ఉద్యోగ పర్వము తృతీయాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తృతీయాశ్వాసము[మార్చు]

ధర్మరాజుతోను అతని తమ్ములతోను మాట్లాడుతున్న కృష్ణుడు

సంజయుడు ధర్మరాజు వద్ద శలవు తీసుకుని హస్థినకు బయలు దేరగానే ధర్మరాజు తన తమ్ములతోను సామంత రాజులతోను సమావేశమై ఇలా అన్నాడు " మనం అందరం శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి ఆయనను రాయబారానికి హస్థినకు పంపుతాము. అందువలన యుద్ధాన్ని నివారించి దాయాదులు ఒకరిని ఒకరు చంపుకునే దురవస్థ తప్పించే అవకాశం ఉంది " అన్నాడు. ఆ తరువాత ధర్మరాజుతో అందరూ ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుని చూసి " దేవా! మా తండ్రి పాండురాజు నిన్ను మాకు పెద్ద దిక్కుగా చూపాడు. నీవు మాకు మిత్రుడవు. నీవు హస్థినకు వెళ్ళి సుయోధనుని సంధికి ఒప్పించాలి. అతడు నీ మాట వింటాడని మా విశ్వాసము. అలా జరిగితే మాకు రాజ్య ప్రాప్తి కలుగుతుంది. మమ్ము నీ పుత్రుడు ప్రద్యుమ్నునితో సమానంగా చూసి మమ్ములను కాపాడు " అని వేడుకున్నాడు. ఆ మాటలకు శ్రీకృష్ణుడు " ధర్మరాజా ! అలాగే చేస్తాను నేను ఏమి చేయాలో చెప్పు " అన్నాడు.

హస్థినకు ధర్మరాజు శాంతి సందేశం పంపుట[మార్చు]

ధర్మరాజు " కృష్ణా ! మా తండ్రి తలపు సుయోధనుని నిర్ణయము సంజయుని ద్వారా తెలుసుకున్నాము. వారి చిత్తము సంజయునికి బాగా తెలుసు. మమ్ము బుజ్జగించి రాజ్య భాగం ఇవ్వకుండా ఉండాలని చూస్తున్నారు. ధర్మాన్ని అనుసరించి అరణ్య అజ్ఞాత వాసములు పూర్తి చేసిన మా మాటను వారు మన్నించడం లేదు. మా పెదనాన్న తన కుమారుని మీద ఉన్న దురభిమానం చేత సుయోధనుని వక్ర బుద్ధి మాన్పలేక ఉన్నాడు. ఇది మాకు ఆపత్కరం మా తల్లికి బంధు మిత్రులకు ఆనందం కలిగించేలా సంధి కుదర్చక ఊరకుండటం పౌరుషం అనిపించుకోదు. వాసుదేవా ! నాడు నిండు సభలో ఐదు ఊళ్ళు ఇచ్చినా చాలు అని చెప్పాను. అది యదార్ధమే అయినా కాని సుయోధనుడు అదైనా ఇస్తాడో లేదో తెలియదు. అంతమాత్రాన యుద్ధం చేయడానికి నాకు మనస్కరించడం లేదు . కాని నన్ను ఆశ్రయించిన వారిని పోషించవలసిన బాధ్యత నాకు ఉంది కనుక సంధి అవసరం ఎంతైనా ఉంది. కృష్ణా ! వారు మమ్ము కష్టాలు పాలు చేసారు. కాని వారిని చంపాలని ఎందుకు కోరుకోవాలి? యుద్ధం తప్ప వేరు మంచి మార్గం లేదా? కౌరవపక్షంలో ఉన్న మా బంధు మిత్రులను రాజ్యం కోసం చంపడం ధర్మమా? ఇంతటి దురవస్థ ఎల్లా సహించను. కృష్ణా ! క్షాత్ర ధర్మం ఇంత కష్టమా? యుద్ధం చేస్తే రాజ్యం వస్తుంది అలాగే వంశ నాశనం ఔతుంది. పరధర్మం ఆచరించడం తగదని పెద్దలు చెప్తారు. యుద్ధంచేసి ప్రాణహాని జరుగుతుంది కనుక అది నా అభిమతం కాదు. యుద్ధంలో గెలువ వచ్చు ఓడవచ్చు ఓటమి మరణం కంటే వేదన కలుగ చేస్తుంది. యుద్ధం జోలికి వెళ్ళకుండా పనులు చక్కపరచు కునే వాడు ఎక్కువ సుఖపడతాడు. పాముతో కాపురం చేయడం ఎంత కష్టమో పగతో మెలగడం అంత కష్టం కనుక దానిని అణచడం శ్రేయస్కరం. విరోధాన్ని విరోధంతో అణచి వేయలేము, విరోధి చేతిలో బాధలు పడలేము. పగను నిర్మూలించా లంటే క్రూరంగా ప్రవర్తించాలి. పగ వలన కీడే కాని మేలు జరగదు కనుక శాంతి మార్గము ఒక్కటే శ్రేయస్కరం. కృష్ణా ! మేము యుద్ధం లేకుండా రాజ్యం కావాలని కోరు కుంటున్నాము. కనుక శాంతి యుతంగా కార్యాన్ని చక్క పెట్టడం మంచిది. కృష్ణా ! నీవు మా మీద పక్షపాతం చూపనవసరం లేదు. ఇరు పక్షాలకు ఆమోద యోగ్యమైన మార్గం చూడు. మెత్తని మాటలతో వినకుంటే మందలించి అయినా కార్యం చక్కపెట్టు. మనకు కురువృద్ధులు ముఖ్యము కనుక దుర్యోధనుడు పరుషంగా మాటాడినా సహించు. ధృతరాష్ట్రుడు కుమారుని మాట విని ఏదీ తేల్చక పోయినా కోపం తెచ్చుకోవద్దు. నా మనసు సంకట పడుతుంది. నీవే మమ్ము సక్రమ మార్గాన నడిపించు. నీ మాట మాకు శిరోధార్యము. సుయోధనుడు దుర్మార్గుడు అతని వద్దకు నిను పంపడం మంచిది కాదని నాకు తోస్తుంది. వారు ఎంతకైనా తెగిస్తారు. నీ మాటలు లక్ష్య పెట్టడు. నీకు కష్టం కలిగించే విధంగా లభించే దేవేంద్ర పదవి కూడా నాకు వద్దు. కనుక ఒంటరిగా కురు సభకు వెళ్ళకు " అన్నాడు.

ధర్మరాజుకు శ్రీకృష్ణుడు స్వాంతన పలుకుట[మార్చు]

ధర్మజుని మాటలు విన్న శ్రీకృష్ణుడు " ధర్మజా! దుర్యోధనుడే కాదు. అతని తండ్రి ధృతరాష్ట్రుడు అటువంటి వాడే. నీ కలత నాకు తెలుసు అనుమానం వద్దు నేను ఆగ్రహిస్తే యుద్ధం చేయటానికి ఎవరూ మిగలరు. నన్ను పంపించడం మంచిది. హస్థినలో వారికి మన మనసులో మాట చెప్పండం మంచిది " అన్నాడు. ధర్మరాజు " కృష్ణా! నీకు మంచిది అనిపిస్తే హస్థినకు వెళ్ళి సంధి కుదుర్చు. మా గురించి నీకు తెలుసు వారి గురించీ తెలుసు మైత్రి గురించి తెలుసు క్లిష్ట సమయంలో ఎలా నడచు కోవాలో నీకు చెప్పతగిన వాడిని కాదు. సంధి అన్ని విధాల మంచిదని నాకు తోస్తున్నది " అన్నాడు. శ్రీకృష్ణుడు " ధర్మజా! నాడు సంజయుడు పలికినది విన్నాను నేడు నీవు చెప్పింది విన్నాను. నీవు ధర్మ నిష్ట కల వాడివి. వారు విరోధమును వదిలి పెట్టరు. భీష్మ, ద్రోణులు వారి వైపు ఉన్నారని వారికి గర్వం కనుక మీరు క్షత్రియ ధర్మం వదిలి వారికి అణిగి మణిగి ఉండనవసరం లేదు. అక్రమంగా రాజ్యం అనుభవిస్తున్న వారు మీకు రాజ్యంలో భాగం ఇస్తారా? ధృతరాష్ట్రుని కుమారులు అన్యాయానికి, అధర్మానికి జంకరు. నీవు సందేహించక యుద్ధం చేసి శత్రువులను జయించి రాజ్యాన్ని కైవశం చేసుకుని అనుభవించి కీర్తి గడించు. నాడు కౌరవ సభలో భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వంటి పెద్దల సమక్షంలో మీకు అపకారం చేసారు. వారు ఈ నాటికి పశ్చాత్తాప పడలేదు. అట్టి వారిపై నీవు జాలి, దయ, కరుణ చూపడం కోపం తెచ్చుకోక పోవడం న్యాయము కాదు. కపట జూదంలో మిమ్మల్ని ఓడించి అవమానించి దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు అన్నమాటలు నా నోటితో తిరిగి చెప్ప తగినవి కాదు. ఆ మాటలు విన్న అందరూ ధృతరాష్ట్రుని నిందించారు. ధర్మానికి కట్టుబడి పరాక్రమవంతులైన మీరు అడవులకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యపడని వారు లేరు. ఆ పాపాత్ములు, క్రూరాత్ములు అయిన కౌరవులు ఇప్పటికే దైవము చేత చంపబడి ఉంటారు కనుక వారిని చంపడం తేలిక. అటువంటి వారు నీకు చంపతగని వారు ఎలా అయ్యారు. పాపాత్ములను క్రూరాత్ములను పాములను చంపినట్లు చంపడమే మానవుని కర్తవ్యం. దీనికి యోచించ నవసరం లేదు. నీవు కురు వృద్ధులైన భీష్మ, ద్రోణ, క్రుపాచార్యులకు భక్తి ప్రపత్తులు చూపు నీ తరఫున నేను నీ సత్ప్రవర్తనను, వినయ విధేయతను, ధర్మనిరతిని కౌరవ సభలో వారికి తెలియచేస్తాను. నా మాటలు వినక దుర్యోధనుడు అధర్మంగా మాటాడినా ధృతరాష్ట్రుడు ఊరకున్నా సభలోని వారు వారి దుష్ప్రవర్తనకు ఈసడించు కుంటారు. మనకు కావలసింది కూడా అదే. ధర్మజా నా శక్తి కొలది సంధి ప్రయత్నాలు చేస్తాను. సంధి కుదిరితే మేలే. సంధి చెడినా వారి మనోభావాలు అవగత మౌతాయి. వారి యుద్ధ ప్రయత్నాలు, బలాబలాలు తెలుసు కోవడం మేలే. సుయోధనుడు తన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు రాజ్యంలో భాగం ఇవ్వడు. కనుక యుద్ధ వాతావరణమే అంతటా గోచరిస్తుంది. యుద్ధం అనివార్యము కనుక నీవు కూడా యుద్ధ సన్నాహాలలో ఉండు " అన్నాడు.

భీమసేనుడు[మార్చు]

ఆ మాటలు విన్న భీమసేనుడు " యుద్ధం యుద్ధం అంటూ మమ్ము భయపెట్టకు. నీవు ముందు హస్థినకు వెళ్ళి ఆ కుబుద్ధి అయిన దుర్యోధనునికి సౌజన్యంతో చెప్పి పని సానుకూల మైయ్యేలా చూడు. అక్కడ అతడి మాటకు ఎదురులేదు. అతడు నీ మాట వినడు. అతడు మమ్మల్నే కాదు తన వారిని కూడా కష్ట పెడుతున్నాడు. అతడికి నేనంటే కూడా గిట్టదు లక్ష్యము లేదు. మొదటి నుండి నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చి కయ్యానికి కాలు దువ్వు తుంటాడు. కాని ఏమి చేస్తాము మా అన్నగారి మాటకు తలవంచి సంధికి అంగీకరించక తప్పదు. మేమంతా కలసి మెలసి ఉన్నాము కదా ! అతడే కదా దుర్బుద్ధితో ఇంత చేసి కురువంశ నాశనానికి కారణం ఔతున్నాడు. భరతవంశం అపకీర్తి పాలౌతుందన్న చింతకూడా వాడికి లేదు. వాడు చచ్చేవరకు మారడు. కృష్ణా ! నువ్వైనా వాడికి బుద్ధి చెప్పు " అన్నాడు. కృష్ణా ! నిండు సభలో మాతాతగారు , మా గురువులు, పెద్దలు వినుచుండగా నా మాటగా వాడికి చెప్పు " మనం అన్నదమ్ములము. పరాయి వాళ్ళు వేలెత్తి చూపేలా నడచుకోవడం తగదు. పెద్దల మాటలు విని రాజ్యాన్ని పంచుకుని ఉండటం ఉత్తమము కదా " కనుక కృష్ణా ! ఎలాగైనా సంధి పొసగేలా చూడు అందరం కలసి మెలసి ఉంటే లోకం అంతా సుఖంగా ఉంటుంది కదా! " అన్నాడు. భీముని మాటలకు కృష్ణుడు నవ్వి " ఏమిటిది భీమసేనా ! నువ్వేనా అన్నది నేనేనా విన్నది. అగ్ని చల్లారి నట్లు , పర్వతం తేలిక అయినట్లు ఇలా సంధి మాటలు నీ నోట వినబడుతున్నాయి. అసలు నీ సంకల్పం ఎటువంటిది మరచావా ! యుద్ధం చేయడము దుర్యోధనుని గడగడ లాడించడం మీ అన్నకి రాజ్యం కట్టబెట్టడం ఇదే కదా నీ లక్ష్యం. భయం అంటే ఎరగని నీవు ఇలా పిరికి మాటలు మాట్లాడు తున్నావు ఇది నీకు ఎవరు నేర్పారో " అంటూ నవ్వగానే భీమునుకి కోపం వచ్చి " కృష్ణా! పెద్ద పెద్ద మాటలు చెప్పొద్దు. మా అన్న ధర్మజుని మాటకు మేము ఎదురు చెప్పము. నా శక్తి ఏమిటో తెలియక మాట్లాడుతున్నావు. నాకు కోపం వస్తే భూమ్యాకాశాలు ఏకం చేస్తాను " అన్నాడు. కృష్ణుడు " భీమా ! ఏదో పరిహాసానికి అన్న మాటకు అంత కోపం ఎందుకయ్యా ! నీకు నీ సోదరులకు కౌరవులు చేసిన కీడు మరచి పౌరుషం లేకుండా మాట్లాడుతుంటే క్షత్రియ ధర్మం కాదని చెప్పాను. అర్జునునికి నేను సారధ్యం వహిస్తుంటే నీవు పక్కన లేకుంటే మాకు విజయం చేకూరుతుందా చెప్పు " అన్నాడు. భీముడు ! సరేలేవయ్యా ఈ మాటలకు భీముడు కోపించడులే. ముందు హస్థినకు వెళ్ళి మా అన్న ధర్మరాజు మనసు కుదుట పడేలా సంధి కుదుర్చుకుని రా. యుద్ధమే జరిగితే ఈ భీముడు ఏనుగుల కుంభస్థలాలు పగుల కొడతాడు, గుర్రములను నేల కూలుస్తాడు. అప్పుడు ఏమాత్రం అలసి పోని నన్ను చూసి నువ్వు ఆశ్చర్య పోతావులే " అన్నాడు. కృష్ణుడు " భీమసేనా! నువ్వు అన్నదానికంటే ఎక్కువ చేస్తావు. నీ శక్తి నాకు తెలియనిదా ! కురు సభకు వెళ్ళి సంధి ప్రయత్నాలు చేస్తాను. యుద్ధమే వస్తే మాకందరికి నువ్వే దిక్కు " అన్నాడు నవ్వుతూ.

అర్జునుడు[మార్చు]

ఆ తరువాత " వాసుదేవా! మా అన్న ధర్మరాజు చెప్పిన తరువాత నేను చెప్పటానికి ఏముంది. మాపెదనాన్న చాలా దురాశా పరుడు. అతడు రాజ్యంలో భాగం ఇవ్వడు. సుయోధనుడు దుర్మార్గుడు అతడు మాకు రాజ్య భాగం ఇవ్వడానికి అంగీకరించడు. ఈ పరిస్థితిలో నువ్వే మాకు మార్గదర్శకుడివి. నీవు తలపెట్టిన ఏ కార్యమైనా దిగ్విజయం ఔతుంది. అది నీ సంకల్ప బలం. ఆనాడు ధర్మరాజును మాయా జూదంలో ఓడించి నిండు సభలో అవమానించి అడవులకు పంపిన ఆ దుర్మార్గులు చంప తగిన వారే. అందుకే నీకు మామీద ఉన్న వాత్సల్యం కారణంగా యుద్ధం అనివార్యము అన్నావు. మేము ద్రౌపదిని నిండు సభలో కొప్పు పట్టుకుని అవమానించినా ఊరక ఉండి తలవంచు కుని అడవులకు వెళ్ళాము. నీవు అవన్నీ మనసున తలచక ఇరుపక్షాలకు సంధి కుదిర్చి అందరికీ సంతోషం కలుగ చేయి. నేను కోరేది ఇదే " అన్నాడు. శ్రీకృష్ణుడు " అదేమిటి అర్జునా! నీవు అంతగా చెప్పాలా నా శాయ శక్తులా సంధికి ప్రయత్నిస్తాను. అయినా సుయోధనుడు రాజ్యం ఇచ్చేవాడైతే చిన్నప్పటి నుండి మిమ్ము ఇలా కష్టాల పాలు చేస్తాడా ? ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు " వచ్చిన వాడు ఫల్గుణుడు అతనిని గెలవడం కష్టం జయాపజయాలు దైవాధీనం కనుక సంధి కుదుర్చుకుంటాము " అన్నప్పుడు ఏమన్నాడో మరచావా? పాండవులకు మాతో పొత్తు ఎలా కుదురుతుంది. నేను వారికి రాజ్యం ఇవ్వను వారిని యుద్ధంలో గెలిచి రాజ్యం అంతా నేను అనుభవిస్తాను " అనలేదా ! ఇప్పుడు సంధి ఎలా చేస్తాడులే పోనీలే సంధి మాట ఎలా ఉన్నా నేను వారి మనోభావాలు తెలుసుకుంటాను " అన్నాడు.

నకులుడు[మార్చు]

తరువాత నకులుడు ఇలా అన్నాడు " కృష్ణా ! మా అన్నయ్యల మాటలు మాకు అనుసరణీయాలు. వనవాస కాలంలో ఉన్న ఆవేషకావేషాలు ఇప్పుడు లేవు. వాళ్ళు తప్పు చేసారని మేము తప్పు చేయాలా ! గోగ్రహణ సమయంలో అర్జునుని చేతిలో ఓడి పోయిన తరువాత వారి మనోభావాలలో మార్పు వచ్చి ఉంటుంది. మా పక్షాన నువ్వు, ఏడు అక్షౌహినుల సైన్యం ఉందని వారికి తెలిసే ఉంటుంది. పాంచాల, యాదవ, మత్స్య, పాండ్యాది దేశాల అండే కాక నీ అండ భీమార్జునుల పరాక్రమము ఉన్నాయని తెలిసి భయపడకుండా ఉంటారా ! భీష్మాది పెద్దలు వారికి హితవు చెప్పరా ! నీమాటలు వారిలో పరివర్తన తీసుకు రాదా . నీ ప్రయత్నం సఫల మౌతుంది. మనకు విజయం సిద్ధిస్తుంది.

సహదేవుడు[మార్చు]

అన్నీ విన్న సహదేవుడు " మా అన్నయ్యలు శాంతి వచనాలు పలకడం నీవు వినడం బాగుంది. భీమార్జునులు తమ పరాక్రమము మరచి ఇలా దీనంగా ఆలోచించడం బాగుందా ! మనకోసం యుద్ధం చేయడానికి వచ్చిన రాజులు ఏమంటారు. బంధువులు మిత్రులు మనలను నిందించరా! ధర్మరాజు రాజ్యభాగం కోసం యాచించడం శ్రీకృష్ణుడు దానిని కురుసభలో అడగటం వారు గర్వంతో కాదనడం ఇంతకంటే హీనమైన కార్యం ఇంకొకటి ఉందా! ఈ బిచ్చపు కూడు రుచిస్తుందా ! మీ రాయభారానికి ఒప్పుకుని వారు ఎంతో కొంత మాకు ఇచ్చినా ఈ సంధి పొసగదు. యుద్ధమే శరణ్యము కనుక నా మాటగా సుయోధనునికి ఇలా చెప్పు " సుయోధనా ! నువ్వు కూడా నీ తమ్ములతో అరణ్యాలలో ఉండి వచ్చి రాజ్యభాగం అడిగి మేము ఇవ్వకుంటే మీకు ఎలా ఉంటుంది. కనుక మాకు రాజ్యభాగం ఇవ్వక తప్పదు. లేకుంటే నీకు చావు తప్పదు. ఇక నీ మాయ మాటలు వినే స్థితిలో మేము లేము అని చెప్పు " అన్నాడు. సహదేవుని మాటలకు సాత్యకి సంతోషించాడు. " సహదేవా ! చక్కగ చెప్పావు. సుయోధనునికి నీతులు చెపితే మన పరువు పోవడం తప్ప ప్రయోజనం లేదు . ఏ విధంగా చూసినా సంగ్రామమే మన కర్తవ్యం ఇక్కడ చేరిన రాజులకు అదే ఇష్టం " అన్నాడు సాత్యకి . సహదేవుడు, సాత్యకి మాటలకు అందరూ హర్షద్వానాలు చేస్తూ తమ అంగీకారం తెలిపారు.

ద్రౌపది[మార్చు]

దస్త్రం:Draupadi telling about the story of her unfolded hair to Krishna.jpg
ముడివేయని జుట్టుని శ్రీకృష్ణునకు చూపించి బాధపడుతున్న ద్రౌపది

తరువాత ద్రౌపది " మా రాజ్యాన్ని అపహరించి మమ్మల్ని అడవులకు పంపినది చాలక సంజయుని పంపి ఊరడింపు మాటలు చెప్పించాడు. ఆ మాటలకు ధర్మరాజు పొంగి పోయి ఐదు ఊళ్ళు ఇచ్చినా చాలు అనడమా? ఏమి వింత. ధర్మరాజు సుయోధనుని మీద ప్రేమాతిశయంతో ఇన్ని అవమానాలను సహించి ఊర కున్నాడేమో కాని రాజ్యభాగం తీసుకోకుండా ఊరకుంటే పాండవులంతటి పిరికి వాళ్ళు, అసమర్ధులు, అవివేకులు, సిగ్గులేని వారు లేరని లోకులు నిందించరా ! పాండవుల ముందు కౌరవులు ఎంత. పాండవులు కౌరవుల ఆగడాలు సహించి ఊరు కోవడానికి వారు బ్రాహ్మణులా ! క్షత్రియులా ! అసలు వారు తక్కువ వారని ఎందుకు నిరూపించు కోవాలి. అసలు ఈ సంధి కౌరవులకే మేలు చేసేలా ఉంది. సుయోధనుడు ఎవరికి భయపడడు. అతడు నీ మాటలు ఆలకిస్తాడో లేదో సంధి కుదరక పోతే పాండవులు యుద్ధం చేస్తారో తిరిగి అడవులకే పోతారో వారికే తెలియాలి. నాకు తోచింది చెప్పాను. మీకు తోచింది చెయ్యండి . నేను అగ్నిలో పుట్టాను. భరత వంశానికి వచ్చాను. పాండు రాజుకు కోడలును అయ్యాను. లోకవంద్యులైన భర్తలను పొందాను. సౌందర్య వంతులైన పుత్రులను కన్నాను. నీ చెల్లెలు సుభద్ర కంటే ఎక్కువగా నీ అభిమానాన్ని పొందాను. కృష్ణా అటువంటి నన్ను రాజసూయ యాగానంతరం అవభృదనైన నన్ను కొప్పు పట్టుకుని సభలోకి ఈడ్చి వలువలు లాగాడు. లోకంలో మరే స్త్రీ కైనా ఇటువంటి అవమానం జరిగిందా? ఆసమయంలో మాటాడ లేక ఊరకుంటే నేను నిన్నే కదా నమ్మాను. ఈ విషయం సంధి మాటలు మాటాడే సమయంలో నీవు గుర్తు పెట్టుకోవాలి. ఆ సమయంలో నన్ను కోడలిగా తలపక దాసిలా తలచిన ధృతరాష్ట్రుడి వద్దకు నా భర్తలతో వెళ్ళినప్పుడు కోడరికం చెయ్యాలా? దాసిలా ఊడిగం చెయ్యాలా ? నువ్వే చెప్పు " అంటూ ద్రౌపది ఒక్క సారి లేచి నిలబడి తన నిడుపాటి వెండ్రుకలు చూపి " కృష్ణా ! ఈ శిరోజాలు ఆ నాడు దుశ్శాసనుడి చేతిలో చిక్కి మిగిలినవి. నా కురులు పట్టి ఈడ్చిన వాడి చేతులు యుద్ధభూమిలో నరకబడి నప్పుడే నాకు మనశ్శాంతి. నా మనస్సులో చెలరేగుతున్న అగ్ని మామూలు మాటలకు చల్లారదు . నేను ధర్మజునితో సుయోధనుని శవాన్ని కనులారా చూడకుంటే అర్జునిని గాండీవం తగులబెట్టనా ! మహా వీరులైన భర్తలు నీ వంటి అన్న ఉండగా పరాభవాగ్నిని ఇంకా ఎన్నాళ్ళు ఒడిలో పెట్టుకోను ! " అని ద్రౌపది నిట్టూర్పు విడిచింది. ఆ మాటలకు కృష్ణుడు ద్రౌపదితో " అమ్మా ! అమ్మా కౌరవులు మనకు రాజ్య భాగం ఇవ్వరు. నీవు అనుకున్నట్లు యుద్ధమూ శత్రు సంహారం తప్పక జరుగుతుంది. నీ శోకం మరచిపో . ఇప్పటి వరకు నీవు అనుభ వించిన దుఃఖం కంటే అధికంగా కౌరవ కాంతలు అనుభవించే రోజు ఇక ఎంతో దూరంలో లేదు. యముని వాహనమైన దున్నపోతు మెడగంటలు వినవలసిన కౌరవులకు నా హితవులు చెవి కెక్కవు. కనుక యుద్ధం అనివార్యం " అని ఊరడించాడు.

శ్రీకృష్ణుడు హస్థినకు ప్రయాణం[మార్చు]

దస్త్రం:The Eremites meet with Krishna on the road of Hastinapura.jpg
హస్తినాపురమునకు వెళ్ళు దారిలో శ్రీకృష్ణుని కలసిన మునులు

అర్జునుడు " కృష్ణా! ఇరువర్గాలకు మేలు చెయ్యి. ఇదే నేను కోరేది " అన్నాడు. ధర్మజుడు కృష్ణుని చూసి కృష్ణా నీ జన్మ నక్షత్రం రోహిణి రేపు రేవతి నక్షత్రం . నీకు చంద్రబలం తారాబలం బాగున్నది. కనుక రేపే నీ హస్థిన ప్రయాణానికి సుముహూర్తం " అని ప్రయాణ ముహూర్తం నిశ్చయించాడు. శ్రీకృష్ణుడు సాత్యకిని పిలిచి తన ఆయుధాలైన గధను, సుదర్శన చక్రాన్ని రధంలో పెట్టించ మన్నాడు. యాదవులలో తన వెంట రావలసిన వారిని నిర్ణయించాడు. దారుకుని పిలిచి రధాన్ని సిద్ధం చెయ్య మన్నాడు. సాత్యకిని చూసి " సాత్యకీ ! కౌరవులు కుటిల బుద్ధులు నువ్వు కూడా నా వెంట రా " అని హస్థినకు పయనమయ్యాడు. అర్జునుడు ధర్మరాజు శ్రీకృష్ణుని వెంట ఊరి వెలుపలి వరకు వచ్చి సాగనంపారు. చివరిగా ధర్మరాజు " కృష్ణా! నీవు మాతల్లి కుంతీ దేవి వద్దకు వెళ్ళి ఆమెకు నా నమస్కారములు చెప్పు. ఆమెను ఊరడింఛు. మా గురువు ద్రోణ, కృపాచార్యులకు నా నమస్కారములు చెప్పు. భీష్మునికి, విదురునికి నా నమస్కారములు అందించు " అన్నాడు. శ్రీకృష్ణుడు సరేనని చెప్పి హస్థినకు పయన మయ్యాడు. మార్గ మధ్యములో కుశస్థలిలో విడిది చేసాడు.

శ్రీకృష్ణునకు హస్థినాపుర స్వాగతము[మార్చు]

దస్త్రం:Drithirastra receives Krishna in his court.jpg
కృష్ణునికి స్వాగతం చెబుతున్న ధృతరాష్ట్రాదులు

శ్రీకృష్ణుడు కుశస్థలిలో విడిది చేసిన విషయం ధృతరాష్ట్రునికి తెలిసి వెంటనే భీష్ముని, ద్రోణుని, కృపాచార్యుని, విదురుని, దుర్యోధనుని , శకునిని, కర్ణుని, సైంధవుని పిలిపించి " శ్రీకృష్ణుడు పాండవ కార్యార్ధి అయి కుశస్థలి వరకు వచ్చాడు. మనమంతా అతనికి ఘనంగా స్వాగత సత్కారాలు చేయాలి సన్నద్ధం చెయ్యండి " అన్నాడు. ఆ మాటలు విన్న భీష్ముడు ద్రోణుడు ఎంతో సంతోషించారు. సుయోధనుడు స్వాగత సన్నాహాలు చేస్తున్నాడు. ధృతరాష్ట్రుడు విదురుని చూసి " విదురా ! శ్రీకృష్ణునినికి విడిది ఎక్కడ ఏర్పాటు చెయ్యాలి? శ్రీకృష్ణునికి ఇష్టమైన ఏ వస్తువులు కానుకగా ఇవ్వాలి ? " అని అడిగాడు. విదురుడు " రాజా ! పాండవులకు ఐదు ఊళ్ళు కూడా ఇవ్వలేని మనం శ్రీకృష్ణునికి కానుకలు సమర్పించ గలమా అన్నాడు. నీ మనసులో మాట గ్రహించాను. శ్రీకృష్ణునికి ఏవో కానుకలు ఇచ్చి లోబరుచు కోవాలని పాండవులతో విభేదం కలిగించాలని చూస్తున్నావు. నీవు ఇంత తెలివి హీనుడివా ! మేరు పర్వతాన్ని ఇచ్చినా శ్రీకృష్ణుడు అర్జునుని విడువడు. కనుక నువ్వు శ్రీకృష్ణునికి కాళ్ళకు నీళ్ళిచ్చి కుశల మడిగితే చాలు. శ్రీ కృష్ణుడు ఏ పనికి వస్తున్నాడో అది నెరవేర్చడం తప్ప వేరేమి శ్రీకృష్ణునకు పని లేదు. ఇంకేమిచ్చినా అది అతనికి ప్రియము కాదు " అన్నాడు. అందుకు సుయోధనుడు " తండ్రీ ! విదురుడు చక్కగా చెప్పాడు. మనము ఏమిచ్చినా కృష్ణుడు పాండవులను విడువడు. మనము కానుకలు ఇచ్చి అతనిని లోబరుచు కోవడానికి ప్రయత్నిస్తే పాండవులకు భయపడి ఇదంతా చేస్తున్నామని లోకులు అనుకుంటారు. ఇది చూసి మన అల్పత్వం బయటపడి శత్రువులు రెచ్చి పోవడం మనకు మంచిది కాదు " అన్నాడు. భీష్ముడు ధృతరాష్ట్రుని చూసి " రాజా ! నువ్వు కానుకలు ఇస్తే ఒకరకంగా ఇవ్వకుంటే ఒకరకంగా చేసే వాడా శ్రీకృష్ణుడు. అతని ధర్మయుక్తమైన మాటలు సావధానంగా విని అతని పని సఫలం చేసి పంపడమే నీ బాధ్యత " అన్నాడు. సుయోధనుడు " కృష్ణుడు పాండవులకు రాజ్యంలో సగ భాగం ఇవ్వమంటాడు. నేను ఇవ్వనంటాను. మీరు చెప్పినట్లు శ్రీకృష్ణుడు పాండవులకు సర్వస్వం కనుక అతనిని పట్టి బంధించి కారాగారంలో పెడితే పాండవులు రెక్కలు తెగిన పక్షులు ఔతారు. యాదవులు, పాంచాలురు మనపక్షం వహిస్తారు. దానినికి నేను తగిన సన్నాహాలు చేస్తున్నాను. ఇక మీరేమి చేస్తారో చెయ్యండి " అన్నాడు. అతని మాటలు విని అంతా నిర్గాంత పోయారు. ధృతరాష్ట్రుడు " సుయోధనా ! ఏమి నువ్వు శ్రీకృష్ణుని బంధిస్తావా నీకు మతి భ్రమించ లేదు కదా! లోకాని కంతటికీ కీడు చేస్తావా! శ్రీకృష్ణుడు మన వద్దకు దూతగా వస్తున్నాడు. దూతను మర్యాద చెయ్యడం ధర్మం. బంధించడానికి అతడు చేసిన అపరాధం ఏమిటి " అన్నాడు. " రాజా ! నీ కుమారుడు శ్రీకృష్ణుని బంధిస్తే సర్వనాశనం ఔతాడు. ఇక నేను ఇక్కడ ఉండలేను " అని భీష్ముడు అక్కడి నుండి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు " కుమారా ! ఇంతటి కొరగాని పనులు మానుము. దీని వలన నీకు కీడే కాని మేలు కలుగదు . ఆ పై నీ ఇష్టం " అన్నాడు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు భీష్ముని , బాహ్లికుని, ద్రోణుని తీసుకుని శ్రీకృష్ణునికి స్వాగతం చెప్పడానికి నియమించాడు. శ్రీకృష్ణుడు తనకు స్వాగతం చెప్పిన వారిని తగురీతిన గౌరవించి వారిలో తన మిత్రుడైన కృతవర్మను తన వెంట బెట్టుకుని హస్థినలో ప్రవేశించాడు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణునికి ఎదురేగి కౌగలించుకున్నాడు. శ్రీకృష్ణుడు అందరి యోగక్షేమాలు అడిగాడు. మిగిలిన వారి యోగక్షేమాలు అండగటానికి సాత్యకిని నియమించాడు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణునికి ఉన్నత ఆసనమిచ్చి అర్ఘ్యపాద్యములు సమర్పించాడు. శ్రీకృష్ణుడు భీష్మ, ద్రోణ, కృపాచార్యులకు నమస్కరించి ధృతరాష్ట్రుని అనుమతి తీసుకుని విదురుని మందిరానికి వెళ్ళాడు.

కుంతీదేవి ఆవేదన[మార్చు]

శ్రీకృష్ణుడు " విదురునితో పాండవులను గురించిన విషయాలు చర్చించిన తరువాత కుంతీ దేవి మందిరానికి వెళ్ళాడు. కుంతీ దేవి తన మేనల్లుడిని పట్టుకుని ఏడ్చి " కృష్ణా ! నీకు తెలియనిది ఏమున్నది. నాయనా ! ధర్మాత్ములు, నీతి మంతు లైన పాండురాజ కుమారులై ఎన్నో సుఖాలు అనుభవించ వలసిన వారు అడవుల పాలు అయ్యారు. తండ్రి లేని వారికి తల్లినైన నేను కూడా దూరం అయ్యాను. నాయనా కృష్ణా ! ధర్మరాజు క్షేమమే కదా ! బకుని చంపిన భీముడు క్షేమమే కదా ! అర్జునుడు బాగున్నాడా ! నకుల, సహదేవులు బాగున్నారా ! నా కోడలు ద్రౌపది ఎలా ఉంది ? ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం . ఆమె నాకు చేసిన సేవలు మరువ లేను. ఆ సాధ్వికి కురు సభలో జరిగిన అవమానం తచుకుంటే మనసు రగిలి పోతుంది. విదురుడు తప్ప సభలో ఎవరు వారిని ఖండించారు? కృష్ణా ! ఈ పదమూడేళ్ళు దాయాదుల దయ మాలిన తిండి తినడం ఎంతో బాధగా ఉంది. నేను మాత్రం సుయోధనాదులను నా కన్న కొడుకులతో సమానంగా ప్రేమించానన్నదానికి ఆ దేవుడే సాక్షి. జరిగిన దానికి ఎవరిని నిందించ గలము ? కృష్ణా ! ఒకరిని అర్ధించి ఆర్జించిన సంపదలు ఎవరిని ఆనంద పెడతాయి. పరాక్రమము లేని క్షత్రియుని ఎవరు గౌరవిస్తారు? " అని ధర్మజునికి చెప్పు. " క్షత్రియ కన్య పుత్రులను ఎందుకు కంటుంది తన కుమారులు అత్యంత పరాక్రమ వంతులు కావాలనే కదా ! అలా కాక పోతే వారు మగవారు అనిపించుకోరు కదా ! " అని భీమార్జునులకు చెప్పు. " భుజబలంతో జీవించడం క్షత్రియ ధర్మమని అలా కాక పిరికి వారిలా జీవించడం హేయమని నకుల, సహదేవులకు చెప్పు. ఇంకా తెలియకున్న ద్రౌపదిని అడిగి తెలుసు కోమని చెప్పు " అని పలికింది. శ్రీకృష్ణుడు " అత్తా ! నీ మనసులో మాట నెరవేరుతుంది. కలత పడవద్దు నీ కుమారులు వీరోచిత సంపదలు మాత్రమే అనుభవిస్తారు. " అని శ్రీకృష్ణుడు పలికాడు. " కృష్ణా ! పాండవులకు తల్లి తండ్రి దైవం అన్నీ నువ్వే నిన్ను నమ్ముకున్న వాళ్ళకు ఆపద దరి చేరదు " అని పలికింది.

సుయోధనుని మందిరంలో శ్రీకృష్ణుడు[మార్చు]

విదురుని మందిరం నుండి బయలు దేరిన శ్రీకృష్ణుడు కృతవర్మను, సాత్యకిని తీసుకుని సుయోధనుని మందిరానికి వెళ్ళాడు. ఆ సమయంలో సుయోధనుడు భీష్మ, ద్రోణ, కర్ణ, శకుని, సైంధవుడు, దుర్ముఖుడు, మొదలగు వారు పర్యవీష్టి ఉండగా సింహాసము పై కూర్చున్నాడు. శ్రీకృష్ణుని రాక తెలుసుకుని అతడిని ఎదురు వెళ్ళి తోడ్కొని వచ్చాడు. శ్రీకృష్ణుడు సుయోధనుని, దుశ్శాసనుని ఆలింగనము చేసుకుని కుశల ప్రశ్నలు వేసాడు. సుయోధనుడు శ్రీ కృష్ణునికి ఉచిత ఆసనం ఇచ్చి సత్కరించాడు. తన ఇంటిలో భోజనానికి ఆహ్వానించిన సుయోధనుని శ్రీకృష్ణుడు సున్నితంగా తిరస్కరించాడు. సుయోధనుడు " కృష్ణా ! మా ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళడం న్యాయం కాదు. నీవు కురు పాండవులకు సమానుడవు. మా తండ్రికి ఇష్టుడవు. మా ఇంట భోజనం చేయక పోవడానికి కారణం ఏమిటి " అన్నాడు. " సుయోధనా! నేను రాయబారిగా వచ్చాను. వచ్చిన పని పూర్తి కాకుండా మీ ఇంట విందులు కుడవడం కానుకలు స్వీకరించడం ధర్మం కాదు కదా! నేను వచ్చిన పని పూర్తి అయిన తరువాత నీ ఇంట విందుకు వస్తాను " అన్నాడు. సుయోధనుడు " అదేమిటి కృష్ణా ! రాయబారం వేరు. విందు వేరు. దానికీ దీనికీ లంకె ఏమిటి? హాయిగా భోజనం చేసి పనులు చక్క పెట్ట వచ్చు భోజనం చేయనంటే ఎలా ? కనుక నీవు మా ఇంట విందు చేయననడానికి కారణం లేదు " అన్నాడు. సుయోధనా " ప్రేమతో పెట్టు భోజనం అత్యంత ప్రియమైనది ఆపద ఉన్న చోట భోజనం మంచిది కాదు. నాకు మీ పట్ల ప్రేమ ఉంది మీ ఇంట నాకు ఆపద లేదు. కాని అయినా ప్రస్తుతం భోజనం చేయలేను. పగ వారి ఇంట భోజనం వారు ఏమి పెడతారో అని అనుమాన పడేలా చేస్తుంది. నాకు పాండవులు అంటే ప్రాణం నీకు వారంటే పగ. చిన్నతనం నుండి నువ్వు అకారణంగా పాండవులకు అపకారం చేస్తూనే ఉన్నావు. అటువంటి పుణ్యాత్ములతో వైరం న్యాయమా? అటువంటి పుణ్యాత్ములకు అపకారం చేసే మీ ఇంట భోజనం మంచిది కాదు. కనుక నేను విదురుని ఇంట భోజనం చేస్తాను " అన చెప్పి సుయోధనుని ఇంట శలవు తీసుకుని విదురుని ఇంటికి వెళ్ళాడు.

విదురుని ఇంట విందు[మార్చు]

విదురుడు అత్యంత ఆదరంగా భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణునికి మర్యాదలు చేసి విందు భోజనం సమకూర్చాడు. విందు పూర్తి అయిన తరువాత విశ్రాంతిగా శ్రీకృష్ణునితో " కృష్ణా ! దుర్యోధనుడు దురభిమాని, నీచుడు, దుష్టబుద్ధి అతడు నీ మాట వింటాడా ! అతడు తన పదకొండు అక్షౌహినుల సైన్యాన్ని చూసి గర్వి స్తున్నాడు. కర్ణుడు ఒక్కడే విజయం చేకూరుస్తాడని నమ్ముతున్నాడు. నీ వస్తున్నావని విని నీ మాటలు విన కూడదని , పాండవులకు రాజ్య భాగం ఇవ్వక ఈ భూమి నంతా తానే ఏలుకోవాలని చూస్తున్నాడు. రాజసూయ యాగంలో ఓడిన రాజులంతా ఇక్కడ చేరారు. వారంతా ఒక్కటై పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి సిద్ధం అయ్యారు కనుక సంధి పొసగదు. కౌరవులకు చేటు కాలం సమీపించింది కనుక కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఆ దుర్మార్గుల ఎదుట కూర్చుని వారు కూయు కారు కూతలు విని వారి చేతిలో అవమానపడటం మంచిది కాదు. కనుక నీవు కురు సభకు వెళ్ళ వద్దని నా అభ్యర్ధన " అని ఆవేదన చెందాడు. సమాధానంగా శ్రీకృష్ణుడు " విదురా! నీవు నా హితము కోరి చెప్పినా నేను ఎందుకు వచ్చానో వారికి తెలియాలి. వారి మనసులో ఉన్నది తెలుసుకుని దానికి అనుగుణంగా చేయాలి కదా ! దుర్యోధనుని దుర్మార్గం నాకు తెలుసు ఈ సంధి పొసగదని నాకు తెలుసు. ఒకడు పని కట్టుకుని పుణ్యం చేసినా పాపం చేసినా అది సిద్ధిస్తుంది. నా మాట ఫలించక పోయినా దాని ఫలితం సిద్ధిస్తుంది. బందువులతో ఏర్పడిన వైరాన్ని పోరాడి ఆ వైరాన్ని మాన్పడం ధర్మమని పెద్దలు అంటారు కదా! కనుక అసాధ్యమైనా కురు పాండవ సంధికి నా ప్రయత్నం చేస్తాను. నన్ను పాండవ పక్షపాతిగా శంకించి సుయోధనుడు నా మాట వినడు. అదీ మంచిదే . అన్నదమ్ములకు వైరం వచ్చినప్పుడు ఇరువురికీ కావలసిన కృష్ణుడు చూస్తూ ఊరక ఉన్నాడన్న అపప్రధ నాకు రాకుండా చూస్తాను. నా మాట వింటే సుయోధనుడు బాగు పడతాడు. లేకున్న లేదు అంతే " అన్నాడు. విదురుడు శ్రీకృష్ణుని వద్ద శలవు తీసుకుని వెళ్ళాడు.

కురుసభకు శ్రీకృష్ణుడు ప్రవేశించుట[మార్చు]

దస్త్రం:Krishna comes into the court of Kauravas.jpg
కురుసభలో ప్రవేశించిన శ్రీకృష్ణుడు

మరునాడు శ్రీకృష్ణుడు కాలకృత్యములు తీర్చుకుని కృతవర్మ సాత్యకులతో కూర్చుని ఉన్నాడు. సుయోధనుడు కర్ణుడు, దుశ్శాసనులను వెంట పెట్టుకుని శ్రీకృష్ణుని వద్దకు వచ్చాడు. అందరూ కొంత సమయం ఇష్టాగోష్ఠి మాట్లాడు కున్న తరువాత సుయోధనుడు శ్రీకృష్ణుని చూసి " కృష్ణా! నా తండ్రి ధృతరాష్ట్రుడు బంధు మిత్ర సమేతంగా కొలువు తీర్చి ఉన్నాడు " అన్నాడు. శ్రీకృష్ణుడు సాత్యకి, కృతవర్మలు వెంట రాగా కురు సభలో సుయోధనాదులతో రాజ భవనానికి వచ్చాడు. విదురుడు శ్రీకృష్ణునికి ఎదురు వచ్చి శ్రీకృష్ణుని సాదరంగా ఆహ్వానించాడు. కర్ణుడు, సుయోధనులు దారి చూపగా శ్రీకృష్ణుడు సభలోకి ప్రవేశించి ధృతరాష్ట్రాదుల సాదర స్వాగతాన్ని అందుకుని తనకై ప్రత్యేకించిన ఉన్నతాసనం మీద కూర్చున్నాడు. సాత్యకి కృతవర్మ శ్రీకృష్ణునికి ఇరివైపులా కూర్చున్నారు. ఆ సభకు నారదాది మహామునులు వచ్చి ఆసీనులై ఉన్నారు.విదురుడు శ్రీకృష్ణుని వెనుక కూర్చుని ఉన్నాడు. సుయోధనుడు, కర్ణుడు పక్కపక్కన కూర్చున్నారు. శకుని తన కుమారులతో ఒక పక్క ఆసీనుడై ఉన్నాడు. సభలోని వారందరూ శ్రీకృష్ణుడు ఏమి చెప్తాడో అని అతురతగా ఎదురు చూస్తున్నారు.

శ్రీకృష్ణుని సందేశం[మార్చు]

కౌరవసభలో శ్రీకృష్ణుడు

శ్రీకృష్ణుడు లేచి సభను ఉద్దేశించి " మహారాజా ! నీకు తెలియనిది ఏమున్నది. అయినా భరత వంశ క్షేమం కొరకు ఇరు కుటంబాలకు మేలు కలిగేలా నాకు తోచినది చెప్తున్నాను. మీ భరత వంశం ధర్మము, సత్యము, కరుణ, ఐకమత్యము, అభివృద్ధి కలిగి ప్రసిద్ధి చెంది ఉంది. అట్టి వంశములో నీవు, నీ సహోదరుడు పాండురాజు జన్మించారు. కనుక నీ పుత్రులు పాండు పుత్రులు పాలు నీళ్ళ వలె కలిసి ఉండక పోతే అప్రతిష్ట పాలు కావాలసి ఉంటుంది. అలా నడిపించ వలసిన బాధ్యత నీది. అయినా నీకు నీ కుమారులు పాండు కుమారులూ సమానమే కదా ! ఈ కురు వంశముకు నీవే పెద్దవి కనుక నీ వంశం మంచి చెడులకు నీవే బాధ్యుడవు. కనుక ఇరు కుటుంబాల యోగక్షేమం దృష్టిలో పెట్టుకుని మెలగాలి. కాని నీ కుమారుల నడవడి మంచిది కాదు వారు ధర్మం తప్పి బంధు మిత్రులను బాధకు గురి చేస్తున్నారు. కౌరవులూ పాండవులూ సఖ్యతతో ఒకే మార్గంలో పయనించడం అందరికీ మంచిది. అలా కాకుండా యుద్ధం సంభవిస్తే వినాశనం తప్పదు. కనుక ఇరు పక్షాలకు సంధి చేయుట మంచిది అది నీ చేతిలోనే ఉంది. ఇక బలాబలాలకు వస్తే భీమార్జునులతో యుద్ధం చేయటానికి మీ పక్షంలో ఎవరున్నారో చెప్పు. ఇక్కడ ఉన్న భీష్మ ద్రోణులను ఎదుర్కొనే వాళ్ళు వారి పక్షంలో లేరు. ఇరు పక్షంలో వారు చని పోవడం తప్ప కంటే సంధి మేలు కదా! కురు సామ్రాట్టువైన నువ్వు నీ కుమరులైన కౌరవ, పాండవులలో ఒకరి పట్ల శతృత్వం వహించడం తగదు. ఈ సమయంలో నీ ఉపేక్ష భూ ప్రజలందరికీ చేసే ద్రోహం. అంతే కాదు నీకు నువ్వే చేసుకునే ద్రోహం. కురు, పాండవులలో ఎవరు మరణించినా కీడు నీకే కదా! అది నీకు మేలు చేయదు కదా! పండితులూ, బలాడ్యులూ, పరాక్రమ వంతులూ అయినా కురు వంశజులు ఈ కొరగాని యుద్ధంలో మరణించకుండా నీ రాజ నీతిని ప్రదర్శించి అందరి మెప్పు పొంది కీర్తి మంతుడివి కా. నీకు సదా వినమ్రులూ, సహోదర పుత్రులూ, తండ్రి లేని వారూ అయిన పాండు పుత్రులను చిన్నప్పటి నుండి ఆదరించి విద్యాబుద్ధులు గరిపి తండ్రి లాంటి నువ్వు చివరికి ఇలా నిష్కారణంగా విడుచుట తగునా ! వారు ముక్త కంఠంతో నాతో ఇలా చెప్పారు " తండ్రీ ! నీ మాట ప్రకారం మేము అరణ్య అజ్ఞాత వాసాలను పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మా తండ్రి గారి అర్ధ రాజ్యానికి అర్హులమని అనుకుంటున్నాము. మాకు తల్లీ, తండ్రీ, గురువు, దైవం అయిన నీవు మా వలన తెలియక జరిగిన అపరాధాన్ని మన్నించి శాసించండి. సుయోధనాదులకు మా క్షేమం అవసరం లేదు మాకు అన్ని నువ్వే కనుక ధర్మం తప్పక మాకు క్షేమం కావించి ధర్మాన్ని నిలపండి. ధర్మాన్ని, సత్యాన్ని రక్షించగలిగే అవకాశం ఉండీ దానిని రక్షించడంలో ఉపేక్ష వహిస్తే అది వారికి కీడు కలిగించక మానదు " అని మీకు చెప్పమన్నారు. కనుక మహారాజా! నీ సమాధానం ఏమిటో చెప్పు. నేను మీ ఇరు కుటుంబాల బంధుత్వం దృష్టిలో పెట్టుకుని ధర్మం, నీతిని రక్షించడానికి ఈ మాటలు చెప్పాను. మీరు క్రోధం మత్సరం విడిచి పాండవులకు న్యాయం చేస్తూ వారి రాజ్య భాగాన్ని వారికి ఇవ్వడం కంటే మంచి ధర్మం ఏముంది. కనుక మహారాజా! నీవు సముచిత నిర్ణయం తీసుకుని వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి మిగిలినది మీ కుమారునికి ఇచ్చి పుత్ర పౌత్రాదులతో సుఖంగా జీవించు. ధర్మరాజు నిన్ను ఆశ్రయించిన తీరు అతని ధర్మనిష్ఠ నీవు ఎరుగనిదా! నీవు పంచి ఇచ్చిన ఇంద్ర ప్రస్థంలో రాజసూయ యాగంతో దిగ్విజయంతో సంపాదించిన రాజ్యంతో కీర్తి ప్రతిష్టలతో తన రాజ్యంలో తమ్ములతో , తల్లితో సుఖంగా ఉన్నాడు. నీ కుమారులు అతడిని జూదానికి పిల్చి అతని సంపద హరించి అవమానించి అడవులకు వెళ్ళగొట్టాడు. వారి ప్రియ సతిని నిండు సభలో అమానించారు. ఇవి అన్నీ నీ అంగీకారంతోనే చేసాడు. అడవులకు పంపి అష్టకష్టాలకు గురి చేసినా వారు ఇంకా మీతో సఖ్యత కోరుతూ సంధి ప్రయత్నాలు చేస్తున్న ధర్మజుని ధర్మనిష్ట , సత్య వ్రతం ఎవరికి ఉంటుంది. ధృతరాష్ట్ర మహా రాజా! నీ కుమారుల క్షేమం కోరి ఇవన్నీ నీకు చెప్తున్నాను. నీ కుమారుని దురాశను తొలగించి పాండవులను పిలిపించి వారి రాజ్యభాగాన్ని వారికి ఇవ్వడం మంచిది. పాండవులు మీ పాద సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు అది ఇష్టం లేకున్న వారు యుద్ధానికి కూడా సిద్ధమే నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించు " అని చెప్పి శ్రీకృష్ణుడు కూర్చున్నాడు.

జమదగ్ని హితబోధ[మార్చు]

సభ అంతా నిశబ్ధం అయింది. అందరూ శ్రీకృష్ణుని మాటలు నిశబ్ధంగా విన్నారు ఎవరికీ బదులు చెప్పే ధైర్యం లేక నిశ్చేష్టులు అయ్యారు. ఇంతలో జమదగ్ని మహా ముని లేచి " సుయోధనా ! పూర్వం ధంభోద్భవుడు అనే మహారాజు ఉండే వాడు. అతడు ఈ లోకంలో తనకు ఎదురు ఎవరు లేరని గర్వించాడు. ఆ సమయంలో నర నారాయణులు గంధమాదన పర్వతం పై తపస్సు చేసు కుంటున్నారు. ఆ దంభోద్భవుడు వారి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ తపస్సు చేసు కుంటున్న మునులు ఎంత చెప్పినా వినలేదు. ఆ సమయంలో నరుడు చేత దర్భలు ధరించి దంభోద్భవునితో యుద్ధం చేసి ఓడించి ప్రాణాలతో వదిలి వేసాడు. ఆ నర నారాయణులే ఈ కృష్ణార్జునులు. కనుక దంభోద్భవునిలా గర్వంతో వారిని ఎదిరించక సంధి చేసుకో " అన్నాడు.

కణ్వమహర్షి హితబోధ[మార్చు]

ఆ తరువాత కణ్వ మహాముని లేచి " సుయోధనా ! తన బలం ఎదిరి బలం తెలియక గర్వంతో, అహంకరంతో యుద్ధానికి తలపడటం మంచిది కాదు. పూర్వం ఇలా గరుత్మంతుడు అహంకారం పూరితుడై గర్వభంగ పడ్డాడు. దేవేంద్రుని రధసారధి మాతలి తన కూతురు గుణకేశికి సర్ప నాయకుడు ఆర్యకుని మనుమడు కురుడి కుమారుడైన సుముఖుడిని భర్తగా నిర్ణయించాడు. ఆ విషయం ఆర్యకునితో చెప్పగా అతడు " అయ్యా ! నా కుమారుడు కురుడిని గరుత్మంతుడు చంపాడు. ఆ తరువాత సుముఖుని కూడా ఒక నెలరోజులలో చంపుతానని చెప్పి కోపంతో వెళ్ళాడు కనుక ఈ సంబంధానికి నేను ఒప్పుకొన లేను అన్నాడు. అందుకు మాతలి నేను దేవేంద్రునితో చెప్పి సుముఖుని ప్రాణాలు కాపాడ గలను రండి " అని దేవేంద్రుని దగ్గరకు తీసుకు వెళ్ళాడు. ఆ సమయంలో దేవేంద్రునితో మహా విష్ణువు ఉన్నాడు. దేవేంద్రుడు మాతలి ద్వారా విషయం తెలుసుకుని మహా విష్ణువు అనుమతితో సుముఖుని దీర్గాయుష్మంతుని చేసాడు. మాతలి తన కుమార్తెను సుముఖునికి ఇచ్చి వివాహం జరిపాడు. ఇది విని గరుత్మంతుడు కోపావేశంతో అక్కడికి వచ్చి విష్ణువు ముందరే " ఇంద్రా ! నీవు అధితి పుత్రుడవు నేను వినతా పుత్రుడను. మన ఇద్దరికి తండ్రి కశ్యపుడు. మనం ఇద్దరం రాక్షసులను వెతికి వెతికి చంపుదాం. నీ కంటే నేను ఎందులో తక్కువ నా నిర్ణయానికి నీవు ఎందుకు అడ్డుపడ్డావు " అన్నాడు. అందుకు ఇంద్రుడు " ఇది నా నిర్ణయం కాదు విష్ణుమూర్తి తీసుకున్న నిర్ణయం " అన్నాడు. గరుత్మంతుడు " తమ్ముడా! నేను ఏమిటో నా బలమెంతో నీకు తెలియదు నీ దేవతా కులమంతా నా ఒంటి మీది ఒక ఈకతో సమం కాదు " అన్నాడు. విష్ణు మూర్తి " నీవు అంత బలవంతుడివా ఏదీ చూపించు " గరుడుని వీపుపై చేతిని ఉంచి అన్నాడు. ఆ భారానికి గరుడుడు కుప్ప కూలి పెద్దగా అరిచాడు. విష్ణుమూర్తి చేయి తీయగానే లేచి నిలబడ్డాడు. విష్ణు మూర్తి నవ్వి " గరుడా! గర్వము మంచిది కాదు బుద్ధిగా ఉండు " అని చెప్పి వెళ్ళి పోయాడు. ఇలా చెప్పి కణ్వ మహర్షి ఈ సంగతి నారదునికి కూడా తెలుసునని అన్నాడు. కనుక సుయోధనా బలగర్వం పనికి రాదు. పాండవులతో ఇకనైనా సఖ్యంగా ఉండు అన్నాడు.

నారద మహాముని[మార్చు]

తరువాత నారదుడు " సుయోధనా! మనం ఎంత బలవంతులమైనా ఎదిరి బలం ఎక్కువై నప్పుడు మన బలం తక్కువే కదా ! ఎంతటి శక్తివంతుల కైనా ధర్మ మార్గాన పయినించి నపుడే అది బలం చేకూరుస్తుంది. శక్తివంతుడైనా అహంకారం బలహీన పరుస్తుంది. ఏది ఏమైనా నేను అనుకున్నది చేస్తాను అంటే గాలవుడికి కలిగిన ఆపదలే ఎదురౌఉతాయి. గాలవుడు అనే ముని కుమారుడు విశ్వామిత్రుని వద్ద విద్యను అభ్యసించాడు. విద్యాభ్యసము పూర్తి కాగానే గురుదక్షిణ ఇస్తానని అన్నాడు. విశ్వా మిత్రుడు వద్దు అన్నాడు, గాలవుడు అంగీకరించక మూర్ఖంగా గురుదక్షిణ అడగాలి అని పట్టుపట్టాడు. విశ్వామిత్రుడు కోపంచి ఒక చెవి మాత్రం నల్లగా ఉన్న తెల్లని గుర్రములు ఎనిమిది వందలు సమర్పించు కొమ్మని చెప్పాడు. గాలవుడు అందుకు అంగీకరించి అశ్వములను వెతుకుతూ బయలు దేరాడు. కాన్ని అతనికి ఎక్కడ వెతికినా అలాంటి గుర్రాలు దొరక లేదు. గాలవుడు నిద్రాహారాలు మాని గుర్రాల కొరకు వెదకడం మొదలు పెట్టాడు. మార్గ మద్యంలో అతడు తన చిన్న నాటి నేస్తం అయిన గరుత్మంతుని కలిసాడు. గరుత్మంతుడు గాలవుని సమస్య తెలుసు కుని అతడిని వీపు మీద ఎక్కించు కుని యయాతి అనే రాజు వద్దకు తీసుకు వెళ్ళాడు. గాలవుని కోరిక విన్న యయాతి తన వద్ద అలాంటి గుర్రలు లేవని తన కుమార్తె మాధవిని అతనికి ఇచ్చి వివాహం చేసాడు. మాధవితో సహా గాలవుడు గుర్రాలను వెదకడం మొదలు పెట్టాడు. అలా అతడు గుర్రాల కొరకు ఇక్ష్వాకు మహారాజు వద్దకు వెళ్ళాడు. ఇక్ష్వాకు మహారాజు వద్ద అలాంటి గుర్రాలు రెండు వందలు ఉన్నాయి. సంతానం కొరకు పరితపిస్తున్న ఇక్ష్వాకు హయములను ఇచ్చి బదులుగా ఒక సంతానం కలిగే వరకు మాధవిని తన వద్ద ఉంచమని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక్ష్వాకు మాధవి ద్వారా వసుమనస్సుడు అనేకుమారుని పొందిన తరువాత మాధవిని గాలవునికి ఇచ్చాడు. ఇదేవిధంగా మిగిలిన హయములను సమకూర్చుకొమ్మని చెప్పి గరుత్మంతుడు వెళ్ళాడు. గాలవుడు కాశీరాజు దివోదాసుకు మాధవిని ఇచ్చి రెండు వందల గుర్రాలను తీసుకున్నాడు. మాధవి వలన దివోదాసుకు ప్రత్యర్ధనుడు అనే కుమారుడు కలిగాడు. తరువాత గాలవుడు మాధవిని భోజ పురాధీశుడు ఔశీనరునికి ఇచ్చి మరొక రెండు వందల గుర్రాలను పొందాడు. ఔశీనరుడికి మాధవి వలన శిబి అనే కుమారుడు జన్మించాడు. అయినా మాధవి కన్యాత్వం చెడలేదు. మిగిలిన గుర్రాల కొరకు గాలవుడు వెదుకుచుండగా గరుత్మంతుడు వచ్చి గాలవునితో " గాలవా ! ఇలాంటి గుర్రాలు ప్రపంచంలో ఇక లేవు. ఈ ఆరు వందల గుర్రాలను నీ గురువు గారికి ఇచ్చి రెండు వందల గుర్రాలకు బదులు మాధవిని అతనికి ఇమ్ము " అని చెప్పాడు. అందరూ విశ్వామిత్రుని వద్దకు వెళ్ళాడు. గరుత్మంతుడు " అయ్యా ! గాలవుడు పసివాడు అతనిని కరుణించి ఈ ఆరువందల గుర్రాలను తీసుకుని మాధవిని మిగిలిన రెండు వందల గుర్రాలకు బదులు స్వీకరించండి అన్నాడు. విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి ఆమె ద్వారా అష్టకుడు అనే కుమారుని పొంది తిరిగి మాధవిని గాలవునికి ఇచ్చాడు. కనుక గాలవుని మాదిరి మూర్ఖుడిలా ప్రవర్తించ వద్దు. గురు దక్షిణ వద్దు అన్నప్పుడు విజ్ఞతతో ఊరక ఉంటే ఇంత అవస్థలు ఉండేవి కాదు కదా ! దురంహంకారం వదిలి పాండవులతో మైత్రి చేసుకుని కురువంశ వినాశనాన్ని ఆపు. శ్రీకృష్ణుని మాట విను " అన్నాడు. మునీశ్వరుల మాటలు పట్టించుకోని సుయోధనుడు " మునీశ్వరులారా! బ్రహ్మ దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. ఇక మీరు మాటలు చాలించండి " అన్నాడు.

శ్రీకృష్ణుని హితవు[మార్చు]

ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు " మునీశ్వరులారా! మీ మాటలు నా కుమారుడు విని ఉంటే మంచిది వినక పోతే నేను చేసేది ఏమీ లేదు కదా ! కృష్ణా ! ఇహమూ పరమూ కలిగే విధంగా నీవు చెప్పావు కాని నీవు చెప్పినది చేసే మార్గం నాకు కనిపించ లేదు. నా కుమారుడు మూఢుడు అతనిని నువ్వు మన బంధుత్వం పురస్కరించుకుని శాంతింప చెయ్యి " అన్నాడు. కృష్ణుడు " కుమారా సుయోధనా ! మంచి వంశంలో పుట్టిన నీవు ఈ దురాగతాలకు పాల్పడటం ఏమిటి. నీ వంటి మహారాజుకు ఇది తగునా ! అల్పుల మాటలు నమ్మి ఆపదలు కొని తెచ్చుకోవద్దు. శకుని, కర్ణుని మాటలు నిన్ను పెడదారిన పెడతాయి. నీ బంధు మిత్రులు, కుమారులు కూడా చెడు మార్గాన పడకుండా పాండవులతో సంధి చేసుకో. పాండవులు నీ పై ఎన్నడూ శత్రుత్వం వహించ లేదు అత్యంత పరాక్రమ వంతులైన వారిని వదిలి అల్పులను ఆశ్రయించి కుల వినాశనం చేయకు. మీరు పాండవులతో సంధి చేస్తే మిగిలిన రాజులు మీకు సామంతులు ఔతారు. మీ ఇరువురి నడుమ కయ్యాలు పెట్టిన రాజులు పాండవులకు ఎందునా సాటిరారు. అర్జునినితో సాటిగా యుద్ధం చేయగల వాడు ఒక్కడు నీ చెంత ఉన్నా యుద్ధం చేయ తగును. లేకున్న జన నష్టం తప్పదు. ఆ నాడు అర్జునుడు నిన్ను ససైన్యంతో ఓడించి గోవులను తోలుకు వెళ్ళ లేదా ! ఈ రోజు అర్జునినికి తోడుగా నేను సారధ్యం చేస్తుండగా అతనిని గెలవడం ఎవరి తరం. అనవసరంగా యుద్ధానికి పాల్పడి నీ బంధు, మిత్ర, సోదర, కుమారులతో మాడి మసై పోయి కుల నాశకుడివి అన్న పేరు తెచ్చుకోకు. నీ తండ్రి సింహాసనంపై కూర్చుంటే నీవు యువరాజువై పాండు పుత్రుల స్నేహంతో రాజ్యం వహిస్తుంటే ఎలా ఉంటుంది. పాండవుల సంధి హస్తాన్ని నిరాకరించి రానున్న లక్ష్మిని నిరాకరించకు " అన్నాడు.

భీష్మద్రోణుల హితవు[మార్చు]

భీష్ముడు " సుయోధనా ! నీ తండ్రి మాటలు ప్రశాంతంగా విను . మనవంశం పావనం చేయడానికి శ్రీకృష్ణుడు మంచి మాటలు చెప్పాడు. ఆయన మాటలు వినక నీ తండ్రి కీర్తిని రాజ్యాన్ని ఎందుకు అపకీర్తి పాలు చేస్తావు. కృష్ణార్జునులతో విరోధం కేవలం నీ ఒక్కడికే. యావత్ప్రపంచానికి వినాశనం. ద్రోణుడు లేచి " సుయోధనా ! మేము నీ మేలు కోరు తున్నాము. శ్రీకృష్ణుని మాటలు వింటే నీకు మేలు కలుగు తుంది. నీ సిరి సంపదలు నిలిస్తాయి లేకున్న లేదు అంతే నేను చెప్పేది " అన్నాడు. ధృతరాష్ట్రుడు " కుమారా ! పెద్దలు గురువుల మాటలు విని నీవు శ్రీకృష్ణుని వెంట వెళ్ళి మీ అన్న ధర్మరాజును కలుసుకో, నీకు మేలు కలుగు తుంది " అన్నాడు. ఆ మాటలు విన్న భీష్మ ద్రోణులు " అవును సుయోధనా ! శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు యుద్ధరంగంలో అడిగిడక మునుపే కౌరవ వంశాన్ని కాపాడు. ధర్మజుని ముందు నిలబడితే అతడు నిన్ను గాఢంగా కౌగలించుకుంటాడు. భీముడు, నీవు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోండి. అర్జున, నకుల, సహాదేవులు నమస్కారం అందుకుని ఆదరించు. మీ సఖ్యత చూచి లోకం హర్షిస్తుంది. మీ కొరకు యుద్ధం చేయడానికి వచ్చిన రాజులు మీ అన్యోన్యతకు ఆనందిస్తూ వారి రాజ్యాలకు వెళుతుంటే లోకం హర్షిస్తుంది. కురువంశం వర్ధిల్లుతుంది " అన్నారు.

సుయోధనుడు తనను తాను సమర్ధించుకొనుట[మార్చు]

ఈ మాటలు సావధానంగా విన్న సుయోధనుడు " కృష్ణా ! తాత భీష్ముడు, గురువు ద్రోణుడు, మా తండ్రి ధృతరాష్ట్రుడు నన్ను ఎప్పుడూ నిందిస్తుంటారు. నువ్వు కూడా అలాగే న్యాయం ఆలోచించక నన్ను నిందిస్తే నేనేమి చేసేది. మేము ద్రౌపదిని అవమానించాము, పాండవులను అరణ్యాలకు పంపాము అని మా మీద అకారణ వైరం పెంచుకుని మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. కృష్ణా ! న్యాయంగా ఆలోచిస్తే నా తప్పు ఏమి ఉంది ధర్మరాజు జూదరి. జూదం ఆడతానని శకుని వెంట పడి జూదం ఆడి రాజ్యం మొత్తం పోగొట్టు కున్నాడు. అంతటితో ఊరుకొనక మరలా పందెం ఒడ్డి ఓడాడు. ఏమి చేసినా తన ఇష్టానికి చేసాడు కాని మేమేమి బలవంతం చేయ లేదు. అతడు చేసిన తప్పులకు నేను కారణం ఎలా ఔతాను? ఇప్పుడు మత్స్యరాజును పాంచాల రాజును తీసుకుని మా పైన యుద్ధానికి వస్తున్నాడు. మేమెప్పుడైనా ఇలాంటి అఘాయుత్యానికి పాల్పడ్డామా? కృష్ణా క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధంలో మరణిస్తే వీరుడన్న పేరే కాక వీర స్వర్గం లభిస్తుంది. క్షత్రియ ధర్మం విడిచి నేను దేవేంద్రుని ముందు కూడా మోకరిల్లను. చిన్నప్పుడు మా తండ్రిగారికి తెలియక రాజ్యం పంచి ఇచ్చాడు. ఇప్పుడు నా శక్తి సామర్ధ్యాలు తెలియక అలా చేస్తే నేను ఊరక ఉంటానా! నేను సూది మొన మోపినంత రాజ్యం కూడా వారికి ఇవ్వను. యుద్ధంలో జయించిన వారు రాజ్య పాలన చేస్తారు ఇదే నా నిశ్చయం " అన్నాడు.

శ్రీకృష్ణుడు సుయోధనుని దుష్కృత్యములు ఎత్తి చూపుట[మార్చు]

సుయోధనుని మాటలకు కృష్ణుడికి కోపం వచ్చినా తమాయించు కుని నవ్వుతూ " సుయోధనా ! నువ్వు చెప్పింది తధ్యం. రేపే యుద్ధం వస్తుంది అందులో నువ్వు నేల కూలడం తధ్యం. ఏమీ నువ్వు తప్పే చేయలేదా ! నీవు పాండవులకు కీడు చేయనిది ఎప్పుడో చెప్పు. వారు పుట్టినది మొదలు జన్మవైరం సాగించ లేదా? భీమ సేనుని బలం సహించ లేని నువ్వు అతడిని కాళ్ళు చేతులు కట్టి నీళ్ళలో పడవేయ లేదా ! కాలకూట విషం పెట్టి భీముని చంపాలని చూడ లేదా ! పెను బాముల చేత కరిపించినది నువ్వు కాదా ! ధర్మరాజును యువరాజుని చేసినందుకే కదా ! నీ చిన తండ్రి భార్య తల్లితో సమాన మైన కుంతిని సపుత్ర సమేతంగా లక్క ఇంట్లో పెట్టి చంపాలని అనుకున్నది ! పాండవుల ధర్మ నిరతి, సత్య సంధత వారిని కాపాడింది. రాజసూయ యాగానికి పిలిచి సత్కరించిన పాపానికి వారు పరాక్రమంతో సాధించు కున్న రాజ్యాన్ని కూడా జూదానికి పిలిపించి నీ తండ్రి అనుమతితో కాజేయ లేదా ! అన్నదమ్ములతో జూదం ఆడి రాజ్యాన్ని కాజేసింది చాలక కుల సతి ద్రౌపదిని నిండు సభలో చీరలు ఊడదీసి అనరాని మాటలు అని అవమానించిది నువ్వు కాదా ! ఆ నాడు నువ్వు, కర్ణుడు, దుశ్శాసనుడి మాటలు సభలో చెప్ప దగినవేనా ! ప్రజల కళ్ళ ముందు ద్రౌపదిని కులసతిని అవమానించింది చాలక నేనేమి నేరం చేసానని అడగటానికి నీకే చెల్లింది. ఇంతా చేసి పాండవులు నీ పై కయ్యానికి కాలు దువ్వుతారని అంటావా ! నీ తండ్రి, తాత, గురువులు చెప్పేది పెడ చెవిన పెట్టావు. నీకూ పాండవులకు పొత్తు కుదరదని తెలిసి కూడా కుల వినాశనం ఆపాలని శాంతి కాముకుడనై ఇంత దూరం చెప్తున్నాను. సంధి చేసుకో బాగు పడతావు " అన్నాడు.

సుయోధనుడు సభనుండి నిష్క్రమించుట[మార్చు]

శ్రీకృష్ణుని మాటలకు సుయోధనునికి కోపం వచ్చింది. అది చూసిన దుశ్శాసనుడు " అన్నయ్యా ! మన తండ్రి, తాత, గురువు నీకు చెప్పే విధం ఇది కాదు. నిన్ను వీళ్ళు ఎలా అయినా సంధికి ఒప్పుకునేలా చేస్తారు. కనుక ఇక్కడ ఉండటం మంచిది కాదు " అన్నాడు. అది విని సుయోధనుడు సభా మర్యాదను లెక్క చేయక అక్కడి నుండి నిష్క్రమించాడు. అతని వెంట అతని సోదరులు, శకుని, కర్ణుడు, అతని మిత్ర రాజులు అందరూ కలసి వెళ్ళి గుంపుగా మంతనాలు చేయడం ప్రారంభించారు. అది చూసిన భీష్ముడు " ఏమిటి వీడు ఇలా వెళ్ళాడు మతి కాని చలించ లేదు కదా! వీడు మదము, లోభము, మోహము మాత్సర్యములతో కొట్టుకుంటున్నాడు. వాడి వెంట వీరంతా వెళ్ళారు. అందరూ కలసి ఏమి చేస్తారో " అనుకుంటూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి " కృష్ణా ! వీరందరికి కాలం మూడి నట్లుంది, లేకుంటే ఇలా ప్రవర్తిస్తారా ! " అన్నాడు. శ్రీకృష్ణుడు " సభికులను చూసి " చూసారా ! ఈ సుయోధనుడు ఎంత గర్విష్ఠి. వంశగౌరవం కాపాడటానికి ఇలాంటి వారిని విడిచిపెడితే నష్టం లేదు. కంసుడు ఇలాగే వంశ ప్రతిష్టను నాశనం చేస్తుంటే నా బంధువులు నాతో చెప్పుకున్నారు. నేను ఆ దుష్టుని చంపి వంశ ప్రతిష్టను నిలిపి అతని తండ్రి ఉగ్రసేనునికి పట్టం కట్టాను. మీరు కూడా అలా చేయటం మంచిది. దుర్యోధనుడు పీడ విరగడ అయితే కురు వంశం వర్ధిల్లుతుంది. కురు పాండవులు కలిసి జీవించే అవకాశం దొరుకుతుంది " అన్నాడు.

ధృతరాష్ట్రుడు గాంధారిని పిలిపించుట[మార్చు]

దస్త్రం:Gandhari reprimands Duryodhana.jpg
దుర్యోధనుడిని కోపగించుకుంటున్న గాంధారి

శ్రీకృష్ణుని మాటలు ధృతరాష్ట్రుని నిశ్చేష్టుడుని చేసింది. వెంటనే విదురుని పిలిచి " విదురా ! నీవు వెంటనే గాంధారిని పిలుచుకురా. కనీసం తల్లి మాట అయినా వింటాడేమో ! " అన్నాడు. విదురుడు వెంటనే వెళ్ళి గాంధారిని తీసుకుని వచ్చాడు. ధృతరాష్ట్రుడు " గాంధారి! నీ కుమారుడు గర్వంతో సభను విడిచి వెళ్ళాడు. ఇంతంటి దుర్మార్గుడు ఎక్కడైనా ఉంటాడా ! నీ వైనా వీడిని శాంతిప చెయ్యి. అప్పుడే ఈ కురువంశం బతికి ఉంటుంది " అని అన్నాడు. గాంధారి " మహారాజా ! నీ కుమారుడు అవినీతి పరుడని తెలిసి అతడిని నీవు సమర్ధిస్తావు. నీవు పాండవులకు అర్ధరాజ్యం ఇస్తే నిన్ను కాదనే వారు ఎవరు " అని పలికి విదురునితో " నేను చెప్పానని సుయోధనుని సభకు తీసుకు రండి " అన్నది. సుయోధనుడు ఒక్కడే వచ్చి సభలో కూర్చున్నాడు. మిగిలిన వారు అక్కడే నిలబడ్డారు. గాంధారి కూడా తనకు తోచిన విధంగా ధర్మం, నీతి, పాండవులతో చుట్టరికం, వారి బ్రతుకు తెరువు, వారి శక్తి యుక్తులు వివరించి సుయోధనుని బుజ్జగించి ఆ పై ఆగ్రహించి మాట్లాడింది. కాని సుయోధనుడు ఆమెను లక్ష్యపెట్ట లేదు. మళ్ళీ వెళ్ళి మంతనాలు జరుపు తున్నాడు. " శ్రీకృష్ణుని తలపు మంచిది కాదు. భీష్ముని, ద్రోణుని తన వశం చేసుకుని మన మీద వత్తిడి తెస్తున్నాడు. తను కంసుని చంపిన విషయం చెప్తున్నాడు. ఇతడిని పట్టి బంధిస్తే కాని పాండవుల గర్వం అణగదు. కృష్ణుడు లేక పోతే పాండవులు కోరలు తీసిన పాము కనుక వారిని జయించడం సులువు " అన్నాడు. ఇదంతా చూస్తున్న సాత్యకి కృతవర్మను పిలిచి కృతవర్మా! మన సైన్యాన్ని సిద్ధం చేసి నువ్వు వాకిలిలో నిలువు ఇక్కడ విషయం నేను చూసుకుంటాను " అని కృష్ణుని అనుమతి తీసుకుని భీష్మ, ద్రోణులతో " సుయోధనాదులు కృష్ణుని బంధించాలని చూస్తున్నారు. అతడిని పట్టుకోవడం అంటే అగ్నిని మూట కట్టడమే ఔతుంది " అన్నాడు. ఆ మాటలు విన్న విదురుడు " ధృతరాష్ట్రుని చూసి " మహారాజా! నీ కుమారులు శ్రీకృష్ణుని బంధించ ప్రయత్నిస్తున్నారు. మాడి మసై పోతారు జాగ్రత్త " అన్నాడు. శ్రీకృష్ణుడు " మహారాజా ! కౌరవులు ఇలా చేయడం తగునా ! నాకు అనుజ్ఞ ఇవ్వండి నేను వారికి బుద్ధి చెప్పి వెళ్ళిపోతాను " అన్నాడు. ధృతరాష్ట్రుడు వెంటనే నీవు పోయి సుయోధనుని నా దగ్గరకు తీసుకురా " అన్నాడు. విదురుడు వెళ్ళి సుయోధనుని తీసుకు వచ్చాడు. ధృతరాష్ట్రుడు " సుయోధనా ! ఏమిటీ దుర్బుద్ధి శ్రీకృష్ణుని పట్టి బంధించాలని చూస్తున్నావు మీరంతా నాశనం ఔతారు. నేనేమి చేయలేను " అన్నాడు. శ్రీకృష్ణుడు " సుయోధనా ! నేను ఒక్కడిని అని నన్ను బంధించాలని చూస్తావా ! నేను ఎవరో చూస్తావా ! " అని ఒక్క చిరునవ్వు నవ్వాడు.

విశ్వరూప సందర్శనము[మార్చు]

దస్త్రం:Macrocosm of Krishna in the Kauravas court.jpg
కురుసభలో విశ్వరూప సందర్శనము

అలా నవ్వగానే శ్రీకృష్ణుని నుదుట బ్రహ్మ , వక్షస్థలంలో విరూపాక్షుడు, ముఖంలో అగ్ని, పార్శ్యంలో ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, ఆదిత్యుడు, మరుత్తులు, విశ్వదేవతలు, అశ్వినిలు ఉద్భవించారు. బాహువుల నుండి బలరాముడు , అర్జునుడు భుజముల నుండి ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు , యదు, వృష్టి, అంధక, భోజ వీరులు ఉద్భవించారు. శంఖం, చక్రము, గధ, ఖడ్గం మొదలగు ఆయుధములు చేతులలో వచ్చి చేరాయి. నేత్రములు, చెవులు, ముక్కుల నుండి ధూమముతో కూడిన మంటలు లేచాయి. రోమ కూపాల నుండి సూర్య కాంతులు వెదజల్లు తున్నాయి. ఆ ప్రకారం శ్రీకృష్ణుని చూడ శక్యం కాక ఉన్నది. అందరూ భయంతో కళ్ళు మూసుకున్నారు. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న మునులకు, భీష్మాదులకు దివ్య దృష్టి ప్రసాదించారు. దేవతలు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు జయ జయ ధ్వానాలు చేసారు. ఆ కలకలం విన్న ధృతరాష్ట్రుడు అది దేవ దేవుని విశ్వరూపం అని గ్రహించి " వాసు దేవా! నన్ను అనుగ్రహించి నిన్ను దర్శించే భాగ్యం ప్రసాదించు " అన్నాడు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి దృష్టి ప్రసాదించాడు. ధృతరాష్ట్రుడు కనులారా విశ్వరూపం చూసి " దేవా! నీ దివ్య మంగళ రూపం చూసిన ఈ కళ్ళతో ఇతరము చూడ లేను. నన్ను తిరిగి అంధుడిని చెయ్యమని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించి తన విశ్వరూపాన్ని ఉపసంహరించి సాత్యకి, కృతవర్మలను తీసుకుని సభను విడిచి వెళ్ళాడు " అని వైశంపాయనుడు వివరించాడు.

బయటి లింకులు[మార్చు]