయిన సంవర్తనుడు ఉపద్రష్టగా ఉన్నాడు. అతడు ఉపద్రష్టగా ఉండి యజ్ఞము చేయిస్తున్నందుకు నా మనస్సు చాలా చింతిస్తుంది. అతడిని ఎలాగైనా ఉపద్రష్టగా ఉండకుండా నిరోదించాలి " అని చెప్పాడు. ఇంద్రుడు అగ్నిదేవుడిని పిలిచి " మరుత్తు ఒక యజ్ఞము చేస్తున్నాడు. నీవు ఎలాగైనా మరుత్తును ఆ యజ్ఞముకు బృహస్పతిని ఉపద్రష్టగా ఉంచమని నా మాటగా చెప్పి అంగీకరించ చేయాలి " అన్నాడు. అగ్నిదేవుడు అందుకు అంగీకరించి మరుత్తు వద్దకు తన నిజస్వరూపంతో వెళ్ళాడు. మరుత్తు అగ్ని దేవుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించాడు. అగ్నిదేవుడు మరుత్తుతో " మరుత్తు మహారాజా ! నన్ను దేవేంద్రుడు నీ వద్దకు దూతగా పంపాడు. బృహస్పతి నీ యజ్ఞానికి యాజకత్వం వహించడానికి అంగీకరించాడు. అందు వలన నీవు మానుష్యత్వం వీడి దేవత్వం పొంద వచ్చు. కనుక నీవు బృహస్పతిని యాజకుడిగా చేసి యజ్ఞము నిర్వహించాలని ఇంద్రుడు తన మాటగా చెప్పమన్నాడు " అని చెప్పాడు. మరుత్తు " అగ్నిదేవా ! దేవగురువు బృహస్పతికి శతకోటి నమస్కారాలు. నేను చేయబోవు యజ్ఞానికి యాజకుడిగా ఉండమని చెప్పినప్పుడు ఆయన నన్ను మానవుడినని చులకన చేసి నిరాకరించాడు. నేను తరువాత కష్టపడి బృహస్పతి తమ్ముడిని అతిప్రయాసతో నేను చేయబోవు యజ్ఞానికి యాజకుడిగా ఉండడానికి సమ్మతిపచేసి యజ్ఞముకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాను. అందుకు సంవర్తనుడు సమర్ధుడని నమ్ముతున్నాను " అన్నాడు. అగ్నిదేవుడు " మరుత్తూ ! దేవగురువు నీకు యాజకుడిగా ఉంటే నీకు దేవేంద్రుడు అంతు లేని పుణ్యలోక ప్రాప్తి కలిగిస్తాడు కదా ! " అన్నాడు. ఈ మాటలను సావధానంగా విన్న సంవర్తనుడు " అగ్నిదేవా ! నీవింకా ఇలా మాట్లాడుతుంటే నేను నిన్ను నా కంటి చూపుతో కాల్చివేస్తాను " అని ఆగ్రహముతో అన్నాడు. ఆ మాట్లకు అగ్నిదేవుడు భయపడి దేవేంద్రుని వద్దకు తిరిగి వెళ్ళి " దేవేంద్రా ! నీ మాటగా నేను మరుత్తుకు బృహస్పతిని యాజకుడిగా చేసుకొమ్మని చెప్పాను. కాని మరుత్తు ఇప్పటికే బృహస్పతి తమ్ముడైన సంవర్తనుడిని యాజకునిగా నియమించి యజ్ఞానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అందువలన బృహస్పని యాజకుడిగా అంగీకరించ లేనని చెప్పాడు. నే బలవంత పెట్టడానికి ప్రయత్నించడం చూసిన సంవర్తనుడు ఆగ్రహించి నన్ను భస్మం చేస్తానని చెప్పాడు. అందుకని నేను భయపడి నీ వద్దకు తిరిగి వచ్చాను " అని చెప్పాడు. ఇంద్రుడు " అగ్నిదేవా ! నీవు తిరిగి వెళ్ళి మరుత్తును ఎలాగైనా నయానా భయానా బృహస్పతి యాజకత్వానికి ఒప్పించు. అలా ఒప్పు కోక పోతే నా వజ్రాయుధాన్ని ప్రయోగించి అతడిని యమసదనానికి పంపుతానని బెదిరించు " అని చెప్పాడు. అగ్నిదేవుడు " దేవేంద్రా ! నాకు తిరిగి వెళ్ళలంటే భయంగా ఉంది. సంవర్తనుడు నన్ను సంవర్తనుడు భస్మం చేస్తాడని భయపడుతున్నాను. కనుక నా బదులుగా వేరెవరినైనా పంపు " అన్నాడు. ఇంద్రుడు " అగ్నిదేవా ! అందరిని భస్మం చేయగల నిన్ను వేరొకరు భస్మం చేయడమేమిటి ? " అన్నాడు. అగ్ని దేవుడు " దేవేంద్రా ! అలా అంటావేమిటి. నీకు యోగశక్తి తెలియనిదా ! వృత్తాసురుడు నిన్ను ఓడించి నీ సింహాసనం ఆక్రమించిన విధానం మరిచావా. అశ్వినీదేవతలకు సోమపానం లేదని నీవు నిరాకరించినప్పుడు చ్యవనుడు నిన్ను పెట్టిన బాధలు అప్పుడే మరిచావా. చ్యవనుడు నీ వజ్రాయుధాన్ని తిప్పికొట్టలేదా ! నీవు విధిలేకనే కదా అశ్వినీదేవతలకు సోమపాన అర్హత కలిగంచావు . కనుక దేవతలబలం కంటే బ్రాహ్మణుల బలం గొప్పది కదా !" అని చెప్పాడు.
గంధర్వుడైన ధృతరాష్ట్రుడిని దూతగా పంపుట
[మార్చు]ఇంద్రుడు ఇక గత్యతరం లేక అగ్నిదేవుడిని వదిలి ధృతరాష్ట్రుడు అనే గంధర్వుడిని మరుత్తు వద్దకు పంపాడు. ఇంద్రుడు " ధృతరాష్ట్రా ! నీవు మరుత్తు వద్దకు పోయి అతడు చేయు యజ్ఞముకు బృహస్పతిని యాజకుడిగా పెట్టుకొమ్మని నా సందేశంగా చెప్పు. ఈ విషయం నీవు సంవర్తనుడి సమక్షంలో చెప్పు " అని గంధర్వుడైన ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ధృతరాష్ట్రునికి ముందు జరిగిన విషయమేది తెలియదు. ధృతరాష్ట్రుడు మరుత్తు వద్దకు వెళ్లి " ఓరాజా ! నీవు యాగముకు బృహస్పతిని యాజకుడిగా నియమించమని దేవేంద్రుడి ఆజ్ఞ. ఇలా చేస్తే దేంద్రుడు సంతోషిస్తాడు లేకున్న తన వజ్రాయుధాన్ని నీ పై ప్రయోగించగలడు " అనిచెప్పాడు. మరుత్తు " గంధర్వరాజా ! ముందుగా నేను చేయు యజ్ఞానికి యాజకత్వను వహించమని బృహస్పతిని కోరాను. కాని ఆయన నేను మానవుడినని హేళన చేసి యాజకత్వం చేయ నిరాకరించాడు. తరువాత నేను అతిప్రయాస మీద సంవర్తనుడిని యాజకత్వము చేయమని అభర్ధించి ఒప్పించాను. ఇప్పుడు నేను సంవర్తనుడిని కాదని బృహస్పతిని యాజకుడిగా పెట్టుకుంటే నేను మిత్రద్రోహిడుని కాదా ! జరిగిన విషయం ఇంద్రుడికి తెలుసు. సిద్ధులకు సాధ్యులకు తెలుసు " అని అంటూ ఉండగానే ఇంద్రూడు ప్రయోగించిన వజ్రాయుధం మురుత్తువైపు దూసుకుని వచ్చింది. ధృతరాష్ట్రుడు " రాజా ! అటుచూడు వజ్రాయుధం నీ మీదకు దూసుకు వస్తుంది. దానిని ఎలా ఎదుర్కుంటావో నీ ఇష్టం " అన్నాడు. అప్పుడు సంవర్తనుడు చిరునవ్వు నవ్వి " రాజా ! భయపడకు. నా సంస్థంభన విద్యతో వజ్రాయుధాన్ని తిప్పికొడతాను. ఒక్క వజ్రాయుధాన్నే కాదు. దేవతలు ప్రయోగించే ఏ ఆయుధాన్నైనా నేను నా సంస్థంభన విద్యతో తిప్పికొట్టగలను " అని సంవర్తనుడు చెప్పాడు. ఇంతలో తన వైపు వస్తున్న వజ్రాయుధాన్ని చూసి " మహాత్మా ! నన్ను ఈ వజ్రాయుధం భారి నుండి రక్షించండి " అని వేడుకున్నాడు. సంవర్తనుడు మహారాజా ! నీవిక వజ్రాయుధాన్ని గురించి మరచి పోయి ఏదైనా వరాన్ని కోరుకో " అన్నాడు. మరుత్తు " మహాత్మా ! మీరుండగా నాకు ఇంద్రుడి వలన భయంలేదు. మీ తపోశక్తితో ఇంద్రుడికి నా మీదున్న కోపమును పోగొట్టి దెవేంద్రుడు దిక్పాలకాది దేవతలతో యజ్ఞానికి విచ్చేసి నేను సమర్పించు హవ్యమును స్వీకరించి నాకు పుణ్యలోకప్రాప్తి కలిగించండి " అని కోరాడు. సంవర్తనుడు నా ఆహ్వానం మీద దేంద్రుడు సోమపానం చేయడానికి వస్తాడు. అతడితో దేవతలందరూ వస్తారు. ఇక నీవు యజ్ఞాన్ని మొదలు పెట్టు " అన్నాడు.
యజ్ఞ పరిసమాప్తి
[మార్చు]సంవర్తనుడు వజ్రాయుధాన్ని అంతదూరంలో ఆపి దానిని తిరిగి ఇంద్రుని వద్దకు తిప్పి పంపాడు. ధృతరాష్ట్రుడిని సగౌరవంగా పంపించాడు. తరువాత సంవర్తనుడు దేవతలను ఆవాహన చేసి ఆహ్వానించాడు. దేవతలు సంవర్తనుడి ఆహ్వానం అందుకుని యజ్ఞానికి విచ్చేసారు. మరుత్తు సంవర్తనుడి ఆజ్ఞమీద దేవేంద్రాది దేవతలను సగౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించాడు. వారికి ఆసనాలు సమర్పించి " చేతులు జోడించి " దేవేంద్రా ! నా ఆహ్వానాన్ని మన్నించి నీవు దేవతలతో చేరి నా గృహముకు విచ్చేసి నా జన్మసఫలం చేసావు. దయాసాగరా నా అందు కోపం మానుకుని కరుణించి నన్ను చల్లగాచూడు " అని అని తిరిగి " దేవేంద్రా ! ఈ మహాత్ముడు బృహస్పతికి స్వయానా తమ్ముడు. మహా తపస్వి. నా అభ్యర్ధన మన్నించి నేను చేస్తున్న యజ్ఞానికి యాజకత్వం వహిస్తున్నాడు " అని చెప్పాడు. దేవేంద్రుడు " మరుత్తు మహారాజా ! నీ వలన నేను ప్రీతి చెందాను. బృహస్పతికి తమ్ముడైన ఈ సంవర్తనుడు మహిమాత్వితుడని చెప్పడంలో సందేహము ఏముంది " అన్నడు. సంవర్తనుడు " దేవేంద్రా ! నేను పిలువగానే యజ్ఞముకు విచ్చేయడం నా తపఃఫలం కాక మరేమిటి ? నీ రాకతో మరుత్తు చేస్తున్న ఈ క్రతువు పుణ్యాలరాశి అయింది. కరుణాతరంగా ! నీ దయ నా మీద ప్రసరింప చేసిన ఈ యజ్ఞము మంత్రలోపం లేకుండా నిర్వహిస్తాను. నీవు దయతో వీక్షించు. నీ రాకతో మరుత్తు పుణ్యలోక అర్హత పొందాడు " అన్నాడు. సంవర్తనుడి ప్రశంశలకు మహదానంద భరితుడైన దేవేంద్రుడు " దేవతలారా ! ఈ యజ్ఞవాటికను ఉదాత్తంగా తీర్చిదిద్దండి. గంధర్వులను అప్సరసలను పిలిచి నృత్యసంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. ఈ యజ్ఞము నిర్విజ్ఞంగా జరిగే ఏర్పాటు చేయండి " అని ఆజ్ఞాపించాడు. సంవర్తనుడు యజ్ఞమును చక్కగా నిర్వహించి దేవతలకు సోమపానం అందించాడు. దేవతలంతా సోమపానం స్వీకరించి సంతుష్టులు అయ్యారు. వారంతా మరుత్తు వీడ్కోలు అందుకుని స్వర్గలోకం చేరారు .
బ్రాహ్మణులు మరుత్తు ఇచ్చిన దానములు
[మార్చు]దేవతలు యజ్ఞముకు వచ్చి సోమరసపానము చేసి వెళ్ళిన తరువాత కూడా యజ్ఞము కొనసాగింది. యాగము పూర్తికాగానే మరుత్తు బ్రాహ్మణులకు అపారంగా దానధర్మాలు చేసారు. అంతే కాక ఆ యజ్ఞ నిర్వహణకు వాడిన బంగారు పాత్రలు కలశములు కూడా బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. తరువాత సంవర్తనుడి ఆజ్ఞ మేరకు జనరంజకంగా పాలన సాగించాడు. కాని బ్రాహ్మణులకు ఒక చిక్కువచ్చి పడింది. వారు దానంగా పొందిన బంగారమును మోసుకు వెళ్ళ లేక వారి జీవనముకు కావలసినంత బంగారము మాత్రం వెంట తీసుకుని మిగిలినది బంగారు కళశలలో భద్రపరచి " ఈ నిధిని భవిష్యత్తులో ఎవరు కనుక్కుంటారో వారికి ఈ నిధి స్వంతం ఔతుంది " అని శాసనం వ్రాసిపెట్టి పొయారు. ధర్మనందనా ! నీవు ఆనిధిని స్వాధీన పరచుకుని అశ్వమేధ యజ్ఞమును నిర్వహించ వచ్చు " అని వ్యాసుడు చెప్పాడు.
శ్రీకృష్ణుడు ధర్మజుని దుఃఖోపశనుడిని చేయుట
[మార్చు]వ్యాసుడు అశ్వమేధ యజ్ఞానికి కావలసిన ధనము సమకూర్చుకునే మార్గం చెప్పినా ధర్మరాజుకు శోకము తగ్గ లేదు. అది చూసి శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! వ్యాసుడు చెప్పిన తరువాత కూడా నీవిలా చింతించ తగదు. ఏపని అయినా నిశ్చింతగా నిర్మలంగా చెయ్యాలి కాని ఇలా చింతించడం తగదు. ఇప్పటివరకు బోధించిన జ్ఞానం ఏమైంది. నీకింకా కామ, క్రోధ, మద, మాత్సర్య, మోహాలు తగ్గినట్లులేదు. ఇక నీ ఆలోచనలు కట్టి పెట్టి యాగనిర్వహణ చేపట్టు. నీ దుఃఖమును ఉపశమించడానికి నీకు నేను ఒక వృత్తాంతం చెప్తాను. వృత్తాసురుడు దేవలోకమును జయించి భూలోకమును కూడా జయించి భూలోకముకు సహజముగా ఉండే వాసనను లాగి వేసాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధమును ఇంద్రుడి మీద ప్రయోగించాడు. అప్పుడు వృత్తాసురుడు భూమిని విడిచి ఆకాశము, వాయువు, జలము, తేజస్సులో ప్రవేశించాడు. వృత్తాసురుడు నీటి నుండి రసమును, అగ్ని నుండి రూపమును, వాయువు నుండి వాసను, ఆకాశము నుండి శబ్ధమును లాగి వేసాడు. అలా పంచభూతముల లోని తన్మాత్రలను తన వశము చేసుకుని ప్రచంఢవిక్రమంతో వృత్తాసురుడు విజృంభించాడు. ఇంద్రుడు తిరిగి తన వజ్రాయుధమును వృత్తాసురుడి మీద ప్రయోగించాడు. వృత్తాసురుడు పంచ భూతములను వదిలి ఇంద్రుడిలో ప్రవేశించాడు. ఆ దెబ్బకు ఇంద్రుడు మూర్ఛితుడయ్యాడు. వశిష్ఠుడు తన మంత్రశక్తితో ఇంద్రుడి మూర్ఛను పోగొట్టాడు. ఇంద్రుడు తనలో ప్రవేశించిన వృత్తాసురుడిని వజ్రాయుధము ప్రయోగించి నాశనం చేసాడు. ఇదంతా రహస్యంగా జరిగినా ఇంద్రుడు దీనిని మునులకు చెప్పాడు. మునులు నాకు చెప్పారు. కనుక ధర్మనందనా ! అంతఃశత్రువులను ఆ విధంగా నిర్మూలించాలి.
మనసును నిర్మలపరచుకునే మార్గం
[మార్చు]శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. వ్యాధులు రెండు విధములు. ఒకటి శారీరకము రెండవది మానసికము. శరీరానికి వాతపిత్త శ్లేష్మములు సమపాళ్ళతో ఉన్నప్పుడే ఆరోగ్యము సమంగా ఉంటుంది. ఏది వికటించినా శరీరం రోగగ్రస్థమౌతుంది. అలాగే మనసు సత్వ, రజో, తామస గుణాలతో ప్రకాశిస్తుంది. త్రిగుణాలను అదుపులో ఉంచినప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేని ఎడల మనసు అస్తవ్యస్థమౌతుంది. శరీరవ్యాధులు మానసికవ్యాధి ఏ ఒక్కటి ఒంటరిగా రావు. ఒక దానితో ఒకటి అనుబంధమై వస్తాయి. శరీర మనసులు వ్యాధిగ్రస్థమైనప్పుడు అది గడ్డుకాలమే. దానినే కర్మానుష్ఠానం అంటారు. దానిని నీవింకా అభ్యాసం చెయ్యలేదు కనుక అది నీకింకాతెలియదు. కనుకనే నీవిలా ప్రవర్తిస్తున్నావు. ప్రస్థుతం నీకు శరీరము, మనసు అశ్వస్థంగా ఉన్నాయి కనుక నీవిలా ప్రవర్తిస్తున్నావు. వాతపిత్త కఫాలు, త్రిగుణాలు చెరి ఒక వైపు లాగుతున్న సమయంలో నీవిక స్వస్థుడివై ఉండ లేవు కదా ! ఏకవస్త్ర అయిన ద్రౌపదిని సభకీడ్చి వలువలు ఊడ్చి అవమానించిన విషయం నీ మనసు నుండి తీసి వెయ్యి, పన్నెండేళ్ళు అడవులలో నీ తమ్ములు భార్యతో కలసి ఇడుములు అనుభవించిన విషయం మనసును నుండి తుడిచిపెట్టు. జటాసురుడు, సైంధవుడు పెట్టిన బాధలు గుర్తుచేసుకోకు, విరాటనగరంలో అనుభవించిన కష్టాలు అవమానాలు మరచిపో, కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడితో యుద్ధము చేయ లేదని అనుకో. అసలు యుద్ధమే జరగలేదనుకో. ఇప్పుడిక యుద్ధము వలన కలిగిన మేలుకాని కీడు కాని నీ మనసులో ఉండవు.
అసలైన యుద్ధము
[మార్చు]శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇంకా ఇలా చెప్పాడు. అసలు అది యుద్ధముకాదు మిధ్య అని ఎందుకు అన్నానంటే నిజమైన యుద్ధము గురించి చెప్తాను విను. కౌరవులు నీ శత్రువులు కాదు నీకు నిజమైన శత్రువు నీ మనసే. నీ మనసు కౌరవులు నీ శత్రువులు అని చెప్పినందు వలన నీవు వారు నీ శత్రువులు అని అనుకుని వారితో యుద్ధం చేసావు. నీకు నిజమైన స్నేహితుడు నీ ఆత్మే. నీ మనస్సే మితృత్వానికి శత్రుత్వానికి కారణం. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే అంతా ప్రశాంతంగా ఉంటుంది. కనుక నీవు నీ అంతఃశత్రువులను జయించి మనసును నీవు ప్రశాంతంగా ఉంచుకుంటే అంతాప్రశాంతంగా ఉంటుంది. అది చేయక నీవు అంతఃశత్రువులను జయించలేక ఇలా మధనపడి దుఃఖించడం వలన ప్రయోజనం ఏమిటి ? ఇక నీవు నీ బుద్ధిని ఉపయోగించి సన్మార్గమున పయనించు. ధర్మనందనా ! మృత్యువు అనేది రెండక్షరములు బ్రహ్మము అనేది మూడక్షరాలు. అలాగే మమ అంటే నేను. నమమ అంటే నేను కాదు. ఈ రెండింటి నడుమ నిత్యము పోరు జరుగుతూనే ఉంటుంది. బ్రహ్మము అంటే పుట్టుక మృత్యువు అంటే చావు. ఈ రెండింటికీ నడుమ కనపడని యుద్ధం నిత్యము జరుగుతూనే ఉంటుంది. పుట్టిన వాడిని ఎలా చంపాలా అని మృత్యువు ఎదురు చూస్తూ ఉంటుంది. మరణించిన వాడిని ఎలా పుట్టించాలా అని బ్రహ్మము ప్రయత్నిస్తుంటాడు. ఆత్మ ఈ రెండింటికి అతీతమైనది . దానికి నాసనము లేదు. ఆత్మకు శరీరానికి సంబంధం లేదు. ఆత్మ నాశనం లేనిది. శరీరము అశాశ్వతం అయినది. శరీరానికి ఉండే నాశనత్వం, పరిమితత్వము ఆత్మకు లేవు. ఆత్మ అఖండము. ఈ భూమిని పాలించే రాజులకు ఈ భూమి మీద మమకారము లేక దానిని ఇంకా పాలించాలన్న కోరిక వదిలినప్పుడు వారికి ఏ పాపం అంటదు. అలాగే సర్వముత్యజించిన సన్యాసికి అడవులలో కందమూలములను భుజిస్తున్నా ప్రాపంచిక సుఖముల మీద, భోగముల మీద ఆశచావక ఉంటే అతడు అడవులలో ఉండీ ప్రయోజనం లేదు. అలాంటి వాడు సదామృత్యువుకు చేరువలో ఉన్నాడని తెలుసుకో. ధర్మనందనా ! నీవు యుద్ధంలో శత్రువులను జయించావని అనుకుంటున్నావు. కాని అది గెలుపు కాదు. నీవు నీ అంతఃశత్రువులను గెలిచినప్పుడే అది నిజమైన గెలుపు ఔతుంది.
అంతఃశత్రువులు
[మార్చు]అంతశత్రువులలో ప్రధముడు కాముడు. కామము అంటే కోరిక. ఈ ప్రపంచంలో కోరిక లేనిది ఏ కార్యము లేదు. జపము, తపము, వేదవేదాంగ పఠనము, శాస్త్రపఠనం, దానధర్మాలు వంటి సమస్త కర్మలు కామముతో ముడి పడి ఉంటాయి. ఎవరూ నిష్కామంగా కర్మ చెయ్యరు. ఆ కాముడు ఒకసారి " నాకు దగ్గరగా నా ప్రభావంతో ఉన్నవాడు ఎవ్వరూ నన్ను జయించలేరు. నన్ను జయించాలని అనుకుంటే వేదములను తెలుసుకోవాలి. నన్ను వేదజ్ఞానముతో మాత్రమే జయించగలరు. నన్ను హతమార్చాలని ఎవరు నన్ను తలచుకుంటూ ఉంటారో నేను అతడి వెంట అతడికి తెయకనే ఉంటాను. కనుక నన్ను అలాంటి వారు ఎన్నటికీ జయించలేరు. కోరికను జయించాలని ఒకడు తపస్సు చేస్తాడు. కోరికలను జయించాలని అనుకోవడమూ ఒక కోరికే ఇక నన్ను జయించడమేమిటి ? మోక్షగామికి కూడా మోక్షము కావాలన్న కోరికను నేనే కనుక నన్ను జయించడమన్నది అసాధ్యం " అన్నాడు. కనుక ధర్మనందనా ! ఏపనైనా నేను చెయ్యాలి దీని వలన నాకు లాభంకావాలి అని కోరిక పెట్టుకోకుండా చెయ్యడం, చేసే పనిని అపారమైన శ్రద్ధతో చెయ్యడం, అడవులకు వెళ్ళి తపస్సు చేసే సమయంలో కూడా నాకు మోక్షం కావాలని కోరక లేక తపస్సు చేయడం, చివరకు మోక్షం కావాలన్న కోరిక కూడా లేక ఉండడం ఇలాంటి లక్షణములతో కోరికను జయించ వచ్చు. ఇలా ఉండడం సామాన్య మానవులకు అసాధ్యం కనుక కాముడు తనను ఎవరూ జయించలేరని ప్రకటించు కున్నాడు. ఇక మాటలతో పని లేదు. నీలోని కాముని అంపివేసి నిర్వికారంగా నిష్కామంగా యాగమును నిర్వహంచిన నీకు పుణ్యలోకప్రాప్తి కలుగుతుంది. అప్పుడు కాముడే నీకు సాక్షీగా ఉంటాడు. అయినా ధర్మనందనా ! నీవు ఎంత ఏడ్చినా పోయినవారు తిరిగి రారుకదా ! కనుక వారిని మరచిపో. కలలో కూడా వారినిక తలవకు. వారి కొరకు దుఃఖించడం మాని విరివిగా యజ్ఞయాగాదులు నిర్వహించి ఈ లోకాన్ని మెప్పించు. నీకు పుణ్యలోకప్రాప్తి కలుగుతుంది " అన్నాడు.
ధర్మజుడు ఊరడిల్లుట
[మార్చు]తరువాత వ్యాసుడు, నారదుడు, దేవస్థానుడు తమకు తోచిన హితవచనాలు చెప్పారు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది కూడా తగిన హితవచనాలు పలికారు. ధర్మరాజుకు అప్పుడు దుఃఖోపశమనం కలిగింది. అశ్వమేధయాగము చేయడానికి అంగీకరించి మునులకు వీడ్కోలు పలికి యుద్ధములో బంధుమిత్రులను హతమార్చినదానికి ప్రాయశ్చితం చేసుకోవడానికి కొంతకాలం గంగాతీరాన ఊండాడానికి అనుమతి తీసుకున్నాడు. తరువాత వ్యాసమహామునుకి నమస్కరించి " మహాత్మా మీ దయ వలన నాకు నిధిరహస్యం తెలిసింది. మిమ్ము తోడ్కొని వెళ్ళి నిధిని స్వాధీనపరచుకుని యాగమును నిర్వహిస్తాను " అని చెప్పాడు. తరువాత ధృతరాష్ట్రుడితో కలసి భీష్ముడికి యధావిధిగా అంత్యక్రియలు నిర్వహించారు. తరువాత అనేక దానధర్మాలు చేసారు. కొన్ని రోజులపాటు అక్కడే ఉండి తరువాత ధృతరాష్ట్ర శ్రీకృష్ణాదులతో హస్థినాపురానికి చేరి నిర్మల మనస్కుడై ప్రజా పాలనలో నిమజ్ఞమయ్యాడు. ఈ కథ వీంటున్న జనమేజయుడు భారత కథ అక్కడతో ముగిసింది అనుకుని వైశంపాయనుడిని " మహాత్మా ! ఆ విధంగా ధర్మరాజు ప్రజలను కన్నబిడ్డలవలె పాలిస్తుంటే శ్రీకృష్ణుడు అర్జునుడు ఏమి చేస్తున్నారో వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు భారతకథను కొనసాగించి చెప్పసాగాడు.
శ్రీకృష్ణారుజునులు
[మార్చు]వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! ధర్మరాజు అలా ప్రజారంజకంగా పాలిస్తున్న తరుణంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు విలాసవంతంగా కాలంగడుపుతూ విహారయాత్రలు చేస్తున్నారు. అప్పుడప్పుడూ అర్జునుడు అభిమన్యుడిని గుర్తు చేసుకుని చింతాక్రాంతుడు ఔతున్నాడు. అప్పుడంతా శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓదారుస్తూ వచ్చాడు. మయసభ నిర్మాణం కాగానే జూదం జరిగింది వెంటనే పాండవులు అడవులకు వెళ్ళారు. ఇప్పుడు పాండవులు రాజ్యాధికారం పొందారు కనుక ఇప్పుడు మయసభను తనివి తీరా చూడడానికి శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి మయసభను చూడడానికి వెళ్ళి మయసభను అణువణువునా చూసి ఆనందించారు. ఒకరోజు శ్రీ కృష్ణుడు అర్జునుడితో " అర్జునా ! భీముని బలపరాక్రమంతోనూ నకులసహదేవుల విలువిద్యా కౌశలంతో నీ గాడీవంతో కౌరవులను గెలిచి ధర్మరాజు జనరంజకంగా రాజ్యపాలన చేస్తున్నాడు. మీ వంటి సోదరులు కలిగిన ధర్మరాజు కలిగిన ధర్మరాజు ఎంతటి ధన్యుడోకదా ! అర్జునా నేను ద్వారకను విడిచివచ్చి చాలా రోజులు అయింది. నాకు మా తండ్రి వసుదేవుడిని, మా తల్లి దేవకీదేవిని, నా అన్న బలరాముడిని చూడాలని కోరికగా ఉంది. మనము హస్థినకు పోగానే తగిన సమయము చూసి మీ ధర్మరాజుతో నా ద్వారక ప్రయాణం గురించి చెప్పు. మీ అన్న అనుమతి లేనిది నేను వెళ్ళలేను. ధర్మజుడు చెప్పినది వినడమే నా వ్రతము. తగిన సమయము చూసి ధర్మజుడి అనుమతి తీసుకుని ద్వారకకు వెడతాను " అని అన్నాడు. అర్జునుడు " అలాగే బావా. నేను తగిన సమయము చూసి అన్న ధర్మజుడికి చెప్తాను . కాని నేను నిన్ను ఒకవిషయము అడగాలి " అన్నాడు. శ్రీకృష్ణుడు " అర్జునా ! సందేహమెందుకు అడుగు " అనిన్నాడు. అర్జునుడు " కృష్ణా ! యుద్ధారంభమున నేను విషాదంలో కుంగిపోతూ ఈ యుద్ధము చేయలేనని చెప్పినప్పుడు నీవు నాకు కొన్ని విషయములు చెప్పావు. నేను యుద్ధము కారణంగా ఆ విషయాలను మనసులో నిలుపుకోలేక పోయాను. నాకు ఆ విషయాలు తిరిగి వినాలని ఉండి. చెప్పవా " అని అడిగాడు.
బ్రహ్మవిద్య
[మార్చు]శ్రీకృష్ణుడు ఆమాటలకు పకపకా నవ్వుతూ అర్జునుడిని గట్టిగా హత్తుకుని " అర్జునా నీకు బుద్ధితత్వము బొత్తిగాతెలియదు. శ్రద్ధ అసలేలేదు. ఏపనికైనా ఏకాగ్రత అవసరం. బుద్ధి చేసే కార్యము మీద నిలిపి శ్రద్ధతో చేసిన కార్యము సఫలమౌతుంది " అంటూ సున్నితంగా మందలించాడు. " అర్జునా ! ఆరోజు నేను బ్రహ్మపదమును ఎలా అధిరోహించాలో చెప్పాను. నీవు శ్రద్ధ వహించని కారణంగా అవి నీ బుద్ధిలో నిలుపుకోలేక పోయావు. వాటిని నేను తిరిగి ఎలా చెప్పగలను. కాని నీకు ఆ విషయము అర్ధమయ్యేలా ఒకకథ చెప్తాను శ్రద్ధగా విను . ఒకసారి నా వద్దకు వచ్చిన ఒక బ్రాహ్మణుడిని నేను తత్వజ్ఞానమును ఉపదేశించమని అడిగాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు " కృష్ణా ! నేను ఒకసారి కశ్యపుడు అనే సిద్ధుడిని చూసాను. అతడు మహాజ్ఞాని, ఇంద్రియములను జయించిన వాడు. ఈ సంసారబంధాలను విడిచిన వాడు. అనేక మంది మహాత్ములచేత పూజలందుకున్న వాడు. నేను ఆయన వద్ద శిష్యరికం చేసాను. ఆయన నాకు చేసిన బోధలను నేను నీకు వినిపిస్తాను " అని చెప్పి నాకు వినిపంచాడు. అవి నేను నీకు చెప్తాను విను అర్జునా ! ఆసిద్ధుడు బ్రాహ్మణుడితో " బ్రాహ్మణోత్తమా ! నేను ఎల్లప్పుడు పుణ్యకార్యములే చేసాను. అందుకని నేను ఇహలోకసుఖాలే కాక పరలోకసుఖాలు కూడా అనుభవించాను. కాని ఒకేఒక తప్పుతో స్వర్గము చేజారిపోయి స్వర్గభ్రష్టుడిని అయ్యి తిరిగి మానవలోకములో జన్మించాను. కామక్రోధ అహంబావములకు లోనయి అనేకజన్మలు ఎత్తుతూనే ఉన్నాను. ఈ జన్మలలో నాకు ఎంతోమంది తల్లులు, తండ్రులు, సోదరులు, సోదరీమణులు, బంధువులు, మిత్రులు, శత్రువులు కలిసారు విడిపోయారు. ఎన్నో జాతులలో పుట్టాను. ఎంతో నరకబాధలు అనుభవించాను. ఎన్నో కష్టములు సుఖములు అనుభవించాను. ఎంతో శ్రమ, బాధలు అనుభవించాను. ఎంతమంది చేత మర్ధించబడ్డాను. ఎంతోమంది చేత చంపబడ్డాను ఎంతోమంది చేత బంధింపబడ్డాను. ఈ జనమరణాలతో విసిగిపోయాను. నాకిప్పుడు జ్ఞానోదయం అయింది. ఇప్పుడు నాకిక ఈ మనుషులతో సంబంధం లేదు. ఇప్పుడు నాకిక సుఖదుఃఖాలతో పని లేదు. ఇక నేనీ బంధములతో చిక్కుకొనక ఈ లోకమును సాక్షీభూతంగా చూస్తూ ఉంటాను. బ్రహ్మస్థితినిపొంది శాశ్వతబ్రహ్మపదమును పొందుతాను. ఇక ఈ జననమరణచక్రంలో ఇరుక్కోను బ్రాహ్మణోత్తమా నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి నిన్ను నా శిష్యుడిగా స్వీకరించాను. నీవు నా దగ్గర ఏమేమి నేర్చుకోవాలని అనుకుంటున్నావో అది నేను నీకు నేర్పుతాను " అని అన్నాడు సిద్ధుడు.
తత్వజ్ఞానము
[మార్చు]అప్పుడు ఆ బ్రాహ్మణుడు " మహాత్మా ! నాకు పరతత్వము గురించి తెలియజేయండి " అని అడిగాడు. ఆ సిద్ధుడు పరతత్వము గురించి ఇలా చెప్పసాగాడు " ధర్మసాధనకు సాధనమైన ఈ శరీరాన్ని మానవుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరం రోగగ్రస్థం కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. తగిన సమయాలలో మాత్రం సరైయిన ఆహారం తీసుకోవాలి. కాని కొంతమంది మానవులు వేళాపళా లేకుండా కంటికి కనిపించిందంతా ఇష్టం వచ్చినదంతా తింటూ ఉంటారు. మరికొంతమంది పుణ్యం వస్తుందని తలచి కఠోరనియమాలతో శరీరాన్ని శుష్కింప చేస్తుంటారు. ఇవి రెండూ శరీరానికి మంచివి కాదు. మరికొంత మంది సమయము లేదని సరిగా ఉడికీ ఉడకనివి, పుచ్చి పోయినవి, కుళ్ళిపోయినవి అని చూడక తినకూడనివి తాగకూడనివి అని కూడా చూడక దేహానికి చెరుపు చేయాస్తాయని తెలిసీ తింటారు. మరికొంత మంది భుజించిన తరువాత కూడా మొహమాటం కొరకు వెంటవెంటనే తింటూతాగుతూ ఉంటారు. కొంతమంది తిన్నవెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలాంటివి చేసినప్పుడు శరీరంలో పిత్తవాతశ్లేష్మాలు అస్తవ్యస్తంగా మారిపోయి శరీరం వ్యాధిగ్రస్థం ఔతుంది. కొంతమంది తమశరీరానికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. ఉద్రేకాన్ని ప్రదర్శిస్తుంటారు. దాని వలన కూడా శరీరం రోగగ్రస్థం ఔతుంది. మరి కొంత మంది తీరని కోరికలతో సదా సతమతమౌతూ ఉంటారు. అందువలన కూడా శరీరం రోగగ్రస్థం ఔతుంది. అహారనియమాలు, మానసిక భావాల అసమానతలు శరీరాన్ని రోగగస్థం చేయడం కాక ప్రాణాంతకం అయి చివరకు మరణానికి దారితీస్తాయి.
వాత పిత్త శ్లేష్మాలు
[మార్చు]నీకు ఇక శ్లేష్మము గురించి చెప్తాను. శ్లేష్మము ఎక్కువ అవడం ఒక దోషము. అది ఏ అవయవము మీద తన ప్రభావాన్ని చూపితే ఆ అవయవము రోగగ్రస్థమై చివరకు అన్ని అవయవాలకు సోకి చివరకు మరణానికి దారితీస్తుంది. శ్లేష్మము గొంతుకు అడ్డుపడినప్పుడు శ్వాస ఆడక ఎగశ్వాస వచ్చి చివరకు జీవుడు శరీరాన్ని వదిలివేస్తాడు. మానవుడికి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మొత్తం పది ఉన్నాయి. వీటిని మనస్సు నియంత్రిస్తూ ఉంటుంది. బుద్ధివీటికి మంచిచెడు చెప్తుంది. వీటి నియంత్రణకు లోబడి ఇంద్రియములు తమకు కావలసిన సుఖములు అనుభవిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే శరీరంలో శ్లేష్మము అధిక మైనప్పుడు ఇంద్రియములకు అది అడ్డుపడి వాటిని పనిచేయ నివ్వక వ్యాధికి మూలకారణమై మిగిలిన అన్ని అవయవముల పనులు ఆగిపోతాయి. తరువాతది వాతము. వాతము అంటే వాయువు. వాయువు శరీరం అంతా ప్రసరిస్తూ ఉంటుంది. మానవుని ఆహారనియమాల వలన దోషపూరితమైన వాయువు వ్యాధిని కలుగచేస్తుంది. వాత సంబంధిత వ్యాదులు క్రమంగా శరీరం అంతా వ్యాపిస్తాయి. నాలుకను చాపడం, చేతులు కాళ్ళు మడవడం చాపడం వంటి పనులను వాతము నియత్రిస్తుంటుంది. దోషపూరితమైన వాయువు ఆయా అవయవాలను పని చేయకుండా ఆపి వేస్తాయి. ఈ వాయువులు ఏక సమయంలో రెండు మూడు అవయవాలకు వ్యాపిస్తే దానిని సన్నిపాత వాతము అంటారు. అది మరణానికి దారి తీస్తుంది. వాతపిత్తశ్లేష్మములు అస్థవ్యస్థమై ఈ శరీరాన్ని రోగగస్థం చేసి చివరకు మరణానికి గురిచేస్తాయి. ఈ శరీరం నివసించడానికి యోగ్యం కానప్పుడు జీవుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి పోతాడు.
ఊర్ధ్వలోకాలు
[మార్చు]ఈ శరీరాన్ని వదిలిన జీవుడు తాను చేసిన కర్మల శేషాన్ని అనుభవించదనికి తిరిగి వేరు శరీరంలో ప్రవేశిస్తాడు. ఆ జన్మలో తాను పూర్వజన్మలో చేసిన పాపపుణ్య ఫలితంగా కష్టసుఖాలను అనుభవిస్తాడు. పామలు చేసిన కష్టాలు పుణ్యాలు చేసిన సుఖాలు అనుభవిస్తాడు. ఏ బంధనాలు లేని జీవుడు మోక్షమును పొందగలడు. పుణ్యకార్యములు, ధర్మకార్యాములూ చేసిన మానవుడు సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్రమండలం వెడతాడు. అక్కడ వారు చేసిన పుణ్యము సుఖములుగా అనుభవింఛీ పుణ్యము తీరగానే మానవ లోకంలో తిరిగి జన్మిస్తారు. కర్మశేషము లేని వారు మాత్రమే తిరిగిరాని మోక్షపదవిని పొందగలరు. మానవుడు గత జన్మలో చేసిన శుభాశుభములు మరుజన్మకు కారణం ఔతాయి. దానిని తప్పించుకోవడం ఎవరి తరము కాదు. స్త్రీపురుష సమాగమంతో తల్లి గర్భంలో పిండంగా ఏర్పడి శరీరధారి అయిన జీవుడు తొమ్మిది మాసముల గర్భవాసానంతరం ఈ లోకములో ప్రవేశించి తన గతజన్మల కర్మశేషాన్ని అనుభవిస్తాడు. మానవుడు జన్మరాహిత్యం పొందనంతకాలం ఇలా పుడ్తూ చస్తూ తిరిగి పుడుతూ మరలా చస్తూ సుఖదుఃఖాలను అనుభవిస్తూనే ఉంటాడు. మానవుడు మోక్షము పొందనంత కాలం జననమరణ చక్రభ్రమణం నుండి విముక్తి ఉండదు.
ముక్తి
[మార్చు]మోక్షము ఎలా వస్తుందో చెప్తాను. శమము, దమము కలిగి ఉండడం, దానాలు చేయడం, ధర్మ ప్రవర్తన కలిగి ఉండడం, బ్రహ్మచర్యం పాటించడం, పరుల సొమ్మును కాని పరుల భార్యను కాని ఆశించక ఉండడం, నియమ జీవితం గడపడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, శుభ్రంగా ఉండడం, సత్యం పలకడం, పెద్దల ఎడ గురువుల ఎడ గౌరవం కలిగి ఉండడం, దేవతలను పితరులను పూజించడం, సదా శుభకార్యములు చెయ్యడం, ధైర్యంగా ఉండడం, క్రూరత్వం వదిలి పెట్టడంవంటి పుణ్యకార్యాలు చెయ్యాలి. ఆ పుణ్యకార్యాలను ఆధారం చేసుకుని మోక్షసాధనకు ప్రయత్నించాలి. ధర్మాచరణ అత్యంత ముఖ్యమైనది. ధర్మాచరణ గురువుల వద్ద పెద్దల వద్ద అభ్యసించాలి. గురువులను పెద్దలను అనుసరిస్తూ వారి హితవచనాలను శాంతవచనాలను వింటూ జీవితం దిద్దికుంటూ ధర్మాచరణ పాటిస్తూ అది ఒక వ్రతం మాదిరి పాటించాలి. ఇంద్రియములు నిగ్రహించి శాంతిమయ జీవితం సాగిస్తూ పరబ్రహ్మను అను నిత్యము భజించాలి. అటువాంటి మానవునికి బ్రహ్మమే సముద్రాలు, ఋత్వుక్కు, అగ్ని, యాగము , జలము, మంత్రం అతడు సదాబ్రహ్మము నందు చరిస్తూ ఆనందమయుడై ఉంటాడు. అతడిని కామము కాని మోహము కాని బాధించలేవు. క్రమంగా అతడికి సంసారము అందు విరక్తికలుగుతుంది.
క్షరము అక్షరము
[మార్చు]బ్రహ్మదేవుడు ముందుగా క్షరమును సృష్టించాడు. దానికి అతీతంగా అక్షరతత్వాన్ని సృజించాలి. అక్షరమే అమృతము. ఈ క్షరము అక్షరము జంటతోనే సృష్టియావత్తు ఉద్భవించింది. ఈ సృష్టికి బ్రహ్మ జననమరణాలను సృజించి నిరంతరం జనమరణ చక్రభ్రమణంలో తిప్పుతుంటాడు. ఇలా జనమరణ చక్రభ్రమణం చేస్తున్న మానవుడు తాను చేసిన పుణ్యకార్యముల వలన వివేకవంతుడై సుఖదుఃఖాలు సిరిసంపదలు ఈ దేహము అశాశ్వతమని తెలుసుకుంటాడు. నిరంతరం కర్మలు చెయ్యడం ఒక వ్యాధిగా భావించి కోరికలను మోహములను త్యజించి మోక్షము వైపు పయనిస్తాడు. తనకున్న పాపములను ప్రక్షాళన చేసుకుని మరలా సంసారచక్రంలో పడకుండా జాగ్రత్త వహిస్తాడు. పుట్టుక వ్యాధులు మసలితనము మరణం జీవుని పరిణామాలని తెలుసుకుని వాటి కొరకు ఆరాటపడడం వ్యర్ధం తలచి మోక్షము కొరకు ప్రయత్నిస్తాడు. అప్పుడు అన్ని చింతలను వదిలి పెట్టి ఆలోచనలను కట్టి పెట్టి ఎవరి మీదా ఆధార పడకుండా ఒంటరియై చరిస్తాడు. భయమును వదిలి మనసును అదుపులో ఉంచి కోరికలను, కోపమును ఇంద్రియములను జయిస్తాడు. మానము అవమానము వంటి ధ్వందములను వదిలి వేస్తాడు. సర్వభూతములలో పరమేశ్వరుడిని ధ్యానిస్తూ ఆత్మజ్ఞానం పొందుతాడు. సుఖదుఃఖములను, కష్టసుఖాలను, ప్రేమద్వేషములను వీటిని సమంగా చూసినవాడు, ధర్మమును అధర్మమును, ఆశనిరాశల వంటి ద్వంధములను వదిలివేసిన వాడు, ధర్మార్ధకామములను వాదిలి మోక్షము కొరకు ప్రయత్నించిన వాడు, జరిగినది జరుగుతున్నది జరగబయేది వేటికీ తాను కర్తను కాదని తెలుసుకున్న వాడు మోక్షాపదవికి అర్హుడు. అది పంచభూతాత్మలకు అతీతముగా అతీతంగా ఏఆధారంగా లేక ఉంటుంది. అది నిర్గుణము పంచభూతగుణములకు అతీతంగా ఉంటుంది. ఆ మోక్షపదవికి నిరంతర సాధన అవసరం. మనసు ప్రశాంతంగా ఉంచుకుని సర్వ సంకల్పములను వదిలి నిరంతరసాధన చేతనే మోక్షపదవిని పొందగలరు.
యోగి
[మార్చు]ఇప్పుడిక నీకుయోగి జనముల గురించి చెప్తాను విను. ఆత్మ అతిసూక్ష్మమైనది కనుక దానిని బాహ్యనేత్రములతో చాడలేము. కేవలము జ్ఞాననేత్రముతో మాత్రమే చూడగలము . ఒక్క యోగిమాత్రమే దానిని తెలుసుకోగలడు. ముందుగా యోగి తనశరీరము నుండి జీవాత్మను వేరుచేయడం నేర్చుకుని జీవాత్మను దర్శిస్తాడు. తరువాత తాను పరమాత్మను కూడా చూడగలడు. పరమాత్మ దర్శనం తరువాత ఈ జనమరణచక్రము నుండి విముక్తుడౌతాడు. తరువాత ఆ యోగి రోగములు ముసలినముల చేత బాధింపబడడు. అతడికి సంతోషం దుఃఖములు ఉండవు. అతడు అప్పుడు ఇతరులకు కూడా మోక్ష మార్గమును బోధించడానికి అర్హుడు. యోగి ఈ శరీరం అశాశ్వతం అని తెలుసుకుంటాడు కనుక దేహపోషణకు ముఖ్యత్వం ఇవ్వడు. సదా ఆత్మ దర్శనానికి ప్రయత్నించే ఆ యోగికి భయం ఉండదు. రాగ ద్వేషములు అతడికి సుఖదు:ఖములు కలిగించవు. అటువంటి యోగి వికారములకు లోను కాక ఇంద్ర పదవిని కూడా తుచ్చముగా భావిస్తాడు. సదా అంతర్ముఖుడై ఆత్మదర్శనం చేస్తూ మనస్సును నిశ్చలంగా ఉంచుతాడు. యోగి అయిన వాడు మనసును ఆత్మయందు లగ్నము చేసి నిశ్చలాత్ముడై బ్రహ్మపదమును పొందుతాడు. ఈ బ్రహ్మపదమును సాధారణ నేత్రములతో చూడ లేము. చెవులతో విన లేము . ప్రశాంతమనసుతో మాత్రమే ఆ బ్రహ్మపదమును దర్శించగలము. ఈ పరబ్రహ్మతత్వము అంతటా చేతులు తలలు కలిగి వ్యాపించి ఉంటుంది. సూర్యుడి వలె దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ పరమాత్మను యోగులు మాత్రమే దర్శించగలరు. ఈ శరీరం నుండి జీవాత్మను వేరు చేసి పరమాత్మ వైపు మళ్ళించి పరమాత్మతో అనుసంధానం చేసినప్పుడే పరబ్రహ్మదర్శనం కలుగుతుంది. బ్రహ్మవిద్యా రహస్యసర్వం నీకు చెప్పాను కనుక ఇక నీవు సుఖంగా వెళ్ళ వచ్చు " అని సిద్ధుడు బ్రాహ్మణునికి పరబ్రహ్మ తత్వమును బ్రాహ్మణుడికి బోధించాడు. తనకున్న సంశయములను పోగొట్టుకున్న శిష్యుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. సిద్ధుడుకూడా ఆ ప్రదేశం వదిలి వెళ్ళాడు. అర్జునా విన్నావు కదా ! ఆనాడు యుద్ధ భూమిలో నీకు చెప్పిన విషయాలు ఇప్పుడు బ్రాహ్మణ సిద్ధుల సంభాషణగా నీకు చెప్పాను. ఈ బ్రహ్మ విద్యను శ్రద్ద లేని వారికి నీవు బోధించకూడదు. ఈ బ్రహ్మవిద్యను నేను దేవతలకు బోధించాను. మానవులలో నీకు బోధించాను. ఈ బ్రహ్మవిద్యను నీవు స్త్రీ పురుషబేధము చూడక ఏ జాతి వారికైనా వారి శ్రద్ధను అనుసరించి బోధించవచ్చు. బ్రహ్మవిద్యకు ప్రతి మానవుడూ అర్హుడే. అందరికీ ఈ బ్రహ్మవిద్య అవశ్యమే. ఎవరైతే ప్రాపంచిక సుఖములను వదిలి బ్రహ్మజ్ఞానమును అభ్యసిస్తారో వారు మోక్షపదవికి అర్హులు అనడంలో ఎటువంటి సందేహంలేదు. అర్జునా నేను చెప్పతగినంత చెప్పాను. ఇంతకంటే నీకు వేరెవరూ చెప్ప లేరు " శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మజ్ఞానము గురించి వివరించాడు.