Jump to content

ఆది పర్వము షష్టమాశ్వాసము

వికీపీడియా నుండి
==షష్ఠాశ్వాసం==

అస్త్ర విద్యా ప్రదర్శన

[మార్చు]

పాండవులూ కౌరవులూ అస్త్రశస్త్ర విద్యాభ్యాసంలో నైపుణ్యం సాధించారు. ఒక రోజు ద్రోణుడు దృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి భీష్ముడు, వ్యాసుడు, విదురుడు, శల్యుడు, కృపుడు, సోమదత్తుడు, శకుని లాంటి పెద్దల ముందు రాజకుమారుల విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయమని కోరాడు. దృతరాష్ట్రుడు అందుకు సమ్మతించి విదురుని పిలిచి తగు ఏర్పాట్లు చేయమని కోరాడు. విదురుడు ప్రదర్శనశాలను నిర్మింపచేసాడు. అస్త్ర విద్యా ప్రదర్శనకు దృతరాష్ట్రుడు గాంధారి సమేతంగా వచ్చాడు. వ్యాసమహర్షీ, కృపాచార్యుడు, శల్యుడు, భీష్ముడు, సోమదత్తుడు, విదురుడు తమతమ ఆసనాలలో ఆశీనులైయ్యారు. తేజో మయుడై ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలతో అక్కడకు వచ్చాడు. ఆయన వెనుక పాండవులూ కౌరవులూ వయసు క్రమంగా వరుసగా నిలిచారు. ముందుగా రాకుమారు లందరూ అస్త్రశత్ర ప్రదర్శన చేసారు. ఆ తరువాత భీముడు, దుర్యోధనుడు గధాయుద్ధ ప్రదర్శన ప్రారంభించి తమ నైపుణ్యం చూపించసాగారు. వారిరువురు తీవ్రంగా పోరాడు కుంటున్నారు. వారి యుద్ధాన్ని చూస్తున్న పౌరులు కావేషాలు పెంచుకుంటున్నారు. విదురుడు దృతరాష్ట్రునికి గాంధారికి జరుగుతున్నవి వివరించి చెప్తున్నాడు. పరస్థితి చేయి దాటుతుందని గ్రహించిన ద్రోణుడు అశ్వత్థామను భీమ, దుర్యోదన యుద్ధాన్ని ఆపించాడు.

అర్జుడి విలువిద్యా ప్రదర్శన

[మార్చు]

ఆ తరువాత అర్జునిని విలువిద్యా ప్రదర్శన ఉంటుందని ప్రకటించాడు. అర్జునుడు రంగప్రవేశం చేయగానే జనులు ఆనందోత్సాహాలతో జయజయ ధ్వానాలు చేయడం ప్రారంభించారు. కొడుకు ప్రయోజకుడై నందుకు కుంతీదేవి ఆనందించింది. విదురుని ద్వారా ఆ కలకలానికి కారణం తెలుసుకుని దృతరాష్ట్రడు గాంధారి సంతోషించారు. అర్జునుడు గురువు అనుమతి తీసుకుని ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, వాయవ్యాస్త్రం, మేఘాస్త్రం మొదలైనవి ప్రదర్శించాడు. ప్రజలు అర్జునిని అస్త్ర విద్యా నైపుణ్యం చూసి ఆశ్చర్యచకితులైయ్యారు. ఇంతలో కర్ణుడు రంగస్థల ప్రవేశం చేసాడు. సహజ కవచకుండలాలతో ప్రకాసిస్తున్న కర్ణుని చూసి జనులు విస్మయం చెందారు.

కర్ణుడిప్రవేశం

[మార్చు]

కర్ణుడు సభామధ్యమంలో నిలబడి గురువుకు నమస్కరించి అర్జునితో " అర్జునా ఈ విద్యలు ప్రదర్శించటానికి ప్రావీణ్యం అవసరం లేదు జనం మెచ్చేలా ఈ విద్యలు నేను కూడా ప్రదర్శించగలను " అన్నాడు. అది చూసి అర్జునుడు కోపించాడు. దుర్యోధనుడు సంతోషించాడు. కర్ణుడు ద్రోణుని అనుమతితో అర్జునుడు చేసిన విద్యలన్నీ ప్రదర్శించాడు. దుర్యోధనుడు ఆనందంతో కర్ణుని వద్దకు వెళ్ళి తనతో చెలిమి చేయమని కోరాడు. కర్ణుడు అర్జునితో ద్వందవిద్యా ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ద్రోణుని అనుమతి కోరాడు. పిలవకుండా వచ్చినందుకు అర్జునుడు కర్ణుని ఆక్షేపించాడు. కర్ణుడు అస్త్ర విద్యా ప్రదర్శన వీరుల సొత్తు కనుక ఎవరూ పిలవనవసరం లేదని అభిప్రాయం వెలిబుచ్చాడు. దుర్యోధనుడు వెంటనే కర్ణినికి అర్జునినితో ద్వందయుద్ధానికి అనుమతి ఇచ్చాడు. ఇరువురి మధ్య యుద్ధం గోరంగా సాగింది. ఒకసమయంలో కర్ణుడు ప్రయోగించిన పర్జన్యాస్త్రం అర్జునిని కనిపించకుండా చేయగానే కుంతీదేవి మూర్చ పోయింది. అర్జునుడు వాయవ్యాస్త్రంతో ఆ మేఘాలను పారద్రోలాడు.

కర్ణుడిరాజ్యాభిషేకం

[మార్చు]

వ్యవహారం శృతి మించుతుందని గ్రహించిన కృపాచార్యుడు ఇద్దరి మధ్యా నిలిచి "కర్ణా ఇతడు పాండు సుతుడు. క్షత్రియుడు అర్జునినితో యుద్ధం చేయాలంటే నీవు నీ వంశక్రమం తల్లి తండ్రుల గురించి చెప్పాలి " అన్నాడు. కర్ణుడు బదులు చెప్పలేక సిగ్గుతో తలవంచుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చి "కులము, శౌర్యమూ, అధిక సేన కలవారు రాజులుగా అంగీకరింపబడతారు కనుక కర్ణుని ఇప్పుడే అంగరాజ్యానికి రాజుని చేస్తాను" అని చెప్పి చెంటనే భీష్మ దృతరాష్ట్రుల అనుమతితో రాజ్యాభిషిక్తుని చేసాడు. కర్ణుడు పొంగిపోయి ఆనందంతో "నాకు నీవిచ్చిన ఈ గౌరవానికి నీకు నేను ఏమి చెయ్యగలను" అన్నాడు. దుర్యోధనుడు బదులుగా అతని స్నేహం కావాలని కోరాడు. కర్ణుడు అందుకు అంగీకరిస్తూ జీవితాంతం తన స్నేహాన్ని అందిస్తానని మాటిచ్చాడు. అప్పుడు అక్కడకు చేరిన కర్ణుని తండ్రిని చూసిన భీముడు "సూత పుత్రుడవైన నీవు రథం నడుపుకోక అర్జునినితో యుద్ధం ఎందుకు" అని చులకనగా మాట్లాడాడు. అందుకు దుర్యోధనడు "ఇంతటి తేజశ్శాలి సూతకులంలో పుడతాడా? అయినా దేవతల పుట్టుక, ఋషుల పుట్టుక, నదుల పుట్టుక, వీరుల పుట్టుక ఎంచకూడదని నీకు తెలియదా? దేవేంద్రుని వజ్రాయుధం దధీచి వెన్నెముక నుండి పుట్ట లేదా? పరమ శివుని కుమారుడు రెల్లు పొదలలో పుట్టలేదా? మన గురువు గారు కుంభంలో పుట్టలేదా? ఉత్తమ క్షత్రియులందరూ బ్రాహ్మణులకు పుట్టలేదా? అంత వరకూ ఎందుకు మీ పుట్టుకలు ఎలాంటివి? కాబట్టి కర్ణుని జన్మ గురించి యోచించ పని లేదు. అతడు ఇప్పుడు రాజు" అన్నాడు. ఆలో సూర్యాస్తమయం అయింది. అంతటితో విద్యా ప్రదర్శన ముగిసింది. దుర్యోధనుడు కర్ణునితో రాజ సౌధానికి వెళ్ళాడు. కుంతీదేవి కర్ణుని గుర్తించినా లోకనిందకు వెరచి చెప్పలేక పోయినందుకు వేదన పడింది.

గురుదక్షిణ

[మార్చు]

రాకుమారుల విద్యాప్రదర్శన పూర్తి అయింది. గురుదక్షిణ ఇచ్చే సమయం ఆసన్నమయింది. రాకుమారులంతా గురువుకు ఏమి కావాలో చెప్పమని అడిగారు. పాత పగ గుర్తుకు వచ్చిన ద్రోణుడు గర్వాంధుడైన దృపధుని తెచ్చి గురు దక్షిణగా ఇవ్వమని కోరాడు. వెంటనే దుర్యోదనాదులు ద్రోణుని తీసుకుని పాంచాల దేశానికి బయలు దేరారు. దుర్యోధనాదులు దృపదునితో యుద్ధం చేయడానికి ఉపక్రమించారు. వీరుడైన దృపదుడు కౌరవుల నందరిని ఓడించాడు. అది చూసిన అర్జునుడు ధర్మరాజును, ద్రోణుని దూరంగా ఉంచి దృపదునితో యుద్ధానికి తలపడ్డాడు. భీముడు దృపదుని సైన్యాన్ని చీల్చి చెండాడాడు. అర్జునుడు దృపదునితో ద్వంద యుద్ధం చేసి అతనిని ఓడించి రథచక్రానికి కట్టి తీసుకు వచ్చి ద్రోణుని ముందు పడవేసాడు. ద్రోణుడు దృపదుని చూసి "దృపద మహారాజు ఇలా దీనంగా పడి ఉన్నారు? ఇప్పటి కైనా మదం తగ్గిందా నన్ను గుర్తు పట్టారా?" అని హేళన చేసి అతనిని విడిచి పెట్టాడు. దృపదుడు ఆ అవమానాన్ని సహించ లేక పోయాడు. తగిన ప్రతీకారం చెయ్యాలని నిశ్చయించు కున్నాడు.

ధర్మరాజ యౌవ రాజ్య పట్టాభిషేకం దుర్యోదనాదులకుట్ర

[మార్చు]

తరువాత దృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజుని చేసాడు. ధర్మరాజు నలుగురు తమ్ములు నాలుగు దిక్కులను జయించి రాజ్యాన్ని విస్తరించగా చక్రవర్తిలా ప్రకాశించ సాగాడు. భీమార్జున పరాక్రమం నకుల సహదేవుల శత్రు భయంకరం ప్రజల మెప్పు పొందాయి. ద్రోణుడు అర్జునిని పరాక్రమానికి మెచ్చి బ్రహ్మశిరం అనే అస్త్రాన్ని ఇచ్చాడు. ద్రోణుడు ఆ అస్త్ర మహిమను ఇస్తూ "అర్జునా నాకు అగ్నివృశుడు ఇచ్చిన ఈ అస్త్రం అమోఘ శక్తి కలది. ఇది లోకాలను మాడ్చి వేస్తుంది. దీనిని సామాన్య మానవుల మీద ప్రయోగించ రాదు. ఇప్పుడు నీవు నాకు మరొక గురు దక్షిణ ఇవ్వాలి ఏ కారణం చేతనయినా నీకు నువ్వుగా నాతో యుద్ధం చేయరాదు " అన్నాడు. ధర్మ రాజు వైభవం దుర్యోధనుడు సహింప లేక పొయ్యాడు. ఒక రోజు తండ్రి దగ్గరకు వెళ్ళి " తండ్రీ పాండవులు మహా వీరులు నీవు ధర్మరాజును రాజుని చేసావు. మంత్రులూ, సామంతులూ, ప్రజలు అతనిని గౌరవిస్తున్నారు. నీవు గుడ్డి వాడివి తాత భీష్ముని ప్రతిజ్ఞ వలన ధర్మరాజు మాత్రం తగిన రాజని ప్రజలు విశ్వసిస్తున్నారు. మమ్మల్ని ఎవరూ లక్ష్యపెట్టడం లేదు. నీవు మార్గాంతం ఆలోచించి వారిని కొంత కాలం ఇక్కడి నుండి పంపించి నట్లైతే ప్రజలు వారిని మరచి పోతారు కాబట్టి మాకు గౌరవం దక్కుతుంది " అన్నాడు. దృతరాష్ట్రుడు బదులుగా " నాయనా దుర్యోధనా నాకు అన్నీ తెలుసు. నేను అంధుడను కనుక రాజ్య కార్యాలను స్వయంగా నిర్వహించ లేను. పాండురాజు నాచే యజ్ఞ యాగాలు చేయించాడు. రాజులను జయించి రాజ్యాన్ని విస్తరించాడు. నన్ను భక్తితో సేవించాడు. కనుక నీకంటే పెద్దవాడైన ధర్మరాజుని యువరాజుని చేసాను ఇప్పుడు తొలగించ లేను " అన్నాడు. దుర్యోధనుడు " తండ్రీ రాజ్యాధికారం వారసత్వంగా లభించేది నీవు అంధుడవు కనుక నీ తమ్ముడు రాజ్యం చేసాడు. అతని మీద అభిమానం చూపిన ప్రజలు ధర్మరాజుని రాజుగా చూడాలని కోరుతున్నారు ఆపై అతని కుమారుడు ఆ పై వారి వంశం రాజులౌతారు. మేము వశ పారంపర్యముగా బానిసలుగా ఉండవలసినదేనా? ఈ రాజ్యం నీది నీ తరువాత మాకు చెందాలి ప్రజాభిమతం మార్చడానికి కొంతకాలం పాండవులను వారణావతం పంపుతాము. ప్రజలు కొంత మరచిన తరువాత వారు తిరిగి వస్తారు " అన్నాడు. దృతరాష్ట్రుడు " నాయనా నా అభిప్రాయం కూడా అదే కానీ ఇందుకు విదురుడు భీష్ముడు అంగీకరించరు " అన్నాడు. దుర్యోదనుడు మీరు చక్రవర్తి కాబట్టి అందరూ మీ ఆజ్ఞను పాటిస్తారు. భీష్ముడు సమభావం కలవాడు కనుక ఏమీ అనడు, అశ్వత్థామ నాతో ఉంటాడు కనుక అతని మీద ప్రేమతో ద్రోణుడు నన్ను విడువడు. బావ మీద ప్రేమతో మనల్నికృపుడు విడివడు. విదురుడు పాండవ పక్షపాతి అయినా ఒక్కడే ఏమి చేయడు. కనుక మీరు ఇందుకు సమ్మతించి తీరాలి " అని బలవంతం చేసాడు. గత్యంతరం లేక దృతరాష్ట్రుడు అందుకు అంగీకరించాడు.

పాండుసుతులు వారణావతానికి వెళ్ళుట లక్కాగృహ దహనం

[మార్చు]

తండ్రి అనుమతి తీసుకుని దుర్యోధనుడు తన కపటోపాయం అమలులో పెట్టాడు. ముందుగా కొందరు మంత్రులను పంపి పాండవులకు వారణావతం గురించి ఆసక్తి కలిగేలా చెప్పించాడు. గొప్పగా వర్ణించిన వారణావతం చూడాలన్న కుతూహలం పాండవులలో కలిగింది. ఒకరోజు దృతరాష్ట్రుడు పాండవులను పిలిచి "నాయనా ధర్మరాజా నీతండ్రి పాండురాజు గొప్ప కీర్తి గడించాడు. కాలవశాత్తు ఆయన ఇప్పుడు లేనప్పటికీ నీవు మీ తమ్ములు తండ్రికి తగిన తనయులు. ఇంత కాలం రాజ్యభారాన్ని మోసి అలసి పోయారు కనుక వారణా వతంలో మీ తల్లితో కొంతకాలం విశ్రాంతి తీసుకుని రండి. గంగా తీరాన ఉన్న ఆనగరం అత్యంత సుఖప్రథమైన నగరం అని విన్నాను. నా మాట కాదనరు కనుక నేనిది చెప్తున్నాను " అన్నాడు. పెద్ద తండ్రి ప్రేమతో చెప్పిన మాటను తిరస్కరించ లేక ధర్మరాజు భీష్మ, ద్రోణ, కృపాచారుల ఆశీర్వాదం తీసుకుని తల్లిని, తమ్ములను వెంట పెట్టుకుని వారణావతం బయలుదేరాడు. ఇది చూసిన దుర్యోధనుడు ఆనంద పడ్డాడు. పురోచనుడు అనే గృహ నిర్మాణ నిపుణుని పిలిచి వారణావతంలో పాండవుల కొరకు లక్క, మట్టి, నెయ్యి, మిశ్రమంతో చేసిన గృహాలను నిర్మించి వాటిలో పాండవులు ఏమరుపాటుగా ఉన్న సమయం చూసి ఆగృహాలను తగులపెట్టు. వారి మరణ వార్త తీసుకువస్తే నీవు జీవితాంతం భోగాలను అనుభవించ వచ్చు. అని అతనిని ప్రలోభ పెట్టాడు. పురోచనుడు అందుకు అంగీకరించాడు. పాండవులు శతశృంగం నుండి వచ్చే సమయానికి వారి వయసు వరుసగా 16, 15, 14, 13, 13 సంవత్సరములు. అని ఇక్కడ ప్రస్తావించబడింది. ఆ తరువాత వారు 13 సంవత్సరములు ఉన్నారు. వారణావతానికి వెళ్ళే సమయంలో వారి వయసు వరుసగా 29, 28, 26, 25, 25 సంవత్సరాలు. తల్లితో సహా వారణావతానికి బయలు దేరుతున్న పాండవులను చూసి పౌరులు పాండవుల అడ్డు తొలగించు కోవాలని వారిని వారణావతానికి పంపుతున్నారని గ్రహించారు. భీష్ముడు మొదలైన వారు అడ్డు చెప్ప నందుకు కలత చెందారు. పాండవులు లేని రాజ్యంలో ఉండలేమని భావించి వారి వెంట నడవ సాగారు. వారితో ధర్మరాజు పెదనాన కోరిక మీద వెళుతున్నామని తిరిగి రాగలమని నచ్చ చెప్పి వారిని మరలించాడు. విదురుడు మాత్రం మరికొంత దూరం వారి వెంట వెళ్ళి నర్మగర్భంగా కొన్ని మాటలు చెప్పాడు. తరువాత కుంతీ దేవి వద్ద శెలవు తీసుకుని మరలి వెళ్ళాడు. విదురుని మాటలు అర్ధం కాని కుంతీ దేవి విదురుడు ఏమి చెప్పాడు అని ధర్మరాజుని అడిగింది. ధర్మరాజు తల్లితో " అమ్మా విషాగ్నుల వలన అపకారం జరుగవచ్చని అప్రమత్తంగా ఉండమని చెప్పాడు. దుర్యోధనుని వెంట ఉండి అతను మనకు అపకారం తలపెడితే మనకు తెలియ చేస్తానని చెప్పాడు " అన్నాడు. విదురుని ప్రేమకు కుంతీతో సహా అందరూ ఆనందించారు.

పాండవుల వారణావత వాసం

[మార్చు]

వారణావత ప్రజలు కుంతీదేవికి పాండవులకు ఘనంగా స్వాగతం చెప్పారు. వారికోసం పురోచనుడు నిర్మించిన గృహాలను చూపి ఉండమన్నారు. శిల్పాచారుడైన పురోచనుని తగిన విధంగా పూజించి సత్కరించారు. పుణ్యాహ వచనం చేసి గృహప్రవేశం చేసారు. ఆ గృహాన్ని అణువణువు పరిశీలించిన ధర్మరాజుకు అందులో ఏదో కృత్రిమత్వం గోచరించింది. భీముని పిలిచి ఆగోడలను చూపి వాటి నుండి ఏదో వింత వాసన వస్తుందని చెప్పాడు. భీముడు అది చూసి " అన్నయ్యా వీటి నుండి లక్క, తైలం కలిపిన వాసన వస్తుంది. గృహం సమీపంలో ఆయుధాగారం ఉంది. ప్రమాదం పొంచి ఉంది " అని అభిప్రాయం వెలిబుచ్చాడు. విదురుడు చెప్పిన విషాగ్నులు ఇవే నని వారికి అర్ధం అయింది " అది అర్ధం చేసుకున్న భీముడు ఆవేశపడి " అన్నయ్యా మనం ఇప్పటి వరకూ ఉన్న పాత ఇంటిలో ఉండి పురోచనుని ఇంటితో తగులపడదాము " అన్నాడు. దర్మరాజు భీమునితో " బీమాతొందరపడకు. విషయం మనకు తెలిసింది కనుక అప్రమత్తంగా ఉందాము. మనకు ఈ విషయం తెలిసిందని తెలిస్తే దుర్యోధనుడు పురోచనుడు వేరే ఉపాయం పన్నుతారు. అది మనకు తెలిసే అవకాశం రాక పోవచ్చు కనుక ఏమీ తెలియనట్లు ఉందాము " అన్నాడు. పురోచనుడు పాండవుల సేవ నిమిత్తం ఒక బోయ వనితను నియమించాడు. ఆమెకు ఐదుగురు కొడుకులు. వారంతా పాండవుల కదలికలను ఎప్పటికప్పుడు పురోచనునిని చేరవేస్తున్నాడు. హస్థినలో దుర్యోధనుని కుతంత్రం తెలుసుకున్న విదురుడు ఒక మనిషిని పాండవుల వద్దకు పంపాడు. విదురుడు చెప్పిన సంకేతం చెప్పి తనను పరిచయం చేసుకున్నాడు. అతడు ధర్మరాజుతో " ధర్మ నందనా రాబోవు కృష్ణ చతుర్ధశి నాడు పురోచనుడు లక్క ఇంటిని తగుల పెట్టకలడు. కాబట్టి ఈ గృహం నుండి సొరంగ మార్గం త్రవ్వమని విదురుడు నన్ను పంపాడు " అన్నాడు. ధర్మరాజు విదురుని దూరదృష్టికి ఆశ్చర్య పడి ఆ ఖనకుడికి అనుమతి ఇచ్చాడు. ఖనకుడు లక్క ఇంటి నుండి వెలుపలికి బిల మార్గం ఏర్పాటు చేసాడు. భీముడు దానిని పరిశీలించి తృప్తి పడ్డాడు.

పాండవులు లక్క ఇంటి నుండి తప్పించుకొనుట

[మార్చు]
నిప్పులో తగలబడిపోతున్న పాండవుల లక్క ఇల్లు

కృష్ణ చతుర్ధశి నాడు కుంతీదేవి వారణావతంలోని ము త్తైదువలకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణలిచ్చి సత్కరించింది. ఆ రోజు రాత్రి బోయ వనిత కొడుకులతో కల్లు సేవించింది అందరూ మత్తుగా నిద్రలోకి జారుకున్నారు. తరువాత భీముడు తల్లిని సోదరులను సొరంగ మార్గంలో పంపించి ముందుగా పురోచనుని ఇంటికి నిప్పు పెట్టి ఆ తరువాత తాము నివసించిన ఇంటికి నిప్పు పెట్టి ఆఖరుగా ఆయుధాగారానికి నిప్పు పెట్టి ఖణికుడికి తాము క్షేమంగా ఉన్నామని చెప్పాడు. ఆ తరువాత తాను కూడా సొరంగ మార్గం ద్వారా అన్న తమ్ములను, తల్లిని కలుసు కున్నాడు. వడి వడిగా నడుస్తూ వెళుతున్న మిగిలిన వారు భీముని వేగాన్ని అందుకోలేక పోయారు. భీముడు తల్లిని వీపు మీద ఎక్కించుకుని ధర్మరాజుని, అర్జునిని చెరి ఒక భుజంపై ఎక్కించుకుని నకుల, సహదేవులను రెండు చేతులతో ఎత్తుకుని వడి వడిగా నడిచాడు. తెల్లవారగానే వారణావత ప్రజలకు లక్క ఇల్లు తగలబడిన విషయం తెలిసింది. దృతరాష్ట్రుని కుయుక్తికి ప్రజలు ఎంతగాగానో అతనిని నిందించారు. అందరూ వచ్చి బూడిద కుప్పలలోని బోయ వనితను ఆమె కుమారుల శవాలను చూసి కుంతీదేవి పాడవులనుకుని భోరున విలపించారు. ఖణికుడు జనంలో చేరి పోయాడు. బూడిద కుప్పలను తొలగిస్తున్నట్లు నటిస్తూ తాను త్రవ్విన సొరంగ మార్గంలో పోసి దానిని కనపడకుండా చేసాడు. వెంటనే హస్థినా పురానికి వెళ్ళి విదురునికి పాండవులు క్షేమంగా తప్పించుకున్నారని చెప్పాడు. వారణావతంలోని ప్రజలు పాడవులు మరణించారని దృతరాష్ట్రునికి తెలియ చేసారు. భీష్ముడు, కృపుడు, ద్రోణుడు ఎంతో దు॰ఖించారు. వారితో చేరి విదురుడు దు॰ఖిస్తున్నట్లు నటించాడు. దుర్యోధనుడు ఎంతో సంతోషించినా పురోచనుని మరణం బాధ కలిగించింది.

హిడింబాసుర వధ

[మార్చు]

బిలమార్గం నుండి పాండవులు వారణావతానికి దక్షిణంగా ప్రయాణించారు. అందరూ అలసిపోగా వారిని ఒక చెట్టు క్రింద విశ్రమింప చేసి భీముడు వారికి కాపలా ఉన్నాడు. అలసి ఉండటం చేత అందరూ నిద్రలోకి జారుకున్నారు. భీముడు జరిగినది తలచుకుంటూ కూర్చున్నాడు. వారు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరలో హిడింబుడు అనే రాక్షసుడు నివసిస్తున్నాడు. అతడు తమ ఆవాసానికి దగ్గరగా మానవులు వచ్చిన విషయం గ్రహించాడు. తన చెల్లెలు అయిన హిడింబను పిలిచి "హిడింబా ఇక్కడ పరిసర ప్రాంతానికి నరులు వచ్చారు నానోరు చవిచెడి ఉన్నది వారిని చంపి నాకు వండి పెట్టు" అన్నాడు. అలాగే నని పాండవుల దగ్గరకు వెళ్ళిన హిడింబ అక్కడ కాపలాగా ఉన్న భీముని చూసింది. అతని మీద మనసు పడింది. అన్న మాట మరచి పోయింది. మానవ కాంతగా మారి పోయింది. తనను చూసి ఎవరని అడిగిన భీమసేనునితో " మహాభాగా నేను హిడింబుని చెల్లెలైన హిడింబను. నీ పై మనసు పడ్డాను. నా అన్న మహా బలవంతుడు. ఇది అతని వనము అతి భయంకరుడైన అతనిని చూసి భయపడని వారు లేరు నీవు ఏమాత్రం. నీవు నన్ను వివాహమాడినచో అతడు నిన్ను విడువగలడు. లేకున్న అతడు మిమ్మలిని బ్రతుక నీయడు. నా వెంట వస్తే కోరిన చోటికి తీసుకు పోతాను " అన్నది. వీరు నా తల్లీ అన్నతమ్ములు వీరిని విడిచి రాలేనని భీముడు అన్నాడు. అయితే అందరం వెళదామని హిడింబ చెప్పింది. ఒక రాక్షసుడికి భయపడి నా తల్లీ సోదరుల నిద్ర చెడగొట్టనా " అన్నాడు. చెల్లెలు ఎంతకీ రాలేదని హిడింబాసురుడు అక్కడికి వచ్చాడు. భీముడు భీకరంగా ఘర్జించి " నిన్ను సంహరించడం ఉచితం కనుక నిన్ను చంపి ఈ అడవిలో రాక్షస భయం లేకుండా చేస్తాను " అని హిడింబునిపై లంఘించాడు. ఇద్దరికీ మధ్య ఘోర యుద్ధం జరిగింది. వారి ఘర్జనలకు మిగిలిన వారు నిద్ర లేచి హిడింబను అడిగి విషయం తెలుసుకున్నారు. అర్జునుడు వారు యుద్ధం చేస్తున్న చోటికి వెళ్ళి " భీమసేనా తూర్పు ఎర్ర బారుతుంది. ఇది రాక్షసులకు అనుకూలమైన వేళ కనుక ఉపేక్షించక అతడిని చంపు " అని అరిచాడు. ఆ మాట విని భీముడు విజృంబించి హిడింబుని గిరాగిరా త్రిప్పి నేలకు కొట్టాడు. హిడింబుడు నడుములు విరిగి ప్రాణాలు వదిలాడు.

హిడింబ భీమసేనుల వివాహం- ఘటోత్కచుని జననం

[మార్చు]

భీముని బలం హిడింబను ఆశ్చర్యపరచింది. భీముడు హిడింబను చూసి "నీవు రాక్షస కాంతవు మేము నిన్ను నమ్మము వెను తిరిగి వెళ్ళుము" అన్నాడు. హిడింబ కుంతీదేవి వద్దకు వెళ్ళి "అమ్మా నేను భీమునిపై మనసు పడ్డాను. అతను నిరాకరిస్తే ప్రాణాలు వదులుతాను. నన్ను మీ కోడలుగా స్వీకరిస్తే మీకు సహాయంగా ఉంటాను. నాకు జరుగుతున్నది జరగబోయేది తెలుసు. మీరు శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళి అక్కడి కొలను లోని నీరు త్రాగారంటే మీకు ఆకలి దప్పులు ఉండవు. అక్కడకు కృష్ణద్వైపాయనుడు వచ్చి మీకు హితోపదేశం చేస్తాడు. కోరికలు అందరికీ ఒకటే కనుక మీమ్మల్ని అర్ధిస్తున్నాను " అన్నది. కుంతీదేవి హిడింబ మాటలు విన్నది. ఆమెపై విశ్వాసం కలిగి భీముని చూసి " భీమసేనా ఈమె ఉత్తమురాలు ఈమెను వివాహమాడితే మనకు మంచి జరుగుతుంది. నా మాట మీ అన్న ధర్మరాజు మాటగా మన్నించి ఈమెను వివాహమాడు " అని చెప్పింది. తల్లి మాటను మన్నించి హిడింబను వివాహమాడి ఆమెతో చేరి శాలిహోత్రుని ఆశ్రమానికి చేరుకున్నారు. ఒక రోజు వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. కుంతీదేవితో " అమ్మా కష్టాలు కలకాలం ఉండవు. మీకు త్వరలో మంచి రోజులు వస్తాయి. రాజ్యం లభిస్తుంది. ఇక్కడ కొన్ని రోజులు ఉండి తరువాత బ్రాహ్మణ రూపాలలో ఏకచక్ర పురం వెళ్ళండి. ఆ తరువాత నేను వచ్చి మీరి చెయ్య వలసిన కర్తవ్యం చెప్తాను" అన్నాడు. వ్యాసుని మాట ప్రకారం పాండవులు కొంతకాలం శాలిహోతుని శ్రమంలో గడిపారు. హిడింబ గర్భం ధరించి ఘటోత్కచుడిని కన్నది. అతను కామరూపుడు అమిత బలవంతుడు. ఘటోత్కచుడు కుంతీ దేవిని తండ్రులను చూసి " అమ్మా నేను ఇక్కడ నాతల్లితో ఉంటాను. మీరు తలచిన వెంటనే మీ దగ్గరకు రాగలను " అని చెప్పి అందరికీ నమస్కరించి తల్లితో తిరిగి వెళ్ళాడు.

ఏకచక్రపురం బకాసురవధ

[మార్చు]

శాలిహోత్రుని ఆశ్రమంలో పాండవులు ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రాలు అభ్యసించారు. ఆ తరువాత వారు జింక చర్మాలు నార చీరలు ధరించి వేద పఠనం చేస్తూ బ్రాహ్మణ వేషాలలో ఏకచక్ర పురం అనే అగ్రహారం చేరారు. ఒక బ్రాహ్మణిని ఇంట్లో నివాసం ఏర్పరచు కున్నారు. పాండవులు ప్రతి రోజు మౌనంగా భిక్ష స్వీకరించి తల్లికి ఇచ్చేవారు. కుంతీ దేవి ఆభిక్షలో సగం భీమునికి పెట్టి సగం మిగిలిన నలుగురు కుమారులతో చేరి భుజిస్తూ వచ్చింది. సహృదుయులు, సత్ప్రవర్తనులు అయిన వారిని చూసి అగ్రహార ప్రజలు ఆనందించారు. ఒక రోజు భీముడు ఇంట్లో ఉన్నాడు మిగిలిన వారు భిక్ష స్వీకరించటానికి వెళ్ళారు. ఆ సమయంలో ఆ ఇంటిలో రోదనలు వినపడ్డాయి. కుంతీ దేవి భీమునితో " భీమసేనా ఈ ఇంటి వారికి ఏదో కష్టం కలిగి నట్లుంది. వీరు చేసిన ఉపకారం గుర్తించడం పుణ్యం ప్రత్యుపకారం మరింత పుణ్యం చేసిన దానికంటే అధిక ఉపకారం చేయడం ఉత్తమ పుణ్యం" అని చెప్పింది. భీమసేనుడు తల్లితో " అమ్మా నీ ఆజ్ఞను నెరవేరుస్తాను. నీవు వారిని అడిగి వారికి ఏమి కష్టం వచ్చిందో చెప్పావంటే నేను వారికి ప్రత్యుపకారం చేస్తాను" అన్నాడు.

బ్రాహ్మణ కుటుంబం విలపించుట

[మార్చు]

కుంతీ దేవితో ఆ ఇంటి యజమాని " అమ్మా జననం మరణం సంయోగం వియోగం సహజమే అయినా వేదోక్తంగా వివాహం చేకున్న భార్యను కాని కన్యాదానం చేసి అత్త వారిటికి పంపవలసిన కూతురుని కాని, నాకూ నా పితృలకు పిండోదకాలు ఇవ్వవలసిన నా కుమారుని కానీ రాక్షసునికి ఆహారంగా పంప లేక నేనే ఆహారంగా వెళతానని చెప్పాను అందుకు వీరు సమ్మతించక విలపిస్తున్నారు " అన్నాడు. అందుకు భార్య "నాధా మిమ్మల్ని వివాహమాడి సంతాన ప్రాప్తి కలిగించాను. భర్త కంటే ముందు మరణించి పుణ్య లోకాలకు వెళతాను. భర్త లేని భార్య లోకంలే అవమానాలు భరిస్తూ కష్టపడవలసి వస్తుంది. మీరు వేరు వివాహం చేసుకుని పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించి ప్రయోజకులను చెయ్యండి. నేను ఆహారంగా వెళతాను" అన్నది. అంతలో కూతురు " అమ్మా నేను వివాహం చేసుకుని మీకు మనుమలను ఇచ్చేకంటే నేనే ఆహారంగా వెళతాను. మీరు జీవించి ఉంటే సంతానాన్ని పొందవచ్చు" అన్నది. ఇంతలో చిన్న వాడైన కుమారుడు కర్ర తీసుకుని " తండ్రీ! నేను వెళ్ళి ఆ రాక్షసుని చంపుతానని " అన్నాడు.

బకాసురుడి వృత్తాంతం విని కుంతి బ్రాహ్మణుడికి అభయమిచ్చుట

[మార్చు]
దస్త్రం:Kunti comforts Brahmin Parents.jpg
బ్రాహ్మణ దంపతులను ఓదారుస్తున్న కుంతి

కుంతీ దేవి " రాక్షసుడు ఎవరు? మీరు అతడికి ఆహారంగా ఎందుకు వెళ్ళాలి? నాకు వివరించండి " అడిగింది. అందుకు సమాధానంగా బ్రాహ్మణుడు " అమ్మా ఇక్కడకు ఆమడ దూరంలో యమునా నదీ తీరాన బకాసరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు గ్రామం మీద పడి అందరినీ తిన సాగాడు. అందువలన మేమంతా అతడితో రోజుకు ఒకడు వాడికి ఆహారంగా వెళ్ళాలని ఒప్పందం కుదుర్చు కున్నాము. ప్రతి రోజూ ఒక బండి ఆహారం, రెండు దున్నపోతులు, ఒక మనిషి ఆతడికి ఆహారంగా వెళ్ళాలి ఈ దేశాన్ని ఏలే రాజుకు కూడా వాడిని ఎదిరించే శక్తి లేక మిన్న కున్నాడు. ఈ రోజు ఈ ఇంటి నుండి అతడికి ఆహారంగా వెళ్ళాలి " అన్నాడు. అందుకు కుంతీ దేవి " అయ్యా ! చింతించ వలదు మీకు ఒక్కడే కుమారుడు. నాకు ఐదుగురు ఉన్నారు. నా కుమారులలో ఒకడిని పంపుతాను " అన్నది. ఆ బ్రాహ్మణుడు కుంతీ దేవితో " అమ్మా! అతిథిని పంపుట తగదు అందునా బ్రాహ్మణ హత్య మహాపాపం " అన్నాడు. కుంతీ దేవి " అయ్యా ! ఆలోచించ వద్దు నా కుమారుడు మహా బలవంతుడు అతడు ఇంతకు ముందు రాక్షసులను చంపాడు. అంతడు తప్పక బకుని చంపి వస్తాడు " అన్నది. ఆమె భీమునితో జరిగినది అంతా చెప్పింది. అందుకు భీముడు సంతోషంగా అంగీకరించాడు.

భీముని ఉత్సాహము చూసి ధర్మరాజు కలతపడుట

[మార్చు]

అంతలో ధర్మరాజాదులు అక్కడికి వచ్చారు. సంతోషంగా ఉన్న భీముని చూసి తల్లితో " అమ్మా భీముని సంతోషం చూస్తే అతడు ఎవరితోనో యుద్ధానికి సన్నద్ధం ఔతున్నట్లుంది. తనంత తానే వెళుతున్నాడా లేక నీవు పంపుతున్నావా " అని అడిగాడు. కుంతీ దేవి జరిగినది ధర్మరాజుకు చెప్పింది. ధర్మరాజు కలత చెంది " అమ్మా ! పరాయి వారి కోసం నీ కన్న కొడుకును బలి ఇస్తావా ? నీకు మతి భ్రమించిందా భీముడు విడువ తగిన వాడా? " అన్నాడు. కుంతీదేవి " నాయనా ధర్మరాజా ! కలత చెంద వలదు. భీముని బలం నీకు తెలియదు. అతడు వజ్రకాయుడు. అతడు పుట్టిన పదవ రోజునే ఒక బండ రాయి మీద పడగా అది పొడి పొడి అయ్యింది. భీముడు రాక్షసుని చంపి ఈ ఆగ్రహారానికి రాక్షస పీడ వదిలిస్తాడు. క్షత్రియ ధర్మాలు వ్యాసుని నోట విన్నది నీకు చెబుతాను. ఉత్తమ క్షత్రియుడు ఇతరులను రక్షించడానికే పుడతాడు. మృత్యు భయంతో ఉన్న బ్రాహ్మణులను రక్షిస్తే పుణ్యలోకాలకు వెళతాడు. సాటి క్షత్రియుని రక్షిస్తే కీర్తిని పొందుతాడు. వైశ్యుని శూద్రుని రక్షిస్తే అనురాగాన్ని పొందుతాడు. ఆపదలో ఉన్నవారిని రక్షించడం క్షత్రియ ధర్మం. మనకు ఉపకారం చేసిన ఈ బ్రాహ్మణుని రక్షించడం మనధర్మం " అని చెప్పింది.

బకాసుర వధ

[మార్చు]
దస్త్రం:Bhima fighting with Bakasura color.jpg
బకాసురునితో పోరాడుతున్న భీముడు

ఆ ఊరి వారంతా ఆహారం తయారు చేసి ముందుగా భీమునికి తృప్తిగా ఆహారం పెట్టి బండిని ఆహార పదార్ధాలతో నింపారు. భీముడు ఆ బండిని తోలుకుంటూ యమునా తీరానికి పోయి బకాసురుని పిలువసాగాడు. అతడు రావడం ఆలస్యం కావడంతో ఆహారాన్ని తానే భుజించ సాగాడు. ఆహారం ఎంతకీ దగ్గరకు రాక పోయేసరికి బకాసురుదు ఆకలితో మండి పడుతూ వెతుక్కుంటూ వచ్చాడు. అక్కడ తనకు తెచ్చిన ఆహారాన్ని భుజిస్తున్న భీమసేనుని చూసి పిడి గుద్దులు గుద్దాడు. భీమసేనునికి చీమ కుట్టినట్లైనా లేక పోవడంతో ఉక్రోష పడి పక్కనే ఉన్న చెట్టును పెరికి భీమునితో కలియబడ్డాడు. భీముడు బకాసురునితో ఘోర యుద్ధం చేసి అతడిని చంపాడు. బకాసురుని కేకలకు అతని బంధువులు పరుగున వచ్చారు. భీముని వారిని చూసి ఆ ఊరు వదిలి వెళ్ళక పోతే మీకూ ఇదే గతి పడుతుందని అరిచాడు. వారు భయపడి పారిపోయారు. బకాసురుని కళేబరాన్ని ఊరి పొలిమేరలో పడవేసాడు. ఏక చక్రపుర ప్రజలు భీముని పరాక్రమాన్ని వేనోళ్ళ కొనియాడారు. ఇంటికి వెళ్ళి జరిగినది సోదరులకు కుంతీ దేవికి చెప్పాడు. ఊరి ప్రజలు భీమసేనుడు సామాన్య బ్రాహ్మణుడు కాదని మంత్రసిద్ధి కలవాడని అతనిని చూడటానికి తరలి వచ్చారు.

నన్నయ తెలుగు అవతారికలో విశేషాలు

[మార్చు]

కొన్ని ప్రసిద్ధ పద్యాలు, శ్లోకాలు

[మార్చు]

సంస్కృత మూలానికి, తెలుగు అనువాదానికి భేదాలు

[మార్చు]

సాహితీ విశేషాలు

[మార్చు]

ఆధ్యాత్మిక విశేషాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వనరులు

[మార్చు]


బయటి లింకులు

[మార్చు]