Jump to content

విరాట పర్వము ప్రథమాశ్వాసము

వికీపీడియా నుండి


విరాట పర్వము, మహాభారతం ఇతిహాసంలోని నాలుగవ భాగము. ఆంధ్ర మహాభారతంలో తిక్కన రచన విరాట పర్వంతో ఆరంభమవుతుంది.

సభాపర్వంలో భంగపడిన పాండవులు జూద నియమానుసారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం గడిపిన తరువాత పదమూడవ యేట అజ్ఞాతంగా విరాటరాజు కొలువులో గడపటం ఈ పర్వంలో ముఖ్య కథాంశం.

ప్రధమాశ్వాసం

[మార్చు]

పాండవుల అరణ్యవాసం ముగిసిందని వైశంపాయనుడు చెప్పగా విన్న జనమేజయుడు " మహర్షీ ! మా తాతలు పాండవులు వనవాసానంతరం అజ్ఞాత వాసమును అతి రహస్యంగా, చాతుర్యంగా, కౌరవులకు తెలియకుండా ఎలా గడిపారు వివరంగా చెప్తారా " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయా ! పాండవులు తమ వనవాస కాలాన్ని పూర్తి చేసారు. ధర్మరాజు తమతో వచ్చిన బ్రాహ్మణులను చూసి " అయ్యా ! ఇన్నాళ్ళు మాతో పాటు మీరూ అడవులలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇక మేము అజ్ఞాతవాసం గడపవలసి ఉంది. మా అజ్ఞాతవాసం మేము నిర్విఘ్నముగా గడపాలని మమ్మల్ని ఆశీర్వదించండి " అని నమస్కరించాడు. ధౌమ్యుడు " ధర్మరాజా ! నీవు ధర్మ స్వరూపుడవు నీ వలెనే పూర్వము ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకము పోగొట్టు కొనుటకు నిషాధాచలము మీద, హరి అధితి గర్భములో వామన మూర్తిగానూ, ఔర్యుడు తన తల్లి తొడలోనూ అజ్ఞాతవాసం చేసారు. కాలం కలసి వచ్చిన తరువాత పూర్వ వైభవం పొందారు. నీవు కూడా అలాగే నీ అజ్ఞాత వాసానంతరం పూర్వ వైభవం పొందగలవు " అన్నాడు. బ్రాహ్మణు లందరూ పాండవులను దీవించి తమతమ ప్రదేశాలకు వెళ్ళారు.

పాoడవులు ద్రౌపది వారివారి పనులను నిర్ణయించు కొనుట

[మార్చు]

ధర్మరాజు తమ్ములను చూసి " మనం అయిదుగురం ద్రౌపది అజ్ఞాతవాసం గడిపే ఉపాయం చెప్పండి " అన్నాడు. అర్జునుడు " అన్నయ్యా! మనకు యమ ధర్మరాజు ఇచ్చిన వరం ఉన్నది కదా ! మనం ఎక్కడకు వెళ్ళినా ఎవరూ గుర్తుపట్టలేరు. కురు దేశం చుట్టూ పాంచాల, చేధి, మత్స్య, సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ణ, శూరసేన, కళింగ, మగధ దేశములు సుభిక్షంగా మనకు నివాస యోగ్యంగా ఉన్నాయి. ఈ దేశాలలో మనకు అనుకూలంగా ఉన్న దేశంలో మనం అజ్ఞాతవాసం గడుపుదాం " అన్నాడు. ధర్మరాజు " నాకు తెలిసి విరాటరాజు సద్ధర్మవర్తి, మంచివాడు, బలవంతుడు అతని పాలనలో మనం అజ్ఞాత వాసం గడపటం ఉచితమని నాకు అనిపిస్తుంది. విరాట రాజు కొలువులో ఎవరెవరు ఏమి పనులు చేయగలరో నాకు వివరంగా చెప్పండి " అన్నాడు. అర్జునుడు " అన్నయ్యా ! నీవు మహనీయ మూర్తివి. సుకుమారుడవు, ఎంతో ప్రాభవం అనుభవించిన వాడివి. అటువంటి వాడవు ఎలా ఇతరులను సేవించ గలవు " అన్నాడు. అర్జునా " నాకు శ్రౌతము, స్మార్తము, శకునము, జ్యోతిషము మొదలగునవి తెలియును. ఈ విద్యలు ప్రదర్శిస్తూ నేను కాలం గడపగలను. నేను జ్యూద ప్రియుడనని నీకు తెలుసు కదా. విరాటరాజును జ్యూదముతో అలరిస్తాను. ఆయన నా గురించి అడిగితే నేను పూర్వం ధర్మరాజు వద్ద స్నేహంగా ఉండేవాడినని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు భీమసేనుని చూసి " భీమసేనా ! బకాసుర, కిమ్మీరాదులను చంపిన నీవు సేవకా వృత్తి ఎలా చేస్తావు " అన్నాడు. భీమసేనుడు " అన్నయ్యా! నాకు రుచికరంగా వంటలు చేయడం వచ్చు కదా. వంటలవాడిగా విరాటరాజు కొలువులో చేరతాను. పైగా నాకు మల్ల యుద్ధంలో ప్రావీణ్యం ఉంది కదా. అతని కొలువులో మల్ల విద్యా ప్రదర్శనలు ఇస్తూ అందరికి వినోదం కలిగిస్తాను. నా పూర్వ చరిత్ర అడిగితే నేను ధర్మరాజు కొలువులో వంటవాడిగా ఉన్నానని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు అర్జునుని చూసి " అర్జునా ! నీ సంగతి ఏమిటి నీవు ఎలాంటి కొలువు చేస్తావు " అని అడిగాడు. అర్జునుడు " అన్నయ్యా ! నేను దేవేంద్రుని దగ్గరకు వెళ్ళినప్పుడు నన్ను ఊర్వసి కామించగా నిరాకరించాను. అప్పుడు ఊర్వశి నపుంసకుడివి కమ్మని శపించింది. దేవేంద్రుడు నన్ను ఆ శాపాన్ని అజ్ఞాత వాస కాలంలో అనుభవించమని చెప్పాడు. అజ్ఞాతవాసం కాగానే శాపవిమోచనం కాగలదని చెప్పాడు. ఆ శాపవశమున నేను విరాటరాజు కొలువులో పేడి రూపం దాల్చి విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. నాకు నాట్య విద్యలో ప్రవేశం ఉంది. నేను అంతఃపురకాంతలకు నాట్యం నేర్పుతాను. నా పూర్వ చరిత్ర అడిగితే నేను ద్రౌపది అంతఃపురంలో నాట్యాచారుడిగా ఉన్నానని చెప్తాను " అని అన్నాడు. తరువాత నకులుని చూసి " ఇతడు చాలా సుకుమారుడు, అందగాడు ఇతడు తన నిజ రూపమును ఎటుల దాచగలడు. ఒరులను ఎలా సేవించ గలడు " అన్నాడు. నకులుడు " అన్నయ్యా ! నాకు అశ్వ శిక్షణలో ప్రవేశమున్నది. నేను అశ్వ శిక్షకుడిగా విరాటుని కొలువులో చేరతాను. అశ్వశాలలోని గుర్రాలకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకుంటాను. ధామగ్రంధి నామంతో సంచరిస్తాను. ఇంతకు పూర్వం నేను ధర్మరాజు కొలువులో అశ్వశిక్షకుడిగా పనిచేసానని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు నవ్వి " సహదేవుని వైపు చూసాడు. సహదేవుడు " అన్నయ్యా ! నాకు పశు పోషణలో అనుభవం ఉంది. తంత్రీ పాలుడనే పేరుతో గోరక్షకుడిగా విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. ఇంతకు పూర్వం ధర్మరాజు కొలువులో గోరక్షకుడిగా పని చేసానని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు ద్రౌపదిని చూసి " సుకుమారీ ! ఇంత వరకు పనులు చేయించుకున్నది కాని ఎవరిని సేవించి ఎరుగదు. ఇంతటి ఉదాత్తచిత్త ఏ పని చేయగలదు " అని మనసులో బాధపడ్డాడు. అది గ్రహించిన ద్రౌపది " నేను సైరంధ్రీ వేషంలో మాలిని అనే పేరుతో విరాటరాజు అంతఃపురానికి వెళతాను. విరాటరాజు భార్య సుధేష్ణను ప్రసన్నం చేసుకుంటాను. అందరూ గౌరవించే విధంగా సైరంధ్రీ వ్రతం సాగిస్తాను " అన్నది. అందరికి అన్ని పనులు కుదిరాయి. మనం అందరం అజ్ఞాత వాసాన్ని నిరపాయంగా గడుపుదాం. ధౌమ్యుల వారు అగ్ని హోత్రం రక్షిస్తుంటారు. మిగిలిన వారు వారి వారి స్వస్థలాలకు వెళతారు. ఎవరైనా మా గురించి అడిగితే ద్వైతవనం నుండి ఎటో వెళ్ళారని చెప్పండి " అని ధర్మరాజు ఆదేశించాడు.

రాజకొలువులో ప్రవర్తించవలసిన పద్ధతులు

[మార్చు]

ధౌమ్యుడు పాండవులను చూసి " ధర్మరాజా ! మీరు కురువంశంలో జన్మించారు. గౌరవంగా బ్రతికారు. ఇలాంటి మీరు పరులను సేవించుట కష్టమే. కాని మనకు అనుకూలం కాదని మరచి పోవద్దు. మీరు పరాక్రమాలు ప్రదర్శిస్తే అజ్ఞాతవాసం భగ్నమౌతుంది. రాజులను సేవించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. రాజుతో చనువుగా ఉన్నాను అనుకుని రాజమర్యాద అతిక్రమిస్తే హాని కలుగుతుంది. రాజుకన్నా విలువైన దుస్తులు ధరించటం కాని, రాజుకన్నా అధికంగా మాట్లాడటం కాని, రాజగృహంకన్నా ఆడంబరమైన గృహంలో నివసించటం కాని చేయకూడదు. సహజంగా రాజులు తమ ఆజ్ఞను ఉల్లంఘించిన వారు పుత్రులైనా మిత్రులైనా శత్రువులుగా చూస్తారు. తాను చేయలేని పని తలపై వేసుకో కూడదు అందువలన భంగపాటు తప్పదు. రాజుల యందు మౌనంగా ఉండకూడదు అలాగని అతిగా భాషించ కూడదు. మితమైన చతుర సంభాషణచే రాజులను మెప్పించాలి. అంతఃపుర రహస్యాలను బయట పెట్టకూడదు. రాజుకు చెప్పదగినవి, వినదగినవి అయిన మాటలనే చెప్పాలి. రాజు అనుమతి మీదనే ఆసనాన్ని అధిరోహించాలి. రాజుకన్నా ఉన్నతాసనం పై ఎప్పటికీ అధిరోహించకూడదు. రాజు అభిమానించాడని పొంగి పోకూడదు. అలాగే అవమానిస్తే కుంగి పోకూడదు. రాజు చెప్పిన పనిని ఎండ, వాన, ఆకలి, దప్పిక, కాలము ప్రదేశం నిమిత్తం లేకుండా చేయాలి. రాజధనాన్ని విషంతో సమానంగా చూడాలి. రాజధనాన్ని సంగ్రహించడం ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. రాజు కొలువులో నవ్వటం ఆవులించడం చేయకూడదు. రాజుగారి శత్రువులతోకాని, వారి దూతలతో కాని సన్నిహితంగా మెలగ కూడదు. భటుడు సంపద కలదు కదా అని అధికంగా భోగింపరాదు. రాజుకు కంటగింపుగా ఉంటుంది. కనుక అజ్ఞాతవాస సమయమున మీరు అణగి మెణగి మెలగవలసి ఉంటుంది " అన్నాడు.

విరాటనగరానికి పయనం

[మార్చు]

ధర్మరాజు ధౌమ్యుని బుద్ధిమతి విని " మాకు అన్నీ మీరే. మాకు తెలియని అనేక విషయాలు చెప్పారు. వాటిని తప్పక పాటిస్తాము " అన్నారు. ధౌమ్యుని ఆశీర్వాదం పొంది పాండవులు ధౌమ్యుడు అక్కడి నుండి విరాటనగరానికి వెళ్ళారు. యమునా నది వెంట నడుస్తున్నారు. మత్స్యదేశ పొలిమేర చేరగానే అక్కడ ఒక ఆశ్రమంలో ధౌమ్యుడు ఆగి పాండవులు వెళ్ళాక అగ్నిహోత్రాలు తీసుకుని పాంచాల దేశానికి వెళ్ళాడు. పాండవులు అరణ్యాల వెంట తమ ప్రయాణం సాగించారు.విరాటనగరానికి వెళ్ళటానికి చాలా దూరం నడిచారు. ద్రౌపది ఇక నడవ లేక పోయింది విశ్రాంతి తీసుకుంటాము అనుకుంది. ధర్మరాజు అందుకు ఒప్పు కోలేదు త్వరగా విరాట నగరం చేరాలన్నది అతని కోరిక పట్టుదల. ద్రౌపది ఇక ఒక అడుగు కూడా వేయలేనని చెప్పింది. ధర్మరాజు నకులుని చూసి " నకులా! ద్రౌపది అలసి పోయింది. కొంచం ఎత్తుకుని తీసుకు రాగలవా " అని అడిగాడు. నకులుడు " నేను కూడా అలసి పోయాను అన్నయ్యా " అన్నాడు. ధర్మరాజు సహదేవుని అడిగాడు. సహదేవుడు అలాగే సమాధానం ఇచ్చాడు. ఇక అర్జునిని వంతు వచ్చింది. అర్జునుడు ద్రౌపదిని అవలీలగా ఎత్తుకుని విరాట నగరం వైపు నడిచాడు. అందరూ విరాట నగర పొలిమేర చేరగానే కొంత తడవు ఆగారు. ధర్మరాజు తమ్ములతో " మనం ఈ ఆకారాలతో ఆయుధాలతో నగరంలో అడుగు పెడితే మనలను సులువుగా గుర్తిస్తారు. మనం మన ఆయుధాలను దాచాలి " అన్నాడు.

పాండవులు తమ ఆయుధాలను దాచుట

[మార్చు]

ధర్మరాజు మాటలు విని అందరూ చుట్టూ పరికించారు. పక్కనే శ్మశానం ఉంది. అక్కడకు సామాన్యంగా ఎవరూ రారు. భూత, ప్రేత, పిశాచాలు అక్కడ తిరుగు తాయని ప్రజలు అక్కడకు రారు. అందువలన ఆయుదాలను దాచడానికి అదే అనువైనదని భావించారు. ఆ శ్మశానంలో ఒక జమ్మి చెట్టు ఉంది. ఆ జమ్మి చెట్టు ఆకాశాన్ని అంటే కొమ్మలతో దట్టమైన ఆకులతో పగటి పూట చూడటానికి కూడా భీతి కొల్పేలా భయంకరంగా ఉంది. ఆ జమ్మి చెట్టును చూసిన అర్జునుడు " అన్నయ్యా ! మనం మన ఆయుధాలను ఇక్కడ భద్రపరుస్తాము " అన్నాడు. పాండవులు తమ ఆయుధాలను ఒకచోట చేర్చి వాటిని వెండ్రుకలు ఉన్న చని పోయిన మృగ చర్మంతో కట్టారు. పక్కనే పడి ఉన్న ఒక జంతు చర్మాన్ని సహదేవుని సాయంతో తీసుకు వచ్చి దానితో ఆమూట కట్టారు. ఆ పక్కనే ఒక అనాధ శవం పడి ఉంది. ఆ శవాన్ని ఆయుధాల మూటతో చేర్చి కట్టారు. ధర్మరాజు ఆ జమ్మి చెట్టు ఎక్కి ఆయుధాల మూటను చెట్టుకు వ్రేలాడ కట్టాడు. ధర్మరాజు ఆ ఆయుదాల మూటకు నమస్కరించి తనకు అర్జునికి తప్ప మిగిలిన ఎవరికైనా అవి సర్పాల వలె కనపడాలని ప్రార్ధించాడు. భీముడు వస్తే అస్సలు కనపడ వద్దని వేడుకున్నాడు. ధర్మరాజు చెట్టు దిగి చుట్టూ పరికించాడు. దూరంగా కొంతమంది పశువుల కాపర్లు కనిపించారు. వారి దగ్గరకు పోయి " అయ్యలారా! మా తల్లి చనిపోయింది. మా కులాచారం ప్రకారం శవాన్ని జమ్మి చెట్టుకు వ్రేలాడ కట్టాలి అందుకే కట్టాము " అని శవాకృతిలో ఉన్న ఆయుధాల మూట చూపించాడు. అమాయకులైన గొల్లలు భయభ్రాంతులై ఇతరులకు చెప్పటానికి పరుగు పరుగున వెళ్ళారు.

పాండవుల వేషధారణ

[మార్చు]

ధర్మరాజు దుర్గాదేవిని ప్రార్ధించాడు. ఆమె తమను ఎవరూ తెలుసుకోలేరని అనుగ్రహించింది. ఆ తరువాత ధర్మరాజు యమ ధర్మరాజును ప్రార్ధించాడు. వెంటనే ధర్మరాజుకు సన్యాసి వేషం , భీమునకు వంట వాడి వేషం, అర్జునినికి పేడి వేషం, నకులునికి అశ్వ రక్షకుడి వేషం, సహదేవుడికి పశుపాలకుని వేషం లభించాయి. మీరు అందరూ ఒకరి వెంట ఒకరు వచ్చి నగరంలో ప్రవేశించండి అని చెప్పి ధర్మరాజు ముందుగా కమండలం తీసుకుని పాచికల కట్ట చంకన పెట్టుకుని నగర ప్రవేశం చేసారు.

ధర్మరాజు కొలువులో చేరుట

[మార్చు]
దస్త్రం:Kankubhattu.jpg
కంకుభట్టుగా ధర్మరాజు

దైవవశాత్తు విరాటరాజు ఆరోజు నగరసంచారం చేస్తున్నాడు. దూరం నుండి సన్యాసి వేషంలో వస్తున్న ధర్మరాజుని చూసి " ఆహా ఏమి ఠీవి, ఏమి రాజసం, రాజ్యాలను ఏలే చక్రవర్తిలా ఉన్నాడు " అనుకుని ధర్మరాజుకు ఎదురు పోయి నమస్కరించాడు. ధర్మరాజుతో " అయ్యా! మీరెవరు? ఏ ఊరు? మా నగరుకు ఎందుకు వచ్చారు? వివరించండి " అన్నాడు. ధర్మరాజు చిరునవ్వు నవ్వి " నేను బ్రాహ్మణుడను. కురుదేశంలో జన్మించాను. సన్యాసాశ్రమం స్వీకరించాను. నాకు జూదంలో ప్రవేశముంది. శత్రువులు జూదంలో ఓడించి నా సంపదనంతా అపహరించారు. ఆ అవమానం భరించలేక దేశం విడిచి వచ్చాను. నన్ను కంకుభట్టు అంటారు. నేను తమరు సజ్జనులైన మహారాజులని విని వచ్చాను. నేను నీచ వృత్తి చేయను. ఒక సంవత్సరం వ్రతం ఉన్నది . ఆ వ్రతకాలం మీ వద్ద ఉంటాను అనుగ్రహించండి. ఆ తరువాత నన్ను అవమానించిన వారిని వెతుక్కుంటూ వెళతాను " అన్నాడు. విరాటరాజు " అయ్యా ! తమరు మా రాజ్యంలో ఉండటం కంటే మాకు భాగ్యం లేదు. నాకు జరిగే మర్యాదలు అన్నీ నీకు జరుగుతాయి. తమరు సంతోషంగా మా నగరంలో ఉండండి " అన్నాడు. ధర్మరాజు " నాకు రాజభోగాలతో పని లేదు. నేల మీద నిద్రిస్తాను. హోమం చేయగా మిగిలినది తింటాను " అన్నాడు. విరాటరాజు అందుకు అంగీకరించాడు. ధర్మరాజు కొలువులో ప్రవేశించాడు.

భీముడు కొలువులో చేరుట

[మార్చు]
దస్త్రం:Valala.jpg
వలలుడిగా భీముడు

తరువాత భీముడు వంటలవాడిగా చేతితో గరిటతో నగర ప్రవాశం చేసాడు. విరాటరాజుకు అభివాధం చేసాడు. భీముడు " అయ్యా! నేను నాల్గవజాతి వాడను. వంటలు చేయగలను. తమరి కొలువులో వంటల వాడిగా ఉంటాను. నేను ఇదివరకు ధర్మరాజు వద్ద వంటలవాడిగా ఉన్నాను. ఆ యనకు ప్రీతికరమైన వంటలు చేసేవాడిని. ఆయనను సేవించినట్లు మిమ్మల్ని సేవిస్తాను. నాకు మల్ల యుద్ధం వచ్చు. తమరికి వినోదం కలిగిస్తాను అనుగ్రహించండి. తమరికి ఇష్టం లేకుంటే వేరొక చోటికి పోతాను " అన్నాడు. విరాటరాజు " నీమాటలకు నేను ముగ్ధుడ నయ్యాను. నీవు వంటవాడిగా చేరు " అన్నాడు. భీముడు విరాటుని కొలువులో వంటల వాడయ్యాడు.

అర్జునుడు కొలువులో చేరుట

[మార్చు]
దస్త్రం:Brihannala.jpg
బృహన్నలగా అర్జునుడు

అర్జునుడు అందమైన చీరె కట్టుతో, రవికతో, చక్కని తలకట్టుతో ఆడవేషంలో విరాటుని కొలువులో ప్రవేశించాడు. అర్జునినిలో నపుంసకత్వం ఆడతనం మూర్తీభవిస్తున్నాయి. విరాటుని చూసి " మహారాజా! నా పేరు బృహన్నల. నేను పేడి వాడిని. ఆడపిల్లలకు ఆట పాట నేర్పుతాను. నన్ను మీ కొలువులో చేర్చుకోండి " అన్నాడు. విరాటరాజు " అయ్యో ఇంత అందమైన నీకు పేడి రూపమా " అడిగాడు. అర్జునుడు " ఔను మహారాజా! శాపవశాన పేడితనం ప్రాప్తించింది. పేడి తనం వలన ఏ పని చేయలేను. సంగీతం, నృత్యం నేర్చుకున్నాను, అన్ని రకముల వాద్యాలను వాయించ గలను. అలంకార కళలో ప్రవేశం ఉంది " అన్నాడు. అతడి పేడి రూపంలో ఏమీ దోషం లేదని గ్రహించి ఉత్తరను కొలువుకు రప్పించాడు. మందగమన ఉత్తర కొలువుకూటమికి వచ్చింది. విరాటరాజు " బృహన్నలా ! ఈమె నా కూతురు ఉత్తర. ఈమెకు నాట్యం నేర్పగలవా " అన్నాడు. బృహన్నల వినయంగా నేర్పుతాను అన్నాడు. విరాటరాజు " బృహన్నలా! నా కూతురు ఇంకా చిన్న పిల్ల. ఆట పాటల మీద మక్కువ ఇంకా పోలేదు. నీవు ఆమెకు కళల యందు ఆసక్తిని కలిగించి నాట్యంలో శిక్షణ ఇవ్వవలసిన బాధ్యత నీదే. నీవు ఈమెకు రక్షికుడిగా ఉండాలి " అని ఉత్తరను చూసి " అమ్మా! ఈమె నీ గురువు ఆమె ఎలా చెపితే అలా భక్తితో నడచుకో " అని బృహన్నలకు ఉత్తరను అప్పగించాడు. ఆ విధంగా అర్జునుడు విరాటుని కొలువులో ప్రవేశించాడు.

నకులుడు కొలువులో చేరుట

[మార్చు]
దస్త్రం:Grandhika.jpg
తామగ్రంధిగా నకులుడు

తరువాత నకులుడు అశ్వపాలకుని వేషంలో విరాటుని కొలువులో ప్రవేశించాడు. ఆ సమయంలో విరాటుడు తన వద్దకు కొనిరాబడిన గుర్రాలను పరిశీలిస్తున్నాడు. నకులుడు కూడా అశ్వాలను తదేకంగా చూస్తున్నాడు. ఇది గమనించిన విరాటుడు అతనికి అశ్వవిద్యలో ప్రవేశం ఉన్నదని గ్రహించాడు.అతని గురించి వివరాలు కనుక్కుని రమ్మని మంత్రులను ఆదేశిస్తున్న తరుణంలో నకులుడు విరాటనుని దగ్గరకు వచ్చాడు. నకులుడు " మహారాజా ! నా పేరు తామగంధి. నాకు అశ్వవిషయములు అన్ని తెలుసు అశ్వపోషణ చేయగలను. అశ్వ ఆయు॰ప్రమాణాన్ని చెప్పగలను. నేను ఇంతకు ముందు ధర్మరాజు వద్ద అశ్వ రక్షకుడుగా ఉంటున్నాను. కాని ధర్మరాజు అందరిని వదిలి పోయాడు. విరాటరాజు సుజనుడు, లోకోత్తరుడు అని విని నేను తమరి కొలువులో చేరి తమరిని సేవించాలని వచ్చాను " అన్నాడు. విరాటుడు అతని నైపుణ్యానికి మెచ్చి అతనిని తన అశ్వశాలలో చేర్చుకున్నాడు.

సహదేవుడు కొలువులో చేరుట

[మార్చు]
దస్త్రం:Arishtanemi.jpg
తంత్రీపాలుడుగా సహదేవుడు

సహదేవుడు చేతిలో ముల్లుగర్రతో, తలమీద తాళ్ళ మూటతో గోపాలుడి వేషంలో విరాటుని వద్దకు వచ్చాడు. సహదేవుడు విరాటునితో " మహారాజా ! నాపేరు తంత్రీ పాలుడు. నేను ఆల మందలను చక్కగా పెంచుతాను. నాకు పశువులలో ఉన్న రకాలు తెలుసు. పశువుల వ్యాధులకు చికిత్స చేయగలను. ఇంతకు ముందు ధర్మరాజు పాలనలో పశు పాలకుడిగా ఉండే వాడిని. నన్ను తమరి కొలువులో పశు పాలకునిగా నియోగించండి " అని కోరాడు. విరాటుడు అతని మాటలకు మెచ్చి అతనిని కొలువులో పశు పాలకుడిగా నియోగించాడు. ఈ విధంగా పాండవులు అయిద్య్గురు కొలువులో చేరారు.

ద్రౌపది అంత:పురంలో చేరుట

[మార్చు]
సైరంధ్రిగా ద్రౌపది

ద్రౌపది సైరంధ్రి వేషానికి తగినట్లుగా తలకు కొప్పు పెట్టుకుంది. మాసిన చీర కట్టుకుంది. దాసీభావాన్ని మనసులో నింపుకుంది. విరాటనగర రాజవీధిలో నడుస్తూ అంత:పురం చేరుకుంది. ఆ సమయంలో విరాట రాజపత్ని సుధేష్ణాదేవి విహారనిమిత్తం రాజప్రాసాదం పైకి ఎక్కి విహరిస్తూ రాజవీధి వెంట విహరిస్తున్న సైరంధ్రిని చూసింది. ఆమె అందానికి ఆశ్చర్యపోయింది. ఆమెను తీసుకు రమ్మని చెలికత్తెలను పంపింది. వారు వెళ్ళి సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని సుధేష్ణ సముఖానికి తీసుకు వచ్చారు. సుధేష్ణ ద్రౌపదితో " మానినీ నీవు ఎవరు? ఏమి కులం? నీ పేరేమి? ఏ పని మీద ఈ నగరానికి వచ్చావు? " అని అడిగింది. ద్రౌపది " అమ్మా ! సైరంధ్రీ జాతి స్త్రీని. నా పేరు మాలిని. నాకు అయిదుగురు భర్తలు. నేను ఒక కారణంపై నా భర్తల ముందే అవమానింప బడ్డాను. భర్తలతో అడవులలో నివసించాను. బ్రహ్మచారిగా కాలం గడిపాను. నాకు ఇంకొక్క వ్రతం ఉంది. మీరు ధర్మ వర్తనులు అని విని వ్రతకాలం మీ రాణివాసంలో గడపాలని వచ్చాను. నేను ఇంతకు ముందు శ్రీకృష్ణుని భార్య సత్యభామ వద్దా, పాండవ పత్ని ద్రౌపది వద్దా పనిచేసాను. నాకు పూలమాలలు, చెండ్లు కట్టడం తెలుసు. రకరకాలుగా తిలకం దిద్దగలను. అందంగా కురులను అల్లగలను ముడువ గలను " అన్నది. ఆమెను అంత:పురంలో చేర్చుకోవడానికి సుధేష్ణకు కొంత సందేహం ఉంది " సైరంధ్రీ! నీవు అందగత్తెవు. నిన్ను చూసి మహారాజు నీ మీద మనసు పడితే నేను ఏమి చేయాలి? ఆడవాళ్ళే నీపై చూపు మరల్చలేక పోతున్నారే ఇక మగవాళ్ళ విషయం చేప్పేదేముంది. నిన్ను అంత:పురంలో ఉంచుకోవడం అంటే నా వినాశనం నేను కోరుకోవడమే " అన్నది సుధేష్ణ. ద్రౌపది " అమ్మా! తమరు అలా అనవలదు. నా భర్తలు బలవంతులు. నా విషయంలో అప్రమత్తంగా ఉంటారు. ఏవరైనా నన్ను నీచభావంతో చూసినా చాలు వారిని సంహరిస్తారు. కనుక ఎవరూ నన్ను దుర్బుద్ధితో చూడరు. నాకు అలాంటి నీచ బుద్ధులు లేవు. నన్ను మీరు నమ్మి మీ సేవకురాలిగా స్వీకరించండి. కాని నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నేను ఇతరుల ఎంగిలి తినను. నీచపు పనులు చేయను " అని పలికింది. సైరంధ్రి మాటలకు సుధేష్ణ సంతోషించి ఆమెను తన పరిచారికగా స్వీకరించింది. అలా ద్రౌపది కూడా విరాటుని కొలువులో చేరింది. పాండవులు ద్రౌపది విరాటుని కొలువులో సంతోషంగా కాలం గడుపుతున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]