అనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ద్వితీయాశ్వాసము[మార్చు]

భీష్ముడు చెప్పిన విష్ణుతత్వమును విని తరించిన ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! వివాహసమయంలో కన్యాదానం చెయ్యడానికి ఎలాంటి వరుడు కావాలి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఇది తెలుసుకేందుకు నీకు నేను ఒక కథ చెప్తాను. అష్టావక్రుడు అనే మునికుమారుడు వదాన్యుని కుమార్తె సుప్రభను వివాహమాడాలని అనుకుని తనకోరికను వదాన్యుడికి తెలిపాడు. వాదాన్యుడు అందుకు అంగీకరించి అష్టావక్రుడిని ఉత్తరదిక్కుగా వెళ్ళమని చెప్పాడు. అలా ఎందుకు చెప్పావని అష్టావక్రుడు అడుగగా వదాన్యుడు " కుమారా ! ఉత్తరదిక్కున కుబేరుడి నగరం దాటిన తరువాత ఉన్న హిమాలయ పర్వతాలలో శివుని కొరకు పార్వతీదేవి కలిసి తపస్సుచేసిన ప్రదేశం అతిపవిత్రం అయింది. అక్కడ పార్వతీ పరమేశ్వరులు విహరిస్తుంటారు. ఆ ప్రదేశం దాటితే ఒక వనము కనిపిస్తుంది. అక్కడ ప్రౌఢవయస్కురాలైన ఒక పవిత్రురాలైన స్త్రీ కనిపిస్తుంది. నీవు ఆ స్త్రీని కలిసి వస్తే నేను నీకు నా కుమార్తెను ఇచ్చి వివాహము చేస్తాను " అని వదాన్యుడు చెప్పాడు. అష్టావక్రుడు కుబేరుడు ఉండే నగరానికి ప్రయాణమయ్యాడు. కుబేరుడిని కలుసుకుని అతడి ఆతిధ్యం స్వీకరించాడు. కుబేరుడు ఏర్పాటు చేసిన అందమైన నృత్యాలు చేసిన స్త్రీలెవ్వరు అష్టావక్రుడిని ఆకర్షించ లేదు. తరువాత శివపార్వతులు విహరిస్తున్న ప్రదేశం చేరుకున్నాడు. తరువాత వదాన్యుడు చెప్పిన కడిమివనానికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో బంగారు మేడలను చూసి తాను వచ్చినట్లు వారికి వర్తమానం పంపాడు. అందమైన వనితలు అతడికి ఎదురు వచ్చి స్వాగతం చెప్పి అష్టావక్రుడిని లోనికి తీసుకు వెళ్ళారు.

అష్టావక్రుడు ప్రౌఢ[మార్చు]

అక్కడ అష్టావక్రుడు ఒక ప్రౌఢను చూసాడు. ఆమె అతడిని తన పక్కన కూర్చోబెట్టుకుని అతడికి ఎన్నో మర్యాదలు చేసింది. ఇంతలో రాత్రి అయింది చలివేళలో అతడి పక్కన చేరిన ఆ ప్రౌఢ అతడిలో ఎటువంటి చలనం లేకపోవడం చూసి " ఆర్యా ! పురుషులైన మిమ్ము ఇటువంటి అందమైన స్త్రీ ఆకర్షించ లేక పోవడమేమిటి. నా సంపదలన్నీ నీ పరం చేస్తాను నన్ను మీ భార్యగా స్వీకరించండి. నేను మీ సేవ చేసుకుని బ్రతుకుతాను " అని వేడుకుంది. అష్టావక్రుడు " అమ్మా ! పరస్త్రీలను కోరడం దోషము. బ్రాహ్మణుడికి శూద్రస్త్రీని చేరడం అత్యధిక దోషం. అదే బ్రాహ్మణ స్త్రీకి అది మహాపాతకము. నేను అవివాహితుడను కనుక నేను ఒక కన్యను వివాహమాడతలిచాను " అన్నాడు. ఆ ప్రౌఢ " అర్యా ! నేను మీ అందానికి వశురాలనైయ్యాను. మోహపరవశులు వావివరుసలు వంశహాని లెక్క చేయరు కదా ! నన్ను వివాహమాడండి " అని వేడుకుంది. అష్టావక్రుడు " మీరిలా మాటాడ తగదు. ఇలాటి వారిని నేను ఎరుగను. నీ కోరిక మానుకో " అని పలికాడు. అప్పుడు ఆ స్త్రీ " చిరునవ్వు నవ్వి " పోదువు కాని ఉండు " అన్నది. అష్టావక్రుడు " నువ్వు దూరంగా ఉంటే ఉంటాను " అని మనసులో " ఈమె ఎవరో శాపగ్రస్థ లాగ ఉంది. లేకున్న ఇలా ప్రవర్తించదు కదా ! " అనుకున్నాడు. తెల్లవారిన తరువాత అష్టావక్రుడికి ఆ స్త్రీ స్నానికి తగిన ఏర్పాటు చేసి స్నానము చేయించింది. అతడికి మృష్టాన్నము పెట్టి భుజింపచేసి విశ్రమించడానికి శయ్యను ఏర్పాటు చేసి విశ్రమించమని చెప్పింది. అష్టావక్రుడు అందుకు అంగీకరించక పోవడంతో ఆమె " మహాభాగా ! నేను కన్యనే తగిన వరుడు దొరకక ఇలా కన్యగా మిగిలాను. నా అదృష్టం వలన మీరు దొరికారు కనుక నన్ను వివాహమాడండి " అన్నది. అష్టావక్రుడు " అమ్మా ! బాల్యంలో తండ్రి, వివాహానంతరం భర్త, వృద్ధాప్యంలో కుమారుని సంరక్షణలో స్త్రీ జీవించాలి కానీ ఎన్నటికీ స్వతంత్రురాలు కాదు. కనుక నీకు నీవుగా వివాహము చేసుకొన తగదు. నన్ను అలా కోరినా నేను అందుకు అంగీకరించను. ఇంతకూ నీవు ఎవరు ? నన్నిలా ఎందుకు పరీక్షిస్తున్నావు ? " అని అడిగాడు. ఆమె " మహాభాగా ! నిన్ను పరీక్షించడానికి వదాన్యుడు నన్ను ఇక్కడకు పంపాడు. నీ నిష్టకు నేను మెచ్చాను. వదాన్యుడు కూడా నిన్ను అల్లుడుగా అంగీకరించి తన కుమార్తెను ఇచ్చి వివాహము చేస్తాడు " అని చెప్పింది. అష్టావక్రుడు ఆమెకు నమస్కరించి తిరిగి వెళ్ళాడు. వదాన్యుడు తన కుమార్తె సుప్రభను అష్టావక్రుడికి ఇచ్చి వివాహం చేసాడు. కనుక ధర్మనందనా ! వరుడి గుణ గణాలను పరీక్షించి కన్యను ఇవ్వాలి.

బ్రహ్మఋషి[మార్చు]

ధర్మరాజు " పితామహా ! బ్రాహ్మాణుడైన మునీశ్వరుడుకి శూద్రస్త్రీకి కలిగిన వ్యక్తి బ్రహ్మర్షి కాగలడా ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీకు వివాహవిధి గురించి చెప్తాను. బ్రాహ్మణుడు తనకులములోని కన్యనే కాక మిగిలిన మూడు కులములలోని కన్యలను వివాహము చేసుకొనవచ్చు. క్షత్రియుడు తనకులములోని కన్యనే కాక మిగిలిన రెండు కులములలోని కన్యలను వివాహము చేసుకొనవచ్చు. వైశ్యుడు తనకులములోని కన్యనే కాక శూద్రజాతి కులములలోని కన్యలను వివాహము చేసుకొనవచ్చు. ఇది వివాహముకు పెద్దలు నిర్ణయించిన పద్ధతి. ఇలాకాక ఎవరైనా తన కులము కంటే అధిక కులముకు చెందిన కన్యలను వివాహమాడిన వర్ణసంకరము జరుగుతుంది. తల్లి ఏకులముకు చెందినది అయినా బిడ్డ తండ్రి కులముకు చెందిన వాడు ఔతాడు. ఇది సకల కులముకు ఆమోదయోగ్యమైన పద్ధతి. విశేషంగా తపోనిష్టా గరిష్టులైన మునికి తక్కువ కులముకు చెందిన సంతానం బ్రాహ్మణులే ఔతారు. క్షత్రియులకు వైశ్య, శూద్రుల వలన కలిగిన సంతానం క్షత్రియులే ఔతారు. పశువులకు, పక్షులకు బ్రాహ్మణుల వలన కలిగిన సంతానం బ్రాహ్మణులే ఔతారు. కనుక బ్రాహ్మణులకు, క్షత్రియులకు క్షేత్రముకంటే బీజమే ప్రధానము. వశిష్ఠుడు, ఋష్యశృంగుడు, అగస్త్యుడు, వ్యాసుడు, మందపాలుడి కుమారులు, ద్రోణుడు, కృపాచార్యుడు పుట్టిన విధము నీకు తెలుసుకదా ! వారందరికి తండ్రి కులమే సంక్రమించింది కదా ! మనువు ఈ విషయములో " నదుల యొక్క, మునుల యొక్క, సిద్ధుల యొక్క, పుట్టుక గురించి తర్కించ తగదు. మహాత్ములు వారి జన్మల వలన కాక గుణముల వలనే ప్రకాశిస్తారు " అని భీష్ముడు పలికాడు.

విప్రుడు దానము[మార్చు]

ధర్మరాజు " విప్రుడు దానము పుచ్చుకోవడానికి అతడు చేసే వృత్తి ప్రధానమైనదా ? లేక అతడు సన్యాసి అవడం వలన నిర్ణయించ బడుతుందా ? తెలపండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మజా ! మంచి బ్రాహ్మణుడు తాను చేసే మంచి పనుల వలన దానమునకు అర్హుడుగా నిర్ణయించబడతాడు. అతడు సన్యాసియా, సంసారియా అన్నది ముఖ్యమైనది కాదు " అన్నాడు. ధర్మరాజు " పితామహా ! పురజనులు బ్రాహ్మణులకు శ్రద్ధగా ఇచ్చు దానములు పాపము కాదు కదా ! " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! శ్రద్ధగా ఇచ్చు దానములు పాపములు పోగొడతాయి కాని పాపములు కలిగించవు. కాని పైకి ధర్మములు పలుకుతూ లోపల అధర్మవర్తనుడైన వాడు దానము పుచ్చుకొనుటకు అనర్హుడు. ఈ విషయములో ఒక సారి భూదేవికి, కశ్యపుడికి, అగ్నికి, మార్కండేయునకు మధ్య ఒక చర్చ జరిగింది. దాని సారాంశము ఏమంటే ఎంతటి ఉన్నత కులమున జన్మించిన వారైనా వేదములు, శాస్త్రములు, పురాణములు చదివినా శీలము సత్ప్రవర్తన లేకున్న అతడికి ఉత్తమగతులు కలుగవు. ఎంతో విద్య నేర్చుకుని అనేక సన్మానాలు పొందిన వాడు ఎదుటి వారి విద్యను చులకన చేసి మాట్లాడిన అతడికి బ్రహ్మ హత్యాపాతకము చుట్టుకుంటుంది. వేయి యజ్ఞములు చేసిన ఫలము కంటే సత్యవాక్యము పలికిన ఫలితము రెండితలు ఉంటుంది. ధర్మనందనా ! మద్యము మాంసము తినడం మాని వేసిన జీవితాంతము బ్రహ్మచర్యము పాటించిన ఫలితం కంటే అధికమైన ఫలితం దక్కుతుంది. ఇంద్రియనిగ్రహమును పాటిస్తూ ఈ లోకములో సంచరించడాన్ని శౌచం అంటారు " అని భీష్ముడు చెప్పాడు.

పురుషార్ధములు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ధర్మము, అర్ధము, కర్మము, మోక్షము పురుషార్ధములు అంటారు కదా ! వాటిని ఎప్పుడు ఆచరించాలి ? తెలపండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మనిషికి అర్ధము మీద, కామము మీద కోరిక ఉండడము మంచిది కాదు. ఎప్పుడూ ధర్మాచరణ మీదనే ధ్యాస ఉండడం మంచిది. అర్ధము, కామములతో ధర్మమును ముడివేయాలి. ధర్మము పగలు, కామము రాత్రి, అర్ధము తెల్లవారు ఝామున ఆచరించాలి. ధర్మనందనా ! గురువులను, బ్రాహ్మణులను పూజించడం వలన పుణ్యం వస్తుంది. బ్రాహ్మణ నింద, వేదాధ్యయన విసర్జన, అగ్నిని విడుచుట పాపము " అని భీష్ముడు చెప్పాడు. భీష్ముడు " పితామహా ! మీరు చెప్పినది నాకు అర్ధము కాలేదు. ఇంతకూ దానముకు అర్హులు ఎవరో వివరంగా చెప్పండి " అని అడిగాడు ధర్మరాజు. భీష్ముడు " ధర్మనందనా ! ధర్మపరులు, కోపము లేని వారు, సదా సత్యము పలుకు వారు, ధీరులు, తన పని తాను సక్రమంగా చేసే వారు, ఇంద్రియములను జయించిన వారు, సర్వభూతముల అందు దయకలిగిన వారు, లోభత్వము లేని వారు, శుచిగా ఉన్న వారు, దానము చెయ్యడానికి అర్హులు, వేదాధ్యయనము చేయువారు, తత్వవిధులు అయిన బ్రాహ్మణులు దానము స్వీకరించుటకు అర్హులు. అర్హులు కాని వారికి దానము చేయుట తగదు. తాను చేసిన దానము వలన ఒక బ్రాహ్మణుడు తృప్తి చెందిన సర్వదేవతలు, మునులు, పితరులు తృప్తి చెందుతారు. కనుక యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానము ఇవ్వడము మంచిది. ధర్మనందనా ! ఉదయము దేవతలను, దేవుళ్ళను మధ్యాహ్నము అతిథులను అంటే మానవులను సాయంకాలము పితృదేవతలను ఆరాధించాలి. ధర్మనందనా ! చాలాకాలము కిందట తయారు చేసిన ఆహారమును, శుభ్రముగా లేని ఆహారమును, ఒకరు తిని విడిచిన పదార్ధములను, మంత్ర పూరితముగా దేవుడికి నైవేద్యము చేయని పదార్ధములను, పురుగులు వెండ్రుకలు పడిన పదార్ధములను తినరాదు. దేవకార్యములకు పితృ కార్యములకు అర్జించిన ధనమును చోరులు అపహరించ కుండా భద్రపరచాలి. మదించిన వాడిని, తెలివి లేని వాడిని, పిచ్చి వాడిని, పాపములు చేసే వాడిని, నపుంసకుని, కుష్టురోగులను, పాపాత్ముడైన పురోహితుడిని, వైద్యము రాని వైద్యుడిని, నియములను వదిలిన వాడిని, అపస్మారకుడిని, రోగగ్రస్థుడిని, క్షయరోగిని, మద్యము విక్రయించు వారిని, వేదవిద్యను విక్రయించి వాడిని తక్షణం వదిలి వేయాలి. ధనము వడ్డికి ఇచ్చి జీవించు వాడిని, అగ్నిహోత్రం చేయని వారిని, మనుష్యులను విక్రయించు వారు దేవకార్యములకు పితృకార్యములకు పనికి రారు " అని భీష్ముడు చెప్పాడు.

దేవకార్యము పితృకార్యము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! దేవకార్యములు, పితృకార్యములు నిర్వహించునప్పుడు దానములు పుచ్చుకొనుటకు ఎవరు అర్హులు ? " అని అడిగాడు. భీష్ముడు " అతిథులకు భోజనము పెట్టి తృప్తి పరచడానికి ధనము కావలసిన వారు, దొంగలవలన సర్వము కోల్పోయిన వారు, వ్రతములు చేయుటకు యాచించే వారు, గురువులను, తల్లితండ్రులను, భార్యాబిడ్డలను పోషించడానికి ధనము లేక ఇబ్బంది పడేవారు, తనకు వచ్చిన వ్యాధిని నయము చేసుకో వడానికి ధనము లేనివారు దేవ పితృ కార్యములలో దానము స్వీకరించడానికి అర్హులు. సత్రములు, మంటపములు, నీడ కొరకు వేసిన పందిళ్ళు, నలుగు కూర్చునే రచ్చబండను కూల్చే వారు, గురువులను నిందించే వారు, వేదములను నిందించే వారు, వేదవిద్యను అమ్ముకునే వారు, ఇతరుల మీద చాడీలు చెప్పేవారు, అనుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించే వారు, ఇతరుల సంపాదన మీద పడితినే వారు, చేసిన మేలు మరిచే వారు, పరుల భార్యలను కోరు వారు, మంత్రశాస్త్రములను నాశనం చేసే వారు. మదంతో విర్ర వీగే వారు. అనాథలను, బాలలను, వృద్ధులను, సన్యాసులను మోసం చేసే వారు. అతిథులకు తనకింద పనిచేసే వారికి తిండి పెట్టక తినేవారు " నరకానికి పోతారు. మారణాయుధాలను, తలవెంట్రుకలను విక్రయించడం, కన్నెపిల్లలను, బ్రాహ్మణులను, గోవులను కత్తులతో నరకడం, గురువులను, తనను నమ్మకంగా సేవించు సేవకుడిని విడిచి పెట్టడం, పదిమంది నడిచే దారిన ముళ్ళు పరచి ప్రజలను ఇబ్బంది పెట్టు వారు నరకముకు పోవడం తధ్యము. నేరం చెయ్యని వాడిని శిక్షించే రాజు, ప్రజలను రక్షించ వలసిన రాజు కర్తవ్యం మరచి ప్రవర్తించడము, తమవద్ద దాచడానికి ఇచ్చిన వస్తువును తిరిగి ఇవ్వని వాడిని, గోవులను ముక్కు పట్టి పీడించు వారికి అధోగతి తప్పదు.

పుణ్యకార్యములు[మార్చు]

పదిమందికి ఉపయోగించే సత్రములు కట్టించడం, తోటలు వేయించడం, మంచి నీటి బావులు తవ్వించడం, భయంతో బాధలతో ఉన్న వారిని కాపాడడము, కన్యాదానము, గోదానము, భూదానము, వాహనదానము, సేవకుల దానము, కీడుచేసిన వారిని క్షమించడం, భార్యాబిడ్డలను , బంధువులను ఆదరించడం, దానధర్మములకు చేసిన ఖర్చును గొప్పలుగా చెప్పుకొనక పోవడం, దుర్మార్గులకు దూరంగా ఉండడం స్వర్గద్వారాలు " అని చెప్పాడు.

బ్రహ్మహత్యాపాతకము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! కొన్ని పనులు బ్రహ్మహత్యా పాతకములు అన్నారు కదా ! హింస లేకుండా హత్యలు ఎలా ఔతాయి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ ప్రశ్నను నేను ఒక సారి వ్యాసుడిని అడిగాను. వ్యాసుడు నాకు చెప్పినది నేను నీకు చెప్తాను. బ్రాహ్మణులను, పేదవారిని పిలిచి వారికి భోజనం పెట్టకపోవడం. మంచికులములో పుట్టి వేదవిద్యను నేర్చిన బ్రాహ్మణుడిని అతడి వృత్తిని అతడు చేయకుండా అడ్డగించడం, నీళ్ళు త్రాగడానికి వచ్చిన ఆవులను నీరు త్రాగకుండా ఆపడము, గుడ్డివారికి, చెవిటివారికి, కుంటివారికి ఇచ్చిన ధనమును అపహరించడం. వేదములను, శాస్త్రములను నిందించడం బ్రహ్మహత్యా సమాన పాపములు. కోపంతో ఊళ్ళకు ఊళ్ళు తగులబెట్టడం, పళ్ళ తోటలను నాశనం చెయ్యడం, అబద్ధపు సాక్ష్యం చెప్పి బ్రాహ్మణులకు ఇతరులకు శోకం కలిగించడం బ్రహ్మ హత్యతో సమాన పాపములు. రూపము గుణము శీలము ఉన్న వరుడికి ఇచ్చి వివాహము చెయ్యక తనకు నచ్చిన విధముగా కన్యను తగని వరుడికి ఇచ్చి వివాహము చెయ్యడం బ్రహ్మ హత్యా సమాన పాపము " అని భీష్ముడు చెప్పాడు.

పుణ్యతీర్ధములు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! నాకు తీర్ధ విశేషాలు తెలియజేయండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము గౌతముడికి అంగిరసుడు వివరించిన విశేషములు నీకు వివరిస్తాను. చంద్రబాగ, వితస్తనదీ తీరాలలో ఏడు దినములు ఉపవాసము చేసిన వాడు మునిసమానుడు ఔతాడు. కాశ్మీరదేశంలో పారే నదులలో నదులలో నీరు త్రాగితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. పుష్కర తీర్ధము, ప్రభాస తీర్ధము, నైశారణ్యము, ఇంద్ర మార్గము, దేవిక, స్వర్గ బిందువు వీటిలో స్నానం చేసిన అప్సరసలతో విమానవిహారము ప్రాప్తిస్తుంది. గంధమాధన పర్వతములలోని ఇంద్రతోయ, కరతోయ అనే నదీతీరాన మూడు రోజులు ఉపవాసము ఉండి స్నానమాచరించిన వారికి అశ్వమేధ యాగము చేసిన ఫలితము కలుగుతుంది. కనఖలములో, గంగాద్వారములో, కుశావర్తములో, బిల్వకములో స్నానము చేస్తే పాతకములు తొలగి పోతాయి. కైలాసశిఖరమున గంగాస్నానము చేసిన దేవతాదర్శనం ఔతుంది. ఒకనెల పాటు ఆహారము భుజించక అగ్నిని ఆరాధించిన వారికి సకలసిద్ధులు ప్రాప్తిస్తాయి. భృగుతుంగము అను సరస్సులో మూడురోజులు ఉపవాసము ఉండి స్నానము చేసిన బ్రహ్మహత్యాపాతకము తొలగిపోతుంది. సుందరికాసరస్సులో స్నానము చేసిన మరుజన్మలో అత్యంత సుందరాకారము ప్రాప్తిస్తుంది. వైమానికము అనే తీర్ధములో స్నానం చేస్తే స్వర్గలోకప్రాప్తి కలుగుతుంది. కృత్తిక, అంగారకుల సేవచేస్తే, పాపములు నశించి స్వర్గలోకప్రాప్తి కలుగుతుంది. విపాశానదిలో మూడు రోజులు స్నానము చేస్తే పునర్జన్మ ఉండదు. కృత్తికా ఆశ్రమంలో స్నానము పితృతర్పణం చేసిన వాడికి శివసాన్నిధ్యము కలుగుతుంది. ద్రోణ శర్మ, శరస్తంభము, దేవదారు వనమును సేవించిన వారికి అప్సరస వంటి భార్య దొరొకుతుంది. చిత్రకూటము, జనస్థానం సేవించిన వారికి రాజ్యసంపదలు కలుగుతాయి. శ్యామాశ్రమంలో ఒక నెల పాటు నిరాహారంగా ఉంటే అతడికి అంతర్ధ్యాన ఫలము కలుగుతుంది. కైశికవాలములో మౌనంగా నిరాహారంగా 21 రోజులు గడిపితే అతడు ముక్తిని పొందగలడు. మతంగవాపిలో ఒక రాత్రి గడిపితే సిద్ధుడు ఔతాడు. నైమిశారణ్యమున ఒకమాసము నివసించిన పురుషమేధము చేసిన ఫలము పొందగలడు. అలాగే ఉత్పలావనములో చేసిన సగము అశ్వమేధయాగము చేసిన ఫలము పొందగలడు. గంగా యమునా సంగమములో ఉన్న కాలాంజనము అను పర్వతము మీద స్నానము చేస్తే విముక్తిమార్గము పొందుతాడు. వైవసత్వతీర్ధంలో స్నానము చేసిన అనేక సంపదలు పొందుతాడు. ప్రయాగక్షేత్రములో మూడుకోట్ల పదివేల పుణ్యతీర్ధములు వచ్చి కలుస్తాయి. ప్రయాగలో ఒకనెల గడిపిన వాడికి ముక్తి లభిస్తుంది. గంగానదిలోను, బ్రహ్మకపాలం లోనూ ఒక మాసం రోజులు ఉపవాసము ఉంటే చంద్రలోకప్రాప్తి కలుగుతుంది. అష్టావక్రము కలవింకము, దేవహ్రదుము వీటిలో స్నానము చేసిన నరుడికి బ్రహ్మలోకప్రాప్తి కలుగుతుంది. రామహ్రదములో 12రోజులు నియమంగా ఉపవాసము ఉంటే సకలదోషములు హరిస్తాయి. మహాహ్రదంలో నెల రోజులు ఉపవాసం ఉంటే జమదగ్ని పొందిన లోకములు ప్రాప్తిస్తాయి. వింధ్యపర్వతము మీద నెల రోజులు తపస్సు చేస్తే సకలధర్మములు అలవడతాయి. నర్మదానదిలో స్నానము చేస్తే రాకుమారుడిగా పుడతాడు. జంబుద్వీపంలో మూడుమాసముల ఒక్క రోజు నివసిస్తే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి. గోకాముఖంలో స్నానము చేసి తండులికాశ్రముకు పోయి, నార చీరలు ధరించి, శాకాహారము తింటూ శాంతిగా జీవిస్తే పదిమంది కన్యలకు భర్త అయి ఆరోగ్యవంతుడుగా అకాలమరణం లేకుండా జీవిస్తాడు. కుల్యతీర్ధంలో మూడు రాత్రులు నిరాహారంగా, శుచిగా, అఘమర్షణ జపం చేస్తే అతాడికి అశ్వమేధయాగము చేసిన ఫలితము దక్కుతుంది. ఆర్షిసేనాశ్రమంలో ఉన్న ఉజ్జానకము అనే తీర్ధములో స్నానము చేసిన మానవుడు సకల పాపములు హరించబడతాయి. పిండారకములో ఒక రాత్రి గడిపిన వాడికి అగ్నిష్ఠోమ ఫలము దక్కుతుంది. ధర్మారణ్యములో ఉన్న బ్రహ్మసరస్సులో స్నానం చేసిన మానవుడు పుండరీక యాగము చేసిన ఫలితము దక్కుతుంది. హిమాలయ పర్వతములలో మునులకు సేవ చేస్తూ తపస్సు చేస్తే సర్వసిద్ధులు ప్రాప్తించి బ్రహ్మలోకప్రాప్తి కలుగుతుంది. ధర్మనందనా ! పుణ్యతీర్ధములను సేవించునప్పుడు కామము, క్రోధము, మదము, లోభము లేని ప్రశాంత చిత్తముతో ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే తీర్ధములు సేవించిన ఫలము దక్కుతుంది. ధర్మజా ! నిజానికి అన్ని తీర్ధములు మనసులోనే ఉంటాయి. ఇంద్రియములను నిగ్రహించడం, తపస్సు చేయడం, మనస్సును అదుపులో ఉంచడం, ఇవన్నీ తీర్ధసేవనంతో సమానములే. కేవలము వట్టి నీళ్ళతో స్నానము చేసిన శరీరము శుభ్రపడుతుంది కాని మనసులోని కల్మషములు తొలగవు. ధర్మనందనా ! దొరకని వాటికి తాపత్రయ పడకుండా దొరికిన వాటితో సంతృప్తి చెంది, కోరికను జయించిన వాడికి ఏ తీర్ధములతో పని లేదు. అటువంటి వారు సదా పవిత్రులే. ధర్మనందనా ! మానవుడు ఎంతో శ్రమకోర్చి దుర్గమమైన ప్రదేశములో ఉన్న అన్ని తీర్ధములు సేవించ పని లేదు. ఆ తీర్ధములను మనసున స్మరించిన చాలు సకల పాపములు హరించబడతాయి " అని భీష్ముడు చెప్పాడు. ఇంతలో శరతల్పగతుడైన భీష్ముడిని చూడడానికి అత్రి, వశిష్ఠుడు, భృగువు, పులహుడు, పులస్త్యుడు, క్రతువు, అంగిరసుడు, అగస్త్యుడు, కణ్వుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని మొదలైన మహామునులు తమ తమ శిష్యులతో సహా అక్కడకు వచ్చారు. వారిని చూసిన పాండవులు ఆశ్చర్యచకితులై వారికి భక్తిశరద్ధలతో నమస్కరించారు. భీష్ముడిని చూసిన పిమ్మట వారంతా అక్కడ నుండి వెళ్ళారు.

జనపదములు పర్వతములు నదులు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ఏయే జనపదములు, ఏయే పర్వతములు, ఏయే నదులు పవిత్రమైనవో మహత్తుగలవో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీకొక ఇతిహాసము చెప్తాను. ఉంఛవృత్తితో జీవితము సాగించే ఒక బ్రాహ్మణుడి ఇంటికి ఒక సిద్ధుడు అతిథిగా వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఆ సిద్ధుడికి అతిథి మర్యాదలు చేసాడు. ఆ బ్రాహ్మణుడు కూడా నువ్వు అడిగినట్లే సిద్ధుడిని అడిగాడు. ఆ సిద్ధుడు బ్రాహ్మణుడికి గంగానదీ మాహాత్మ్యము వివరిస్తూ " ఏయే ప్రాంతములో గంగానది ప్రవహిస్తుందో ఆయా ప్రదేశములు పవిత్రములు ఔతాయి.

గంగానది మహిమ[మార్చు]

గంగానదిలో భక్తితో స్నానం చేసి పూజిస్తే వారికి యజ్ఞములు, బ్రహ్మచర్యము, తపస్సు, దానములు చేసిన ఫలము చేకూరుతుంది. మానవుడి అస్థికలు ఎన్ని సంవత్సరాలు గంగానదిలో నానుతుంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. గంగానది లేని దేశము, సోమము లేని యజ్ఞము, చంద్రుడు లేని రాత్రి, సూర్యుడు లేని పగలు, ఆత్మధర్మము లేని ఆశ్రమము, పూలు లేని చెట్లు మాదిరి శోభించ లేదు. చాంద్రాయణవ్రతములు నూరు చేసినా గంగాజల పానము చేసిన దానితో సమానము కాదు. అగ్నిలో పడిన దూది దగ్ధము అయినట్లు గంగానదిలో స్నానము చేసిన మానవుడికి పాపములు దగ్ధము అవుతాయి. దేవతలకు అమృతము వంటిది మానవులకు గంగాజలము. దిక్కు లేని వారికి గంగానది పరమ దిక్కు అని మునివాక్కు లు చెప్తున్నాయి. గంగానది ఇసుక తలమీద పెట్టుకుని గంగానది మట్టి నుదుటిన ధరించిన వారి పాపములు నశిస్తాయి. గంగానది మీద నుండి వచ్చే గాలులు తగిలినా పాపాలు నశిస్తాయి. గంగాస్నానము చేసిన అటు ఏడుతరాలు, ఇటు ఏడుతరాలు పితృదేవతలు తరిస్తారు. అంతెందుకు ఎక్కడ స్నానము చేస్తున్నా గంగలో మునుగుతున్నట్లు భావన చేసినా గంగాస్నాన ఫలము దక్కుతుంది. గంగను చూసిన వాడు మానవుడు గంగను చూడని వాడు పశువుతో సమానము, గుడ్డివాడితో సమానము. దేవతలు, ఇంద్రుడు కూడా సదా గంగను స్మరిస్తారు ఇక మానవుల సంగతి చెప్పనలవి కాదు. మరణసమయంలో గంగను స్మరించిన వాడికి ముక్తి తధ్యము. గంగాస్నానను చేసిన వాడికి రాజభయము, చోరభయము, పాపభయము, భూతభయము కలుగవు. దివి నుండి భువికి దిగి వచ్చిన గంగానదిని సాక్షాత్తు శివుడే తన శిరస్సున ధరించాడు. ఇక మానవుల గురించి చెప్పనేల. మానవులకు ఇంద్రుడు, గ్రహములకు సూర్యుడు, నక్షత్రములకు చంద్రుడు ఎలాగో మానవులకు గంగానది అంతే. సగరకుమారులు కపిలముని శాపానికి గురి అయి దగ్ధమైనప్పుడు గంగానది వారి మీద ప్రవహించి వారిని పునీతులను చేసింది. ఆ గంగానదిని భగీరధుడు తన తపస్సుతో భూమి మీదకు తీసుకు వచ్చాడు. గంగానది చంద్రుడి మీద నుండి అక్కడ నుండి సూర్యలోకము మీదగా విష్ణువు పాదాల నుండి జాలు వారి శివుడి శిరస్సు మీద పడి అక్కడి నుండి హిమాలయ పర్వతముల నుండి భూమి మీదకు వచ్చింది. అచంచలమైన భక్తితో ఎవరు గంగను పూజించి, ఆశ్రయిస్తారో వారికి గంగ సకల సంపదలను ప్రసాదిస్తుంది " అని సిద్ధుడు బ్రాహ్మణుడికి చెప్పాడు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

జనపూజితుడు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! సర్వజనములతో పూజింపబడు వాడు ఎవరో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఒకసారి నారదుడు శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి శ్రీకృష్ణుడి అతిథిసత్కారాలు అందుకున్నాడు. శ్రీకృష్ణుడు " నారదా ! నీవు అత్యంత మక్కువతో ఎవరిని మొక్కుతావు ? " అని అడిగాడు. " కృష్ణా ! వరుణుడికి, వాయుదేవుడికి, భూమికి, ఆకాశానికి, అగ్నికి, ఈశానుడికి, షణ్ముఖుడికి, మహాలక్ష్మికి, విష్ణువుకు, బ్రహ్మదేవుడికి, బృహస్పతికి, చంద్రుడికి, నీటికి, భూమికి ఎవరు భక్తితో పూజిస్తారో నేను వారిని భక్తితో నమస్కరిస్తాను. ఇంకా వేదాధ్యయనం చేసే వారు, తపోధనులు, దేవతలను పూజించువారు, భూదానము, గోదానము, ధనదానము, ధాన్యదానములను చేయు వారు, అతిథిపూజ చేయువారు, పితృతర్పణం చేయువారు, భిక్షాటనతో శాంత చిత్తముతో జీవించువారు, ఎల్లప్పుడు సత్యమునే పలుకువారు వీరికి నేను భక్తితో నమస్కరిస్తాను. ధర్మము, అర్ధము, కామము సమానంగా భావించు వారు. అహంకారము, అధిక మమకారము లేనివారు, మంచి నడవడి కలవారు, లోలత్వము లేని వారు వీరందరికి నేను నమస్కరిస్తాను. కృష్ణా నీవు కూడా వీరిని పూజించి శుభలు పొందు " అని చెప్పాడు. కనుక ధర్మనందనా ! నీవు కూడా అలా ప్రవర్తించి శుభములు పొందు " అని భీష్ముడు చెప్పాడు.

రాజు కర్తవ్యము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! రాజ్యము చేసే రాజులకు ప్రధాన కర్తవ్యము ఏమిటో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పట్టాభిషిక్తుడైన రాజుకు ప్రథమకర్తవ్యము బ్రాహ్మణపూజ. బ్రాహ్మణులు సుఖశాంతులతో జీవించు రాజ్యము సుభిక్షంగా ఉంటుంది. బ్రాహ్మణులను అవమానించిన రాజ్యములో అనేక కష్టములు కలుగుతాయి. విప్రులు ఘటనాఘటన సమర్ధులు. విప్రులకు అనుకూలంగా ఉన్న వారు రాజ్యాధిపతులు కాగలరు. విప్రులను అవమానించిన వారు రాజ్యభ్రష్టులు కాగలరు. బ్రాహ్మణుడు కోపిస్తే దేవేంద్రుడు కూడా తట్టుకో లేడు. విప్రులు శాపానుగ్రహ సమర్ధులు. పూర్వము ద్రవిఢ దేశాధిపతులు బ్రాహ్మణులను అవమానించి శూద్రులైనారు. కనుక ధర్మనందనా నీవు ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజింపుము. సదాచారము కలిగిన బ్రాహ్మణుడికి భోజనము పెట్టిన అతడి పితృదేవతలు తరిస్తారు. భూదేవికి విష్ణుమూర్తికి బ్రాహ్మణుల విషయమై ఒకసారి సంవాదము జరిగింది. విష్ణుమూర్తి భూదేవితో " దేవీ ! నీవు లోకమాతవు కదా ! నిన్ను ఒక విషయము అడుగుతాను. పాపములు పోగొట్టుకోవడానికి చేయవలసిన పనులు ఏవి ? " అని అడిగాడు. భూదేవి " నాధా ! బ్రాహ్మణులను సేవించినా ! పూజించినా ! విప్రులకు హితము చేసినా పాపములు నశిస్తాయి. అహల్యను కోరుకున్నందుకు ఇంద్రుడికి శరీరము నిండా కన్నులు కలుగుతాయని శపించింది బ్రాహ్మణుడైన గౌతముడే కదా ! " అని జవాబు చెప్పింది. కనుక ధర్మనందనా ! నీవు ఏమరపాటు లేక బ్రాహ్మణులకు పూజ చెయ్యి. పుట్టుకతోనే బ్రాహ్మణులు పూజనీయులు. ముందుగా బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను సృష్టించి వారితో " మీకు ధర్మనిరతి తప్ప వేరు పని లేదు. మీరు ధర్మమును సదా రక్షించడమే మీ కర్తవ్యము. అందు వలన మీకు శుభములు కలుగుతాయి. బ్రాహ్మణుడు మిగిలిన వర్ణముల వారికి మార్గదర్శకుడిగా ఉండాలి. నిత్యము వేదాధ్యయనము, అగ్నిహోత్రము ఆచరించాలి. క్షత్రియులు మీ మాటను అనుసరించి నడచుకుంటారు. ఎవరైనా అగ్నిని తాకవచ్చు, హిమాలయమును కదిలించ వచ్చు, గంగానదిని మూట కట్టవచ్చు కాని విప్రులను మాత్రము అవమానించ రాదు. విప్రులను కొలవడం కల్పవృక్షము వంటిది " అని బ్రహ్మ చెప్పాడు.

ఇంద్రుడు శంబరుడు[మార్చు]

భీష్ముడు ఇంకా " ధర్మనందనా ! ఈ విషయంలో ఇంద్రుడికి శబరుడికి మధ్య జరిగిన సంభాషణ చెప్తాను విను. శంబరుడు జటాసురుడి కొడుకు. జటాసురుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు జటాసురుడి వద్దకు వెళ్ళి " నీకు ఈ ఉన్నత స్థితి ఎలా వచ్చింది. జటాసురుడు " నాకు బ్రాహ్మణుల మీద కోపము అసూయ లేవు. నేను ఎల్లప్పుడు బ్రాహ్మణులను రక్షిస్తాను. అందుకే నాకు ఈ వైభవము కలిగింది. దేవాసురయుద్ధములో బ్రాహ్మణుల అనుగ్రహము వలనే కదా దేవతలు గెలిచారు. అది చూసి నా జనకుడు చంద్రుడితో " ఆహా ! విప్రులు మహానుభావులు కదా అందుకే దేవతలు గెలిచారు " అన్నాడు. అప్పుడు నా జనకునితో చంద్రుడు " బ్రాహ్మణులు, తపస్సు, వేదాధ్యయనము ఎల్లప్పుడు ఆచరిస్తారు. బ్రాహ్మణుడు ఎంత దూరము వెళ్ళి అయినా గురుశుశ్రూష చేసి విద్యను అభ్యసిస్తాడు. తరువాత తపస్సు చేస్తాడు. అది బ్రాహ్మణుడికి విధించిన కర్మ. కనుక బ్రాహ్మణుడు అందరికీ అధికుడు. అటువంటి బ్రాహ్మణులను ఆదరించిన శుభములు, అవమానించిన అశుభములు కలుగుతాయి అనడంలో సందేహం లేదు " అని చెప్పగా నేను విన్నాను. చంద్రుడి మాటలు మన్నించి నా జనకుడు బ్రాహ్మణులను పూజించాడు. అందుకనే తేజస్సుతో వెలుగొందుతున్నాడు. నా తండ్రి మాదిరి నేను కూడా బ్రాహ్మణులను పూజించి ఇంతటి ఉన్నత స్థితికి చేరాను " అని శంబరుడు ఇంద్రుడికి చెప్పాడు. కనుక ధర్మనందనా ! నీవు కూడా ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజించి ఆదరించి శుభములు పొందుము " అని భీష్ముడు చెప్పాడు.

రాజు ఆదరించ తగిన వారు[మార్చు]

ధర్మరాజా " పితామహా ! సదా తనవెంట ఉండేవారు దూరంనుండి వచ్చినవారు వీరిలో ఉత్తములెవ్వరు. ఎవరిని ఆదరించాలి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! క్రోధమూ, ఈర్ష్య లేని వారు, స్నేహితులు, బంధువులు, సంబంధులు, ఋత్విజులు, పురోహితులు వీరంతా ఆదరించతగిన వారే. దూరం నుండి వచ్చిన వారిలో తెలియని వారిలో ఆచారశీలురు, విద్యావంతులు, గౌరవనీయులు అందరూ పూజింపతగిన వారు " అని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు " పితామహా ! లోకంలో ఉన్న పాపాలన్నింటికీ స్త్రీలు మూలకారణం అంటారు కదా ! అలా ఎందుకు అంటారో చెప్పండి " అని అడిగారు. భీష్ముడు " ధర్మనందనా ! స్త్రీలు నీవు చెప్పినటువంటి వారే. ఈ సందర్భంలో నీకు నారదుడికి పంచచూడ అనే అప్సరసకు జరిగిన సంవాదము తెలుపుతాను. ఒకసారి నారదుడు లోక సంచారము చేస్తూ పంచచూడ అనే అప్సరసను చూసి " లలనా ! నిన్ను ఒక విషయము అడుగుతాను చెప్పు " అని అడిగాడు. పంచచూడ " మహాత్మా ! అడగండి నాకు తెలిసినంత వరకు చెప్తాను " అని పలికింది. నారదుడు " వనితల స్వభావము ఎలా ఉంటుందో నాకు తెలిసేలా చెప్పు " అని అడిగాడు. పంచచూడ " అదేమిటి మహామునీ ! నేను వనితను. వనితలు మరొక వనితల గురించి చెడుగా ఎలా చెప్తారు " అనుకున్నావు. నారదుడు " నీవు నిజము చెప్పిన నీకు దోషము ఏమీ రాదు చెప్పు " అని అడిగాడు. పంచచూడ " మహాత్మా ! స్త్రీస్వభావములు మీరు ఎరుగనివా ! అయినా మీరు అడిగారు కనుక చెప్తాను. మంచి కులమున పుట్టీ, గౌరవమర్యాదలు కలిగి ఉండీ, ఒకరికి భార్య అయి ఉండీ స్త్రీ పరపురుషుడితో తిరుగుతుంది. ఇంది స్త్రీ స్వభావము ఇందుకు ఏమని చెప్పాలి. ఇది ఎవరికి అర్ధము కాదు. స్త్రీలు సర్వదోషముకు కారణము. పురుషుల మంచితనము మగువలకు అర్ధము చేసుకొనక పరాయి పురుషులను పొగుడుతుంటారు. రాజదండన భయము లేకపోతే స్త్రీలను అదుపు చేయడం కష్టమే. ఎన్ని కట్టెలు వేసినా అగ్నికి తృప్తి ఉండదు. ఎన్ని నదులు కలిసినా సముద్రుడికి తృప్తి ఉండదు. ఎంత మంది ప్రాణాలు హరించినా మృత్యుదేవతకు తృప్తి ఉండదు " అని చెప్పిన పంచచూడ మాటలకు నారదుడు తృప్తి చెందాడు. ధర్మనందనా నీ ప్రశ్నకు ఇదే సమాధానము " అని భీష్ముడు చెప్పాడు.

స్త్రీలరక్షణ[మార్చు]

ధర్మరాజు " పితామహా ! మరి అలాంటి స్త్రీలను ఎలా కాపాడు కోవాలి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! స్త్రీలు అసురుల మాయల కంటే మించిన మాయలు కల వారు. ఈ సందర్భంలో నీకు ఒకకథ చెప్తాను. మొదట స్త్రీలు దోషము, మాయా మర్మము లేక సాధువులుగా ఉండే వారు. అందుకే స్త్రీలకు దైవత్వము లభించింది. ఇది చూసి అసూయ పడిన దేవతలు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. బ్రహ్మ అప్పుడు మాయలు మర్మాలు స్త్రీల లక్షణముగా ఏర్పరిచి స్త్రీలకు మోహము ఎక్కువగా ఉండేలా చేసాడు. అందు వలన స్త్రీలు మోహపరవశులై పురుషులను వారి కోరికలకు బలి చేయసాగారు. పురుషులు స్త్రీల కొరకు రోషము, కోపముకు లోనై దైవత్వము కోల్పోయారు. ఇది చూసి దేవతలు తృప్తి చెందారు. కనుక స్త్రీల మాయామర్మములు కలవారు కనుక వారి మనసు గ్రహించడం పురుషులకు కష్టమే. ఇందుకు నీకు ఒకకథ చెప్తాను. పూర్వము దేవశర్మ అనే ముని ఉండే వాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞము కార్యము మీద పోతూ తన శిష్యుడైన విపులుడిని చూసి " విపులా ! నా భార్య అతిలోకసుందరి. ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుడి ఉపాయము తిప్పి కొడుతూ నా భార్యను రక్షిస్తున్నాను. నేను ఇప్పుడు యాగము చేయడానికి వెడతాను. ఇంద్రుడికి పరుల భార్యలమీద కన్ను. కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి " అని చెప్పాడు. విపులుడు " గురువుగారూ ! మీరు చెప్పినట్లే చేస్తాను. కాని ఇంద్రుడు మాయావి కనుక ఏరూపంలో వస్తాడో తెలుసుకోవడం ఎలాగ ? " అని అడిగాడు. దేవశర్మ " విపులా ! నీవు చెప్పినది నిజమే ! మాయావి అయిన ఇంద్రుడు పక్షుల రూపంలో జంతువుల రూపంలో కూడా రాగలడు కనుక జాగ్రత్త పడాలి. దేవేంద్రుడు నా భార్య మీద కన్ను వేసి ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. అందులో సందేహం లేదు. నేను ఆశ్రమంలో లేనని తెలిసిన ఇంద్రుడు నా భార్య కొరకు తప్పక వస్తాడు. కనుక నీవు జాగరూకత వహించాలి " అని చెప్పాడు. విపులుడు " గురుదేవా ! మీరు చెప్పినట్లు చేస్తాను " అన్నాడు. దేవశర్మ నిశ్చింతగా యాగము చేయడానికి వెళ్ళాడు. విపులుడు జాగ్రత్తగా గురుపత్నిని కాపలా కాస్తున్నాడు. అతడికి ఒక ఆలోచన వచ్చి " నేను గురు పత్నిని యోగశక్తితో ఆవహిస్తాను. అప్పుడు దేవేంద్రుడు గురుపత్నిని ఏమీ చేయలేడు. నేను యోగ శక్తితో ఆవహించిన విషయము గురువుగారికి తెలిసే అవకాశము లేదు " అనుకున్నాడు. ఆ తరువాత శిష్యుడి ఆత్మ గురుపత్నిని ఆవహించింది. శిష్యుడి ఆత్మ ప్రవేశించడంతో ఆమె ఆత్మ జడత్వం పొందింది. ఇంద్రుడు ఆమె మీద కోరికతో పక్కనే ఉన్న శిష్యుడు నిద్ర పోతున్నాడని అనుకుని ఆమెను సమీపించి తన కోరిక తెలిపాడు. ఆమె జడత్వము వహించినందు వలన ఇంద్రుడికి జవాబు ఇవ్వ లేదు. ఇంద్రుడు ఆమెను త్వరపెట్టాడు. గురుపత్నిలో ఉన్న శిష్యుడు ఇంద్రుడితో " ఇంద్రా ! నీవు ఇక్కడకు వచ్చిన పని ఏమి ? " అని అడిగుతూ ఆమెను స్పృహ తప్పేలా చేసాడు. ఇంద్రుడు ఇదంతా చూసి భయపడ్డాడు. శిష్యుడు గురుపత్నిని వదిలి బయటకు వచ్చి ఇంద్రుడితో " గౌతముడి శాపంతో ఒళ్ళంతా కళ్ళు చేసుకున్నా నీకు బుద్ధి రాలేదు కదా ? దేవేంద్రుడివై ఉండి ఇంద్రియములు అదుపులో పెట్టుకోలేని నీ బుద్ధి కుత్సితమైనది కదా నీచుడా. ఇలాంటి పని చేస్తే నా గురువు గారి కోపాగ్నికి భస్మము కాగలవు జాగ్రత్త " అన్నాడు. దేవేంద్రుడు తన యోగబలముతో విపులుడి శక్తి గ్రహించాడు. విపులుడు తిరిగి " మా గురువు దాకా ఎందుకు నేనే నిన్ను దహించగలను కాని మనసు రావడం లేదు బ్రతికి పోయావు వెళ్ళు " అని అన్నాడు. ఇంద్రుడు బతుకు జీవుడా అంటూ వెళ్ళి పోయాడు. గురువు గారు వచ్చిన తరువాత " గురువు గారు ! మీరు లేనప్పుడు దేవేంద్రుడు ఇక్కడకు వచ్చాడు. కాని నా యోగబలానికి భయపడి వెళ్ళి పోయాడు " అని చెప్పి తాను రుచి శరీరంలో ప్రవేశించిన విషయం చెపితే గురువు గారు ఏదైన అనుకుంటాడని చెప్ప లేదు.

దేవకాంత పూలదండ[మార్చు]

ఒక రోజు ఆకాశ మార్గాన పోతున్న దేవకాంత మెడలోని పూలదండ దేవశర్మ తలమీద పడింది . దేవశర్మ దానిని భార్యకు ఇచ్చాడు. ఆ సమయంలో రుచి అక్క భర్త అయిన చిత్రరధుడు దేవశర్మను, రుచిని తమ ఇంట్లో జరిగే ఉత్సవానికి రమ్మని ఆహ్వానించాడు. చిత్రరధుడి ఇంటికి పోతూ రుచి ఆ దండను అలంకరించుకుని వెళ్ళింది. ఆ పరిమళముకు ఆకర్షింపబడిన ఆమె సోదరి ఆదండ గురించి సోదరిని అడుగగా ఆమె ఆ పూలు తమ ఆశ్రమంలో ఉన్నాయని చెప్పి తన భర్తతో అటువంటి పూలను తన సోదరికి తెచ్చి ఇవ్వమని కోరింది. దేవశర్మ విపులుడిని పిలిచి ఆ పుష్పములు ఎక్కడ ఉంటాయో వెతికి పట్టుకు రమ్మని చెప్పాడు. విపులుడు తన యోగశక్తితో ఆ పుష్పములు ఉన్న ప్రదేశం తెలుసుకుని ఆ పూలను తీసుకుని వస్తూ మార్గమధ్యంలో ఇద్దరు స్త్రీ పురుషుల వాదన విన్నాడు. ఆ స్త్రీ నాది తప్పు అయిన " విపులుడికి పరలోకములో పట్టినగతి నాకు పడుతుంది " అన్నది. అతడు అది విని ఇంకా ముందుకు సాగాడు అక్కడ ఆరుగురు జూదరులు ఆడుతూ మధ్యలో కలహించి " నాది తప్పయితే పరలోకములో విపులుడికి పట్టినగతి నాకు పడుతుంది " అని అన్నాడు. ఈ మాటలు విన్న విపులుడు తాను చేసిన తప్పేమిటి " ఒక వేళ తాను గురువుగారు లేని సమయంలో ఆమె శరీరంలో ప్రవేశించిన విషయం గురువుగారికి చెప్ప లేదు కదా ! అందు వలన నాకు పాపం వచ్చింది ఏమో " అని తర్కించుకుంటూ గురువుగారిని చేరి ఆ పూలను గురువుగారికి సమర్పించాడు. విపులుడు ఒంటరిగా ఉన్న సమయంలో గురువుగారు విపులుడితో " విపులా నీవు వచ్చు మార్గములో ఇద్దరు స్త్రీ పురుషులు ఆరుగురు జూదరులు కనిపించారు కదా వారు ఎవరో తెలుసా " అని అడిగాడు. విపులుడు వారు ఎవరో తెలియదని చెప్పాడు. గురువు " నీవు నా భార్యను రక్షించడానికి నా భార్య శరీరంలో ప్రవేశించావు. అది పాపపమని వారనుకున్నారు నిజంగా అది పామని నేను అనుకుంటే నేను నీకు శాపం ఇచ్చేవాడిని కాని వరాలు ఎందుకు ఇస్తాను ? ఆ స్త్రీ పురుషులు పగలు రాత్రి. ఆ జూదరులు ఆరు ఋతువులు " అని చెప్పాడు. గురువుగారి ఔదార్యానికి శిష్యుడు ఆశ్చర్య పోయాడు. గురువు గారు ఇంకా విపులుడితో " రాత్రి పగలు ఆరు ఋతువులు మనుష్యులు చేసే మంచి పనులు చెడ్డ పనులు గమనిస్తుంటారు. కనుక మనం ఎవరికి తెలియకుండా తప్పు చేయవచ్చని అనుకోవడం పొరబాటు. నీవు ఒక స్త్రీని రక్షించడానికి విజ్ఞతతో చేసిన పని మంచిదే కాని తప్పు కాదు ఇలా చేసి నా గౌరవం కాపాడావు. అందుకని ఆ విషయం నాకు చెప్పక దాచడం పాపము కాదు " అని చెప్పాడు. అని చెప్పి భీష్ముడు ధర్మనందనా ! స్త్రీల గురించి నీకు చెప్పాను. స్త్రీలలో అనేక విధములు ఉంటారు. అందులో మంచి వారు కులస్త్రీలు ఉంటారు. వారి వలనే ఈ భూమి క్రమం తప్పక పరిభ్రమిస్తుంది. పాతివ్రత్యం పాటించే స్త్రీ దైవం వంటిది. మానవుడికి ధర్మము, సుఖము, పేరు ప్రతిష్ఠలు మంచి భార్య వలన లభిస్తాయి అనడంలో ఏ విధమైన సందేహం లేదు " అని చెప్పాడు.

కన్యను ఎన్నుకోవడము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! కన్యావరణం ఎలా చెయ్యాలి వివరించండి " అన్నాడు. భీష్ముడు " ధర్మనందనా " వధువు తండ్రి మంచి కులము, శీలము, విద్య కల వాడిని పిలిచి తన కన్యను నీటితో సహా దానము ఇవ్వడము బ్రాహ్మణవివాహం. క్షాత్ర వివాహంలో కన్య స్వయంవరంలో పురుషుడిని వరిస్తుంది. పరస్పరం ప్రేమించుకున్న తరుణంలో ఆ పురుషుడికి కన్యను ఇచ్చి వివాహం చెయ్యడమే గాంధర్వం. ఇది క్షత్రియవివాహాలలో పెద్దలు అంగీకరించిన వివాహాలలో ఒకటి. గాంధర్వవివాహములో కట్నం తీసుకున్నప్పుడు అది అసురవివాహం ఔతుంది. ఇక కన్యమీద కోరికతో ఆమెకు సంబంధించిన వారిని చంపి ఆమె దుఃఖిస్తున్నా లెక్క చేయక బలవంతంగా తీసుకు వచ్చి వివాహం చెయ్యడం రాక్షసవివాహం అంటారు. ఇలా అయిదు విధముల వివాహాలలో మూడు ధర్మసమ్మతాలు. మిగిలిన అసుర, రాక్షస వివాహాలు ధర్మసమ్మతాలు కాదు పైగావి దూషింపతగినవి. తల్లి, తండ్రి, అన్నదమ్ములు లేని కన్య వివాహముకు పనికి రాదు. బ్రాహ్మణుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కన్యలను వివాహమాడవచ్చు. కాని శూద్రకన్యను వివాహమాడడం ఆమె వలన సంతానం కనడం నిషేధం. క్షత్రియుడు ముందుగా క్షత్రియకన్యను చేసుకున్న తరువాత వైశ్యకన్యను చేసుకో వచ్చు. వైశ్యుడు, శూద్రుడు తమ కులము కన్యలను వివాహమాడాలి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో క్షత్రియులు, వైశ్యులు శూద్రకన్యలను వివాహమాడవచ్చు " అని భీష్ముడు చెప్పాడు.

బ్రాహ్మణుడు శూద్రకన్య[మార్చు]

ధర్మరాజు " పితామహా ! మీరు బ్రాహ్మణుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కన్యలను మాత్రమే వివాహమాడాలని అన్నారు. కాని బ్రాహ్మణుడు శూద్రకన్యలను వివాహమాడినట్లు విన్నాము అదెలా సాధ్యము " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా కొన్ని విషమసమస్యలు వచ్చినప్పుడు బ్రాహ్మణుడు శూద్రకన్యను వివాహమాడవచ్చు. ప్రేమించి కాని, శూద్రకన్య ధనం మీద ఉన్న కోరికతో కొందరు బ్రాహ్మణులు శూద్రకన్యలను వివాహమాడి ఉండ వచ్చు. కాని బ్రాహ్మణుడికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యకన్యల వలన కలిగిన సంతానం బ్రాహ్మణుడు ఔతాడు కాని శూద్రకన్య వలన కలిగిన సంతానం బ్రాహ్మణుడు కాజాలడు.

బ్రాహ్మణ ఆస్తి పంపకము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! బ్రాహ్మణ శూద్ర స్త్రీకు పుట్టిన సంతానానికి కూడా తన తండ్రి ఆస్తిలో భాగం ఉంటుంది కదా ! నాలుగు వర్ణముల స్త్రీలను వివాహమాడిన బ్రాహ్మణుడి సంతానానికి ఆస్తి పంపకం ఎలా జరగాలి ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ముందు ఆ బ్రాహ్మణుడి ఆస్తిని పది భాగములుగా విభజించాలి. దానిలో నాలుగు భాగములు బ్రాహ్మణ స్త్రీ సంతానానికి ఇవ్వాలి. మూడు భాగములు క్షత్రియ స్త్రీ వలన కలిగిన స్త్రీకి ఇవ్వాలి. రెండు భాగములు వైశ్య స్త్రీ వలన కలిగిన సంతానానికి ఇవ్వాలి. శూద్ర స్త్రీ వలన కలిగిన సంతానం తండ్రి ప్రేమతో ఇచ్చిన భాగము తీసు కోవాలి కాని ఆస్తి కొరకు తండ్రిని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సంతానాన్ని ఎదిరించ కూడదు. అలాగే బ్రాహ్మణుడికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల వలన కలిగిన సంతానం శూద్ర స్త్రీ వలన కలిగిన స్త్రీకి కలిగిన సంతానానికి ధర్మంగా రావలసిన ఆస్తిని ఇవ్వకుండా ఎగకొట్ట కూడదు " అని చెప్పాడు.

మిగిలిన వారి ఆస్తి పంపకము[మార్చు]

" ధర్మనందనా ! క్షత్రియుడి ఆస్తిని ఎనిమిది భాగములుగా విభజించాలి. అందులో నాలుగు భాగములు క్షత్రియ కాంత వలన కలిగిన సంతానానికి ఇవ్వాలి. మూడు భాగములు వైశ్య కాంత వలన కలిగిన సంతానానికి ఇవ్వాలి. ఒక భాగము శూద్రస్త్రీ వలన కలిగిన స్త్రీకి ఇవ్వాలి. శూద్రస్త్రీ సంతానం తమ ఆస్తి కొరకు తగవులాడక ప్రేమతోనే పొందాలి. క్షత్రియ, వైశ్య సంతానం శూద్రస్త్రీ సంతానికి ధర్మంగా ఇవ్వ వలసిన ఆస్తిని ఇవ్వక ఎగకొట్ట కూడదు. సంతానం తన ఆస్తి కొరకు వైశ్యుడి ఆస్తి అయిదు భాగములుగా చేసి నాలుగు భాగములు వైశ్య వనిత వలన కలిగిన సంతానానికి ఇవ్వాలి. ఒక భాగము శూద్ర స్త్రీ వలన కలిగిన స్త్రీకి ఇవ్వాలి. ఇక్కడ శూద్ర స్త్రీ సంతానం తన భాగము కొరకు తగవులాడక ప్రేమతోనే పొందాలి. అలాగే వైశ్య స్త్రీకి కలిగిన సంతానం శూద్ర స్త్రీ సంతానానికి ధర్మంగా ఇవ్వ వలసిన ఆస్తిని ఎగకొట్ట కూడదు. ఇక శూద్రుడి సంతానం అతడి సంతానం సమానంగా పంచుకోవాలి. ఇక వైదిక కర్మలు, స్నానము, భోజనము వంటి సమస్త కర్మల మీద అధికారము బ్రాహ్మణ స్త్రీదే కాని మిగిలిన వారికి ఉండదు " అని భీష్ముడు చెప్పాడు.

కుమారులు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! పలువిధముల కుమారులు ఉంటారు అంటారు కదా ! వారు ఎవరో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మరాజా ! ఎవరికైనా తన కులములో వివాహమాడిన కన్యకు ధర్మబద్ధంగా పుట్టిన పెద్దకుమారుడు వారసుడు ఔతాడు. పుత్రులు లేని వారు తమ కుమార్తె కుమారుని అల్లుడు, కూతురు సమ్మతితో దత్తు తీసుకున్న కుమారుడు దౌహిత్రుడు ఔతాడు. అతడు పుత్రసమానుడు ఔతాడు. సంతానం లేని వారు భర్త అనుమతితో భార్యకు అర్హులైన వారి వలన కలిగిన కుమారుడు కూడా పుత్రసమానుడే ఔతాడు. ఇతడు ఔరసపుత్రుడు అని పిలువబడతాడు. సంతానము లేని వారు ఇతరుల నుండి జలధార ద్వారా దత్తముగా స్వీకరించిన కుమారుడు కూడా పుత్రసమానుడు ఔతాడు. ఇతడు దత్రిముడు, దత్తపుత్రుడు, దత్తుడు, దత్తుకొడుకు ఔతాడు. తల్లితండ్రులు లేని వాడిని దగ్గరకు చేర్చి ప్రేమగా పెంచిన పుత్రుడు కృత్రిముడు అని పిలువబడతాడు. పరునిభార్య వలన సంతానము కనిన అతడు పరుని కుమారుడిగా చెలామణి ఔతాడు కనుక అతడు గూఢజుడు అని పిలువబడతాడు. తల్లి తండ్రుల వలన వదిలి పెట్టబడిన పుత్రుడు అపవిద్దుడు అని పిలువబడతాడు. వివాహ పూర్వము కన్యకు కలిగిన పుత్రుడు కానీనుడు అని పిలువబడతాడు. అతడు వివాహము అయిన పిదప ఆ స్త్రీ భర్తకు కూడా అతడు పుత్రుడు ఔతాడు. వివాహత్పూర్వము గర్భము ధరించిన స్త్రీని తెలిసి కాని తెలియక కాని వివాహము చేసుకున్న తరువాత పుట్టిన కుమారుడికి ఆ స్త్రీని వివాహమాడిన పురుషుడు తండ్రి ఔతాడు. అతడు సహోఢుడు అని పిలువబడతాడు. భర్తను వదిలిన స్త్రీ, భర్తచేత వదిలిపెట్టబడిన స్త్రీ, వైధవ్యము పొందిన స్త్రీకి కలిగిన సంతానము అతడి జన్మకు కారణమైన పురుషుడి కుమారుడు ఔతాడు. అతడిని పౌనర్భుడు అంటారు. తల్లి తండ్రులు లేని వాడు, తల్లి తండ్రుల చేత వదలబడిన వాడు తనకు తానుగా ఎవరికైనా దత్తుపోయిన అతడు స్వయందత్తుడు అని పిలువబడతాడు. తల్లి తండ్రుల వలన అమ్మబడిన వాడు కొనుక్కున్న వాడికి కుమారుడు ఔతాడు. అతడు క్రీతుడు అని పిలువబడతాడు. ఈ పన్నెండు విధముల కలిగిన వాడు కుమారులే అయినా ఔరసపుత్రుడికే తల్లి తండ్రులకు ఉత్తర క్రియలు చేసే అధికారం ఉంటుంది.

స్నేహాలు[మార్చు]

ధర్మరాజు" పితామహా ! ఒకరిని ఒకరు చూడడం వలన కాని ఒకరితో ఒకరు కలిసి జీవించడం వలన కాని కలిగే స్నేహాలు ఎలా ఉంటాయి ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు చ్యవన నహుష సంభాషణ వినిపిస్తాను శ్రద్ధగా విను. భృగు వంశంలో జన్మించిన వాడు చ్యవనుడు. అతడు గొప్ప తపోధనుడు. అతడు గంగా యమునా సంగమస్థానంలో నీటిలో మునిగి సమాధిస్థితిలో ఉన్నాడు. అప్పుడు అతడిని చేపలు చుట్టుముట్టి అతడిని తాకుతూ తిరుగుతున్నాయి. ఆ చేపల స్పర్శకు ఆనందిస్తూ చ్యననుడు 12 సంవత్సరాలు గడిపాడు. ఒక రోజు చేపలు పట్టే జాలరులు ఆ ప్రాంతానికి వచ్చి చేపలకొరకు వేసిన వలలో చేపతో చ్యవనుడు కూడా చిక్కుకున్నాడు. అతడిని చూసి భయపడిన జాలరులు భయపడి " మునీంద్రా మీరు నీటిలో ఉన్న విషయము మాకు తెలియదు కనుక మా తప్పు కాచి మమ్ము రక్షించండి " అని వేడుకున్నారు. అందుకు చ్యవనుడు " ఇందులో మీ తప్పు ఏమీ లేదు. నేను నీటి అడుగున ఈ చేపలతో సహజీవనము చేస్తున్నాను కనుక వీటితో నేను మరణించాలని అనుకుంటున్నాను. కనుక మీరు నన్ను కూడా వీటితో పాటు వెలకు అమ్మండి " అని అన్నాడు. ఆ మాటలకు జాలరులు మరింత భయపడి ఆ దేశమును ఏలే రాజు నహుషుడి వద్దకు వెళ్ళి జరిగినది వివరించారు. రాజు నహుషుడు పురోహితులతో వచ్చి చ్యవనుడికి సాష్టాంగ నమస్కారం చేసి " మహానుభావా ! ఈ జాలరులు చేసిన తప్పుకు తగిన పరిష్కారం తెలియచేయండి " అని అడిగాడు. అందుకు చ్యవనుడు " ఈ జాలరులు వారి వృత్తి ధర్మంగా చేపలు పడుతున్నారు. కనుక అది వారి తప్పు కాదు. వీరు చాలా కష్టించి చేపలను, నన్ను పట్టారు కనుక వారి కష్టానికి తగిన ప్రతి ఫలము ఇచ్చి పంపండి " అని అన్నాడు. నహుషుడు ముని కోపించనందుకు సంతోషించి మంత్రులను పిలిచి ఆ జాలరులకు వేయి మాడలు ఇచ్చి పంపమన్నాడు. ఆ మాటలకు చ్యవనుడు " నా ఖరీదు వేయి మాడలా " అన్నాడు. నహుషుడు " అలాగైతే " లక్ష మాడలు ఇవ్వండి " అన్నాడు. చ్యవనుడు " నా విలువ లక్షమాడలా " అన్నాడు. నహుషుడు " కోటి మాడలు ఇచ్చి పంపండి " అని అన్నాడు. చ్యవనుడు " నా ఖరీదు కోటిమాడలా " అని అడిగాడు. నహుషుడు పంతానికి పోయి " అర్ధరాజ్యం ఇస్తాను " అన్నాడు. చ్యవనుడు " అలా కాదులే మహారాజా ! మరొక మాట చెప్పు " అని అన్నాడు. నహుషుడు " నా పూర్తి రాజ్యము ఇస్తాను " అన్నాడు. చ్యవనుడు " మహారాజా ! మంత్రులతో ఆలోచించి తగిన వెల నిర్ణయించు " అన్నాడు.

అవిజాతుని సలహా[మార్చు]

నహుషుడు " మంత్రులతో ఉన్న రాజ్యం అంతా ఇస్తానన్నాను కదా ! ఇంతకంటే నావద్ద ఇవ్వడానికి ఏముంది " అని దుఃఖించాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అవిజాతుడు అనే ముని జరుగుతున్న విషయము విని " మహారాజా ! చింతించకండి. ఇప్పుడే మునికి తగిన వెల నిర్ణయిస్తాను " అన్నాడు. నహుషుడు " మునీంద్రా ! అదేదో చెప్పి పుణ్యం కట్టుకుని నన్ను రక్షించండి " అని వేడుకున్నాడు నహుషుడు మంత్రులతో. అవిజాతుడు " మహారాజా ! గోవు బ్రాహ్మణుడు బ్రహ్మదేవుడు రెండు జాతులుగా పుట్టించినా ఒక జాతికి చెందిన వారే. గోవు క్షీరము వలన పాలు, పెరుగు, నెయ్యి వంటి యాగసంభారాలు సమకూడుతాయి. ఆ యాగము చేయతగిన వాడు బ్రాహ్మణుడు. కనుక వీరిరువురు సమానులే. సకల వేదాంగ విదుడైన బ్రాహ్మణుడికి విలువ నిర్ణయించడం ఈశ్వరుడికి కూడా శక్యము కాదు. సకలదేవతా స్వరూపమైన గోవు కూడా అంతే కనుక బ్రాహ్మణుడికి సమానంగా గోవును దానంగా ఇచ్చి చ్యవనుడిని విడిపించండి " అని అన్నాడు. ఆ మాటలకు సంతోషించి నహుషుడు " మహానుభావా ! నన్ను కరుణించండి . మీకు వెల నిర్ణయించ కలిగిన శక్తి నాకు ఉందా ! కనుక తమకు బదులుగా గోవును దానము ఇస్తాను " అని అన్నాడు. చ్యవనుడు నవ్వి " నీ నిర్ణయానికి సంతోషించాను. నహుషమహారాజా ! గోవు అంటే అగ్ని, గోవు అంటే అమృతము, యజ్ఞములో గోవు అత్యంత పవిత్రమైన స్థానాన్ని అలంకరిస్తుంది. స్వర్గలోక సమానము దేవతలకు కూడా పూజనీయము. కనుక నాకు బదులుగా గోవును ఇవ్వండి " అన్నాడు. వెంటనే నహుషుడు గోవును తెప్పించి జాలరులకు ఇచ్చాడు. జాలరులు గోవును చ్యవనుడికి సమర్పించారు. చ్యవనుడు " జాలరులారా మీకు చేపలకు స్వర్గ ప్రాప్తి కలిగిస్తాను " అని వరం ప్రసాదించాడు. తరువాత చ్యవనుడు, అవిజాతుడు నహుషుడికి వరం ఇవ్వడానికి సంకల్పించి నహుషుడికి సతతము ధర్మపరత్వము, ఇంద్రుడితో సమానమైన సంపదలు ప్రసాదించారు. తరువాత నహుషుడు రాజధానికి వెళ్ళాడు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

పరశురాముడు విశ్వామిత్రుడు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ఉత్తమమైన బ్రాహ్మణ వంశములో పుట్టిన పరశురాముడు క్షత్రియ లక్షణములు కలిగి ఉండడం, క్షత్రియ వంశంలో కౌశికపుత్రుడిగా పుట్టిన విశ్వామిత్రుడికి బ్రాహ్మణలక్షణాలు అలవడడం చిత్రవిచిత్రంగా ఉంది. మీ వలన ఇది కొంత విన్నాను. పూర్తిగా వినాలన్న కుతూహలం కలుగుతుంది వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! చ్యవనుడు, కుశికుడు వీరి సంవాదము చెప్పి నీ సందేహం తీర్చగలను. చ్యవనుడు ఒక బ్రాహ్మణుడు. కుశికకులము వలన తమ వంశముకు ముప్పు రాగలదని తెలుసుకుని చ్యవనుడు కుశిక వంశానికి నాశనం కలిగించాలని అనుకున్నాడు. అతడు కుశికమహారాజు వద్దకు వెళ్ళాడు. కుశిక మహారాజు చ్యవనుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించి " మహారాజా ! నేను ఒకవ్రతము చేయ సంకల్పించాడు. నీవు నీ భార్య నాకు సేవ చెయ్యాలని నా కోరిక " అని అన్నాడు. అందుకు కుశికుడు సంతోషముగా ఒప్పుకున్నాడు. ఆ రాజు చ్యవనుడికి ఒక నివాసము ఏర్పాటు చేసి అతడికి స్నానాది వసతులు కలిగించి " మునీంద్రా ! ఇక్కడ మీకు సకల సంపదలు ఉన్నాయి. మేము మీకు ఏమి సేవలు చెయ్యాలో చెప్పండి " అని అడిగాడు. చ్యవనుడు " మహారాజా ! నేను భోజనం చేసి నిద్రపోతాను నీవు నీ భార్య నా కాళ్ళు పట్టండి. నేను లేచే వరకు నన్ను నిద్ర లేపద్దు " అన్నాడు రాజదంపతులు అందుకు అంగీకరించారు. ముని నిద్రకు ఉపక్రమించగానే రాజదంపతులు కాళ్ళు పట్టసాగారు. చ్యవనుడు కదలిక లేకుండా అలా నిద్రపోతూనే ఉన్నాడు. రాజదంపతులు నిద్రాహారాలు మాని కాళ్ళు పట్టసాగారు. ఇలా ఇరవై ఒక్క రోజులు నిద్ర పోయి ఇరవై రెండవ రోజు నిద్ర లేచి ఎవరికీ చెప్పకుండా ఆస్థలము విడిచి పోయాడు.

కుటీరములో చ్యవనుడు[మార్చు]

రాజురాణి అతడిని వెంబడించారు. చ్యవనుడు నగరం దాటిన తరువాత అంతర్ధానం అయ్యాడు. అది చూసి రాజు రాణి మూర్ఛ పోయి తరువాత తేరుకుని " అయ్యో ఆ ముని చెప్పకుండా పోయాడే " అని చింతిస్తూ రాజధానికి పోవాలని తిరిగి పోతూ కుటీరానికి వెళ్ళి చూసారు. ఆశ్చర్యంగా అక్కడ నిద్రపోతున్న మునిని చూసి ఆనందించి తిరిగి కాళ్ళు పట్ట సాగాడు. తిరిగి నిద్రకు ఉపక్రమించిన చ్యవనుడు 21 రోజులు నిద్ర పోయి 22 వ రోజు నిద్ర లేచి " నాకు స్నానము చెయ్యాలని ఉంది " అని అన్నాడు. రాజదంపతులు మునిని కూర్చో పెట్టి సువాసనలు గుభాళించే నూనెతో మర్ధన చేసారు. కాని ఆ ముని వారిని తిట్టి అక్కడ నుండి వెళ్ళి పోయి కొంతసేపటి తిరిగి వచ్చాడు. రాజు రాణి కోపించక అతడికి తలకు పోసి దివ్యమైన భోజనము పెట్టారు. ఆ పదార్ధములను చూసి ముని తిరిగి అక్కడ నుండి వెళ్ళాడు. రాజ దంపతులు ఆ ముని భోజనం చేయనందుకు బాధపడ్డారు. ముని మరునాడు తిరిగి వచ్చి " రాజా నీవు రధము సిద్ధము చేసి గుర్రాలకు బదులుగా మీరు రధము లాగుతూ ఉండండి నేను రధములో కూర్చుని రత్నములు, బంగారము, గోవులు, గుర్రములు యాచకులకు దానం ఇస్తాను " అన్నాడు. రాజు మారు పలుకక ముని కోరిన విధంగా అంగీకరించాడు. ముని కోరిన విధముగా రత్నములు, బంగారము, గోవులు తెప్పించి రథమును సిద్ధం చేసి దాని మీద మునిని కూర్చుండ చేసి గుర్రములకు బదులుగా రథమును లాగసాగారు. ముని చర్నాకోలు తీసుకుని వారిని గుర్రములు మాదిరి కొడుతూ యాచకులకు రత్నములు, బంగారము, గోవులను ఇవ్వసాగాడు. అలా రాజదంపతులు చర్నాకోలుతూ దెబ్బలు తింటూ నిద్రాహారాలు లేక ఎన్నో దినాలు రథము లాగసాగారు. ఇది చూసిన ప్రజలు తమలో " ఈయన కూడా ఒక తపస్వియా ! ఇది కూడా తపో మహిమేనా ! ఈ రాజదంపతులు ఈ హింసను ఎలా సహిస్తున్నారో ! ఇది అన్యాయము. అనుకుంటూ రధము వెంట వెళ్ళసాగారు. చ్యవనుడు కూడా వారి ముఖములో విసుగు కాని కోపము కాని చూడ లేదు. అతడు వారి సహనముకు ఆశ్చర్యపడుతూ నగరం వెలుపలి వరకు రధములో వెళ్ళాడు. తరువాత రధము దిగి రాజదంపతులకు కట్టిన పగ్గాలు తీసి వారిని విడిపించి వారి శరీరములను ప్రేమతో నిమిరాడు. ఆశ్చర్యంగా వారి శరీరానికి తగిలిన గాయాలు మాని వారు స్వస్థులు అయ్యారు. ముని వారిని చూసి " రాజా ! మీరు అలసి పోయారు. నేను మీకు వరాలు ఇస్తాను. మీరిక రాచనగరుకు వెళ్ళండి. నేను గంగాతీరానికి వెళ్ళి నా వ్రతమును పూర్తి చేస్తాను. మీరు రేపు నా వద్దకు రండి " అని అన్నాడు. వారు " మహాత్మా ! మాకు అలుపు ఆయాసము లేవు . మీ స్పర్శతో మాగాయాలు మాని మాకు నూతనోత్సాహము వచ్చింది. ఇదంతా మీ మహిమే స్వామీ " అన్నారు. రాచదంపతులు తమ నగరుకు తిరిగి వెళ్ళారు.

గంగాతీరములో చ్యవనుడు[మార్చు]

మరునాడు ఉదయము గంగా తీరానికి వెళ్ళిన రాజదంపతులు అక్కడ ఒక దివ్య భవనం చూసారు. వారు ఆశ్చర్యముతో భవనములో అడుగు పెట్టి లోపల ఒక పక్క వేదాధ్యయనము, ఒక పక్క సంగీత నృత్య వినోదములు, మరొక పక్క కోకిలలు లాంటి సుందర పక్షులకు ఆలవాలమైన తోటలు, మరొక పక్క తామరలు హంసలు కలిగిన మడుగులు, మరొక పక్క విహరించడానికి అనువైన చిన్న కొండలు దాని మీద విహరిస్తున్న దేవతలు ఉండడము చూసి తాము స్వర్గ లోకములో ఉన్న అనుభూతిని పొందారు. అక్కడ ఒక చోట శయ్య మీద పడుకుని ఉన్న చ్యవనుడిని చూసారు. వెంటనే చ్యవనుడు ఆ దివ్యభవనము కూడా మాయము అయి గంగాతీరము అడవి కనిపించాయి. అక్కడ చ్యవనుడు తపసు చేసుకుంటూ కనపడ్డాడు. రాజురాణితో " దేవీ ! చూసావా యోగబలము అంటే ఇదే. మానవులకు రాజ్యము సంపాదించడం సులభము . కాని సుబ్రాహ్మణత్వము, తపస్సు చాలా కష్టము. ఈ మహాముని తపోశక్తి వలన ఎన్ని సృష్టించాడో చూడు " అని అన్నాడు. ఇంతలో ముని కళ్ళు తెరిచి వారిని తన దగ్గరకు పిలిచాడు. రాజదంపతులు మునికి నమస్కరిస్తూ దగ్గరకు వెళ్ళారు. ఆ ముని వారిని దీవించి " రాజా ! నీవు నీ భార్య ఇంద్రియములను చక్కగా వశవర్తులును చేసుకున్నారు. మీకు ఇన్ని కష్టాలు కల్పించినా మీకు కోపము రాలేదు. నేను మిక్కిలి ఆనందించాను. మీరు కోరిన వరములు ఇస్తాను కోరుకోండి " అని అన్నాడు.

కుశికుని కోరిక[మార్చు]

రాజు " మహానుభావా ! నిన్ను సేవించడం కంటే వేరు వరము ఎందుకు. మీరు మా ఇంటికి వచ్చి నివసించిన రోజులు ఉన్న కాలంలో అనేక అద్భుతాలు జరిగాయి అందుకు కారణం తెలుకోవాలని అనుకుంటాను " అని అడిగాడు. చ్యవనుడు " రాజా ! ఒక సారి బ్రహ్మదేవుడు దేవతలు మునులు ఉన్న సభలో ఇలా అన్నాడు " భృగువంశము కుశికవంశము వాటి లక్షణాలైన బ్రాహ్మణము, క్షాత్రము మారిపోయి వర్ణసంకరం జరుగుతుంది " అని చెప్పడం నేను విన్నాను. భృగువంశానికి వర్ణసంకరం జరగడం సహించలేక నేను కుశికవంశమును నాశనం చేద్దామని మీ వద్దకు వ్రతము నెపముతో వచ్చాను. నేను మిమ్ము పెట్టే కష్టాలు సహించ లేక మీరు నన్ను నిందిస్తారని నేను మిమ్ము శపించ వచ్చని అనుకున్నాను. కాని మీరు చూపించిన సహనానికి నేను ఆనందించి మీకు వరాలు ఇస్తాను అన్నాను. మీరు వద్దన్నారు. మీకు స్వర్గం ఎలా ఉంటుందో చూపాను. రాజా ! నీకు క్షాత్రము కంటే బ్రాహ్మణము మీద మక్కువ ఎక్కువ. నీకు మూడో తరంలో ఒక బ్రహ్మతేజోదీప్తుడు జన్మిస్తాడు. ఇక నీకు కావలసిన వరము కోరుకో " అన్నాడు. కుశికుడు " మహాత్మా ! ఇంతకంటే కావలసిన వరము ఏమిటి ? నా సంతానముకు ధర్మతత్పరత, బ్రాహ్మణత్వము కలిగేలా చూచి అనుగ్రహించు " అని వేడుకున్నాడు. చ్యవనుడు " రాజా ! నీ కోరిక నెరవేరుతుంది. నీ మనుమడు త్రిలోక పూజితుడు ఔతాడు " అని అన్నాడు.

కుశికుడి సందేహం[మార్చు]

కుశికుడు చ్యవనుడి ముందు ఒక సందేహం వెలిబుచ్చాడు. " మునీంద్రా ! నా మనుమడు ఏ ప్రకారంగా బ్రాహ్మణత్వం పొందుతాడో చెప్పండి " అని అడిగాడు. చ్యవనుడు " రాజా ! నా వంశంలో రుచీకుడు అనే వాడు జన్మిస్తాడు. అతడు నీ కుమారుడు గాధి కుమార్తెను వివాహం చేసుకుంటాడు. ఆ రుచీకుడికి జమదగ్ని అనే కుమారుడు జన్మిస్తాడు. ఆ జమదగ్ని ధనుర్వేదమును కూలంకుశంగా అభ్యసిస్తాడు. జమదగ్ని కుమాడైన రాముడు తండ్రి నుండి ధనుర్వేదమును అభ్యసిస్తాడు. ఆ ధనుర్విద్య సమస్త రాజలోకమును నాశనం చేస్తుంది. ఇది విధివిలాసం. విధివిలాసం వలననే గాధి భార్య, ఋచీకుడి భార్య అనాలోచితంగా చేసిన పనివలన సద్బ్రాహ్మణుడైన ఋచీకుడికి మనుమడిగా క్షాత్ర ధర్మావలంబికుడైన పరశురాముడు జన్మిస్తాడు. క్షత్రియుడైన కుశికుడికి మనుమడుగా బ్రాహ్మణత్వము అవలంబించిన విశ్వామిత్రుడు జన్మిస్తాడు. ఈ వర్ణసంకరము జనుల చేత శ్లాఘించబడి కీర్తిదాయకమౌతుంది. ఇలా బ్రహ్మవాక్కు ఫలించి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇక నేను తీర్ధయాత్రకు వెడతాను. మీరు సుఖంగా ఉండండి " అని పలికి చ్యవనుడు వెళ్ళి పోయాడు. ధర్మనందనా ! ఇది విశ్వామిత్ర పరశురాముల వృత్తాంతము " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

దానము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! నాకు దానము దాని మహిమ గురించి వివరించండి " అనీడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మంచి పాలిచ్చే పాడి ఆవును ఒక సందబ్రాహ్మణుడికి దానంగా ఇస్తే ఆ ఆవుకు ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తారు. అతడికి అటు ఏడుతరాలు ఇటు ఏడు తరాలు సద్గతులు పొందుతారు. గోదానము కాక ఇతరదానములు కూడా చెయ్య వచ్చు. కన్యాదానము, భూదానము, గృహదానము, కనకదానము, అన్న దానము, జలదానము, వస్త్రదానము, శయ్యాదానము, ఆసనదానము, వాహనదానము మొదలైనవి సద్బ్రాహ్మణులకు దానంగా ఇస్తే ఇహ లోకములోను, పర లోకములోను సుఖములు అనుభవిస్తాడు. కాని ధర్మనందనా ఎవరైతే దానము కొరకు తన వద్దకు వచ్చిన వానికి అతని మనోరధము ఎరిగి అతడికి కావలసినది దానంగా ఇస్తే అది అత్యుత్తమదానము ఔతుంది. భయంతో ఉన్న వాడికి అభయం ఇవ్వడం అన్నింటికంటే శ్రేష్టమైనది. యుద్ధములో ప్రాణములు దానంగా ఇవ్వడం ఉత్తమోత్తమం. శత్రువు ఎటువంటి వాడైనా అతడు శరణు కోరినప్పుడు ప్రసన్నమైన మనసుతో అతడి కోరిక తీర్చిన వాడు పురుషోత్తముడు అని అంటారు. భార్యా బిడ్డలను పోషించ లేక బాధపడుతున్న వాడికి సాయంచెయ్యడం అతడి దుఃఖాన్ని పోగొట్టడం అత్యంత గొప్పగుణం. తన భార్యను తప్ప అన్యకాంతలను యజ్ఞయాగములు చెయ్యడంలో ఆసక్తి కల వారు, అటువంటి సద్బ్రాహ్మణులను వెతికి వారికి దానం చెసిన వాడు మూడు లోకములలో పూజనీయుడు " అని భీష్ముడు చెప్పాడు.

ఉత్తమ దానము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! దానము కొరకు తన వద్దకు వచ్చి వానికి దానము చెయ్యడం మంచిదా! లేక తనను ఏదానము కోరక పోయినా అతడి మనసు తెలుసుకుని దానము చెయ్యడం మంచిదా ! భీష్ముడు " ధర్మనందనా ! అడిగిన వాడికి అందరూ సహజముగా దానము చేస్తారు. కాని అడుగ కుండా ఎదుటి వాని మనసెరిగి దానం చెయ్యడమే ఉత్తమం. సత్పురుషుడికి దానం ఇవ్వడం మరణం వంటిది. దానం కావాలా అని అడగబడడం అంతకంటే పెద్ద చావు వంటిది. కనుక అడగని వాడి మనసెరిగి దానము చెయ్యడం వలన తనను తాను రక్షించుకుని దానం పుచ్చుకున్న వాడిని రక్షిస్తాడు " అని భీష్ముడు చెప్పాడు.

దానము ఫలితము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! దానము యజ్ఞము వంటిది. దానం చెయ్యడంలో అనేక ధర్మవిధులు ఉన్నాయి. కాని ఆ దానములలో అధిక ఫలము ఇచ్చే దానము ఏదో చెప్పండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ధనము, ధాన్యము, గోవులు, మణులు, భూమి, జలము, అన్నము మొదలైనవి వినయ పూర్వకంగా బ్రాహ్మణులకు దానం ఇస్తే మంచి యజ్ఞములు చేసిన ఫలము దక్కుతుంది. కనుక ధర్మనందనా ! నీవు కూడా ఎల్లప్పుడు దాన ధర్మములు చేస్తుండు.

భూదానము[మార్చు]

దానములలో ఉత్తమమైనది భూదానము. మనకు అవసరమైన వస్త్రములు, ధాన్యము, రత్నములు మనకు భూముల నుండి లభిస్తుంది. బంగారము, వెండి, వస్త్రములు, ధాన్యము, వివిధములైన రత్నములను ఇస్తున్న భూమిని దానం ఇస్తే దానం ఇచ్చిన వాడు ఉత్తమఫలములు పొందుతాడు. దానము చేసిన వాడు భూమి ఉన్నంతకాలము స్వర్గములో ఉంటాడు. భూమిని కొంచంగా దానము చేసినా అతడు మరుజన్మలో రాజ్యములు పాలిస్తాడు. యుద్ధములో వీరమరణం పొందిన క్షత్రియుడికి భూదానం చేసినఫలితం లభిస్తుంది. భూదానము బ్రహ్మహత్యా పాతకమును హరిస్తుంది. పాపాత్ముడు భూమిని దానంచేసినా భూమికి ఆ పాపం అంటదు. భూదానము అశ్వమేధయాగము చేసిన ఫలము ఇస్తుంది. దారిద్యముతో బాధపడుతూ ఎవరిని యాచించకుండా జీవించే బ్రాహ్మణుడికి దానము చేసిన భూదాన ఫలితము అంత అని చెప్పనలవి కాదు. యాగం చేసినప్పుడు శాంత చిత్తులైన బ్రాహ్మణులకు భూదానము చెయ్యడం అత్యంత ముఖ్యము. అర్హుడైన బ్రాహ్మణుడికి గోవుచర్మము మేర భూమిని దానము చేసినా అది దానము ఇచ్చిన వాడి సకల పాపములను హరిస్తుంది. యుద్ధములో మరణించి వీరస్వర్గము పొందిన వారు, సతతము గురువులను పూజించు వారు, అనేక పుణ్యకార్యములు చేసిన వారు ఎవరూ భూదానము చేసిన వారికి సరితూగ లేరు. భూదేవి సహితము కోరి భూగీతను ప్రజకు అందించింది. ఆ గీతను అనుసరించి పరశురాముడు భూదానము చేసాడు.

భూగీత[మార్చు]

భూనదానము గురించి భూదేవి స్వయంగా ఇలా అన్నది . ఇహ లోకము లోను పరలోకములోను సుఖము కావాలని కోరుకునే వారు నన్ను దానము చెయ్యండి. భూదానముకు సరి అయిన దానము మరొకటి లేదు. సంతోషముగా నన్ను దానము చేస్తే నాకు సంతోషము కలుగుతుంది. అలాకాక దుష్ట చింతనతో ఆ భూధానముకు అడ్డు తగులుతే నాకు బాధ కలుగుతుంది. ఎటువంటి దుర్మార్గుడైనా సహృదయముతో భూదానము చేసిన అతడికి నేను ఇహలోకములో మేలు చేస్తాను. ధర్మనందనా ! భూదాన విషయములో బృహస్పతి ఇంద్రుడికి చెప్పిన మాటలు విను. " దేవేంద్రా ! భూమిని రత్నగర్భ అంటారు. కనుక భూదానము చేసిన వాడికి హయములు, ఏనుగులు, రత్నములను, కన్యలను దానము చేసిన ఫలితం కలుగుతుంది. భూమి నుండి బంగారము లభిస్తుంది కనుక ఆ భూమిని దానము చేసిన వాడిని చూసి భూతములు తృప్తి చెందుతాయి. రాజులు తమ పరిపాలనా విధినిర్వహణలో తెలిసో తెలియకో అనేక పాపములు చేస్తుంటారు. ఆ పాప పరిహారానికి భూదానము ఉత్తమమైన మార్గము. ఎవరైతో తాముదానంగా ఇచ్చిన భూమిని తిరిగి తీసుకుంటారో వారు నరకానికి పోక తప్పదు. భూమిని దానము చేస్తానని దానము ఇవ్వకున్న మహా పాపము వస్తుంది. అలాగే అడుగక ముందు దానము చేసిన వాడికి పుణ్యము వస్తుంది " అని బృహస్పతి చెప్పాడు.

దానముగా ఇవ్వతగినవి[మార్చు]

ధర్మరాజు " పితామహా ! దానపరుడైన మానవుడికి ఇవ్వతగిన వస్తువులను తెలియచెయ్యండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! అన్నము, బంగారము, జలము, ప్రముఖంగా దానము చెయ్యడానికి అర్హమైనవి. వీటిలో అన్నదానము ప్రముఖమైనది. మునులు దేవతలు కూడా అన్న దానము గురించి ప్రస్థుతి చేస్తుంటారు. యజ్ఞయాగములలో కూడా అన్నముకు విశిష్ఠస్థానం ఉంది. కనుక అన్నదానముకు మించిన దానము వేరొకటి లేదు. కనుక అన్ని పుణ్యకార్యములలో అన్న దానము తప్పక చెయ్యాలి. అన్నము ప్రాణాధారము కనుక మనకు, మన వాళ్ళకు లేక పోయినా అన్నమును అతిధులకు దానము చేసిన వారికి అధికమైన పుణ్యము వస్తుంది. బాగా అలసిపోయిన వాడు, తపస్వి, బాలుడు, వికలాంగుడు, స్త్రీ వీరు ఆకలితో అన్నము పెట్టమని అడిగిన గృహస్థు కోపగించక వారికి అన్నము పెట్టి ఆకలి తీర్చాలి. ఆకలితో ఉన్న కుక్కకు కాని, కడజాతి వాడికి కాని అన్నము పెట్టిన వాడికి ఎంతో పుణ్యము లభిస్తుంది. మునులకు, పితరులకు, దేవతలకు అన్నదాన విధులు నిర్వహించిన అది కర్మలన్నింటిలో శ్రేష్ఠము. అన్నదానము చెయ్యడానికి కులము, విద్య, వృత్తి అడ్డు రాకూడదు. అడగగానే బ్రాహ్మణులకు అన్న దానము చెయ్యాలి. ధర్మనందనా ! బ్రాహ్మణులకే కాదు అన్ని జాతుల వారికి కులముల వారికి అన్న దానము చేసిన నీకు సకల శుభములు చేకూరగలవు " అని భీష్ముడు చెప్పాడు.

నక్షత్రములు దానము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! నాకు నక్షత్రసంబంధిత దానముల గురించి తెలియచెయ్యండి " అని అడిగాడు. భీష్ముడుమునుములు, చంద్రుడి నక్షత్రములో అన్నము, ఆరుద్ర నక్షత్రములో గోవును, అదితి నక్షత్రములో తీపిపులగము, బృహస్పతి నక్షత్రములో బంగారము, ఆశ్లేషా నక్షత్రములో ధనము, మఖానక్షత్రములో ఉప్పు, నువ్వులు దానము చేయుట శ్రేష్టం. భగుడు అధిదేవతగా ఉన్న తార నక్షత్రములో చెరుకురసము, ఉత్తరఫల్గుణీ నక్షత్రములో పాలతో వండిన పౌష్టికాన్నము, సూర్య తారలో ఏనుగులు, రథములు. చిత్తా నక్షత్రములో శ్రీగంధపు చెక్క, స్వాతీ నక్షత్రములో తనకు ప్రీతికరమైనది దానము చేయ వలెను. విశాఖనక్షత్రములో ఎద్దు, అనూరాధ నక్షత్రములో పైపంచలు, జ్యేష్టా నక్షత్రంలో ముల్లంగి, కరివేపాకు, మూలానక్షత్రములో మంచి ఫలములు, పూర్వాషాఢలో పెరుగు, ఉత్తరాషాఢలో తేనెతో వండిన అన్నము, విష్ణువు, వసువులు, నీరు అధిదేవతలుగా కలిగిన నక్షత్రములలో దుప్పట్లు, వాహనములు, యవలు దానముగా ఇవ్వ వలెను. పూర్వాభద్ర, ఉత్తరాభద్రలో మాంసము, రేవతి నక్షత్రంలో కంచు పాత్రతో కూడిన గోవు, అశ్విని నక్షత్రంలో గుర్రపు బండి, భరణీ నక్షత్రములో నువ్వులు, ఆవులు దానము చెయ్యడం మంచిది. ఈ ప్రకారం దానము చేసిన మానవుడు ఊర్ధ్వ లోకాలకు పోగలడు.

ఇతర దానాలు[మార్చు]

ధర్మనందనా అన్ని దానములకు ప్రత్యామ్నాయం సువర్ణదానం. ఏదైనా వ్రతం చేసిన సమయంలో సువర్ణదానం చేసిన ఆయుష్షు పెరుగుతుంది, మనిషి పునీతుడౌతాడు, భావశుద్ధి కలుగుతుంది. అని పూర్వము హరిచంద్రుడు చెప్పాడు. దాహార్తికి మంచినీరు ఇవ్వడం అన్నింటి కంటే ఉత్తమ దానం అని మనువు చెప్పాడు. నీరుదానం చెయ్యడమంటే మరో అర్ధం ఉంది. చెరువులు, బావులు, కొలనులు నిర్మించడం నీటిదానమే. ఈ దానము చేసిన వారు పుణ్యలోకాలకు పోయారు. ఎవరు తవ్వించిన కొలను, చెరువులలో ఆవులు నీళ్ళు త్రాగుతాయో ఆ కులము మొత్తం సద్గతి పొందుతుంది. ఎవరు తవ్వించిన బావి, చెరువు, కొలనులో దాహార్తులు మంచి నీరు త్రాగి దాహం తీర్చుకుంటారో అతడికి పాపములు అంటవు. దానములలో తరువాతి స్థానం ఘృతము. నెయ్యిని యజ్ఞ యాగములందు ఉపయోగిస్తారు కనుక అగ్నిదేవుడు, యజ్ఞపురుషుడు ప్రీతి చెందుతారు. కుండలు బ్రాహ్మణులకు దానం చేస్తే అతడు ధనవంతుడౌతాడు. గొడుగులు దానంచేసిన పుత్రులను పొందుతాడు. వాహనములు దానంచేసిన సకల కోరికలు సిద్ధిస్తాయి. చెప్పులు దానం చేస్తే శత్రునాశనం ఔతుంది. నువ్వులు పితృదేవతలకు ఆహారంగా సృష్టించాడు బ్రహ్మ. నువ్వులు దానం చేసిన వాడికి పాపములు నశిస్తాయి. తిలదానం గొప్పది కనుక మునులు కూడా దీనిని స్వీకరిస్తారు. అటువంటి తిలాదానం చేసినవారు మునుల కంటే శ్రేష్టుడు ఔతాడు. పుణ్యకార్యాలలో, యజ్ఞయాగాలలో దానాలు చెయ్య వచ్చు. దానం ఎప్పుడైనా ఎక్కడైనా చెయ్య వచ్చు.

గోదానమహిమ[మార్చు]

ధర్మనందనా ! గోదానమహిమ గురించి వివరిస్తాను. గోవులు తపోధనుల కంటే గొప్పవి. గోవుల హోమమునకు కావలసిన పాలు, పెరుగు, నెయ్యి ఇస్తాయి. గోవుశరీరములో పనికిరానిది ఏమీ లేదు. దాని పేడ, మూత్రము, చర్మము అన్ని పవిత్రములే. పైగా గోవులు మనకు అన్ని పనులు చేసి పెడతాయి. వేదములు గోవులు, బ్రాహ్మణుడు ఒకటే అని చెప్తున్నాయి. కనుక గోదానము చేసిన వాడికి ముక్తి లభిస్తుంది. గోవులను బ్రాహ్మణులకు దానం చేసిన పాపం నశించి పుణ్యలోకాలకు చేరగలరు. ఆవు పాలు అమృతముతో సమానమని దేవేంద్రుడే చెప్పాడు కనుక ఆవు పాలు దానము చేసిన అమృతము దానము చేసిన దానితో సమానఫలము దక్కుతుంది. గోదానము చేసిన మన ప్రాణములు దానం చేసినట్లే. కాని గోవులను అర్హులకు మాత్రమే దానం చెయ్యాలి. క్రూరులకు, నాస్థికులకు, దుర్మార్గులకు దానం చేసిన వాడు దుఃఖముకు గురి ఔతారు. కనుక గోదానము ఇవ్వాలంటే అతడు అర్హుడే అని తెలుసుకుని దానం చెయ్యాలి. ధర్మనందనా ! రోగం వచ్చిన దానిని, బక్క చిక్కినది, చూలు కాని ఆవును దానం చెయ్యరాదు. మోక్షప్రాప్తికి గోదానం చేసిన మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఎన్ని గోవులను దానము చేసిన అంత ఫలితము ఉంటుంది.

మిగిలిన దానములు[మార్చు]

ధర్మనందనా ! తరువాతి స్థానము అన్న పానీయాలది. అందులో అన్నము చాలా గొప్పది. అన్నమును దేవ లోకములో అమృతమని, నాగకులములో, సుధ అని, పితృలోకములో స్వధ అని పిలుస్తారు. మహాత్ములు అన్నమును ప్రాణము అని కూడా పిలుస్తారు. కనుక అన్న దానము ప్రాణ దానముతో సమానము. అన్నము కంటే జలము గొప్పది. అన్నము వండడానికి కూడా జలము అవసరము కదా ! చంద్రుడు జలము నుండి పుట్టాడు కదా ! ఓ షధులంటికీ చంద్రుడు ఆధారము కనుక అన్నము కంటే జలము ఉత్తమము. మానవుడు తన వద్ద ఉన్న అన్నమును దేవతలకు నివేదించాలి, పితరులకు తర్పణము చేయాలి, అతిధులను సత్కరించాలి.

తిల దానము[మార్చు]

ధర్మనందనా ! తరువాత తిలదానము గొప్పది. దాని గురించి ఒకి ఇతిహాసము చెప్తాను విను. పూర్వము మధ్య దేశంలో పర్ణశాల అను ఊరు ఉంది. ఆ ఊరిలో శర్మ అను బ్రాహ్మణుడు నివసించే వాడు. ఆ శర్మను యముడు పిలిచి ఈ విధముగా ఉపదేశించాడు " దానములలో నువ్వుల దానము గొప్పది. ఎందు కంటే నువ్వులను పితరులు ఇష్టంగా తింటారు. నువ్వులు ఆహారంగా తీసుకుంటే పాపములు హరిస్తాయి. బుద్ధి పుణ్యకార్యముల వంక మరలుతుంది. కనుక నీవు ఎల్లప్పుడు నువ్వులను దానంగా ఇవ్వు. అలాగే వస్త్రదానము చేస్తే దేవతలు, దీపదానముకు పితరులు సంతోషిస్తారు " అని యముడు స్వయముగా చెప్పాడు కనుక తిలదానము చాలా గొప్పది. ఇక సంగ్రహంగా చెప్పాలంటే దానము చేయ తగ్గవి మూడు భూదానము, విద్యాదానము, గోదానము. ఇంతకు మించిన దానములు లేవు. గురువు శిష్యుడికి విద్యాదానము చేసిన భూదాన ఫలితము దక్కుతుంది. గోదానము కూడా భూదానముతో సమానమైనది. గోమయముతో దేవతా గృహములు, పితృ కార్యములు చేయు గృహములు అలికిన వాటికి పవిత్రత చేకూరు తుంది. జీవించి ఉన్నంత కాలము భోజనముకు ముందు ఆవుకు పిడికెడు గడ్డి పెట్టిన వాడికి బ్రాహ్మణుల కోరిక తీర్చిన ఫలము దక్కుతుంది.

గోదానము లోకము[మార్చు]

ధర్మనందనా ! దీనిలో ఒక ధర్మసూత్రం ఉంది. గోదానము మంచిబుద్ధితో చేసిన వాడికి మంచి ఫలితము కులుగుతుంది. చెడుబుద్ధితో చేసిన చెడుఫలితము కలుగుతుంది. ఈ సందర్భంలో ఒకకథ చెప్తాను. ద్వారావతి నగరంలో ఒక బావిలో ఒక పెద్దతొండ నివసిస్తూ ఉంది. ఒక రోజు అది మనుష్యుల కంట పడింది. దానిని బావిలో ఉండనిస్తే నీరు పాడౌతుందని ఆ ఊరి జనులు దానిని పెద్ద తాళ్ళతో బయటకు తీయడానికి ప్రయత్నించారు కాని వారు ఎంతటి ప్రయత్నము చేసినా దానిని బయటకు తీయలేక పోయారు. వారంతా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి ఈ విషయము చెప్పారు. శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చి ఆ తొండను బయటకు తీసాడు. శ్రీకృష్ణుడిని చూసి తాను నృగు మహారాజునని తెలిపింది. శ్రీకృష్ణుడు దానిని గుర్తుపట్టి " అయ్యా ! అనేక గోవులను దానము చేసిన నీకు ఈ గతి ఎలా పట్టింది " అని అడిగాడు. తొండ " ఏమని చెప్పుదును కృష్ణా ! నేను ఒకరోజు ఒక బ్రాహ్మణుడికి ఒక గోవును దానంగా ఇచ్చాను. ఆ బ్రాహ్మణుడు దానిని మేతకని బయటకు తోలిన సమయంలో ఆ గోవు మా గోవులతో కలిసి అలవాటు ప్రకారం మా మందలో చేరి మా ఇంటికి వచ్చింది. అది గోపాలాకులు గమనించ లేదు . మరు నాడు నేను దానమివ్వడానికి గోవులను తెమ్మని గోపాలకులకు చెప్పగా వారు మిగిన గోవులతో నేను దానం ఇచ్చిన గోవును కూడా తీసుకు వచ్చారు. ఆ విషయము తెలియక నేను ఆగోవును దానంగా ఇచ్చాను. ఆ గోవును దానంగా పొందిన బ్రాహ్మణుడు గోవును తోలుకుని పోతుడగా అంతకు ముందు ఆ గోవును దానంగా పొందిన బ్రాహ్మణుడు తన గోవును వెతుకుతూ ఆ గోవును చూసాడు.

గోవు కొరకు బ్రాహ్మణులు వాదించుకొనుట[మార్చు]

అతడు ఆ గోవును చూసి " ఈ గోవును నాకు రాజుగారు దానంగా ఇచ్చారు " అని అన్నాడు. రెండవ బ్రాహ్మణుడు కూడా " ఇది రాజు నాకు దానంగా ఇచ్చిన గోవు " అన్నాడు. వారు కొంతసేపు వాదించుకుని చివరకు రాజు గారి వద్దకు గోవుతో సహా వెళ్ళాడు. నేను జరిగినది విచారించిన మీదట తెలుసుకున్నాను. ఒకసారి దానమిచ్చిన గోవును తిరిగి దానము ఇచ్చుట పొరపాటు అని తెలుసు కనుక పొరపాటును సరి దిద్దడానికి మొదటి బ్రాహ్మణుడికి ఆ గోవు బదులు లక్ష గోవులను ఇస్తానని చెప్పాను. అతడు " ఆ గోవు మా పాలిట మహా లక్ష్మి. అది నా కుమారుడికి అడిగినదే తడవుగా పాలను ఇస్తుంది కనుక నాకు ఆ గోవే కావాలి " అన్నాడు. నేను రెండవ బ్రాహ్మణుడితో ఆ గోవుకు బదులుగా మణులు బంగారం ఇస్తాను దానిని తిరిగి ఇవ్వమని అడిగాను. అతడు " మీ రాజ్యము మొత్తము ఇచ్చినా నాకు వద్దు. నాకు దానంగా ఇచ్చిన గోవే నాకు కావాలి " అన్నాడు. తరువాత నాకు మృత్య్వు సంభవించి నేను యమధర్మ రాజు వద్దకు వెళ్ళాను. యమధర్మరాజు ప్రేమతో " రాజా ! నీవు ఎన్నో దాన ధర్మాలు చేసావు. నీకు చాలా పుణ్యము వచ్చింది. కాని నీవు ఒక సారి దానంగా ఇచ్చిన గోవును తిరిగి దానం ఇచ్చావు. తెలక చేసినా అది పాపాము కనుక నీకు దుర్దశ సంభవించింది. కనుక నీవు ముందు దుర్గతి అనుభవిస్తావో సద్గతి అనుభవిస్తావో తేల్చుకో " అన్నాడు. నేను ముందుగా దుర్గతి అనుభవించడానికి అంగీకరించాను. వెంటనే పై నుండి కిందకు తల కిందులుగా భూమి మీద పడ్డాను. అలా పడడం ఒక ముని చూసి నన్ను చూసి జాలి పడి " నీవు తొండ జన్మ ఎత్తుతావు. కొంతకాలానికి నీకు శ్రీకృష్ణుడి చేతి స్పర్శ తగిలి నీ దుర్దశ తొలగి సద్గతి కలుగుతుంది " అని చెప్పాడు. ఇంతకాలానికి నాకు నీ చేతి స్పర్శ తగిలింది కనుక ఇక నేను దుర్దశ తొలగి సద్గతికి పోతాను " అన్నాడు. శ్రీకృష్ణుడు " విప్రుల సొమ్ము అపహరించడం రాజులకు మహా పాపము. తనకు తెలియకుండా నృగుడు విప్రుడి సొమ్ము అపహరించి ఇలాంటి దుర్గతిని పొందాడు " అని నృగుడితోను అక్కడ గుమి కూడిన ప్రజలతోను చెప్పాడు.

గోదానము ఫలము[మార్చు]

ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! నాకు గోదానము చేసినందు వలన కలిగే ఫలితము చెప్పండి " అని అడిగాడు. భీష్ముడు ధర్మనందనా " ఈ సందర్భంలో నీకు ఒక ఇతిహాసము చెప్తాను. ఔద్ధాలకుడు అనే ముని ఉండే వాడు అతడి కుమారుడు సచికేతుడు. ఒక రోజు ఔద్దాలకుడు సచికేతుడిని పిలిచి " కుమారా ! నేను ఇంటి వద్ద సమిధలు, కలశము, పువ్వులు మరచి వచ్చాను. నీవు పోయి తీసుకునిరా " అని చెప్పాడు. సచికేతుడు ఉత్సాహంగా తండ్రి చెప్పినవి తీసుకు రావడానికి వెళ్ళాడు. అతడు పోయి చూసే ఏరు పొంగి వస్తువులు ఏటిలో కొట్టుకు పోయాయి. వస్తువులు కనపడని సచికేతుడు తిరిగి వెళ్ళి తండ్రితో వస్తువులు కనపడ లేదని చెప్పాడు. అప్పటికే ఔద్దాలకుడు ఆకలితో ఉండడంతో కుమారుడి మీద ఆ మాటలకు కోపగించి " వస్తువులు కనపడక పోతే ఇక్కడకు ఎందుకు వచ్చావు. యముడి దగ్గరకు పో " అన్నాడు. తండ్రి కోపంతో అన్న మాటలకు కుమారుడు గడగడ లాడుతూ తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. కాని అప్పటికే అతడు యమపురిచేరుకున్నాడు. అది చూసి ఔద్దాలకుడు తల్లడిల్లి పోయి చేజేతులా కుమారుడిని చంపుకున్నానని ఏడవసాగాడు. ఇంతలో తెల్ల వారింది. తెల్లవారగానే సచికేతుడు కళ్ళు తెరవడం చూసి ఔద్దాలకుడు ఆనందించి " నాయనా ! పుణ్య లోకములకు వెళ్ళి నా కొరకు తిరిగి వచ్చావా ! " అని అంటూ కుమారుడిని గుండెలకు హత్తుకున్నాడు. సచికేతుడు " తండ్రీ ! నీవు నన్ను ఎముడి వద్దకు వెళ్ళమన్నావు కదా ! అలాగే నేను యముడి వద్దకు వెళ్ళాను. యముడు నన్ను దగ్గరకు పిలిచి ఉచితాసనము ఇచ్చి అర్గ్య పాద్యములు ఇచ్చాడు. నేను ఎముడిని " నేను ఎక్కడ ఉన్నాను " అని అడిగాను. యముడు " నాయనా ! నిన్ను మీ తండ్రి యమ లోకానికి పొమ్మని చెప్పినందు వలన నీవు యమ లోకము వచ్చావు. అంతే కాని నీకు ఆయుర్దాయము ఇంకా ఉంది. నీ తండ్రి నీ కొరకు దుఃఖిస్తున్నాడు వెళ్ళు " అన్నాడు. నేను " అలాగే వెడతాను. ఇక్కడ పుణ్య లోకాలు ఉంటాయట కదా ! నాకు వాట్ని ఒక్క సారి చూపించరా ! " అని అడిగాను. వెంటనే యముడు ఒక రథము తెప్పించి నన్ను ఎక్కించుకుని పుణ్య లోకాలకు తీసుకు వెళ్ళాడు. నేను నయనానంద కరంగా వాటిని చూస్తూ అక్కడ దివ్యాభరణాలు ధరించి తితుగుతున్న వారిని చూసి " మహాత్ములారా ! మీరెవరు ? ఏమి పుణ్యము చేసుకుని ఇలా అనుభవిస్తున్నారు ? " అనీడిగాను. వారు " కుమారా ! మేము చేసిన గోదాన ఫలము వలన ఈ భోగములు అనుభవిస్తున్నాము " అని చెప్పారు. తరువాత నేను యముడికి నమస్కరించి ఇక్కడకు వచ్చాను.

గోదానము లోకాలు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! గోదానము చేసిన వారు పొందు లోకమును గురించి వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! గోదానము చేసిన వారు పొందే లోకము పేరు గోలోకము. అక్కడ నిర్మల మనస్కులు, సత్యము పలుకు వారు, ఇంద్రియములని నిగ్రహించుకున్న వారు, మనో నిగ్రహము కలవారు, ఎల్లప్పుడు గురువులను పూజించు వారు కూడా ఉంటారు. గోలోకముకు మించిన పుణ్యలోకము మరొకటి లేదు. అక్కడ కాలము ఉండదు. అలసట, రోగములు, ఆకలి, దప్పిక ముసలితనము ఉండదు. అక్కడ ఉన్న వారు సదా ఆనందంలో మునిగి ఉంటారు. గోదానముకు మించిన దానము మరొకటి లేదు. కాని గోదానముకు వినియోగించే ధనము ధర్మముగా సంపాదించినది అయి ఉండాలి. ఇతరుల సొమ్ముతో దానము చెయ్యరాదు. కనుక ధర్మనందనా ! నీవు కూడా గోవులను అర్హులైన వారికి దానము చేసి పుణ్యలోకములు పొందుము " అని భీష్ముడు చెప్పాడు.