చంద్రుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిండు చంద్రుడు

చంద్రుడు , జాబిల్లి లేదా శశి (☾), భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం. చంద్రుడిని కథల్లోనూ, భావయుక్తంగాను చందమామ అని కూడా పిలుస్తారు. భూమి నుండి చంద్రునికి రమారమి 3,84,403 కిలోమీటర్ల దూరముంటుంది. సూర్యుని కాంతి చంద్రునిపై పడి ప్రతిఫలించి భూమికి చేరుతుంది. ఇంతదూరం నుండి కాంతి ప్రతిఫలించడానికి సుమారు 1.3 క్షణాలు పడుతుంది. చంద్రుని వ్యాసం 3476 కి.మీ. (2159 మైళ్ళు),[1] ఇది భూమి వ్యాసంలో పావువంతు కంటే కొంచెం ఎక్కువ. చంద్రుడు సౌరమండలములో ఐదో అతిపెద్ద ఉపగ్రహం. గ్యానిమీడ్, టైటన్, క్యాలిస్టో, ఐఓ అనే ఉపగ్రహాలు దీని కంటే పెద్దవి. సముద్రాలలో అలలు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లే ఏర్పడతాయి.

పుట్టుక[మార్చు]

చంద్రుడు ఎలా ఉద్భవించిందనే దానికి వివిధ పరికల్పన లున్నాయి. వాటిలో విస్తృతంగా ఆమోదం పొందినది, మహా ఘాత పరికల్పన. దీని ప్రకారం, భూమిని శుక్రగ్రహ పరిమాణంలో ఉన్న ఖగోళ వస్తువు ఢీకొనడంతో ఏర్పడిన శకలాల నుండి చంద్రుడు ఏర్పడింది. ఈ ఘటన సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట, సౌరవ్యవస్థ రూపుదిద్దుకున్న 2 - 10 కోట్ల సంవత్సరాల తరువాత జరిగింది. గుద్దుకున్న ఖగోళ వస్తువును థీయా అనే గ్రీకు పురాణాల్లోని దేవత పేరిట పిలుస్తున్నారు. చంద్రశిలలపై జరిపిన విశ్లేషణపై 2016 లో తయారు చేసిన నివేదిక, ఈ ఘాతంలో రెండు ఖగోళ వస్తువులు సూటిగా ఢీకొన్నాయని, తద్వారా రెండు వస్తువులూ ఒకదానిలో ఒకటి బాగా మిళితమై పోయాయనీ పేర్కొంది.

ఇది కాక, మరి కొన్ని ఇతర పరికల్పనలు కూడా ఉన్నాయి:

  • భూమి ద్రవరూపంలో ఉన్న కాలంలోనే, అపకేంద్ర బలం కారణంగా దాన్నుంచి కొంత భాగం విడిపోయి చంద్రుడు ఏర్పడింది.
  • చంద్రుడు వేరే చోట పుట్టింది. తరువాతి కాలంలో భూమి తన గురుత్వ శక్తితో లాక్కుంది.
  • భూమి చంద్రుడూ ఒక్కసారే, ఒకే ఎక్రీషన్[నోట్స్ 1] చక్రం నుండి పుట్టాయి.

అయితే పై పరికల్పనకు లభించిన ఆమోదం వీటికి లభించలేదు.

చంద్రుడి విశేషాలు[మార్చు]

  • చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి 29.5 భూమి యొక్క రోజులు పడుతుంది. అనగా చంద్రుడిపై ఒక్క రోజు, భూమిపై ఒక నెలకు సమానం.
  • చంద్రుడు భూమిని ఒక్కసారి చుట్టిరావడానికి 27.3 రోజులు పడుతుంది. భూమి-చంద్రుడు-సూర్యుడు మధ్య వ్యవస్థాపక మార్పుల వల్ల ఒక చంద్రమాసానికి 29.5 రోజులు పడుతుంది. దీనినే చంద్రమాసము అంటారు.
  • చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికీ భూమి చుట్టూ తిరగడానికీ ఒకే సమయం పడుతుంది. ఈ కారణం వల్ల భూ వాసులకు చంద్రుడి ఒకే ముఖం కనబడుతుంది. భూ వాసులు, చంద్రుడి ఆవలి వైపు ఎప్పటికీ కనబడదు. దీన్ని టైడల్ లాకింగు అంటారు.
  • చంద్ర మండలంపై వాతావరణం లేదు. అందుకే చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవుని పాద ముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయి.
  • చంద్రుడి సాంద్రత భూమి సాంద్రతలో 1/6 వ వంతు ఉంటుంది. అందువల్ల భూమిపై 60 కేజీల బరువు ఉండే మనిషి చంద్రునిపై 10 కేజీలు మాత్రమే ఉంటాడు.
  • చంద్రుడి గరిష్ఠ ఉష్ణోగ్రత 127 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత -173 డిగ్రీల సెల్సియస్.
  • 1959 సెప్టెంబర్ 14 రష్యా పంపిన లూనా-2 చంద్రుడి మీదకు మొట్టమొదట దిగింది.
  • చంద్రుడి పై ఇప్పటి దాకా నడిచిన వ్యోమగాములు 12 మంది.
  • ఇప్పటి దాకా 382 కిలోల చంద్ర శిలల్ని భూమి మీదకు తీసుకువచ్చారు వ్యోమగాములు.[2]
దస్త్రం:చంద్ర బింబము.JPG
చంద్ర బింబము

భౌతిక లక్షణాలు[మార్చు]

చంద్రుడి నిర్మాణం.

అంతర్ నిర్మాణం[మార్చు]

పురాణాలలో చంద్రుడు[మార్చు]

  • తారా శశాంకం: బృహస్పతి భార్య తార చంద్రుని అందానికి మోహించి పతిలేని సమయంలో చంద్రుని కూడెను. అందువలన గర్భవతి అయ్యెను. ఈమెను చంద్రుడు తీసుకొనిపోగా, బృహస్పతితో యుద్ధం జరిగెను. ఇంతలో తారకు బుధుడు జన్మించెను. తగవు తీర్చడానికి వచ్చిన బ్రహ్మ తారను అడిగి నిజం తెలుసుకొని బుధుని చంద్రునకు, తారను బృహస్పతికి ఇప్పించెను.
  • చంద్రుడు పరమశివుని తలపైన ఆభరణముగా భాసిస్తాడు. అందువల్లనే అతన్ని చంద్రమౌళి, చంద్రశేఖరుడు అనే పేర్లతో పిలుస్తారు.

చంద్రోదయం[మార్చు]

ప్రతిరోజు చంద్రుడు భూమికి తూర్పు వైపు నుంచి పడమర వైపుకు పయనిస్తూ ఉంటాడు. సూర్యకాంతితో పోల్చితే చంద్రకాంతి చాలా తక్కువ అందువలన మనకు ఎదురుగా ఉన్నప్పటికి ఎక్కువ సార్లు చంద్రుడు పగలు కనిపించడు. అందువలన చంద్రుడు స్పష్టంగా కనిపించే సూర్యాస్తమయం తరువాత భాగమునే చంద్రోదయముగా ఉపయోగిస్తున్నారు. అనగా సూర్యుడు అస్తమించిన తరువాత చంద్రుడు కనిపించడాన్నే చంద్రోదయంగా పేర్కొనవచ్చు. అందువలన ప్రతిరోజు చంద్రుడు తూర్పు వైపున పుట్టినప్పటికి (ఉదయించినప్పటికి) దిక్కులతో సంబంధం లేకుండా సూర్య అస్తమయం తరువాత చంద్రుడు ఏ వైపున కనిపించినను దానినే చంద్రోదయంగా పేర్కొనడం జరుగుతుంది.

చంద్రగ్రహణం[మార్చు]

చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని 'చంద్ర గ్రహణం' అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలా సేపు (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Spudis, Paul D. (2004). "Moon". World Book Online Reference Center, NASA. Archived from the original on 2007-04-17. Retrieved 2006-12-23.
  2. అక్టోబర్ 12 2008, ఈనాడు ఆదివారం సంచిక ప్రచిరించిన శీర్షిక ఆధారంగా



ఉల్లేఖన లోపం: "నోట్స్" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="నోట్స్"/> ట్యాగు కనబడలేదు

"https://te.wikipedia.org/w/index.php?title=చంద్రుడు&oldid=4148451" నుండి వెలికితీశారు