ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ద్వితీయాశ్వాసం[మార్చు]

ఆ విధంగా సంజయుడు ధర్మజుని వద్ద శలవు తీసుకుని ఉపప్లావ్యం వదిలి హస్తినాపురం చేరాడు. ధృతరాష్ట్రుని అంతఃపురానికి వెళ్ళి దర్శించాడు. ధృతరాష్ట్రుడు సంజయుడిన చెంతన కూర్చుండ పెట్టుకొని జరిగిన విషయం వివరించమని అడిగాడు. సంజయుడు " మహారాజా! ధర్మరాజు మీ క్షేమం మీ కుమారుల క్షేమం అడిగాడు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " సంజయా! ధర్మరాజు అతని సోదరులు క్షేమమేనా? అతని బంధు మిత్రులు అతని పట్ల ప్రీతితో మెలగుతున్నారు కదా " అన్నాడు. సంజయుడు " మహారాజా! ధర్మరాజు అతని సోదరులు క్షేమమే. ధర్మరాజుకు దైవ చింతన మెండు కదా. అతడు ధర్మాన్ని నమ్ముకున్నాడు. పాప పుణ్యాలను నీమీద పెట్టాడు. నీవు నీ కొడుకు కోరినట్లే కాని వేరొక తీరుగాఆలోచించవు. అతడేమో కర్ణుడిని, శకునిని నమ్మి వారి ఆధీనంలో ఉంటాడు. కడుపుకు అన్నం తినేవాడు నీ కొడుకులు చేసే దుర్మార్గాలు చూస్తూ ఊరకుంటారా? లోకంలో ఎవరికీ కొడుకులు లేరా ? కొడుకులు దుర్మార్గం చేస్తుంటే బుద్ధి చెప్పక నీ మాదిరి చూస్తూ ఊరక ఉండేవారు ఎవరయినా ఉంటారా? ప్రజలంతా నిన్నుపుచ్చిపోయేలా తిడుతుంటే విన లేక నా చెవులు పుచ్చిపోతున్నాయి. దుశ్శాసనుడు, శకుని మాత్సర్యంతో నిన్ను, దుర్యోధనుడిని బొమ్మలను ఆడించినట్లు ఆడిస్తున్నారు. పాండవులు మంచివారు కనుక సరి పోయింది. వారే విసిగిపోయి కోపిస్తే ఒక్క చిటికెలో మీరంతా ఈ సరికి నాశనం అయి ఉండే వారు. మనవాళ్ళు ధర్మరాజు శాంతగుణాన్ని పిరికితనం అనుకుంటున్నారు. అది పొరబాటు. పొట్టేలు కొండను చూసి, అది తనను ఢీకొనలేదు కనుక కొండ ఓడిపోయిందని ప్రకటించినట్టు ఉంది. ధర్మరాజు తన తమ్ములను అదుపులో పెడుతున్నారు కనుక మీరు జీవించి ఉన్నారు. లేకుంటే ఈ సరికి మీరు ప్రాణాలతో ఉండే వారు కాదు. జూదం ఆడిన రోజే అవినీతికి బీజం పడింది. అప్పుడు నువ్వు ఉపేక్షించడం వల్ల మనసులను ఇప్పుడు కాల్చుతోంది. ధర్మరాజు మెత్తని పులి. ఏమీ ఎరగనట్టు ఉంటాడు. నీమీద అన్యాయం పెట్టేవరకు ఊరుకోడు. అటువంటి నిందపడిన తర్వాత ఆపడం నీతరం, నాతరం కాదు " అన్నాడు. సంజయుడు ఈవిధంగా చెప్పి, వేగంగా రావడం వలన అవయవాలు నొప్పిగా ఉన్నాయని, ప్రొద్దు పోయిందికనుక పొద్దున్నే వచ్చి అందరూ వింటూ ఉండగా సభలో జరిగిన విషయాలన్నీ వివరంగా చెపుతాను అని వెళ్ళిపోయాడు.

ధృతరాష్ట్ర విదురుల ఆలోచన[మార్చు]

దస్త్రం:Vidura and Dhritarashtra.jpg
ధ్రుతరాష్ట్ర విదురుల ఆలోచన

ధృతరాష్ట్రుడు వెంటనే విదురుడిని మందిరానికి పిలిపించి " విదురా! సంజయుడు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. రేపు వచ్చి అక్కడ జరిగిన విషయాలన్నీ చెపుతానని వెళ్ళాడు. అప్పటినుండి నా మనసు వికలమయింది. నిద్ర రావడం లేదు " అన్నాడు. విదురుడు " ధ్రుతరాష్ట్రా! బలవంతుని చేతిలో దెబ్బలు తిన్న బలహీనుడు, డబ్బు పోగొట్టుకొన్నవాడు, ఇతరుల డబ్బును దొంగలించాలని కాచుకున్న వాడు, కామంతొ మనసు కలతచెందిన వాడు నిద్రపట్టక అవస్థ పడతాడు. వీటిలో నీకు ఏ దోషం ఉంది. ఇతరుల సొమ్మును అపహరించి నీవు ఒక్కడివే అనుభవించాలని అనుకున్నావా. నీకు నిద్ర రాకపోవడానికి కారణం ఏమిటి చెప్పు" అన్నాడు. ధృతరాష్ట్రుడు " విదురా! ధర్మరాజు మనోగతం ఏమయి ఉంటుందో అవగతం కాక నిద్ర రావడం లేదు " అన్నాడు

విదురుడు " రాజా! నీ బంధువు, హితుడు, సేవకుడు, శాంతమూర్తి అయిన ధర్మరాజు నీకు కీడు తలపెడతాడా? అతని రాజ్యాన్ని అతనికి ఒప్పగించి ఇప్పటికైనా నీవు నీ కుమారులు చేసిన తప్పు సరిదిద్దు. ధర్మరాజు నిన్ను పెదనాన్న వైనా తండ్రిలా చూస్తున్నాడు కనుక సహిస్తున్నాడు. నీవు, నీ కొడుకు దుర్యోధనుడు రాజ్యభారాన్ని  శకుని, కర్ణ, దుశ్శాసనుల మీద మోపారు. అది చివరిదాకా కొనసాగదు. ఎందుకంటే తొందరపాటుతనం, తమ శక్తి తమకు తెలియకపోవడం, ఓర్పుల మంచికి కాదు అది నీకూ తెలుసు " అన్నాడు.

అప్పుడు ధృతరాష్ట్రుడు " విదురా! నీవు ధర్మా ధర్మాలు, నీతి అవినీతి తెలిసినవాడివి. నాకు నిద్రలేకుండా చేస్తున్న ఈ దుఃఖం ఉపశమించేలాగా నీ అమృత వచనాలను నా మీద కురిపించు " అన్నాడు.

విదురనీతి[మార్చు]

విదురుడు " రాజా! మనిషి తనను లోకులు నిందించే పని చేయక జనులకు అంగీకారమైన రీతిలో ప్రవర్తించాలి. పరుల సంపదకు ఈర్ష్యపడక నలుగురితో కలిసి మెలిసి బ్రతకాలి. కోపం, పొగడ్తలకు పొంగి పోవడం, గర్వం, అసంతృప్తి, దురభిమానం, ఏ పనీ చేయక పోవడం దుర్జనుల లక్షణం. తనను పాలించే రాజును, లోకాన్నిరక్షించే భగవంతుని, కట్టుకున్న భార్యను, బంధువులను సముచితంగా ఆదరించక పోతే ఏ కార్యం సత్ఫలితాన్ని ఇవ్వదు. అవివేకులు తమను ప్రేమించే వారిని వదిలి ద్వేషించే వారి వెంట పడతారు. ఎదుటి వాడు బలవంతుడని తెలిసినా వారితో తలపడతారు. ధనము, విద్య, వంశము మంచి వారికి గౌరవాన్ని, అణకువను కలిగిస్తే చెడ్డవారికి మదాన్ని గర్వాన్ని కలిగిస్తాయి. బాణం శత్రువును నిర్జించ వచ్చూ లేక తప్పి పోవచ్చు. కాని నేర్పు గలవారి నీతి శత్రువును, రాజ్యాన్ని నాశనం చేస్తుంది.

ప్రభుత్వాన్ని చేపట్టి మంత్రము, ఉత్సాహం అనే రెంటినీ జతచేసి మిత్రులు, శత్రువులు, తటస్థులు అనే మూడు వర్గాలను సామదానభేద దండోపాయాలతో వశపరచుకొని త్వక్కు, చక్షువు, శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణముము, అనే ఐదు ఇంద్రియాలను జయించి సంధి విగ్రహము, యానము, ఆసనము, ద్వైదీభావము అనే ఆరిటిని తెలుసుకొని, వేట, జూదం, పానము, స్త్రీ, వాక్కులో పరుషత్వం, దండ పారుష్యం, అర్థ దూషణం అనే ఏడు వ్యసనాలను విడిచి ప్రవర్తించేవాడే వివేకవంతుడు.

మధురమైన పదార్థాలను తాను ఒక్కడే తినడమూ, అందరూ నిద్రిస్తున్నప్పుడు తాను ఒక్కడే మేలుకోవడం, ఒక్కడే ఆలోచించడం, ఒంటరిగా ప్రయాణం చేయడమూ మంచిది కాదు. సత్ప్రవర్తన అనేది సముద్రమైతే దానిని దాటడానికి ఓడవలే సత్యం ఒప్పుగా ఉంటుంది.
క్షమాగుణాన్ని చేతగాని గుణంగా భావిస్తారు కాని క్షమాగుణమే మిక్కిలిగా మెరిసే ఆభరణం. మంచి సౌందర్యం కావాలనుకొనేవాళ్ళు దానిని ధరిస్తారు.

పరుషవాక్యములు మాట్లాడక పోవడం, పాపపు పనులు చేయక పోవడం ఈ రెండిటి వలన మనిషి ఉత్తముడు అవుతాడు. సమర్థుడై ఉండి కూడా శాంతంగా ఉండే వాడు, పేద వాడైనా తనకున్నంతలో దానం చేసే వాడు పుణ్యపురుషుడు అనిపించు కుంటాడు. న్యాయార్జితమైన ధనాన్ని అర్హులకు ఇవ్వక పోవడమూ అనర్హులకు ఇవ్వడము వలన కీడు కలుగుతుంది. పరస్త్రీ వ్యామోహం, మద్యపానం, వేటాడటం, పరుషభాషణ, వృధాగా ధనమును ఖర్చు చేయడమూ, పోట్లాడటమూ సప్త వ్యసనాలని విజ్ఞులు చెప్తారు. కనుక వారు వాటి జోలికి పోకూడదు. తనకు ఉచితమైన దుస్తులు ధరించడమూ, ఆత్మ స్తుతి చేయక పోవడమూ, దానం చేసి ఎందుకు చేసానా అని చింతించక పోవడం, ఎంత బాధలో ఉన్నా కీడు పలకకపోవడం, కష్ట కాలంలో కూడా ధర్మ మార్గాన్ని విడనాడక ఉండుట మంచి నడవడి అనిపించుకుంటుంది.

స్నేహం, మాటలు, పోట్లాట తనకు సమానులతో చేయాలి కాని అల్పులతోను అధికులతోను కాదు. తనకు ఉన్నంతలో ఇతరులకు ఇవ్వాలి, శత్రువయినా కోరిన సహాయం చేయాలి. ఎక్కువగా కష్టపడి తక్కువగా సుఖపడాలి. మంచి వారు పొగడ్తలకు పొంగిపోడు. మరింత మేలు చేస్తాడు కాని కీడు చేయడు.

నేను చెప్పిన లక్షణాలు ధర్మజునిలో ఉన్నాయి. నీవు వారిని పెంచి పెద్దచేసి, రక్షించి ఆదరించి ఇప్పుడు వారు వేరుగా ఉంటే ఊరుకోవచ్చునా. వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి వారిని రప్పించి, నీ కొడుకులతో సమానంగా ఆదరించడం నీ ధర్మం. మీరు వాళ్ళూ కలసి ఉన్నంత కాలం దేవతలు కూడా మీ వంక కన్నెత్తి చూడలేరు " అన్నాడు.

ధ్రుతరాష్ట్రునికి విదురుడు బుద్ధిమతి చెప్పుట[మార్చు]

దస్త్రం:Law of Prahlada.jpg
ప్రహ్లాదుని న్యాయం

విదురుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు " విదురా? నాకు మేలు చేకూర్చేది, కర్తవ్యమయినదీ నీవే ఎఱుగుదువు. ధర్మరాజు పద్ధతి కూడా నీకు తెలుసు. నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు " అని అడిగాడు. విదురుడు " నన్ను ఈవిధంగా నొక్కి అడిగితే ఉన్న సంగతి చెప్పాలి కదా.సావధానంగా విను " అన్నాడు.

"రాజ్యం దక్కింది కదా అని తమ్ముని రాజ్యభాగాన్ని కూడా మింగుదామని చూస్తున్నావు. అది ఎలా

జఱుగుతుంది. చేప అత్యాశతో మాంసంతో పాటుగా గాలాన్ని కూడా మింగిన విధంగా ఉంది నువ్వు చేస్తున్న పని. వంచకుడైన నీ కొడుకు మనసులో అనుకున్నదంతా మాట్లాడితే అది నెరవేరుతుందా. విదురుడు ఈ విధంగా అనడం విని ధృతరాష్ట్రుడు నోటమాటలేనివాడై, నిశ్చేష్టుడైపోయాడు. నిద్రలేకపోవడంవల్ల అలసటతో , ఆలోచనలతో సతమతమవుతూ " విదురా ! ఇప్పటివరకు నీ మాటలతో నా మనస్తాపం కొంత తగ్గింది. నాకు కార్యం సాధించే నీతిని, సాధించలేని అవినీతిని చెప్పు" అన్నాడు. అప్పుడు విదురుడు అతనితో ఇలా అన్నాడు.

 "పక్వానికి రాక మునుపే పండును కోస్తే  తినడానికి రుచిగా ఉండక పోవడమే కాక, దాని విత్తనం తన ప్రయోజనాన్ని కోల్పోతుంది. దండలు కట్టేవాడు చెట్టునుంచి పువ్వులు కోసే విధంగా, తేనెటీగలు పూవు నుంచి తేనెను గ్రహించే విధంగా ఎదుటివాడు బాధ పడకుండా పనిచేసి ఫలితాన్ని పొందాలి. అంతేకాని బొగ్గుల కోసం చెట్టు మొదలంటా నరకకూడదు.
పరుల ధనానికి, విద్యకు, పరాక్రమానికి, తేజస్సుకు, ఈర్ష్య చెందే వాడు ఏరోగం లేకుండానే బాధ పడతాడు. ఎదుటి వానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేక పోతే మాట్లాడకుండా ఊరకే ఉండటం మంచిది. మాటల వలననే పగ, చెలిమి, తెలివి, కలత, ధర్మము, పాపము, కీర్తి, అపకీర్తి కలుగుతాయి.
గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది.  కాని మాటలతో చెడిన కార్యం, సిద్ధించదు.  శరీరంలో విరిగిన బాణాలను ఉపాయంతో తొలగించవచ్చు కానీ మనసులో నాటుకున్న మాటలనే గాయాలను ఎన్ని ఉపాయాలతో నైనా మాన్పలేము.

ధర్మరాజు నోటి వెంట ఒక చెడు మాట కూడా రాదు కాని నీ కొడుకులు ఒకరిని మించి ఒకరు నీచవాక్యాలు అనేకం పేలుతూ ఉంటే నీవు దానిని జంకూగొంకూ లేకుండా వింటూ ఊరుకుంటున్నావు. నీకు ఇది తగునా.

చేటు కాలం దాపురించినప్పుడు  చెడ్డ మాటలు, చెడు చేతలూ కూడా   మనసుకు  ధర్మ బద్ధంగానే కనిపిస్తాయి.

నీ మనసు లో పాండవులపై పగనుంచి మరలటం లేదు. ఏమి చేస్తాం. ధర్మ నిరతుడైన ధర్మరాజు తన సంపదకు దూరం కావడం ధర్మమా?అని విదురుడు ధృతరాష్ట్రుడిని ప్రశ్నించాడు.

ఇదంతా విని ధృతరాష్ట్రుడు, " నీ నీతివాక్యాలతో నా మనస్సు కుదుటపడదు. ఇంకా చెప్పు" అన్నాడు. అప్పుడు విదురుడు ఇంకా ఇలా అన్నాడు. "భూలోకంలో ధర్మం కలిగిన పురుషుడికి అనుభవించదగిన ఫలాలన్నీ చేరతాయి. కీర్తి కూడా కలుగుతుంది. పొగడ్త ఎంతకాలం ఉంటుందో అంతకాలమూ పుణ్యలోకాలు కలుగుతాయి. పూర్వం ప్రహ్లాదుడు రాక్షస కులంలో జన్మించినా ధర్మ మార్గం తప్పక అంగీరసునికి తన కుమారునికి వచ్చిన వివాదంలో పక్షపాత రహితంగా అంగీరసుని పక్షాన న్యాయం చెప్పాడు. కనుక నీవు కూడా నీ కుమారుల పట్ల పక్షపాతం వదిలి ఇరువురికి సంధి చెయ్యి. అందు వలన వారూ వీరూ కూడా సుఖపడతారు. చేయదగినవి అని పాపాలు చేస్తే అవే ఇష్టంగా మారతాయి. ధర్మకార్యాలు చేయరానివి అని తలిస్తే అలాగే అవుతాయి.

పెద్దలు లేని సభ, సభ కాదు, న్యాయం మాట్లాడలేని వారు పెద్దలు కారు, సత్యం లేని ధర్మం ధర్మం కాదు. ఏదో ఒక మిష మీద చెప్పేది సత్యము కాదు. నీతి మార్గంలో నడవడం ఉత్తమం, శౌర్యంతో సంపదలు పొందుట మధ్యమము, భారంగా బ్రతుకు ఈడుస్తూ బతకడం అధమం. నీతిమాలినవారిని ఉత్తములు మెచ్చుకోరు.

నీ పుత్రులు ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వుతూ ఉంటారు. కర్ణుడు మొదలైనవారైతే అంతకుముందే కొవ్వెక్కినవారు.నీవేమో నీతి మార్గం అనుసరించవు.
పాండవులు కయ్యానికి కాలు దువ్వరు; కయ్యానికి పిలిచిన వారిని వదలరు. నీ తమ్ముడు పాండురాజు వలెనే అతని కొడుకులు పాండవులు కూడా నిన్ను భక్తితో కొలుస్తారు.  వారిని నిర్మలమైన మనసుతో ఆదరించడం మంచిది.

పాండవులు దిక్కులేనివారు అని అనుకోకు. ఏ కారణం లేకుండానే ఉపకారబుద్ధితో ఇతరుల పనులగురించి బాధపడేవారే ఆ పాండవులకు దిక్కు.

ఒకడు ఒక మహానుభావుడి పోషణలో అతని ఔన్నత్యం ఆసరాతో మంచి సంపదతో ఏ లోటు లోకుండా ఉండి, చివరకు అటువంటి మహానుభావుడికే హాని చేస్తే ఆ కృతఘ్నుడి శవాన్ని కుక్కలు కూడా అసహ్యించుకుంటాయి. కాబట్టి చేసిన మేలు మరిచిపోవడం తప్పు. పాండురాజు నీకు మంచి భక్తుడు. పాండవులు కూడా నీకు తేజస్సు, లాభం సంపాదించి పెట్టారు. వారిని ఆదరించు.

ఒకప్పుడు మంచి బ్రతుకు బ్రతకవచ్చు, ఒకప్పుడు ఆపదలకు గురికావచ్చు. ఒకప్పుడు ప్రశంసలు పొందవచ్చు, ఒకప్పుడు నిందపడవచ్చు. త్యాగము లేదా అడుగుకొనే స్థితి కలుగవచ్చు. జీవితంలో ఇటువంటి సుఖదుఃఖాలు కలుగుతూ ఉంటాయి. వాటికోసం చింతించడం ఎందుకు.

ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం. దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది, మతి చెడుతుంది, శరీరం కృశిస్తుంది, రోగం వస్తుంది. మిక్కిలిగా దుఃఖిస్తే  శత్రువుకు అది సంతోషాన్ని చేకూరుస్తుంది కనుక దుఃఖించడం మాను " అన్నాడు. ధృతరాష్ట్రుడు " విదురా! నేను ఉత్తముడైన ధర్మరాజును  నా మాటలతో చేతలతో బాధించాను. అందు వలన నా కుమారులకు మరణం తథ్యం. నేను దుఃఖించక ఎలా ఉండగలను " అన్నాడు.
విదురుడు " రాజా! నీవు లోభం విడిచి మనసు అదుపులో పెట్టుకుంటే మనశ్శాంతి అదే లభిస్తుంది . జ్ఞాతి వైరం వదిలి పెట్టు. గోవులను ఆక్రమించడం, బ్రాహ్మణులను అగౌరవ పరచడం ఎవరైతే నివారిస్తారో వారు గొప్పవారు.దాయాదులు కలిసి ఉంటే ఒకరికొకరు రక్షగా, ఆశ్రయంగా ఉండి తామరలతో ప్రకాశించే సరస్సులా ఉంటారు.

చెట్టు ఒకటే ఉంటే దానిని ఏనుగులు, గుఱ్ఱాలు తొక్కివేస్తాయి. గాలి కూల్చేస్తుంది గుంపుగా ఉన్న చెట్లను ఎవరూ ఏమీ చేయలేరు. అన్నదమ్ములు కలిసి ఉంటే వారిని ఎవరూ కన్నెత్తి చూడలేరు. వేరుగా ఉంటే శత్రువుకు లోకువైపోతారు. కాబట్టి కౌరవులు, పాండవులు ఒకరికొకరు అండగా ఉంటే శత్రువుకు జయించరానివారు అవుతారు. పాండు పుత్రులను పిలిచి వారికి హితం కలిగించి నీ పుత్రులను బ్రతికించుకో. ఇచ్చకాలు మాట్లాడేవారు ప్రతిచోటా ఉంటారు. అప్రియమైనా హితం పలికేవారు వేరుగా ఉంటారు. జూదం ఆడిన నాడే నేను వద్దని చెప్పాను. రోగం వచ్చినవాడికి పథ్యం సహించనట్టుగానే నా మాటలు నీవు విన లేదు. కాకుల వంటి నీ కుమారులను నమ్మి నెమళ్ళ వంటి పాండవులను వదులుకుని ఇప్పుడు తల్లడిల్లి పోతున్నావు.పిల్లులను ఆదరించి సింహాలను చేరదీసినట్టు దుర్యోధనాదులకోసం పాండవులను వదిలేసావు. కులం నిలుపుకోవడానికి ఒక్కడినయినా వదులుకోవాలని పెద్దలంటారు. అవినీతిపరుడై, మంచి మాటలు చెప్తే వినని దుర్యోధనుడిని వదులుకుంటే వచ్చే నష్టం ఏమిటి. సహాయం సంపదను బట్టి, సంపద సహాయాన్ని బట్టి ఉంటాయి. ఇలా ఒకదానితో ఒకటి కూడి ఉంటే గాని సిద్ధించవు. కాబట్టి నీ సంపద పాండవులకు, వారి సహాయం నీకు ప్రీతి కలిగిస్తుంది. పరస్పరం కలిసి ఉండడం మేలు. కురువంశోద్ధారకులైన భీష్ముడు,ధర్మరాజు,మంచి పరాక్రమవంతులైన అర్జునుడు, కర్ణుడు , భీముడు, దుర్యోధనుడు, శస్త్ర అస్త్ర విద్యలలో నిపుణులైన అభిమన్యుడు, లక్ష్మణ కుమారుడు, ద్రోణుడు, ద్రుపదుడు వంటి ఆత్మీయులు వారి బంధువులు అంతా చేరి నిన్ను సేవిస్తుంటే నీ వైభవం ఎలా ఉంటుందో ఆలోచించు. " అన్నాడు. పాండవులు ఇప్పుడు పగ విషయం మరిచిపోయినా కొన్నాళ్ళకయినా ఇబ్బందులు పడి చెడుతుందే కాని దుర్యోధనుడితో రాజ్యం పాలించబడదు. అని చెప్పాడు విదురుడు. ధృతరాష్ట్రుడు " విదురా! నీవు చెప్పిన మాటలు రాజనీతి సమ్మతములే . అయినా నా కొడుకును వదలలేను. కనుక ధర్మం జయిస్తుంది అని చూస్తూ ఉంటాను " అన్నాడు. అప్పుడు విదురుడు " రాజా! దాయాదులు గుణం లేనివాళ్ళయినా విడిచిపెట్టకూడదు అంటారు. సకల గుణసంపద కలిగినవారై, నీ అనుగ్రహం కోరే పాండవులను నీవు వదిలి పెట్టవచ్చా. నేను నీ మేలుకోరేవాడిని. పాండవులు బ్రతకడానికి చిన్న పల్లెలు అయినా కొన్నిటిని కేటాయించి, దుర్యోధనుడిని ఒప్పించి సంధి చేస్తే మంచిది. యుద్ధం నివారించడానికి కొడుకులను వదల మన్నాను కాని సంధి చేసుకుంటే అందరికీ క్షేమమే కదా!

ఎన్ని భోగాలు అనుభవించినా మహారాజులకైనా చావు తప్పదు. కాబట్టి చెవికి చేదుగా ఉన్నా

ఈ విషయాన్ని అర్థం చేసుకున్నావంటే నీకు ఇహ పరాల్లో కీర్తి సంపదలు కలుగుతాయి. ధర్మరాజును వదిలిపెట్టకు. మనసు గట్టిచేసుకొని నీ కొడుకులకు, మంత్రులకు సంధి చేసుకోమని చెప్పు." అన్నాడు. ధృతరాష్ట్రుడు " విదురా! నీ మాటలు నా మనసును తేటపరిచాయి. ఆలోచిస్తే ఇదే తగిన పని అనిపిస్తోంది. అలాగే చేస్తాను " అన్నాడు. విదురుడు " ఆ మాట మీద ఉండు. ఇంతకాలానికి నీకు చేయదగినదానిపై మనసు స్థిరపడింది. దుర్యోధనుని చూసి మనసు మార్చుకోకుండా, అతను మొగ్గినవైపు నీవు మొగ్గకుండా ధర్మరాజుతో సంధి చేసుకో. మా వంటి వారికి ఆనందం కలుగుతుంది " అని చెప్పి తన మందిరానికి వెళ్ళాడు.

సభలో సంజయుని సంధి ప్రస్తావన[మార్చు]

దస్త్రం:Sanjaya in Kaurava Sabha.jpg
ధృతరాష్ట్రుని సభలో పాండవుల సందేశమును వినిపిస్తున్న సంజయుడు

మరునాడు ధృతరాష్ట్రుడు సభ తీర్చాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, సోమదత్తుడు, శల్యుడు, దుర్యోధనాదులు సభా ప్రాంగణంలో వున్నారు. సంజయుడు సభను ఉద్దేశించి దృతరాష్ట్రునితో " రాజా! మీరు ఆదేశించినట్లు ఉపప్లావ్యం వెళ్ళి ధర్మరాజును చూసాను ధర్మరాజు పేరు పేరున మిమ్మలి యోగక్షేమాలు అడిగాడు. నేను వివరించాను. అలాగే కృష్ణార్జునులను కలిసాను. శ్రీకృష్ణుడు నాతో ఇలా అన్నాడు " సంజయా! అజాత శత్రువైన ధర్మరాజుకు కోపం వస్తే నీటిలో నిప్పు పుట్టిన చందాన ఉంటుంది. దానిని ఆర్పడం ఎవరి తరం కాదు. యుద్ధం అనివార్యం అయితే మీరు మీ సమస్త సంపదలు యోగ్యులకు పంచి బంధు మిత్రులతో భోగములను అనుభవించి యుద్ధ భూమికి రండి. నాడు సభలో ద్రౌపది గోవిందా రక్షించు అని నన్ను వేడుకున్నది ఇంకా చెవిలో వినిపిస్తుంది. తీర్చలేని ఆ అప్పు తీర్చకనే నేను సారథ్యం వహిస్తున్నను. అర్జునుని గాండీవానికి కౌరవ సేన దగ్ధం కాక తప్పదు " అన్నాడు. అప్పుడు అర్జునుడు " సంజయా! ధర్మరాజు అడిగినట్లు రాజ్య భాగం ఇవ్వకుంటే యుద్ధం తప్పదు భీముడు నేను దుర్యోధనుని అకృత్యాలకు బదులు చెప్పక వదలము. దుర్యోధనుని యుద్ధ భూమిలో అంపశయ్య మీద పరుండ చేయకుంటే ధర్మరాజు భూశయనం చేసిన దానికి అర్ధము లేదు. భీముడు గద తీసుకుని యుద్ధ భూమిలో వీర విహారం చేస్తుంటే దుర్యోధనుడు రాజ్యం ఇవ్వక ఏమి చేస్తాడు. కౌరవులు మాటలతో సంధి చేయరు. కేవలం యుద్ధము తోనే మాట వింటారు. నకుల సహదేవులు, అభిమన్యుడు, సాత్యకి యుద్ధ భూమిలో వీర విహారం చేస్తున్నప్పుడు సుయోధనుడు సంధి చేస్తాడులే. శిఖండి శత్రురధికులను ఏరిఏరి చంపుతూ, చితకగొట్టుతూ భీష్ముని మీదకు ఉరికి యుద్ధ భూమిలో పడగోట్టినప్పుడు సుయోధనుడు యుద్ధాన్ని గురించి పశ్చాత్తాప బడతాడులే. దృష్టద్యుమ్నుడు ద్రోణుని మీదికి యుద్ధానికి దిగినప్పుడైనా సంధి చేయక తప్పుతుందా? సంజయా! పట్టుకోకుండానే గాండీవం గంతులేస్తోంది. మీట కుండానే నారి కంపిస్తోంది. నా అమ్ముల పొందిలోంచి బాణాలు మాటిమాటికి పైకి ఎగిరెగిరి దూకుతున్నాయి. యుద్ధంలో నేను వింటి నారి లాగి పిడుగుల వంటి బాణాలను గాండీవానికి సంధించి శత్రువుల శిరస్సులను ఛేదిస్తూ వుంటే దుర్యోధనుడి సేన చెల్లా చెదరుగా పారిపోతూ వుంటే దుర్యోధనుడు యుద్ధం గురుంచి పరితపిస్తాడులే. . ఇంద్రాది దేవతలు కూడా ఎవరిని జయించ లేరో వారిని జయించ గలనని మోహపడుతున్నాడు. కంస, నరక, మురులను సంహరించిన మహాత్ముడైన శ్రీకృష్ణుని కూడా దుర్యోధనుడు లక్ష్య పెట్టక అతడిని కూడా తను జయిస్తానను కుంటున్నాడు.. మేము భీష్మ, ద్రోణ, కృప అశ్వధామలతో నమస్కరించి రాజ్యం కోరి యుద్ధం చేస్తాము. మా రాజ్యాన్ని అధర్మంగా అపహరించి, నియమభంగం చేసి, తిరిగి మా రాజ్యాన్ని మాకు ఇవ్వని కౌరవులను సంహరించి మా రాజ్యాన్ని తీసుకుంటే ధర్మం గెలిచినట్లే కాని ఇందు అధర్మం ఏమీ లేదు. యుద్ధం జరిగిందా ఇక ధార్తరాష్ట్రు లేనట్లే. ఇలా నిండు సభలో ధ్రుతరాష్ట్రునికి నా మాటగా చెప్పు. భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వథామ, శల్యులు నిర్ణయించినది జరుగుతుంది. యుద్ధాన్ని నివారిస్తే సుయోధనుడు ఆయుష్మంతు డౌతాడు " అని చెప్పారని చెప్పాడు.

.

భీష్ముడు[మార్చు]

అప్పుడు భీష్ముడు " శ్రీకృష్ణుడు అర్జునుడు నర నారాయణులు. ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని నిర్మూలించ డానికి ప్రతి యుగంలోను అవతరిస్తారు. ఇప్పటికే కాలకేయులను, నివాతకవచులను సంహరించారు. వారిరువురు రెండుగా కనిపించే ఒకే శక్తి .వారిరువురిని గెలవడం హరునికైనా సాధ్యం కాదు. శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు గాండీవం ఎక్కు పెట్టినప్పుడు నీకు తెలుస్తుంది. అయినా సుయోధనా నీవు గర్విష్టివి. నా మాటలు లెక్క చేయవు. పరశురాముని చేత శపింప బడిన కర్ణుడు, శకుని, దుశ్శాసనుల మాటలు నీకు వీనుల విందులు. దీని ఫలితంగా యుద్ధ భూమిలో మా అందరి మరణ వార్తలు వింటావు " అనగానే కర్ణుడు లేచి " మీరు ఇలా మాటాడ తగునా! నాలో ఏ తప్పులు చూసి నన్ను నిదిస్తున్నావు? దుర్యోధనుడికి నేను ఏ కొద్దిపాటి ద్రోహము చేయలేదు. . నేనేమి చేసాను ? సుయోధనుని కొలువులో ఉంటూ అతను పెట్టిన అన్నం తింటున్నాను కనుక అతనికి హితముగా మాట్లాడుతాను. నేను ధృతరాష్ట్ర సతీ, పుత్ర, పౌత్రులకు హితము చేస్తాను లేకున్న సుయోధనుడు నన్ను ఇంత వాడిని చేస్తాడా? యుద్ధంలో పాండవులందరినీ నేనే చంపగలను " అన్నాడు. భీష్ముడు " ధృతరాష్టా! ఈ కర్ణుడు పాండవులకు ఇసుమంత అయినా పోలడు. పాండవులను గెలుస్తానని ప్రగల్భాలు చేసే వీడిని నమ్మి సుయోధనుడు పాండవులతో శత్రుత్వం వహించి యుద్ధానికి దిగుతున్నాడు. పాండవులు ఎన్నో విజయాలు సాధించారు. వీడు ఇప్పటికి ఒక్క విజయం పొందాడా? ఉత్తర గోగ్రహణంలో వీడి తమ్ముని చంపి గోవులను అర్జునుడు తరలించుకు పోతుంటే అక్కడే ఉండి వీడు ఏమి చేసాడు? ఘోష యాత్రలో నీకుమారుని గంధర్వ్యులు బంధించి తీసుకుని పోతుంటే వేడిమి చేశాడు. ఆ గంధర్వులను ఓడించి పాండవులు ఓడించ లేదా! వీడివన్ని అసత్య ప్రగల్భాలు. అంత ద్రోణుడు లేచి " మహారాజా! భీష్ముడు మీకందరికి ఆప్తుడు ఇరువురికి కావలసిన వాడు. కనుక మీ హితవు కోరి సంధి చేయమంటున్నాడు. ఖాండవ వన దహనం మొదలు అర్జునుని విజయాలు ఆలోచించండి. ఎంతో మంది ధనుస్సు పట్టిన వీరులు ఉన్నా విజయుడు అన్న పేరు ఒక్క అర్జునినికి మాత్రమే దక్కింది . అర్జునుడు అన్నంత పని చేస్తాడు " అన్నాడు. భీష్మ ద్రోణుల మాటలు విననట్లే ఉన్న ధృతరాష్టుడు వారికి సమాధానం చెప్పక " సంజయా ! ధర్మరాజుకు మన సైన్యం గురించి తెలుసా? మనసైన్యం గురించి అతడు ఏమని అనుకుంటున్నాడు? అతని వైపు ఎవరు ఉన్నారు? " అని అడిగాడు. ఆ మాటలు విన్న సంజయుడు దీర్ఘంగా నిట్టూర్చి ముర్చపోయాడు. కొంతసేపటికి స్ప్రుహలోకొచ్చి " ధృతరాష్ట్రుడు ఇంత వెర్రి వాడా ! పాండవుల బలాబలాలు అడుగు తున్నారు. ఇతనికి ఏమి చెప్పి ఏమి ప్రయోజం " అనుకుని " దేవా! మరలా చెప్తున్నాను మీరు సగ భాగం ఇస్తే యుద్ధ మాట తలపెట్టడు. అతడు సంధికి సిద్ధం అంటున్నాడు. యుద్ధం వస్తే అతడు ఎవరిని లక్ష్య పెట్టడు. నీకు తెలియనిది ఏమున్నది. బకుడిని, హిడింబుని, కీచకుని, కిమ్మీరుని వధించిన భీముడు వారి పక్షమే కదా! ఫాలాక్షుని ఓడించిన అర్జునుడు వారి పక్షమే ద్రుపది కుమారులు దృష్టద్యుమ్నుడు, భీష్ముని చంపాలని శపథం పట్టిన అంబ ద్రుపడుకి మొదట కూతురై పుట్టి దైవవశాత్తూ పురుషుడైన శిఖండి, అభిమన్యుడు, మాద్రి కుమారులు వారికి కాక ఎవరికి చేస్తారు. శ్రీకృష్ణుడు, సాత్యకి వారికి బాసటగా ఉన్నారు. ద్రుపదుడు, కేకయరాజులు, జరాసంధుని కుమారుడైన సహదేవుడు, జయత్సేనుడు, శిశుపాలుని కుమారులు వృషభుడు, దృష్టకేతు, మాయావిద్య విశారధుడు భీముని కుమారుడు ఘటోత్కచుడు వారి పక్షాన తలపడటానికి సిద్ధం. ఇంకా తూర్పు ఉత్తర దేశరాజులు ధర్మరాజుకు సాయంగా ఉన్నారు. శ్రీకృష్ణుని సాయం కన్నా మించినది లేదు కదా! ధర్మరాజుకు మనతో పోరు సల్పడానికి ఇంకేమి కావాలి? " అన్నాడు సంజయుడు.

ధృతరాష్టుడు[మార్చు]

ఇది విని ధృతరాష్టుడు " సంజయా! నీవు చెప్పినది నిజము. వారంతా ఒక ఎత్తు భీముడు ఒక ఎత్తు. అతడిని తల్చుకుంటే భయంగా ఉంది. మనలో అతడిని ఎదుర్కోడానికి ఎవరున్నారు.. దూకుడు స్వభావం కలవాడు. దుర్యోధనాధులను హింసించేవాడు. వీడే అసలు భేదానికి కారకుడు. నాలుగు మూరలు పొడవు, ఎనిమిది అంచులతో ఉన్న ఉక్కు గదను చేబట్టి వందల మందిని చంపుతూ భయంకరమైన యుద్ధం చేసే వీడిని నా కుమారులు ఎలా తట్టుకోగలరు. చిన్నప్పటి నుండి అతడు నామాట వినడు ఇప్ప్దుదు నా పుత్రులు ఇంకా కష్ట పెట్టారు. సుయోధనుడు కయ్యానికి కాలు దువ్వు తున్నాడు. వాడిని మన సైన్యంలో ఎవరు ఆపగలరు. వాడికి ఏ ఆయుధమూ పని లేదు. జరాసంధుని ఒక్క పోటుతో చంపాడు. చేతితోనే ఎందరినైనా చంపగలడు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు వాడికి అర్జునుడు సాయం ఉన్నాడు. ఇక ఏమి చెప్పను. అర్జునితో సమానంగా యుద్ధం చేసే వాడిని మనం చూసామా? అతనికి సారథి శ్రీకృష్ణుడు ఉన్నాడు. ముగ్గురూ కలిస్తే కౌరవ సేనను దహిస్తారు.వారి గురించి భీష్మ, ద్రోణులకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. అయినా వారు మన కొరకు యుద్ధం చేస్తారు. వారికి కురు పాండవులు సమానమే కదా? నా మాట నా కుమారులు వినరు. మొదటి నుండి విదురుడు చెప్పినదే జరుగుతున్నది. సంజయా ! నేనేమి చేయను, నా కేది దారి నా కేది శరణ్యము . ధర్మరాజు వినయవంతుడు. అతనికి వుదురుడు, దృపదుడు, సోదరులు, శ్రీకృష్ణాదులు తోడు ఉండగా ధర్మరాజుతో పోరుకు తలపడటం మిడతలు పోయి మంటలో పడటం లాంటిది. వంశ నాశనం తప్పదు శాంతి మార్గమే మేలు నా కుమారులకు చెప్పడానికి ప్రయత్నిస్తాను " అన్నాడు. సంజయుడు " దేవా! మీరు చెప్పినది సబబు. మొదటినుంచి నీవు పాండవులకు కీడు కలిగిస్తూనే వున్నావు. వారి శక్తి తెలిసి కూడా నీ కొడుకులకు వశమవుతూ వుంటావు.నీకీ ధైర్యం ఎక్కడినుండి వస్తుందో నాకు తెలియడం లేదు. ఇప్పుడు కూడా ఈ బుద్ధి నిలుస్తుందని నే ననుకోను. ఈ కురు జాంగల దేశాలు వారి తండ్రి సంపాదించినవి, తర్వాత వీరు భూమినంతటిని తమ భుజబలంతో జయించారని తెలుసుకో. దానిని నీకు సమర్పించగా నీవు దానిని నాది అని భావిస్తున్నావు. నీవు ధర్మజుని విడిచినా కాని అతడు నిన్ను వదలక ఘోష యాత్రలో నీ కుమారులను రక్షించాడు. అతడు మిమ్ము ఎన్నటికీ అతిక్రమించడు. అతడిని పిలిపించి సంధి కావించండి " అన్నాడు.

సుయోధనుడు[మార్చు]

దుర్యోధనుడు " తండ్రీ! మీ మాటలు విచిత్రముగా ఉన్నవి ఎక్కడో అడవులలో ఇడుములు పడుతున్న వారిని తెచ్చి కొంత మంది పిరికి వాళ్ళను జత చేసినంత మాత్రాన పాండవులు గెలుస్తారా? నీకు ఇంత భీతి వలదు మన బలాన్ని తక్కువగా ఛూడకు. మేము గెలుస్తాము. పరశురాముని గెలిచిన భీష్ముడు మన పక్షాన ఉన్నాడు. ద్రోణుడు, కృపాచారులు సామాన్యులా? ఈశ్వర వర ప్రసాదితుడి అశ్వథామ సామాన్యుడా? బాహ్లికుడు, సింధురాజు, సోమదత్తుడు, గాంధారరాజు సామాన్యులా? వీరిని గెలుచుట పాండవులకు శక్యమా ? మీరు సందేహించ కండి. మేము వారి అడుగులకు మడుగులు వత్తము. యుద్ధము చేస్తాము పారి పోము; ఇదే మా నిశ్చిత అభిప్రాయము. మా చేత బాధలు పడ్డవాళ్ళు దండెత్తి వస్తే పారిపోవడం చిన్నతనం కాదా? వారిని చూసి భయపడి మాకు తలవంపులు తేకండి. భీముడే కాదు నాతో తలపడి గదా యుద్ధం చేయగల వాడు ముల్లోకాలలో లేడు. భీముని నేను చంపగలను అతడు మరణిస్తే పాండవ పక్షాన యుద్ధం చేయగల వారు లేరు. అందుకే ధర్మరాజు ఐదు ఊళ్ళు ఇమ్మని అడిగాడు. కర్ణుని వద్ద సహజ కవచ కుండలాలు ఉండేవి. వాటిని ఇంద్రుడికి దానం చేసి పొందిన అమోఘమైన శక్తి ఆయుధం అర్జునిని చంపుతుంది. భీష్మాదుల శరాగ్ని వారి సేనను నాశనం చేస్తుంది. ఇక నీ మిగిలిన కుమారులు అత్యంత శక్తి మంతులు కారా? మన సైన్యం పదకండు అక్షౌహినులు వారి సైన్యం ఏడు అక్షౌహినులు. ఇది తెలియక ఎందుకు దు॰ఖిస్తున్నావు? " అని సంజయుని చూసి " సంజయా! ఇంతకూ అల్లరి మూకను తయారు చేసుకున్న ధర్మరాజు ఏమంటున్నాడో చెప్పు" అన్నాడు. సంజయుడు చెప్పసాగాడు " సుయోధనా! పాండవులు యుద్ధంఅంటే భయపడలేదు ఏదో పెళ్ళికి పోతున్నట్లు భావిస్తున్నారు.అర్జునిని పాశుపతం, భీముని గదాయుధం నమ్మి యుద్ధానికి దిగుతున్నారు " అని చెప్పి ధృతరాష్టుని చూసి " దేవా! వారి మాటలను బట్టి భీష్ముడు శిఖండి వంతు, ద్రోణుడు దుష్టద్యుమ్నుని వంతు, దుర్యోధనుడు అతని తమ్ములు భీముని వంతు మీలోని యువకులు అభిమన్యుని వంతు, అశ్వత్థామ, కర్ణుడు, సైంధవుడు మొదలగు మహా వీరులు అర్జునుని వంతు కృతవర్మ సాత్యకి వంతు సోమదత్తుడు చేకితానుడు అనే యాదవ రాజు వంతు శకుని నకుల సహదేవుల వంతు, శల్యుని ధర్మరాజు సంహరిస్తాడు . ఇక మీరే ఆలోచించీ నిర్ణయించండి " అన్నాడు. అదివిన్న ధృతరాష్టుడు " అయ్యో ఇక నాకు దిక్కెవరు? ధర్మరాజు శ్రీకృష్ణుడు ఉన్న సైన్యాన్ని నా కొడుకు లెక్క చేయక పోవడం నా కర్మ. ఇక చెప్పకు అలా జరగాలంటే అలా జరుగుతుంది " అన్నాడు. అలా దుఃఖిస్తున్న తండ్రిని చూసి సుయోధనుడు " తండ్రీ మేము పాండవులు ఒకే చోట పుట్టి పెరిగాము కదా మా కంటే పాండవులు బలవంతులు ఎలా అయ్యారు? నువ్వు ఎప్పుడూ వారిని పొగుడు తుంటావు ఈ రాజ్యం మాది మాకు దక్కాలని భగవంతుడు నిర్ణయించారు. బాధపడ వద్దు " అన్నాడు. ధృతరాష్టుడు " సంజయా! చూసావా నా కొడుకు పిచ్చిపిచ్చిగా మాట్లాడు తున్నారు. పాండవుల వైపు వారిని ఎవరు రెచ్చ కొడుతున్నారు? " అన్నాడు. సంజయుడు " దేవా! దుష్టధ్యుమ్నుడు పాండవులలో అగ్నిని రెచ్చ కొడుతుంటాడు. తాను ఒక్కడే కౌరవ సైన్యాన్ని హతమారుస్తాను అంటాడు. ధర్మరాజు "నువ్వు అన్నంత పని చేస్తావు అంటాడు " అప్పుడు దుష్టధ్యున్ముడు నన్ను చూసి మహేశ్వరుడు, ఇంద్రుని అనుగ్రహం పొందిన మా అర్జునునితో సరి పోలు వారు కౌరవ సేనలో ఎవరున్నారు? ధర్మరాజును శరణు వేడి బ్రతకమని సుయోధనునికి చెప్పు " అన్నాడు. అది విన్న ధృతరాష్టుడు " కుమారా నీకు సగం రాజ్యం చాలదా? ధర్మరాజుకు సగరాజ్యం ఇచ్చి హాయిగా బ్రతకవచ్చు కదా పెద్దల మాటలు నీకు ఎందుకు వినవు? శకుని, కర్ణుల మాటలు ఎందుకు వింటావు " అన్నాడు.ఆమాటలకు కోపించిన దుర్యోధనుడు " నామాటలు ద్రోణుడు, భీష్మాదులు అంగీకరించడం లేదు. నేను ధర్మరాజుకు సూది మొన ఓపినంత భూమి కూడా ఇవ్వను కర్ణుడు, దుశ్శాసనాదుల సహాయంతో యుద్ధం చేసి పాండవులను గెలుచుట నిశ్చయం. ఇదే నా నిర్ణయం " అన్నాడు. ధృతరాష్టుడు " కుమారా ! నా మాట విని యుద్ధం మాను. భీముడు యుద్ధ రంగంలో నిన్ను నీ సైన్యాన్ని చీల్చి చెండాడు తున్నప్పుడైనా నా మాట వింటావా? అర్జునుడు ఛంఢ ప్రఛంఢుడై సైన్యాన్ని దునుమాడుతున్నప్పుడైనా నామాట వింటావా? నీది కేవలం మానవ శక్తి పాండవులది దైవ శక్తి అర్జునుడు అగ్ని దేవుని వలన అక్షయ తుణీరాన్నీ పొందాడు. వాయు దేవుడు, ఇంద్రుడు, యముడు, అశ్వినీ దేవతలు వారిని కాపాడు తుంటారు. కనుక వారిని చంపడం భీష్మునికి వీలు కాదు. దేవతలకు వీలు కాని రాక్షసులను అర్జునుడు చంపాడు, కనుక అతడు దేవతలను మించిన వాడు. అర్జునుడు ఒకేసారి ఒకే వేగంతో అయుదువందల బాణాలు వేయగలడు కనుక శాంతి ఒక్కటే ప్రస్తుత కర్తవ్యం " అన్నాడు. సుయోధనుడు " తండ్రీ ! రాగద్వేషాలకు అతీతులైన దేవతలు వారికి ఎలా సాయం వస్తారు. వారు పక్షపాత బుద్ధి వహిస్తే వారికి దైవత్వం ఎలా సిద్ధిస్తుంది? పాండవులకు దేవతల సాయం ఉంటే అరణ్యాలలో ఎందుకు కష్ట పడతారు? ఆత్మస్తుతి క్షమార్హం కాదు కాని నాకు కోపం వస్తే పాండవులను దేవతలు రక్షించరు. బ్రద్దలయ్యే భూగిరి శిఖరాలను నేను మంత్ర శక్తితో ఆపగలను.రాళ్లవానను గాలిని అందరూ చూస్తుండగా శమింప చేయగలను. నీళ్ళను స్తంభింపజేసి వాటిమీద రధాలను సైనికులను నడిపించ గలను. దేవ దానవ శక్తులు నాకు ఉన్నాయి. ధర్మతనయుడు అతని తమ్ములు, కుమారులు వాసుదేవాది యాదవులు, కేకయ, పాండ్య, మగధ, చైద్య, ప్రముఖ వీరులు నా బారిన పడి అణగారి పోవడం మీరు వింటారు. వారి తేజస్సు, శౌర్యము నాకు సాటి రావు, పితామహ, ద్రోణ, అశ్వథామ, కృపులకు తెలిసిన సమస్త అస్త్రాలు నాకు తెలుసు " అన్నాడు.

కర్ణుడు భీష్ముడు[మార్చు]

తరువాత కర్ణుడు లేచి " మిత్రమా! నాకు గురువుగారి శాపం కారణంగా అస్త్రశస్త్రాలు గుర్తుకు రావు అని లోకులు అంటారు. కాని ఆ మహానుభావుడు నాకు వాటి స్పురణ ప్రసాదించాడు. కావున నాకు అస్త్ర సంపద ఉన్నది నిశ్చయము. దేవతలకు కూడా నన్ను గెలవడం కష్టం అర్జునుడు ఎంత నేను పాండవులను గెలుచుట తధ్యం " అన్నాడు. భీష్ముడు లేచి " కర్ణా! యముని ప్రేరణతో మాట్లాడుతున్న నిన్ను వారించడం మా తరమా? పాండవులు యుద్ధంలో రాలి పోతారా? అనవసరంగా నోరు నొప్పి పుట్టేలా వాగకు. దేవేంద్రుడు ఇచ్చిన శక్తితో అర్జునుని చంపగలనని అనుకుంటున్నావు. శ్రీకృష్ణుని చేతిలో అది ముక్కలు కాక తప్పదు. అర్జునుని కొరకు నీ వద్ద ఉన్న సమస్త అస్త్రాలను శ్రీకృష్ణుడు నాశనం చేస్తాడు. ధృతరాష్టా! దాయాదులు కలిసి ఉంటే క్షేమంగా ఉంటారు లేకున్న సమస్తం కోల్పోతారు. కనుక సంధి చేసుకో " అన్నాడు. భీష్ముడు " సుయోధనా సంధి చేసుకుని ధర్మరాజుతో చేరు భీష్ముడు మన హితం కోరుతాడు. అతడి మాటను మన్నించు " అన్నాడు. సుయోధనుడు ఆ మాటలను లక్ష్యపెట్ట లేదు. ఆ మాటలకు కోపించి " సుయోధనా! మాట్లాడ వెందుకు అర్జునుడు గోగ్రహణంలో ఒకసారి ఒంటరిగానే విజృంభించి నపుడు నీ సైన్యం పారిపోలేదా? కర్ణుడు నీ చెంత ఉండి ఏమి చేసాడు. కాని ఇప్పుడు అలా కాదు. శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు విజృంభిస్తే ఎదుర్కోవడం ఎవరి తరం కాదు. కర్ణా యుద్ధంలో మరణించి వీరుడవు అనిపించు కుంటావు. సుయోధనుని మరణానికి కారకుడవు అవుతావు " అన్నాడు. కర్ణుడు విరక్తిగా "సుయోధనా! భీష్ముని మాటలు నా మనసుని కలచి వేస్తున్నాయి. ఈ భీష్ముడు చచ్చే వరకు నేను యుద్ధభూమిలో అడుగు పెట్టను. ఆతరువాత నేను నా ప్రతాపం చూపిస్తాను" అని అస్త్ర సన్యాసం చేసిన కర్ణుడు ఇక అక్కడ ఉండలేక సభ వదిలి వెళ్ళాడు. అప్పుడు భీష్ముడు నవ్వుతూ " అయ్యో సుయోధనా! ఇంతటి మహా వీరుడు అలిగితే ఎలాగా! కుమారా నీవు ఈ కర్ణును అండ చూసుకుని యుద్ధానికి దిగుతావు. అప్పుడు మా ప్రతాపములో వ్యత్యాసం చూడు. సుయోధనా! నేను, బాహ్లికుడు, ద్రోణుడు కలసి శత్రు నాశనం చేస్తాము " అన్నాడు. సుయోధనుడు కర్ణుడు పోయాడన్న బాధ భరించ లేక " తెలిసో తెలియకో అందరూ పాండవులు గెలుస్తారని అంటున్నారు. మొదట నిన్ను, ద్రోణుని, బాహ్లికుని నమ్మాను. కాని ఇప్పుడు చెప్తున్నాను. కర్ణుడు, దుశ్శాసనుడు నా వెంట ఉంటే విజయం నాదే నాకు వేరొకరితో పనిలేదు " అన్నాడు. సుయోధనుని మాటలకు కలత చెందిన ధృతరాష్ట్రుడు " విదురా! నా కుమారుడు కర్ణునితో కలసి మృత్యుపాశంలో ఇరుక్కున్నాడు. ఈ సమయంలో ఏమి చేయాలి చెప్పు " అన్నాడు. విదురుడు " మహారాజా! మన వాళ్ళు దుర్బలులై ఒకరిలో ఒకరు కలహించుకోవడం మనకు మరింత ప్రతికూలం అర్జునునకు అనుకూలం. మాటలు కట్టిపెట్టి పాండవులను పిలిచి సంధి చేయించు " అన్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుని చూసి " సంజయా ! మరలి వచ్చు నపుడు అర్జునుడు నీతో ఏమన్నాడో చెప్పు " అని అడిగాడు. సంజయుడు " దేవా! అర్జునుడు నాతో " ధర్మరాజు న్యాయంగా మాకు రావలసిన రాజ్య భాగం అడుగుతున్నాడు. దర్పంతో ఇవ్వకుంటే మాచేత వారు యుద్ధభూమిలో చావక మానరు " అన్నాడు.

ధృతరాష్టుడు సంజయుని జయాపజయాలు వివరించమని కోరుట[మార్చు]
దస్త్రం:Dritarashtra feel sad.jpg
భీమసేనుని బలమును గురించి విని విలపిస్తున్న ధృతరాష్టుడు

ఆ పై ధృతరాష్ట్రుడు " సభ ముగించాడు. అందరూ వెళ్ళిన తరువాత అక్కడ ఉన్న సంజయుని చూసి ధృతరాష్ట్రుడు " సంజయా ! నీకు ఇరు పక్షాలలో ఉన్న వీరు లందరూ తెలుసు. యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారో చెప్పగలవా " అని అడిగాడు. సంజయుడు " దేవా! ఈ విషయం నన్ను అడగడం కన్నా గాంధారిని, మీ తండ్రి వ్యాసుని పిలిపించి అడగడం మంచిది " అన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు " తన తండ్రి వ్యాసుని ధ్యానించాడు. గాంధారిని పిలిపించాడు. వ్యాసుడు సంజయుని ఛూసి " సంజయా! నీకు అన్నీ తెలుసు. నేను వినేలా ధృతరాష్టుని ప్రశ్నకు సమాధానం చెప్పు " అన్నాడు. సంజయుడు " ధృతరాష్టా ! నీవు కౌరవ పండవ సేనకు కల తారతమ్యం గురించి అడిగావు. పాండవ పక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడు. మీ పక్షాన ఎవరున్నారు చెప్పు. పాండవుల బలం శ్రీకృష్ణుడే . సమస్త లోకాలు ఒక పక్కన శ్రీకృష్ణుడు ఒక పక్కన నిలిచినా శ్రీకృష్ణుడు గెలుస్తాడు. సత్యం, ధర్మం, న్యాయం ఎక్కడ ఉన్నాయో శ్రీకృష్ణుడు అక్కడ ఉంటాడు. శ్రీకృష్ణుని ఆశ్రయించిన వారికి జయం తప్పదు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " సంజయా! కృష్ణుని గురించి నాకు తెలియక పోవడానికి నీకు తెలియడానికి ఏమి కారణం " అన్నాడు. సంజయుడు " లోకంలో విద్య అవిద్య అని రెండు ఉన్నాయి. అవిద్యతో అలమటిస్తున్న వారు తమో గుణంతో విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని తెలుసుకో లేరు. విద్యా వినయ భూషితుడు తెలుసు కొనగలడు. ధృతరాష్ట్రుడు " విద్య అంటే ఏమిటి? అవిద్య అంటే ఏమిటి వివరించు " అన్నాడు. సంజయుడు " దేవా ! ప్రతి మనిషికి సత్వ, రజో, తమో గుణాలు ఉంటాయి. నేను వాటికి లోబడక పక్షపాత రహితంగా నిర్వికారంగా ఉండి పవిత్ర భావంతో ధర్మంగా ఉంటాను. అందువలన నేను విష్ణువును తెలుసు కున్నాను. నీకు గాని వేరెవరికైనా విష్ణువును తెసుకోవడానికి ఇది తక్క వేరు మార్గం లేదు. ఇందుకు భిన్నమైన దానిని అవిద్య అంటారు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " పక్కనే ఉన్న సుయోధనుని చూసి " నాయనా సుయోధనా ! సంజయుడు మన శ్రేయోభిలాషి. అతని మాట విని శ్రీకృష్ణుని ఆశ్రయించి నీవు నీ తమ్ములతో క్షేమంగా ఉండండి " అన్నాడు. సుయోధనుడు " తండ్రీ ! ఈ లోకాలు సర్వ నాశనం అయినా నేను ధైర్యం వదలను శ్రీకృష్ణుని శరణు వేడను " అన్నాడు. ధృతరాష్ట్రుడు నిర్వేదంగా " గాంధారి ! విన్నావా నీ కుమారుని మాటలు. వీడు దుర్మార్గుడు, నీతి బాహ్యుడు, గర్విష్టి, అసూయాద్వేహాలు కలవాడు నా మాట వినడు. వీడు చెడి పోతాడు. వీడికిక బ్రతుకు లేదు " అన్నాడు. గాంధారి " సుయోధనునితో " కుమారా సుయోధనా ! ఈ ఐశ్వర్యం, సంపద, రాజ్యం, నీ ఆయుషు ఎందుకు వదులు కుంటావు. దైవం భీముని రూపంలో నిన్ను చంపుతుంది. నీ లాంటి అవినీతిపరుడు ఎక్కడైనా ఉంటాడా ? " అన్నది. వ్యాసుడు " ధృతరాష్టు నితో " నీకు శ్రీకృష్ణుడంటే భక్తి అందుకే సంజయుని రాయబారిగా పంపావు. సంజయుని మాట విని శ్రీకృషుని ఆశ్రయించు. రాగ ద్వేషాలు వదిలి ఏకాగ్రతతో ఆరాధించిన వారికి శ్రీకృష్ణుడు చేరువ ఔతాడు. కామక్రోధాలతో అలమటించే వారికి అతను దూరంగా ఉంటాడు.అన్నాడు. ధృతరాష్ట్రుడు " మీరు చెప్పినట్లే చేస్తాను " అన్నాడు. ధృతరాష్ట్రుడు " శ్రీకృష్ణునికి వాసు దేవుడనే పేరు ఎలా వచ్చింది. సంజయుడు " శ్రీకృష్ణుడు అంతటా ఉంటాడు. సకల జగము అతనిలో ఉంటాయి కనుక అతనిని వాసుదే వుడంటారు. ఇందియ నిగ్రహంతో అతనిని ధ్యానిస్తే అతని వశం ఔతాడు. నీవు కూడా అన్ని చింతలు వదిలి అతనిని ధ్యానించు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " వ్యాసమహర్షీ ! నేను శ్రీకృష్ణుని శరణు వేడుతాను . శ్రీకృష్ణుని దివ్య మంగళ రూపాన్ని దర్శింప లేను. నిరంతరం కృష్ణుని సన్నిధిలో ఉండే వారు ఎంతటి పుణ్యాత్ములో కదా " అని విచారించాడు. అంతట వ్యాసుడు నిష్క్రమించాడు. దుర్యోధనుడు, గాంధారి, సంజయుడు తమ తమ నివాసములకు వెళ్ళారు.

ఉద్యోగ పర్వం రెండవ భాగం కొరకు ఉద్యోగ పర్వము-2 చూడండి.

బయటి లింకులు[మార్చు]