అనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తృతీయాశ్వాసం[మార్చు]

అంపశయ్య మీద ఉన్న భీష్ముడితో ధర్మరాజు " పితామహా ! మనం రోజు చేసే కర్మలలో భక్తి శ్రద్ధలతో చేయవలసిన పనులేవో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నియమ నిష్ఠలను శ్రద్ధతో పాటించాలి. వేదములు అధ్యయనం చేయడం వేదములను అర్ధం చేసుకోవడం అర్ధము చేసుకునన్న దానిని ఇతరులకు నేర్పడము చేయాలి. మనస్సును ఆధీనంలో ఉంచుకోవడం, ఇతరుల నుండి ఏవస్తువును తీసుకొనక పోవడం, తాను చెయ్యవలసిన పనులను భక్తిశ్రద్ధలతో చెయ్యడం, ఇంద్రియములను స్వాధీనంలో ఉంచుకోవడం, ఎల్లప్పుడు సత్యము పలకడం, ఎల్లప్పుడు విద్యను అభ్యసించడం, తనకున్నది పరులకు ఇవ్వడంలో ఆసక్తి కనబరచడం, బ్రహ్మచర్యము పాటించడం, తల్లితండ్రులకు సేవ చెయ్యడం, గురువులకు సేవ చెయ్యడం, ఇతరుల మీద దయకలిగి ఉండడం, గోవులను సంరక్షించడం పైన చెప్పిన పనులన్ని అత్యంత శ్రద్ధతో చేయతగినవి " అని భీష్ముడు చెప్పాడు.

గోదాన విధి[మార్చు]

ధర్మరాజు " పితామహా ! గోదానము ఇవ్వవలసిన విధానం వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ గోదానమహిమ గురించి పూర్వము బృహస్పతి మాంధాతకు చెప్పాడు. ఒక పుణ్యదినము అందు బ్రాహ్మణుల అనుమతి తీసుకుని ఆ రోజంతా ఉపవాసము ఉండి గోవులు ఉన్న మంద వద్దకు పోయి ఒకరోజు ఆ గోశాలలో ఉండి మరునాడు సూర్యోదయమున తాను దానము ఇవ్వదలచిన గోవును పేరు పెట్టి పిలిచి బ్రహ్మదేవుడు చెప్పిన మంత్రము ఈ విధముగా పఠించుతూ " ఈ గోవు నా తల్లి, ఈ ఎద్దు నా తండ్రి, ఈ గోవుగర్భం స్వర్గం, ఈ గోవు నిలిచిన ప్రదేశం పుణ్యలోకం ఇచ్చిన వ్యక్తికి శాశ్వత సుఖసంతోషాలు లభిస్తాయి. ఇక దానము పుచ్చుకునే వాడు విద్యాభ్యాసము చేసే విద్యార్థికాని, వ్రతములు చెయ్యడంలో ఆసక్తి ఉన్న వాడు కాని, ఎటువంటి పాపములు చెయ్యనివాడు కాని, శాంతచిత్తుడు కాని, ఇంద్రుయ నిగ్రహము కలవాడు కాని, కోపము లేనివాడు కాని అయి ఉండవలెను. మహారాజా ! ఆశ్వీజమాసంలో కృష్ణపక్షంలో అష్టమి నుండి మూడు రోజులు దీక్షలో ఉండి గోమూత్రము గోమయము పుచ్చుకుంటే అతడు కోరినకోరికలు సిద్ధిస్తాయి " అని మాంధాతకు చెప్పాడు. కనుక ధర్మనందనా నీవు కూడా పై నియమములు ఆచరించి గోదానము చెయ్యి. పొద్దుననే లేచి కాలకృత్యములు తీర్చుకుని ఉపవాసము ఉండి గోదానము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది. ఇక కపిలవర్ణ గోవును దానం చేస్తే సకలపాపములు నశించగలవు " అని భీష్ముడు చెప్పాడు.

కపిల గోవు విశిష్ఠత[మార్చు]

ధర్మరాజు " పితామహా ! కపిలగోవు విశిష్ఠత తెలపండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము దేవతలకు ఆకలి వేసింది. వారంతా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు వారికి అమృతం ఇచ్చాడు. దేవతలు ఆ అమృతము సేవించారు. ఆ అమృతపు సువాసనల నుండి కామధేనువు ఉద్భవించింది. కామధేనువు నుండి మరి కొన్ని ఆవులు జన్మించాయి. ఆ ఆవులన్ని హిమాలయాల మీద విహరిస్తున్నాయి. ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లిదగ్గర పాలు తాగుతుంది. ఆ పాల నురగ గాలికి ఎగిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడి తల మీద పడింది. పరమశివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరచి ఆ ఆవులను చూసాడు. ఆ ఆవులన్ని ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి. ఆవులన్ని బెదిరి తలోదిక్కుకు పారి పోయాయి. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి " మహేశా ! నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా ! లేగ దూడల నోటి నుండి వచ్చే నురగ కూడా అమృత సమానము కదా ! అది ఎంగిలి ఎలా ఔతుంది ! గోవు పాలు అమృతమైతే వాటి నురగ కూడా అమృతమే కదా ! దీనికి ఆగ్రహిస్తే ఎలా ! వాటిని కరుణించు " అని వేడుకుని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు. పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనముగా చేసుకుని ఆవులను ఆప్రాంతంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే బెదిరి పోయిన ఆవులు తిరిగి వచ్చాయి. శివుడు " బ్రహ్మదేవా ! ఈ గోవులన్ని నా మూడవ కంటిచూపుతో ఎర్రగా అయిపోయాయి. ఇప్పటి నుండి ఇవి అతి శ్రేష్ఠమై నవిగా భావించబడతాయి " అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి కపిలగోవులనబడే ఎర్రటి గోవులు దానం ఇవ్వడం ఆనవాయితి అయింది " అని భీష్ముడు చెప్పాడు.

సౌదాసుడు[మార్చు]

భీష్ముడు " ధర్మనందనా ! ఇక్ష్వాకు కులములో సౌదాసుడు అనేవాడు జన్మించాడు. ఆయన పురోహితుడు వసిష్ఠుడు. ఒక రోజు సౌదాసుడు వశిష్ఠుడిని చూసి " మహాత్మా ! ఈ లోకములో పవిత్రమైనది ఏది ? " ని అడిగాడు. వశిష్ఠుడు " సౌదాసా ! ఆవు పవిత్రమైనది. ఆవు హవిస్సుకు పుట్టినిల్లు. అన్ని జీవులకు గోవు ఆధారము. గోవులు ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది. గోవు ఈ సంసార సాగరాన్ని దాటడానికి పనికి వచ్చే పడవ. స్వర్గలోకమును చేరడానికి నిచ్చెన వంటిది. మానవులు తమ కున్న గోసంపదలో పదింట ఒక దానిని దానంగా ఇవ్వాలి. గోవును ఉదయం స్మరించి నమస్కరించడం అధికమైన పుణ్యం ప్రసాదిస్తుంది. ఆవు పేడ, ఆవు పంచితము పవిత్రమైనవి. కాని ఆవు మాంసము తినడం మహా పాపము. మానవులకు పీడ కలల వలన వచ్చే ఫలితం గోవును స్మరించిన నివారించ బడుతుంది. ఆవు పేడతో ఇల్లు శుభ్రం చెయ్యడం, ఆవు పంచితం ఔషధంగా తీసుకోవడం మంచిది. బ్రాహ్మణులు గోసంపద కాపాడుకుంటూ ఉంటారు. గోదానము వలన అనంతమైన సుఖాలు కలుగుతాయి " అని వశిష్ఠుడు సౌదాసుడికి గోవుల విశిష్ఠత గురించి చెప్పాడు.

యజ్ఞములకు మూలము[మార్చు]

భీష్ముడు " ధర్మనందనా ! ఒకసారి వ్యాసుడి కుమారుడైన శుకుడు గోవుకు సమానమైనది ఈ లోకంలో మరేదీ లేదు. యాగములకు మూలకారణం గోవు. ప్రారంభంలో ఆవులకు కొమ్ములు లేవు. బ్రహ్మదేవుడు " గోవులు పరమపవిత్రములు. యజ్ఞముకు గోవులు మిక్కిలి అవశ్యము. గోవును చూసినంతనే దురితములు తొలగి పోతాయి. ఎవరైతే గోవును పూజిస్తారో వారు స్వర్గసౌఖ్యములు పొందగలరు. కుమారా ! ఆవు ఔషదులకు నిలయము. గోవు పంచితమును ఆవుపాలు, ఆవునెయ్యి, ఆవుపేడతో కలిపి మూడు దినములు సేవించిన సకలరోగములు నశిస్తాయి. తరువాత మూడు దినములు ఉపవాసము చేసి ఆవుగిట్టలతో తొక్కించిన యవలతో కాచిన గంజి సేవించిన తేజోవంతులు ఔతారు. ఈ విధంగా సేవించి దేవతలు రాక్షసులను గెలిచారు. ఆవునెయ్యిని సేవించడం వలన ఉదాత్తుడు ఔతాడు. ఆవు నెయ్యిని దానం చేసిన ఎంతో పుణ్యము వస్తుంది. ప్రతి రోజు ఆచమనం చేసి గోవుల మధ్య గోమతి మంత్రం జపించిన అంతఃకరణ శుద్ధి బాహ్య శుద్ధి ఏర్పడుతుంది. ఈ గోమతి మంత్రమును అగ్ని కార్యము, గోవులసమక్షము, బ్రాహ్మణుల ఎదుట చదివిన కోరిన కోరికలు సిద్ధిస్తాయి. అందు వలన గోవును మించిన వస్తువు ఈ లోకములో లేదు " చెప్పాడు. ధర్మనందనా విన్నావు కదా ! గోవుల మాహాత్మ్యము " అని భీష్ముడు చెప్పాడు.

గోలోకము[మార్చు]

ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! ఈ మూడు లోకములకు బ్రహ్మదేవుడు అధిపతి. బ్రహ్మలోకమును గోలోకము అంటారట ఎందుకు " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము విశ్వకర్మ గొప్ప తపస్సు చేసాడు. అమృత రూపిణి కామరూపి అయిన సురభి అనే కన్యని మానస పుత్రిగా సృష్టించాడు. ఆమెతో పాటు మహా తేజోవంతుడైన ఒక పురుషుడిని కూడా సృష్టించాడు. ఆ పురుషుడు ఆ కన్యను చూసి మోహించి ఆమె కొరకు పరితపించ సాగాడు. అది చూసిన బ్రహ్మ "మార్తోభవ " (నీ పరితాపము ఉపశమించు కాక) అని దీవించాడు. అతడికి మార్తాండుడు అని పేరు పెట్టి అతడికి సురభిని ఇచ్చి వివాహము జరిపించి " మీ రిరువురికి పుట్టిన సంతానం యజ్ఞయాగాదులకు అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి సమకూరుస్తాయి " అని చెప్పాడు. వారిరువురికి గోవులు సంతానంగా జన్మించాయి. ఆ గోవులు కూడా మానవులకు, దేవతలకు కోరినవి ఇస్తూ వారి చేత పూజలు అందు కుంటున్నాయి " అని భీష్ముడు చెప్పాడు.

సురభి మార్తాండుడు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! సురభి మార్తాండులకు కలిగిన సంతానం గురించి వివరించండి " అని అడిగాడు. ధర్మనందనా ! ముందుగా సురభి మార్తాండులకు పదకొండు మంది ఉద్భవించారు. వారే బ్రాహ్మణులకు మూల పురుషులు. వారే ఏకాదశ రుద్రులు. వారి పేర్లు అజపాదుడు, అహిర్బుధ్న్యుడు, త్రయంబకుడు, వృషాకపి, శంభుడు, కాపాలి, రైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు. ఈ ఏకాదశరుద్రులను లోకమంతా పూజించారు. ఏకాదశ రుద్రుల తరువాత గోసమూహం పుట్టింది. ఆ ఆవుల ముఖంలో కొమ్ములలో నాలుకలో ఇంద్రుడు, మలద్వారము మూత్రములో వాయుదేవుడు, మూపురంలో శివుడు, పాదాలలో దేవతలు, కడుపులో అగ్నిదేవుడు, ఆవుపాల పొదుగులో సరస్వతి, ఆవు పేడలో లక్ష్మీదేవి, ఆవు పంచితంలో కీర్తి, రక్తంలో చంద్రుడు కొలువై ఉన్నారు. గోవు హృదయంలో భగుడు అనే దేవత, పాలలో బ్రహ్మదేవుడు, వెంట్రుకలలో అనుష్ఠానములు, తోకలో యమధర్మరాజు, ఆవు కన్నులలో సూర్యుడు, చర్మములో తపస్సు, తేజము అధిష్ఠాన దేవతలుగా ఉన్నారు. ఆవు కాళ్ళలో ఉన్న కీళ్ళలో సిద్ధులు కొలువై ఉన్నారు. సమస్త దేవతలకు ఆలవాలమైన గోవు మాహాత్మ్యము ఏమని వర్ణింపగలము.

సుమిత్రుడు[మార్చు]

సమస్తదేవతలకు ఆలవాలమైన ఆవు గురించి ఈ సందర్భంలో నీకు ఒక ఇతిహాసము చెప్తాను. త్రిశిఖరము అనే కొండ ఉండేది. ఆ కొండప్రాంతంలో భృగువంశంలో పుట్టిన కొంత మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నారు. వారిలో సుమిత్రుడు ఒకడు. ఒకరోజు అంగీరసుడు అనే బ్రాహ్మణుడు గోశర్కర అనే తీగను సుమిత్రుడికి ఇచ్చాడు. సుమిత్రుడు దానిని తన గోవులకు ఆహారంగా ఇచ్చాడు. ఆ ఓషధిని తిన్న ఆవులు ఏపుగా పెరిగి ఆ గోవులకు తామర తంపరగా సంతానం పెరిగింది. అలా ఆ గోవుల సంతతి పెరిగి మందగా ఏర్పడ్డాయి. సుమిత్రుడు ఆ ఆవుల మందను చూసి బాగా మురిసి పోయాడు. ఆ ఆవు దూడలు తల్లుల పాలు త్రాగుతుంటే వాటి నుండి వచ్చే నురగను తాను సేవించసాగాడు. అప్పటి నుండి అతడికి ఫేనుడు చూసి అక్కడే స్నానం చేస్తున్న గోవులు " మీరు ఎవరు ? ఇక్కడ ఏమి చేస్తున్నారు ? మీకీ రూపములు ఎలా వచ్చాయి " అని అడిగాయి. అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న గోవులు " మేము బ్రాహ్మణులకు సేవ చేస్తాము. యజ్ఞములకు, పితృకార్యములకు, అతిథి సత్కారములకు, బ్రాహ్మణులకు ఆహారంగా ఉపయోగపడే పాలు ఇస్తాము. బ్రాహ్మణుల పొలములో పని చేయడానికి మా పిల్లలను పంపుతాము. మేము చేసే మంచి పనుల వలన మాకు గోలోక ప్రాప్తి కలిగింది. కాని మీరు మంచి పని చేసే వారిని చూసి అసూయ చెందుతారు. కనుక మీకు మీ దూడలకు ఈ దుర్గతి పట్టింది " అని పలికాయి. మిగిలిన గోవులు తమ తప్పు తెలుసుకుని తమకు తరుణోపాయము చూపమని కాంతల రూపంలో ఉన్న గోవులను అడిగాయి.

రంతిదేవుని యజ్ఞము[మార్చు]

ఆ గోవులు " రంతిదేవుడు ఒక యజ్ఞము చేస్తున్నాడు. మీరు అక్కడకు వెళ్ళండి. ఆయన మిమ్మల్ని ఆయజ్ఞములో బలి ఇస్తాడు. మీకు గోలోకప్రాప్తి కలుగుతుంది " అని పలికాయి. వెంటనే ఆ ఆవులన్ని రంతిదేవుడి వద్దకు వెళ్ళడానికి సిద్ధం అయ్యాయి. కాని అందులో ఒక గోవు సందేహం వెలిబుచ్చింది. " మనం మన యజమాని సుమిత్రుని అడిగి కదా వెళ్ళాలి అని అంది. కొన్ని ఆవులు " సుమిత్రుడు మనము వెళ్ళడానికి సుమిత్రుడు అనుమతి ఇవ్వడు. కనుక మనం అతడిని చంపుదాము అప్పుడు అతడు కూడా గోలోకముకు వస్తాడు " అన్నాయి. కాని కొన్ని ఆవులు సుమిత్రుడిని చంపలేక పోయాయి. కొన్ని కపిలగోవులు మాత్రం " మేము సుమిత్రుడిని చంపుతాము. దానికి బదులుగా మీరు మాకు ఏమి ఇస్తారు " అని అడిగాయి. మిగిలిన ఆవులు కపిలగోవులతో " ఈ రోజు నుండి అన్ని రంగుల ఆవులలో ఎర్రని గోవులు శ్రేష్టమైనవిగా పరిగణించబడతాయి " అని వరం ఇచ్చాయి. వెంటనే ఆ ఆవులు మారురూపంలో తమ యజమాని సుమిత్రుడి వద్దకు వెళ్ళి " అయ్యా ! ఇప్పటి వరకు మీరు గోపూజ చేసారు. మేము ఎంతో సంతోషించాము. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి " అని అడిగాయి. అందుకు సుమిత్రుడు " నాకు ఇప్పటి వలె ఎప్పటికి ఆవుల అందు భక్తి, శ్రద్ధ ఉండేలా అనుగ్రహించండి " అని కోరుకున్నాడు. ఆ ఆవులు " అలాగే అనుగ్రహిస్తాము మేము గోలోకము వెడుతున్నాము. మీరు కూడా మాతో రండి " అన్నాయి. సుమిత్రుడు " నేను నా గోవులను విడిచి ఎక్కడకు రాను " అన్నాడు. మారు వేషములో ఉన్న గోవులు అతడి శరీరమును తమ కొమ్ములతో ఎత్తి కింద పడవేసాయి. సుమిత్రుడు ప్రాణాలు వదిలాడు. అతడి శరీరం మాత్రం కింద పడింది. ఆత్మమాత్రం గోలోకం పోయింది. అక్కడ ఉన్న గోమాతలు సుమిత్రుడిని ఆదరించి మర్యాదలు చేసి అతడికి జరిగినది చెప్పి నీకు మేలే జరిగింది కాని నిన్నిలా దారుణంగా చంపిన ఎర్రని ఆవులకు మాత్రం ముఖం నల్లగా మాడి పోతుంది " అని శాపం పెట్టాయి.

రంతిదేవుడు[మార్చు]

ఆవులన్నీ రంతిదేవుడి వద్దకు వెళ్ళి " అయ్యా మీరు మమ్ము యజ్ఞములో బలి ఇచ్చి మాకు గోలోక ప్రాప్తి కలుగజేయండి " అని వేడుకున్నాయి. రంతిదేవుడు " అది ఎలాగ చేస్తాను అది పాపము కదా ! ఆ పనిచేసి నేనెలా పాపము మూట కట్టుకుంటాను. నాకు ఉత్తమ గతులు ఎలా ప్రాప్తిస్తాయి " అని అన్నాడు. అయ్యా ఇది మా నిర్ణయం కాదు దేవతల నిర్ణయం మీరు ఆచరించాలి " అన్నాయి. రంతిదేవుడు " అయితే నాది ఒక నిబంధన మీలో ఏ ఒక్క గోవైనా మోహపరవశంతో బలికి అంగీకరించక పోయిన నేను యజ్ఞం ఆపి వేస్తాను " అని అన్నాడు. అందుకు గోవులు అంగీకరించాయి. రంతిదేవుడు " గోవులను వరుసగా బలి ఇచ్చి యజ్ఞంలో హోమం చేసాడు. ఇంతలో ఒక ఆవు తన దూడతో " అయ్యో ఈ కౄరాత్ములు నన్ను చంపడానికి వస్తున్నారు నేను చచ్చి పోతే నీ గతి ఏమిటి ? " అని ఏడ్చింది. వెంటనే రంతిదేవుడు ఆమాటలు విని యజ్ఞము ఆపించాడు. మిగిలిన ఆవులన్నీ బ్రతికి పోయాయి. అప్పటి వరకు బలి ఇచ్చిన గోవులు గోలోకము వెళ్ళాయి. రంతిదేవుడు స్వర్గానికి వెళ్ళాడు. ఇదీ గోవుల మహిమ " అనిచెప్పి " ఇంకా శుకుడికి గోమహిమ గురించి చెప్పిన మాటలు వివరిస్తాను విను. " కుమారా ! గోవులను మొదట బ్రహ్మ సృష్టించాడు. ఈ చరాచర జగత్తుకు మూలాధారము గోవు. దేవతలకు, సిద్ధులకు, సాధ్యులకు గోవు తల్లి వంటిది. బ్రహ్మపదమును కోరు వాడు గోవును మనసుతో కాని, కర్మలతో కాని, వాక్కుతో కాని బాధించకూడదు. ఇది బ్రహ్మ వాక్కు వేదము కూడా గోవులకు పవిత్రత ఆపాదించింది. ఏ గోవును పూజించి దేవతలు మానవుల కంటే గొప్ప వాళ్ళు అయ్యారో అటువంటి గోవుల కంటే పవిత్రమైనది ఈ లోకములో ఏముంది. యజ్ఞ యాగములలో గోవులకు ఉన్న పవిత్రత నీకు తెలిసిందే కదా ! ఉపనిషత్తులన్నీ గో స్వరూపాలే అనే బ్రహ్మదేవుడు చెప్పాడు. గోపూజ పవిత్రమైన యజ్ఞము వంటిది. మానవులు ఎక్కువగా కపిలగోవులను పూజిస్తారు. వాటిని దానంగా ఇస్తారు. దానితో వారి పాపాలన్నీ తొలగి పోతాయి " అని వ్యాసుడు చెప్పాడు.

కపిల గోవు మహిమ[మార్చు]

శుకుడు తన తండ్రి అయిన వ్యాసుడితో " తండ్రి గారూ ! కపిలగోవులకు అంత మాహాత్మ్యము ఎలా వచ్చింది " అని అడిగాడు. వ్యాసుడు " ఒకసారి దేవతల సంఘానికి కనపడకుండా తనను దాచమని అగ్నిదేవుడు గోవులను వేడుకున్నాడు. అలాగే అని గోవులు అగ్నిదేవుడిని దాచి పెట్టాయి. దేవతలు అగ్ని దేవుడిని వెతుకుతూ చివరకు ఆవుల వద్ద ఉన్నాడని తెలుసుకుని " గోవులారా ! అగ్నిదేవుడిని దాచడం లోకములకు మంచిది కాదు. కనుక అగ్నిదేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి " అని అడిగారు. ఆవులు వారిమాట మన్నించి అగ్నిదేవుడు దాగి ఉన్నచోటు చూపాయి. దేవతలు అగ్నిదేవుడితో గోవులకు ఏదైనా వరం ప్రసాదించమని అడిగారు. అగ్నదేవుడు తాను దాగి ఉన్న కారణంగా వాటికి ఎర్రరంగు వస్తుంది అని వరమిచ్చాడు. పైగా ఆవులలో ఎర్రటి ఆవులు శ్రేష్టమైనవని వాటిని పూజించిన వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని చెప్పాడు. కపిలగోవును దానం ఇచ్చిన వాడు పుచ్చుకున్న వాడు కూడా పుణ్యలోకాలకు పోతారని వరమిచ్చాడు.

కపిల గోవు లక్షణములు[మార్చు]

శుకుడు " తండ్రీ ! కపిలగోవు లక్షణము ఏమిటో వివరించండి " అని అడిగాడు. వ్యాసుడు " కుమారా ! సాధారణంగా కపిల గోవులకు చెవులు, ముక్కు, కళ్ళు, కొమ్ములు కపిల వర్ణంలో ఉంటాయి. అలాకాక ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు. అది కపిల గోవు అని పిలువబడుతుంది. ఇక శరీరం అంతా ఎర్రగా ఉంటే ఇక దాని మహిమ చెప్ప వలసిన అవసరం లేదు. కపిల గోవు మీద బరువు వెయ్యరాదు. దానిని హింసించ రాదు. దానిని బలికి ఉపయోగించ రాదు. కపిలగోవును కాలితోకాని చేతితోకాని గోటితోకాని కర్రతోకాని కొట్టిన వాడు నరకానికి పోతాడు. కపిల గోవుకు వేళకు మేత నీరు పెట్టినవాడు సద్గతికి పొందుతాడు. గోవులతో పాటు, బ్రాహ్మణులు, గాయత్రీమాత, వసంతకాలము, సత్యము, బంగారము పుట్టాయని పెద్దలు చెప్తారు. దానము ఇవ్వ తగిన వస్తువులలో ఆవులు, బంగారము, భూమి శ్రేష్టమైనవి అని " వ్యాసుడు తన కుమారుడైన శుకుడికి వివరించాడు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

గోమయము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! గోమయములో లక్ష్మీదేవి ఉంటుందని చెప్తారు నిజమేనా ! " అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో గోవులకు లక్ష్మీదేవికి జరిగిన సంవాదం చెప్తాను. ఒక సారి లక్ష్మీదేవి గోవులమంద లోకి వెళ్ళింది. ఆవులన్నీ లక్ష్మీ దేవిని చూసి " నీవు ఎవరు ? మాలోకి ఎందుకు వచ్చావు ? " అని అడిగాయి. లక్ష్మీదేవి " నేను మీలో ఉండడానికి వచ్చాను " అని చెప్పింది. గోవులు " నీవు చంచలమైన దానివి కనుక మాలో ఉండ తగవు " అన్నాయి. ఆ మాటలకు లక్ష్మీదేవి దుఃఖించి " గోవులారా ! నేను ఇదివరకు రాక్షసుల వద్ద ఉన్నాను. వారి దుష్ప్రవర్తనకు కోపించి దేవతల వద్దకు వెళ్ళాను. కనుక రాక్షసులు చెడిపోయారు. దేవతలు బాగుపడ్డారు. నేను తమవద్ద సదా ఉండాలని మానవులు నాకు పూజలు చేస్తుంటారు. మీరేమో నేను మీ వద్దకు వస్తానంటే వద్దంటున్నారు " అని పలికింది. గోవులు " ఎన్ని చెప్పినా నీవు చంచలమైన దానివి. నిలకడ లేని నిన్ను మాలో చేర్చుకోలేము. నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు " అన్నాయి. లక్ష్మీదేవి " నన్ను మీరిలా అవమానిస్తే నేను ఎక్కడకు పోను. నన్ను ఎవరు రానిస్తారు. అందుకని నేను మీ వద్ద ఉంటాను " అన్నది. గోవులు " లక్ష్మీదేవి ! మా మూత్రము, గోమయము, పవిత్రములు అని వేదములు చెబుతున్నాయి. నీవు వాటిలో నివసించు " అని అన్నాయి. అప్పటి నుండి ఆవు పంచితము, ఆవుపేడ లక్ష్మీదేవికి స్థానములు అయ్యాయి.

కామధేనువు[మార్చు]

ఒకరోజు కామధేనువు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై " నీకు ఏమి వరం కావాలో కోరుకో " అని అడిగాడు. కామధేనువు " బ్రహ్మదేవా ! నేను కోరిన వెంటనే నా వద్దకు వచ్చారు. అంత కంటే నాకు కావలసినది ఏమున్నది " అన్నది కామధేనువు. ఆ మాటలకు బ్రహ్మదేవుడు సంతోషించి " నీ లోకమైన గోలోకము అన్ని లోకముల కంటే పైగా ఉండేలా వరం ఇస్తున్నాను. గోలోకము సత్యలోకం కంటే పైన ఉంటుంది " అని పలికాడు. ధర్మనందనా ! గోవులమహిమ అలాంటిది " అని భీష్ముడు చెప్పాడు.

సువర్ణము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! గోవుల మాహాత్మ్యము గురించి చెప్పారు. కాని సర్వయజ్ఞములలోదానం ఇవ్వతగినది సువర్ణము అని విన్నాను. వేదములలో కూడా సువర్ణదక్షిణేతివై అని చెప్పారు కదా ! అని చెప్పారు కదా ! దానము ఇవ్వ తగిన వస్తువులలో భూమి, సువర్ణము, గోవులు శ్రేష్ఠమైనవి అని తమరు అన్నారు కదా ! మరి సువర్ణము యొక్క విశేషములు చెప్పండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మా తండ్రి చనిపోయిన తరువాత నేను మా తండ్రికి శ్రాద్ధవిధులు చేయడానికి గంగా తీరముకు వెళ్ళాను. నేను నా తల్లి గంగాదేవి సాయంతో శ్రాద్ధవిధులను యధావిధిగా నిర్వర్తించాను. పిండప్రదాన సమయం వచ్చింది. పిండములు పెట్టడానికి ధర్బలు నేలమీద ఉంచాను. వాటిమీద నేను పిండం ఉంచేసమయాన ఉంగరములు కంకణములు కల ఒకచేయి. ఆ పిండముకొరకు చేయిచాచింది. ఆ చేతిని నా తండ్రి శంతనుడిదిగా గుర్తించాను. ఆహా సాక్షాత్తు నా తండ్రి నేను పెట్టే పిండము కొరకు తన చేతినిచాచాడు. ఏమి నా అదృష్టము అని మురుసిపోయాను. కాని నా తండ్రి చేతిలో పిండము పెడితే శాస్త్రం అంగీకరించదు. పిండము దర్భల మీద పెట్టాలి కాని నేరుగా చేతిలో పెట్టడం శాస్త్రవిరుద్ధం. అందుకని నేను పిండం చేతిలోపెట్టక దర్భలమీద పెట్టాను. అంతలో నా తండ్రి చేయి మాయమై నా పితృ, పితామహ, ప్రపితామహులు సాక్షాత్కరించి " రాజా ! నీ తండ్రి అడిగాడు కదా అని చేతిలోపెట్టక పిండం దర్భల మీద పెట్టి ధర్మం నిలబెట్టావు. నీ పిండ ప్రధానంతో మేము చాలా తృప్తి చెందాము. అదీకాక నీవు భూమికి బదులుగా గోవులకు బదులుగా సువర్ణ దానంచేయడం మాకు హితం చేకూర్చినది. ఎందుకంటే సువర్ణము పావనమైనది. సువర్ణము ఇచ్చిన వాడిని పుచ్చుకున్న వాడిని పవిత్రులను చేస్తుంది. కనుక ఇక మీద నువ్వు యజ్ఞములలో గోదానము, భూదానముకు బదులు సువర్ణదానము చెయ్యి " అని పలికి నా పితరులు అంతర్ధానం అయ్యారు. ధర్మనందనా ! ఇది నేను స్వయంగా చూసిన విషయం నీకు చెప్పాను

పరశురాముడు సువర్ణ దానం[మార్చు]

ధర్మనందనా ! ఇరవై ఒక్కమారు దండెత్తి క్షత్రియులను చంపిన అందుకు పరశురాముడు ప్రాయశ్చితము చేయగోరి వాజపేయజ్ఞము చేసాడు. కానీ పరశురామునికి యజ్ఞము చేయడంతో తీరికచిక్కక వశిష్ఠుడు మొదలైన మునుల వద్దకు పోయి తాను చేసిన పాపములు పోవడానికి తగినమార్గము చూపమని అడిగాడు. అందుకు వశిష్ఠుడు " రామా ! సువర్ణము అగ్నితో సమానము. దేవతలుకూడా అగ్నితో సమానము. కనుక సువర్ణదానము చేసిన దేవతలను దానముచేసిన ఫలము వస్తుంది అని వేదములు చెప్తున్నాయి. కనుక నీవు కూడా సువర్ణదానం చేసి నీ పాపములు పటాపంచలు చేసుకో " అన్నాడు.

అగ్నిదేవుడు జంతువుల శాపాలు[మార్చు]

సువర్ణం గురించి బ్రహ్మదేవుడు చెప్పినది చెప్తాను. పార్వతి పరమేశ్వరులు ఒకరిని గురించి ఒకరు తపస్సు చేసి తుదకు వివాహం చేసుకున్నారు. వారి దాంపత్య ఫలితంగా శివుడి తేజస్సు అగ్నిలో నిక్షిప్తం అయింది. ఆ సమయంలో తారకాసురుడు మునులను దేవతలను బాధించసాగాడు. వారు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొర పెట్టుకొనగా బ్రహ్మదేవుడు " దీనికి నేను తగిన ఏర్పాటు చేసాను. మీరు వెళ్ళి అగ్ని దేవుడిని వేడుకోండి " అని చెప్పాడు. దేవతలు మునులు అగ్నిదేవుడి వద్దకు వెళ్ళారు. కాని వారికి అక్కడ అగ్నిదేవుడు కనిపించ లేదు. ఒక కప్ప కనిపించి అగ్నిదేవుడు పాతాళంలో ఉన్నాడని చెప్పింది. తన ఉనికి చెప్పిన కప్ప మీద అగ్నిదేవుడు కోపించి " కప్పల నోటికి రుచి తెలియకుండు కాక " అని శాపం ఇచ్చాడు. కాని దేవతలు తమకు సాయం చేసినందుకు బదులుగా కప్పలకు " ఎండా కాలంలో నీరు దొకక కప్పలు చనిపోయినా వానా కాలంలో తిరిగి జీవం పోసుకుని బెక బెక మంటూ అరుస్తాయి " అని వరం ఇచ్చారు. ఇంతలో అగ్నిదేవుడు కనిపించ కుండా పోయాడు. తిరిగి దేవతలు అగ్నిదేవుడిని వెతుకుతూ వెళ్ళారు. ఒక ఏనుగు తన తోడముతో సైగ చేస్తూ అగ్నిదేవుడు ఉన్నాడని ఒక రావిచెట్టును చూపింది. అగ్ని దేవుడు కోపించి " ఇప్పటి నుండి ఏనుగులకు నాలుక తిరుగబడుతుంది " అని శాపం ఇచ్చి దేవతలకు కనిపింకుండా వెళ్ళి జమ్మిచెట్టులో ప్రవేశించాడు. దేవతలు ఏనుగు చేసిన సాయానికి బదులుగా " నాలుక తిగబడినా మీకు అన్ని రుచులు చక్కగా తెలుస్తాయి " అని వరం ఇచ్చారు. ఇంతలో ఒక చిలుక అగ్నిదేవుడు జమ్మి చెట్టులో ఉన్నాడని దేవతలకు మునులకు చెప్పింది. దేవతలు మునులు అంతా జమ్మి చెట్టును చుట్టు ముట్టారు. అగ్ని దేవుడు చిలుక మీద కోపించి " నన్ను గురించి చెప్పినందుకు మీకు కూడా నాలుక తిరుగబడుతుంది " అని శపించాడు. దేవతలు మునులు తమకు చేసిన సాయానికి బదులుగా చిలుకకు " నాలుక మడతపడినా చిలుకలకు చక్కని పలుకులు అలవడతాయి " అని వరం ఇచ్చారు.

కుమారస్వామి జననము[మార్చు]

ఇక తప్పించుకోలేని అగ్నదేవుడు దేవతలను మునులను చూసి వారు వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. వారు వారికి తారకాసురుడి వలన కలిగిన బాధలు గురించి చెప్పి తారకాసురుడు చనిపోయే మార్గం చెప్పమని చెప్పి " అగ్నిదేవా ! నీవు మా క్షేమం కోరితే మేము నీ మహిమను లోకం అంతా చాటుతాము " అన్నారు. అగ్నిదేవుడు అంగీకరించి తన లోని శివుడి రేతస్సును గంగానదిలో వదిలాడు. అప్పుడు గంగాదేవి గర్భంధరించి ఆ గర్భమును భరించలేక పక్కనే ఉన్న రెల్లుపొదలలో ఆ గర్భాన్ని నిక్షిప్తం చేసింది. అప్పుడు ఆ రెల్లుపొదలలో ఒక బాలుడు జన్మించాడు. ఆరుగురు కృత్తికలు ఆ బాలుడిని పెంచారు. ఆ బిడ్డ నాది అంటే నాది అని అందరూ ఎత్తుకోసాగారు. ఆ బిడ్డ ఆరు ముఖాలతో ఆరుగురు కృత్తికల నుండి పాలుత్రాగాడు. అలా ఆ బాలుడు అగ్నిపుత్రుడు, గంగాదేవి పుత్రుడు, కార్తికేయుడు అనే పేర్లతో ఖ్యాతిపొందాడు. ఆ తరువాత అతడు దేవసేనకు అధిపతి అయి తారకాసురుడిని సంహరించి దేవతలకు మునులకు ఆనందం కలిగించాడు. మహాశివుడు హిరణ్మయుడు. హిరణ్మయమైన శివుడి రేతస్సును గ్రహించి భద్రపరచిన అగ్నిదేవుడు కూడా సువర్ణకాంతులతో ప్రకాశించాడు. బంగారము ఏర్పడిన విధానం ఇదే. అందువలన బంగారముకు జాతరూపము అని పేరు వచ్చింది. బంగారం అంతమహిమ కలది. సువర్ణదానం అందుకే అంత ప్రశస్థం పొందింది " అని వశిష్ఠుడు పరశురాముడికి చెప్పాడు. ఆ మాటలు విన్న పరశు రాముడు సువర్ణ దానాలు చేసాడు. కనుక ధర్మనందనా ! నీవు కూడా మిక్కుటంగా సువర్ణదానం చేసి కీర్తి పొందు " అని భీష్ముడు ధర్మరాజుకు సువర్ణదాన మహిమ గురించి చెప్పాడు.

పితృయజ్ఞము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! పితృయజ్ఞము గురించి నాకు వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! దేవతారాధన కంటే పితృదేవతలను ఆరాధించడం ఎంతో గొప్పది. మనుష్యులకు తమ పితృదేవతలను ఆరాధించడం సర్వశుభములు చేకూరుస్తుంది. ప్రతి అమావాస్య నాడు పితృయజ్ఞము, పిండప్రదానం భక్తిశ్రద్ధలతో చేసిన వాడు నిత్యము పితృదేవతలను ఆరాధించిన ఫలము పొందుతాడు. పితృయజ్ఞము చేయాలో వివరిస్తాను. పాడ్యమి నాడు పితృదేవతలను పూజించిన వాడు అందమైన భార్యను పొందుతాడు. విదియనాడు పితృదేవతలను పూజించిన వాడికి అందమైన కుమార్తెలు జన్మిస్తారు. తదియ, చవితి తిధుల నాడు పితృదేవతల పూజించిన వాడు ధనికుడు ఔతాడు. పంచమినాడు పితృదేవతలను పూజించిన వాడు పుత్రవంతుడు ఔతాడు. షష్ఠి నాడు పితృదేవతల పూజించిన వాడు విద్యావంతుడు ఔతాడు. సప్తమినాడు పితృదేవతల పూజించిన వాడు వ్యవసాయ భూములకు అధిపతి ఔతాడు. అష్టమినాడు పితృదేవతల పూజించిన వాడు వ్యాపారవేత్త ఔతాడు. నవమినాడు పితృదేవతల పూజించినవాడు ఆవుల మందలను పొందుతాడు. దశమినాడు పితృదేవతల పూజించినవాడు లోహసంపదలు పొందుతాడు. ఏకాదశి నాడు పితృదేవతల పూజించినవాడు మంచి కుమారులను పొందుతాడు. ద్వాదశి, త్రయోదశినాడు పూజించినవాడు ధనధాన్యములను పొందుతాడు. చతుర్ధశినాడు పితృదేవతల పూజించినవాడు వీరస్వర్గం పొందుతాడు. పౌర్ణమి అమావాస్యలనాడు పితృదేవతల పూజించినవాడు సకలకోరికలను పొందగలడు.

పితృకార్య విధులు[మార్చు]

ధర్మనందనా ! శ్రాద్ధకర్మ చేయుటకు కృష్ణపక్ష తిధులు, అపహార్ణము మంచివి. కాని పాడ్యమి, దశమి, చతుర్ధశి పితృ కార్యముకు పనికి రావు. పితృ కార్యములో తిలలు, పాయసము, నెయ్యి ఉత్తమము. ఆవుల పాలు, పెరుగు, వెన్న, నెయ్యి శ్రేష్టము. మత్స్యములు, మాంసము తగినంతగా ఉపయోగించిన ఫలితము లభిస్తుంది. పితృదేవతల అర్చనలో గొర్రె మాంసం, ఖడ్గ మృగ మాంసం, గండ మృగ మాంసం, మేక మాంసం, ఒక దాని కంటే ఒకటి మేలైనవి.

నక్షత్రాలు పితృకార్య విధులు[మార్చు]

కృత్తిక నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన శత్రుభయం ఉండదు. రోహిణి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన పుత్రసంతానప్రాప్తి కలుగుతుంది. మృగశిర నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన ఓజస్సు ప్రాప్తిస్తుంది. ఆరుద్ర నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన క్రూరుడౌతాడు. పునర్వసు నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన తన కృషిఫలిస్తుంది. పుష్యమి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన మంచి పుష్టిగా ఉంటారు. ఆశ్లేష నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన వీరకుమారులు జన్మిస్తారు. మఖ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన కులము వర్ధిల్లుతుంది. పూర్వ ఫల్గుణి నక్షత్రము పితృకార్యం నిర్వహించిన సౌభాగ్యవంతులు ఔతారు. ఉత్తర ఫల్గుణి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన సంతానవంతులు ఔతారు. హస్త నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన కార్యసఫలత సిద్ధిస్తుంది. చిత్త నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన 'అందమైన సంతానం కలుగుతుంది. స్వాతి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన వర్తక వాణిజ్యములు వృద్ధి చెందుతాయి. విశాఖ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన సంతాన ప్రాప్తి కలుగుతుంది. అనూరాధ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన రాజ్యాధికారం దక్కుతుంది. జ్యేష్ట నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన రాజపూజితులు ఔతారు. మూల నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. పూర్వాషాఢ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన సకలశోకాలు తొలగి పోతాయి. శ్రవణ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి. ధనిష్ఠ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన రాజ్యాధికారం ప్రాప్తిస్తుంది. శతభిష నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన కార్య సాఫల్యత సిద్ధిస్తుంది. పూర్వాబాధ్ర నక్షత్రము, ఉత్తరాబాధ్ర నక్షత్రములలో పితృకార్యం నిర్వహించిన గోసంపద పెరుగుతుంది. రేవతి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన లోహవృద్ధి కలుగుతుంది. అశ్వని నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన అశ్వసంపదవృద్ధి చెందుతుంది. భరణి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన ఆయుః ప్రమాణం వృద్ధి చెందుతుంది " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

పితృకర్మ బ్రాహ్మణుల యోగ్యత అయోగ్యత[మార్చు]

ధర్మరాజు" పితామహా ! పితృ కార్యములలో పూజించుటకు ఎటువంటి యోగ్యతలు కలిగిన వారు కావలెను " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! దేవతాసంబంధ కార్యములకు మంచి బ్రాహ్మణులు దొరికితే చాలు. మరీ పరీక్షలు అవసరం లేదు. కాని శ్రాద్ధకర్మలకు మాత్రం అర్హులైన బ్రాహ్మణులను మాత్రమే నియమించాలి. శ్రాద్ధకర్మలకు నియోగించబడే బ్రాహ్మణులు ఎటువంటి దుర్గుణములు లేని వారై ఉండాలి. సకల విద్యలను ఎరిగిన వాడై ఉండాలి. పది మంది సరసన భోజనంచేయకలిగిన అర్హత కలిగిన వాడై ఉండాలి. జూదరులు, ఇతరులకు విషప్రాయులు, వేదాధ్యయనము చేయనివాడు, ధనము వడ్డికి ఇచ్చు వాడు, పాటలు పాడి జీవించువాడు, గ్రామాధికారిగా పనిచేస్తూ జీవించువాడు, కుష్ఠురోగి, వ్యాపారి, మద్యము విక్రయించే వాడు, ఖండాంతరాలలో వ్యాపారం చేయువాడు, రాజుగారి దగ్గర పనిచేసేవాడు. కూర్చుని భోజనం చేయడానికి అనర్హులు కనుక వీరు పితృకార్యములలో భోజనం చేయడానికి అనర్హులు. భోజనం చేసే సమయంలో తలపాగా ధరించకూడదు. చెప్పులు వేసుకుని భుజించకూడదు. పితృకార్యములకు తయారు చేసిన వంటకములు నువ్వులు నీళ్ళు చల్లి శుద్ధిచేసిన ఎలాంటి దోషం ఉన్నాపోతుంది. శాంతచిత్తులు, మంచి గుణము శీలము కలవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, అధ్యాపకుడు, దయకల వాడు, జ్ఞాని అయిన వాడు, వ్యాకరణశాస్త్రము, ధర్మశాస్త్రం, పురాణములు, బ్రహ్మజ్ఞానములో నిష్ణాతులు అయిన వారు పంక్తి భోజనముకు అర్హులు. శ్రాద్ధకర్మలకు బ్రాహ్మణుడిని నియోగించే ముందు అతడి యోగ్యత పరీక్షించాలి. ఒకసారి నియోగించిన తరువాత అతడు అయోగ్యుడు అని తేలితే యజమాని పడేబాధ అంతాఇంతా కాదు. పై పద్ధుతులన్నీ సక్రమంగా పాటిస్తూ శ్రాద్ధకర్మ నిర్వర్తించే వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి.

అత్రి మహాముని[మార్చు]

బ్రహ్మమానస పుత్రుడైన అత్రిమహాముని కుమారుడు దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడి కుమారుడు నిమి. నిమి కుమారుడు శ్రీమంతుడు. శ్రీమంతుడు మరణించిన తరువాత అతడికి నిమి శాద్ధ కర్మలు నిర్వర్తిస్తూ తన తాత అయిన అత్రిమహామునిని తలచుకున్నాడు. అప్పుడు అత్రిమహాముని అక్కడకు వచ్చి శ్రాద్ధకర్మలు పర్యవేక్షించ సాగాడు. అప్పుడు శ్రాద్ధకర్మల గురించి తన మనుమడైన నిమికి చెప్తూ " శ్రాద్ధములో బ్రాహ్మణులుగా కూర్చొను వారు పంక్తిభోజనముకు అర్హులై ఉండాలి. బ్రాహ్మణులకు వేసిన దర్భాసనాలు కుడి వైపుకు తిరిగి ఉండాలి. శ్రాద్ధములో తిలలు సమృద్ధిగా ఉండాలి. మంచిదర్భలు సేకరించాలి. దర్భలు పెట్టే సమయంలో వాటి కొనలు దక్షిణం వైపు ఉంచాలి. శ్రాద్ధముకు చేయు వంటకములలో మునగ ఆకు, ఉల్లిపాయ, చెడి పోయిన మాంసము, మలినమైన ఉప్పు, నల్ల జిలకర, కరివేపాకు, ఇంగువ వాడరాదు. పూరి పంటధాన్యము, నేరేడు పండు కూడా శ్రాద్ధముకు పనికి రాదు. శ్రాద్ధముచేసే ప్రదేశములలో కుక్కలు, రజస్వల అయిన స్త్రీలు, వ్యభిచారము చేయు వారు, కడజాతి వారు తిరుగ కూడదు. శ్రాద్ధము జరిగేసమయంలో తుమ్మడం, ఏడవడం చేయకూడదు. శ్రాద్ధకర్మలు ప్రశాంతంగా చేయాలి. శ్రాద్ధకర్మలు ఇలా విధిగా నియమనిష్టలు పాటించాలి.

పితృదేవతలు[మార్చు]

అత్రిమహాముని నిమితో " బ్రహ్మదేవుడు శ్రాద్ధ కర్మలలో ఆర్యముడికి, సోముడికి, అగ్నికి భాగములు ఏర్పరిచాడు. శ్రాద్ధకర్మలలో పితృదేవతలతో పాటు విశ్వదేవతలను అర్చించి వారికి భాగం ఇవ్వాలి. దేవతలలో పూషములైన వారు 60 మందికి సమాన భాగములు ఏర్పరిచారు. కొండలలో, అడవులలో ప్రయాణం చేసే సమయంలో, నదులు దాటే సమయంలో శ్రాద్ధంపెట్టవలసి వస్తే ఈ అరవై మంది దేవతలను తలచిన వారికి శుభం చేకూరుతుంది.

మునులు శ్రాద్ధ కర్మ[మార్చు]

కుమారా ! ఒక సారి కొంత మంది మునులు శ్రాద్ధకర్మలు నిర్వర్తిస్తున్నారు. అందరూ ఒకేసారి శ్రాద్ధకర్మలు నిర్వహించడం వలన ఆ రథార్ధాలను పితృదేవతలు మిక్కుటంగా ఆరగించడం వలన అజీర్తిచేసింది. వారు చంద్రుడి వద్దకు వెళ్ళి తమకు అజీర్తి చేసిందని చెప్పారు. చంద్రుడు వారిని అగ్నిదేవుడి వద్దకు వెళ్ళమని చెప్పాడు. పితృదేవతలు అందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తమకు అజీర్తి చేసినవిషయం చెప్పారు. బ్రహ్మదేవుడు వారికి పక్కనే ఉన్న అగ్ని దేవుడిని చూపి మీకు వచ్చిన అజీర్తిని అగ్నదేవుడు హరిస్తాడు అని చెప్పాడు. అగ్నిదేవుడు పితృదేవతలతో " ఇప్పటి నుండి మీరు మీ ఆహారము తీసుకునే సమయంలో నా ద్వారా తీసుకోండి. అప్పుడు మీరు తీసుకున్న ఆహారపదార్ధములు బాగా జీర్ణం ఔతాయి " అని చెప్పాడు. అప్పటి నుండి పితృదేవతలు తమ పితృభాగాలను అగ్ని ముఖంగా తీసుకోసాగారు. కనుక శ్రాద్ధకాలంలో అగ్నిని అర్చించాలి. అందు వలన పితృదేవతలు సంతృప్తి చెందడమే కాక అగ్నిదేవుడి భయానికి రాక్షసులు ఆఛాయలకు కూడా రారు. కనుక శ్రాద్ధకర్మలలో అగ్నిని అర్చించాలి. అందు వలన పితృదేవతలు కూడా తృపి చెందుతారు. పితృ, పితామహ, ప్రపితామహులను శిష్టమైన ఆచారముతో భక్తితో శ్రద్ధతో అర్చించాలి. ఆ సమయంలో యజ్ఞోపవీతమును అపసవ్యముగా మార్చుకోవాలి. చనిపోయిన పితరులకు పిండప్రధానంతో వారి ప్రేతభావన తొలగిపోయి ఉత్తమగతులు కలుగుతాయి. చనిపోయిన వారికి వారి కొడుకులలో ఒక్కరైనా గయలో పిండప్రదానం చేస్తారని ఆశతో ఎక్కుమంది పుత్రులు కావాలని కోరుకుంటారు. పితరులకు, కన్యాదానము, నల్లటి ఆంబోతును వదలడం ఎక్కువ ప్రీతి పాత్రము " అని అత్రిమహాముని నిమికి చెప్పినట్లు శ్రాద్ధవిధిని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు.

ఉపవాస వ్రతము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ఉపవాసవ్రతమును తపస్సు అని అంటారు కదా ! దాని గురించి నాకు వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మరాజా ! ఆహారము తీసుకోకుండా ఉపవాసము ఉండడం తపస్సు అనిపించుకోదు. అలా ఆహారం తీసుకోకుండా ఉండడం ఆత్మను హింసించడం ఔతుంది. అసలు తపస్సు అంటే నిష్టతో చేసేది. అవి సత్యము పలడం, బ్రహ్మచర్యం, నిత్యము శుచిగా ఉండడం, మౌనంగా ఉండడం, నియమ నిబద్ధంగా జీవితం గడపడం, ఇతరుల మీద దయ కలిగి ఉండడం, ఎదుటి వారి మనసును కాని శరీరం కాని నొప్పించక పోవడం, తనకు ఉన్నదానిలో దానం చెయ్యడం వీటిని తపస్సు అంటారు " అని చెప్పాడు.

దానపరుడు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ఉన్నదాంట్లో ఇతరులకు దానం చేసే వాడు. ఎవరి వద్ద ఉచితంగా ఏమీ తీసుకొననివాడు వీరి గుణములు ఎలాంటివి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు సప్తఋషులకు వృషాదర్భి అనే వానికి జరిగిన సంవాదం వివరిస్తాను. శ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, భరద్వాజుడు, జమదగ్ని, వశిష్ఠుడు సప్తఋషులు. వశిష్ఠుడు భార్య అరుంధతి. ఆమె ఎప్పుడూ భర్తను వెన్నంటి ఉంటుంది. వారందరికి గండఅనే వనిత పరిచర్యలు చేస్తూ ఉంటుంది. ఆమె భర్త పేరు పశు సఖుడు. అతడు కూడా వారికి పరిచర్యలు చేస్తూ ఉండే వాడు. ఆ పది మంది తపసు చేయడంలో ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉండేవారు.

అనావృష్టి సప్తఋషులు[మార్చు]

అలా ఉండగా ఒకసారి భయంకరమైన అనావృష్టి ఏర్పడింది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఎదురైంది. జనములకు ప్రాణాలు రక్షించుకోవడం దుర్లభం అయింది. ఆ సమయంలో కశ్యపుడు మొదలైన ఋషులు ఆహారం కొరకు వెతుకుతున్నారు. శిబిచక్రవర్తి కొడుకు యాజ్యుడు రాజయ్యాడు. అతడు తనకుమారుడు నీలుడు అనే వాడిని యజ్ఞదక్షిణగా ఋత్విక్కులకు ఇచ్చాడు. ఆ నీలుడు కాలంతీరి చనిపోయాడు, వారి పరిచారకులు మొత్తం పదిమంది తమ ఆకలి తీర్చుకోవడానికి ఆ శవం చుట్టూచేరారు. ఆ సమయంలో వృషాదర్భి అనే మహారాజు వేటకువెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఆ రాజు విరివిగా దానధర్మాలు చేసే వాడు. శవాన్ని తినడానికి సన్నద్ధమౌతున్న మునులను చూసి ఆగి " అయ్యా ! మీరందరూ ఆకలితో ఉన్నారు. అందుకే శవాన్ని తినడానికి సిద్ధపడ్డారు. నా వెంట రండి మీకు కావలసిన ఆహారము సమకూరుస్తాను. అంతే కాదు మీకు ధనము, ధాన్యము, బండ్లు, గోవులు, గ్రామములు బహుమతిగా ఇస్తాను " అని అన్నాడు. అది విని సప్తఋషులు " మహారాజా ! మేము ఎవరి వద్దా ఏదీ పుచ్చుకొనము. రాజుల వద్ద చేయిచాచి తీసుకున్నది మాకు విషతుల్యము. మీకు మా గురించి తెలియదు కనుక ఇలా మాట్లాడుతున్నావు " అని అన్నారు.

వృషాదర్భి కృత్తి[మార్చు]

మునుల మాటకు రాజు మనసులో బాధ పడుతూ రాజధానికి వెళ్ళాడు. రాజు కొన్ని కృత్రిమ ఫలాలను తయారు చేయించి వాటిలో బంగారం పెట్టి వాటిని తన మంత్రులకు ఇచ్చి మునులకు ఇమ్మని పంపాడు. మంత్రులు వాటిని తీసుకుని మునుల వద్దకు వెళ్ళి వాటిని మునులకు ఇచ్చారు. వారు వాటిని తీసుకుని అవి బరువుగా ఉండడం గమనించి వాటిని సున్నితంగా తిరస్కరించారు. మంత్రులు తిరిగి వెళ్ళి ఆ విషయం రాజుతో చెప్పారు. అదివిన్న వృషాదర్భికి కోపం వచ్చింది. వెంటనే ఆయన ఒక యజ్ఞము చేసి యజ్ఞము నుండి కృత్తి అనే రాక్షసిని ఆవాహన చేసాడు. హోమంలో నుండి కృత్తి అనే రాక్షసి పుట్టి ఆయన ఎదుట నిలబడి " రాజా ! నాతో వచ్చిన పని ఏమిటి " అని అడిగింది. వృషాదర్భి " నీవు వెళ్ళి కశ్యపుడు మొదలైన ఋషులను ముక్కలు ముక్కలుగా నరికివెయ్యి " అని ఆజ్ఞాపించాడు. కృత్తి వెంటనే సప్తఋషుల వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో మునులు అడవిలోఫలాల కొరకు, కాయల కొరకు అన్వేషిస్తున్నారు. ఆ సమయంలో శునస్సకుడు అనే సన్యాసి వారి వద్దకు వచ్చి నమస్కరించాడు. అతడు కూడా వారితో కలిసి ఆహారం కొరకు అన్వేషించ సాగాడు. వారికి ఏమీ దొక లేదు చివరకు తామర తూండ్లు అయినా తినాలనుకుని కొలను వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన కృత్తి వారికి అడ్డంగా నిలబడింది. మునులు ఆమెతో " నీవు ఎవరు ? నీకు ఇక్కడ ఏమి పని ? అడ్డు తొలగు అన్నారు " అని వారు కొలనులో దిగ బోయారు. కృత్తి " నేను ఎవరిని అయితే ఏమి ఈ కొలనుకు కావలి ఉన్నాను. మీరు దీనిలో దిగడానికి వీలు లేదు " అని పలికింది. మునులు " మాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమీ దొక లేదు. ఈ కొలనులో దిగి ఇక్కడ ఉన్న తామరతూడ్లు తిని ఆకలితీర్చుకోవాలని అనుకున్నాము " అన్నారు. కృత్తి అలా అయితే మీరు మీ పేర్లు చెప్పి కొల్సనులో దిగండి " అన్నది. సప్త ఋషులకు విషయం అర్ధం అయింది. అది ఒక రాక్షసి అని అది తమను సంహరించడానికి వచ్చిందని తెలుసుకున్నారు. అడిగింది కనుక తమ పేర్లను నిర్వచనంతో సహా ఎవరికి అర్ధం కాకుండా చెప్పారు. వారు చెప్పిన పేర్లను అర్ధం చేసుకో లేక కృత్తి దిక్కులు చూస్తుంది. ఇంతలో శునస్సఖుడు తన పేరు చక్కగా అర్ధం అయ్యేలా చెప్పినా కృత్తికి అది అర్ధం కాలేదు. కృత్తి శునస్సఖుడిని " నీ పేరు అర్ధం లేకుండా చెప్పావు. సరిగా చెప్పు " అని గద్దించింది. శునస్సఖుడు " నా పేరు సరిగా చెప్పినా అర్ధం చేసుకోలేక పోయావు ఈ తప్పు నీది కదా ! నీకు ఎలా చెప్పినా అర్ధం కాదు. ఇదిగో ఈ మంత్రదండం నీకు తగిన బుద్ధిచెప్తుంది " అని తన మంత్రదండముతో కృత్తి తలమీద కొట్టాడు. ఆ దెబ్బకు కృత్తి నేలమీద పడి భస్మం అయ్యింది.

మునుల శపధం[మార్చు]

తరువాత మునులు కొలనులో దిగి తామరతూడ్లను తీసుకుని వాటిని నీటిలో శుభ్రం చేసి కొలను పక్కన పెట్టారు. సంధ్యావందనం చేసుకోవడానికి కొలనులో దిగి సంధ్యావందనంచేసి కొలను బయటకు వచ్చిచూసే సరికి తామరతూండ్లు కనిపించ లేదు. వారికి అనుమానం వచ్చి శునశ్శఖుడిని మధ్యవర్తిగా పెట్టుకుని ఈ విధంగా శపధం చేయసాగారు. ముందుగా అత్రిమహర్షి లేచి " నేను కనుక తామర తూండ్లు దొంగిలించి ఉంటే ఆవును తన్నడం వలన, సూర్యుడికి అభిమఖంగా మలమూత్ర విసర్జన చేయడం వలన, వేదములు చదువకూడని రోజులలో వేదాధ్యయనం చేయడం వలన కలుగు పాపములు నాకు కలుగు కాక " అని శపధం చేసాడు. తరువాత వశిష్ఠుడు లేచి " ఈ తామరతూడ్లు దొంగిలింన వాడు వేదాధ్యయనం మానిన పాపం, సన్యాసిగా ఉండి కామకలాపం చేసిన పాపం, కుక్కను వెంట పెట్టుకుని తిరిగిన పాపముల పోతాడు " అని పలికాడు. తరువాత కశ్యపుడు లేచి " అవసరం లేకున్నా మాంసంతినడం, న్యాయసభలో ఒకరి పక్షం వహించడం, దుష్టులకు దానం చెయ్యడం, కట్టుకున్న భార్యతో పట్టపగలు చేరడం, విద్యా వంతులైన బ్రాహ్మణులను లోభబుద్ధితో ఏడిపించడం, సరకు అంతా ఒకేసారి కొని తరువాత లాభముకు అమ్మడం వంటి పాపములు ఈ తామరతూండ్లు దొంగిలించిన వాడికి కలుగు కాక " అని పలికాడు. తరువాత భరద్వాజుడు లేచి " ఈ తామరతూండ్లు దొంగిలించడం ఎట్టిదనిన జ్ఞాతులపట్ల, గోవులపట్ల, స్త్రీలపట్ల ధర్మం విడిచి ప్రవర్తించిన దానితో సమానం. యజ్ఞకుండంలో వేయవలసిన హవిస్సును కంపలలో మండుతున్న అగ్నిలో వేయడం, గురువును కించపరుస్తూ విద్యను అభ్యసించడం " అని పలికాడు. తరువాత జమదగ్ని లేచి " ఈ తామరతూండ్లు దొంగతనం ఎలా జరిగిందంటే రజస్వల అయిన భార్యతో చేరడం, తాగే నీటిలో మలమూత్రములు విసర్జించడం, ఎప్పుడూ పగప్రతీకారంతో రగిలి పోవడం, భార్యసంపాదన మీద జీవించడం ఈ తామరతూండ్లు దొంగిలించడం సమానం. ఇతరులను అతిధులుగా ఆదరించడానికి బదులు తమలోతామే ఒకరిని ఒకరు ఆదరించడంతో, అనవసరంగా పగను పెంచుకోవడం, పాడి ఆవును కొట్టడం వంటి పాపము చేసిన దానికి ఏ పాపం వస్తుందో ఈ తామరతూండ్లు దొంగిలించిన వాడికి వస్తుంది " అని పలికాడు. గౌతముడు లేచి " వేదము చదువుకొని కూడా వేదాధ్యయనం చేయకపోవడం, రోజూ అగ్ని ఆరాధన చేయక పోవడం, మద్యం విక్రయించడం, వర్ణసంకరం చేసి శూద్రస్త్రీని పెళ్ళి చేసుకోవడం మొదలైన పాపములు ఈ తామరతూండ్లు దొంగిలించిన వాడికి సంక్రమిస్తుంది " అని గౌతముడు చెప్పాడు. తరువాత విశ్వామిత్రుడు లేచి " అర్హత కలవారిని వదిలి అర్హత లేని వారిని పనిలో పెట్టుకోవడం, అధర్మవర్తనుడు, కపటి అయిన రాజును సేవించడం వంటి పాపములు ఈ తామరతూండ్లు దొంగిలించిన వానికి సంక్రమిస్తుంది " అని అన్నాడు. ఇదంతా విని అరుంధతి నవ్వి " ఎప్పుడూ అత్తగారిని ఆక్షేపించడం, తిట్టడం, భర్తపట్ల అనిచితంగా ప్రవర్తించడం, వండుకున్నది ఎవరికి పెట్టకుండా తానే తినడం వంటి పాపములు తామరతూండ్లు దొంగిలించిన వాడికి తగులుతాయి " అన్నది అరుంధతి.ఇంతలో సేవకురాలు గండ " వండినవంట ముందు తానే తినడం, పని చేయడములో సోమరిగా కుటిలముగా ఉండడం, అబద్ధాలు చెప్పడం, కన్నకూతురిని ధనము కొరకు అమ్ముకోవడం, మంచివారికి కీడు చెయ్యడం వంటి పాపములు ఈ తామరతూండ్లు దొంగిలించిన వానికి సంక్రమిస్తాయి. అదీ కాక ఈ తామరతూండ్లు దొంగిలించిన వాడు జీవితం అంతా ఒకరికి దాస్యం చేస్తుంటాడు " అని పలికింది. ఆమె భర్త పశుసఖుడు " ఈ తామరతూండ్లు దొంగిలించిన వాడికి సంతానం కలుగదు గర్భదరిద్రుడు ఔతాడు " అన్నాడు.

శునస్సఖుడు[మార్చు]

ఇదంతా విన్న శునస్సఖుడు " ఈ తామరతూండ్లు దొంగకు ఇవ్వడం వేదవేదాంగములు చదివిన బ్రాహ్మణోత్తముడికి తనపుత్రికను దానం ఇవ్వడం వంటిది " అన్నాడు. ఆ మాటలకు అందరూ ఆశ్చర్య పోయారు. అదేమిటి నువ్వు ధర్మవచనాలు పలుకుతున్నావు. అంటే తామరతూడులు దొంగిలించినది నువ్వే అన్న మాట. ఆకలితో అల్లాడి పోతున్నాము. దయచేసి ఆ తామరతూండ్లు మాకు ఇవ్వు " అని అడిగాడు. శునస్సఖుడు " అయ్యా ! నిజం చెప్తున్నాను. ఈ తామరతూండ్లు కనిపించక పోతే మీరు ఏమి అనుకుంటారో అని తెలుసుకోవడానికి ఈ తామరతూండ్లను దాచి పెట్టాను. ఇవిగో తీసుకుని మీ ఆకలి తీర్చుకోండి " అని తాను దాచిన తామరతూండ్లను తెచ్చి ఇచ్చి " మహానుభావులారా ! మీ మీద కోపించి వృషాదర్భి మిమ్మల్ని చంపడానికి హోమం చేసి హోమగుండం నుండి కృత్తి అనే రాక్షసిని సృష్టించి మీ మీదకు పంపాడు. అది తెలిసిన నేను ఆ రాక్షసిని చంపాను. ఇక ఎందుకు దాపరికం నేను దేవేంద్రుడను. మీరంతా లోభత్వం వదలడం వలన మీకు పుణ్యలోకాలు సిద్ధించాయి. రండి పుణ్యలోకాలకు పోదాము " అని దేవేంద్రుడు సప్తఋషులను, అరుంధతిని పుణ్య లోకాలకు తీసుకుపోయాడు. ధర్మనందనా ! ఇదంతా వారు ఇతరులకు ఇచ్చినది పుచ్చుకొనక పోవడం, లోభం విడిచిపెట్టడం వంటి సద్గుణాల వలన జరిగింది. కనుక నీవు కూడా లోభమును విడిచి పెట్టు. ఒకరి సొత్తుకు ఆశించకు " అని భీష్ముడు చెప్పాడు.

పితృకార్యము గొడుగులు చెప్పులు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! పితృకార్యములలో గొడుగులు, చెప్పులు దానంగా ఇస్తారు కదా ! అలా ఎందుకు ఇస్తారు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో జమదగ్నికి సూర్యుడికి జరిన సంవాదం వినిపిస్తాను. ఒక సారి జమదగ్ని తన భార్య రేణుకాదేవితో కలిసి ఆశ్రమం వదిలి దూరంగా వెళ్ళి విహరించసాగాడు. అప్పుడు జమదగ్ని విల్లు పట్టుకుని ఉన్నాడు. రేణుకాదేవి అంబుల పొది పట్టుకుని ఉంది. జమదగ్ని ఆరుబయట బాణములు వదులుతున్నాడు. రేణుకాదేవి ఆబాణములు తిరిగి తెచ్చి జమదగ్నికి ఇస్తుంది. ఇలా మధ్యాహ్నం అయింది. సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చాడు. ఒక సారి రేణుకదేవి బాణములు తీసుకు రావడంలో ఆలస్యం జరిగింది. జమదగ్ని రేణుకాదేవిని చూసి " ఇంత ఆలస్యం జరిగిందేమి ? " అని అడిగాడు. రేణుకాదేవి " నాధా ఎండవేడిమి ఎక్కువగా ఉంది. అందుకని కొంతసేపు చెట్టునీడన నిలబడ్డాను. అందుకని ఆలస్యం అయింది " అని బదులు చెప్పింది రేణుక. జమదగ్ని కోపించి " ఏమీ ఆ సూర్యుడు నీకు తాపం కలిగించాడా ? ఉండు సూర్యుడికి తగిన బుద్ధి చెప్తాను. నా బాణములతో సూర్యమండలం కప్పి వేస్తాను " అని అన్నాడు. ఆ మాటలు సూర్యుడు విని బ్రాహ్మణ వేషంలో జమదగ్ని వద్దకు వచ్చి " అయ్యా సూర్యుడి మీద కోపం మానండి " అని వేడుకున్నాడు. జమదగ్ని " నువ్వు మాట్లాడకు పక్కకు పో నేను ఈ సూర్యుడిని కాల్చి వేస్తాను " అని అన్నాడు. సూర్యుడు " మునీంద్రా తాపసులైన మీరు కోపిస్తే ఎలాగా ! సూర్యుడి తాపము చేతనే కదా జలములు వేడెక్కి మేఘములుగా మారి వర్షరూపంలో లోకాలకు నీరు లభిస్తుంది. దానివలన మనకు ఓషధులు, పంటలు లభిస్తాయి కదా ! మరి సూర్యకిరణాలు తపించక పోతే ఎలాగ " అని అన్నాడు. అప్పటికి జమదగ్ని శాంతించ లేదు. సూర్యుడు నిజస్వరూపంతో జమదగ్ని ముందు నిలిచి " మునీంద్రా ! నా వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే క్షమించండి " అని వేడుకున్నాడు. ఆ మాటలకు జమదగ్ని శాంతించాడు. వెంటనే సూర్యుడు గొడుగు చెప్పులు సృష్టించి జమదగ్నికి ఇచ్చి " మహర్షి ఈ సాధనము ఇంతకు ముందు లేవు. ఈ గొడుగు వేసుకుంటే సూర్యతాపము సోకదు, ఈ చెప్పులు వేసుకుంటే ఎండవేడిమికి కాళ్ళు కాలవు. ఈ గొడుగును, చెప్పులను బ్రాహ్మణులకు దానంచేస్తే పుణ్యం లభిస్తుంది " అని అన్నాడు. ఆ వస్తువులను స్వీకరించిన జమదగ్ని సంతోషించాడు. ధర్మరాజా ! గొడుగు, చెప్పులు సూర్యుడి చేత సృష్టించబడ్డాయి. వాటిని దానంగా ఇస్తే పుణ్యలోకాలు లభిస్తాయి " అని భీష్ముడు చెప్పాడు.

శూద్రుడి ప్రవర్తన[మార్చు]

ధర్మరాజు" పితామహా ! శూద్రుడు ఏ ప్రకారం చేస్తే ఇహ లోకంలోను, పరలోకంలోను సుఖములు పొందగలడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము పరాశరుడు తన శిష్యులకు కొన్ని ధర్మసూక్ష్మములు తెలియ చేసాడు. ఆ వాక్యముల సారాంశం ఇది. శూద్రుడైన వాడు ఇంద్రియములను జయించి అంతః శత్రువులైన కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను జయించి గర్వమును వదిలి పెట్టి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులముల వారికి భక్తితో శుశ్రూషలు చేసిన ఈ లోకములోనూ పరలోకము లోనూ సుఖపడగలడు. అలాకాక తన ధర్మమును వదిలి వేదాధ్యయనము, తపస్సు చేస్తే ఈ లోకములోనే కాక పరలోకములో కూడా హీనుడౌతాడు. బ్రాహ్మణుడికి వేదాధ్యయనం, క్షత్రియుడికి బలపరాక్రమాలు, వైశ్యునికి వాణిజ్యము శూద్రుడికి సేవకా వృత్తి అధిక ధనాలు. ఇది వేదము చూపిన మార్గము. ఈ మార్గములలో నడిచిన వారు ఉత్తమ గతులు పొందుతారు. అలా కాక స్వధర్మం వదిలి పరధర్మమును ఆచరించిన ఇహలోకంలోను పరలోకంలోను కూడా దుర్గతి కలుగుతుంది.

శౌచము[మార్చు]

ధర్మనందనా ! నీకు పరాశరుడు తన శిష్యులకు శౌచము గురించి చెప్పినవి చెప్తాను. మానవుడు మలమూత్ర విసర్జన పగలు ఉత్తర దిక్కున, రాత్రి దక్షిణదిక్కున చేయడం మంచిది. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ఉత్తరదిక్కుగా మలమూత్రములను విసర్జించి అవయవములను సున్నితంగా ఎడమచేతితో శుభ్రపరచుకోవాలి. లేని ఎడల రోగములు ప్రాప్తిస్తాయి. తరువాత చేతిని చక్కగా కడుగుకుని తరువాత చేతులకు మట్టి పూసుకుని రుద్దుకుని కడగాలి. తరువాత పాదములను శుభ్రంగా కడుగు కోవాలి. మలమూత్రములను బహిరంగ ప్రదేశములో విసర్జించ కూడదు. దూరంగా చాటుగా చేయాలి. మలమూత్ర విసర్జన తరువాత నురగలేని మంచి నీటితో ఆచమనం చేయాలి. ఆచమనం చేసిన తరువాత నోటిని తుడుచుకోవాలి. తలమీద నీళ్ళు చల్లుకోవాలి. తరువాత శుభ్రమైన నీటితో కళ్ళు, ముక్కు, చెవులు, భుజములు, గుండెలు, బొడ్డు తుడుచుకోవాలి. తలమీద నీళ్ళతో తుడుచుకోవాలి. ఆచమనం చేసేటప్పుడు తూర్పుముఖంగా గాని, ఉత్తరముఖంగా కాని కూర్చోవాలి. ఇలా చేసిన ఋగ్యజుర్సామ వేదములు సంతోషిస్తాయి. నీటితో ఆచమనం చేసిన అధర్వణవేదం సంతోషిస్తుంది. అలా ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు సంతోషిస్తాయి. కాళ్ళు కడగడం వలన పుండరీకాక్షుడు సంతోషిస్తాడు. నీటితో కళ్ళు తుడుచుకుంటే సూర్యుడు సంతోషిస్తాడు. ఇది ఆచమనవిధి. ఈ ఆచనమును ప్రతి ఒక్కరు వస్త్రములు మార్చుకొనినప్పుడు, జంధ్యమును మార్చుకొనినప్పుడు, అన్న పానముల వేళలందు చేయాలి. అన్నము తిన్న తరువాత ఆహారపు ముక్కలు పళ్ళ మధ్య ఇరుక్కుంటాయి కనుక మూడు మార్లు పుక్కిలించి ఆ నీటిని ఉమ్మి వేసి ఆ తరువాత ఆచమనం చేయాలి. ఈ ఆచమనం అన్ని వర్గముల వారు చేయాలి.

వర్ణాశ్రమ ధర్మాలు[మార్చు]

ధర్మనందనా ! పరాశరుడు వర్ణాశ్రమ ధర్మాలు ఇలా వివరించాడు. బ్రాహ్మణుడు జపంచెయ్యడం, యజ్ఞంచెయ్యడం, వేదాధ్యయనంచెయ్యడం వంటివి చేస్తాడు. అదే అతడికి బ్రతుకుతెరువు. బ్రాహ్మణుడికి తపస్సు శోభను చేకూర్స్తున్నాము. క్షత్రియునికి రాజ్యపాలన శోభను చేకూరుస్తంది. క్షత్రియుడి యజ్ఞయాగములు చేయిస్తాడు. దండనీతి క్షత్రియుడికి జీవనాధారం. వైశ్యుడు నిర్దుష్టమైన హవ్యములను యజ్ఞయాగములకు సమకూరుస్తాడు. వైశ్యుడికి వ్యాపారం, వాణిజ్యం జీవనాధారం. వైశ్యుడు అతిథులను సత్కరిస్తాడు. శూద్రుడికి పరిచర్యలు చేయడం యజ్ఞము. మిగిలిన మూడు వర్ణాల వారికి సేవలు చెయ్యడమే అతడికి బ్రతుకుతెరువు. అతడు తన పనిలో ఎక్కువ సామర్ధ్యం చూపించి మెప్పు పొందుతాడు. పైన చెప్పిన ధర్మాలు ఆచరించ తగినవి. యతులు అన్ని వర్ణముల వారికి పూజనీయులు. ప్రియమైన మాటలు పలకడం, శాంతంగా ఉండడం, ఇంద్రియనిగ్రహం కలిగి ఉండడం, మంచి నడవడి ప్రవర్తన కలిగి ఉండడం, అలసత్వం లేకుండా ఉండడం, ఆశను జయించడం, శాయశక్తులా ఈ సంసారాన్ని దాటడానికి ప్రత్నించడం, తనకు కావలసిన వస్తువులను ధర్మ మార్గంలో సంపాదించడం, సన్యాసులకు సేవ చేయడం యతి జీవితం గడపవలసిన విధానం ఇది. శూద్రుడికి దాన ధర్మాలు చేయవలసిన అవసరం లేదు కాని యతులపట్ల ఆదరము, భక్తి ప్రదర్శించిన దానధర్మాలు చేసిన ఫలం దక్కుతుంది. దారి తప్పిన బాటసారులను, యతులను కనిపెట్టి వారికి దాహం ఇచ్చి సేవ చెయ్యడం శూద్రుడి విధి. యతులకు వ్యాధి వస్తే వైద్యం చేయించడం, వారికి అన్న పానములు సమకూర్చి సేవ చెయ్యడం వలన శూద్రుడికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి.

అన్ని వర్ణాలవారు ఆచరించవలసిన ధర్మాలు[మార్చు]

అన్నివర్ణాల వారు తప్పక ఆచరించవలసిన సామాన్య ధర్మాలు పరుల ధనముకు ఆశించక ఉండడం, అందరినీ తన వలెనే ఆదరించడం, ఈ లోకంలో ఉన్న అన్ని వస్తువులను నీటిలో పుట్టే తరంగాల వలె చూసి దేని మీద ఆసక్తి లేకుండా ఉండడం, సాటిప్రాణుల మీద దయకలిగి ఉండడం, సాటివారికి మేలు చెయ్యడం, తాను చేసిన పుణ్యం తనతో వస్తుంది అని నమ్మడం, అందరూ ఆచరించ వలసిన ధర్మములు. పొరపాటున ఎవరైనా తెలియక చెడ్డ పనిచేసిన దానికి వారు ప్రాయశ్చితం చేసుకోవాలి. జీవహింస చేసినప్పుడు దానికి తగిన ప్రాయశ్చితం చేసుకోవాలి. సాటి మనిషిని చంపిన వచ్చే పాపం అనేక సంవత్సరములు భిక్షాటన చేసిన కాని పోదు. మద్యపానం, గురుపత్నిని కోరడం వంటివి ఘోరమైన పాపములు. తన ప్రాణములు బలి ఇచ్చినా ఆ పాపములు పోవు. పై విషయములు తెలుసుకుని పరలోక భీతితో పాపభీతితో దైవచింతనతో జీవితం గడపాలి. శూద్రుడికి కఠినమైన నియమనిష్ఠలు లేవు కనుక అతడి ధర్మసూక్ష్మములను గ్రహించి ఉత్తమలోకములు పొంద వచ్చు.

జరగబోయే కీడుకు సూచన[మార్చు]

పరాశరుడు జరుగబోయే కీడు ఎలా తెలుసుకోవాలి అన్నది వివరించాడు. ఉత్తరదిక్కున బంగారు వర్ణం కలిగి ఉన్న వానిని దక్షిణ ముఖంగా నిలిచి ఉండడం చూసిన వానికి మూడు సంవత్సరాలలో మరణం సంభవిస్తుంది అని తెలుసుకోవాలి. సూర్యబింబం తేజోవిహీనంగా కనిపించిన వానికి రెండు సంవత్సరాలలో మరణం సంభవిస్తుంది. వెన్నెలలో కనపడే తన నీడకు చిల్లులు కనబడడం చూసిన వానికి ఒక సంవత్సరంలో మరణం సంభవిస్తుంది అని తెలుసుకోవాలి. తన నీడ తల లేకుండా కనపడిన ఆరు నెలలో మరణం సంభవిస్తుందని తెలుసుకోవాలి. చెవులను చేతులతో మూసినప్పుడు ఏ శబ్దం వనిపించక ఉన్న అతడికి నెల రోజులలో మరణం సంభవిస్తుంది అని తెలుసుకోవాలి. చెవులు ముక్కులు పని చేయక కళ్ళలో జీవం పోయి కనిపించిన అతడికి అది ఆఖరి రోజని తెలుసుకోవాలి. పైన చెప్పిన అరిష్టములు సంభవించినప్పుడు మానవుడు ధైర్యం కోల్పోకూడదు. ముందు జీవితము మీద కోరికను ఆశలను వదిలి పెట్టాలి. మనసు నిలకడగా ఉంచుకుని ఏకాగ్రచిత్తులై ధ్యానం చేసిన పరమాత్మ అనుగ్రహం పొందాలి. అటువంటి వ్యక్తి మరణించిన మరుజన్మలో అతడి కర్మఫలమును అనుసరించి విప్ర, వైశ్య, క్షత్రియ కులములలో సంపన్నుడై జన్మించి సుఖములు అనుభవించి పరలోకములో కూడా సుఖములు అనుభవిస్తాడు.

వైరాగ్యము[మార్చు]

ఆ జన్మ ఎత్తినప్పుడు అతడికి జ్ఞానోదయం కలుగుతుంది. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ అశాశ్వతం, ఏదీ మన వెంటరాదు, అన్నింటికీ పుట్టుక మరణం తప్పవు, అటువంటి వాడికి వెంపర్లాడడం వృధా ! అని తెలుసుకుంటాడు. ఈ సంసారం దుఃఖమయం, అనంతమైన దుఖం తరువాత కొద్దిపాటి సుఖంలభిస్తుంది. దానికే మనం ఆనందపడతాము. వెంటనే దుఃఖం ముంచుకొస్తుందని తెలుసుకోలేము. కనుక ఈ సుఖముల మీద మమకారం పెంచుకోవడం వృధా. అని ఆలోచించి ధర్మపరుడై జీవిస్తాడు. చేసిన పనికి ఫలితం తప్పక ఉంటుంది. చెయ్యని పనికి ఫలితంఉండదు. కర్మఫలము తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అనే సత్యాన్ని గ్రహిస్తాడు. కర్మఫలము తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదని తెలుసుకుంటాడు. సత్కారముల వలన కలిగిన పూణ్యము వలన స్వర్గసుఖాలు అనుభవించి పుణ్యము క్షీణించిన పిదప జ్ఞానులు ఉన్న కుటుంబంలో పుట్టి దేవతలను, పితరులను, అతిధులను పూజిస్తాడు, గృహస్థాశ్రమం స్వీకరించి భార్యాపుత్రులతో సుఖములు అనుభవించి తరువాత వైరాగ్యము పొంది తనవారిని వదిలి పెట్టి గురువులను సేవించి సాంఖ్యయోగ రహస్యాలను అభ్యసిస్తాడు. తరువాత సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు. దేవాలయములలో కొండగుహలలో నివసిస్తూ భిక్షాటనతో జీవిస్తాడు. రాగద్వేషములను వదిలి పెట్టి సుఖదుఃఖములకు అతీతుడౌతాడు. అహంకారం వదిలిపెట్టి నిత్యము తృప్తిగా జీవిస్తాడు. ఎవరి ఆధీనంలో ఉండక, ఒకచోట నిలువక తిరుగుతూ ఉంటాడు. చివరకు అక్షరతత్వాన్ని తెలుసుకుని పరమాత్మలో ఐక్యమైపోతాడు.

శూద్రుడు ముక్తి[మార్చు]

అటువంటి సన్యాసులను సేవించిన శూద్రుడు కూడా తమ పాపములు పటాపంచలు చేసుకుని పరమాత్మలో లీనమైపోతాడు. ఇతరవర్ణముల వారికి ఈ సౌలభ్యం లేదు. శూద్రులకు సేవకాధర్మము కర్తవ్యము కనుక పవిత్రులైన సన్యాసులను సేవించిన సునాయాసంగా ముక్తిని పొందగలడు. జనులందరూ మోక్షాసక్తులే అయినా శూద్రులకు సులభంగా మోక్షప్రాప్తి కలుగుతుంది. కాని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కూడా తమ ఇంద్రియములను నిగ్రహించి మోక్షమును పొందుగలరు. కాని అన్నింటికి ముందు తమ పాపప్రవర్తన వదలి సన్మార్గంలో నడవాలి. పాపచింత కలవారికి జ్ఞానమార్గము కనపడదు. తరువాత మంచి గురువులను ఆశ్రయించి వారు ఉపదేశించినది ఆచరణలో పెట్టాలి. మంచి గురువు దొరికాడు జ్ఞానోదయం జరిగిందని గర్వించకూడదు. అలా గర్వించినవాడు తిరిగి పాపకూపంలో పడిపోతాడు. అసలు జ్ఞానం కలిగింది అన్నదానికి నిదర్శనం పాపం లేకుండా ఉండడమే. మనిషికి జ్ఞానం కలుగే కొలది శాంత గుణం అలవడాలి. గర్వం నశించాలి. అప్పుడు గురువులకు సేవచేస్తూ ముక్తిని పొందగలడు. మానవుడు తమ ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. పైన చెప్పిన వాటిని ఆచరించు యుక్తుడైన వాడికి పరమ సాక్షాత్కారం లభిస్తుంది. యుక్తుడు కాని వాడికి పరమాత్మ సాక్షాత్కారం లభించదు. దీనిని సౌఖ్యమార్గం అంటారు. సౌఖ్యమార్గమున నడుస్తూ అహంకారం గర్వము వదిలి సేవిస్తూ గురువులను ముక్తిని పొందాలి. సన్యాశాశ్రమం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మాత్రమే పరిమితం. శూద్రులకు మాత్రం సన్యాసులను సేవించడము వలన ముక్తి లభిస్తుంది. బంగారుకొండ పక్కన ఉండే కాకి కూడా బంగారంలా మెరుస్తుంది. అలాగే పవిత్రుడైన సన్యాసి సాహచర్యం చేసిన వ్యక్తి పవిత్రుడౌతాడు. కనుక శుద్రుడికి సన్యాసాశ్రమం తపస్సు చేసి పుణ్యము ఆర్జించవలసిన అవసరం లేదు " అని పరాశరుడు తన శిష్యులకు చెప్పాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

మానవులలో పూజనీయులు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! మానవులలో కూడా దేవతలు సైతం మొక్క తగిన వారు ఉన్నారని విన్నను. అలాంటి వారు ఎలా ఉంటారో తెలియచేయండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఇదే ప్రశ్న ఒక సారి దేవేంద్రుని సారథి అయిన మాతలి అడిగాడు. అందుకు దేవేంద్రుడు ఇచ్చిన సమాధానం వివరిస్తాను. కామము, అర్ధము ధర్మ మార్గముననే పొందు వారు. స్త్రీలు కోరే అందము రూపము ఉండి కూడా స్త్రీలపట్ల కామము లేని వారు, అధికమైన విద్య, ధనము ఉండి కూడా గర్వము లేని వారు. ఇంద్రియములను జయించిన వారు, తాను వివాహమాడిన స్త్రీ అందు తృప్తి కలిగిన వారు, తపస్సు అనే ధనము మీద మమకారం కలిగిన వారు, ఎల్లప్పుడూ సత్యమునే పలికే వారు, పరమ శౌచులూ, అనవసరమైన పనులను తల మీద వేసుకుని సతమతం కానివారు, వీరందరూ మానవులైనా దేవతలకు కూడా పూజనీయులే " అని చెప్పాడు.

చెరువులు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! చెరువులు తవ్వించడంలో గల ధర్మవిశేషములు తెలపండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మరాజా ! తటాకములు దేవతలకు జంతువులకు ఆశ్రయాలు. చెరువులో ఆవులు నీరు తాగుతాయి కనుక చెరువులు తవ్వించిన వాడు పుణ్య లోకాలకు పోతాడు. చెరువులు తవ్వించిన వాడు ఈ లోకములో కూడా కీర్తి, అయిశ్వర్యం పొందుతాడు. చెరువులు నీటితో నిండి ఉన్నంత కాలం తవ్వించిన వాడికి యజ్ఞములు చేసిన ఫలం కలుగుతుంది. అదే చెరువులకు గట్టు మీద చెట్లను నాటితే ఆ చెట్లు పక్షులకు స్థావరమై మనుషులకు, జంతువులకు నీడ ఇస్తున్నాయి. కనుక వాటిని నాటిన వారికి సకలసౌఖ్యములను ఇస్తాయి. చెరువులు తవ్వించిన వారి పితరులు పుణ్య లోకములకు పొందుతారు. చెరువులు తవ్వించడం, చెట్లు నాటించడం దేవతలకు, మానవులకు మేలు చేస్తుంది " అని భీష్ముడు చెప్పాడు.

గృహస్థ ధర్మము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! గృహస్థ ధర్మాన్ని వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ విషయంలో భూదేవికి విష్ణుమూర్తికి జరిగిన సంవాదం గురించి చెప్తాను. నీ లాగే ఒక సారి విష్ణుమూర్తి భూదేవిని అడిగితే భూదేవి " గృహస్థు ప్రతి రోజు అగ్ని కార్యము చెయ్యాలి. అత్యంత భక్తితో భూతబలి ఇవ్వాలి. ఇందు వలన దేవతలు సంతోషిస్తారు. గృహస్థు ప్రతి దినము తన పితరులకు అన్నము, పాలు, పండ్లు, నీరు నివేదించాలి. వైశ్వదేవము అనే క్రియ గృహస్థు తప్పక చెయ్యాలి. తరువాత తన శక్తిమేర పేదలకు దానము చెయ్యాలి. పేద బ్రాహ్మణులను వెదికి వారికి భిక్ష వెయ్యాలి. ప్రతి రోజు అతిధులను సత్కరించాలి. ఏ కారణం చేత అయినా అన్నం తినే ముందు మొదటి ముద్దను అగ్నిహోత్రములో వెయ్యాలి. మొదటిది శ్రౌతబలి ఇది వేదములలో చెప్పబడినది. ఈ బలి ధర్మముకు, ఓషధులకు, వనములకు, రాక్షసులకు సంబంధించినది. రెండవది స్మార్త బలి. ఇది పశువులకు, పక్షులకు సంబంధించినది. గృహస్థు రెండు బలులు విధిగా చెయ్యాలి. ఇది గృహస్థ ధర్మం. బ్రాహ్మణులు ఈ విధిని నిర్వర్తించిన తరువాతనే భోజనం చెయ్యలి "అని భూదేవి విష్ణుమూర్తికి చెప్పింది " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడని సూతుడు వైనకాది మునులకు చెప్పాడు.

వనరులు[మార్చు]