ఆది పర్వము సప్తమాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


సప్తమాశ్వాసం[మార్చు]

బకాసురుని వధ తరువాత పాండవులు కొంతకాలం ఏకచక్ర పురంలో ఉన్నారు. ఒక రోజు ఒక బ్రాహ్మణుడు వారింటికి వచ్చాడు. ధర్మరాజు బ్రాహ్మణునికి అతిథి సత్కారాలు కావించి అతనితో " బ్రాహ్మణోత్తమా ! మీరు ఏఏదేశాలు తిరిగారు? అక్కడి విశేషాలు ఏమిటి? " అని అడిగాడు. అందుకు బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు " నేను ఎన్నో దేశాలు చూసాను కానీ దృపద దేశాన్ని మించింది లేదు. దృపద మహారాజుకు యజ్ఞగుండం నుండి పుట్టిన కుమార్తె ఉన్నది. ఆమె పేరు ద్రౌపది. దృపదుడు ఆమెకు వివాహం చేయ నిశ్చయించాడు " అని చెప్పాడు. అది విన్న ధర్మరాజు ఆశ్చర్యపడి " బ్రాహ్మణోత్తమా ! ఆమె ఎందుకు మానవులకు జన్మించ లేదు? ఆమెను దృపదుడు ఎలా పొందాడు? సవిస్తరంగా మాకు చెప్పండి " అని అడిగాడు. అందుకు బ్రాహ్మణుడు " దృపదుడు ద్రోణుడు చిన్ననాటి మిత్రులు ద్రోణుడు దృపదునిచే అవమానించ బడ్డాడు. ద్రోణుడు తన శిష్యులచే దృపదుని తెప్పించి ప్రతీకారం తీర్చుకున్నాడు. దృపదుడు ఆ అవమానాన్ని సహించలేక ద్రోణుని చంపే కుమారుని అర్జునిని వివాహమాడే కుమార్తెను పొందాలని యజ్ఞం చేసాడు. " యజ్ఞం నుండి భయంకర శరీరంతో ధనుర్భాణాలతో ఒక పురుషుడు ఉద్భవించాడు. తరవార అద్భుత సౌందర్య రాశి అయిన ఒక స్త్రీ వచ్చింది. ఆకాశవాణి ఆ పురుషునకు దృష్టద్యుమ్నుడు స్త్రీకి ద్రౌపది అని పేరు నామకరణం చేసాడు. దృపద మహారాజు అర్జునిని మరణ వార్త బాధ పెట్టింది. కానీ ఆయన పురోహితుడు పాడవులకు అన్నీ శుభ శకునాలు గోచరిస్తున్నాయి. వారు జీవించే ఉన్నారు అని చెప్పాడు. అందుకు ఒక ఉపాయం ఆలోచిన దృపదుడు మత్స్య యంత్రాన్ని చేయించాడు. దానిని భేదించిన వాడికి ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ద్రౌపది స్వయం వరానికి రాజులంతా తరలి వెళుతున్నారు " అని చెప్పాడు. కుంతీ దేవి ఇదంతా విని " ధర్మరాజా మనం ఈ బ్రాహ్మణుని ఇంట ఎక్కువ రోజులు ఉన్నాము. ఎక్కువ రోజులు ఒకరి ఇంట ఉండటం ఉచితం కాదు. కనుక మనం పాంచాల దేశం వెళతాము " అని చెప్పింది. అందుకు ధర్మరాజు అంగీకరించాడు. అందరూ పాంచాల దేశానికి ప్రయాణ మయ్యారు. వారు పాంచాల దేశం వెళుతూ మార్గ మధ్యంలో వ్యాస మహా ముని ఆశ్రమం దర్శించారు. వ్యాసుడు వారిని దీవించి మీరు పాంచాల దేశం వెళ్ళినట్లైతే మీకు మేలు జరుగుతుంది అన్నాడు.

అంగారపర్ణుడు[మార్చు]

ఆ తరువాత వారు గంగా తీరంలో ప్రయాణిస్తూ సోమశ్రవ తీర్థం చేరుకున్నారు. వారు అక్కడ స్నానం చేయాలని అనుకున్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అంగారపర్ణుడు అనే గంధర్వుడు " మానవులారా ఇది రాక్షసులు, యక్షులు, గంధర్వులు తిరిగే సమయం. ఈ వేళలో మానవులకు తిరగడం ఉచితము కాదు. ఇది నా ఆధీనంలో ఉన్న భూమి ఇక్కడ మీరు స్నానం చేస్తే ఆపదల పాలౌతారు. మీరు వెళ్ళక పోతే నా బాణాగ్నికి దగ్ధం అవుతారు " అన్నాడు. అర్జునుడు " నీవు చెప్పింది సామాన్య మానవులకు సరిపోతుంది. మా వంటి వీరులకు కాదు పవిత్రమైన గంగానది ఏ ఒక్కరి స్వంతం కాదు. భూమి మీది జల వనరులు అందరి స్వంతం " అని అంగారపర్ణునితో అన్నాడు. తనకు ఒక మానవుడు ఎదురు చెప్పటమేమిటని అంగారపర్ణుడు కోపించి అర్జునినిపై పదునైన బాణాలు వేసాడు. అర్జునుడు ఆ బాణాలను చేతిలోని కొరివితో అడ్డుకుని అంగారపర్ణునిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించి అతని రధాన్ని బుగ్గి చేసాడు. నిస్సహాయంగా చూస్తున్న అంగారపర్ణుని ధర్మరాజు వద్దకు తీసుకు వెళ్ళాడు. ధర్మరాజు " అర్జునా ఓడి పోయిన వారిని, శౌర్యం కోల్పోయిన వారిని, శిక్షించ రాదు కనుక అతనిని విడిచి పెట్టు " అన్నాడు.

అర్జున అంగారుపర్ణుల స్నేహము[మార్చు]

అంగారపర్ణుడు " అర్జునా నీ పరాక్రమానికి మెచ్చాను. నీతో స్నేహం చేయాలని ఉంది. నీకు చాక్షుసీ విద్యను, మహా వేగం కలిగిన గుర్రాలను ఇస్తాను నువ్వు నాకు ఆగ్నేయాస్త్రం నాకు ఇవ్వు " అన్నాడు. అర్జునుడు " గంధర్వా మనం ఎంత స్నేహితులమైనా నీ వద్ద నేను విద్యను, ధనాన్ని స్వీకరించరాదు. నేను నీకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను. నీ వద్ద గుర్రాలను స్వీకరిస్తాను " అన్నాడు. అర్జునుడు గంధర్వునితో " ధర్మపరులమైన మమ్మల్ని చూసి గర్వంగా ఎందుకు మాట్లాడావు " అని అడిగాడు. అందుకు అంగారపర్ణుడు " అర్జునా ! ఆడవారితో ఉన్న వాడు వివేకం కోల్పోవడం సహజం కానీ ఆ సమయంలో మనకు పురోహితుడుంటే ధర్మా ధర్మ విచక్షణ చేస్తాడు. తాపత్యా ! మీరు పురోహితుడు లేకుండా తిరగటం మంచిది కాదు. అందువలన ఒక ఉత్తమ బ్రాహ్మణుని పురోహితునిగా చేసుకొండి " అని చెప్పాడు. అర్జునుడు " మిత్రమా ! మేము కుంతీ పుత్రులమైన మేము తాపశ్యులము ఎలా అయ్యాము " అని అంగారపర్ణుని అడిగాడు. అంగారపర్ణుడు ఇలా చెప్పాడు " అర్జునా ! సూర్యుని కూతురుకు సావిత్రికి చెల్లెలు తపతి అనే కన్య మహా సౌందర్యవతి. ఆజాఘీడుని కొడుకు సంవర్ణుడు. అతడు సూర్యుని గురించి తపసు చేసాడు. తన కూతురు తపతికి సంవర్ణుడు తగిన భర్త అని అనుకున్నాడు. ఒక రోజు సంవర్ణుడు తపతిని చూసి మోహించి ఆమె సమీపానికి వెళ్ళి ఆమెను ప్రశ్నించాడు. ఆమె మౌనంగా అక్కడ నుండి వెళ్ళినా ఆమెకు కూడా అతనిపై మోహం కలిగింది. పిచ్చి వాడిలా తిరుగుతున్న సంవర్ణునిని చూసి అతని బాధను అర్ధం చేసుకుని తాను కన్యనని స్వతంత్రురాలిని కాదు కనుక తండ్రి అనుమతితో వివాహమాడమని చెప్పింది. ఒక రోజు వశిష్ఠుడు సంవర్ణుని కలిసి అతని బాధను తెలుసుకున్నాడు. వశిష్టూడు సూర్యుని వద్దకు వెళ్ళి " పూరు వంశస్థుడు, ధర్మపరుడు, సత్గుణ సంపన్నుడైన సంవర్ణునికి నీ కుమార్తె తపతిపై మోహం కలిగింది కనుక నువ్వు నీ కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చెయ్యి అని చెప్పాడు. సూర్యుడు తన కోరిక తీరు తున్నందుకు సంతోషించి తపతిని వశిష్టునితో పంపాడు. వశిష్ఠుడు వారిద్దరికి వివాహం చేసాడు. వారికి కురు మహారాజు జన్మించాడు. మీరు కురు వంశజులు కనుక మిమ్మల్ని తపత్యా అని పిలిచాను " అని చెప్పాడు.

వశిష్ఠుడు[మార్చు]

విశ్వామిత్రునకు విందు ఏర్పాటు చేయవలసినదిగా సబలను కోరుతున్న వశిష్ఠుడు

అర్జునుడు అంగారపర్ణుని చూసి " గంధర్వా ! మా పూర్వులకు గురువు పురోహితుడైన వశిష్టుడిని గురించి వినాలని ఉంది " అడిగాడు. అంగార పర్ణుడు అర్జునితో ఇలా చెప్ప సాగాడు. "అర్జునా ! పూర్వం కన్యాకుబ్జ నగరాన్ని విశ్వామిత్రుడు అనేరాజు పాలిస్తున్నాడు. ఒక రోజు అతడు తన సేనలతో సహా వేటకు వెళ్ళి అలసి పోయి వశిష్టుని ఆశ్రమంలోకి సైన్యంతో సహా వెళ్ళాడు. ఇరువురు పరస్పర కుశలం విచారించుకున్న తరువాత వశిష్టుని బలవంతం కారణంగా ఆశ్రమంలో భోజనం చేయడానికి అంగీకరించాడు. నందినీ అనే కామధేనువు సాయంతో అపార సేనావాహినితో సహా విశ్వా మిత్రునకు వశిష్ఠుడు షడ్రశోపేత మైన విందు భోజనం పెట్టాడు. అది విశ్వామిత్రుని ఆశ్చర్యచకితుని చేసింది. అలాంటి ధేనువు తన వద్ద

విశ్వామిత్రుని సైన్యంపై నందిని కోపం

ఉండటం ఉచిత మని ఎంచి వశిష్టుని వద్దకు వెళ్ళి ఆ ధేనువును ఇమ్మని కోరాడు. వశిష్ఠుడు అది తనకు ప్రాణాధారం కనుక ఇవ్వలేనని చెప్పాడు. విశ్వామిత్రుడు రాజ్యంలోని సొత్తుపై రాజుకు అధికారం ఉంటుంది కనుక తాను తీసుకు వెళతానని బలవంతంగా నందినిని తీసుకు వెళ్ళాడు. తిరిగి వశిష్టుడిని చేరిన నందినీ తన నుండి అపార సైన్యాన్ని సృష్టించి విశ్వామిత్రుని సైన్యాన్ని చీల్చి చెండాడింది. విశ్వామిత్రునికి జ్ఞానోదయం కలిగి క్షాత్ర బలం కటే తపో బలం గొప్పదని తెలుసుకుని రాజ్యాన్ని విడిచి పెట్టి తపసు చేసుకోవడానికి వెళ్ళాడు.

విశ్వామిత్రుడి మత్సరం[మార్చు]

తపస్సు వలన దివ్యశక్తులు సాధించినా విశ్వామిత్రునికి వశిష్టునిపై మత్సరం పోలేదు. వశిష్ఠుడు కల్మషపాదునికి యాజకుడుగా చేస్తున్నాడు. విశ్వామిత్రునకు కూడా కల్మషపాదునికి యాజకునిగా ఉండాలని ఉండేది. ఒక రోజు కల్మషపాదుడు వేటకు వెళ్ళి తిరిగి వస్తున్న తరుణంలో వశిష్టుని పెద్ద కుమారుడు శక్తి మహర్షి ఎదురు పడ్డాడు. రాజు శక్తితో ! పక్కకు తొలగి నాకు దారి ఇవ్వు " అని అడిగాడు. శక్తి " మహారాజా ! ఎంతటి వారైనా బ్రాహ్మణుడు ఎదురైతే ముందుగా తొలగి దారి ఇవ్వడం ధర్మం " అని చెప్పాడు. రాజు ఆగ్రహించి చేతి కర్రతో శక్తిని కొట్టాడు. శక్తి కోపించి " రాజా ! రాక్షసుడిలా నన్ను కొట్టావు కనుక రాక్షసుడివై నరమాంస భక్షకుడివైపో " అని శపించాడు. అప్పుడు కళ్ళు తెరచిన కల్మషపాదుడు శాపవిమోచనం ఇవ్వమని వేడు కున్నాడు. దూరంగా ఇదంతా గమనిస్తున్న విశ్వామిత్రుడు కల్మషపాదునిలో కింకరుడు అనే రాక్షసుని ప్రవేశపెట్టాడు. అప్పటి నుండి కల్మషపాదుడు రాచకార్యాలు మానివేసాడు. ఒక రోజు ఒక బ్రాహ్మణుడు కల్మషపాదుని మాంసాహారం పెట్టించమని అడిగాడు. అప్పటికి సరేనని ఆ తరవార మరచి పోయినా రాత్రికి గుర్తు వచ్చి వంటవాడిని పిలిచి ఆ బ్రాహ్మణునికి మాంసాహార భోజనం పెట్టమన్నాడు. వంటవాడు ఆ సమయంలో మాంసం లభ్యం కాదని చెప్పాడు రాజు ఆవేశంతో నరమాంసం అయినా పెట్టమన్నాడు. వంటవాడు నరమాంసం వండి ఆ బ్రాహ్మణునికి పెట్టాడు. తాను తిన్నది నరమాంసం అని గ్రహించిన బ్రాహ్మణుడు " కల్మషపాదుని చూసి నాచేత నరమాంసం భుజింప చేసావు కనుక నీవు రాక్షసుడవై నరమాంసం తింటూ జీవించు " అని శపించాడు. కల్మషపాదుడు వెంటనే రాక్షసుడైనాడు. వెంటనే శక్తి దగ్గరకు వెళ్ళి " దీనికంతా కారణం నీవే కనుక ముందు నిన్నే భక్షిస్తాను " అని చెప్పి అతనితో చేరి వశిష్టుని నూరుగురు కుమారులను భక్షించాడు.

వశిష్టుడి ఆత్మహత్యా ప్రయత్నము[మార్చు]

తన నూరుగురు కుమారులు చనిపోవడం సహించలేని వశిష్ఠుడు ఆత్మహత్యకు పాల్పడ పోతుండగా శక్తి భార్య అదృశ్యవంతి గర్భస్థ శిశువు సుస్వరంతో వేదాలను వల్లించడం విన్నాడు. వశిష్ఠుడు మనుమని చూడాలని ఆశతో ఆత్మహత్యా ప్రయత్నం మానుకున్నాడు. ఒక రోజు కల్మషపాదుడు అదృశ్యవంతిని భక్షింపబోయాడు. వశిష్ఠుడు అతనిపై మంత్ర జలం చల్లాడు. వెంటనే కల్మషపాదునికి రాక్షసత్వం పోయి శాప విముక్తుడు అ య్యాడు. వశిష్ఠుడు కల్మషపాదునితో " బ్రాహ్మణులను అవమానిస్తే వచ్చే అనర్ధం తెలుసింది కదా ఇక మీదట బ్రాహ్మణులను పూజించు " అని హితభోధ చేసాడు. రాక్షసునిగా ఉన్న సమయంలో కల్మాషపాదుడు ప్రణయకాలాపంలో ఉన్న బ్రాణుని చంపి తిన్నాడు. బ్రాహ్మణుని భార్య కోపించి " ప్రణయకాలాపంలో ఉన్న నా భర్తను చంపావు కనుక నీవు స్త్రీతో ప్రణయకాలాపం చేస్తే మరణిస్తావు " అని శపించింది. అందువలన కల్మాషపాదుడు సంతానం పొందలేక పోయాడు. సంతానం కావాలనే కోరిక అధికం కావడంతో వశిష్టుని వద్దకు వచ్చి తనకు సంతానం ప్రసాదించమని వేడుకున్నాడు. వశిష్ఠుడు అందుకు అంగీకరించాడు. కల్మాషపాదుని భార్య మదయంతి యందు సంతానం కలిగేలా అనుగ్రహించాడు. మదయంతి గర్భం ధరించింది. పన్నెండేళ్ళు గడచినా ప్రసవం కానందున ఆమె పదునన రాతితో గర్భాన్ని చీల్చుకుంది. ఆమెకు అశ్మకుడు అనే రాజర్షి జన్మించాడు. అదే సమయంలో శక్తి భార్య అదృశ్యంతికి పరాశరుడు జన్మించాడు. అతడు తల్లి వలన తన తండ్రిని ఒక రాక్షసుని వలన మరణించాడని విని ఆగ్రహం చెంది లోకాలను భస్మం చేస్తానని శపథం చేసాడు. అది విని వశిష్ఠుడు అతనిని వారించాడు.

ఔర్యుడు[మార్చు]

పరాశరుని కోపము చూసి అతడి తాత వశిష్ఠుడు " పరాశరా ! అకారణంగా అందరిని హరించడం తగదు. పూర్వం కృతవీర్యుడు భృగువంశ వంశ బ్రాహ్మణులను యాజ్ఞికులుగా చేసుకుని ఎన్నో యజ్ఞాలను చేసాడు. కృతవీర్యుడు వారికి మిక్కుటమైన ధనాన్ని ఇచ్చాడు. దానిని వారు దాచుకున్నారు. కొంత కాలానికి కొంత మంది క్షత్రియులు భృగు బ్రాహ్మణులు కృతవీర్యుడి ధనాన్ని దాచుకున్నారు అని అపప్రధ పుట్టించారు. అది విని కొంత మంది బ్రాహ్మణులు ధనాన్ని క్షత్రియులకు ఇచ్చారు. కొంత మంది ధనాన్ని భూమిలో పాతి పెట్టారు. క్షత్రియులు ఇది చూసి ఆ బ్రాహ్మణులను చంపి ఆ ధనాన్ని తీసుకు వెళ్ళారు. భృగువంశ బ్రాహ్మణుల గర్భస్థ శిశువులతో సహా చంపి వేసారు. స్త్రీలు భయపడి హిమాలయాలకు పారిపోయారు. అందులో ఒక బ్రాహ్మణుని భార్య తన తోడలో గర్భాన్ని దాచింది. ఆమె తొడ నుండి తేజో వంతుడైన ఔర్యుడు అనే కుమారుడు జన్మించాడు. అతని తేజస్సుతో కృతవీర్యుని వంశంలోని క్షత్రియులందరూ అంధులయ్యారు. ఔర్యుడు త తండ్రితో సహా బంధులందరిని చనిపోయారని తెలుసుకున్నాడు. లోకాలను నాశనం చేయటానికి ఘోర తపస్సు చేయడం సంకల్పించాడు. ఔర్యుని పితృదేవతలు ప్రత్యక్షమై " మేము అసమర్ధులమై క్షత్రియుల చేతిలో మరణించ లేదు. ధనాపేక్షతో ధనాన్ని దాచలేదు. మేము గొప్పగా తపస్సు చేయడం వలన మాకు మరణం రాలేదు. ఆత్మ హత్య చేసుకుందామని అనుకుంటే అది పాపమని చేయలేక పోయాము. ఈ మనుష్య లోకంలో అధిక కాలం ఉండలేము. కనుక క్షత్రియులతో వైరం తెచ్చుకుని వారి చేతిలో మరణం తెచ్చుకున్నాము. కనుక నువ్వు లోకాలను నాశనం చేయడం ధర్మం కాదు " అని పలికారు. వారి మాటలను విన్న తరువాత ఔర్యుడు తన సంకల్పం విరమించుకున్నాడు.

పరాశరుని సత్రయాగం[మార్చు]

ఔర్యుని వృత్తాంతం విని పరాశరుడు సంకల్పం విరమించుకున్నా రాక్షసుల మీద కోపం పోలేదు. అందు వలన పరాశరుడు రాక్షస వినాశనానికి సత్రయాగం చేయ సంకల్పించాడు. వశిష్ఠుడు అందుకు అభ్యంతరం చెప్పలేదు. ఆ సత్రయాగంలో రాక్షసులందరూ పడి భస్మం అవుతున్నారు. అలా రాక్షస జాతి అంతరిస్తుంటే పులస్త్యుడు, పులహుడు, క్రతువు వశిష్టుని దగ్గరకు వచ్చి పరాశరుడు చేసే రాక్షస వినాశనం ఆపమని వేడుకున్నారు. వారి కోరికను మన్నించి పరాశరుడు సత్రయాగాన్ని, రాక్షస వినాశనాన్ని ఆపి వేసాడు.

ధౌమ్యుడు[మార్చు]

దస్త్రం:Pandavas meet vyasa in midway.jpg
దారిలో వ్యాసుని కలసిన పాండవులు

అర్జునుడు అంగారపర్ణునితో " మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు లేరు. మాకు నువ్వు దారి చూపి పురోహితుడిని ఎవరో చెప్పు " అని అడిగాడు. అందుకు అంగారపర్ణుడు " ఇక్కడకు ఉత్కంచం అనే పుణ్య తీర్థం ఉంది. అక్కడ ధౌమ్యుడు అనే బ్రాహ్మణుడు తపసు చేసుకుంటున్నాడు. మీరు అతనిని పురోహితునిగా చేసుకోండి " అని అర్జునినితో అన్నాడు. తరువాత పాండవులు ధౌమ్యుని వద్దకు వెళ్ళారు. అతనిని తమ పురోహితునిగా ఉండమని కోరారు. ధౌమ్యుడు అందుకు సమ్మతించాడు. పాండవులు కుంతీ దేవి ధౌమ్యుని వద్ద ఆశీర్వాదం తీసుకుని ఆయనతో పాంచాల దేశానికి బయలు దేరారు. దారిలో మరి కొందరు బ్రాహ్మణులు వారిని అనుసరించారు. పాంచాల దేశంలో వారు ఒక కుమ్మరి ఇంట బస చేసారు.

ద్రౌపదీ స్వయంవరం[మార్చు]

దస్త్రం:Drishtadumnya announces about the Draupadi Swayamvara.jpg
ద్రౌపది స్వయంవరం గురించి సభలో ప్రకటించుచున్న దుష్టద్యుమ్నుడు

స్వయంవర మండపంలో అనేక మంది రాజులు ఉపస్థితులై ఉన్నారు. వారిలో ఒకరిని వరించడానికి కృష్ణ సిద్ధంగా ఉంది. దుష్టద్యుమ్నుడు మత్స్య యంత్రం గురించి రాజులకు రాజుల గురించి కృషణకు చెప్పాడు. స్వయంవరానికి దుర్యోధనాదులు, కర్ణుడు, భూరి శ్రవుడు, సోమదత్తుడు, శృతసేనుడు, అశ్వత్థామ, శల్యుడు, విరాటుడు, జరాసంధుడు, గాంధార రాజులు, సారణుడు, సాత్యకి, సాంబుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, కృతవర్మ, యుయుధానుడు, సుమిత్రుడు, సుకుమారుడు, సుశర్మ, సుదక్షిణుడు, సుషేణుడు, సేనాబిందుడు, చంద్రసేనుడు, సముద్రసేనుడు, ఔశీనరుడు, చేకితానుడు, జనమేజయుడు, శిశుపాలుడు, జయధ్రధుడు, బృహధ్రధుడు, సత్యవ్రతుడు, చిత్రంగదుడు, శుబాంగధుడు, భగీరధుడు, భగదత్తుడు, పౌండ్రక వాసుదేవుడు, వత్సరాజులు, యదు, వృష్టి, భోజ, అంధక వంశ రాజులు మొదలైన రాజులతో సంభావనల కోసం

దస్త్రం:The Swayamvara of Panchala's princess, Draupadi.jpg
స్వయంవరంలో మత్స్య యంత్రమును ఛేదించిన అర్జునుడు

బ్రాహ్మణ సమూహాలు వచ్చారు. అన్న బలరామునితో వచ్చిన శ్రీకృష్ణుడు పాండవులను గుర్తించాడు. కను సైగతో యదువీరులను స్వయంవరంలో పాల్గొన వద్దని ఆదేశించాడు. ఒక్కొక్కరే స్వయంవరంలో పాల్గొని విల్లు ఎక్కు పెట్టలేక పోయారు. కర్ణుడు లేచి వెళ్లి ధనుస్సును ఎక్కుపెట్టలేకపోయాడు. తర్వాత శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు లాంటి వారు వింటిని ఎక్కుపెడుతూ మోకాళ్లమీద వాలిపోయారు.తరువాత దుర్యోధనుడు లేచి ద్రౌపదిని చూస్తూ ధనుస్సును ఎత్తి ఎక్కుపెడుతూ వ్రేల్లమధ్య వింటినారి దెబ్బతగిలి పడిపోయి సిగ్గుపడుతూ నిష్కమించాడు. తరువాత అర్జునుడు ధర్మరాజు వైపు చూసాడు. ధర్మరాజు వెళ్ళమని సైగ చేసాడు. సభాస్థలి వైపు వెళుతున్న అర్జునిని చూసి కొంతమంది ఇతనికి ఎందుకు. ఇతని వలన ఏమౌతుందని చులకనగా చూసినా కొందరు బ్రాహ్మణులు మర్యాద కాపాడాలని వేడుకున్నారు. అతి సులువుగా విల్లు ఎక్కు పెట్టి ఐదు బాణాలను వదిలి మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. రాజులంతా చేష్టలుడిగి చూస్తున్నారు. బ్రాహ్మణులు అత్యంత ఉత్సాహం చూపెట్టారు. ధర్మరాజు భీముని అర్జుననుకి తోడు ఉంచి తను విడిదికి వెళ్ళాడు. ద్రుపద రాజ పుత్రి అర్జునిని మెడలో వరమాల వేసింది.

రాజులందరినీ కూర్చి సుయోధనుడు భీమార్జునులను ఎదుర్కొనుట[మార్చు]

రాజులందరూ ఇది చూసి అగ్రహోదగ్రులైయ్యారు. దుర్యోధనుని నాయకత్వంలో " విద్యా పటిమ చూపించి గెలుచు కున్న బ్రాహ్మణుని తప్పులేదు. కానీ దృపదుడు మనలను పిలిపించి అమర్యాద చేసాడు. ఇతని బలాన్ని అణచివేయాలి " అని అన్నాడు. బ్రాహ్మణులు అర్జునిని ప్రోత్సహిస్తూ రాజులతో కలియబడ్డారు. దృపదుడు అర్జునిని ప్రక్కన నిలబడ్డాడు. అర్జునుడు బ్రాహ్మణులను వారించి భీమునికి సైగ చేసి రాజులతో తలపడ్డాడు. ఇక్కడ మహాభారతంలో శ్రీకృష్ణుని ప్రవేశం అవుతుంది. శ్రీకృష్ణుడు ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బలరామునితో " అన్నయ్యా! పాండవులను చూసావా వెళ్ళి పోయిన వారు ధర్మరాజు నకుల సహదేవులు. చెట్టు పెరికి యుద్ధం చేస్తున్న వాడు భీముడు. బాణాలను సంధించి యుద్ధం చేసున్న వాడు అర్జునుడు " అన్నాడు. లక్క ఇంటిలో మరణించారని అనుకున్న వాళ్ళు ఇక్కడ కనపడటం బలరామునికి ఆశ్చర్యం కలిగించింది. కర్ణుడు అర్జునిని నైపుణ్యం చూసి " నన్ను ఎదిరించడం దేవేంద్రునికి, అర్జునినికి , ఉపేంద్రుడు అయిన విష్ణువుకి,పరశురామునికి తప్ప సాధ్యం కాదు నువ్వు ఎవరు? " అని అర్జునుని అడిగాడు. అర్జునుడు " నేను వీరిలో ఎవరిని కాను కాని ముందు యుద్ధం చెయ్యి " అన్నాడు. భీమడు శల్యునితో యుద్ధం చేసి ఓడించాడు. ఈ బ్రాహ్మణుల్తో యుద్ధం ఏమిటి అని రాజులు వెనుతిగారు. కానీ దుర్యోధనుడు మాత్రం " ఈ బ్రాహ్మణులు ఎవరు? ఎక్కడినుండి వచ్చారు ? " అని విచారిస్తుండగా శ్రీకృష్ణుడు సుయోధనా, ఇతరులు చేయలేని కార్యం ఈ బ్రాహ్మణుడు చేసాడు. ద్రౌపదిని భార్యగా పొందాడు. ఇక అతని గూరించి మనకు ఎందుకు పదండి " అని వారించాడు. దుర్యోదనాదులు సరే అని వెళ్ళి పోయారు.

ద్రౌపదిని భీమార్జునులు కుంతీవద్దకు తీసుకు వెళ్ళుట[మార్చు]

కుంతీదేవి విడిదిలో ఆందోళన పడసాగింది. స్వయంవరానికి వెళ్ళిన పాండవులు ఎంతకీ రాక పోయేసరికి దుర్యోధనాదులు గుర్తించి చంపివేసేరేమోనని కలత పడింది. ముందుగా ధర్మరాజు నకుల సహదేవులు వచ్చారు. తరువాత అర్జునుడు భీముడు ద్రౌపదితో వచ్చారు. రాగానే అర్జునుడు కుంతీ దేవితో " అమ్మా ! మేము ఒక బిక్ష తీసుకు వచ్చాము " అన్నాడు. వారిని చూడకుండానే కుంతీ " మీరు ఐదుగురు ఉపయోగించండి " అని చెప్పింది. ఆ తరువాత కొడుకు తీసుకు వచ్చింది ఒక కన్యనని తెలుసుకుని అధర్మం పలికినందుకు భయపడింది. ఆమె " ధర్మరాజా ! ఏమి తెచ్చారో తెలియక అలా పలికాను. ఇది అధర్మం, లోక విరుద్ధం. ఇప్పుడు ఏమి చేయాలి?" అని అడిగింది. అప్పుడు ధర్మరాజు అర్జునిని చూసి " అర్జునా ! ఈమెను నీవు గెలుచు కున్నావు కనుక నీవు వివాహం చేసుకో " అన్నాడు. అందుకు అర్జునుడు ధర్మరాజుతో " అన్నయ్యా ! పెద్ద వారు మీరుండగా నేను వివాహం చేసుకోవడం ఉచితం కాదు. ఈమెను మీరు వివాహం చేసుకొండి " అన్నాడు. ధర్మరాజు " మనలో మనకు తగువెందుకు మనం అయిదుగురం వివాహం చేసుకుంటాము " అన్నాడు. శ్రీ కృష్ణుడు బలరామ సహితంగా అక్కడకు వచ్చి తనని తాను పరిచయం చేసుకుని ధర్మరాజుకు కుంతీ దేవికి నమస్కరించాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో బ్రాహ్మణ వేషాలలో ఉన్న మమ్మలిని ఎలా గుర్తు పట్టారు. అన్నాడు. శ్రీకృష్ణుడు " ధర్మజా ! సూర్యని మేఘములు కమ్మినంత మాత్రాన తేజస్సు దాగుతుందా ! మీరు ఏ వేషంలో ఉన్నా మీ తేజస్సు మిమ్మలిని గుర్తించేలా చేసింది. మత్స్యయంత్రాన్ని అర్జునుడు కాక మరెవ్వరు ఛేదించగలరు. ఎలాగో లక్క ఇంటి నుండి తప్పించుకున్నారు. మీకు శుభం కలుగుతుంది " అని చెప్పి బలరామునితో వెళ్ళి పోయాడు.

దృపదుడు పాండవుల పుట్టుపూర్వోత్తరాలు కనుగొన ప్రయత్నించుట[మార్చు]

దృపదుడు కుమారుని పిలిచి " దృష్టద్యుమ్నా ! ఎవరో బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని తీసుకు వెళ్ళారు. నీవు పోయి వారి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుని రా " అని చెప్పాడు. దృష్టద్యుమ్నుడు భీమార్జునుల వెంట వెళ్ళి జరిగినది చూసివచ్చాడు. దృపదునితో " తండ్రీ ఆ ఇరువురూ ద్రౌపదిని తీసుకుని ఒక వయసు పైబడిన స్త్రీకి చూపించారు. అందరూ ఆమెకు నమస్కరించారు. అందులో పెద్దవాడు చెప్పినది విని మిగిలిన నలుగురు వెళ్ళి బిక్ష తీసుకుని వచ్చారు. అందులో కొంత భాగం బలి దానాలకు, అతిథులకు పెట్టారు. మిగిలిన దానిలో సగభాగం బలిష్టుడైన రెండవ వానికి పెట్టారు. మిగిలినది మిలినవారు తిన్నారు. చెల్లి ద్రౌపది వారికి విసుక్కోకుండా సేవలు చేసింది. వారందరికి దర్భలతో పడకలు తయారు చేసింది. వారంతా ఏనుగులు, గుర్రాలు, యుద్ధాలు గురించి మాట్లాడు కుంటున్నారు. వారి నడవడి బ్రాహ్మణుల వలె లేదు శ్రేష్టమైన రాజకుమారుల వలె ఉన్నారు " దృష్టద్యుమ్నుడు చెప్పాడు. అయినా దృపదునికి నమ్మకం కురదక తన పురోహితుని పిలిచి " విప్రోత్తమా ! నీవు వెళ్ళి వారి వద్దకు పుట్టు పూర్వోత్తరాలు కనుక్కుని రా " అని పంపాడు. పురోహితుని చూసి ధర్మరాజు తగిన విధంగా సత్కరించాడు. ఆ పురోహితుడు ధర్మరాజుతో " బ్రాహ్మణోత్తమా ! దృపదుడు ఆడపిల్ల తండ్రి కదా. మీ కులగోత్రాలు అడిగి రమ్మన్నాడు " అన్నాడు. ధర్మరాజు " విప్రోత్తమా ! మీ రాజు మత్స్యయంత్రం కొట్టిన వాడికి పిల్లనిస్తానని చెప్పాడు. మా సోరదరుడు సాధించాడు. మా కులగోత్రాలు తెలుసుకుని ఏమి చేస్తాడు? వీరుడు కాని వారు మత్స్యయంత్రం కొట్టగలరా ? మీ మహారాజు కోరిక తీరింది కదా విచారమేల? " అని మర్మంగా మాట్లాడాడు. చేసేది లేక ఆ విప్రుడు ఆ విషయాన్ని దృపదునికి చెప్పాడు.

దృపదుడు పాండవులను గుర్తించుట[మార్చు]

విప్రుని మాటలకు దృపదుని సందేహం కొంతవరకు తీరినా మనసులో ఇంకా ఏదో సందేహం. అది తీర్చు కోవడానికి నాలుగు జాతుల వారికి అనువయిన రధాలను సిద్ధం చేయించి ధృష్టద్యుమ్నుని పాండవులను తీసుకురావటానికి పంపాడు. పాండవులు క్షత్రియులకు ఉచితమైన రధాలను ఎక్కి దృపదుని వద్దకు వచ్చారు. పాండవులకు ఎదురేగి అతిధి సత్కారాలు గావించి వారికి అనేక కానుకలు పంపాడు. పాండవులు క్షత్రియులకు ఉచితమైన ఆయుధాలను మాత్రం తీసుకున్నారు. దృపదుడు సంతోషించాడు. వారు క్షత్రియులన్న నిర్ధారణకు వచ్చారు. కానీ వారి నోటితో చెబితే బాగుంటుందని ధర్మరాజుతో " అయ్యా ! మీరు దేవతలా, గంధర్వులా, క్షత్రియులా లేక బ్రాహ్మణులా చెప్పి నా సందేహం తీర్చండి. మీ నిజ స్థితి తెలియకుండా నా కుమార్తెను ఎలా ఇవ్వగలను? " అన్నాడు. ఇక దాచడం భావ్యం కాదని ధర్మరాజు దృపద " మహారాజా ! మేము క్షత్రియులము. పాండురాజ పుత్రులము. నా పేరు ధర్మరాజు. వీరు భీమార్జున నకుల సహదేవులు. మత్స్యయంత్రాన్ని నా తమ్ముడు అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించాడు. ఈమె మా తల్లి కుంతీ దేవి " అని చెప్పాడు.

ద్రౌపది వివాహ ప్రస్థావన[మార్చు]

అది విన్న దృపదుడు తన చిరకాల కోరిక నెరవేరిందని పొంగిపోయాడు. ధర్మ రాజు పక్కన కూర్చుని " విచిత్రవీర్యుని మనుమడు పాండురాజు కుమారుడు నాకు అల్లుడు కావడం నాకు సంతోషంగా ఉంది. స్వయంవరంలో అతడిని వరించిన కన్యతో అర్జునునికి వివాహం చేస్తాను " అన్నాడు. దానికి ధర్మరాజు " అర్జునుడి కంటే ఇద్దరం పెద్దవాళ్ళం ఉన్నప్పుడు అదెలా కుదురుతుంది " అన్నాడు. దృపదుడు " అయితే పెద్దవాడివైన నీవు వివాహం చేసుకో ధర్మబద్దంగా ఉంటుంది " అన్నాడు. ధర్మరాజు " అలా కాదు. అర్జునుడు తెచ్చిన భిక్ష ఐదుగురు పంచుకోవాలని మాతల్లి గారి కోరిక. అందువలన ఈ కన్యను మేము ఐదుగురం వివాహం చేసుకుంటాము " అన్నాడు. అది విన్న దృపదుడు " అదేమిటి? ఒక పురుషుడు చాలా మంది కన్యలను వివాహం చేసుకోవచ్చు. ఒక కన్యను మాత్రం ఎక్కువ మంది వివాహమాడటం లోక విరుద్ధం కనుక ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాము " అన్నాడు. మరునాడు వ్యాసుడు అక్కడకు వచ్చాడు. అందరూ సమావేశమైన సమయంలో దృపదుడు వ్యాసునితో జరిగినదంతా వివరించి " మహాత్మా ! ఒక కన్యను ఐదుగురు పురుషులకు ఇవ్వడం లోక విరుద్ధం కాదా ? తమరే ధర్మ నిర్ణయం చేయండి " అన్నాడు. ధర్మరాజు చేతులు జోడించి " మాకు మా తల్లి దైవం. ఆమె మాటను మేము జవదాటం. నేను మాట వరుసకు కూడా అబద్ధం చెప్పను. నానోట ఈ మాట ఎలా వచ్చిందో తెలియడం లేదు. పూర్వం జటిల అను ఋషి కన్య ఏడుగురు ఋషులను వివాహమాడింది. దాక్షాయిని అనే కన్య ప్రచేతనులు అనబడే పదిమందిని వివాహం చేసుకుంది. కనుక దృపద మహారాజా ! ఆలోచించక నీ కుమార్తెను మా ఐదుగురికి ఇచ్చి వివాహం చేయవచ్చు" అన్నాడు. ఇరువురి వివాదం విన్న వ్యాసుడు కాసేపు ఆలోచించాడు. దృపదునితో " మహా రాజా ! నీ కుమార్తెను ధర్మరాజు చెప్పినట్లు వారైదుగురికి ఇచ్చి వివాహం చెయ్యి. ఇది ధర్మ నిర్ణయం. ఇందుకు కారణం చెపుతాను " అని చెప్పి దృపదుని ఏకాంతానికి తీసుకు వెళ్ళాడు.

ద్రౌపది పూర్వజన్మల వృత్తాంతం[మార్చు]

దస్త్రం:Vyasa telling the secret of birth of Drupadi to Drupada.jpg
ద్రౌపది పూర్వజన్మల వృత్తాంతం గురించి ద్రుపదునకు వివరిస్తున్న వ్యాసుడు

వ్యాసుడు దృపదుడితో " దృపదమహారాజా ! పూర్వం మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన మహా పతివ్రత. మౌద్గల్యుడు కుష్టురోగంతో బాధ పడుతున్నాడు. అయినా అసహ్యించు కోకుండా సేవలు చేస్తుంది. ఒక రోజు భర్తకు భోజనం పెట్టి మిగిలిన అన్నం తింటూ ఉన్నప్పుడు అందులో భర్త వేలు ఊడిపడి ఉండటం చూసి అది పక్కన పెట్టి మిగిలిన అన్నం తింటూ ఉంది. ఇది చూసి మౌద్గల్యుడు ఆశ్చర్య పోయాడు. " ఇంద్రసేనా ! నీ పతి భక్తి అమోఘం. నీకు ఏమి వరం కావాలో కోరుకో ఇస్తాను " అన్నాడు. " నాధా ! నాకు వాంఛలు తీరలేదు. అందుకు మీ రూపం అందుకు అడ్డు వస్తుంది. మీరు అందమైన ఐదు రూపాలుగా మారి నా కోరికలను తీర్చండి " అని అడిగింది. అందుకు అంగీకరించిన మౌద్గల్యుడు మనోహరమైన ఐదు రూపాలు ధరించి భార్య కోరిక తీర్చాడు. తరువాత అతడూ బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కానీ కోరికలు తీరని ఇంద్రసేన మరు జన్మలో కాశీరాజు కూమార్తెగా జన్మించింది. ఆమె చాలా కాలం కన్యగా మిగిలి పోయింది. శివుని గురించి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అన్నాడు. శివుని చూసిన ఇంద్రసేన తన మనసులోని బలవత్తరమైన కోరికతో శివుని చూసిన తత్తరపాటుతో " నాకు భర్త కావాలి " అని అయిదు సార్లు చెప్పింది. శివుడు ఆమెతో " తధాస్థు మరు జన్మలో నీకు ఐదుగురు భర్తలు లభిస్తారు " అన్నాడు. అది విని ఆమె తన పొరపాటు గ్రహించింది. " దేవా ! ఒక కన్యకు ఐదుగురు భర్తలు లభించటం లోక విరుద్ధం కాదా నాకు ఈ వరం వద్దు " అన్నది. అందుకు శివుడు " సాధ్వీ నీవు ఐదుగురు భర్తలతో ధర్మబద్ధం అయిన కాపురం చేస్తావు " అన్నాడు. అలా ఐతే నాకు నిరంతర పతి సేవాభాగ్యం కావాలి . నాకు ఒక్కొక్కరితో ఏకాంత జీవితం కావాలి. కన్యాత్వం చెడకుండా కాపురం కావాలి " అని అడిగింది. శివుడు ఆమె కోరిన విధంగా వరాలు ఇచ్చాడు. " నువ్వు వెళ్ళి గంగా తీరంలో ఉన్న ఇంద్రుడిని తీసుకురా " అన్నాడు. ఆ సమయంలో యమ ధర్మరాజు సత్ర యాగం చేస్తున్నాడు. యాగ దీక్షలో ఉన్నాడు కాబట్టి ప్రాణి హింస చేయలేదు. లోకంలో మరణాలు తగ్గి భూభారం ఎక్కువైంది. ఇంద్రాది దేవతలు బ్రహ్మ లోకానికి వెళ్ళి " దేవా మరణం లేకుంటే మానవులకు మాకు తేడా ఏమిటి? అందుకు తరుణోపాయం తమరే చెప్పాలి " అన్నారు. అందుకు బ్రహ్మ దేవుడు " యముని సత్ర యాగం ముగిసే దాకా మీరు నిశ్చింతగా ఉండండి. ఆ తరువాత అతడు మానవులను అంతమొందిస్తాడు. మీ తేజస్సు, యముని తేజస్సుతో పుట్టిన వీరులు ఆయనకు సహాయంగా ఉంటారు " అన్నాడు. దేవతలు ఇంద్రలోకం వెళుతూ గంగా తీరంలో ఏడుస్తున్నకాశీరాజు కూతురిని చూసాడు. ఇంద్రుడు " ఎందుకు ఏడుస్తున్నావు " అని అడిగాడు. ఆమె " అది తెలిసుకోవాలంటే నా వెంట రావాలి " అని శివుని దగ్గరికి తీసుకు వెళ్ళింది. ఆ సమయంలో శివుడు ఒక యువతితో పాచిక లాడుతున్నాడు. ఇంద్రుడు " ముల్లోకాలకు అధిపతిని నాముందు జూదం ఆడుతావేమి? " అని అహంకారంతో అన్నాడు. అందుకు శివుడు కోపించి " గర్వంతో మాట్లాడకు నీకు చేతనైతే ఆకొండ గుహను చీల్చు" అన్నాడు. ఇంద్రుడు సరేనని గుహను చీల్చగానే తనలాంటి నలుగురిని చూసి ఆశ్చర్య పోయాడు. శివుడు నిజరూపం ధరించి " మీ ఐదుగురు ఇంద్రులు మానవ లోకంలో జన్మించండి. కాశీ రాజ పుత్రిక మానవ కాంతగా జన్మించి మీకు భార్య అవుతుంది " అన్నాడు. వ్యాసుడు " దృపద మహారాజా ఆ ఐదుగురు ఇంద్రులే పాండవులు. కాశీ రాజు కుమార్తె నీ ఇంట పెరుగుతున్న యజ్ఞసేని. నీకు అనుమానం అయితే వారి నిజరూపాలు చూడు" అని తన తపో మహిమతో వారి రూపాలు చూపగా. వెలుగుతున్న వారి నిజరూపాలను చూసాడు. వ్యాసుడు " దృపదా ! పూర్వం నితంతుడు అనే రాజర్షి కుమారులు కూడా ఔశీనర పుత్రికను స్వయంవరంలో గెలిచి వివాహ మాడారు. కనుక నీ కూతురిని పాండవులకిచ్చి వివాహం జరిపించు " అన్నాడు.

ద్రౌపదితో పాండుసుతుల వివాహం[మార్చు]

ద్రౌపదితో పాండవుల వివాహం

వ్యాసుని మాటలతో దృపదుని సందేహం తీరింది. ద్రౌపదిని పాండవులకు ఇవ్వడానికి సమ్మతించాడు. పాడవుల తరఫున ధౌమ్యుడు పౌరోహిత్యం వహించాడు. సర్వాలంకార భూషిత అయిన ద్రౌపదిని ముందుగా వేదోక్తంగా ధర్మరాజుకు ఇచ్చి వివాహం చేయించారు. తరువాత పరమ శివుని ప్రార్థించగానే తిరిగి కన్యాత్వం సిద్ధించింది. ఆ తరువాత భీమసేనునికి ఆ తరువాత అర్జునినికి ఆ తరువాత నకుల సహదేవులకు వేదోక్తంగా వివాహం జరిపించారు. ఆపై కుంతీ దేవి ఆశీర్వాదం పొంది ఆపై పెద్దల ఆశీర్వాదం పొందారు.

బయటి లింకులు[మార్చు]