ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ద్వితీయాశ్వాసము

[మార్చు]

నారదుడు

[మార్చు]

ఆవిధముగా తపస్సు చేస్తున్నధృతరాష్ట్రుడి వద్దకు నారదుడు, దేవలుడు, పర్వతుడు, మౌంజాయనుడు అను మహర్షులు వచ్చారు. వారితో శతాయువు కూడా వచ్చాడు. కుంతి వారికి అతిథిసత్కారాలు చేసింది. తరువాత వారు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళారు. ధృతరాష్ట్రుడు వారికి సంభ్రమంతో నమస్కరించాడు. వారు ధృతరాష్ట్రుడిని ఆశీర్వదించాడు. ధృతరాష్ట్రుడు వారికి దర్భాసనము ఇచ్చి కూర్చోమని చెప్పాడు. అప్పుడు నారదుడు " ధృతరాష్ట్రమహారాజా ! శతాయువు అని ఒక మహారాజు ఉండే వాడు. ఆయన తాత గారు సహస్రచిత్యుడు తన కుమారుడికి రాజ్యము ఇచ్చి అడవులకు వచ్చి ఇదే ప్రదేశములో తపస్సు చేసి ఇంద్రుడితో మిత్రుత్వము పొందాడు. ఆయన కాకుండా పృషధుడు, శైలాలయుడు, పురుకుత్సుడు ఇక్కడే తపస్సు చేసి స్వర్గలోకము పొందారు. నాకు వారందరూ తెలుసు. ఈ ఆశ్రమంలో తపస్సు చేయడము అందరికీ సాధ్యము కాదు. వ్యాసుడి దయ వలన నీకు ఆ అదృష్టము కలిగింది. ఇక్కడ తపస్సు చేయడము వలన నీవు కూడా వారి వలెనే ఉత్తమ గతులు పొందుతావు. నీ భార్య గాంధారి కూడా నిన్ను అనుసరించి వస్తుంది. మీకు సేవలు చేసినందుకు కుంతీదేవి కూడా ఉత్తమ గతులు పొంది తన భర్త పాండురాజును చేరుకుంటుంది. ఇప్పుడు పాండురాజు స్వర్గలోకములో ఉన్నాడు. సదా నిన్నే తలచుకుంటున్నాడు. యమధర్మరాజు ఆత్మగా కలిగిన విదురుడు కూడా యమధర్మరాజును చేరుకుంటాడు. సంజయుడు కూడా మిమ్ము అనుసరించి వస్తాడు " అని చెప్పాడు. ఆమాటలు విన్న ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతి ఎంతో సంతోషించారు. ఆ శతాయువు నారదుడిని " నారదమహర్షీ ! మీకు అన్నీ తెలుసు కదా ! నాకు ఒక సమాధానము చెప్పండి. మీరు కురుసార్వభౌముడికి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పారు కదా అది ఎలాగో వివరించండి. అందుకు నారదుడు " శతాయువూ ! నేను ఒకసారి దేవేంద్రుడితో ముచ్చటిస్తున్న సమయములో ధృతరాష్ట్రుడి ప్రస్తావన వచ్చింది. ధృతరాష్ట్రుడి తీవ్రమైన తపస్సు గురించి దేవలోకము అంతా ప్రశంసించారు. అప్పుడు దేవేంద్రుడు " నారదా ! ఇంతటి తీవ్రమైన తపస్సు చేస్తున్న ధృతరాష్ట్రుడు తన భార్య గాంధారితో సహా దేవలోకము చేరుకుంటాడు " అన్నాడు ఇంద్రుడు. ఆ సమయములో అక్కడ ఉన్న పాండురాజు అది విని చాలా సంతోషించాడు " అని నారదుడు చెప్పాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రాదులు సంతొషించారు. నారదాది మహామునులు అక్కడి నుండి తమ నివాసాలకు వెళ్ళారు.

పాండవులు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళుట

[మార్చు]

హస్థినాపురములో పాండవులు కూడా తమ తల్లి కుంతీని తలచుకుని విచారిస్తున్నారు. పెదతండ్రి ధృతరాష్ట్రుడు, పెదతల్లి గాంధారి అడవిలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో అని దుఃఖిస్తున్నారు. ముసలిప్రాయంలో సుఖపడవలసిన తరుణంలో అడవులలో కష్టములు అనుభవిస్తున్నారని కుమిలిపోతున్నారు. హస్థినాపుర ప్రజలు కూడా వారిని తలచుకుని ఎంతో బాధపడుతున్నారు. పాండవులు విదురుడిని, సంజయుడిని తలచుకుని కూడా దుఃఖిస్తున్నారు. రాచభోగములను వదిలి అడవులలొ ఆకులు అలములు తిని బ్రతకవలసిన అవరము ఏమున్నదని విలపిస్తున్నారు. వారినిచూసి ద్రౌపది, సుభద్ర కూడ బాధపడుతున్నారు. ఇక ఉండలేక పాండవులు అందరూ ధృతరాష్ట్రాదులను చూడడనికి అరణ్యముకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ఆ సమయములో సహదేవుడు అన్నలకు నమస్కరించి " తల్లి కుంతీదేవిని చూడాలని నేను ముందె అనుకున్నను కాని మీరు ఏమి అంటారో అని చెప్పలేదు. మనతల్లి కుంతీదేవి తన బావ ధృతరాష్ట్రుడికి, తన అక్క గాంధారికి సేవలు చెయ్యడానికి వారితోపాటు అడవులకు వెళ్ళింది. అక్కడ నారచీరలు కట్టుకుని ఆకులు అలములు తింటూ ఎలా ఉందో అని నాకు బెంగగా ఉంది అన్నయ్యా ! అందుకని ఆలస్యము చెయ్యకుండా అరణ్యములకు వెళ్ళి వారిని చూసి రావడము మంచిది " అని అన్నాడు. ఆమాటలు విన్న ద్రౌపది కూడా " సహదేవుడు చక్కగా చెప్పాడు. మీరు తక్షణము కుంతీదేవిని చూడడానికి అడవులకు వెళ్ళడము సముచితము. కాని మరొక్క విషయము. మా కోడళ్ళము అందరమూ అత్తగార్లను చూడడానికి ఉవ్విళ్ళూరుతున్నాము. మేమంతా ప్రయాణానికి సిద్ధముగా ఉన్నాము " అన్నది. ధర్మరాజు అందుకు సమ్మతించాడు. ప్రయాణానికి తగిన సన్నహాలు చెయ్యమని ఆదేశాలు జారీ చేసాడు. హస్థినాపురప్రజలు ఎవరైనా తమతో రావచ్చని. అలావచ్చే వారికి తగిన ఏర్పాట్లు చెయ్యమని ఆదేశాలు ఇచ్చాడు. తాము లేని సమయములో నగరరక్షణార్ధము యుయుత్సుడిని, కృపాచార్యుడిని, ధౌమ్యుడిని నియమించాడు. అలా పాండవులు అడవులకు వెళ్ళడానికి సన్నాహాలు చేసుకున్నారు.

పాండవులు ఆశ్రమానికి చేరుట

[మార్చు]

భీముడు గజబలముతో, అర్జునుడు రధములతో, నకులుడు అశ్వబలముతో, సహదేవుదు కాల్బలముతో బయలు దేరారు. ద్రౌపది వంటి అంతఃపుర స్త్రీలు పల్లకీలలో, బంగారు రధములలో బయలుదేరారు. ధర్మరాజు 16 అశ్వములు కూర్చిన రధములో బయలుదేరాడు. అలా ధర్మరాజు గంగానదిని దాటి కురుక్షేత్రములో శతాయువు ఆశ్రమానికి సమీపములో ఉన్న ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అందరూ తమ రధములు దిగి కాలినడకన ఆశ్రమము వద్దకు వెళ్ళారు. ధర్మరాజు అక్కడ ఉన్న వారిని " ధృతరాష్ట్రుల వారు ఎక్కడ " అని అడిగాడు. వారు " యమునలో స్నానము చెయ్యడానికి వెళ్ళాడు " అని చెప్పారు. వెంటనే ధర్మరాజు మొదలైన వారు యమునా నదీతీరానికి వెళ్ళారు. అప్పటికే యమునలో స్నానము జపతపాదులు ముగించుకుని ధృతరాష్ట్రుడు మొదలగు వారు వారికి ఎదురు వచ్చారు. కుంతీదేవి పాండవులను చూసి పొదివిపట్టుకుని అందరినీ ఆశీర్వదించింది. సహదేవుడు కుంతీదేవి పాదాల మీదపడి ఏడ్చాడు. కుంతీదేవి గాంధారికి, ధృతరాష్ట్రుడికి తన కుమారులు వచ్చిన విషయము చెప్పింది. పక్కనే ఉన్న సంజయుడు పాండవులను చూసి సంతోషముగా పలకరించాడు. ద్రౌపది మొదలైన అంతఃపుర స్త్రీలు అందరూ వచ్చి గాంధారికి, కుంతికి నమస్కరించారు. వారు అంతఃపురస్త్రీలను ఆదరించారు. తన వారు అందరూ చుట్టూ ఉండగా ధృతరాష్ట్రుడికి తాను హస్థినాపురములో ఉన్నట్లు అనిపించింది. అందరూ కలసి ఆశ్రమానికి వెళ్ళారు.

ధృతరాష్ట్రుడు ధర్మరాజును కుశలము విచారించుట

[మార్చు]

పాండవులు, ధర్మరాజు అరణ్యాలకు వచ్చారని తెలిసి చుట్టుపక్కల ఉన్న మునులు, ఋషులు వారిని చూడవచ్చారు. అక్కడకు వచ్చిన పాండవులు మునులకు పాదాభివందనము చేసారు. ఆ మునులు పాండవులను తమకు పరిచయము చెయ్యమని కోరారు. సంజయుడు " ఈయన ధర్మరాజు, ఈయన భీముడు, ఈయన అర్జునుడు, ఈయన నకులుడు, ఈయన సహదేవుడు, ఈమె ద్రౌపది. ఈమె శ్రీకృష్ణుడి చెల్లెలు అర్జునుడి భార్య అయిన సుభద్ర. ఉలూపి, చిత్రాంగదలు కూడా అర్జునుడి భార్యలు. ఈమె ఉత్తర. యుద్ధములో వీరమరణము పొందిన అభిమన్యుడి భార్య " తరువాత పాండవుల ఇతర భార్యలను కూడా వారికి పరిచయము చేసాడు. పరిచయాలు అయిన తరువాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో " ధర్మనందనా ! నీవు, నీ తమ్ములు, నీ మిత్రులు, బంధువులు అందరూ కుశలమే కదా ! నీ అంతరంగ పరిజనము సుఖముగా ఉన్నారా ! నీవు నీ పెద్దలు నడచిన మార్గమునే నడుస్తున్నావా ! దేవాలయములు, బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారములు మాన్యములు అన్యాక్రాంతము కాకుండా కాపాడుతున్నావా ! ప్రజకు బాధకలిగించని విధంగా పన్నులు విధించి కోశాగారాన్ని నింపుతున్నావు కదా ! నీవు నీ మిత్రులపట్ల స్నేహభావము శత్రువులపట్ల కాఠిన్యము ప్రదర్శిస్తున్నావు కదా ! నీకు మిత్రులు శత్రువులు కాక తటస్థముగా ఉన్న రాజుల పట్ల అప్రమత్తముగా ఉంటున్నావు కదా ! ఎందుకంటే వారు ఎప్పుడు ఏవైపు ఉంటారో తెలియదు కదా ! దేవతలను, పితృదేవతలను, అతిథులను నైవేద్యములు భోజనములు పెట్టి తృప్తిపరుస్తున్నావు కదా ! నీ రాజ్యములో నాలుగువర్ణాల వారు తమకు విధించిన వృత్తులు క్రమము తప్ప కుండా పాటిసున్నారు కదా ! నీ రాజ్యములో బాలలు, వృద్ధులు, స్త్రీలు, అందరూ, భయము లేకుండా జీవిస్తున్నారు కదా ! నీ ఆజ్ఞను పురప్రజలు కచ్చితముగా పాటిస్తున్నారు కదా ! " అని గబగబా ప్రశ్నించాడు.

ధర్మరాజు ధృతరాష్ట్రుడిని కుశలము విచారించుట

[మార్చు]

ధృతరాష్ట్రుడు కుశలము విచారించిన దానికి బదులుగా ధర్మరాజు " పెదనాన్నగారూ! మీరు నాకు చేసిన రాజనీతి ఉపదేశమువలన రాజ్యపాలన అంతా చక్కగా జరుగుతున్నది. కాని మా దిగులంతా తమరి గురించే. తమరి తపస్సు ఎలా కొనసాగుతోంది. మా తల్లి కుంతీదేవి తమకు సేవలు చేస్తున్నది కదా ! మా పెదతల్లి గాంధారి తపస్సు బాగా సాగుతుంది కదా ! విదురుల వారు ఇక్కడ లేరు ఎక్కడకు వెళ్ళారు ? నాకు వారిని చూడాలని ఉంది. నేను వెంటనే విదురుడిని చూడాలని అనుకుంటున్నాను " అని అడిగాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో " కుమారా ధర్మరాజా ! నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నా తపస్సు బాగా సాగుతోంది. కుంతి మాకు బాగా సేవలు చేస్తోంది. గాంధారి తపస్సు బాగా జరుగుతోంది. సంజయుడు కూడా తనకు తోచిన విధముగా తపస్సు చేస్తున్నాడు. కాని విదురుడు మాత్రము ఎక్కడ ఉంటాడో ఎక్కడ తిరుగుతుంటాడో తెలియదు. వేళకు ఆహారము తీసుకోడు. ఒక్కోసారి గాలి, నీరు మాత్రమే ఆహారముగా తీసుకుంటాడు. ఒక్కో సారి అది కూడా తీసుకోడు. చాలా విచిత్రముగా ప్రవర్తిస్తుంటాడు. మనుష్యులు తిరగడానికి భయపడే ఈ కారడవిలో ఒంటరిగా స్వేచ్ఛగా నిర్భయముగా సంచరిస్తుంటాడు. ఈ క్షణములో ఇక్కడ ఉంటాడు. మరు క్షణములో ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నాడు చూడు అని దూరముగ తిరుగుతున్న విదురుడిని ధర్మరాజుకు చూపించాడు ధృతరాష్ట్రుడు.

ధర్మరాజు విదురుని అనుసరించుట

[మార్చు]

ధృతరాష్ట్రుడు చూపించిన వైపు చూసిన ధర్మరాజుఅక్కడ విదురుడు ఉండడము చూసాడు. విదురుడి శరీరము అంతా మట్టి కొట్టుకుని ఉంది. దుస్తులు ధరించ లేదు. జుట్టంతా జడలు కట్టి ఉంది. ఆశ్రమ సమీపానికి వచ్చి అక్కడ అధికముగా జనము ఉండడము చూసి దూరముగా పోసాగాడు. ఇది చూసిన ధర్మరాజు " విదురా ! విదురా ! ఆగు. నేను ధర్మందనుడను నిన్ను చూడడానికి వచ్చాను " అని అరుస్తూ విదురుడి వెంట పరిగెత్తాడు. విదురుడు ఒక చెట్టూ కింద నిలబడ్డాడు. ధర్మరాజు పరుగున వెళ్ళి విదురుడి ముందు నిలబడ్డాడు. విదురుడు నిశ్చలంగా నిలబడ్డాడు. ధర్మరాజు " విదురా ! నేను ధర్మనందనుడను నిన్ను చూడ వచ్చాను. కళ్ళుతెరవండి " అని ప్రార్ధిచాడు. విదురుడు కళ్ళు తెరచి ధర్మరాజు వైపు తదేకంగా చూస్తూ తన యోగ బలముతో తన శరీరాన్ని విడిచి పెట్టాడు. విదురుడి ఇంద్రియములు, విదురుడి ప్రాణములు విదురుడిని విడిచి పెట్టి తేజో రూపములో ధర్మరాజులో ప్రవేశించాయి. విదురుడి పాంచభౌతిక శరీరము కింద పడిపోయింది. ధర్మరాజు అప్పుడు ఇనుమడించిన కాంతితో ప్రకాశించాడు. ఇది చూసిన ధర్మరాజు ఆశ్చర్యచకితుడై విదురుడికి అంత్యక్రియలు నిర్వర్తించాలని తలచాడు. అప్పుడు ఆకాశము నుండి ఒక వాక్కు వినిపించింది " విదురుడు యతీశ్వరుడు. యతిధర్మము స్వీకరించాడు. అతడి శరీరానికి అగ్నిసంస్కారము చేయ కూడదు. కనుక అతడి శరీరాన్ని అక్కడే విడిచి పెట్టు " అని వినిపించింది. తరువాత ధర్మరాజు వడివడిగా నడుస్తూ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న వారికి జరిగినదంతా వివరించాడు. అది విని అందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు. తరువాత ధర్మరాజును చూడడానికి వచ్చిన తాపసులు అందరూ ధృతరాష్ట్రుడి వద్ద శలవు తీసుకుని అక్కడ నుండి వెళ్ళారు. తరువాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును చూసి " ధర్మనందనా ! నీకు ఫలములు, దుంపలు ఇస్తాను అహారముగా స్వీకరించు " అన్నాడు. అలాగే అని ధృతరాష్ట్రుడి ఆతిథ్యాన్ని ధర్మరాజు సంతోషంగా స్వీకరించాడు. అందరూ ధృతరాష్ట్రుడు భోజనముగా ఇచ్చిన ఫలములను, కందమూలములను సంతోషముగా స్వీకరించారు. ఆ రోజు రాత్రి ఆశ్రమంలో నిద్రించారు. తెల్లవారిన తరువాత కాలకృత్యములు, సంధ్యావందనము మొదలైన కార్యక్రమమాలు పూర్తిచేసుకున్న తరువాత భార్య ద్రౌపది, తమ్ములతో, పరివారముతో కలసి ఆశ్రమము అంతా తిరిగి చూసారు. తరువాత ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి అతడికి నమస్కరించి ఎదురుగా ఒక ఆసనము మీద కూర్చుని ఇష్టాగోష్ఠి జరిపాడు. ఆ విధముగా ధర్మరాజు ఒక మాసము కాలము తన పరివారముతో అరణ్యములో గడిపాడు.

వ్యాసుడు ధృతరాష్ట్రుడి ఆశ్రయముకు వచ్చుట

[మార్చు]

ఒకరోజు ధృతరాష్ట్రుడు, ధర్మరాజు శతాయువు మొదలైన మహా మునులతో కుర్చుని సంభాషిస్తున్న తరుణములో అక్కడకు వ్యాసుడు వచ్చాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజు అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించారు. ధృతరాష్ట్రుడిని చూసి వ్యాసుడు " ధృతరాష్ట్రా ! నీకు వనవాసము అలవాటు అయ్యిందా ! తపస్సు ఆచరిస్తున్నావా ! తాపసులకు అనువైన పనులను నియమము తప్పక ఆచరిస్తున్నావా ! నీ పుత్రులు మరణించిన శోకము నీ మనసులో నుండి తొలగి పోయిందా ! నీ భార్య గాంధారి దుఃఖమును మరచి పోయిందా ! నీకు నీ భార్యకు పరిపూర్ణ జ్ఞానము లభించిందా ! కుంతీదేవి మీకుసేవలు చక్కగా చేస్తుందా ! మీరు అడవిలో ఉంటే తాను రాజభవనములో ఉండలేనని కుంతి మీతో అరణ్యాలకు వచ్చింది. ఆమె త్యాగము వర్ణనాతీతము కదా ! నీవు ధర్మరాజు మీద, భీమార్జున నకుల సహదేవుల మీద ప్రేమానురాగాలు కలిగి ఉన్నావా ! నీ మనసు నిర్మలంగా ఉన్నదా ! నీ మనసు నిర్మలమైనదా ! ధృతరాష్ట్రమహారాజా ! శత్రుత్వము, ఒకరికి అపకారము చేసే గుణమును కలకాలము నిలుపుకోకూడదు. మనసు సదా నిర్మలంగా నిలుపుకున్నప్పుడే సంపదలు కలుగుతాయి. విదురుడు శరీరము వదిలాడని విన్నాను. విదురుడు ఎవరో కాదు. అతడు సాక్షాత్తు యమధర్మరాజు. మాండవ్యముని శాపము కారణంగా మానవజన్మ ఎత్తాడు. బ్రహ్మదేవుడి ఆదేశాన్ని అనుసరించి అంబిక యొక్క దాసికి పుత్రుడిగా శూద్రగర్భమున జన్మించాడు. అతడే కాదు ధర్మరాజు కూడా యమధర్మరాజు ప్రతిరూపమే. అందుకే విదురుడు యోగబలముతో తన అంశను ధర్మరాజులో కలిపాడు. అటువంటి దేవతా స్వరూపుడైన ధర్మరాజు చేత సేవలు అందుకుంటున్నందుకు సంతోషంగా ఉందా ! " అన్నాడు.

ధృతరాష్ట్రుడి వైరాగ్యము

[మార్చు]

ధృతరాష్ట్రుడు వ్యాసుడితో వినయముగా " వ్యాసమునీంద్రా ! ఈ వనవాసము నాకు ఏమాత్రము బాధకలిగించడము లేదు. నా దేహము చిత్తము తపస్సు చేసుకోవడములో నిమగ్నము అయ్యాయి. నేను కాని గాంధారి కాని పుత్రశోకమును ఇసుమంత కూడా అనుభవించడము లేదు. ఆ దుఃఖమును మేము ఎప్పుడో మరచిపోయాము. నాకు ధర్మరాజు మీద, అతడి తమ్ముల మీద అంతులేని అనురాగము ఉంది. ఈ ధర్మరాజు సాక్షాత్తు ధర్మదేవతా స్వరూపుడని నాకు తెలుసు. ఆ మాటలను నేను ఎప్పటికప్పుడు నా మాటలతో చేతలతో ధర్మరాజుకు తెలియజేస్తున్నాను. కుంతి రాజభోగములు వదులుకుని మా వెంట అరణ్యాలకు వచ్చి మాకు సేవలు చెయ్యడము మాకు ఎంతో ఆశ్చర్యము కలిగిస్తోంది. తమరి దయవలన మాకు అధ్యాత్మపరిజ్ఞానము, మానసిక నిర్మలత్వము కలిగాయి " అని వినయముగా చెప్పాడు. ఆ సమయములో ద్రౌపది, సుభద్ర మొదలైన అంతఃపురకాంతలు వ్యాసుడి దర్శనము కొరకు వచ్చి ఆయనకు భక్తితో నమస్కరించారు. వారిని అందరిని వ్యాసుడు ఆశీర్వదించాడు. తరువాత ధృతరాష్ట్రుని చూసి వ్యాసుడు " మీ అందరికి మీ మనసులలోని చింతలను తీర్చి మంచిబుద్ధి కలిగించే తలంపుతో ఇక్కడకు వచ్చాను. మీకు ఇష్టము వచ్చినది అడగండి. మీ కోరికలు తీరుస్తాను " అని అన్నాడు.

ధృతరాష్ట్రుడు వ్యాసుడిని కోరిన కోరిక

[మార్చు]

వ్యాసుడికి బదులిస్తూ ధృతరాష్ట్రుడు " వ్యాసమునీంద్రా ! తమరు మా మీద దయతో మా వద్దకు రావడమే మహాభాగ్యము. ఇంతకంటే మేము కోరేది ఏముంటుంది. మీ దయ మాకు లభించింది అంతకంటే అధికమైనది ఏమున్నది. మీరు మా వద్దకు రావడము మమ్ము ఆదరించడముతో నా జన్మ ధన్యము అయింది. నాకు ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుందో లేదో అన్న భయము పోయింది. నేను ధన్యులలో ధన్యుడిని అయ్యాను. అయినా మీరు కోరమన్నారు కనుక అడుగుతున్నాను. నా కుమారుడు దుష్టస్వభావము కలవాడు. పాండవులు పాపస్వభావము లేనివారు, పుణ్యాత్ములు. అటువంటి వారిని నా కుమారుడు సుయోధనుడు పరాభవించాడు. తన మిత్ర రాజులందరిని ససైన్యముగా యుద్ధ భూమికి బలి ఇచ్చాడు. భీష్మ, ద్రోణ, కర్ణులను బలి ఇచ్చి చివరకు తాను కూడా బలి అయ్యాడు. అధముడైన సుయోధనుడి కొరకు తమ భార్యా, బిడ్డలను, రాజ్యాలను వదిలి వచ్చిన నానా దేశాల రాజులకు ఎటువంటి సద్గతులు లభించాయి. మరణించిన తరువాత వారు పొందిన లోకములు ఏమిటి వారు ఏమయ్యారో తెలియజేయండి " అని అడిగాడు.

గాంధారి కోరిన కోరిక

[మార్చు]

గాంధారి వ్యాసుడికి నమస్కరించి " వ్యాసమునీంద్రా ! భారతయుద్ధము జరిగి 16 సంవత్సరాలు అయ్యాయి. ఈ 16 సంవత్సరాలు నా భర్త ధృతరాష్ట్రుడు కొడుకుల కొరకు పరితపిస్తూ ఉన్నాడు. ఆయనే కాదు నేను, ద్రౌపది, సుభద్ర, కుంతి, నా కోడళ్ళు నూరుమంది, యుద్ధములో చనిపొయిన భూరిశ్రవుడు, సోమదత్తుడు, బాహ్లికుడి భార్యలు యుద్ధములో చనిపోయిన తమ భర్తలు, కొడుకులు ఎలా ఉన్నారో అని పరితపిస్తున్నారు. వారిని చూడాలని ఆతురతగా ఉన్నారు. ఈ సృష్టిలో ఎన్ని లోకాలు ఉన్నాయో అన్నీ నీ యోగశక్తితో చూపగల సమర్ధులు మీరు. మాకు ఈ మాత్రము చూపలేరా ! కనుక మాకు మా బంధువులు ఎక్కడ ఉన్నారో చూపండి. మా దుఃఖములు తొలగించండి. ఇదే మా కోరిక " అని అందరి కోరికగా గాంధారి చెప్పింది.

కుంతీదేవి సందేహము

[మార్చు]

కుంతీదేవి వ్యాసుడికి నమస్కరించిన సమయములో కుంతీదేవికి తన కుమారుడు కర్ణుడు మనసులో మెదిలాడు. కుంతి మనసు బాధపడింది. అది వ్యాసుడు గ్రహించి " అమ్మా కుంతీదేవి ! గాంధారి తన కోరిక తెలియజేసింది. నీ మనసులో కోరిక కూడా తెలియజేస్తే అది కూడా తీరుస్తాను " అని అన్నాడు. కుంతీదేవి వ్యాసుడికి నమస్కరించి " వ్యాసమునీంద్రా ! నీవు దేవతలకు దేవతవు. నీవు నా భర్తకు తండ్రివి. నిన్ను మామామగారుగా పొందడము మా అదృష్టము. నా మీద దయ ఉంచి నా విన్నపము ఆలకించు. నేను కన్యగా ఉన్నప్పుడు దుర్వాస మహాముని మా తండ్రి వద్దకు వచ్చాడు. ఆయనకు సేవలు చెయ్యడానికి నా తండ్రి నన్ను నియమించాడు. నా సేవలకు దుర్వాసుడు మెచ్చుకుని " నీకు ఒక వరము ఇస్తాను కోరుకో " అన్నాడు. నేను " మహానుభావా ! మీ దయ మా మీద ఉన్నది నాకు అంతే చాలు. నాకు ఇక ఏ వరమూ అవసరము లేదు " అని అన్నాను. దుర్వాసుడు " నేను వరము ఇస్తానని అన్నప్పుడు నీవు కాదని అనకూడదు. అడుగు " అన్నాడు. నేను భయపడి " నాకు పుత్రుడిని ప్రసాదించమని అడిగాను " అప్పుడు ఆ ముని నాకు ఒక మంత్రము ఉపదేశించి " ఈ మంత్రము మననము చేసి ఏ దేవతను పిలిస్తే ఆ దేవత వచ్చి నీకు పుత్రుడిని ప్రసాదిస్తాడు. కుంతీ ! సాక్షాత్తు యమధర్మరాజు నీకు కుమారుడిగా జన్మిస్తాడు " అని చెప్పాడు. తరువాత దుర్వాసుడు వెళ్ళిపోయాడు. నేను బాల్యచాపల్యము చేత ఆ మంత్రమును పరీక్షించాలని ఏ దేవతను పిలవాలా అని ఆలోచిస్తుండగా ఆకాశములో సూర్యుడు కనిపించాడు. నేను మంత్రము మననము చేసి సూర్యదేవుడుని ప్రార్ధించాను. నేను ఇది కేవలము వినోదము కొరకు చేసాను. కాని సూర్యదేవుడు నిజంగానే నా ముందు ప్రత్యక్షమై " నీకు ఏమి వరము కావాలో కోరుకో " అని అడిగాడు. నాకు భయము వేసి చేతులు జోడించి " అయ్యా ! మీరు ఎందుకు వచ్చారు ? వెళ్ళిపోండి " అని ప్రార్ధించాను. అందుకు సూర్యదేవుడు " కన్యామణీ ! వృధాగా ఎవరినైనా ఆహ్వానించడము తప్పు. నీకు మంత్రము ఎవరు ఉపదేశించారో నేను వారిని శపిస్తాను " అని కోపంతో అన్నాడు. నేను భయముతో వణికిపోయాను. నా బాల్యచాపల్యము వలన నిరపరాధి అయిన గురుదేవులు దుర్వాసులవారు శాపగ్రస్థులు కావడము ఇష్టపడక " దేవా ! తమరు నా మీద దయ ఉంచి తమరితో సమానతేజస్సు కలిగిన పుత్రుడిని ప్రసాదించండి " అని కోరాను. అప్పుడు సూర్యభగవానుడు " కన్యామణీ ! నీకు నా తేజోప్రభావముతో నాతో సమానుడైన తేజస్వి కుమారుడిగా జన్మిస్తాడు. నీవు కన్యవు కనుక నీ కన్యాత్వము చెడకుండా పుత్రుడు కలిగేలా వరము ప్రసాదిస్తున్నాను " అని పలికాడు. తరువాత సూర్యభగవానుడు వెళ్ళి పోయాడు. నేను గర్భవతిని అయ్యాను. తల్లితండ్రులకు తెలియకుండా అంతఃపురములో పుత్రుడిని ప్రసవించాను. కాని కన్యను అయిన నేను లోకనిందకు వెరచి కుమారుడిని పెంచలేక నదిలో విడిచి పెట్టాను. ఇది నాకు ఒక కలగా జరిగి పోయింది. తమరు జ్ఞానులు కనుక జరిగినది అంతా గ్రహించారు. కాని ఆ పుత్రుడు నాకు కలిగిన విధానము నదిలో వదిలిన విధానము నాకు ఇంకా బాధ కలిగిస్తుంది. నేను చేసింది పాపమో కాదో నాకు తెలియక పోయినా నేను నా కుమారుడిని నిర్ధయగా నదిలో వదిలి వేసినందుకు ఇప్పటికీ నా హృదయము దహించుకు పోతుంది. ఆ భయము ఇప్పటికీ నన్ను వదలడము లేదు కనుక మీరు నా భయాన్ని పోగొట్టండి. మరణించిన తన కుమారుడు ఎటువంటి ఉత్తమ గతులు పొందారో తెలుసుకోగోరుతున్న ఈ ధృతరాష్ట్రుడి కోరికను తీర్చండి. ఇదే మీరు నాకు ఇచ్చే కోరిక " అని వేడుకొన్నది.

కురుక్షేత్ర రహస్యము

[మార్చు]

వ్యాసుడు కుంతీదీవితో " కుంతీ ! నీవు చెప్పినది యదార్ధము. ఇందులో నీ తప్పు ఏమీ లేదు. దేవతలు ఇలాంటి అద్భుతాలు చేస్తూ ఉంటారు. కర్ణుడు అలా జీవించవలసి ఉన్నది. కనుక నీవు కర్ణుడిని నదిలో వదిలి పెట్టావు. కర్ణుడి పుట్టుక వలన నీ కన్యాత్వము భంగము కాలేదు కనుక నీవు స్త్రీలలో అగ్రగణ్యురాలవు. నీవు నిష్కళంక చరితవు అనడములో ఎటువంటి సందేహము లేదు. గాంధారీ నీవు కోరినట్లు నీ కుమారులను, బంధువులను, సోదరులను, కుంతి తన కుమారుడైన కర్ణుడిని, మీ మీ బంధువులను చూస్తారు. ద్రౌపది, సుభద్ర, మిగిలిన స్త్రీలు వారివారి పుత్రులను, కుమారులను, మనుమలను చూస్తారు. నేను ఈ పని చేయడానికే ఇక్కడకు వచ్చాను. నీ యొక్క, నీ భర్త యొక్క, కుంతి యొక్క, చింతలు పోగొట్టడానికి మీరు కోరిన కోరికలు నెరవేరుస్తాను. కాని గాంధారీ ! నీవు నీ కుమారుల గురించి, మనుమల గురించి చింతించ వలదు. వారు యుద్ధము చెసి వీరమరణము పొందారు. భారతయుద్ధము ఇలా జరగాలని ఎప్పుడో నిర్ణయించబడినది. ఎందరో దేవతలు తమ తమ అంశలతో ఈ భూమిమీద జన్మించారు. నీ భర్త పూర్వజన్మలో ధృతరాష్ట్రుడు అనే గంధర్వరాజు. అతదు ఈ జన్మలో అంధరాజుగా జన్మించాడు. యమధర్మరాజు అంశతో పుట్టిన వాడు ధర్మరాజు. వాయుదేవుడి అంశతో జన్మించిన వాడు భీముడు, అశ్వినీ దేవుల అంశతో జన్మించిన వారు నకులసహదేవులు నరనారాయణులలో నరుడు అర్జునుడిగాను నారాయణుడు శ్రీకృష్ణుడిగాను జన్మించారు. ద్వాపరుడు శకునిగాను, కలి అంశతో సుయోధనుడు జన్మించారు. రాక్షసాంశలతో దుశ్శాసనాది నీ మిగిలిన కుమారులు జన్మించారు. సూర్యుడి అంశతో కర్ణుడు, చంద్రుడి అంశతో అభిమన్యుడు జన్మించారు. అగ్నిలో నుండి పుట్టిన ద్రౌపదికి అన్నగా అగ్ని దేవుడే ధృష్టద్యుమ్నుడుగా జన్మించాడు. వాయుదేవుడి అంశతో అతడి సోదరుడు శిఖండి జన్మించాడు. బృహస్పతి అంశతో కులగురువు ద్రోణుడు జన్మించారు. అష్టవసువులలో ఎనిమిదవ వసువు శాపగ్రస్థుడై దేవవ్రతుడుగా జన్మించి భీష్ముడుగా ఖ్యాతి గాంచాడు. రుద్రుడి అంశతో అశ్వత్థామ జన్మించాడు. మిగిలిన రాజులంతా దేవతాంశలతో రాక్షసాంశలతో జన్మించారు. కనుక వీరంతా కారణజన్ములు. వారి వారి జన్మసాఫల్యము పొందగానే ఈ లోకాన్ని విడిచారు. కనుక ఎవరు ఎవరినీ చంపలేదు. ఇక మీరందరూ నాతో గంగాతీరానికి వచ్చారంటే అక్కడ మీ మనసులోని దుఃఖాన్ని పోగొట్టేలా మీ మీ మిత్రులను, కుమారులను, పౌత్రులను, బంధువులను చూపిస్తాను " అన్నాడు. అందరూ వ్యాసుడితో గంగాతీరానికి చేరారు. వారితో శతాయువు వంటి మునులు కూడా ఆ ఆశ్చర్యము చూడడానికి గంగాతీరము చేరారు. అప్పటికి సాయంత్రము అయింది. బంధుదర్శనము రేపు చేద్దామని వ్యాసుడు చెప్పాడు. అక్కడకు చేరిన వారంతా ఆ రాత్రి తమ వారిని చూడాలన్న ఉత్సుకతతో శతసంవత్సరాల పాటు ఎదురు చూసినట్లు ఎదురు చూసారు.

వ్యాసుడు చేసిన అద్భుతము

[మార్చు]

మరునాడు ఉదయమే అందరూ నిద్రలేచి ప్రాతఃకాలము నిర్వర్తించ వలసిన విధులను నిర్వర్తించారు. ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతీ, పాండవులు ఉత్సాహంతో వ్యాసుడి వద్దకు పోయి ఆయన చుట్టూ చేరారు. సకల జన్సమూహము జరగబోవు అద్భుతము తిలకించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వ్యాసుడు గంగానదిలో దిగి ఒక్క మునక వేసి పైకిలేచి చేతులు చాచి " అందరూ రండి " అని ప్రేమగా పిలిచాడు. ఇంతలో పెద్దగా చప్పుడు వినిపించింది. బిల బిల మంటూ నీళ్ళలో నుండి యుద్ధములో చనిపోయిన దుర్యోధనుడు, అతడి నూరుగురు తమ్ముళ్ళు, అతడియావత్తు కుంటుంబము, అభిమన్యుడు, అశ్వత్థామ చేతిలో హతమైన ఉపపాండవులు, మొదలగు పాండురాజు సంతతి వారు, కర్ణుడు, బాహ్లికుడు, మొదలైన కురుప్రముఖులు, ద్రుపదుడు, అతడి సంతతివారు, విరాటుడు, అతడి కుమారులు, శకుని అతడి అన్నదమ్ములు, అతడి కుమారులు, వీరందరికి ముందు భీష్ముడు, ద్రోణుడు ముందు నడువగా గంగానది నుండి దివ్యశరీరధారులై వెలుపలికి వచ్చారు. ధృతరాష్ట్రుడు అంధుడు కనుక వారిని చూడలేదు. వ్యాసుడు అతడికి దివ్యదృష్టి ప్రసాదించాడు. గాంధారి కూడా తన కళ్ళకు కట్టుకున్న వస్త్రమును తొలగించింది. అందరూ తమ పుత్రపౌత్ర సమేతంగా బంధువులను చూసారు. వారంతా నవ్వుతు తుళ్ళుతూ ప్రేమగా హాయిగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వీరేనా యుద్ధములో ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకున్నది. సుయోధనుడిలో పూర్వము ఉన్న అభిమానము, క్రౌర్యము మచ్చుకు కూడాలేవు. అంతా ప్రేమమయముగా ఉన్నారు. అందరూ కలసి ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చారు. వారిరాక అక్కడి వారికి ఆశ్చర్యము ఆనందము కలిగించింది. చిన్న వారందరూ తమకన్నా పెద్ద వారికి నమస్కారాలు చేస్తున్నారు. పెద్ద వాళ్ళు చిన్న వారిని ఆశీర్వదించారు. అంతా ఆనందంగా ఉన్నారు. అక్కడ దివ్యశరీరులు మానశరీరులు కలసిమెలసి ఉన్నారు. భీష్ముడు తనకంటే చిన్న వారిని, ద్రోణుడు తన శిష్యులను, తమ తమ తండ్రులను, తల్లులను, కొడుకులను, కూతుళ్ళను, మనుమలను, మనుమరాళ్ళను, బావలను, మరుదులను, అన్నలను, తమ్ములను, అక్కల్ను, చెల్లెళ్ళను, అత్తగార్లను, మామగార్లను, కోడళ్ళను, అల్లుళ్ళను తదితర బంధువులను కలుసుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ రోజంతా అందరూ పూర్వ వైరములు మరచి హాయిగా గంగాతీరములో గడిపారు.

దివ్యశరీరులకు వీడ్కోలు

[మార్చు]

మరునాడు ఉదయము దివ్యశరీరులు మానవశరీరుల వద్ద వీడ్కోలు తీసుకున్నారు. తిరుగుప్రయాణానికి సిద్ధము అయ్యారు. దివ్యసరీరులు తమ తమ లోకాలకు వెళ్ళడానికి గంగానదిలో దిగారు. వారికి వీడ్కోలు పలికేసమయములో వ్యాసుడు " చనిపోయిన మీ భర్తలను కలుసుకున్నారు. మీలో ఎవరైనా మీ భర్తలను అనుసరించి వారితో దివ్యలోకాలకు వెళ్ళాలని అనుకుంటే వెళ్ళవచ్చు అలాంటి వారు వచ్చి గంగానదిలో మునగండి. వెంటనే యుద్ధములో చనిపోయిన వీరుల భార్యలు అందరూ ధృతరాష్ట్రగాంధారీల అనుమతి తీసుకుని తమ భర్తలను అనుసరించడానికి గంగానదిలో మునిగారు. వెంటనే వారంతా తమ మానవశరీరలను వదిలి దివ్యసరీరాలను ధరించి తమ భర్తలను అనుసరించారు. ఆ దృశ్యమును చూసిన వారు ఆశ్చర్యచకితులు అయ్యారు. ఆ విధముగా అక్కడ వారికి వ్యాసుడి దయ వలన బంధు సమాగమము జరిగింది. ధృతరాష్ట్రుడికి తిరిగి అంధత్వము ప్రాప్తించింది. శతాయువు మొదలైన మహామునులు ధృతరాష్ట్రుడి వద్ద శలవు తీసుకుని తమ నివాసములకు వెళ్ళారు. వ్యాసుడు ధృతరాష్ట్రుడితో " కుమారా ! చూసావా నీ కుమారులు ఈ లోకముకంటే పై లోకాలలో సుఖముగా ఉన్నరు. ఇకనైనా వారి మరణము గురించి చింతించ వలదు. ధర్మరాజు ఇక్కడకు వచ్చి ఒక మాసము అయ్యింది. అతడు నీవు వెళ్ళమని చెప్పే వరకు వెళ్ళడు. అతడు వెళ్ళక పోతే అక్కడ రాజ్యపాలన కుంటువడుతుంది " అని వ్యాసుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు " మునీంద్రా ! అలాగే చెప్తాను. మీ దయ వలన నాకు కుమారులను చూసే భాగ్యము కలిగింది. కృతార్ధుడను అయ్యాను " అన్నాడు.

ధృతరాష్ట్రుడు ధర్మరాజును రాజ్యముకు మరలమని చెప్పుట

[మార్చు]

ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో " నాయనా ధర్మతనయా ! నీవు ఇక్కడకు వచ్చి చాలారోజులు అయింది. అక్కడ రాజ్యపాలన కూడా చెయ్యాలి కదా ! అక్కడ ఉంటేనే కదా అను దినము రాచకార్యములు సక్రమంగా నడిచేది. నీవు రాజనీతి గురించి భీష్మాదుల వలన తెలుసుకున్నావు. నేను ప్రత్యేకముగా చెప్పవలసినది ఏమీ లేదు. నీవు రాజధానిలో లేని సమయము చూసి శత్రువులు విజృంభించే ప్రమాదము ఉంది. కనుక నీవు నీ తమ్ములను తీసుకుని వెంటనే హస్థినాపురము వెళ్ళు. నీ రాకవలన నా మనసులో ఉన్నబాధ మాయము అయ్యింది. ఇప్పుడు నా మనసు ప్రాపంచక విషయముల మీదలేదు తపస్సు చేయాలని మాత్రమే ఉంది. మీరు ఇక్కడ ఉంటే నా తపస్సు కు భంగము కలుగుతుంది. కనుక నీవు నీ అన్నదమ్ములు, అంతఃపుర స్త్రీలు, పరివారముతో సహా రాజధానికి తిరిగి వెళ్ళండి " అన్నాడు. ధర్మరాజు చేతులు జోడించి " పెదనాన్నా ! మీరు చెప్పినట్లే చెస్తాను. రాజ్యభారము వహించడానికి భీముడిని, అర్జునుడిని, నకులసహదేవులను పంపి నేను ఇక్కడే ఉండి మీ పాదసేవ చేసుకుని తరిస్తాను. నాకు అనుమతి ఇవ్వండి " అన్నాడు. ఆ మాటలకు గాంధారి " కుమారా ! ధర్మనందనా ! నీవు ఇలా మాట్లాడ తగదు. నీవు ఇక్కడ సన్యాసదీక్ష తీసుకుని ఇక్కడ ఉంటే అక్కడ రాజ్యపాలన ఎవరు చేస్తారు. నీ యొక్క మా యొక్క పితరులకు ఎవరు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు. కనుక నీవు రాజధానికి వెళ్ళడమే ఉత్తమము " అని గాంధారి పలికింది. ధర్మరాజు " అమ్మా ! మీరు ఎన్ని చెప్పినా ఇంత ప్రశాంతముగా ఉన్న ఈ అరణ్యమును విడిచివెళ్ళడానికి నా మనస్సు ఒప్పడము లేదు. నా మనసులో ఇదివరకటిలా రాజ్యకాంక్ష లేదు. అమ్మా ! అటు పాంచాలవంశము లోనూ ఇటు మత్స్య వంశము లోనూ స్త్రీలు తప్ప పురుషులు అందరూ యుద్ధములో మరణించారు. కేవలము స్త్రీలు మాత్రమే మిగిలారు. ఇదంతా నా వలనేకదా జరిగింది. ఆ వంశములో కేవలము ఒక్క పురుషుడు కూడా లేని రాజ్యము నాకు అవసరము లేదు. భారతయుద్ధము జరిగినప్పటి నుండి నా మనసు రాజ్యపాలన మీద లేదు తపస్సు మీదనే లగ్నము అయి ఉంది. నేను మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించను. నన్ను ఇక్కడ ఉండడానికి అనుమతించండి. మరేమీ మాట్లాడకండి " అన్నాడు. వెంటనే సహదేవుడు ఇలా అన్నాడు " అన్నయ్యా ! నేను కూడా ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటాను. నా తల్లి కుంతికి, మా పెదనాన్న ధృతరాష్ట్రుడికి, గాంధారికి సేవలు చేసుకుంటూ ఉంటాను. తమరు అంతఃపుర కాంతలను తీసుకుని హస్థినాపురము వెళ్ళండి " అన్నాడు. తన చిన్న కుమారుడు అన్న మాటలకు పొంగి పోయిన కుంతీదేవి సహదేవుడిని గుండెలకు హత్తుకుని " నాయనా ! సహదేవా ! మీరు అందరూ రాజధర్మములో సమర్ధులు. మీరు సమర్ధవంతముగా రాజ్యపాలన చేయాలి కాని మాకు సేవలు చేస్తూ అరణ్యములలో ఉండ తగదు. ఇంకో మాట మీరు ఇక్కడ ఉంటే మాకు తపోభంగం కావడము నిశ్చయము. మాకు ఏకాగ్రత కుదరదు. మీరు ఇక్కడ ఉండడము మాకు కీడే కాని మేలు కాదు. కనుక మీరందరూ హస్థినకు వెళ్ళండి. ఇది నా మాట ఒక్కటే కాదు. బావగారు ధృతరాష్ట్రుడు, అక్క గాంధారుల మాట కూడా ఇదే. కనుక మీరిక పోయి రావచ్చును " అని చెప్పింది. ఇక చేసేది ఏమీ లేక ధర్మరాజు పెదతండ్రి వద్ద శలవు తీసుకున్నాడు. ధృతరాష్ట్రుడు భీమార్జున, నకులసహదేవులను ఆలింగనము చేసుకుని ఆశీర్వదించాడు. పాండవులందరూ ధృతరాష్ట్రుడి పాదములకు నమస్కరించి ఆయన ఆశీర్వాదము తీసుకున్నారు. తరువాత పాండవులు పెదతల్లి గాంధారికి తల్లి కుంతీదేవికి నమస్కరించి వారి దీవెనలు పొందారు. తరువాత ద్రౌపది, సుభద్ర మొదలైన అంతఃపుర కాంతలు కూడా అందరి వద్దా శలవు తీసుకున్నారు. అందరూ తిరిగి హస్థినాపురము వెళ్ళారు.

నారడుడి రాక

[మార్చు]

తరువాత కొన్ని దినములు గడచిన తరువాత ధర్మరాజు తన తమ్ములతో ఇష్టాగోష్టి జరుపుతున్న సమయములో అక్కడకు నారదుడు వచ్చాడు. పాండవులు నారదుడికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించి ఉచితాసనము మీద కూర్చుండబెట్టారు. ధర్మరాజు నారదుడితో " మహానుభావా ! తమరు ఎక్కడి నుండి వచ్చారు. తమరి రాకకు కల కారణము ఏమిటి ? " అని అదిగాడు. నారదుడు " ధర్మనందనా ! నేను లోకసంచారము చెస్తూ ఎన్నో దేశాలు తిరిగాను. నిన్ను చూసి చాలారోజులు అయింది కనుక నిన్ను చూడాలని వచ్చాను. గంగానది వద్ద ఉన్న మునుల వలన మీ పెదనాన్న ధృతరాష్ట్రుడి తపస్సు గురించి విన్నాను " అన్నాడు. అది విని ధర్మరాజు " మహాత్మా ! మా పెద తండ్రిగారూ, మా పెద తల్లిగారూ, మా తల్లి కుంతి క్షేమమేనా ? వారికి ఏ ఇబ్బంది కలగ లేదు కదా ! " అని అడిగాడు. నారదుడు " ధర్మనందనా ! నీకు అన్ని విషయాలు సవిస్తరముగా చెప్తాను. సావధాన చిత్తుడవై విను. మీరందరూ ధృతరాష్ట్రుడి ఆశ్రమము నుండి వచ్చిన తరువాత కొంత కాలము బాగానే జరిగింది. ఒక రోజు మీ పెద తండ్రి ధృతరాష్ట్రుడు, పెద తల్లి గాంధారి, మీ తల్లి కుంతి, సంజయుడు అగ్నిహోత్రముతో సహా తపస్సు చేసుకోడానికి గంగానదీ తీరములో ఉన్న అరణ్యాలకు వెళ్ళారు. అక్కడ ధృతరాష్ట్రుడు కేవలము గాలి మాత్రమే తింటూ తపస్సు చేయసాగాడు. గాంధారి కూడా కేవలము నీరు మాత్రమే ఆహారముగా తీసుకుని తపస్సు చేయసాగింది. మీ తల్లి కుంతి మాసముకు ఒకసారి మాత్రము ఆహారము తీసుకుంటూ తపస్సు చేయసాగింది. సంజయుడు వారముకు ఒకసారి మాత్రము ఆహారము తిని తపస్సు చేయసాగాడు. ఇలా యాజకులు నిత్యము అగ్నిహోత్రము రగిలిస్తూ ఉండేవారు. ఒక్కోసారి ధృతరాష్ట్రుడు ఒంటరిగా తిరుగుతూ ఉండే వాడు. ఒక రోజు వారందరూ గంగానదిలో స్నానము చేసి వస్తున్న సమయములో అడవికి నిప్పు అంటుకుని దావానలము తీవ్రముగా వ్యాపించింది. అడవి అంతా చుట్టుముట్టింది. పక్షులూ జంతువులు కకావికలు అయిపోయాయి. గాంధారీ, ధృతరాష్ట్రులు నిరాహారముగా ఉన్న కారణాన అక్కడ నుండి వేగంగా పరిగెత్తి ఆ మంటల బారి నుండి ప్రాణములు రక్షించుకొన లేక అక్కడె నిలబడిపోయారు. ధృతరాష్ట్రుడు సంజయుడితో " సంజయా ! నీవు అగ్నిజ్వాలలు లేని చోటుకు పారిపో. పారి పోవడానికి మాకు శక్తిలేదు కనుక మేము రాలేము. నీవు పారిపొయి నీ ప్రాణములు రక్షించుకో " అని చెప్పాడు. సంజయుడు " మహారాజా ! జీవితమంతా కలసి ఉన్నాము. ఇక మీదటకూడా అలాగే ఉంటాము. నా ప్రాణాలు కాపాడుకోవడానికి మిమ్ము వదిలి వంటరిగా వెళ్ళ లేను. ధృతరాష్ట్రుడు " సంజయా ! మేము తప్పించుకునే పరిస్థితిలో లేము. కాని నీవు తప్పించుకు పారి పోగలవు. ఇది పాపము కాదు వెళ్ళిపో " అని అన్నాడు ధృతరాష్ట్రుడు. ఎలాగైతేనేం ధృతరాష్ట్రుడు సంజయుడిని అక్కడ నుండి పారిపోవడానికి సమ్మతింపజేసాడు. తరువాత ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతీ ఆయన పక్కనే కూర్చున్నారు. సంజయుడు ఆ మంటలు తప్పించుకుని హిమాలయాలకు పారిపోయాడు. ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతీలను ఆ మంటలు చుట్టుముట్టాయి. చివరకు వారు ముగ్గురూ మంటలకు ఆహుతి అయ్యారు. ఇదంతా నాకు గంగాతీరాన ఉండే మునులు చెప్పారు. ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతీలు అడవులకు వెళ్ళడము, మీరు వారిని చూడడానికి రావడము, తిరిగి మీరు హస్థినకు వెళ్ళడము ఆ మునుల వలన తెలుసుకున్నాను. తరువాత నేను ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతీల మృతదేహాలను కూడా చూసాను. ఈ విషయము నీకు చెప్పి పోదామని వచ్చాను. వారంతా ఉత్తమలోకాలకు వెళ్ళారు. నీవిక బాధపడవలసిన అవసరము లేదు " అన్నాడు.

పాండవులు పెద్దలకు తిలోదకాలు సమర్పించుట

[మార్చు]

నారదుడు చెప్పిన విషయము విని ధర్మరాజు భీమార్జున నకులసహదేవులు దుఃఖముతో రోదించసాగారు. ఈ విషయము అంతఃపుర స్త్రీలకు తెలిసి అంతా శోకసముద్రములో మునిగి పోయారు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి దావానలములో ఆహుతి అయ్యారు అన్న విషయము హస్థినాపురము అంతా వ్యాపించింది. జనులంతా తండోపతండాలుగా రాజప్రాసాదానికి రాసాగారు. అంతా తమమహారాజు మరణానికి ధుఃఖిస్తున్నారు. తన ఏడుపుని దిగమింగుకుని ధర్మరాజు నారదుడితో " మునీంద్రా ! ఎవరి చావు ఎక్కడ వ్రాసి పెట్టి ఉందో ఎవరికి తెలుసు. మేమంతా ఉండగా మా పెదనాన్న కురువృద్ధుడు దిక్కు లేని చావు చచ్చాడు. నూరుగురు కుమారులు ఉండీ, వెయి ఏనుగుల బలము ఉండీ కూడా ధృతరాష్ట్రుడు నిస్సహాయంగా అగ్నికి ఆహుతి అయ్యారు. పట్టు పానుపు మీద హాయిగా నిద్రిస్తూ వంధిమాగధుల కైవారాలతో నిద్ర లేవవలసిన ధృతరాష్ట్రుడు ఇప్పుడు కటిక నేల మీద పడి ఉండి నక్కలు తోడేళ్ళ ఊళలు వింటూ దిక్కు లేకుండా పడి ఉన్నాడు. నారదా ! గాంధారి తన భర్తతో మరణించింది. ఆమె గురించి చింతించవలసిన పని లేదు. కాని మా తల్లి కుంతీదేవి మేమంతా రాజభోగాలు అనుభవిస్తుంటే అడవులకు వెళ్ళి అక్కడ అగ్నికి ఆహుతి అయ్యింది. ఆమె గురించే నా దుఃఖం అంతా. ఆమె కడుపున పుట్టిన భీమార్జునులు, నేను, మాద్రీ సుతులు నకులసహదేవులు ఇంతమంది కుమారులను పెట్టుకుని మా తల్లి అనాధగా దిక్కులేని చావుచచ్చింది. ఆమె గురింది దుఃఖించకుండా ఎలా ఉండగలను చెప్పు. నారదా ! తమరికి తెలుసు కదా ! ఖాండవనదహన సమయములో అర్జునుడు అగ్నిదేవుడికి చేసిన సాయము మరచి అగ్నిదేవుడు మా తల్లిని ఎలా దహించాడు. ఆఅగ్నిదేవుడికి కృతజ్ఞత లేదా ! అగ్నిదేవుడు ఇంత కృతఘ్నుడా ! మునీంద్రా ! ఇక ఎంత వగచి ఏమి ప్రయోజనము. మా పెదనాన్న, పెదతల్లి, మా తల్లి అగ్నికి ఆహుతి అయ్యారు కదా ! వారికి మేము ఏమి చెయ్యాలి చెప్పండి " అని అడిగాడు. నారదుడు " ధర్మనందనా ! నీకు మరో విషయము చెప్పాలి. ఇది జరిగిన ముందు రోజు ధృతరాష్ట్రునికి విరక్తి అధికమై అగ్నికి ప్రత్యేక పూజలు చేసి అగ్నిదేవుడి వద్ద శలవు తీసుకున్నాడు. ఆ అగ్నిని వేల్చిన ఋత్విక్కులు అగ్నికి అక్కడ ఉద్వాసన చేసి అగ్నిని అక్కడే వదిలి వెళ్ళారు. ఆ అగ్ని కార్చిచ్చుగా మారి ఆ అడవిని దహించి వేసింది. ఆ అగ్నిలో వారు ఆహుతి అయ్యారు. కనుక నీవు, నీ తమ్ములు, ద్రౌపది మొదలైన అంతఃపుర కాంతలు అందరూ గంగానదికి వెళ్లి స్నానము చేసి మీ పెదనాన ధృతరాష్ట్రుడికి, గాంధారికి, కుంతీదేవికి తిలోదకాలు ఇవ్వండి " అన్నాడు. వెంటనే పాండవులు, అంతఃపురకాంతలు, పురజనులు అంతా గంగాతీరానికి వెళ్ళి గంగా స్నానము చేసి తిలోదకాలు ఇచ్చారు. పదిరాత్రులు గంగాతీరమున కుటీరాలు నిర్మించుకుని అక్కడే నివసించారు. సమర్ధులైన వారిని పిలిపించి ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతీదేవిల అస్థికలు సేకరించి వాటిని గంగానదిలో నిమజ్జనము చేసారు. శ్రాద్ధకర్మలు శ్రద్ధగా చేసారు. దానధర్మాలు విరివిగా చేసారు. వారికి ఉత్తమలోక ప్రాప్తికి కావలసిన అన్ని కార్యక్రమములను శ్రద్ధగా చేసారు. శ్రాద్ధకర్మలు జరిగిన 12 రోజులు నారదుడు అక్కడే ఉండి అన్ని సక్రమంగా జరిపి ధర్మరాజును అతడి తమ్ములను ఆశీర్వదించాడు. తరువాత ధర్మరాజు తన తమ్ములతో అంతఃపురకాంతలతో హస్థినాపురము చేరాడు. ఈ విధముగా ధృతరష్ట్రుడు భారతయుద్ధము తరువాత 15 సంవత్సరములు హస్థినాపురములోను 3 సంవత్సరములు అరణ్యములోను గడిపి పరలోకము చేరుకున్నాడు " అని భారతకథను వైశంపాయనుడు జనమేజయుడికి వినిపించాడు.

వనరులు

[మార్చు]