శాంతి పర్వము పంచమాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వైశంపాయనుడు జనమేజయుడికి భారత కథను వినిపిస్తున్నాడు. ధర్మరాజు శంకలకు భీష్ముడు చక్కగా సమాధానాము ఇస్తున్నాడు. ఆ క్రమంలో ధర్మరాజు భీష్ముడిని " పితామహా దేహంలోని పురుషుడు ఏ కారణంగా శ్రీమంతుడు ఔతాడు. ఏకారణంగా నశిస్తాడు " అని అడిగాడు.

శ్రీమంతుడు[మార్చు]

భీష్ముడు " ధర్మనందనా ! నీకు ఇంద్రుడు లక్ష్మీదేవికి మధ్య జరిగిన సంవాదము చెప్తాను విను. ఒక రోజు నారదుడు లోక సంచారము చేస్తూ మందాకినీ నదిని చేరుకుని అక్కడ స్నానమాచరించి ఆ సమయంలో అప్పటికే ఇంద్రుడు మందాకినీ నదిలో స్నానమాచరించి అనుష్టానం తీర్చుకోవడం చూసి ఇంద్రుడితో సంభాషించ సాగాడు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి ఇంద్రుడికి నమస్కరించింది. ఇంద్రుడు " నీవు ఎవరు ఎక్కడకు పోతున్నావు ? " అని అడిగాడు. ఆ స్త్రీ " ఓ ఇంద్రా ! నేను తామరపువ్వు నుండి జన్మించిన లక్ష్మిని. ఇప్పటి వరకు నేను రాక్షసుల వద్ద ఉన్నాను. ప్రస్తుతము వారి ప్రవర్తన నచ్చక ఇప్పుడు నీ వద్దకు వచ్చాను " అన్నది. ఇంద్రుడు " అదిసరే ఇప్పటి వరకు రాక్షసుల వద్ద ఏ గుణములు నచ్చి వారి వద్ద ఉన్నావు ? ఇప్పుడు నీకు వారు ఎందుకు నచ్చ లేదు ? నిన్ను మెప్పించాలంటే ఏమి చేయాలి ? " అని అడిగాడు. లక్ష్మి " ఇంద్రా ! ఇప్పటి వరకు అసురులు దానములు, వేదాధ్యయనము చేయడము, అతిథులను సత్కరించడం వంటి మంచి పనులు చేశారు. ఇప్పుడు వారికి గర్వము పెరిగి మంచి గుణములను విడిచి పెట్టారు. అందుకని నేను వారిని విడిచిపెట్టాను. నీవు సత్య ధర్మపరుడవని ఎరిగి నీ వద్దకు వచ్చాను. గురువుల ఎడ భక్తి కల వారు, పితరులను దేవతలను పూజించు వారు, సత్యమును పలికే వారు, దానశీలురు, ఇతరుల ధనమును కాని భార్యలను కాని కోరనివారు, పగలు నిద్రించని వారు, వృద్ధులపట్ల బాలలపట్ల స్త్రీలపట్ల దయ కలిగిన వారు, బ్రాహ్మణులను పూజించు వారు, నిత్యము శుచి శుభ్రత కలిగిన వారు, అతిథులకు పెట్టికాని భుజించని వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నేను వారివద్ద ఉండడానికి ఇష్ట పడతాను. అలా కాక కామమునకు, లోభమునకు, క్రోధములకు లోనై ధర్మమును విడిచిన వారు, గర్విష్టులు, అతిథి సత్కారము చేయని వారు, పరుషవాక్యములు పలుకువారు, క్రూరపు పనులు చేయువారిని నేను మెచ్చను. అటువంటి వారి వద్ద ఉండడానికి నేను ఇష్టపడను " అన్నది లక్ష్మి. ఆ మాటలకు ఇంద్రుడు, లక్ష్మి ఎంతో సంతోషించారు. ఇంద్రుడు లక్ష్మీదేవితోసహా స్వర్గానికి వెళ్ళాడు. కనుక ధర్మరాజా ! లక్ష్మీ దేవి నివాస స్థానములు తెలుసుకుంటివి కదా అలా నడచుకో " అన్నాడు.

ముక్తి మార్గము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ప్రజలు దేనిని ఆచరించిన, ఏ విధ్య అభ్యసించిన ముక్తి పొందగలరు " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను. పూర్వము జైగిషల్యుడు అనే మహాముని దేవలుడికి ఇలా చెప్పాడు. శాంతిమతులకు, సౌమ్యులకు ఏ ధర్మము వర్తిస్తుందో నాకు అదే ఇష్టము. ఆ ధర్మమును నీకు వివరిస్తాను. తనను పొగడినా, తిట్టినా, ప్రియము చేసినా, అప్రియము చేసినా, తనను ఎవరైనా పొగడినా బాధించినా అటువంటి వారి ఎడ సమభావం వహించడము జ్ఞానుల లక్షణము. కోరిన వస్తువు లభించలేదని చింతించక ఉన్న దానితో తృప్తిపడాలి. తాను అనుకున్నది జరగలేదని చింతించ కూడదు. హర్షము, అభిమానము, అసూయ, మదము, తప్పు చేయడము మొదలైనవి దుర్గుణాలు. ఇంద్రియనిగ్రహము కలవారు తనకు అవమానము జరిగినా సన్మానము జరిగినట్లే భావిస్తారు. తమకు సన్మానము లైజరిగినా అందుకు అధికముగా పొంగిపోక సమభావము కలిగి ఉంటారు. ఇంద్రియములను అదుపులో పెట్టుకున్నవారు ప్రశాంత మనస్కుడై ఉంటారు. దేవతలు సహితము వారి స్నేహాన్ని కాంక్షిస్తారు " అని చెప్పాడు.

జనప్రియుడు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! అఖిల జనులకు ప్రియము కలిగించు వారు ఎవరు ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో శ్రీకృష్ణుడికి ఉగ్రసేనుడికి జరిగిన సంవాదము వినిపిస్తాను. ఒకసారి ఉగ్రసేనుడు శ్రీకృష్ణుడితో " కృషా ! లోకంలోని జనులంతా నారదుడిని భక్తి ప్రమత్తులతో పూజిస్తారు కదా ! అతడు అంతటి గొప్ప వాడా ! నారదుడిలో ఉన్న గొప్పతనము ఏమిటి ? " అని అడిగాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు " నారదుడిలో వేదవిద్య, ఆచారము సమృద్ధిగా ఉన్నాయి కాని అహంకారము కొంచము కూడా లేదు. సచ్చీలవంతుడు నిరాడంబర వేషధారి, మత్సరము, గర్వము, మదము, మచ్చుకైనా లేవు. నారదుడు తన పుట్టుకచేత, తపస్సుచేత, తేజముచేత, బుద్ధిచేత, నీతిచేత ప్రసిద్ధిపొందాడు. నారదుడు ధీరుడు, మృదుమధురంగా మాటాడువాడు. కాఠిన్యము, దైన్యము, క్రోధము, లోభము, నిరాసక్తత మచ్చుకూడా లేదు. నారదుడుకు ఈర్ష్య, అసూయ అనేవి, ఎలా ఉంటాయో తెలియదు. కనుక జనులు నారదుడిని కీర్తిస్తారు. ధర్మజా నీవడిగిన ప్రశ్నకు సమాధానము ఇదే ! " అని అన్నాడు.

కాలప్రమాణము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! నాకు కాల విభజన గురించి యుగప్రమాణముల గురించి భూతములు ఎన్ని రకములు ? వాటిని వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ విషయములను పూర్వము వేదవ్యాసుడు శుకుడికి చెప్పాడు. అవే విషయములను నీకు వివరిస్తాను. వేదవ్యాసుడు " కుమారా ! ఈ కాలముకు పంచభూతములకు ఆధారభూతంగా వెలిగే తేజోరూపము ఒకటి ఉంది. ఆ తేజస్సు ఎప్పుడూ చైతన్యవంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది కాని ఏ పనీ చేయదు. కేవలం సాక్షీ భూతంగా మాత్రమే ఉంటుంది. ఆ తేజస్సు కేవలం భావనలో మాత్రమే కనిపిస్తుంది. ఇక కాలప్రమాణము గురించి చెప్తాను విను. 18 నిముషాలు కలిస్తే ఒక కాష్ట ఔతుంది. 30 కాష్టలు ఒక కళ ఔతుంది. 360 కళలు ఒక ముహూర్తము. 30 ముహూర్తాలు ఒక అహోరాత్రము. 30 అహోరాత్రములు ఒక మాసము. 2 మాసములు ఒక ఋతువు ఔతుంది. 3 ఋతువులు ఒక ఆయనము ఔతుంది. రెండు ఆయనములు ఒక సంవత్సరం ఔతుంది. ఆయనములు రెండు అందులో ఒకటి ఉత్తరాయణము రెండవది దక్షిణాయనము. ఉత్తరాయణమును అగ్ని అంటారు. దక్షిణాయణన్ని ధూమము అంటారు. ఉత్తరాయణము మంచి చేస్తుంది. దక్షిణాయణము చెడ్డచేస్తుంది. భూమి మీద మానవులకు ఒక మాసకాలము పితరులకు ఒకరోజు. మానవుల సంవత్సరకాలము దేవతలకు ఒక రోజు. ఇక యుగముల గురించి చెప్తాను విను. దేవతలకు 12,000 సంవత్సరాలు భూమి మీద 4 యుగముల కాలము. మొదటిది కృత యుగము అది 12,000 సంవత్సరమల కాలంలో 40 శాతము అంటే 4,800 సంవత్సరాలు. రెండవది త్రేతా యుగము అది 12,000 సంవత్సరాల కాలములో 30 శాతము అంటే 3,600 సంవత్సరములు. మూడవది ద్వాపర యుగము అది 12,000 సంవత్సర కాలములో 20 శాతము అంటే 2,400 సంవత్సరములు. నాల్గవది కలియుగము అది 12,000 సంవత్సర కాలములో 10 శాతము అంటే 12,00 సంవత్సరాల కాలము. యుగములు మానవ కాలములో :-

  • కృతయుగము : 17,28,000 సంవత్సరాలు.
  • త్రేతాయుగము : 12,96,000 సంవత్సరాలు.
  • ద్వాపరయుగము : 8,64,000 సంవత్సరాలు.
  • కలియుగము : 4,32,000 సంవత్సరాలు.

యుగముల మధ్యకాలాన్ని యుగసంధి కాలము అంటారు. యుగ సంధి కాలము కృతయుగమున 400 దేవ సంవత్సరాలు, త్రేతాయుగమున 300 దేవ సంవత్సరాలు, ద్వాపర యుగమున 200 దేవ సంవత్సరాలు, కలియుగమున 100 దేవ సంవత్సరాల కాము ఉంటాయి.

యుగసంధి మానవ కాలములో :-

  • కృతయుగము : 1,44,000 సంవత్సరాలు.
  • త్రేతాయుగము : 1,08,000 సంవత్సరాలు.
  • ద్వాపరయుగము : 72,000 సంవత్సరాలు.
  • కలియుగము : 36,000 సంవత్సరాలు.

త్రేతాయుగము నుండి మానవులలో ధర్మము, న్యాయము, ఆయువు, శరీరబలము, ధారుఢ్యము క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి. ఈ నాలుగు యుగములు ఒక మహాయుగము ఔతుంది. అటువంటి మహాయుగములు వెయ్యి బ్రహ్మదేవుడికి ఒక పగలు. అలాగే ఒక వెయ్యి మహాయుగములు ఒక రాత్రి ఔతాయి. బ్రహ్మ నిద్రించే సమయంలో జగత్తుకు ప్రళయం సంభవిస్తుంది. బ్రహ్మదేవుడు నిద్రి లేవగానే బ్రహ్మదేవుడు సృష్టికి పూనుకుంటాడు. ఇలా సృష్టి క్రమం నడుస్తూ ఉంటుంది.

బ్రహ్మతత్వము[మార్చు]

ఈ బ్రహ్మతత్వము నుండి మహాతత్వము పుట్టింది. మహాతత్వము నుండి క్రమముగా మనస్సు, గగనము, పవనము, నీరు, భూమి ఒక దాని నుండి ఒకటి ఆవిర్భవించాయి. ఈ పంచభూతములకు శబ్ధ, స్పర్శ, రస, గంధములు గుణములుగా భాసిస్తున్నాయి. ఈ సప్తస్వరూపములను పురుషులు అంటారు. వారంతా సమష్టిగా సృష్టికార్యము నెరవేరుస్తారు. మనలో ఉన్న తేజోమయమైన పురుషరూపమును బ్రహ్మము అనీ ప్రజాపత్యము అని అంటారు. ఆ పురుషుడు సర్వవ్యాపకుడు, స్రష్ట, బ్రహ్మ, ప్రజాపతి అనే పేర్లతో పిలువబడతాడు. ఆ పురుషుడు సత్యము, నిత్యము అయిన ఆత్మ స్వరూపుడు, ఆ పురుషునకు జగత్తు విషయాలు ఏవీ అంటవు. అతడు దేవతలలో, మునీంద్రులలో, గరుడ, ఉరగ, కిన్నెరులలో, నదులలో, వనములలో, సముద్రాలలో నిండి ఆయాకార్యములు నిర్వహిస్తుంటాడు. ఇక మనుష్యుల స్వభావములు విచిత్రంగా ఉంటాయి. కొందరు తమ ప్రయత్నాల వలన మాత్రమే తనకు అన్నీ లభిస్తున్నాయి అనుకుంటారు. మరి కొందరు అన్నీ దేవుడే ఇస్తున్నాడు అనుకుంటారు. మరి కొందరు పంచభూతాలే సకలమూ చేస్తున్నాడని అనుకుంటున్నారు. ఇక సాత్వికులు అంతటా సమాన దృష్టితో చూస్తూ సుఖదుఃఖాలకు లోనుకాక ఉంటారు. అన్నిటికంటే తపస్సు గొప్పది, తపస్సుకు ఇంద్రియ నిగ్రహము, మానశిక శాంతి అవసరము. ఇంకా సాధ్యాయనము వేదాధ్యయనము ఈ తపస్సుకు బలము చేకూర్చి మంచి బలాన్నిస్తుంది. ఈ బ్రహ్మములు శబ్ధబ్రహ్మము, పరబ్రహ్మము అని రెండు విధములు. సాధకుడు ముందు శబ్ధబ్రహ్మమును ఆరాధించి పరబ్రహ్మాన్ని పొందగలడు. ఈ పరబ్రహ్మ జగత్తును సృష్టిస్తుంది లయము చేస్తుంది కాని తాను దేనిలోనూ పాల్గొనదు.

లయము[మార్చు]

కుమారా ! ఇప్పటి వరకు సృష్టి గురించి చెప్పాను. ఇక లయం గురించి చెప్తాను. ప్రళయకాలంలో ఈ చరాచర జీవరాశులు సమస్తము భూమిలో కలిసిపోతాయి. అంటే మట్టితో నిర్మించబడిన ఈ శరీరాలు తిరిగి మట్టిలో కలిసిపోతాయి. తరువాత ఈ భూమి సమస్తం జలమయమౌతుంది. జలం అగ్నిలోకలుస్తుంది. అగ్ని వాయువులోకలుస్తుంది. వాయువు ఆకాశంలోకలుస్తుంది. ఈ ఆకాశాన్ని మనసులాగుతుంది. మనసు చంద్రుడిలోలీనమౌతుంది. మనసులో పుట్టినసంకల్పాలు చంద్రుడిని తనలో లీనం చేసుకుంటుంది. ఆ సంకల్పాలను జ్ఞానం తనలో ఇముడ్చుకుంటుంది. ఆ జ్ఞానం కాలంలో కలిసి పోతుంది. ఆ తరువాత కాలం కూడా నశిస్తుంది. ఆఖరున శుద్ధతత్వము స్వరూపమై అఖండ జ్ఞానము వెలుగుతూ ఉంటుంది. దానినే బ్రహ్మరూపము అంటారు. ఈ సంహారణకారణము అంతా బ్రహ్మ వలననే జరుగుతుంది " అని వ్యాసుడు చెప్పాడు.

జాతి ధర్మములు[మార్చు]

వ్యాసుడు ఇంకా " కుమారా ! బ్రాహ్మణుడు పుట్టగానే జాతకకర్మ చేస్తారు. తరువాత ఉపనయనము చేస్తారు. తరువాత అతడు గురువు వద్దకు వెళ్ళి వేదములు, శాస్త్రములు నేర్చుకుంటాడు. అలా గురువుల ఋణము తీర్చుకుంటాడు. తరువాత గురుగారి అనుజ్ఞతో వివాహము చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరిస్తాడు. గృహస్థాశ్రమంలో దేవఋణం పితృఋణం తీర్చుకుంటాడు. బ్రాహ్మణులకు యజ్ఞములు చేయడం చేయించడం, వేదాధ్యయనం చేయడం, వేదములు ఇతరులకు బోధించడం, దానములు చెయ్యడం, దానములు స్వీకరించడం లాంటి ఆరుకర్మలు బ్రాహ్మణులు చేయతగ్గవి. అన్ని జాతులవారు దానములు చేయవచ్చు. దానముకు అర్హము కాని వస్తువు లేదు. కాశ్యుడు అనే రాజు తన ప్రాణములు దానం ఇచ్చి ఒక బ్రాహ్మణుడి ప్రాణములు కాపాడాడు. శిబిచక్రవర్తి తన శరీర అవయవములను, తన కుమారుడిని బ్రాహ్మణుడి కొరకు అర్పించాడు. కాశీరాజు ప్రత్యయనుడు తన కళ్ళను బ్రాహ్మణుల కొరకు దానంచేశాడు. జనకమహారాజు, పరశురాముడు తమ రాజ్యాలను బ్రాహ్మణులకు దానంచేశాడు. పాంచాలరాజు బ్రహ్మదత్తుడు శంఖనిధిని బ్రాహ్మణులకు దానంచేశాడు. ఇంకా బ్రాహ్మణులకు తమతమ ప్రాణములను, శరీరములను, మణులను, బంగారమును, కన్యలను, ఆవులు మొదలైన ప్రశస్త వస్తువులను అనేకులు దానంగా ఇచ్చారు. వారికందరికి ఉత్తమగతులు ప్రాప్తించాయి. దానం చేయడము వలన, వేదాధ్యయనము చేయడము వలన, యజ్ఞము చెయ్యడము వలన నానావిధములైన పాపములు వినాశనం ఔతాయి. కనుక దానగుణము ఆచరించడం ఉత్తమము.

సంసార నావ[మార్చు]

ఈ ప్రకారము పాపములు పోగొట్టుకున్న మానవులు మితముగా భోజనం చెయ్యడం, ఇంద్రియనిగ్రహం, అరిష్డవర్గాలకు దూరంగా ఉండడము వంటివి చేసి బ్రహ్మపదముకై ప్రయత్నించాలి. అప్పుడు మానవులు సంసార నది ఆవలి ఒడ్డుకు చేరగలరు. బుద్ధిమంతులు తన ప్రజ్ఞ అను నావను ఉపయోగించి సంసారమనే నదిని దాటి ఆవలి తీరము చేరగలరు. సంతోషము, భయము, కోపము లేని వారు, బుద్ధి, ధైర్యము, అప్రమత్తత ఉన్నవారు, ధర్మము తప్పనివారు, ఇంద్రియనిగ్రహము కలవారికి నాశనం లేదు. ఒక్కోసారి మనం చేసే అధర్మకార్యాలు ధర్మంగా అనిపిస్తాయి అప్పుడు శాస్త్రములు పఠించి ధర్మనిర్ణయం చేయాలి. బుద్ధిమంతులు జ్ఞానము సముపార్జించడానికి వాక్కును, మనస్సును నియంత్రించుకుంటారు. అట్టివారు వేదవిదులైనా, వేదములు చదవకపోయినా, ధర్మాత్ములైనా, పాపాత్ములైనా, పైన చెప్పినపద్ధతులు పాటించిన జరామరణాలతో కూడిన ఈ సంసారాన్ని అవలీలగా దాటగలరు. యోగము అనే రథముకు సదాచారము చక్రము. ప్రాణము కాడికొయ్య. అపానము అక్షము (ఇరుసు). ఉపాయము అపాయము అనేవి నొగలు. జ్ఞానేంద్రియములు అశ్వములు. సర్వతంత్రము అనేది అశ్వములను తోలు చర్నాకోలు. త్యాగము పగ్గములు. సాధకుడు ఈ యోగము అను రథము ఎక్కి మోక్షమార్గమున పయనిస్తారు. క్రమముగా పంచభూతములను గెలిచి, అహంకారమును పక్కకు నెట్టి, బుద్ధిని పెంపొందించుకుని ప్రకృతిసిద్ధములైన వికారములను పోగొట్టుకుని చివరకు ఈ భూమిని జయించి, చిట్టచివరకు యోగసిద్ధిని పొంది ప్రకాశిస్తారు. మానవులు తమలోని అహంకారమును జయించిన అది మనస్సును, పంచభూతములను, బుద్ధిని జయించే మార్గాన్ని సుగమంచేస్తుంది ఇదే యోగమార్గము. ఇంద్రియములను ప్రపంచవిషయముల మీదకు పోనీయక మనస్సును అంతర్ముఖం చేసి అను సంధానించడమే సాంఖ్యము అంటారు. సాంఖ్యము యోగము వేరువేరు కాదు రెండూ ఒకటే. సారంలేని సంసారముకు కారణం మమతలు, మమకారాలు. సాంఖ్యులకైనా, యోగులకైనా మమతలు వదలడం ముఖ్యము.

భూతములలో తారతమ్యములు[మార్చు]

ఇక భూతములలో తారతమ్యములు చెప్తాను విను. భూతములు రెండు విధములు. స్థావరములు, జంగములు. స్థావరములు అంటే కదలనివి. జంగములు శ్రేష్టమైనవి. జంగములు వీర్యము, అండము, బీజము, స్వేదము మొదలైన వాటి నుండి పుడతాయి. వీటిలో రెండు కాళ్ళ జీవులు, నాలుగు కాళ్ళు, అనేక పాదములు కలిగిన జీవులు ఉంటాయి. ఈ జీవులలో రెండుకాళ్ళు కలిగిన మానవులు మేలు. ఈ మనుష్యులలో జాతి ధర్మములను పాటించే వారు మేలు. వారిలో బ్రాహ్మణులు ఉత్తములు. బ్రాహ్మణులలో వేదాధ్యయనము చేయు వారు ఉత్తములు. వేదాధ్యయనము చేయు వారిలో ప్రవచనము చేయు వారు గొప్పవారు. వారిలో ఆత్మజ్ఞానము కలవారు శ్రేష్టులు. అటువంటి వారు స్వధర్మమును పాటించేవారు, మంచి సంకల్పం కలవారు, దైవారాధికులు అయి ఉంటారు. అటువంటి వారినే బ్రాహ్మణులు అంటారు. అటువంటి వారు అందరి చేత నమస్కారములు, ఆదరము పొందుతారు. అటువంటి వారితో సమానులు ఈ భూమి మీద మరెవ్వరూ ఉండరు. అటువంటి బ్రాహ్మణులను ఆధారం చేసుకునే ఈ ప్రపంచము ధర్మమార్గంలో నడుస్తుంది. అటువంటి బ్రాహ్మణుడు నిర్మలమైన జ్ఞానము కలిగి ఉండాలి, నిష్ఠాగరిష్ఠుడై ఉండాలి, తను వేదము విధించిన కర్మలను నిష్ఠతో నెరవేర్చాలి. అలాంటి వారికి ఎలాంటి సందేహములు లేక నిర్మల మనసుతో జీవిస్తారు. ఈ చరాచర జగత్తును సృష్టించిన మహాతత్వాన్ని చేరుకోవడానికి తపస్సును మించిన సాధనములేదు. బ్రాహ్మణులకు మైత్రి వంటి ధర్మము మరొకటి లేదు. మైత్రీధర్మము సక్రమంగా పాటిస్తే ఇక మిగిలిన కర్మలతో పని లేదు. మైత్రీధర్మము వివేకమును ఇస్తుంది " అని వ్యాసుడు శుకుడితో చెప్పాడు.

బ్రహ్మపదము[మార్చు]

శుక్రుడు వ్యాసుడితో " మునీంద్రా ! పరమ బ్రహ్మపదము పొందుటకు అవసరమైనది యజ్ఞములా ? యోగమా ? సాంజ్ఞమా ? జ్ఞానమా ? వీటిలో ఏది ముఖ్యమో వివరించండి? " అని అడిగాడు. నీవు చెప్పినవి అన్నీ మంచివే. తపాస్సు, ఇంద్రియ నిగ్రహము, రాగద్వేషములు, లోభములను పక్కన పెట్టే నేర్పు, దృఢమైనవిద్య వీటి వలన కూడా పురుషుడు బ్రహ్మపదమును పొందవచ్చు. ప్రయత్నమీద ఇంద్రియములను నిగ్రహించ వచ్చు. మనస్సును నిగ్రహిస్తే ఇంద్రియము పని చేయడము మానివేస్తాయి. అప్పుడు బ్రహ్మప్రాప్తి పొందడము సులువు. బుద్ధి మనకు కనిపించదు, వినిపించదు కాని బుద్ధివలన మనము పరమాత్మను చూడగలము తెలుసుకోగలము. వినయము, విద్య కలిగిన బ్రాహ్మణుడియందు, ఆవులందు, ఏనుగులందు, వీధికుక్కలందు, కుక్కమాంసము తినువారియందు సమదర్శనము కలవారు బ్రహ్మపదవికి అర్హులు. చరాచరజగత్తులో అన్ని జీవరాశులందు భగవంతుడు ఆత్మస్వరూపుడై వెలుగుతూ ఉంటాడు. ఆ పరమాత్మయందు అన్ని జీవరాశులు సంచరిస్తున్నాయని తెలుసుకున్న వాడు పరబ్రహ్మపదమును పొందగలడు. ఆత్మ క్షరమైనది, జీవుడు అక్షరుడు. జీవిలో మృత్యువు పొంచి ఉంటుంది కనుక క్షరమైనది. అక్షరమనగా మరాణానంతరము పొందే స్వర్గప్రాప్తి అదియే అమృతము. పండితుడైన వాడు అన్నిటినీ సమానంగా చూస్తాడు. ఈ లోకాలను కాలము శాసిస్తుంది. కాలమును జయించిన వాడు పరబ్రహ్మ పదమును పొందగలడు. ఈ శరీరము తొమ్మిది ద్వారములు కలిగిన ఒక పురము. అందులో ఆత్మ వెలుగుతూ ఉంటుంది. యోగులు ఆ ఆత్మను అక్షరము, అమృతము అంటారు. ఆత్మతత్వమును సత్కర్మలు చేస్తూ వైరాగ్యముతో జీవించే యోగి మాత్రమే తెలుసుకోగలడు. అటువంటి యోగులకు కామము, క్రోధము, భయము, నిద్ర, లోభములు ఉండవు. యోగులు వాటిని వదిలి వేస్తారు. పండితుడు కామ సంబంధిత కోర్కెలను సంకల్పములను వదిలి కామమును జయిస్తాడు. సత్వగుణ సంపదతో నిద్రను, మోహమును జయిస్తాడు. గురువులను, పెద్దలను, పండితులను పూజించడము వలన లోభమును వదిలి వేస్తాడు. ఇంద్రియములను నిగ్రహించి కోపమును జయిస్తాడు. దృఢమైన మనసుతో భయాన్ని జయిస్తాడు. ఏ ఒక్క ఇంద్రియము అదుపు తప్పినా యోగి యొక్క ప్రజ్ఞ మొత్తము నాశనం ఔతుంది. కనుక ఇంద్రియములను అదుపులో ఉంచుకోవాలి. మనసును అదుపులో ఉంచుకోవాలి. ద్వేషించినా సన్మానించినా ఒకటిలా స్వీకరించాలి. జనావాసాలలో ఉంటూ ఇది సాధించడము అసాధ్యము కనుక జనావాసమును వదిలి అరణ్యములకు పోయి కొండగుహలలో నివసిస్తూ సాధన చేయాలి. యోగి అయిన వాడు విలువైన బంగారమును, విలువ లేని మట్టిని సమానంగా చూడాలి. కర్మమార్గమును ప్రవృత్తిమార్గమని అంటారు. ప్రవృత్తిమార్గము ఇహలోక బంధములను కలిగిస్తుంది. నివృత్తిమార్గము ఆ బంధములను విడతీస్తుంది. కనుక జ్ఞానులు కర్మమార్గమును వదిలి జ్ఞానమార్గమును అనుసరిస్తారు. కొందరు కర్మమార్గము మేలని అనుకుంటారు. వారు జనన మరణములను తప్పించజాలరు. కర్మవలన చిత్తశుద్ధి కలుగుతుంది కాని అది అవిద్య, మాయకు లోబడి ఉంటుంది. కనుక కర్మలను త్యాగము చేయుట మోక్షమునకు మార్గము " అని చెప్పాడు వ్యాసుడు.

ఆశ్రమధర్మాలు[మార్చు]

శుకుడు " తండ్రీ ! విద్య ఎటువంటి వారికి అబ్బుతుంది ? వివరించండి " అని అడిగాడు. " అరణ్యములో వానప్రస్థులు జీవిస్తారు. వారు భిక్షాటనతో జీవించాలి, ప్రజల మధ్యతిరగడం మానివేయాలి. మానము, అవమానము సమానంగా భరించాలి. అప్పుడు ఆధ్యాత్మ విద్య అలవడుతుంది " అని వ్యాసుడు చెప్పాడు. శుకుడు " తండ్రీ ! ఎటువంటి వారికి కర్మలు విడుచుట సాధ్యము కాదు అంటారు కదా ! వారు ఏమి చేయాలి ? " అని అడిగాడు. వ్యాసుడు " కుమారా ! బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థాశ్రమంలో ఉన్న వారు, యతులు, వారివారికి విధించిన కర్మలను నిర్వర్తించాలి. మోక్షమార్గముకు ఈ నాలుగు ఆశ్రమాలు నాలుగు మెట్లవంటివి. మనిషి ఆయుర్ధాయము శతయుస్సుగా నిర్ధారించిన అందు 25 సంవత్సరములు బ్రహ్మచర్య ఆశ్రమంలో గురువుకు సేవలు చేస్తూ వేదవిద్య అభ్యసించవలెను. బ్రహ్మచర్యాశ్రమంలో విషయవాంఛలకు దూరంగా ఉండాలి. విద్యాభ్యాసము పూర్తిచేసుకుని గురుదక్షిణ ఇచ్చి గురువుగారి అనుమతితో వివాహము చేసుకోవాలి. గృహస్థాశ్రమంలో బంధువులను ఆదరిస్తూ, అతిథిసత్కారాలు చేస్తూ, సత్యమునే పలుకుతూ, భార్యాపుత్రులను ఆదరిస్తూ, పుత్రులను విద్యావంతులను చేయాలి. ఇలా కర్తవ్యనిర్వహణ చేస్తూ మరొక 25 సంవత్సరాలు గడపాలి. తరువాత వానప్రస్థ్యం స్వీకరించి కందమూలములు తింటూ, తాపసులను సేవిస్తూ, వారికి పెట్టగా మిగిలిన ఆహారాన్ని భుజిస్తూ తపమాచరిస్తూ మరొక 25 సంవత్సరాలు గడపాలి. ఆఖరి 25 సంవత్సరాలు సన్యాసాశ్రమం స్వీకరించి కర్మలను విడవాలి. సన్యాశ్రమంలో తలను నున్నగా గొరిగించుకుని, ఎవ్వరితో కలహించక, వృక్షముల నీడన జీవించాలి. ఈ కాలంలో జనావాసాలలోకి వెళ్ళకూడదు. ఒంటరిజీవితము గడుపుతూ, కామ క్రోధాలకు లోబడక, స్తుతి నిందలన సమంగాస్వీకరించాలి. లభించిన దాన్నిని తిని, ఎక్కడబడితే అక్కడే నిద్రపోవాలి. సకల భూతముల అందు దయకలిగి ఉండాలి. అలాంటి వాడు యతి అని పిలువబడతాడు " అని వ్యాసుడు చెప్పాడు.

అంతర్యాగము[మార్చు]

వ్యాసుడు శుకునికి అంతర్యాగము గురించి వివరించసాగాడు. " కుమారా ! అంతర్యాగము చేసే యోగి తన ప్రాణములను తన అంతరాత్మలో హోమము చేస్తాడు. అప్పుడు అతనికి పాపములన్నీ తొలగి పోతాయి. ఆత్మ ఒక పక్షి వంటిది. ఆకాశంలో ఎవ్వరికీ కనిపించక ఎగురుతూ ఉంటుంది. అది గుడ్డులో నుండి పుడుతుంది. కేవలము యోగులు మాత్రమే దానిని చూడగలరు. కాలము ఒక చక్రము వంటిది, దానికి అంచులు 6 ఋతువులు, 12 మాసములు పదునైన పళ్ళుగా ఉంటాయి. కాలచక్రము విశ్వమంతా వ్యాపించి గిరగిరా తిరుగుతూ ఉంటుంది. మనశరీరంలో ఉండే జీవుడే రథము. దానికి సారథి మనసు, ఇంద్రియములు అశ్వములు. ఇంద్రియములు అనే అశ్వములు అదుపు తప్పితే రథము దారి తప్పుతుంది కనుక ఇంద్రియములను అదుపులో ఉంచుకోవడము అవశ్యము. మోక్షమును కోరు యోగి సర్వసంకల్పములు విడిచి చిత్తమును సత్వగుణము నిలపాలి, మితాహారము తినాలి. అప్పుడు గాలి లేని చోట పెట్టిన దీపంలా చిత్తము స్థిరముగా ఉండి ప్రకాశిస్తుంది. కుమారా ! శుకమునీంద్రా ! వేదాంతసారమును మధించి ఆ వెన్నను నీకు ఇచ్చాను. నీవు దానిని యోగులకు ఇవ్వు. అన్నీ దానముల కంటే విద్యాదానము శ్రేష్ఠమైనది కనుక నీవు దానిని అందరికీ పంచి పెట్టు. ఇంకా నీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆడిగి తెలుసుకో " అన్నాడు. శుకుడు " తండ్రీ ! ఇప్పటి వరకూ విన్నదే నాకు సరిగా అర్ధము కాలేదు. కనుక నాకు ఇంకొంచము వివరించండి " అని అడిగాడు శుకుడు. వ్యాసుడు " ఈ సృష్టికర్త పంచభూతములలో అంతటా తానే నిండి ఉండి వాటిని ఈ లోకములో నియోగిస్తాడు. తిరిగి ఈ పంచభూతములను తనలో లీనము చేసుకుంటాడు. ఈ కార్యము నిరంతరము సాగుతూనే ఉంటుంది. తాబేలు తన అవయవములను తనలోకి తీసుకున్నట్లు సృష్టికర్త తనలోకి సృష్టిని తానే లయము చేసుకుంటాడు. పరమాత్మను మాయ ఆవరించినప్పుడు ఈ సృష్టి జరుగుతుంది. మాయ తొలగి పోగానే ఈ సృష్టి అంతా పరమాత్మలో లయం ఔతుంది. ముందుగా పంచభూతములు, ఇంద్రియములు, విషయములు సృష్టించబడతాయి. జ్ఞానేంద్రియములు ఐదు, మనస్సు ఆరవది, బుద్ధి ఏడవది, ఎనిమిదవ వాడు జీవుడు ఇతడే క్షేత్రజ్ఞుడుగా ప్రకాశిస్తుంటాడు. మనసులో తలంపులు పుడతాయి. ఆ తలంపుల మంచిచెడులను బుద్ధి నిర్ణయిస్తుంది. ఆ తలంపులను ఇంద్రియములు ఆచరిస్తాయి. ఈ ప్రక్రియ అంతంటికి క్షేత్రజ్ఞుడైన అంతరాత్మ సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది. సత్వంతో ఉండడము సత్వగుణ లక్షణం. ఎల్లప్పుడూ దుఃఖంతో ఉండడము రజోగుణలక్షణం. ఏ పనీ చేయక సోమరిగా ఉండడము తమోగుణ లక్షణము. ఈ గుణాల ఆధారంగా ఇంద్రియములు పనిచేస్తుంటాయి. ఇంద్రియములు, విషయములు, మనసు, బుద్ధి, ఆత్మ క్రమంగా ఒకదాని కంటే ఒకటి ఎక్కువ. బుద్ధి అంతటా విస్తరించి ఉంటుంది. వినడము, చూడడము, రుచి చూడడము, వాసన చూడడము, స్పర్శించడము లాంటి పనులను ఇంద్రియముల ద్వారా బుద్ధి నిర్వహిస్తుంది. ఈ బుద్ధి ఒకసారి పొంగిపోతుంది, మరొక సారి కుంగిపోతుంది, మరొకసారి సుఖదుఃఖములు లేకుండా నిశ్చలంగా ఉంటుంది. ఈ బుద్ధి స్వభావము ఎరిగిన సాధకుడు ఇంద్రియాసక్తి వదిలి ఆత్మ దర్శనము చేసుకుంటే అతడికి సుఖము, దుఃఖము కలుగవు. అత్తిపండులో ఉన్న పురుగులు పండుకు ఎటువంటి హాని చేయవు. ఆత్మలో ఉన్న విషయవాంఛలు ఆత్మను అంటవు. సాలెపురుగు తన నుండి నుండి దారమును సృష్టించినట్లు సత్వ, రజో, తమో గుణాలు సుఖ దుఃఖములను కలిగిస్తుంటాయి. ఆత్మ వాటికి సాక్షీభూతంగా ఉంటుంది. ఆత్మ నాశనం లేనిది కనుక పురుషుడు సత్వరజోతమో గుణములను వదిలి ఆత్మానుసంధము చేసుకుంటే మోక్షము లభిస్తుంది. బ్రాహ్మణుడికి ఇంద్రియనిగ్రహము ఒక సంపద లాంటిది. ఇంద్రియనిగ్రహము కల బ్రాహ్మణుడికి భయము, శోకము, గర్వము, సంతోషము కలుగవు. మనస్సును నిగ్రహించడము, ఆత్మగురించి తెలుసుకోవడము వివేకవంతుల లక్షణము. ఈ లక్షణముతో మోక్షమును పొంద వచ్చు.

పరమ ధర్మము[మార్చు]

శుకుడు " ధర్మములన్నింటి కంటే పరమధర్మము ఏది ? " అని అడిగాడు. వ్యాసుడు " ఇంద్రియ నిగ్రహము, ఏకాగ్రత, అన్నింటి కంటే ఉత్తమధర్మము. మనసుతో ఇంద్రియములను నిగ్రహించి తరువాత బుద్ధిని దానికి అను సంధానము చేయాలి. అప్పుడు పరతత్వాన్ని దర్శించ వచ్చు. మొక్కలు తమకు పూచిన పూలకు వాసన చూడ లేవు. వృక్షములు తన ఫలములను తాను భుజించదు. అలాగే అంతరాత్మ తన నిజస్వరూపమును చూడ లేదు. ఇలా ఇంద్రియ నిగ్రహంతో మనస్సును బుద్ధితో అనుసంధానము చేసి పరతత్వమును దర్శించి శాంతిని పొందాలి. మనిషి పతనానికి మూలము లోభము. దాని పుట్టుక ఎవరికి తెలియదు. లోభము అనే మడుగుకు సంకల్పము అనేది గట్టు. క్రోధము దానిలోని బురద. కోరికలు ఆ మడుగులో సంచరించే పాములు. ఆ మడుగు మోహము అనే గడ్డి, మొక్కలు, నాచుతో కప్పబడి ఉంటుంది. అజ్ఞానులు దానిని కనుగొనజాలరు. సత్యము అనే సాధనతో ఆ మడుగు నిజస్వరూపమును తెలుసుకొనగలడు. కనుక నీవు ఆ లోభముకు లోనుగాక ప్రసన్నాత్ముడవై కొండ మీద నుండి కింద ఉన్న వారిని చూసినట్లు ఈ లోకాన్ని దర్శించు. కనుక అన్ని ధర్మలలోకి ఇంద్రియ నిగ్రహము ఉత్తమధర్మము. కుమారా ! బ్రాహ్మణతత్వము వేదవేదాంగలు చదివినా, యజ్ఞయాగాదులు చేసినా లభించదు. కేవలం ప్రశంతతతోనే బ్రాహ్మణత్వము సిద్ధిస్తుంది. పరులకు భయపడక, పరులను భయపెట్టక సమదృష్టితో జీవించే వాడే బ్రాహ్మణుడు. బంధములలో పెద్దబంధము కామము. కామాన్ని వదిలిన మబ్బు వీడిన చంద్రుడి మాదిరి ఆత్మ ప్రకాశిస్తుంది. కామాన్ని జయించి పరతత్వోపాసనా తత్పరుడైన పురుషుడు సుఖము, సమృద్ధి పొదుతాడు. నాది అన్నభావము లేకనే ఏది మనకు ప్రియము కలిగిస్తుందో, దేనిని భుజించకున్నా మనసుకు తృప్తి కలుగుతుందో, ఏది పొందకున్నా బలము కలుగుతుందో అటువంటి పరతత్వాన్ని వేదముల సాయంతో దర్శించాలి. విషయవాంఛలు, కర్మ బంధాలు, త్రిగుణాలు వదిలిన బ్రాహ్మణుడికి ముసలితనము లేదు, మృత్యువు అతడి దరిచేరదు. ఈ దేహము వేరు, అందులోని దేహి వేరు. ఈ సత్యమును వేదాధ్యయనము చేసిన ప్రశాంతచిత్తులు మాత్రమే దర్శించగలరు. సూర్యుడు నీటిలో బింబరూపములో కనిపిస్తాడు. అలాగే ఆత్మ కూడా బుద్ధిలో ప్రతిబింబ రూపములో కనబడుతుంది. సత్వగుణ ప్రధానులకు ఇది గోచరమౌతుంది. రాత్రి పగలనక సూర్యుడు నిరంతరము ప్రకాశిస్తుంటాడు. అలాగే పరమయోగికి వివేకము అవివేకము ఉండదు. నిరంతరము జ్ఞానముతో ప్రకాశిస్తుంటాడు. అతడికి ఇంద్రియములు ఉన్నా లేనట్లే. అతడి ప్రపంచంలో తిరుగుతూనే సమాధిస్థితిలో ఉంటాడు. మోహము అనే బీజము నుండి కామము అనే చెట్టు మొలకెత్తుతుంది. దానికి ఏమరుపాటు అనే నీరు పోసి పెంచుతుంటారు. ఆ చెట్టుకు ఆకులు అసూయ, కాండము అభిమానము, శోకములు శాఖలు, అనేక విధములైన చింతలు ఉపశాఖలు. పూర్వ జన్మ కర్మల ఫలితంగా ఆ చెట్టు వృద్ధి చెందుతుంది. ఆ చెట్టుకు ఆశలు అనే తీగలు అల్లుకుని ఉంటాయి. ఆ చెట్టుకు కాసిన పండ్లకై దాని పైకి ఎక్కిన వాడు ఎవరైనా నశిస్తాడు. అలాకాక త్యాగము అనే కత్తితో ఆచెట్టును సమూలంగా నరికిన వాడు సకల విధ దుఃఖముల నుండి విముక్తుడు కాగలడు. కుమారా ! ఈ శరీరమే ఒక నగరం అయితే ఈ నగరానికి ప్రభువు బుద్ధి, మనసు మంత్రి, ఇంద్రియాలు పురజనులు, శబ్ధ, స్పర్శ, రూప, రుచి, గంధాదులు అక్కడి పురోహితులు. ఈ రాజ్యాన్ని త్రిగుణాలు అనే దొరలు పాలిస్తూ అనుభవిస్తుంటాయి. రాజైన బుద్ధి వివేకము లేక త్రిగుణాలకు బానిసైన నశిస్తుంది, జయించిన శాశ్వత సుఖమును పొందుతాడు " అని వ్యాసుడు శుకునికి చెప్పాడని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

మృత్యుధర్మము[మార్చు]

ధర్మరాజు భీష్ముడిని " పితామహా ! కార్యబలము, వీర్యబలము, మనోబలము ఉన్న అనేక మంది రాజులు ఈ యుద్ధములో చనిపోయారు. వీరికి ఎంతబలము ఉన్నా మృత్యువును జయించలేక పోయారు. అది ఎందు వలన జరిగింది ? అసలు మృత్యువు అంటే ఏమిటి ? అది ఎలా జీవరాశులను చంపుతుంది ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " పూర్వము అకంపనుడు అనే వాడు యుద్ధములో చనిపోయిన తన కుమారుని కొరకు దుఃఖిస్తున్న తరుణంలో నారదుడు అక్కడకు వచ్చి అతడి దుఃఖానికి కారణం అడిగి తెలుసుకుని ఆ దుఃఖము పోగొట్టడానికి అతడికి ఒకకథ వినిపించాడు. నీకు ఆకథ వినిపిస్తే నీ సందేహములు అన్నీ తీరగలవు. బ్రహ్మదేవుడు జగములను సృష్టించి తరువాత సమస్త జీవరాశులను సృష్టించాడు. జీవరాశులు దినదినాభివృద్ధి చెంది చివరకు భూమి అంతా జీవరాశులతో నిండి పోయింది. అప్పుడు బ్రహ్మ ఈ జీవరాశులను ఎలా సంహరించాలా అని అని ఆలోచించాడు. బ్రహ్మదేవుడి ఆలోచనల వేడిమికి అతడి శరీరము దహించుకు పోసాగింది. బ్రహ్మదేవుడి నుండి పుట్టిన అగ్ని మూడు లోకాలను దహించి వేయడానికి సమాయత్తం అయింది. ఇది చూసిన శివుడు బ్రహ్మదేవుడి వద్దకు వచ్చి బ్రహ్మదేవుడిని శాంతించమని అర్ధించాడు. బ్రహ్మదేవుడు శాంతించగానే శివుడు జీవులను చంపే విధానం ఇది కాదు అని చెప్పి ఆ మంటలను ఆర్పాడు. బ్రహ్మదేవుడి శరీరం నుండి ఎర్రని కన్నులతో ఒక స్త్రీ ఉద్భవించి దక్షిణ దిశగా కదల సాగింది. బ్రహ్మదేవుడు ఆమెను దగ్గరగా పిలిచి " ఓ మృత్యుదేవతా నీవు ఈ ప్రాణులను బలవంతుడు బలహీనుడు అని భేదము చూడక అందరినీ సంహరించు "ని ఆజ్ఞాపించాడు. అప్పుడు మృత్యుదేవత కన్నుల నీరు నింపి " బ్రహ్మదేవా ! నీ నుండి పుట్టిన నేను ఇంతటి క్రూరమైన పని ఎలా చేయగలను. నన్ను ఏదైనా ధర్మకార్యము కొరకు నియోగించు " అని కోరింది. బ్రహ్మదేవుడు మృత్యుదేవత కన్నుల నుండి జలజలా రాలుతున్న కన్నీటిని దోసిట పట్టి " మృత్యుదేవతా ! నేను నిన్ను సంహారక్రియ కొరకే సృష్టించాను. నీవు మారు మాటాడక సంహరించవలసినదే " అని అన్నాడు. ఆ మాటలకు మృత్యుదేవత కంపించి " బ్రహ్మదేవా ! నేను మనష్యులను చంపి వారి బంధువుల శోకము చూడ లేను. ఈ పని నా వల్ల కాదు నేను తపస్సు చేసుకోవడానికినుజ్ఞ ఇవ్వండి " అని అడిగింది. బ్రహ్మ " అది ఎలా కుదురుతుంది మానవ సంహారం నీ కర్తవ్యం. నీ అప్పగించిన పని నీవు చేయకున్న అది ధర్మవిరుద్ధము ఔతుంది. కనుక నీవు ఈ పని చేయకతప్పదు. మృత్యుదేవత మారు మాటాడక అక్కడ నుండి ధేనుకాశ్రమం వెళ్ళి అక్కడ అనేక సంవత్సరాలు తపస్సు చేసింది. తరువాత హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసింది. బ్రహ్మ దేవుడు ఆమె వద్దకు వెళ్ళి " మృత్యుదేవతా ! నీవిలా తపస్సు చేసి ఏమి ప్రయోజనం. నీవు నీ కర్తవ్యం నెరవేర్చు " అని అన్నాడు. మృత్యుదేవత " మహాత్మా ! ఆ పని నా వల్ల కాదు. నన్ను క్షమించు " అన్నది. బ్రహ్మదేవుడు " మృత్యు దేవతా ! నేను సత్యము పలుకుతున్నాను. మానవ సంహారం నీకు పరమధర్మం. నా మాట కాదనకు ఇందు వలన నీకు ఏ పాపము అంటదు. మరొక్క మాట నీవు ఏడ్చినప్పుడు నేను నీ కన్నీటిని పట్టి ఉంచాను నేను ఆ కన్నీటిని లోకంలోని ప్రజల మీద చల్లుతాను. అవి నానా రకములైన రోగములుగా మారి జనులను పీడిస్తాయి. వాటికి కామక్రోధము తోడౌతాయి ప్రజలు ఆ రోగములతోనే మరణిస్తారు నీవు కేవలము వారి ప్రాణములు మాత్రమే తీస్తావు. నీవు నిమిత్తమాత్రవు మాత్రమే. నీవు పురుషులను చంపు సమయంలో పుషుడుగాను, స్త్రీలను చంపు సమయంలో స్త్రీ గాను, నంపుంసకులను చంపు సమయంలో నపుంసకుడి గానూ మారే వరము నీకు అనుగ్రహిస్తున్నాను. నీకు పాపము అంటదు సరి కదా ! ఈ సంకార కార్యమే ధర్మ కార్యము ఔతుంది " అని అన్నాడు. ఆ మాటలకు ధర్మదేవత శాంతించింది. బ్రహ్మదేవుడి మాట వినక పోయిన శాపముకు గురి కావలసి వస్తుందని అనుకుని మానవసంహార కార్యం చేయడానికి ఒప్పుకుంది. ఇలా మరణం ఆసన్నము కాగానే జనులు తమ శరీరాలను వదిలి పూర్వాకృత కర్మలను అనుసరించి తిరిగి జన్మిస్తుంటారు " అని భీష్ముడు చెప్పాడు.

ధర్మము[మార్చు]

మృత్యు దేవత గురించి విన్న ధర్మరాజు " పితామహా ! నేను ఇది వరకే దీనిని గురించి విన్నా నేను ఆ సమయంలో అధిక దుఃఖానికి గురీయి ఉండడం వలన అర్ధం చేసుకోలేక పోయాను. ఇప్పుడు బాగా అర్ధం చేసుకున్నాను. మంచి వారు ఎప్పుడూ ధర్మానికి భయపడుతుంటారు కదా ! నిజంగా ధర్మం అంత గొప్పదా ! వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! వేదముల మీద భక్తి, దృఢమైనస్మృతి, మంచి ఆచారము, అందమైన శరీరము, ఇవే ధర్మములని కొందరి అభిప్రాయము. కాని కేవలం ధనార్జనే ధర్మమని కొందరి అభిప్రాయము. కాని అన్యాయంగా, అధర్మంగా, అబద్ధాలు చెప్పి ధనార్జన చేయడం మహాపాపము. పరులసొమ్ముకు ఆశించక అబద్ధాలు చెప్పక అక్రమాలు చెయ్యకుండా ధనం సంపాదించడమే పరమ ధర్మం. ధర్మము అనేక రూపాలుగా ఉంటుంది. ధర్మము ఇలా ఉంటుంది అని చెప్పలేము. ధర్మాన్ని గురించి నాకు తెలిసింది చెప్తాను విను. ఇతరులు ఏ ఏ పనులు చేస్తే మన మనస్సుకు, శరీరానికి కష్టం నష్టం కలుగుతుందో ఆయా పనులు మనము ఇతరుల పట్ల చేయక పోవడమే పరమ ధర్మం. ఇదే ధర్మ సూక్ష్మం " అని చెప్పాడు.

సదాచారములు[మార్చు]

ఆ మాటలకు సంతోషించిన ధర్మరాజు " తాతగారూ ! నేను అజ్ఞానంతో ఏమేమో అడుగుతున్నాను. అడిగినవే తిరిగి తిరిగి అడుగుతున్నానని కోపము వద్దు. ఉత్తమమైన ఆచారము గురించి వివరించండి అని అడిగాడు. భీష్ముడు " ధర్మరాజా ! వేదములలో వివిధములైన ఆచారము గురించి వివరంగా చెప్పారు. వాటిని ఆచరించడమే మన ధర్మము. పెద్ద వాళ్ళు ఏది ఆచరిస్తే అదే ఉత్తమమైన ఆచారము. ఈ సందర్భంలో నీకు జాబాలికి, తులాధరుడు అనే వ్యాపారికి జరిగిన సంవాదం వినిపించెదను విను. పూర్వము జాబాలి అనే మహాముని తపస్సు చేసుకుంటున్నాడు. అతడి తల మీద ఒక పిచ్చుక గూడు కట్టింది. అక్కడ గుడ్లుపెట్టి పొదిగి వాటిని పిల్లలనుచేసింది. పెద్ద పిచ్చుక పిల్లతో కలిసి అక్కడ నివసించ సాగింది. ఆ విషయం తెలిసినా జాబాలి వాటిని తరిమి వేయకుండా భరిస్తూ " ఆహా ! నా వంటి ధర్మనిష్ఠాగరిష్ఠుడు ఎవరైనా ఉంటారా ! " అని తనను తాను మెచ్చుకోసాగాడు. అప్పుడు ఆకాశవాణి " మహాత్మా ! తనను తాను మెచ్చుకునే ధర్మనిష్ఠ ఎక్కడైనా ఉంటాదా. నీ కంటే ధర్మనిష్ఠా పరుడైన తులాధరుడు కూడా ఇలా ఎప్పుడూ మాట్లాడ లేదు ఇక నీ వెంత ? " అని ఎగతాళి చేసింది. ఆ మాటలకు ఆశ్చర్యపడిన జాబాలి " ఆ తులాధరుడు ఎక్కడ ఉంటాడు. నేను అతడిని కలవాలి " అని అడిగాడు. " అతడు వారణాశి పురంలో నివసిస్తున్నాడు " అని ఆకాశవాణి పలికింది. జాబాలి తులాధరుడి మీద కలుగిన మత్సరంతో వారణాశికి వెళ్ళాడు. అక్కడ వ్యాపారం చేస్తున్న తులాధరుడిని చూసాడు. జనులంతా అతడిని ధర్మాత్ముడని పొగుడు తున్నారు. జాబాలిని చూసి తులాధరుడు అతడికి అతిథి సత్కారాలు చేసి " మహానుభావా ! మీ తల మీద పిచ్చుకలు తిరుగుతున్నా చలించక హాయిగా తిరుగుతున్న మీరు జితేంద్రియులు. గౌరవించ తగిన వారు " అని అన్నాడు. అది విన్న జాబాలి " అది సరే నీవు చేసేది వ్యాపారం అందులో ధర్మము తప్పక చేయడం ఎలా సాధ్యము " అని అడిగాడు. తులాధరుడు " అయ్యా ! నేను వస్తువులు కొనడంలో అమ్మడంలో ఎలాంటి మోసములకు పాల్పడను. కొంత లాభంతో తృప్తి పడతాను . లాభం వచ్చినప్పుడు పొంగిపోక నష్టాలకు కుంగిపోక సమ స్థితిలో ఉంటాను. నేను మట్టిబెడ్డను, బంగారపు ముద్దను సమ దృష్టితో చూస్తాను. నేను ఎవరిని పొగడను తిట్టను. నన్ను నేను పొగొడుకోను. ఇతరులను హింసించను. సాటి జీవులయందు దయ కలిగి ఉంటాను. ఎల్లప్పుడూ సత్యమునే పలుకుతుంటాను. నేను భోగభాగ్యములను కాని, కీర్తిప్రతిష్ఠలు కాని కోరను. ఎవరికైనా ఉపకారము చేసి నేను ఇంత ఉపకారము చేసాను అని చెప్పుకోను. నాకు దేని మీద మమకారము ద్వేషము లేవు. ఈ లోకమును ఆటవస్తువులాగా చూస్తూ బయట ప్రపంచానికి తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాను " అని అన్నాడు. జాబాలి " తులాధరా ! నీవు యజ్ఞములు, యాగములు, తపస్సు మొదలగు ధర్మము గురించి మాట్లాడ లేదు. వేదవిధులు వీటిని సత్కర్మలు అంటారు కదా ! మరి ఇవి ఆచరించ తగిన ధర్మము కాదా ! " అని అడిగాడు. " మహాను భావా ! ఈ యజ్ఞములు యాగములు, తపస్సులు ఏవేవో కోరికలు తీరడానికి చేస్తారు. కనుక వాటి అవసరం లేదని నా అభిప్రాయం. దేవతలు వాటిని మెచ్చరని నా భావన. ఈ యజ్ఞ యాగాలు జననమరణ చక్రం నుండి మానవులను విముక్తి చేయ లేదు. ఎవరైతే సత్యమునే ఒక యజ్ఞముగా పాటిస్తూ నిత్య తృప్తుడై ఉంటాడో అతడికి శాశ్వత ఆనందము కలుగుతుంది. అని నా నమ్మకము " అని అన్నాడు తులాధరుడు. జాబాలి " తులాధరా ! నీవు కర్మలు వదల కుండా చేస్తున్నావు కదా ! దానికి ఏమి కారణం ? అని అడిగాడు. అందుకు తులాధరుడు ఇలా చెప్పాడు. తులాధరుడు " ఎవరు సతతము ధర్మమునే ఆచరిస్తాడో, ఎవరు ధర్మముతో చెలిమి చేస్తాడో, ఎవరు నిష్కల్మష హృదయంతో కర్మలు చేస్తుంటాడో, అతడికి కర్మలు ఆచరించక పోతే కలిగే ఆనందము కలుగుతుంది. అన్ని నగరాలూ పుణ్య క్షేత్రములే, అన్ని నదులూ పుణ్య నదులే, నిష్కల్మష హృదయంతో ఉన్న వాడికి అన్నీ పవిత్ర నదులే. వృత్తిధర్మంగా పనిచేస్తున్నాను, ఫలితం భగవంతుడికి అప్పగిస్తాను అనుకుని కర్మలు చేసే వాడికి ఏ దోషము అంటదు. ఫలితం ఆశించి చేసే కర్మలకు దోషం అంటకుండా ఎలా ఉంటుంది. నాకు తెలిసిన ధర్మము ఇది. ఇది సరి అయిన ధర్మం ఔనోకాదో సజ్జనులను అడిగి తెలుసుకుంటాము. నీవు ఇన్ని రోజులు తండ్రిలా పోషిస్తున్న ఆ పిచ్చికలు హాయిగా ఎగురుతున్నాయి. వాటిని పిలిచి లాలించు " అని అన్నాడు. అప్పుడు జాబాలి పిచ్చుకలను దగ్గరకు పిలిచాడు.

ధర్మదూతలు[మార్చు]

అవి అతడి దగ్గరకు రాకుండా అలా ఆకాశంలో ఎగురుతూ " ఓ మునీంద్రా ! మేము ధర్మ దేవత దూతలము. ధర్మదేవత పంపగా నిన్ను పరీక్షించడానికి వచ్చాము. మేము మీకు కలిగిన సందేహము తీరుస్తాము. ఎవరి మనసులో ఇతరుల ఎడ ద్వేషము, మాత్సర్యము ఉంటుందో అతడికి ఇతరులతో తగవులాడాలని కోరిక కలుగుతుంది. అందు వలన హింస చెలరేగుతుంది. కనుక మునీశ్వరులు తమలో తాము ద్వేషించడం, మాత్సర్యము వహించడము కూడనివి. స్పర్ధ ధర్మాన్ని నాశనం చేస్తుంది. ధర్మం నశిస్తే మనిషి నాశనం ఔతాడు. కనుక మానవుడు స్పర్ధను వదలాలి. సత్వగుణము వలన శ్రద్ధ పుడుతుంది. శ్రద్ధ ఉన్నవాడు తాను తెలుసుకో తగిన దానిని తెలుసుకుంటాడు. కనుక ప్రతి మనిషికి శ్రద్ధ ముఖ్యము. శ్రద్ధలేని తపసు, శ్రద్ధలేని యజ్ఞ యాగము నిష్ఫలములు. కనుక శ్రద్ధే అన్నిటి కంటే ముఖ్యము. శ్రద్ధ ధనమువంటిది. అది మనసును చెడు దారిలో పోకుండా కాపాడుతుంది. శ్రద్ధజీవాత్మ యొక్క ప్రసన్నత్వము. యాగము చేయుటకు శ్రద్ధ, శుచిత్వము ముఖ్యము. శ్రద్ధలేని శుచిత్వము, శుచిత్వములేని శ్రద్ధ నిష్ఫలమే. ఇదే విషయాన్ని బ్రహ్మదేవతలతో ఇలా చెప్పాడు. శ్రద్ధ కలిగిన వాడు ఉత్తముడు. అతడి చేతి భోజనము అత్యంత శ్రేష్టము. ధనము వడ్డికి ఇచ్చి ఆ వడ్డీతో దానధర్మలు చేసే వాడు, వేదవేదాంగములు చదివినా లోభి అయిన వాడు సమానమే. అందులో యాగములో దానము చేసిన వాడు శ్రేష్టుడు. శ్రద్ధలేని వాడికి దానము చెయ్యడానికి మనస్కరించదు. శద్ధ కలిగిన వాడి మనసులో మత్సరం ఉండదు. అందుకని శ్రద్ధ కలిగిన వాడు శ్రేష్టుడు. అని బ్రహ్మదేవుడు చెప్పాడు " అని పిచ్చుకలు జాబాలికి చెప్పాడు. ఆ మాటలు విన్న జాబాలి తులాధరుడిని చూసి " మహాత్మా ! నాకు ఆన్ని తెలుసు అనుకున్నాను. నాకు ఏమి తెలియదని ఇప్పుడు తెలుసుకున్నాను. నేను మునుల మాటలను వినలేదు కనుక నన్ను నేను పొగుడు కోవడము అనే దోషం నాకు పట్టుకుంది. నీ మాటలతో నాకు దోషము పోయింది. ఇక నేను ప్రశాంత చిత్తంతో జీవిస్తాను " అని పలికాడు జాబాలి. తులాధరుడు " ఓ మహాత్మా ! ఎవరికైనా స్వధర్మ కంటే మించిన ధర్మము మరొకటి లేదు " అని లేదు. తరువాత జాబాలి తులాధరుడి వద్ద శలవు తీసుకుని వెళ్ళి పోయాడు. అని చెప్పి భీష్ముడు " ధర్మనందనా ! తులాధరుడి మాటలు విన్నావు కదా ! వాటిలోని ధర్మ సూక్ష్మాలు తెలుసుకుని ప్రవర్తించు " అన్నాడు.

కాలము కార్యనిర్వహణ[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ఒక కార్యమును నిర్వహించడానికి ఎక్కువ సమయం తీసుకుంటే మంచిదా ! తక్కువ సమయం తీసుకుంటే మంచిదా ! వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఏ కార్యమైనా తొందర పడకుండా చక్కగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని తరువాత చేయడం మంచింది. అలా చేసిన కార్యములకు మంచి ఫలితాలు ఇస్తాయి. కాని కొంత మందికి ఓర్పు సహనము ఉండదు. ఏదో చెయ్యాలని తహతహ. అలాంటి వారు ఆలోచించి పని చేసే వాడిని చూసి వారికి చురుకుతనం లేదు అన్నింటా ఆలస్యమే . అది మంచిది కాదు. ఈ సందర్భంలో నీకు మేధాతిథి అనే ముని కుమారుడైన చిరకారిని గురుంచిన కథ చెప్తాను. చిరకారి ప్రతి పనిని చక్కగా ఆలోచించి చేస్తాడు అందుకనే అతడిని చిరకారి అని పిలుస్తారు. ఒక సందర్భంలో మేధాతిథికి తన భార్య మీద కోపము వచ్చి ఆమెను చంపమని తన కుమారుడైన చిరకారిని ఆదేశించి బయటకు వెళ్ళాడు. ఏ పని అయినా చక్కగా ఆలోచించి చేసే చిరకారి మనసులో " తండ్రి ఆజ్ఞను మీరడానికి వీలు లేదు కనుక తల్లిని చంపాలి. కాని తల్లిని చంపడం కంటే మహా పాపం మరొకటి లేదు. తండ్రికి నచ్చ చెబుతాము అనుకుంటే తండ్రి ఆజ్ఞను దిక్కరించడము పాపము అని పెద్దలు చెప్తారు. తల్లిని రక్షించుకోవడము కుమారుడి ధర్మము. పుత్రుడికి స్వతంత్రంగా వ్యవహరించే వీలు లేదు. కనుక ఏదైనా ఉపాయము ఆలోచించాలి. తండ్రి ఆజ్ఞ ప్రకారము తల్లిని చంపితే నరకము తప్పదు. తండ్రి ఆజ్ఞను దిక్కరించినా నరకము తప్పదు. తల్లి భూమి, తండ్రి బీజము. జన్మకు కారణమైన తల్లి, తండ్రి ఇద్దరూ ముఖ్యమే ఎవరిని వదలడము కుదరదు. తడ్రికి కుమారుఘు ప్రతి రూపము కనుక తండ్రి ఆజ్ఞను పరిపాలించిన కుమారుడికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. తపస్సు, ధర్మము, విద్య ఇవన్ని తండ్రికి ప్రతిరూపాలు. తండ్రికి ప్రీతి కలిగే పనులు చేసిన దేవతలు కూడా దీవిస్తారు. ఇక తల్లి వైపు కొయ్య నుండి అగ్ని పుట్టినట్లు, తల్లి గర్భము నుండి కాళ్ళు, చేతులు, తల, ముక్కు, చెవులు మొదలైన అంగములతో కుమారుడు పుడతాడు. కుమారుడికి జన్మ నిచ్చే తల్లి ఎంతో గర్భ క్లేశము అనుభవిస్తుంది. తల్లి తన బాగోగుల కంటే కుమారుల బాగోగులకే ఎక్కువ ముఖ్యత్వము ఇస్తుంది. అందుకే తల్లిని మించిన దైవము లేదు. తండ్రికి బిడ్డను పైపైన చూస్తాడు. కాని తల్లి, బిడ్డల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. కనుక ధర్మశాస్త్రాలు తండ్రి కంటే తల్లికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. కొడుకు బాలుడైనా, ప్రౌఢ వయసులో ఉన్నా, వృద్ధుడైనా తల్లికి కొడుకు మీద ప్రేమ తగ్గదు. కనుక తల్లి ఈ జగతికి మూలాధారము. క్షుద్ర జంతువుకైనా ఉన్నత వంశస్థులకైనా తల్లి ఒకే విధంగా ఉంటుంది. తల్లి ఒడిలో లభించే జీవితము ప్రపంచంలో ఎక్కడా లభించదు. ఎవరికైనా మాతృవియోగం కలిగినప్పుడు అతడు సర్వము కోల్పోయినట్లు బాధపడతాడు. ప్రపంచం అంతా శున్యము అయినట్లు ఉంటుంది. మనసంతా చలించి పోతుంది. ఉన్నవాడైనా, బలవంతుడైనా, బలహీనుడైనా, బుద్ధి ఉన్న వాడైనా, బుద్ధి లేని వాడైనా వీరందరికి తల్లి సంపదతో సమానము. తల్లి జీవించి ఉంటే సకల సంపదలి, సకల సుఖములు ఉన్నట్లే. అటువంటి తల్లిని చంపడం ఎలా చూసినా మహాపాపమే. ఈ విషయము తెలుసుకోవడానికి పెద్ద విద్యలు అవసరం లేదు. పశువుల కాపరికి కూడా ఇది తెలుసు. తల్లిని చంపడానికి మనసెలా వస్తుంది, చేతులెలా వస్తాయి. ఈ విధంగా పరి పరి విధము చిరకారి ఆలోచిస్తున్న తరుణంలో బయటకు వెళ్ళిన మాధాతిధి " అయ్యో ! ఏదో చిన్న తప్పుకు భార్యను చంపమని కుమారుడికి చెప్పి వచ్చాను. నా కుమారుడు తల్లిని చంపడు కదా ! ఎంత తొందర పడ్డాను. అయినా నాకుమారుడు ఏ పనీ ఆలోచించి కాని చెయ్యడు. తల్లిని చంపడు " అని వడి వడిగా ఇంటికి వస్తూ " కుమారా ! నీ తల్లి నిన్ను నవమాసాలు కని పెంచింది. నేను తొందరపడి ఆమెను చంపమని ఆజ్ఞాపించాను. కాని నువ్వు తొందరపడి ఏపని చెయ్యవు అని నాకు తెలుసు " అని అనుకుంటూ ఇల్లు చేరాడు. తండ్రిని చూసి చిరకారి తల్లిని చంపడానికని ఎత్తిన కత్తిని కిందకు పెట్టి తండ్రికి నమస్కరించాడు. అతడి తల్లి కూడా భర్తకు నమస్కరించింది. వారిరువురిని చూసి మేధాతిధి ఆనందబాష్పాలు రాలి వారిద్దరిని దీవించాడు. మేధాతిథి " ఒక కార్యము చెయ్యవలసి వచ్చినప్పుడు ఆలోచించి ధైర్యంగా చెయ్యాలి. అటువంటి వాడిని లోకము ఆర్యుడని అంటుంది. ఆలోచించక తొందరపడి పని చేసే వాడిని లోకము అనార్యుడని అంటుంది. ఒక పని చెయ్యడానికి ముందు ఇతడు మిత్రుడా, శత్రువా, ఇతడు యోగ్యుడా, అయోగ్యుడా అని ఆలోచించి నిర్ణయించే వాడు బుద్ధిమంతుడు. అలాంటి వాడికి సకల శుభములు కలుగుతాయి " అని అన్నాడు మేదాతిథి. కనుక ధర్మనందనా ! ఏ పైని అయినా ఆలోచించి చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి " అని భీష్ముడు అన్నాడు.

శిక్ష[మార్చు]

ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! నాకు శిక్షా విధానము గురించి వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మరాజా ! పూర్వము ద్యుమత్సేనుడు అతడి కుమారుడు సత్యవంతుడు నడుమ జరిగిన సంవాదము గురించి చెప్తాను విను. వారిద్దరు నేరస్తులకు వేయు శిక్షలగురించి చెప్తాను విను. ద్యుమత్సేనుడు :-నేరము చేసిన వారిని వధించడము ధర్మమని పెద్దలు చెప్పారు. సత్యవంతుడు :- హింస కర్మ అయినట్లైతే చేయ కూడాని కర్మ ఉంటుందా ? ద్యుమత్సేనుడు:-దొంగలు, హంతుకుల వంటి వారిని వధించకుంటే లోకంలోని ప్రజలు బాధలు అనుభవించాలి. సత్యవంతుడు :- అందుకు మరణ దండన కంటే వేరు మార్గము లేదా ?

ద్యుమత్సేనుడు:- ఉన్నాయి నేరానికి తగిన శిక్షలు ఉంటాయి. నేరము చేసిన వాడిని చూపులతో చంపడము, పరుషమైన మాటలతో బాధించడం, మందలించడం, ధనరూపము (అపరాధ రూపములో ధనము వసూలు చేయుట) లో శిక్షలు విధించడం, శరీరావయవములు తీసి వేయడము వంటివి జరుగుతాయి. కాని చంపతగిన నేరము చేసినప్పుడు మాత్రము చంపడం తప్ప వేరు మార్గంలేదు. నేరస్థుల ఎడ వీడు నా వాడు, వీడు మిత్రుడు, బంధువు అని పక్షపాతము చూపడము కూడా నేరమే ఔతుంది. శిక్షలు విధించే రాజు ముందుగా తాను నీతి మంతుడుగా ఉండాలి. తన పుత్రులను, మంత్రులను, ఉద్యోగులను నీతి మంతులుగా తీర్చిదిద్దాలి. అప్పుడే అతడు ప్రజాపాలనకు అర్హుడౌతాడు. తన దగ్గరకు వచ్చిన అభియోగాన్ని చక్కగా పరిశీలించాలి. నేరస్థుని పట్ల, బాధితుడి పట్ల మమకారము కాని ద్వేషము కాని లేకుండా సమదృష్టి వహించి తీర్పును చెప్పాలి. మరణదండనకు అర్హుడైనప్పుడు మాత్రమే నేరస్థుడికి మరణ శిక్ష వేయాలి. అలా చేసిన రాజుకు ఏ పాపము అంటదు. మనం రోజూహత్యలు చేయడం చూస్తూనే ఉన్నాము. లోభము చేతగాని కామము చేతగాని మనస్సులో ఏ మాత్రము శంకలేక నేరస్థులు హత్యలుచేస్తున్నారు. అలాటి వారి పట్ల అహింసా వృత్తి వహిస్తే హింస ప్రబలి ప్రజలలో భయాందోళనలు చెల రేగగలవు. అహింస బ్రాహ్మణులకే కాని రాజులకు, క్షత్రియులకు కాదు. రాజు దయా హృదయంతో ప్రజలను కన్నబిడ్డలవలె పాలించాలి, అలాగే దుష్టులను శిక్షించాలి. అప్పుడే ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారు. ఈ విధంగా పాలించడం రాజుకు అహింసా వ్రతము పాటించడమే ! " అని ద్యుమత్సేనుడు తన కుమారుడైన సత్యవంతుడికి బోధించాడు. అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

గృహస్థ ధర్మము సన్యాస ధర్మము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! గృహస్థ ధర్మము, సన్యాస ధర్మము ఈ రెండింటిలో ఆచరించతగిన ధర్మము ఏది ? అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! రెండునూ ఆచరణ యోగ్యములే. ఈ సందర్భంలో నీకు కపిలమహర్షికి ఒక గోవుకూ జరిగిన సంవాదము వినిపిస్తాను. పూర్వకాలంలో కపిలుడు అనే మహాముని ఉన్నాడు. అతడు ఒక ధేనువును చూసి " నీవు వేదస్వరూపవు కదా ! " అని అన్నాడు. అక్కడే అదృశ్యరూపములో ఉన్న స్యూమరశ్మి అనే ముని ఆ మాటలు విన్నాడు. ఆ మాటలతో కపిలుడికి వేదముల మీద గౌరవం లేదని తెలుసుకుని సూక్ష్మరూపంలో ఆ గోవులో ప్రవేశించి కపిలుడితో " మహర్షీ ! యతులు వేదములను డాంబికత్వముకు ప్రతి రూపంగా భావిస్తారు. కాని వేదములు ఆచరించతగినవి, గౌరవించ తగినవి. నీ సంగతి చెప్పు. నీకు వేదములు ఆచరించతగినవి కాదా ! " అని కపిలుడు అడిగాడు. కపిలుడు " ఓ ధేనువా ! నాకు వేదములు అన్న ఆదరము కానీ అనాదరము కాని లేవు. అసలు నీవు నన్ను ఇలా ఎందుకు అడిగావు. నీ మనసు నాకు అవగతము కాకున్నా నాకు తెలిసినంత వరకు చెప్తాను విను. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అను నాలుగు ఆశ్రమధర్మాలు. ఆ మార్గంలో నడచుట సంసారుల కర్తవ్యము. వేదంలో విధించిన విధులను ఆచరించడం మానవుల ధర్మము. కాని యజ్ఞములో హింస మంచిదోచెడ్డదో నాకు చెప్పాలి " అని నువ్వే చెప్పాలి. స్యూమరశ్మి " బ్రహ్మదేవుడు యజ్ఞము కొరకే ధాన్యమును, పశువులను సృష్టించాడు. అదీ కాక స్వయంగా తానే యజ్ఞాలు చేసాడు. ప్రాజ్ఞుడు, అజ్ఞాని ఇద్దరూ స్వర్గ సుఖాలు కోరుకుంటారు. కాని యజ్ఞము చేస్తే తప్ప స్వర్గలోకప్రాప్తి కలుగదు. అమలినమైన గృహస్థ ధర్మము లోనే యజ్ఞములు చేయడానికి వీలు ఔతుంది. అలాంటప్పుడు యజ్ఞము హింస అనుకుంటే ఎలాగ ? " అని ధేనువులో ఉన్న ముని పలికాడు. కపిలుడు " కేవలం ఆత్మ సుఖం కోరుకునే వాడు ఇతరములైన సుఖములకు ఆశపడడు. అతడికి కామము, శోకము, విషయవాంఛ ఉండవు. అటువంటి వాడికి స్వర్గ సుఖములు ఎందుకు? కనుక శాశ్వతమైనమోక్షము కొరకు గృస్థాశ్రమము వదిలి పెడతాడు " అన్నాడు. ధేనువులోని ముని " మహర్షి ! మిగిలిన ఆశ్రమములన్ని గృహస్థాశ్రమాన్ని అనుసరించి వర్ధిల్లుతున్నాయి. గృహస్థు మోక్షముకు అర్హుడు కాడని ఏ శాస్త్రము చెప్ప లేదు. సమస్త ధర్మములకు, సమస్త కార్యములకు గృహస్థ ధర్మము మూలము. దరిద్రులు, సోమరులు చేయవలసిన కర్మలను వదిలి వేస్తారు. దాని వలన వారికి సద్గతి కలుగదు. వేదాధ్యయనము వదిలిన పాపము చుట్టుకుంటుంది. వేదములను విడుచుట ధర్మము కాదు " అని స్యూమరశ్మి చెప్పాడు. కపిలుడు " అయ్యా ! బ్రాహ్మణులు తమ ఆచారవ్యవహారములు పాటించి దేవతలని తృప్తిపరచాలి. బ్రాహ్మణుడు పాటించే ఆచారాలు ఈ విధంగా ఉన్నాయి. సాధకుడు మోక్షప్రాప్తికై శరీరంలోని ద్వారాలను మూసివేస్తాడు. తన ముందు గుట్టగా పడి ఉన్న బంగారాన్ని ముట్టుకోడు. తనను హింసించే వాడిని కూడా చేతితోకొట్టక చేతిని కట్టడిచేస్తాడు. పరస్త్రీలను చేరక ఉపస్థు అనే వాకిలిని మూసివేస్తాడు. కేవలము శరీరము జీవించడానికి మాత్రమే ఆహారంభుజిస్తాడు. అంతే కాని రుచికొరకు ఆహారం తీసుకోడు. అలా ఉదరము అనే ద్వారాన్ని బంధిస్తాడు. ఎప్పుడూ అసత్యము పలుకడు, పరుషముగా మాట్లాడడు, అనవసరమైన వాదనకు దిగడు కనుక అలా నోరు అనే ద్వారాన్ని మూసివేస్తాడు. ఈ నాలుగు ద్వారములను మూసి వేసిన బ్రాహ్మణుడికి తపస్సు, యజ్ఞములు, యాగములు, దానములు, వ్రతములు అవసరంలేదు. అతడికి వేదములతో పనిలేదు. ద్వందాతీతుడు పేరు ప్రతిష్ఠల కొరకు పాకులాడడు. కళ్ళకు కనపడే ప్రకృతిని కనపడని పరమాత్మను సాక్షీభూతంగా చూస్తుంటాడు. అటువంటి వాడు నిజమైన బ్రాహ్మణుడు. అలా కాని వాడు కర్మలు చేస్తూ కర్మలలో మునిగి తేలుతుంటాడు " అని కపిలుడు చెప్పాడు. అప్పుడు స్యూమరశ్మి తన ఉనికిని తెలిపి " కపిలమహర్షి ! నా పేరు స్యూమరశ్మి. ధర్మ సూక్ష్మములను గ్రహించుట కొరకు ఈ ఆవులలో చేరి మాట్లాడాను. అంతే కాని వేరు కాదు. నేను నిన్ను ఆశ్రయించాను. వేదములు ప్రమాణంగా స్వీకరించిన తరువాత వర్ణాశ్రమధర్మాలను పాటించడమో, పరిత్యజించడమో జరగాలి కదా ! వర్ణాశ్రమధర్మాలను ఆచరించ తగినవా కాదా ! " అని అడిగాడు. కపిలుడు " జ్ఞాని అయిన వాడు ఏ పనిచేసినా వాడికి కీడువాటిల్లదు. జ్ఞాని కానివాడు కామానికి కోరికలకు లొంగి కర్మబంధంలో చిక్కుకుంటాడు. అహంకారము, కామము, కోపము లేనివాడు శుభము జరిగినా అశుభము జరిగినా బాధపడడు. త్యాగగుణంతో ఎప్పుడూ ప్రశాంతతో జీవిస్తాడు. మీ మహా ఋషులందరూ జ్ఞానము కలవారే. కాని మీలో ఏ ఒక్కరికో ఏకాత్మ భావన కలుగుతుంది. అలాంటి వాడికి సందేహాలు, కర్మబంధాలు ఉండవు. స్యూమరశ్మి " మహాత్మా ! వేదములు శాస్త్రములు చూపిన దోవనువదలడం వలన మోక్షము రాదు. వేదములు నమ్మకపోవడం వలన కీడు జరుగుతుంది అని తెలుసుకున్నాను. నా సందేహము తీర్చండి " అని అడిగాడు. కపిలుడు " శబ్ధబ్రహ్మము, పరబ్రహ్మము అని రెండు. శబ్ధబ్రహ్మమును ఆరాధించిన వాడు పరబ్రహ్మమును పొందుతాడు. అసూయ లేని, శమము, దమము, ఆత్మజ్ఞానము కల వాడు వేదములలో చెప్పబడిన ఆచార వ్యవహారాలను శ్రద్ధగా ఆచరిస్తాడు. అటువంటి గృహస్థు సాటి జీవుల ఎడ దయ కలిగి ఉంటాడు. అతడికి స్వాతిశయము, అహంకారము మచ్చుకైనా ఉండవు. శాంత స్వరూపులైన బ్రాహ్మణులు, క్షత్రియులు గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షము పొందుతారు. జ్ఞానము ధర్మముకు అధిష్టానము, పరమ సంతోషము ధర్మానికి మూలము, త్యాగము దాని రూపము. కనుక నాలుగు ఆశ్రమాలు ఆచరించ తగినవే. ప్రశాంతమనస్కులు నిరంతర ఆనందం అనుభవిస్తారు. వేదమును చదివినంతనే ప్రయోజనము చేకూరదు. వేదతత్వమును గ్రహించి ఆచరించిన కాని ఫలితము సిద్ధించదు. వేదము చదువునప్పుడు అర్ధము అయినట్లు కనిపించినా వేదము అర్ధము గ్రహించుట కష్ట తరము. మోక్షముకు మూడే మార్గాలు మొదటిది కర్మ ఫలత్యాగము, రెండవది ఇంద్రియ నిగ్రహము, మూడవది శాశ్వతానందము. ఇవి ఒక దాని కంటే ఒకటిగొప్పది " అని చెప్పాడు కపిలుడు. కపిలుని స్యూమరశ్మి ఎంతో ప్రశంసించాడు. ధర్మనందనా ! ఈ సంవాదంలో సూక్ష్మము గ్రహించి నడుచుకో " అన్నాడు భీష్ముడు.

ధర్మము అర్ధము కామము[మార్చు]

ధర్మరాజు భీష్ముడిని " పితామహా ! ధర్మము, అర్ధము, కామములలో ఏది ఉత్తమమైనది ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు కండధారుని చరిత్ర చెప్తాను విను. ఒక బ్రాహ్మణుడు యజ్ఞము చేయ తలపెట్టాడు. కాని అతడి వద్ద ధనము లేదు అందుకని అతడు ధనము కొరకు తపస్సు చేయసాగాడు. అప్పుడు కండధారుడు అతడి వద్దకు వచ్చి " విప్రుడా ! నీ కోరిక ఏమిటి అని అడిగాడు ? " ఆ విప్రుడు కండధారుడిని " దేవా ! నాకు ధనము కావాలి " అని అడిగాడు. కండధారుడు దేవతల అనుచరుడూ కుబేరుడి అనుచరుడైన మణిబద్రుడు అనే వాడిని తలచుకుని ప్రత్యక్షం చేసుకుని " మణిభద్రా ! ఇతడికి కావలసిన ధనము ఇమ్ము " అన్నాడు. మణిభద్రుడు " అలాగే ఎంత ధనము కావాలన్నా ఇస్తాను " అన్నాడు. అప్పుడు కండధారుడికి ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడో ఒక సారి చనిపోకతప్పదు. కనుక ఇతడికి ధనముతో పనిఏమిటి ? ఇతడి బుద్ధిని చక్కని మార్గమున పెట్టిన సంపదలు ఇతడి వద్దకు వచ్చిచేరుతాయి. అని అనుకుని ఆ విషయము మణిభద్రుడికి చెప్పాడు. ఆ ఆలోచనకు మణిభద్రుడు కూడా సంతోషించాడు. కండధారుడు ఆ విప్రుని ధర్మమార్గమున పెట్టమని దేవతలను ప్రార్థించాడు. అప్పుడు ఆ విప్రునికి తపమాచరించవలెనన్న సంకల్పము కలిగి కండధారుడితో " ఓ మహాత్మా ! నేను ఇప్పటి వరకు నిన్ను ధనము అడిగాను. కాని ఇప్పుడు నీ దయ వలన నా మనస్సు తపస్సు మీదకు మరలింది. కనుక నాకు ఇక ధనము అక్కర లేదు. నాకు తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇవ్వు " అని ప్రార్ధంచాడు. కండధారుడు ఆ బ్రాహ్మణుడికి తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇచ్చి వెళ్ళాడు. తరువాత ఘోరతపమాచరించిన బ్రాహ్మణుడు తన శరీరమును, మనస్సును, మానవత్వము వదిలి దివ్యత్వము పొంది దివ్య శక్తులను పొందాడు. అతడు మనసులో ఇప్పుడిక నేను కోరిన వారికి ధనము ఇవ్వగలను. అప్పుడు విప్రుడు కుండధారుడిని తలచుకుని ప్రత్యక్షము చేసుకుని తపోమహిమతో గంధము, పూలు సృష్టించి కుండధారుడిని పూజించాడు. కుండధారుడు " విప్రోత్తమా ! నీవు నిరంతరము ధర్మాన్ని ఆశ్రయించి, యోగాభ్యాసము చేసి, ఆత్మను అను సంధానము చేసి తరించు " అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి పోయాడు.

అహింస[మార్చు]

ధర్మనందనా ! బ్రాహ్మణుడి కథ విన్నావు కదా నీకిక అహింసావ్రతము గురించి చెప్తాను విను. ఒక బ్రాహ్మణుడు అడవిలో ఆశ్రమము నిర్మించుకుని భార్యతో జీవించ సాగాడు. అతడు పొలములో రాలినగింజలను ఏరుకుని జీవనము సాగిస్తున్నాడు. అతడు అహింసావ్రతము ఆచరిస్తూ యజ్ఞములో ఫలములను హవిస్సుగా సమర్పించ సాగాడు. అది వేదవిహిత మార్గము కాదని తెలిసి అతడి శాపానికి భయపడి భార్య ఎదురుచెప్పక ఊరకున్నది. ఇంద్రాది దేవతలు హవిస్సును స్వీకరించ లేదు. అక్కడకు ఒక జింక వచ్చి విషయము తెలిసి చెప్పలేదని మునిపత్నిని నిందించి తనను చంపి ఆ మాంసముతో దేవతలకు హవిస్సులు ఇవ్వమని కోరింది. అందుకు ఆ బ్రాహ్మణుడు అందుకు అంగీకరించ లేదు. ఆ జింక కొంత దూరము పోయి తిరిగి వచ్చి " ఓ విప్రోత్తమా ! నీకు నేను దివ్యదృష్టి ఇచ్చాను నీ కొరకు ఎవరు వచ్చారో చూడు " అన్నాడు. ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో చూసి అక్కడ ఉన్న అప్సరసలను, గంధర్వులను చూసి ఆ జింక చెప్పినట్లు దానిని హింసించడానికి పూనుకున్నాడు. అంతటితో అతడి తపస్సు భగ్నమైంది. ఆ జింక ఒక దేవతాస్వరూపము దాల్చి " విప్రోత్తమా ! నేను ధర్మదేవతను నిన్ను పరీక్షించడానికి ఇక్కడకు వచ్చాడు. నీకు ఒక ధర్మసూక్ష్మము చెప్తాను విను. అహింస మహాపాపము. కాని అవసరమైన చోట జీవహింస చేసినా అది ధర్మమే ఔతుంది. యజ్ఞము కొరకు కూడా అనవసర జీవహింస చేయకూడదు. నీవు జీవులను బలి ఇవ్వకుండానే నీ యజ్ఞము పూర్తి అయ్యేలా అనుగ్రహిస్తాను " అని చెప్పి వెళ్ళింది.

పాపకార్యముల నుండి విముక్తి[మార్చు]

ధర్మరాజు భీష్ముడిని " పితామహా ! పురుషుడు పాపకార్యము చేయడానికి కారణమేమిటి ? ధర్మకార్యాలు చేయడానికి కారణమేమిటి ? పాపకార్యముల నుండి, పుణ్య కార్యముల నుండి ఎలా విముక్తి చెందుతాడు " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మానవుడు ఇంద్రియములతో గంధము, రసము మొదలైన వాటిని ఆస్వాదించి లోభము మోహములకు లోనౌతాడు. ఆ కారణంగా అధర్మముగా ప్రవర్తిస్తాడు. అందు వలన పాపకార్యములు చేసి పాపము మూట కట్టుకుంటాడు. ఈ విషయము ముందే గ్రహించి మనసును విషయముల నుండి మరలించి సజ్జన సాంగత్యము చేసిన ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఆ తరువాత పాపచింత తొలగి ధర్మాచరణ అందు ఆసక్తి కలిగి ఆ తరువాత ముక్తి పొందుతాడు " అని భీష్ముడు చెప్పగానే ధర్మరాజు " పితామహా ! మీరు క్లుప్తంగా చెప్తే నేను గ్రహించ లేకున్నాను. కనుక వివరించండి అన్నాడు. భీష్ముడు " ధర్మనందనా ! కుండలు చేయడానికి కుమ్మరికి కుండలు చేసే నేర్పరి తనము, కుమ్మరి సారె, మెత్తటి మట్టికావాలి. కనుక ఏపనికైనా నేర్పరితనం అవసరం. ధర్మనందనా ! కోపము, క్షమాగుణము తోను, కోరికలు లేక పోవడము, సత్వగుణాన్ని పెంపొందించుకొనడము, మితనిద్ర, ధైర్యము, రాగద్వేషములను వదులి జాగరూకతతో భయాన్ని వదిలి, అభ్యాసముతో వస్తువుల మీద వ్యామోహం భ్రాంతినివదిలి, మితాహారంతో రోగములను అధిగమించి, శబ్ధ, రూప, రస, గంధములు నిస్సారమని గ్రహించి తృప్తిగా జీవించి లోభత్వమును, దయాగుణము చేత ధర్మాన్ని, విచక్షణా జ్ఞానంతో కర్మలను అరికట్టాలి. పై గుణాలతో కామక్రోధములను జయించి కడు నేర్పుతో ముక్తిని సాధించాలి.

ఆశ[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ఈ మహాభారతయుద్ధములో అన్నలను తమ్ములను, బంధువులను, స్నేహితులను చంపుకోవడము కేవలం ఆశ తోడనే కదా ! మరి ఈ ఆశను తొలగించే ఉపాయము చెప్పండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మాండవ్యముని జనకుడితో చెప్పినది వింటే నీకు అది అవగతమౌతుంది. ఒక సారి మాండవ్యుడనే ముని జనకుడి వద్దకు వచ్చి " మహారాజా ! నా లోని ఆశ చావడానికి నన్ను శిక్షించండి " అని అడిగాడు. జనక మహారాజు " మునీంద్రా ! నీకు ఉన్న సంపదలు నీకు దుఃఖమును దోషమును తెచ్చి పెడతాయి. మనకు ఆశ లేకున్న దుఃఖములు, దోషములు దరి చేరవు. అందుకే మిధిలానగరం తగలబడుతున్నా నాకు ఏమీ జరగనట్లే ఉంటుంది. కామసంబంధిత సుఖము ఏదైనా ఆశను, కోరికను విడిచిన తరువాత వచ్చే ఆత్మసుఖముకు సరికాదు. ఆవుకు కొమ్ములు పెరుగుతున్న చందాన మనలో ఆశా దినదిన ప్రవర్ధమానం ఔతుంది. ఆశామోహములు నా ఇల్లు, నా వాళ్ళు, నా ధనము, నా బంధువులు అనే భావములు కలిగిస్తాయి ఆశామోహాలు విడిచిన ఆశ ఆవిరి అయి ఇంకి పోయి జ్ఞానజ్యోతి వెలుగుతుంది. ఓ మునీంద్రా ! దొరికిన దానిని అనుభవిస్తూ దొరకని దానికి చింతించక ప్రశాంతచిత్తంతో ఉంటే అతడి మనసులోకి ఆశ ప్రవేశించదు. ఈ ఆశను దుర్మార్గులు విడువలేరు. ఈ ఆశకు ముసలితనము, రోగము, చావు లేదు కానీ అది మనిషి ప్రాణంతీస్తుంది. ఆశను జయించిన వాడు ఆనందము పొందుతాడు కనుక మునీంద్రా ! నీవు, సుఖములు, దుఃఖములు అనే ద్వంద్వములకు లోనుకావద్దు. అంతఃకరణలో శాంతిపొందు. అదే నీకు అఖండశాంతిని ఇస్తుంది. అని జనకుడు చెప్పాడు " కనుక ధర్మనందనా ! నీ ప్రశ్నకు జనకుడి మాటలే సమాధానము అని భీష్ముడు చెప్పాడు.

అవసాన కాలము[మార్చు]

ధర్మరాజుభీష్ముడిని " పితామహా ! మానవుడికి అవసాన కాలము ముంచుకుని వస్తున్నప్పుడు అతడు దేనిని ఆచరించాలి. ఈ విషయము ఇదివరకే మీరు నాకు చెప్పారు. కాని వివరంగా వినవలెనన్న కోరిక కలుగుతుంది " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఒక బ్రాహ్మణుడికి మేధావి అనే కుమారుడు ఉన్నాడు. అతడికి అపరిమితమైన మేధాసంపత్తి ఉంది. ఒక రోజు మేధావి తన తడ్రితో " తండ్రీ ! మనిషికి దినదినము ఆయువు తరిగిపోతున్నప్పుడు అతడేమి చేయాలి ? " అని అడిగాడు. బ్రాహ్మణుడు " కుమారా ! ప్రతిపురుషుడు తన జీవితంలో బ్రహ్మచర్యము, వేదాభ్యాసము, వివాహము, సంతానము పొందడము, ధనసంపాదన, యజ్ఞయాగములు చెయ్యడము తరువాత వానప్రస్థము గడిపి ఆ పిదప సన్యాసం స్వీకరించడం ఇంతకన్నా ఏమి చేయగలడు " అని చెప్పాడు. అందుకు మేధావి " మానవునికి పుట్టినది మొదలు ముసలితనము మరణము వెంటాడుతుంటాయి కదా ! అది ఎరుగక తీరికగా వర్ణాశ్రమధర్మాలు ఆచరించడం ధర్మమా ! మనముచేయవలసిన ధర్మకార్యాలు వెంట వెంటనే చేయకున్న మరణం మన కొరకు ఆగదు కదా ! ఇది చేయతగిన పని, చేయకూడని పని ఆలోచిస్తూ ఉన్న యముడు తరుణం చూసి తనవైపు లాగక ఊరక ఉంటాడా ! తండ్రీ ! మృత్యువు అమృతము రెండు మనలోనే ఉన్నాయి. మనలోని మోహమే మృత్యువు, మనలోని తత్వ విచారమే అమృతము. తండ్రీ ! జీవహింస చేసే యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞము మేలు కదా ! కనుక నేను అహింసాయుతమైన కర్మయజ్ఞము చేస్తాను. యోగమార్గావలంబన, తపస్సు, కర్మఫలములను విడుచుట కాక వేరు కర్మలు మనకు హితము కలిగిస్తాయా ! అంతా మనకే కావాలి అన్న అత్యాశ దుఃఖాన్ని కలిగిస్తుంది. విషయ సుఖములను త్యాగము చెయ్యడానికి మించిన సుఖము ఉంటుందా ! నీవు విషయ వాంఛలు శాశ్వతము కాదని తెలుసుకో. నీవు మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఆత్మ పరిశీలన చేసుకో " అని కుమారుడు చెప్పాడు. ఆమాటలకు ఆ బ్రాహ్మణుడు ఆనందిం, చి దానిని ఆచరించి ముక్తి పొందాడు. ధర్మనందనా ! మేధావి మాటలలోని అంతరార్ధము గ్రహించిన నీకు సమాధానము దొరుకుతుంది " అని చెప్పాడు.

బ్రహ్మపదము హరిత గీత[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ఎటువంటి శీలము కలవాడు బ్రహ్మపదము పొందుతాడు " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మితంగా ఆహారం తీసుకుంటూ ఇంద్రియ సుఖములను త్యజించి మోక్షము కొరకు ప్రయత్నించాలి. ఈ సందర్భంలో నీకు హరిత గీత చెప్తాను. పూర్వము హరితుడు అనే మహాముని కొంత మంది పండితులకు ఇలా బోధించాడు. సాధకుడైన వాడు నిష్ఠతో ఇల్లు వదలాలి. కోరికలకు దూరంగా ఉండాలి. త్రికరణ శుద్ధిగా పరులకు కీడి చెయ్యకూడదు. అందరి పట్ల సమదృష్టి కలిగి ఉండాలి. పొగడ్తలకు పొంగడము, నిందకు కుంగడము ఉండ కూడదు. నివాసగృహాలను త్యజించి దేవాలయములో నిద్రించాలి, అడవులలో ఉన్న్ప్పుడు కొండగుహలలో తలదాచు కోవాలి. భోజన సమయంలో మాత్రమే భిక్షాటన చేయాలి. తనకు కావలసిన దాబ్నికంటే ఎక్కువ తీసుకొనక సున్నితంగా తిరస్కరించాలి. ఎల్లప్పుడూ ఆత్మాను రక్తుడై ఉండాలి. ఇలాంటి వాడికి మోక్షము కరతలామలకము " అని చెప్పాడు.

వృత్త గీత[మార్చు]

ధర్మరాజు " పితామహా ! నేను క్షత్రియుడిని పైగా చక్రవర్తిని, ఇంద్రియములను జయించి రాజసము వదిలి త్రిగుణములను వదిలి శాంతి సుఖము ఎప్పుడు పొందుతానో కదా ! " అని ధర్మరాజు ఆవేదన చెందాడు. దేవాసుర యుద్ధములో వృత్తాసురుడనే రాక్షసుడు పడి పోయాడు. అప్పుడు రాక్షసులు అతడిని సురక్షిత స్థావరానికి తీసుకు వెళ్ళారు. కాని వృత్తాసురుడి మొహంలో విషాదఛాయలు కనిపించక నిర్మలంగా ఉన్నాదు. అప్పుడు రాక్షస గురువైన శుక్రుడు " వృత్తా ! శత్రువులు నీ రాజ్యము, సంపదలు అపహరించారు కదా ! నీకు ఏమాత్రము దుఃఖము కలుగక పోవడానికి కారణం ఏమిటి ? " అని అడిగాడు. వృత్తాసురుడు " కలిమి లేములు కాలవశాత్తు వస్తుంటాయి పోతుంటాయి. అజ్ఞానులు మాత్రమే కలిమి ఉన్నప్పుడు దర్పము, పోయినప్పుడు దైన్యము అనుభవిస్తుంటారు. సంపదలు అశాశ్వతము అని తెలిసిన వాడు సంపదలు ఉన్నా పోయినా బాధపడక నిర్మల మనస్కుడై ఉంటాడు. లోకం లోని ప్రాణులన్నీ కర్మవశాన దేవతలు గాను, మనుష్యుల గాను, జంతువులు గాను జన్మలు ఎత్తుతూ మరణిస్తూ ఉంటారు. ఈ విషయము నాకు తెలుసు కనుక నేను ఎందుకూ బాధ పడను " అని అన్నాడు వృత్తుడు. శుక్రాచార్యుడు వృత్తుని గురించి మనశుద్ధి తెలుసుకోవాలని " ఓ వృత్తాసురా ! నీవు రాక్షసరాజువు నీవు ఇంత విరక్తిగా పడడము తగదు " అని అతడిని రెచ్చగొట్టాడు. వృత్తుడు చలించక " గురుదేవా ! పూర్వము నేను పూర్వము దేవతలను జయించాలని ఘోరమైన తపస్సు చేసి విజయము సాధించి ముల్లోకాలు జయించి సమస్త సంపదలు అనుభవించాను. ఏదో పాపం చేసాను కనుక అవన్నీ ఇప్పుడు పోయాయి. ఇప్పుడిక దుఃఖించడం ఎందుకు. ఇక నేను సుకృత దుష్కృతముల జోలికి పోకుండా తటస్థుడనై నిర్మలచిత్తుడనై విష్ణువును పూజిస్తాను. నేను ఇంద్రుడితో యుద్ధము చేసే సమయంలో అతడి పక్కన విష్ణుమూర్తిని చూసి అతడి మహత్యానికి ఆశ్చర్య పోయాను. గురువర్యా ! నాకు విష్ణువు మహిమ గురించి వివరించండి " అని అడిగాడు. అలాగే చెప్పబోతున్న సమయంలో అక్కడకు వచ్చిన సనత్కుమారుడిని చూసి శుక్రాచార్యుడు " ఋషివర్యా ! ఈ దానవేంద్రుడికి విష్ణుమహిమ గురించి వివరించండి " అని అడిగాడు. సనత్కుమారుడు " సర్వవ్యాపి అయిన విష్ణువుకు భూమియే పాదాలు, ఆకాశమే తల, దిక్కులే భుజాలు అలా విష్ణువు సర్వదేవమయుడై సర్వవ్యాప్తుడై ఉన్నాడు. ఈ చరాచర జూవులను సృష్టించడం, పోషించడం, చంపడం ఆయన లీలామాత్రంగా చేస్తుంటాడు. మానవుని జీవితంలో అనేక వర్ణములుగా వస్తుంటాయి. పూర్వజన్మ కర్మవిశేషము చేత అనేక వర్ణములలో ఫలితము అనుభవిస్తుంటాడు. ఇలా జననమరణ చక్రంలో చిక్కుకుని నిరంతరము జీవుడు పరిభ్రమిస్తుంటాడు. జీవుడు ఉత్తముడు, అధముడు, మధ్యముడు అను మూడు విధములైన జన్మ ఎత్తుతుంటాడు. దేవతాజన్మ ఉత్తమం, మానవజన్మ మధ్యమం, పశుపక్ష్యాదుల జన్మ అధమం. ఈ జన్మలో ఒకరికి ఉపకారము చేసిన వాడికి మరుజన్మలో ఉత్తమమైన జన్మ లభిస్తుంది. ఈ జన్మలో పరులకు అపకారం చేసిన వాడికి మరు జన్మలో అధమ జన్మ లభిస్తుంది. పుణ్యకార్యాచరణతో జీవుడు మాలిన్యము వదిలి పవిత్రుడౌతాడు. ఎన్ని ఎక్కువ పుణ్య కార్యాలు చేస్తే అంత మంచి జన్మ లభిస్తుంది. అప్పుడు అతడు దుఃఖము వదిలి నిర్మలానందాన్ని పొందుతాడు. ఏ జీవుడు సదా తెల్లనివర్ణమును మనసున తలుస్తుస్తాడో అప్పుడు అతడికి విష్ణు భావన కలుగుతుంది " అన్నాడు సనత్కుమారుడు. అమృతోపమాయమైన ఆమాటలు విన్న వృత్తుడు శుద్ధమనస్కుడై విష్ణుసాయుజ్యం పొందాడు.

ఇంద్రుడు వృత్తాసురల మధ్య యుద్ధము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! వృత్తుడు ఇంతటి విష్ణుభక్తుడు కదా అతడికి ఇంద్రుడితో యుద్ధము ఎంద్సుకు సంభవించింది " అని అడిగాడు. భీష్ముడు" ఇంద్రుడు అపారమైన దేవసేనతో రాక్షసరాజు వృత్తాసురుడి మీదకు వెళ్ళి రాక్షససైన్యాలను చూసి జంకుతూ రాక్షసరాజైన వృత్తుడితో తలపడ్డాడు. పర్వతాకారంతో యుద్ధము చేస్తున్న వృత్తుడిని చూసి ఇంద్రుడికి వణుకు పుట్టింది. వృత్తుడు ఇంద్రుడిని మూర్ఛిల్లజేసాడు. అప్పుడు వశిష్ఠుడు తన తపో మహిమతో ఇంద్రుడి మూర్ఛ నుండి కోలుకునేలా చేసి తిరిగి యుద్ధానికి పురికొల్పాడు. దేవగురువైన బృహస్పతి ఇంద్రుడికి విజయం కలిగించమని ఈశ్వరుడిని ప్రార్థించాడు. ఈశ్వరశక్తి ఇంద్రుడిలో ప్రవేశించింది. వృత్తుడిని చంపడానికి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఎత్తగానే విష్ణువు ఆ వజ్రాయుధంలో ప్రవేశించాడు. అప్పుడు శివుడు " ఇంద్రా ! ఈ వృత్తుడు 60,000 దివ్య సంవత్సరములు బ్రహ్మ గురించి తపస్సు చేసాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ వృత్తుడికి మహోగ్రమైన బలాన్ని ప్రసాదించాడు. ఆ బలాన్ని నేను నా తేజముతో నాశనం చేస్తాను. అనగానే ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టి పడగొట్టాడు. దేవతలు తూర్యనాదములతో, విజయఘోషతో ఇంద్రుడిని పొగిడారు. వజ్రాయుధపు ఘాతముతో విష్ణువు వృత్తునిలో ప్రవేశించాడు. విష్ణుస్పర్శ తగలగానే వృత్తుడు మాలిన్యము తొలిగి పునీతుడయ్యాడు. ఇంద్రుడు శివుడికి నమస్కరించి " శంకరా నీ దయతో కదా నేను ఈ విజయము సాధించాను " అని స్వర్గానికి వెళ్ళాడు.

బ్రహ్మహత్యా పాతకము[మార్చు]

స్వర్గానికి వెళ్ళిన ఇంద్రుడికి మనశ్శాంతి లోపించింది. అతడికి బ్రహ్మహత్యాపాతక భయముపట్టుకుంది. ఇంద్రాది దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి తరుణోపాయము చెప్పమని అడిగాడు. బ్రహ్మ ఆ పాపమును అందరికి పంచి విముక్తి పొందమని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకమును పంచి ఇవ్వడానికి అగ్నిని, గడ్డిని, ఓషధులను చెట్లను, జలమును, స్త్రీలను పిలిచి బ్రహ్మహత్యాపాతకమును పంచుకొమ్మని ఆజ్ఞాపించాడు. అందుకు వారు భయముతో అంగీకరించారు. ప్రతిగా ఇంద్రుడు వారికి కోరికలను ప్రసాదిస్తూ చెట్లను తుంచిన వాడికి నరికిన వాడికి, అగ్నిని ప్రజ్వలింపచేయక హవిస్సులను వేసినవాడికి, జలములో మల మూత్రములను విడిచిన వాడికి, నదిలో ఉమ్మి వేసిన వాడికి, బహిష్టు సమయంలో స్త్రీని చేరిన వాడికి బ్రహ్మహత్యాపాతకము చుట్టుకుంటుందని వరమిచ్చాడు. ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకము నుండి విముక్తుడయ్యాడు. ఇంద్రుడు బ్రహ్మ అనుమతితో అశ్వమేధయాగము చేసి స్వర్గాన్నిపాలించసాగాడు. వృత్తుడి శరీరము నుండి కారిన రక్తము పుట్టగొడుగులుగా మారాయి. కనుక బ్రాహ్మణులు పుట్టగొడుగులను ఆహారముగా స్వీకరించరు " అని చెప్పి భీష్ముడు " ధర్మనందనా ! నీవు కూడా ఇంద్రుడిలా శత్రువులను జయించి కీర్తిని పొందు " అని చెప్పాడు.

జ్వరము[మార్చు]

దక్ష యాగ విధ్వంసం

ధర్మరాజు సందేహంతో " పితామహా ! వృత్తుడికి జ్వరము వచ్చిందని విన్నాను. వృత్తాసురుడికి ఆజ్వరము వచ్చింది " అని అడిగాడు. భీష్ముడు " ధర్మరాజా ! వెండి కొండ మీద పార్వతీ సమేతంగా పరమశివుడు, దేవతలు, మునులు, యక్షులు మొదలగు వారు సేవిస్తుండగా కొలువు తీరి ఉన్నాడు. అప్పుడు సతీదేవి భర్తను చూసి నాధా ! వీరంతా ఎక్కడికి పోతున్నారు " అని అడిగింది. శివుడు " దేవీ ! దక్షుడు చేయు యాగములో తమ తమ హవిర్భాగములు తీసుకొనుటకు వెడుతున్నారు " అన్నాడు. సతీదేవి " నాధా ! మీరు ఎందుకు పోవడము లేదు మీ హవిర్భాగము మీరూ పొందాలి కదా ! " అని అడిగింది. శివుడు " దేవీ ! దక్షుడు నన్ను యాగముకు పిలువ లేదు. నాకు హవిర్భాగమునూ ఏర్పరచ లేదు. అందుకని నేను వెళ్ళ లేదు " అని చెప్పాడు. ఆ మాటలకు కోపించిన సతీదేవి కోపమును నిగ్రహించుకుని మౌనంగా ఊగిపోయింది. భార్య అంతర్యము గ్రహించిన శివుడు తన ప్రమధ గణములతో పోయి దక్షుడి యజ్ఞమును నాశనం చేసాడు. యజ్ఞమునకు విచ్చేసిన దేవతలు, మునులు, యక్షులు తొక దిక్కుకు పారి పోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు " పరమశివా ! నీకు ఈ యాగములో హవిర్భాగము కల్పిస్తాము శాంతించు " అన్నాడు. ఆ మాటలకు శివుడు శాంతించాడు. బ్రహ్మదేవుడు " పరమేశ్వరా ! నీ నుదుటి నుండి పుట్టిన స్వేదము నుండి ఒక పురుషుడు ఉద్భవించాడు. అతడు జ్వరము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు. అతడు జీవులను ఆవహిస్తాడు. అతడు ఏకరూపములో ఉంటే ప్రజలుభరించ లేరు కనుక అతడికి వివిధ రూపాలను ప్రసాదించండి " అని అడిగాడు. అప్పుడు శివుడు జ్వరాన్ని ఏనుగులకు తలనొప్పిలాగా, పాముకు కుబుసంగా, గోవులకు పాదాల నొప్పిగా, లేళ్ళకు తన రూపము తాము చూడడానికి నిరోధంగా, గుర్రములకు పార్శపు నొప్పిగా, నెమళ్ళకు ఈకలు రాలునట్లుగా, కోకిలలకు కళ్ళ వ్యాధిగా, చిలుకలకు ఎక్కిళ్ళుగా, మేకలకు కంగారుతనంగా, పులులకు అలసటగా, మనుష్యులకు చావు పుట్టులకు కలిగే వ్యాధిగా విభజిస్తున్నాను " అని చెప్పాడు.

ఆచరించవలసిన కర్మలు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! శాస్త్ర తత్వము తెలిసిన వాడికి అనుమానాలు అధికము. పరమాత్మ గురించి ఎవరికి తెలియదు. అలాంటి వాడు ఎలాంటి కర్మలు ఆచరించాలి " అని అడిగాడు. భీష్ముడు ధర్మరాజా ! గురుపూజ, వేదాధ్యయనము, వృద్ధులకు సేవ చెయ్యడము చేయవలసిన సత్కర్మలు. నారదుడు ఈ విషయము ఒక సారి గాలవుడికి చెప్పాడు. ఒక సారి గాలవుడు నారదుడి వద్దకు వచ్చి " మునీంద్రా ! నేను చాలా శాస్త్రములు అధ్యయనము చేసాను. కాని నా మనసులో ఏదోవెలితి ఉంది నాకు సంపూర్ణజ్ఞానము ప్రసాదించండి " అని అడిగాడు. బదులుగా " నారదుడు గాలవా ! మానవుడు ముందు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పాపకర్మలను అన్నింటినీ వదిలి పుణ్యకర్మాచరణ చేయాలి. మనసు పరిశుద్ధం చేయాలి. సమస్తప్రాణుల పట్ల దయకలిగి ఉండాలి. సజ్జనసాంగత్యము చేయాలి, ఎప్పుడూ మధురంగా సౌమ్యంగా మాట్లాడాలి. దేవతలను, పితృదేవతలను ఆరాధించాలి. అహంకారమును వదిలి పెట్టాలి. ఏ వస్తువు కొరకు ఎవరిని యాచించకూడదు. ఇంద్రియ నిగ్రహము కావాలి. విషయ వాంఛలకు దూరంగా ఉండాలి. పరనింద, ఆత్మపొగడ్త మాని వేయాలి. సోమరితనము, అధిక ప్రసగం, మాత్సర్యం, కోపము ఉండకూడదు. ఎల్లప్పుడూ అతిథి సత్కారం చెయ్యాలి. వేదాధ్యయనము, వేదాంగచర్చలు, యజ్ఞయాగములు, బ్రాహ్మణ సన్మానము జరిగే ప్రదేశములలో నివసించాలి. ఇలాంటి ఋజువర్తనుడికి సకల దోషములు తొలగి జ్ఞానోదయం ఔతుంది " అని నారదుడు గాలవుడికి వివరించాడు " అని భీష్ముడు చెప్పాడు.

కాలపాశము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! కాలము అవిచ్ఛన్నము కదా ! నా బోటి వాడు ఈ కాలపాశమును ఎలా ఛేదించగలడు ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ విషయము పూర్వము సగరమహారాజు అరిష్టనేమి అనే మునిని అడిగాడు. ఆముని చెప్పిన మాటలు నేను నీకు చెప్తాను " మహారాజా ! మానవుడు ఎప్పుడూ భార్య, బిడ్డలు, ధనము, ధాన్యము, పశువులు మొదలైన వ్యామోహములో పడి తన మనసును వ్యాకుల పరచుకుంటూ ఉంటాడు. అటువంటి వాడికి మోక్షము దుర్లభము. వయసు ముదురిన తరువాత అయినా భార్యను వదిలి ఏకాంత ప్రదేశముకు పోవాలి. ప్రశాంతమైన ఏకాంత ప్రదేశముకు పోవాలి. అతడికి పుత్రులు ఉన్నా వారిని వదిలి వెళ్ళాలి. అప్పుడే అతడికి వైరాగ్యము శాంతి కలుగుతాయి. కాని ఈ సంసార లంపటంలో ఉన్నవాడు " అయ్యో ! నేను లేకపోయిన వీరు ఏమై పోతారు ? ఎలా బ్రతుకుతారు ? అని వాళ్ళకు సేవలు చేస్తూ చస్తాడు. అప్పుడు బంధుమిత్రులు ఎవరూ అతడిని ఆదుకొన లేరు. ఈ విషయాన్ని గ్రహించి ముందే వైరాగ్యము అలవరచు కోవాలి. అతడి సేవలను అందుకున్న బంధుమిత్రులు అతడికి ముక్తి కలిగించ లేరు కనుక ముందే ఆ విషయము గ్రహించి సంసారం నుండి బయటపడి జ్ఞానసముపార్జన చేయాలి . ప్రతిరోజూ ఎందరో పుట్టడము మరణించడమూ కళ్ళారా చూస్తున్నాము. చచ్చేవాడు ఏదీ పట్టుకు పోడని గ్రహిస్తే ఏదీశాశ్వతం కాదని అనుభవంలోకి వచ్చి ముక్తిమార్గంలోకి ప్రవేశిస్తాడు. అలాకాక ఈ సంసార లంపటంలో కొట్టిమిట్టాడే వాడు ఎన్నటికీ ముక్తిమార్గము చేరలేడు. మానవుడు ఈ ద్వందాల నుండి బయటపడి మృష్టాన్నము పచ్చడి మెతుకులు, కటికనేల మృదువైన పట్టు పరుపులను, జింకచర్మమును చీనీ చీనాంబరములను, సమదృష్టితో చూడాలి. అటువంటి వాడికి ముక్తి సులువుగా లభిస్తుంది. ఎంతో మంది చక్రవర్తులు ఈ భూమండలాన్ని పాలించారు. వారంతా కాలగర్భంలో కలిసి పోతూ పూచికపుల్ల కూడా తీసుకు పోలేదు. ఈ విషయము గ్రహించిన సాధకుడు మోక్షము పొందుతాడు. ధసంపాదన కష్టము కాని దుఃఖములు మాత్రము అవలీలగా చుట్టుముట్టుతాయి. ఈ విషయము తెలుసుకున్న వాడు తిరిగి జననమరణ ఉచ్చులో పడక మోక్షముకొరకు ప్రయత్నిస్తాడు. కనుక మహారాజా ! నీవు గృహస్థాశ్రమంలో ఉన్నా తామరాకు వలె నీటి బొట్టులా అంటీ ముట్టనట్లు ఉండు. అహంకారము లేక మమతలను మమకారములను వదిలిన మోక్షప్రాప్తి నీకు సులువౌతుంది " అని అరిష్టనేమి బోధించాడు " అని చెప్పిన భీష్ముడు " ధర్మనందనా ! నీ ప్రశ్నకు సమాధానము లభించింది కదా " అన్నాడు.

దానవులు శుక్రాచార్యుడు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! దానవులు ధర్మద్వేషులు కదా ! వారికి శుక్రాచార్యులు గురువుగా మంత్రిగా ఎలా ఉన్నాడు. ఆ శుక్రుడికి ఆపేరు ఎలా వచ్చింది " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! శుక్రుడి అసలు పేరు భార్గవుడు. భార్గవుడికి యోగ బలము ఎక్కువ. భార్గవుడు కుబేరుడిని మోసగించి అతడి సంపదలన్ని అపహరించాడు. కుబేరుడు ఈ విషయము ఈశ్వరుడికి మొరపెట్టుకున్నాడు. ఈ విషయము విన్న ఈశ్వరుడు కుపితుడయ్యాడు. శివుడు కళ్ళ నుండి నిప్పులు రాలుస్తూ ఎక్కడా ఆ భార్గవుడు ? అని హూంకరించాడు. అది తెలిసిన భార్గవుడు భయపడి ఒక పొదలో దాక్కున్నాడు. శివుడు అతడిని పట్టుకుని మ్రింగివేసి తిరిగి శుక్లరూపములో బయటకు విడిచాడు. అయినా శివుడి కోపము తీర లేదు. అప్పుడు పార్వతి " పరమశివా ! ఈ భార్గవుడు నీ కడుపు నుండి బయటకు వచ్చాడు కనుక ఇతడు మనకు పుత్రసమానుడు. పుత్రుడి మీద కాఠిన్యము తగదు కనుక అతడి మీద దయ చూపండి " అన్నది. శివుడు శాంతించాడు. శివుడి శుక్లముగా వచ్చాడు కనుక అతడు ఆతరువాత శుక్రుడు అయ్యాడు " అని చెప్పాడు.

తపోధర్మము పరాశరగీత[మార్చు]

ధర్మరాజు " పితామహా ! మీరు చెప్తున్న కొద్దీ నాకు వినవలెనని కుతూహలము పెరగడము లేదు. కాని ఏమి అడగాలో తెలియకున్నది కనుక మీరే నాకు మంచి ధర్మములు ఉపదేశించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీకు పరాశరగీతను చెప్తాను. పూర్వము జనకమహారాజు కోరిక మేరకు పరాశరుడు ధర్మబోధ చేస్తూ " మానవుడు ఇహలోక సౌఖ్యములు, పరలోక సౌఖ్యములు, ధర్మకార్యములే అని తలచి చిన్న విత్తనము ద్వారా ఫలమును పొందినట్లు ధర్మాచరణ వలన సుఖము పొందాలి. మంచి పనులకు సుఖము చెడ్డ పనులకు దుఃఖము కలుగుతుంది. సుఖదుఃఖములు మానవుడిని వదలక వెన్నంటుతూ ఉంటాయి. మానవుడు త్రికరణశుద్ధిగా అన్యాయము అధర్మము చెయ్యక ఉన్న సత్గతికలుగుతుంది. సత్పదమనగా సత్యము, మనో నిగ్రహము, అహింస. మనోరధానికి కట్టిన కోరికలనే గుర్రాలు అన్ని వైపులా పరుగెడుతుంటాయి. బుద్ధి అనే పగ్గములతో వాటిని అదుపులో పెట్టి మనసును సన్మార్గములో నడపాలి. భగవంతుడు మానవుడికి ఇచ్చిన పూర్ణాయుస్షును దుర్గుణాలతో మానవుడు మట్టిపాలు చేసుకుని అకాలమరణం పొందుతుంటాడు. అలాకాక మంచి మార్గాన పయనించి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. అధర్మము, అక్రమము, అవినీతి వలన ప్రాప్తించిన సంపదలవలన తాత్కాలిక సుఖము లభించినా అది శాశ్వతము కాదు. ఆ సుఖములు పాము వలె కాటేసి దుఃఖాల పాలు చేస్తాయి. కనుక ధర్మకర్మాచరణ ఉత్తమమైనది. విష్ణుస్థుతి, తపస్సు చేయడము, ధర్మప్రవర్తన వలన మనసుకు శాంతి లభిస్తుంది. పై సుగుణముల వలన ఎంతటి దుర్మార్గుడు కూడా సన్మార్గుడౌతాడు. గృహములో అగ్ని హోత్రము ఉన్న వాడిని వేదము పుణ్య పురుషుడు అంటుంది. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, సన్మార్గము, బలము, బుద్ధి ఇవన్నీ అగ్ని స్వరూపాలు. సాధుజన సాంగత్యముతో ఎంతటి దుర్మార్గుడైనా సన్మార్గుడౌతాడు. బ్రాహ్మణులను సేవించిన శూద్రులు కూడా ఇహలోక సుఖములు, పరలోక సుఖములు పొందగలరు. ఈ మానవుడి శరీరము అనిత్యము. ఈ సత్యమును తెలుసుకున్న మానవుడు సుఖదుఃఖములకు చలించక ధర్మమార్గమున పయనించాలి. ఇది ఏ జాతి వాడికైనా అనుసరణీయము. ఎక్కువ ఫలము ఆశించి తక్కువ పాపమైనా చెయ్యకూడదు. ఫలము తక్కువని పుణ్యకార్యాచరణ మానకూడదు. అందువలన ఇహపర సుఖములు కలుగుతాయి. ప్రతి మనిషి స్వధర్మము పాటించాలి. స్వధర్మము విడిచి ఎన్ని ధర్మములు చెప్పినా అవి వ్యర్ధమే. యజ్ఞములు చెయ్యని బ్రాహ్మణుడు, ప్రజారక్షణ చెయ్యని క్షత్రియుడు, ధర్మమార్గమున విత్తము సంపాదించని వైశ్యుడు, విప్రుల సేవ చెయ్యని శూద్రుడు అధర్మపరులే ! ధర్మముగా సంపాదించినది లేశమైనా అది అఖండ ఫలితాన్ని ఇస్తుంది. అన్యార్జితమైన ఆస్తి, ధనము కోటి రెట్లు ఉన్నా అది నిష్ఫలమే అని పెద్దల ఉవాచ. బ్రాహ్మణుడు పేదరికము చేత బాధించబడిబ అతడు క్షత్రియ ధర్మము, వైశ్య ధర్మము ఆచరించ వచ్చు. కాని సేవకా ధర్మము ఆచరించిన అతడు నరకానికి పోతాడు. శూద్రుడు తన జీవనాధారము నశించినప్పుడు వైశ్యధర్మము, పశుపోషణ, వ్యవసాయము చేసి జీవించ వచ్చు.

పరమగతి[మార్చు]

జనక మహారాజా ! పూర్వము రాక్షసులు మానవులు చేస్తున్న ధర్మకార్యములు సహించ లేక మానవులను ఆవహించారు. అందు వలన మానవులు అధర్మవర్తనులు అయ్యారు. మానవులలో గర్వము, రోషము ప్రవేశించి యజ్ఞ యాగములు చెయ్యడము ఆపివేశారు. అది చూసి దేవతలు చింతించి శివుడి వద్దకు పోయి మొరపెట్టుకున్నారు. శివుడు దేవతల మొర ఆలకించి తన త్రిశూలమును పంపాడు. ఆ త్రిశూలము శక్తి వలన మానవులలోని రాక్షసత్వం నశించింది. అలా శివుడు ప్రజారక్షణ చేసిన తరువాత యజ్ఞయాగములు యధావిధిగా జరిగాయి. కనుక జనకమహారాజా నీవు కూడా రాక్షసత్వము అణచి వేసి వారిలో ధర్మనిరతిని పెంచు. ఇక తపసు గురించి చెప్తాను విను. పూర్వము విద్యాధరులు, మునిపుంగవులు, దేవతాగణములు తపస్సు చేయడం వలననే వైభవం పొందారు. బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేతనే సమస్త లోకములను సృష్టించాడు. రాజులు కూడా తపస్సు వలననే కీర్తి గడించారు. మనకు సుగంధము, పట్టుపరుపులు తపసు వలనే ప్రాప్తించాయి. మానవుడు భార్య, బిడ్డలు, ధనము, భోగములు, సంపదలతో విసిగి పోయినప్పుడు నిర్మల మనసుతో చేసిన తపసు అతడికి ఉపశాంతి కలిగిస్తుంది. లోభము సుఖదుఃఖాలను కలిగిస్తుంది. కాని ఆ సుఖదుఃఖాలు కూడా తపస్సు లేమి వలనే సంభవిస్తాయి. సుఖము వచ్చినప్పుడు అహంకరించడం దుఃఖంకలిగినప్పుడు కుంగిపోవడం సహజం. కాని తపమాచరించిన వాడు అన్నిటినీ సమానంగా చూడగలడు. తపస్సిద్ధి పొందిన మానవుడికి ధర్మార్ధకామమోక్షములు ప్రాప్తిస్తాయి " అని పరాశరుడు జనకుడికి బోధించాడు.

చతుర్వర్ణాలు పుత్ర జననం[మార్చు]

జనకుడు పరాశరుడితో " ఓ మహర్షీ ! మానవుల కర్మలను అనుసరించి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని నాలుగు చతుర్వర్ణాలుగా విభజన జరిగింది కదా ! మరి వారిలో హెచ్చు తగ్గులు ఎందుకు. తండ్రి తానే పుత్రుడుగా జన్మిస్తాడు అంటారు కదా ! అది ఎలా అని వివరించండి ? " అని అడిగాడు. పరాశరుడు " జనక మహారాజా ! బ్రహ్మ ముఖము, భుజములు, తొడలు, పాదముల నుండి జన్మించారు. వారు జన్మించిన ప్రదేశము అనుసరించి వారిలో భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. తండ్రి తన మానసిక శరీరస్థితిని తన తేజస్సులో నిక్షిప్తము చేసి భార్యద్వారా పుత్రుడికి జన్మ ఇస్తాడు కనుక కుమారుడు తండ్రికి ప్రతి రూపము ఔతాడు. ఋష్యశృంగాదులు అలా జన్మించిన వారే కదా ! " అని పరాశరుడు చెప్పాడు. జనకుడు " చతుర్వర్ణ ధర్మాలు గుణగణాలు వివరించండి " అని జనకుడు అడిగాడు. పరాశరుడు " మహారాజా ! దానము పుచ్చుకోవడము, యజ్ఞయాగాదులు చేయించడము, వేద విద్యలు బోధించడం బ్రాహ్మణుల ముఖ్య విదులు. ప్రజారక్షణ రాజుకు విధించబడిన విశేష బాధ్యత క్షత్రియుడి ముఖ్యవిధి. వ్యవసాయము, పశుపోషణ, వ్యాపారము, ధనార్జన వైశ్యుడికి విధించబడిన ధర్మము. శూద్రులకు సేవా ధర్మము ముఖ్యము. కాని అన్ని వర్గముల వారికి సాధారణ ధర్మాలు ఉన్నాయి. సత్యము, శుచి, అహింస, అసూయద్వేషములు లేకుండుట, అతిథి సత్కారము, పితరులకు శ్రాద్ధకర్మలు చేయడము ప్రధానధర్మాలు. ఏ మానవుడికి పరస్త్రీవ్యామోహము తగదు. విశేషధర్మాలు పాటిస్తూ సాధారణధర్మాలు ఆచరించే మానవుడికి ఇహపర సుఖములు తధ్యము. విశేషధర్మాలను విడిచి పరధర్మమును ఆచరించిన వాడికి పాపము తప్పదు.

అహింస[మార్చు]

ఇక హింస అహింస అహింసాకరమైన పనులగురించి చెప్తాను విను. మానవుడికి శమము, దమము ముఖ్యము. అవి లేని వారికి హింసాప్రవృత్తి కలుతుంది. అహింస వలన శమము, దమము ప్రాప్తిస్తాయి. ప్రజారక్షణ కొరకు యుద్ధము చెయ్యడములో క్షత్రియుడికి హింస చేయక తప్పదు. అందుకు పరిహారం చెప్తాను. యుద్ధరంగములో శత్రువు కింద పడినా, పారిపోతున్నా, రథము గుర్రము లాంటి వాహనము నుండి కింద పడినప్పుడు అతడిని చంపకూడదు. కాని మానవుడు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అవి అహింసతో సాటిరావు. న్యాయమార్గంలో అహింసాయుతంగా చేసిన యుద్ధములో మరణించిన వాడికి మోక్షము లభిస్తుంది. యుద్ధంలో వీరుడు తన కంటే బలవంతుడిని కాని సమానబలవంతుడిని కాని సంహరించిన అతడికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి. శరీరము త్రిగుణాలు, పంచేంద్రియాలు, పంచభూతములతో చేయబడినదని తెలిసిన ఎవరైనా అధర్మకార్యాలు చేయగలరా ! పుట్టిన వాడికి చావుతప్పదని తెలుసుకుని అశాశ్వతమైన ఈ శరీరం అనుభవించే సుఖములు అశాశ్వతమైనవని తెలిసిన వాడు అధర్మానికి ఒడిగట్టడు. సజ్జనుడు ధర్మాత్ముడు అయిన వాడు ఉత్తరాయణంలో జరిగే యుద్ధం మొదలైన కారణాల వలన మరణిస్తాడు. దుర్జనుడు ఆత్మహత్య, విషప్రయోగము, ఉరి వేసుకోవడం, నీళ్ళలో మునగడం వలన మరణిస్తాడు. మానవులకు తన అజ్ఞానమే తనకు బద్ద విరోధి. మానవుడు తన అజ్ఞానం వలన అకృత్యాలకు అధర్మాలకు పాల్పడి నశించి పోతాడు. మానవ జన్మ ఉత్తమమైనది ఏకులంలో జన్మించినా సరే ! మానవజన్మలోనే సద్గతి పొందే అవకాశం ఉంది. ఫలాపేక్ష లేక చేసిన పుణ్యకార్యాలు, అతిథిపూజలు, పుణ్యయాత్రా స్నానము శాశ్వత సుఖాన్ని ఇస్తుంది " అని పరాశరుడు జనకుడికి చెప్పాడు.

పరమగతి[మార్చు]

జనకుడు పరాశరుడిని " పరమగతి అంటే ఏమిటి ? ఏ పని చేస్తే మేలు కలుగుతుంది ?ఏ పని చేస్తే నాశనం ఉండదు ? " అని అడిగాడు. జనకమహారాజా విషయవాంఛలకు లోను కాక ఉండడమే మేలైనది. మంచిజ్ఞానం సంపాదించడమే పరమగతి. అన్ని కర్మలలోకి తపస్సు నాశనంలేనిది. తెలివి కలిగినవాడు విషయవాంఛలలో మునిగి తేలుతున్నా తామరాకు వలె నీటిబొట్టులా ఉంటూ ప్రాపంచిక విషయాలను వదిలి తటస్థంగా ఉంటాడు. జ్ఞానము లభించినందుకు అది పర్యవసానం. అజ్ఞానులకు చిత్తము విషయవాంఛల వైపు లక్క కర్రకు అతుక్కున్నట్లు గాఢతరంగా ఆకర్షితమై వాటిలో సదా మునిగి తేలుతుంది. సూర్యకాంతశిల సూర్యకిరణాలకు ఆకర్షితమైనట్లు మంచి విషయాలకు మంచిమనసు స్పందిస్తుంది. సదా భగవంతుడిని ధ్యానించే మనసు భగద్చింతనతో మునిగి పోయినట్లు. అరటి చెట్టు బెరడులా ఈ ప్రపంచం నిస్సారమైనదని ఎరిగిన జ్ఞాని చివరకు ముక్తి పొందగలడు. పుట్టినదాది ప్రాపంచిక విషయాలలో కొట్టుమిట్టాడే మానవుడు ఆత్మను ఉద్ధరించ లేడు. గుడ్డివాడు అలవాటు పడిన పరిసరాలలో అనాయాసంగా తిరిగిన విధంగా ఈ సంసారంలో తిరుగుతూ ఉంటాడు కాని బయటపడడానికి ప్రయత్నించడు. తామరతూడును నీటితో కడిగి బురదను వదిలించినట్లు జ్ఞానమనే పవిత్ర జలముతో కడిగిన బుద్ధి దేదీప్యంగా ప్రకాశిస్తుంది. ఎలుకను పట్టి తినడానికి పిల్లి ఉన్నట్లు మృత్యువు తనను కబళించడానికి పొంచి ఉన్న విషయం ఎరగని మానవుడు కడుపు నింపుకోవడానికి కోరికలు తీర్చుకోవడానికి జీవిత కాలాన్ని వెచ్చిస్తాడు. బరువు ఎక్కువైన పడవ సముద్రాన్ని ఎలా దాటలేదో కోరికలు ఎక్కువైన జీవి సంసార సాగరాన్ని దాటి ఆవలి ఒడ్డుకు చేర లేడు. కనుక కోరికలు, అత్యాశ ప్రతిబంధకాలని గ్రహించాలి. మానవుడు భార్యా, బిడ్డలు, అన్నదమ్ముల కొరకు నిరంతరం శ్రమించినా ఆఖరి దశలో వారు ఆదుకుంటారన్న నమ్మకం లేదు. మరణాంతరం ఆదుకునేది అతడి పుణ్యమూ, జ్ఞానమే అని గ్రహించి జ్ఞానసముపార్జన చేసిన అది అతడిని ఆదుకుంటుంది. మబ్బు పట్టిన సమయాన సూర్యకాంతి కనపడ పోయినా అది సూర్యుడిని ఎన్నటికీ వెన్నంటి ఉన్నట్లు సమదృష్టి కలిగిన ధర్మాత్ముడిని జ్ఞానము ఎన్నడు వదలదు " ఇలా పలు విధముల పరాశరుడు చేసిన బోధలకు జనకుడు పరవశించాడు " భీష్ముడు ధర్మజుడికి చెప్పాడు.

దమము సత్యము క్షమ హంసగీత[మార్చు]

ధర్మరాజు సందేహం తీరని మనసుతో " పితామహా ! మీరు చెప్పినట్లు దమమము, సత్యము, క్షమ అంతటి ఉత్తమమైన గుణాలా ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీవు హంసగీత వింటే నీ సందేహములు తీరగలవు. ధర్మరాజా ! ఒక సారి బ్రహ్మదేవుడు హంసరూపంతో ఒక కొలనులో క్రీడించసాగాడు. అప్పుడు కొంత మంది సాధ్యులు ఆ హంసను చూసారు. " హంసరాజమా ! మేము సాధ్యులము అనే దేవతలము. నీకు అన్ని విద్యలు తెలుసు కనుక మా సందేహములు సమాధానం చెప్పండి. అన్నిటింటి కంటే ఉత్తమమైనది ఏది ? చిత్తము ఎప్పుడూ దేని అందు లీనమై ఉంటుంది. పురుషుడు ఈ కర్మ బంధము వలన ఎలా విముక్తుడు కాగలడు " అని అడిగారు. హంసరూపం లోని బ్రహ్మ ఉన్న బ్రహ్మ " క్షమ, సత్యము, ఇంద్రియ నిగ్రహము, సత్యము పలకడము, అత్యంత మహిమ కలిగినవి. సమస్త ధర్మములలో అవి కీర్తించ తగినవి. అవి నీతికరమైనవి, ఇతరులను బాధపెట్టేవి, నిష్ఠూరమైన మాటలు, ధర్మకార్యముకు పనికి రానివి సత్యములు కావు కనిక నిజమే అయినా సజ్జనుడు అలాంటి వాటిని పలకడు. సజ్జనుడు ఇతరుల నిందలకు, అవమానములకు చలించక శాంతం వహిస్తాడు. అతడి కీడుచేసిన వాడికి మేలుచేస్తాడు, కొట్టిన వాడిని కూడా క్షమిస్తాడు. వాదసారము సత్యము, సత్యసారము ఇంద్రియనిగ్రహము, ఇంద్రియనిగ్రసారము మోక్షము. కనుక సత్యవ్రతుడికి మోక్షము తధ్యము. పంచ జ్ఞానేంద్రియము, పంచ కర్మేంద్రియములను అదుపులో పెట్టుకున్న వాడు సర్వ ధర్మములను ఆచరించినట్లే . ఇంద్రియనిగ్రహంతో పాపం నశించి ఆత్మ నిర్మలమై మోక్షప్రాం ప్రాప్తిస్తుంది. మనసును అదుపులోఉంచిన వాడికి మోక్షము కరతలామలకం అని పెద్దలు చెప్తారు. పరులను నిందించినప్పుడు అతడి పాపములు తనకు అంటుకుంటాయి. కనుక ఇతరులను నిందించతగదు. కోపము అన్ని విధాలా అనర్ధం. కోపిష్టి చేసిన తపసు, జపము, దేవతార్చన, వ్రతములు, దానములు, యజ్ఞము, పితృకార్యములు మొదలైన పుణ్యకార్యములు నిష్ఫలములు. మౌనం కంటే మంచి పలుకు మేలు. ఈతరులకు ప్రీతి కలిగించే సత్యము పలికే వాడిని దేవతలు కూడా మెచ్చుకుంటాడు " అని హంస రూపములో ఉన్న బ్రహ్మ సాధ్యులకు చెప్పాడు. సాధ్యులు " హంసరాజమా ! ఈ లోకము దేని వలన కప్పబడి ఉన్నది ? జీవుడు ఎందుకు ప్రాకాశ హీనుడౌతాడు ? మిత్రులు విడి పోవడానికి కారణం ఏమిటి ? మోక్షం లభించడానికి కారణం ఏమిటి ? అని అడిగారు. హంస రూపంలో ఉన్న బ్రహ్మ " సాధ్యులారా ! ఈ లోకమంతా అజ్ఞానము చేత కప్పబడి ఉంది. మాత్సర్యముకు లోనైన జీవుడు ప్రకాశించ లేడు. లోభి మిత్రులను కోల్పోతాడు. సదా విషయవాంఛలలో తేలే వాడికి మోక్షం లభించదు " అని హంసరూపంలోని బ్రహ్మ చెప్పాడు. సాధ్యులు " తమలోతాము లీనం అయ్యే వాడు ఎవరు ? అందరికీ ప్రీతి కలిగించే వాడు ఎవడు ? బలవంతుడు ఎవడు ? కలహ మార్గము నుండి తొలిగి పోగలిగిన వాడు ఎవడు ? " అని అడిగారు. హంసరూపం లోని బ్రహ్మ " ప్రాజ్ఞుడు తనలో తానే లీనమై బలవంతుడై కలహస్వభావమును వదిలి వేస్తాడు " అని చెప్పాడు. సాధ్యులు " హంసరాజమా ! విప్రుడు దైవత్వం ఎప్పుడు పొందగలడు ? ఎందు వలన సాధుత్వం పొందుతాడు ? ఎందు వలన దుర్జనుడౌతాడు ? ఎందు వలన మనిషిగా చరిస్తాడు ? వివరించ గలరా ! " అని అడిగారు. హంసరూపం లోని బ్రహ్మ " విప్రుడు వేదాధ్యనంతో దైవసమానుడౌతాడు. పుణ్యకార్యాచరణతో సాధుత్వం లభిస్తుంది. దుర్మార్గము వలన దుర్మార్గుడు ఔతాడు. శుచిశుభ్రత విడిచి విషయవాంఛలలో మునిగి పోయిన వాడు మానవుడౌతాడు " అని చెప్పి బ్రహ్మ తన నిజరూపం ధరించి వారిని దీవించి బ్రహ్మలోకం వెళ్ళాడు " అని చెప్పిన భీష్ముడు " ధర్మనందనా ! ఈ హంస గీత వలన నీ సందేహం తీరిందా ! " అని అడిగాడు.

సాంఖ్యము యోగము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! యోగశాస్త్రము, సాంఖ్యయోగము గురించి వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! సాంఖ్యులు తాము అను సరించేదే ఉత్తమమైనది అని చెప్తారు. కాని నాకు రెండూ సమానవైనవే అని చెప్తారు. యోగులు ప్రత్యక్ష సాక్ష్యాన్ని నిజము అని నమ్ముతారు. సాంఖ్యులు వేదములు, శాస్త్రములు ప్రమాణమని చెప్తారు. కానీ ఆచరణలో రెండూ ఒకటే, ఇద్దరి లక్ష్యము ఒక్కటే శాస్త్ర రూపంలో రెండింటికీ భేదం ఉన్నా ఫలితం ఒక్కటే. సర్వభూతముల అందు ప్రేమగా ఉండడం, నియమ నిష్టలు పాటించడం, శుచి శుభ్రత పాటించడం రెండింటిలో ఉంటాయి కదా ! " అని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు " పితామహా ! భూతదయ, శౌచము, నియమ పాలన సాంఖ్యులకు యోగులకు ఒకటే అయినా శాస్త్రములు మాత్రం రెండుగా ఎందుకు ఉన్నాయి ? " అని అడిగాడు ధర్మరాజు. భీష్ముడు " ధర్మనందనా ! యోగులు తమ యోగ బలముతో కామము, కాంక్ష, మోహము, రాగము తొలగించుకుని ఉన్నత స్థితిని పొందుతాడు. కనుక యోగికి యోగబలం ముఖ్యము. బలహీనుడైన వాడు ప్రవాహ వేగానికి కొట్టుకు పోయినట్లు యోగబలం లేని వాడు విషయవాంఛల ప్రవాహంలో కొట్టుకు పోతాడు. మదించిన ఏనుగు ప్రవాహాన్ని అడ్డగించినట్లు యోగి యోగబలంతో విషయవాంఛల ప్రవాహాన్ని మళ్ళించి చిత్తమును ముక్తిమార్గం వైపు మళ్ళించగలడు. మృత్యువు కూడా అటువంటి యోగి వద్దకు రావడానికి భయపడతాడు. యోగి తన ఇచ్ఛకు వచ్చినట్లు ప్రవర్తించినా సంసారంలో చిక్కుకొనడు. యోగి యోగములో నైపుణ్యం సాధించి మోక్షం అనే లక్ష్యాన్ని చేదించి మోక్ష సౌధంపైన నిలువగలడు. రధికునకు సారధి వలె, యోగమార్గంలో నిశ్చలుడైన యోగి ఆత్మను సరి అయిన మార్గంలో నడిపించగలడు. మనిషి శిరస్సు, నాభి, హృదయము, పొట్ట, చెవులు, పక్కలు వీటి వలన ఆత్మను దర్శించ వచ్చు " అని భీష్ముడు చెప్పాడు.

యోగి ఆహారము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! యోగి తినవలసిన ఆహారం ఏమిటి ? తినకూడని ఆహారం ఏమిటి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! యోగి నూనెతో చేసిన పదార్ధములను తినకూడదు. ఆకలి తీరే విధంగా మితాహారం, జలము తీసుకోవాలి. రుచికరమైనవైనా పొట్ట నిండా భుజించ కూడదు. కామము, క్రోధము, నిద్రను, ఆశను, భయమును వదిలి పెట్టాలి. నిర్జనప్రదేశంలో కూర్చుని శ్వాశనిశ్వాశను అదుపులో పెట్టుకుని తనలోతాను ఆనందం అనుభవిస్తూ మోక్షమును పొందాలి . ఇది అసిధారావ్రతం కత్తి మీద సాము వంటిది ఆచరణకు అంత సులభమైనది కాదు. కాని చిత్తశుద్ధి కలిగిన యోగికి అసాధ్యమైనది లేదు. యోగసిద్ధుడు అన్నిటికీ అనాసక్తుడు. యోగి పుట్టినప్పుడు సంయోగము మరణించునప్పుడు దీనత్వం ఉండవు. భోగం వలన సుఖం భోగహీనత వలన దుఃఖం కలుగదు. ధర్మనందనా ! నీకు యోగవిధానం చెప్పాను " అని చెప్పాడు.

సాంఖ్యయోగము[మార్చు]

ధర్మరాజు " పితామహా ! నాకు సాంఖ్య శాస్త్రం గురించి వివరిస్తాను " అని చెప్పాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వం కపిలుడు చెప్పిన సాంఖ్య శాస్త్రం గురించి నీకు వివరిస్తాను. మానవుడు ముందు జ్ఞానం సంపాదించాలి. తరువాత ప్రపంచ విషయాలను జాగ్రత్తగా గ్రహించాలి. ఇది ఒక్కోదానికి ఒక్కో విధంగా ఉంటుంది. పశువులు, పక్షులు, మానవులు, దేవతలు, గంధర్వులు, పితరులు, సిద్ధులు, గరుడులు, కిన్నెరలు భిన్నంగా ప్రవర్తిస్తారు. వీరి గురించి తెలుసుకోవడం అవసరమా ! అని నీవు అనుకోవద్దు. అన్నీ విషయములు తెలిసి ఉంటే వాటి నుండి తప్పించుకోవడం తేలిక. ధర్మనందనా ! చెవికి శబ్ధం, కంటికి రూపం, చర్మానికి స్పర్శ, నాలుకకు రుచి, ముక్కుకు వాసన, కడుపులో జఠరాగ్ని, ఆకాశంలో వాయువు, అగ్నిలో జలం, జలములో భూమి, ఇంద్రుడిలో చేతులు, వామనుడి అందు కాళ్ళు, ధనంలో లోభం, తమోగుణంలో బుద్ధి, రజోగుణంలో తమోగుణం, సత్వగుణంలో తమోగుణం ఉన్నాయి. సత్వగుణం ఆత్మలో అను సంధానమై ఉంటుంది. ఆత్మ నారాయణుడు, పరమేశ్వర రూపంలో లీనమై ఉంటుంది. ఆ పరమాత్మ మోక్షాసక్తుడు. ఆ మోక్షానికి దేనితో సంబంధం లేదు. సత్వ, రజో, తమోగుణ ప్రధానమైన ప్రకృతిలో 16 వికారాలు ఉన్నాయి. మనలో ఉన్న ఆత్మకు ఆధారం ఈ ప్రకృతియే. ఆత్మ స్వయం ప్రకాశితమైన ఒక తేజోమయరూపం. రెండు రూపములుగా ప్రకాశించే ఈ ఆత్మ ఒక రూపంతో పంచేంద్రియాల ద్వారా ఈ లోకంలోని విషయాలను అనుభవిస్తుంటుంది. ఇంకొక రూపం తటస్తంగా ఉండి సాక్షీ భూతంగా చూస్తూ ఉంటుంది. మనలో ఉన్న వాయువు ఒకటే అయినా అది అయిదు విధాలుగా పనిచేస్తుంది. మానవుడు ఈ వాయువులను నిశితంగా పరిశీలించిన ఆత్మ దర్శనం లభిస్తుంది. అటువంటి మానవుడు తాను మాతృ గర్భంలో ఉన్నప్పుడు, జననకాలంలో పడే వ్యధ, బాల్యంలో ఉండే మూర్ఖత్వము, యవ్వనంలోని రాగద్వేషాలు, విషయాసక్తి, వార్ధక్యము లోని దీనావస్థ తెలుసుకుని వాటి నుండి విముక్తిపొందడానికి ప్రయత్నిస్తాడు. ఈ మానవుడు పుణ్యకార్యములు చేసి స్వర్గముకు వెళ్ళి అక్కడ పుణ్యము పాపము లేని తటస్థజీవితము గడిపి పుణ్యము కరిగిపోయిన పిదప తిరిగి మానవుడిగా జన్మించి విషయాలలో చిక్కుకుంటాడు. పాపకార్యములు చేసిన మానవుడు పశుపక్ష్యాది జన్మలు ఎత్తుతాడు. జ్ఞాని ఈ రెండింట చిక్కక మోక్షంపొందుతాడు. అజ్ఞాని తనకు కలిగే వృద్ధాప్యమూ, మరణము గురించి ఎరుగక ఎదుటి వాడికి వచ్చే వృద్ధాప్యము, చావు గురించి చింతింస్తున్నాడు. మిగిలిన వారు తాము చిరకాలం జీవిస్తామని విర్రవీగుతుంటాడు. ధర్మనందనా ! ఈ దేహములో కామము, క్రోధము, భయము, నిద్ర, నిట్టూర్పు, అనే అయిదు దోషములు ఉన్నాయి. క్షమవలన కోపము, సంకల్పం లేనందున కామము, ప్రమాదము లేనందు వలన భయము, సజ్జన సాంగత్యం వలన నిద్ర, మితభోజనం వలన నిట్టూర్పులు నివారించ వచ్చు. ఇవీ సాంఖ్యయోగులు ఆచరించే విధానము. సాంఖ్యయోగి ప్రాపంచిక విషయములు పక్కకు పెట్టి సాంఖ్యము అనే ఓడను ఎక్కి జ్ఞానము అనే చుక్కానితో సంసార జీవితమును అవలీలగా దాటగలడు. ఈ సంసారం అనే ఓడలో దుఃఖం అనే నీరు ఉంటుంది. అందులో వ్యాధులు, రోగములు అనే మొసళ్ళు, భయాలు అనే పాములు సంచరిస్తుంటాయి. ప్రవాహమే హింస, విషయాసక్తి బురద, ఆశలు సుడిగుండాలు. ఆ సముద్రంలో అట్టడుగున సుఖసంతోషాలు అనే రత్నాలు ఉన్నాయి. ఆ సముద్రముకు తీరం సత్యం, ఈ సంసార సాగరమును దాటిన వాడిని సూర్యుడు తన లోకముకు తీసుకు పోతాడు. తరువాత జీవుడు సూక్ష్మరూపంలో తామరతూడులో ఉన్న సన్నని ద్వారము గుండా ప్రయాణిస్తాడు. ఆ జీవుని ప్రవాహుడు ఆకాశంలోకి చేరుస్తాడు. తరువాత అతడు పరమాత్మలో ఐక్యం ఔతాడు " అని భీష్ముడు చెప్పాడు.

ముక్తి పొందిన జీవుడు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! పరమాత్మలో చేరిన జీవుడు తన పూర్వ వృత్తాంతము గురించి తలచుకుంటాడా లేక మరచిపోతాడా ! మోక్షము చెందిన తరువాత జీవుడి పరుస్థితి ఏమిటి ? తన పూర్వస్థితికన్నా భిన్నంగా ఉంటాడా ? మోక్షం పొందిన జీవుడు పూర్వచింత ఉంటుందా ! వివరించండి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! కపిలమహర్షి ఈ విషయం గురించి వివరంగా చెప్పాడు. మానవుడు స్పర్శ చేత కాని వినడం చేత కాని ఆత్మను తెలుసుకోలేడు. మనసు ద్వారానే ఇంద్రియములను తెలుసుకోగలడు. జ్ఞానస్వరూపుడైన మానవుడు మనసు ద్వారా ఇంద్రియములను తెలుకున్నా లేకున్నా ఒకటే. ముక్తి పొందిన మానవుడికి ఇంద్రియములు జడపదార్ధముతో సమానము. వాటిపని అవి మనసుతో పని లేకుండా చేసుకు పోతుంది. సాధకుడు ఈశరీరములో ఉండగానే మోక్షంపొందిన తరువాత ఇంద్రియములను అవి చేసే పనులను నిర్వికారంగా చూస్తుంటాడు. సాధకుడు తన లోని పంచభూతములను, బుద్ధిని, మనసుని అణిచిపెట్టి, పరమాత్మను చేరుకుంటాడు. అలా పరమాత్మను చేరుకున్న వాడికి ఇక జన్మ ఉండదు. జన్మరాహిత్యం పొందడమే మోక్షం. ఇంతకు మించిన దశ వేరేలేదు. దీనిని మానవుడు గురువు వద్ద ఉపదేశం పొంది నియమానుసారం సాధించాలి. ధర్మరాజా ! దీనిని సాంఖ్య పద్ధతి అంటారు. పరమపదాన్ని చేరడానికి ఇంతకంటే ఉత్తమమార్గం వేరేలేదు. ఈ పద్ధతిని బ్రహ్మదేవుడు కూడా గౌరవిస్తాడు. నీవు కూడా ఇలా నిర్మల మనస్కుడవై మోక్షం పొందు. ధర్మనందనా యోగులు జ్ఞానుల మధ్యతేడా చాలా స్వల్పం. యోగి చూసిన విధంగానే సాంఖ్యుడు చూస్తాడు వారిద్దరి దృష్టికూడా ఒకటే. కనుక మునులు, యోగులు, సాంఖ్యులు ఒకే మార్గంలో పయనిస్తాడు. వారి పేర్లలో బేధమే కాని అవి ఒక దానిలో ఒకటి సంచరిస్తాయి. తత్వవేత్తలు కూడా దీనిలో అభేదం చూడరు. మానవుడు యోగ మార్గం లేక సాంఖ్యమార్గమున సంచరిస్తూ మోక్షప్రాప్తికి ప్రయత్నించే సమయంలో దారి తప్పి మోక్షముకు చేర లేకపోయినా అతడికి స్వర్గ ప్రాప్తి తదథ్యం. స్వర్గ సుఖాలు అనుభవించిన తరువాత తిరిగి జ్ఞానుల ఇంట మానవుడుగా జన్మను ఎత్తి సాధన కొనసాగించి మోక్షం పొందుతాడు. కనుక ధర్మజా ! నీవు కూడా ఈ మార్గమే అవలంబించు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు " అని వైశంపాయనుడు జనమేజయునకు భారత కథను చెప్పాడు.