Jump to content

శాంతి పర్వము ద్వితీయాశ్వాసము

వికీపీడియా నుండి


ద్వితీయాశ్వాసం

[మార్చు]

ధర్మరాజు కురు సామ్రాజ్యానికి పట్టాభి షిక్తుడయ్యాడు. ధృతరాష్ట్రుడికి, గాంధారికి, విదురుడికి రాజ్యధికారం ఇచ్చి వారు చెప్పినట్లు రాజ్యపాలన చేయసాగాడు. భర్తలను పోగొట్టుకున్న భార్యల క్షేమసమాచారాలు కరుణతో విచారించి ఉచితరీతిన వారికి సహాయాలు అందచేసాడు. కృపాచార్యుడు, యుయుత్సుడు, సంజయులకు గౌరవ మంత్రుల పదవులు ఇచ్చి సత్కరించాడు. తల్లి కుంతీదేవికి శుశ్రూషలు చేయసాగాడు. ద్రౌపదిని సౌమ్యంగా ఆదరిస్తున్నాడు. ధౌమ్యునకు సకల సంపదలు ఇచ్చి గౌరవించాడు. ఆయన ఆధ్వర్యంలో దేవ, పితృ పూజలు, సంతర్పణలు, విప్రార్చనలు చేయసాగాడు. దీనులను, అనాథల పోషణఏర్పాట్లు చేసాడు. రాచకార్యములన్నీ చక్కబెడుతూ అమితానందం పొందుతున్నాడు. సకల పౌరుల జానపదుల మనస్సుకు ఆనందం కలుగచేసాడు. శ్రీకృష్ణుడిని దైవంలా ఆరాధించ సాగాడు.

శ్రీకృష్ణుడి ధ్యానం

[మార్చు]

ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణుడి మందిరానికి వెళ్ళాడు. కృష్ణుడికి చేతులు జోడించి నమస్కరించి " కృష్ణా ! రాత్రి సుఖంగా నిద్ర పట్టిందా ! నీ మనసు ప్రశాంతంగా ఉందికదా ! నీవు చూపిన ధర్మమార్గమున పయనించిన నేను ఈ రాజ్యాధికారం పొందగలిగాను " అని అన్నాడు. దానికి కృష్ణుడు మారుమాటాడ లేదు. శ్రీకృష్ణుడు అప్పుడు ధ్యానమగ్నుడై ఉన్నాడు. ధ్యానముద్రలో ఉన్న శ్రీకృష్ణుడిని చూసి ధర్మరాజుతో ఇలా అన్నాడు. " కృష్ణా ! నిశ్చలధ్యానంలో ఉన్నావు, క్షరుడవు, అక్షరుడవు నీవే కదా ! ఈ సృష్టికి ఆది, అంతం నీవేకదా ! ఒక్కడుగా ఉన్న వెలుగుతున్న నిశ్చలచైతన్యం నీవే కదా ! పురుషోత్తముడివి నీవేకదా ! నీవు ఎవరిగురించి ధ్యానం చేస్తున్నావు ? దీనికి కారణం ఏమి ? " అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధ్యానం గురించి నవ్వుముఖంతో ధర్మరాజుని చూసి " ధర్మనందనా ! గంగాదేవి రత్నగర్భవాసాన ఎవనిని కన్నదో, పరశు రాముడు ఎవరిని తన శిష్యుడిగా స్వీకరించి సకలవిద్యలు నేర్పించాడో, ఆ పరశు రాముడే ఎవరితో యుద్ధం చేసి అలసిపోయాడో, కాశీ రాజు కన్యలవలన సకల రాజన్యులు ఎవరి చేతిలో ఓడిపోయారో, ఎవరు నాలుగువేదములను, ధనుర్వేదమును ఆమూలాగ్రం అభ్యసించాడో, ఆ భీష్ముడు నిర్మలమనస్సుతో నన్ను తలచుకుంటున్నాడు. నా మనసు అతనిలో లీనమైంది " అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు " కృష్ణా ! భీష్ముని ప్రతిభావిశేషములు గురించి ఇదివరకు విన్నాను. ఇప్పుడు నీవు చెప్పావు. కృష్ణా ! నాకు మా తాత భీష్ముడిని చూడవలెనన్న కోరిక కలుగుతుంది. నీతో నన్ను చూస్తే ఆయనఎంతో ఆనందిస్తాడు " అని అన్నాడు.

భీష్ముని స్తుతి

[మార్చు]

కృష్ణుడు దారుకుని పిలిచి రథం సిద్ధం చేయమని చెప్పాడు. అదే సమయంలో వ్యాసుడు, నారదుడు, దేవస్థాణుడు, వాత్సుడు, దేవరాతుడు, దేవలుడు మొదలైన మహా మునులు భీష్ముడి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో భీష్ముడు శ్రీకృష్ణుని మనసులో నిలుపుకుని ఇలా ప్రార్థించ సాగాడు " అగ్ని, సూర్యుడు, బ్రహ్మకు సమానుడైన శ్రీకృష్ణుని మనసారా ప్రార్థిస్తున్నాను. మహామునులు, దేవతలు, ఎవరిస్వరూపమును తెలుసుకోలేరో, అట్టిస్వరం తెలిసిన వారిని నేను పూజిస్తున్నాను. దుఃఖమును పరమౌషధంగా ఎవరిని శ్రుతులు పేర్కొంటాయో, అతడిని నేను పూజిస్తున్నాను. ఈ సృష్టి ఆది, మద్యము, అంతం ఎవరై ఉన్నారో అతడిని కొలుస్తున్నాను. ఈ అనంతమైన విశ్వానికి మూలకారకుడైన పుండరీకాక్షుడిని నేను కొలుస్తాను. సహస్రశీర్షుడు, సహస్రాక్షుడు, వేదములే తానైనవాడు, చిన్నవారిలో చిన్నవారిలో చిన్నవాడివి, పెద్దవారిలో పెద్దవాడివి, సహస్రపాదుడు అయిన ఆ దయాళువును నేను ఆరాధిస్తాను, అమృతమూర్తి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం, ఉపనిషత్తులు తానే అయి ఆ పురుషోత్తముడిని నేను తలుస్తాను. దేవకీ గర్భవాసమున యజ్ఞ యాగాదులను సంరక్షించడానికి దేవదేవుని మనసులో ధ్యానిస్తాను, ఒక్కడే పన్నెండు మూర్తులుగా వెలుగుతూ, అదితి గర్భమున జన్మించిన వామన మూర్తిని నేను ధ్యానిస్తున్నాను, దశరథుని కుమారుడిగా జన్మించి రావణసంహారం గావించిన శ్రీరామావతారునిగా నిన్ను ధ్యానిస్తాను. శుక్లపక్షంలో దేవతలను, కృష్ణపక్షంలో పితరులను తన అమృతంతో పోషిస్తున్న ఓషధాధీశుడైన చంద్రుని రూపమైన శ్రీహరిని ధ్యానిస్తాను. గరుత్మంతుని వాహనంగాగల విష్ణువును ధ్యానిస్తాను. వ్యక్తమైన ఈ దేహంలో అవ్యక్తంగా ఉన్న పరమాత్ము డైన విష్ణువును ధ్యానిస్తాను, నిరంతరం శాంతమూర్తులై జీవిస్తున్న యోగులకు మాత్రమే వ్యక్తమైన నీ రూపమును ధ్యానిస్తున్నాను, యాదవకుల తిలకుడైన బలరాముడిగా నిన్ను ధ్యానిస్తాను. దేవకి వసుదేవుల గర్భవాసాన జన్మించి పసిపాపగా ఉండగానే రాక్షస సంహారం చేసి, కంసుని వధించి, అత్జునుడికి సారథ్యం వహించి భూభారాన్ని తగ్గించిన శ్రీకృష్ణుడిగా నిన్ను ధ్యానిస్తున్నాను. కలియుగంలో ధర్మోద్ధరణకు జనించబోవు మహావిష్ణువును నేను ధ్యానిస్తున్నాను. నశించే ఈ భూతములలో అక్షరముగా వెలుగొందుతున్న పరమాత్మను ధ్యానిస్తున్నాను. ఓ పరమేశ్వరా, సుబ్రహ్మణ్యా, భక్తవత్సలా, మహాదేవా, విశ్వప్రకాశా, హృషీకేశా, వరదా, నారాయణా, రాజీవనయనా, హిరణ్యనాభా, అఖిలలోకముల చేత ఆరాధించబడు నామములు కలవాడా, అచ్యుతా, అమృతరూపా, నీకు మనసారా మొక్కుతున్నాను. నన్ను కరుణించు. నిన్ను నిరతం స్మరించువారికి భయ నివారణమై సకలకార్య సాఫల్యం కలుగుతుంది, నీవు మంగళకరుడవు, నీవే పరబ్రహ్మం, నీవే పరము, నీవే సత్యము, నీవే తపసు, నీవే అగ్నివి, నీవే హవిస్సు సకలం విష్ణు స్వరూపమే ! సమస్త విద్యలకు, సమస్తతపములకు మూలం నీవే, నీవు పుట్టక లేనివాడివి, నీవు యజ్ఞస్వరూపుడవు. నిన్ను కనులారాగాంచిన నాకు కల్మషం అంటదు. నేను నీకు శరణాగతుడను నాకు నీవు మోక్షం ప్రసాదించు అని మనసారా విష్ణుమూర్తిని ప్రార్థించాడు భీష్ముడు. శ్రీ మహావిష్ణువును మనసారా స్తుతించిన భీష్ముని మహాఋషులు అందరూ ఎంతగానో ప్రశంసించారు. శ్రీకృష్ణుడు భీష్ముడు చేసిన స్తుతికి ఆనందభరితుడయ్యాడు.

శ్రీకృష్ణుడు ధర్మరాజుతో భీష్ముని వద్దకు వెళ్ళుట

[మార్చు]

శ్రీకృష్ణుడు ధర్మరాజుతో మనం భీష్ముడి వద్దకు వెడదాము " అన్నాడు. శ్రీకృష్ణుడు, సాత్యకి ఒక రథం ఎక్కారు. ధర్మరాజు, అర్జునుడు ఒక రథం ఎక్కారు. భీముడు, నకులుడు, సహదేవుడు మరొక రథం ఎక్కారు. కృపాచార్యుడు, యుయుత్సుడు, సంజయుడు మరొక రథం ఎక్కారు. అందరూ భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉన్న ప్రదేశానికి వెళ్ళేదారిలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అయిదు మడుగులు చూపి అతడితో " ధర్మనందనా ! అదుగో దూరంగా కనబడుతున్నాయే అయిదు మడుగులు వాటిని శమంతక పంచకం అంటారు. పరశురాముడు లోకంలోని రాజులందరినీ సంహరించి పరశురాముడు తన తండ్రికి ఇక్కడే రక్త తర్పణం చేసాడు " అన్నాడు. అప్పుడు ధర్మరాజు " శ్రీకృష్ణా ! ఈ క్రూరమైన పనిని పరశురాముడు ఎందుకు చేసాడు ? ఇందుకు కారణం ఏమి ? మరి ఇప్పుడు ఉన్న క్షత్రియులు ఎవరు ? చచ్చిన వారు ఎలా బ్రతికారు ? ఎలా ఈ భూమిని ఏలారు ? నాకు వివరించవా ! " అని అడిగాడు.

పరశురాముడి జన్మ వృత్తాంతం

[మార్చు]

శ్రీకృష్ణుడు ధర్మరాజు కోరిక మీద పరశురాముడి జనన వృత్తాంతం చెప్పసాగాడు " ధర్మనందనా ! పూర్వము జహ్నుడు అనే రాజు ఉన్నాడు. అతడి కుమారుడు ఉపజహ్నుడు. అతడి మనుమడు వల్లభుడు. ముని మనుమడు కుశికుడు. కుశికుడు ఘోరతపమాచరించి ఇంద్రుడిని ప్రసన్నుడిని చేసుకుని జగములోకెల్లా అధికుడైన కుమారుడు కావాలని కోరుకున్నాడు. ఇంద్రుడు అలాగేనని వరం ఇచ్చాడు. కుశికుడి కుమారుడు కౌశికుడు. అతడే గాధిగా లోక ప్రసిద్ధుడయ్యాడు. గాధి కుమార్త సత్యవతి. గాధి తన కుమార్తెను ఋచీకుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అతడు గొప్ప తపశ్శాలి తనకు తన మామగారికి కుమారులు కలగాలని తపస్సు చేసాడు. యాగఫలంగా రెండు పాత్రలయందు హవిస్సును పొందాడు. ఋచీకుడు తన భార్యతో రెండు పాత్రలిచ్చి " ఈ పాత్రలో ఉన్న హవిస్సు సేవించిన వారికి క్షత్రియులందరికీ అజేయుడైన కుమారుడు కలుగుతాడు. ఈ రెండవ పాత్రలో ఉన్న హవిస్సును సేవించిన వారికి అత్యంత తపోధనుడు, ఉత్కృష్ట బ్రాహ్మణోత్తముడు జన్మిస్తాడు. కనుక నీవు దీనిని సేవించుము " అని ఆ పాత్రలను భార్యకు ఇచ్చాడు. తరువాత అతడు స్నానం ఆచరించుటకు వెళ్ళాడు. ఇంతలో అక్కడకు వచ్చిన తల్లిని తండ్రిని చూసి సత్యవతి ఒక హవిస్సు పాత్రను భర్త చెప్పిన విధంగా తల్లికిచ్చింది. గాధి భార్య బుద్ధిపూర్వకంగా ఆ పాత్రలను మార్చింది. కుమార్తె కొరకు ఇచ్చిన హవిస్సును తాను సేవించింది. అదితెలియని సత్యవతి తనతల్లి కొరకు ఉద్దేశించిన హవిస్సును తాను సేవించింది. స్నానం చేసి వచ్చిన ఋచీకుడు జ్ఞానదృష్టితో జరిగినది గ్రహించి " సత్యవతీ ! నీ గర్భమున మహాక్రూరుడు పెరుగుతున్నాడు " అన్నాడు. సత్యవతి తల్లడిల్లి పోతూ భర్తను శరణు వేడింది. ఋచీకుడు " సత్యవతీ ! నేనేమి చేయ లేను. నీ తల్లి గర్భాన బ్రహ్మజ్ఞాని పుడతాడు. నీ గర్భమున క్రూరాత్ముడు జన్మించగలడు " అన్నాడు. సత్యవతి " నాకు పిల్లలు లేక పోయినా పరవా లేదు. క్రూరాత్ముడు మాత్రం వద్దు " అని వేడుకుంది. ఋచీకుడు కరుణించి " సత్యవతీ ! నీ కుమారునికి బదులు నీ మనుమడు క్రూరాత్ముడు ఔతాడు " అని పలికాడు. ఆ విధంగా సత్యవతికి జమదగ్ని జన్మించాడు. సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు జన్మించాడు. పరశురాముడు ధనుర్విధ్య అభ్యసించాడు.

కార్తవీర్యార్జునుడు

[మార్చు]

ఆ సమయంలో హైహయ వంశస్తుడైన కార్తవీర్యార్జునుడు అనే రాజు ఏడు దీవులతో కూడిన భూమిని పాలిస్తున్నాడు. కార్తవీర్యార్జునుడికి వెయ్యి చేతులు ఉన్నాయి. కార్తవీర్యార్జునుడు పరాక్రమశాలి నీతిమంతుడు. ఒకరోజు అగ్నిదేవుడు కార్తవీర్యార్జునుడి వద్దకు వచ్చి తనకు ఆహారంకావాలని అడిగాడు. కార్తవీర్యార్జునుడు తన ఆధీనంలో ఉన్న గ్రామములను భక్షించమని అగ్నిదేవుడికి అనుమతి ఇచ్చాడు. అగ్నిదేవుడు అన్ని ముని ఆశ్రమాలతో చేర్చి వశిష్టాశ్రమం కూడా దహించాడు. దానికి వశిష్ఠుడు ఆగ్రహించి దీనంతంటికీ కార్తవీర్యార్జునుడు కారణమని గ్రహించి " కార్తవీర్యార్జునుడి చేతులు పరశురాముడి చేతిలో తెగిపోగలవు" అని శపించాడు. అది తెలిసిన కార్తవీర్యార్జునుడు ఖిన్నుడయ్యాడు. కాలక్రమేణా కార్తవీర్యార్జునుడికి నీతిబాహ్యులైన అనేక మంది కుమారులు కలిగారు. ఒకరోజు వారు అరణ్యముకు వేటకు వెళ్ళి అలసి పోయి జమదగ్ని ఆశ్రమంలో ప్రవేశించి జమదగ్ని ఆతిధ్యం స్వీకరించారు. తమకు సురభి సాయంతో ఆతిధ్యం ఇచ్చిన జమదగ్ని యొక్క కామధేనువైన సురభి మీద ఆశతో దౌర్జన్యంగా దానిని పట్టితెచ్చి తమ భవనంలో కట్టివేసారు. ఈ విషయం కార్తవీర్యార్జునుడికి తెలియదు. కాని ఈ విషయమంతా తెలుసుకుని పరశురాముడు యుద్ధంలో కార్తవీర్యార్జునుడి చేతులు నరికి ధేనువును తీసుకు వెళ్ళాడు. ప్రతీకారంగా కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్నిని చంపారు.

క్షత్రియ సంహారం

[మార్చు]

జమదగ్ని మరణం గురించి తల్లి వలన తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుడి కుమారులతో సహా హైహయవంశ రాజులందరిని చంపాడు. దానితో తృప్తి పడకలోకములో అని క్షత్రియులందరినీ చంపి వారి రక్తంతో తన తండ్రికి రక్తతర్పణం విడిచాడు. తరువాత పరశురాముడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఒకరోజు విశ్వామిత్రుడి మనుమడు పరాసు అనేవాడు గర్వాంధుడై పరశురాముడిని చూసి " క్షత్రియులకు భయపడి పిరికి వాడిలా దాక్కున్నావు అని హేళన చేసాడు " ఆ మాటలకు కోపించిన పరశురాముడు బాలురు వృద్ధులు అని చూడక క్షత్రియులందరిని సంహరించాడు. ఈ విధంగా ఈ ప్రకారం పరశురాముడు ఇరవై ఒక్కమార్లు దండెత్తి క్షత్రియ సంహారం చేసి వారిని సమూలంగా నాశనం చేసాడు. తరువాత పరశురాముడు అశ్వమేధయాగం చేసిన ఆ సందర్భంలో తాను క్షత్రియసంహార సందర్భంలో సంపాదించిన రాజ్యాన్ని కశ్యపునకు దానంచేసాడు. అప్పుడు కశ్యపుడు పరశురాముడు ఇక్కడ ఉంటే ఇంకా ఎంత మంది రాజులను చంపుతాడోనని " పరశురామా ! నీవు క్షత్రియసంహారం ద్వారా పొందిన రాజ్యాన్ని నాకు దానంగా ఇచ్చావు కనుక ఇక నీకు ఇక్కడ నిలువ నీడలేదు. తక్షణమే దక్షిణదేశం పో " అన్నాడు. కశ్యపుడి ఆంతర్యం గ్రహించిన పరశురాముడు అలాగే దక్షిణ దేశానికి వెళ్ళాడు. దక్షిణ దిశలోని సముద్రుడు పరశురాముడికి భయపడి తన తీరం వెంట కొంత భూమిని అతడికి దానంగా ఇచ్చాడు. కశ్యపుడు పరశురాముడి వద్ద తాను పొందిన భూమిని బ్రాహ్మణులకు పంచి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. అప్పటి నుండి ఈ భూమికి కాశ్యపి అనే మరో నామం వచ్చింది.

భూమిని క్షత్రియులను తిరిగి రాజులను చేయుట

[మార్చు]

తరువాత కొన్ని రోజులకు వైశ్యులలో, శూద్రులలో ప్రముఖులు గర్వించి బ్రాహ్మణులభూమిని వారిభార్యలను అపహరించారు. దాని వలన బ్రాహ్మణులు అదుపు తప్పారు. బ్రాహ్మణులు అదుపు తప్పి మద్యపానం, దొంగతనం, ఇతరుల భార్యలను అపహరించడం మొదలైన అకృత్యాలకు పాల్పడి వారి ధర్మమైన యజ్ఞయాగాదులు మరిచి పోయారు. ధర్మం అంతరించి అధర్మం రాజ్యమేల సాగింది. ఈ అధర్మాన్ని సహించ లేక భూదేవి కుంచించుకుపోయింది. అది చూసి కశ్యపుడు తన ఉరువులతో భూమిని పైకిలేపాడు. అప్పటి నుండి భూమికి ఉర్వి అనే మరోపేరు వచ్చింది. భూదేవి ఆలోచించి " క్షత్రియులు మాత్రమే దండ నీతిని ఉపయోగించి ఈ భూమిని రక్షించగలరు " అనుకుంది. " ఓ మునీంద్రా ! పరశురాముడు చంపగా మిగిలిన క్షత్రియులు ఇంకా అక్కడక్కడ జీవించి ఉన్నారు. వారిని అందరిని పిలిచి ఈ భూమిని పాలించు భారాన్ని వారికి అప్పగించు " పరశురాముడి చేతిలో చావకుండా కొంత మంది హైహయరాజులు బతికి బయటపడ్డారు. అందులో కురువంశ సంజాతుడు విదూరధుడు అనే వాడు ఎలుగుబంట్లతో రక్షించబడ్డాడు. సుదానువంశంలో మరొకడు బ్రతికాడు, అతడిని పరాశరుడు అనే ఋషి చేరదీసాడు, అతడు శూద్రుడైనా అతడి చేత సర్వకర్మలు చేయించాడు. శిబి అనే చక్రవర్తి కుమారుడు గోపతి అడవిలో గోవుల చేత రక్షించబడ్డాడు. ప్రతర్ధనుడి కుమారుడు వత్సుడు అనే వాడు గోశాలలో దాక్కుని బతికాడు. దధివాహనుడు అనే వాడి కుమారుడు అంగుడు అనే వాడు గౌతమ మునీంద్రుని చేత రక్షించబడ్డాడు. బృహద్రధకులములో పుట్టిన భూరి అనేవాడు ఒరగ్రుధకూటము అనే పర్వతము మీద కొండ ముచ్చులతో రక్షించబడ్డాడు. మరుత్తుల సంతానమైన నాలుగేళ్ళ వయసు కలిగిన నలుగురు సముద్రుడి చేత రక్షింపబడ్డాడు. వీరంతా ఉత్తమ క్షత్రియులు వీరు ఈ భూమిని సమర్ధవంతంగా పాలించగలరు " అని చెప్పింది. 'కశ్యపుడు' భూదేవి చెప్పినట్లు ఆ రాజులందరినీ పిలిపించి వారికి ఈ భూమిని అంతటిని పంచి ఇచ్చారు. వారి నుండి అనేక రాజవంశాలు వర్ధిల్లాయి. ఆ విధంగా వర్ధిల్లిన రాజవంశాలన్నీ ఈ మహాభారత యుద్ధంలో అంతరించాయి కాని అక్కడక్కడా కొంత మంది చావక బ్రతికి బయటపడ్డారు " అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు.

శ్రీకృష్ణుడు భీష్ముని కుశలము విచారించుట

[మార్చు]

తరువాత వారంతా ఓఘవతీ తీరంలో అంపశయ్యలో పడి ఉన్న భీష్ముడి వద్దకు చేరుకున్నారు. అందరూ తమతమ రథములు దిగారు. శ్రీకృష్ణుడు భీష్ముడి వద్దకు పోయి " ఓ తేజోవంతుడా భీష్ముడా ! నీ మనసు వ్యాకులత చెందక ప్రశాంతంగా ఉందా ! నీ శరీరంలో గుచ్చుకున్న బాణాలు బాధ పెడుతున్నాయా ! ఆ బాధ నీకు కలగక పోవడానికి కారణం నీకు నీ తండ్రి ప్రసాదించిన వరప్రభావమే ! నీకు తెలియని విషయాలు లేవు కదా ! క్షత్రియుడిగా జన్మించి బ్రహ్మచర్యం అవలంబించి రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచావు. నీలాంటి వాడు అరుదుగా జన్మిస్తాడు. దేవ, దానవ, యక్ష, గంధర్వాదులు ఒక్కుమ్మడిగా దండెత్తి వచ్చినా నిన్ను జయించ లేరుకదా ! ఇంద్రియ నిగ్రహం, తపస్సు, సత్యము, దానము, ధర్మనిరతిలో అగ్రగణ్యుడవు. శరీరం అంతా బాణములు గుచ్చుకున్నా " నా ఇష్టం వచ్చినప్పుడు నేను మరణిస్తాను " అని చెప్పిన ధీరోదాత్తుడవు. అష్టవసువులలో అగ్రగణ్యుడవు, గంగాపుత్రుడవు నీకునీవే సాటి. నీ గురించి బ్రహణులు చెప్పగా విన్నాను. ఇడుగో ధర్మరాజు తన వారిని అందరినీ పోగొట్టుకొని బాధాతప్త హృదయుడైన ఇతడికి అమృతోపమానమైన నీ పలుకులతో నివారణ కలిగించు. నీకు తెలియని విషయములు లేవు. నాలుగు వర్ణములు, నాలుగు వేదములు, నాలుగు ఆశ్రమములు వాటి ధర్మములు నీకు బాగా తెలియును. ప్రవృత్తి, నివృత్తి, సాంఖ్యము, పురాణములు, ఇతిహాసములు, ధర్మశాస్త్రం నీకు కరతలామలకం. ఎవరి మనసులో కలిగిన సంశయమైనా తొలగించగలిగిన సమర్ధుడవు. ఈ ధర్మరాజును ఆదరించి అతడి సంశయం పోగొట్టుము. శోక మోహ బాధిత ప్రజల సంశయ నివృత్తి చేసినప్పుడే కదా నీ లాంటి వారు నేర్చుకున్న విద్యలకు సార్ధకత " అని పలికిన శ్రీకృష్ణుడిని భీష్ముడు నమస్కరించాడు.

శ్రీకృష్ణుడు రాజధర్మాలు చెప్పడానికి భీష్ముడే తగినవాడని చెప్పుట

[మార్చు]

శ్రీకృష్ణుడి మాటలకు భీష్ముడు " పరంధామా ! యోగీశ్వరేశ్వరుడవు, నీవే కర్తవు, నీవే భర్తవు, నీవే సంహార కర్తవు నేను ఏమి చెయ్యాలో నీవే నిర్ణయించు " అని అన్నాడు. శ్రీకృష్ణుడు " మహానుభావా ! నా అందు నీకు అచంచల భక్తి ఉన్నదని తెలుసు, భక్తి, సత్ప్రవర్తన ఈ రెండే నా నివాసం. ఈ రెండింటిలో ఏది కొరవడినా నేను అక్కడ నుండి తప్పుకుంటాను. నీకు ఆ రెండూ పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజు నుండి ఏభై ఆరు రోజులకు సూర్యుడు ఉత్తరాయణంలో సంచరిస్తాడు. అప్పుడు నీవే దేహం విడిచి జన్మరాహిత్యం పొంది మోక్ష స్థితికి చేరుకుంటావు. నీ సహచర మనువులు నీ కొరకు అదృశ్యంగా ఆకాశంలో ఎదురు చూస్తున్నారు. నీవు పరమ పదించిన నీతో నీవు అర్జించిన జ్ఞానం మరుగున పడుతుంది " అని అక్కడ ఉన్న ధర్మరాజాదులను చూపి " భీష్మా ! నీ వల్ల ధర్మభోధనలు వినడానికి వీరంతా వచ్చారు. వీరికి ధర్మ బోధ చేసి నీవు సముపార్జించిన జ్ఞానం వీరికి పంచి ఇచ్చి నీవు ధన్యత చెంది వీరికి ధన్యత కలుగ చెయ్యి " అన్నాడు.

శ్రీకృష్ణుడు భీష్ముడికి బాధలేకుండా వరమిచ్చుట

[మార్చు]

భీష్ముడు కృష్ణుడితో " శివంకరా ! అచ్యుతా ! నారాయణా ! నీ పలుకులకు నా జన్మ తరించింది. నేను ధన్యుడనయ్యాను. నీకు ఎదురాడటం నీతో మాట్లాడడం ఆ బ్రహ్మకు కూడా తరం కాదు. ఇక నేనెంత. నా శరీరంలో గుచ్చుకున్న బాణములు బాధిస్తున్నాయి. నోరు ఎండిపోయింది. నా గొంతు నాలుక మాట్లాడ సహకరించడం లేదు. అడిగిన దానికి జవాబు చెప్పేశక్తి నాకులేదు. కనుక ధర్మ సూక్ష్మములు నీవే చెప్పు. నీవు ఉండగా నేను చెప్పడం భావ్యం కాదు. గురువు ముందు శిష్యుడు ఉపన్యసించినట్లు ఉంటుంది " అన్నాడు. ఆ మాటలకు కృష్ణుడు ఇలా అన్నాడు " నీ బాధ నాకు అర్ధమయ్యింది. నీకు మూడు వరాలు ఇస్తున్నాను. నీ శరీరంలో గుచ్చుకున్న బాణముల వలన ఏ బాధ లేకుండా, స్పృహ తప్పి పోకుండా, నీకు నొప్పి తెలియకుండా, అసలు నీకు ఏమి జరకుండా ఉండేలా వరమిస్తున్నాను. నీ మనస్సు ప్రాపంచిక విషయములలో తగులుకొనక బ్రహ్మజ్ఞానం కలిగేలా మరొక వరం ప్రసాదిస్తున్నాను " అన్నాడు. అప్పుడు దేవదుంధుభులు మ్రోగాయి. పుష్పవృష్టి కురిసింది. అప్పటికి సంధ్యాసమయం అయింది. మునులు, ధర్మరాజు శ్రీకృష్ణుడు మరుసటి దినం వస్తామని భీష్ముడి వద్ద శలవు తీసుకుని తమ తమ రథములను అధిరోహించి హస్థినాపురం వెళ్ళారు.

శ్రీకృష్ణుడు భీష్ముని యోగక్షేమములు విచారించుట

[మార్చు]

మరునాడు ఉదయం ధర్మరాజాదులు మంగళ స్నానమాచరించి భీష్ముడి వద్దకు పయన మయ్యారు. ధర్మరాజు అర్జునుడితో " ఈ రోజు మనతో సైనికులు పరిచారికలు వద్దు. ధృతరాష్ట్రాదులు మాత్రం వస్తే చాలు " అని చెప్పాడు. ధర్మరాజు, అర్జునుడు ఒక రథం మీద, భీముడు నకుల సహదేవులు ఇంకొక రథం మీద శ్రీకృష్ణుడు మరొక రథం మీద, కృపాచార్యుడు, సంజయుడు, యుయుత్సుడు మరొక రథం ఎక్కి భీష్ముడి వద్దకు చేరుకున్నారు. వారికంటే ముందుగా నారదాది మునులు భీష్ముడి వద్దకు చేరుకున్నారు. శ్రీకృష్ణుడు, ధర్మరాజాదులు భీష్ముడికి నమస్కరించారు. ముందుగా మాట్లాడేది ఎవరని ఒకరి ముఖం ఒకరు చూసుకొను చుండగా ధర్మరాజు కృష్ణుడితో " కృష్ణా ! భీష్ముడితో మాటాడ తగిన వారు నీవు తప్ప ఎవరు లేరు కనుక నీవు సంభాషణ మొదలు పెట్టు " అన్నాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి దగ్గరగా వెళ్ళి అతడి యోగక్షేమములు విచారించాడు. భీష్ముడు " దేవా! నీ దయ వలన నాకు ఆకలి, దప్పిక, అలసట లేదు. వయోవృద్ధుడినైన నేను ప్రస్థుతం బాలుడి వలె ఉత్సాహభరితుడనై ఉన్నాను. నీవు చెప్పిన విధంగా నేను పాండవులకు ధర్మ సూక్ష్మములు చెప్తాను. కాని సర్వజ్ఞుడవైన నీవు నా చేత చెప్పించడం లోని అంతర్యం ఏమిటి ? " అని అడిగాడు.

ధర్మరాజు రాజధర్మములు చెప్పమని భీష్ముడిని కోరుట

[మార్చు]

శ్రీకృష్ణుడు భీష్మా ! ఈ లోకంలో సకల యశస్సుకు కీర్తికి నేనే కారణం. రాజధర్మాలు ధర్మరాజు ద్వారా లోకానికి చెప్పడం వలన నాకు కొత్తగా వచ్చే కీర్తి లేదు నాకు దానిమీద వ్యామోహం లేదు. ఈ అవసాన దశలో ధర్మనిరతుడవైన నీ నోటి నుండి ధర్మసూక్ష్మములు లోకానికి అందించి నీకు కీర్తి కలిగించాలని ఇలా చేస్తున్నాను. నీవు అన్నీ సందేహాలు తీర్చేవిధంగా సమస్తజ్ఞానం నీలో ప్రవేశపెట్టాను. ఇందు వలన నీ కీర్తి ఆచంద్రార్కారం నిలిచి ఉంటుంది. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు నీవు చెప్పే సమాధానాలు ఈ లోకానికి మార్గదర్శకాలు ఔతాయి. నీ జన్మధన్యం ఔతుంది. కనుక నీవు ధర్మరాజు అడిగిన వాటికి తగిన సమాధానాలు చెప్పు " అన్నాడు. ఆ మాటలకు మిక్కిలి ఆనందపడిన భీష్ముడు " కృష్ణా ! ధర్మరాజు పుట్టినప్పుడు మునీంద్రులంతా ఆనందించారు. ఈ భరతకులంలో ధర్మరాజు పరమధార్మికుడు అయ్యాడు. సత్యము, శాంతి, శౌచము, ధర్మము మొదలగు ఉత్తమ గుణాలకు ధర్మరాజు ఆలవాలం అయ్యాడు. కామంతోగాని ధనంతోగానీ, భయంతోగానీ ధర్మం తప్పనివాడు ధర్మరాజు. అలాంటి వాడు నన్ను ఏమి అడగదలిచాడో అడగమను నాకు తోచినంత చెప్తాను " అన్నాడు భీష్ముడు. ఆ మాటలకు కృష్ణుడు నవ్వి " భీష్మా ! ఈ యుద్ధంలో ధర్మరాజు మిత్రులను, బంధువులను, మిత్రులను సంహరించాడు. లెక్కలేనంత మందిని రణభూమికి బలి ఇచ్చాడు. అతడిలో జాలి దయ మచ్చుకైనాలేవు అని నీవు అంటావని నీ ఎదుటికి రావడానికి భయపడుతున్నాడు " అని అన్నాడు. ఆ మాటలకు భీష్ముడు కృష్ణా ! బ్రాహ్మణులకు వేదాధ్యనము, యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించడం విద్యుక్తధర్మం, అలాగే క్షత్రియులకు యుద్ధం చెయ్యడం విద్యుక్తధర్మం. యుద్ధంలో తమను ఎదిరించిన తండ్రులను, తాతలను, బంధువులను, మిత్రులను, కుమారులను, మనుమలను, గురువులను వధించడం ధర్మమేకదా ! ఎందుకంటే వారు వారి ధర్మం మరిచి యుద్ధం చేసారు. అలాంటి వారిని వధించుట ధర్మమే కాని పాపం కాదు ! యుద్ధంలో అధర్మవర్తనులను, అన్యాయం చేసిన వారిని వధించడం పుణ్యమే కాని పాపంకాదు. కనుక ధర్మరాజు ధర్మాత్ముడే ! " అని భీష్ముడు అన్నాడు. ఈ మాటలు విన్న ధర్మరాజు చేతులుజోడించి భీష్ముడి ముందుకువచ్చాడు. భీష్ముడి పాదాలాకు తలతాకించి నమస్కరించాడు. భీష్ముడు ధర్మరాజు తలను తన రెండుచేతులతో పట్టి నుదుటి మీద చుంబించాడు. " ధర్మనందనా ! నీ మదిలో మెదలుతున్న సందేహాలను అడగవయ్యా " అన్నాడు.

రాజధర్మములు

[మార్చు]

ధర్మరాజు అందరి అనుమతి పొంది భీష్మునితో " పితామహా ! ధర్మార్ధ కామాలలో రాజధర్మం గొప్పది. ఏనుగుకు అంకుశం ఎలాగో, గుర్రానికి పగ్గములు ఎలాగో మానవ మనుగడకు రాజధర్మం అత్యావశ్యం. మా పూర్వులు ఆచరించిన రాజధర్మమును ఆచరించక పోతే అరాచకం పెరుగుతుంది, ధర్మం నశిస్తుంది. ఈ ప్రజలు చేసే పాపాలను రాజధర్మంతోనే అణచి వేయడం ధర్మంతుంది. ధర్మం తెలిసిన ప్రజలు రాజును ధర్మస్వరూపంగా అనుకుంటారు. కనుక రాజుకు రాజధర్మములు తెలుకొన వలసిన అవసరం ఉంది. రాజు రాజధర్మం తప్పితే రాజ్యంలో అరాచకం పెరుగి ధర్మం తగ్గుతుంది. కనుక రాజు ప్రజలు చేసే పాపాలను రాజధర్మంతోనే అణిచివేయాలి. ప్రజలు రాజును ధర్మస్వరూపుడిగా ఆరాధిస్తారు కనుక రాజు రాజధర్మం ఎరిగి పాలన చేయడం అవశ్యం కనుక మీరు నాకు రాజధర్మ సూక్ష్మాలను ఎరిగించండి " అని అడిగాడు. భీష్ముడు " తనకు మేలు జరగాలని కోరుకునే రాజు ముందుగా ఏ దేవతలను పూజించాలి. ఏ పనికైనా దైవబలం అవసరం. కనుక మానవ ప్రయత్నంతో పైన చెప్పిన రెండింటినీ చేయాలి. మానవ ప్రయత్నం చేసే రాజుకు దైవసాయం ఉంటుంది. ప్రయత్నం విఫలమైనా రాజు కలత నొందక అది దైవనిర్ణయం అని భావించాలి. రాజుకు శాంతి, దాంతి, విజితాత్మ, శీలం మొదలైన సుగుణములు ఉండాలి. ఇవి ఉన్న రాజుకు సమస్త సంపదలు సమకూడుతాయి. రాజు సత్యసంధత కలిగి విజ్ఞత, మంచి నడనవడి కలిగి రాజ్య పాలన చేస్తూ దండనీతిని జాగరూకతతో అమలు చేస్తే కీర్తిమంతుడు కాగలడు. రాతి నుండి ఇనుము పుడుతుంది, అదే ఇనుముతో రాతిని కొడితే రాయి విరుగుతుంది, నీటి నుండి అగ్ని పుడుతుంది కాని అగ్నితో నీటిని కాల్చాలనుకుంటే అది ఆరిపోతుంది. బ్రాహ్మణుడి వలన రాజు తయారు ఔతాడు. ఆ రాజే బ్రాహ్మణుడిని అవమానిస్తే రాజు నాశనం కాక తప్పదని. నీవు మనసులో పెట్టుకోవాలి. బ్రాహ్మణులు వేదస్వరూపులు కనుక వారిని గౌరవించి ఆదరించు. బ్రాహ్మణుడు తప్పు చేస్తే అతడూ దండనార్హుడే. శుక్రనీతిలో " యుద్ధ సమయంలో అస్త్ర శస్త్ర సహితుడై తన మీదకు వచ్చే బ్రాహ్మణుడిని వధించడం రాజుకు పరమధర్మం. కాని గురువు భార్యను కోరిన వాడిని, పసి పిల్లలను చంపినవాడిని, సాటి బ్రాహ్మణుడిని చంపినవాడిని, రాజద్రోహం చేసిన వాడిని చంపక దేశభహిష్కరణ చేయాలి " అని చెప్పాడు.

రాజప్రవర్తన

[మార్చు]

బృహస్పతి రాజ ప్రవర్తన గురించి " రాజు దుర్గరక్షణలో అప్రమత్తతతో వ్యవహరించి చతురంగబలముతో రక్షించాలి. రాజు బ్రాహ్మణులను, వైశ్యులను, క్షత్రియులను వర్ణవివక్షణ లేక సమానంగా చూడాలి. రాజు దయతో వ్యవహరించాలి కాని మెతకదనం చూప కూడదు. మృదుప్రవర్తన వలన రాజు ప్రజలలో చులకన ఔతాడు. అప్పుడు ప్రజలు రాజుతో తమకు ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించి ఆటలాడుతారు. అలాగే రాజు కౄరత్వం ప్రదర్శించ కూడదు. ప్రజలు భయభ్రాంతులు ఔతారు. కనుక అతిమృదుస్వభావం చూపక, అతికౄరత్వం చూపక దయ దండన సమపాళ్ళలో రంగరించాలి. ఇది రాజధర్మంలో ప్రధానమైనది. రాజు తన కోపతాపములు ప్రజల ముందు ప్రదర్శించక సంయమనం వహించాలి. రాజు గంభీరంగా ఉండాలి కాని తనక్రింది ఉద్యోగులతో ప్రజలతో పరిహాసాలు పరాచకాలు ఆడకూడదు. అలా చేస్తే రాజును లెక్క చేయక రాజుకు హానికలిగించే పనులుచేసి రాచరికానికి ముప్పు తీసుకు రాగల ప్రమాదం ఉంది. రాజు ఉద్యోగులతో దయతో గంభీరంగా వ్యవహరించాలి. రాజ్యముకు రాజ్యపాలన కలిగించే వారికి అపకారము తలపెట్టిన వారిపట్ల మెతకదనం వహించక కఠినత్వం వహించాలి. రాజు వారిని వెంటనే వదిలించుకోవాలి. గర్వాంధుడై తన కర్తవ్యం మరచి ప్రవర్తించే వాడిని రాజు వదిలించుకోవాలి కాని భరించ కండా ఉండటమే రాజధర్మం " మరుత్తుకు చెప్పాడు. కనుక ధర్మరాజా ! తప్పు చేసిన వాడు గురువైనా, సుతుడైనా, మిత్రుడైనా మన్నించక కఠినంగా శిక్షించాలి. ప్రజలను బాధిస్తున్న అసమంజసుడిని వదిలి వేసిన సగరుడు, బ్రాహ్మణులను బాధిస్తున్న కుమారుడు శ్వేతకేతువును వదిలి వేసిన ఉద్దాలకుడు మనకు ఈ విషయంలో ఆదర్శ మూర్తులు. రాజు సత్యము, ధర్మము, క్షమాగుణం కలిగి పాలన సాగించి ప్రజలను సంతోష పెట్టాలి. రాజు తనకు కీడు సంభవించగలదని భావిస్తే వైదికకర్మల ద్వారా వాటిని నివారించాలి. రాజు చతుర్వర్ణాలను సమంగా ఆదరించాలి. తనను పొగిడే వారిని దూరంగా ఉంచాలి. అవినీతిని అంత మొందించి వారి ధనమును బాధితులకు పంచాలి. ఎవరిని అతిగా నమ్మకూడదు, అలాగని ఎవరి మీద అవిశ్వాసం చూపక విచక్షణతో వ్యవహరించాలి.

అంతఃకలహం

[మార్చు]

ధర్మజా ! రాజుకు అంతఃశత్రువులు ఎక్కడినుండో పుట్టుకు రారు. అతడి ప్రజల నుండి వస్తారు. అది నివారించాలంటే ధర్మనిరతులైన వారిని, అర్ధశాస్త్రంలో నిపుణులను, స్థిరచిత్తులను, రాజాజ్ఞను గౌరవించే వారిని, ఉత్తమ కులతిలకులను, నీతిమంతులను తన కొలువులో చేర్చుకుని పాలన సాగించాలి. అటువంటి రాజు పాలనలో ప్రజలు సంతోషంతో కపటంలేక పుత్రులవలె మెలగుతారు. రాజు అత్యంత పరాక్రమ వంతుడై ఉండాలి. లేని ఎడల ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించ లేడు. అని శుక్రాచార్యుడు చెప్పాడు. పరాక్రమ హీనుడు, ప్రజలను రక్షించ లేని రాజు చదువుకోని ఋత్విక్కు వంటి వాడు. అని మనువు చెప్పాడు. ప్రజా సంరక్షణయే పరమ ధర్మమని ఇంద్రుడు భరద్వాజుడు చెప్పారు. రాజైన వాడు ఎప్పుడూ ఉత్సాహవంతుడై ఉండాలి. న్యాయమార్గమున కాని, అన్యాయ మార్గమున కాని శత్రువును వధించాలి. అల్పుడని వదిలి వేసిన శత్రువు బలిష్టుడై విషంకక్కే అపాయం ఉంది. కనుక శత్రుసంహారం రాజ్యానికి శ్రేయోదాయకం. ఎన్ని అండ్డంకులు వచ్చినా రాజురాజ్యాన్ని అన్యాక్రాంతం చెయ్యకూడదు " అని చెప్పాడు భీష్ముడు. అప్పటికి సూర్యాస్తమయం అయ్యింది కనుక శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు, మహా మునులు భీష్ముడి వద్ద శలవు తీసుకుని వెళ్ళారు.

నీతి శాస్త్రం

[మార్చు]

మరునాడు ఉదయయం శ్రీకృష్ణుడు ధర్మరాజు మహామునులు భీష్ముని వద్దకు వచ్చి చుట్టూ కూర్చున్నారు. ధర్మరాజు చేతులు జోడించి " పితామహా ! మామూలు మానవులకు రాజులకు భేదం లేదుకదా ! ఇద్దరికీ చావు పుట్టుక వ్యాధులు ఉన్నాయి. ఇద్దరికీ తలా , చేతులు, కాళ్ళు సమానమే కదా ! ఇద్దరికీ చావు పుట్టుక వ్యాధులు సమానమే! అలాంటప్పుడు రాజు ప్రజలను తనవశంలో ఎలా ఉంచుకోగలడు ? ఎలా రక్షించగలడు ? ఎలా దండించగలడు ? రాజు దేవుడితో సమానం ఎలా కాగలడు ? దయచేసి వివరించండి " అని అడిగాడు. అందుకు భీష్ముడు " ధర్మనందనా ! కృతయుగంలో ధర్మము చక్కగా ఉంది. ప్రజంతా ధర్మబద్ధులై ప్రవర్తించారు. అందుకని ప్రజలకు ఎవరి రక్షణా అవసరం లేక పోయింది. తరువాత క్రమంగా ప్రజలలో ఇది నాది అది నీది అనే భావం పెరిగి స్వార్ధం పెరిగి లోభత్వం ప్రవేశించింది. క్రమంగా ధర్మం క్షీణించి ప్రజలు అకృత్యముకు పాల్పడసాగారు. క్రమంగా కోరికలు ప్రబలి ఒకరిమీద ఒకరికి మదం, మాత్సర్యం, ద్వేషం పెరిగింది. వేదాలు చదవడం మానివేసారు. అధర్మం రాజ్యమేల సాగింది. అప్పుడు దేవేంద్రాదులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి " దేవా ! మానవ లోకంలో వేదాధ్యాయం సన్నగిల్లింది. యజ్ఞయాగములు చేయడం వదిలారు. ధర్మం క్షీణించింది " అని మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు నవ్వి " నేను దానికి తగిన ప్రతిక్రియ చేస్తాను కలత చెందవద్దు " అని చెప్పాడు.

బ్రహ్మరచించిన నీతిశాస్త్రం

[మార్చు]

తరువాత బ్రహ్మదేవుడు నీతి శాస్త్రమును రచించాడు. ఆ నీతి శాస్త్రంలో రాజు, మంత్రి, దుర్గం, కోశాగారం, వార్తా సేకరణ, దండనీతి, మిత్రులు, శత్రువులు, ఉదాశీనుడు, సంధిచేసుకోవడం, రాజతంత్రములు, ధర్మం, అర్ధం, కామము, మోక్షం అనే నాలుగు పురుషార్ధములు పొందుపరిచాడు. ఆ నీతిశాస్త్రం లక్ష అధ్యాయములు కలిగి ఉంది. ఆ నీతిశాస్త్రం లోకములకు ఆచరణయోగ్యమై నిర్మలంగా ఉండడానికి తోడ్పడుతుందని భావించాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడి నొసటి నుండి ఆది అంతం లేనివాడు, ఈ విశ్వమునకు కర్త అయిన వాడు, సర్వభూతములలో తానై ఉన్నవాడు, సనాతనుడు, వికృతం, విశాలం అయిన కన్నులు కల వాడు అయిన శివుడు విశాలాక్షుడు అనే పేరుతో ఆవిర్భవించాడు.విశాలాక్షుడు బ్రహ్మ రచించిన లక్ష అధ్యాయములు గల నీతి శాస్త్రమును ఆ మూలాగ్రం చదివాడు. ఈ నీతి శాసత్రం చదవడానికి మానవుల బుద్ధి ఆయుస్షు, బుద్ధి సరి పోదు అని అనుకున్నాడు. అందు వలన ఆ నీతిశాస్త్రమును పదివేల అధ్యాయములకు కుదించి, వైశాలాక్షము' అనే నీతిశాస్త్రము రచించాడు. ఆ తరువాత ఆ నీతిశాస్త్రం మహేంద్రుడు చదివాడు. మహేంద్రుడు దానిని అయిదు వేల అధ్యాయములకు కుదించాడు. ఆ తరువాత బృహస్పతి అందరికీ అర్ధం అయ్యేలా మూడు వేల అధ్యాయములకు కుదించాడు. దానిని శుక్రుడు వేయి అధ్యాయములకు కుదించాడు. అదే శుక్రనీతి. కాల క్రమేణా మునులు దానిని చిన్న చిన్న గ్రంథాలుగా రచించారు. ఇలా నీతిశాస్త్రం వివిధ మార్పులు చెందింది. దేవతలు ఆ తరువాత విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి నీతిశాస్త్ర పరిణామమును వివరించి దానిని అమలు చేయడానికి ఒక సమర్ధుడిని నిర్ధేశించండి అని వేడుకున్నారు.

ప్రధమ ప్రజాపాలకుడు

[మార్చు]

దేవతల కోరికను మన్నించి విష్ణుమూర్తి తన తేజస్సుతో ఒక మానసపుత్రుడిని పుట్టించాడు. అతడి పేరు విరజుడు. విష్ణువు అతడిని రాజును చేసాడు. కాని అతడు రాజ్యపాలన పట్ల విముఖత వహించి తన కుమారుడైన కర్ధముడికి రాజ్యమును అప్పగించి తాను తపమాచరించడానికి వెళ్ళాడు. కర్ధముడు కూడా రాజ్యపాలన పట్ల విముఖత వహించి తన కుమారుడైన అనంగుడికి రాజ్యమును అప్పగించి తప మాచరించ డానికి వెళ్ళాడు. అనంగుడు నీతి శాస్త్రమును అనుసరించి దండనీతిని ఉపయోగించి రాజ్యపాలన సాంగించాడు. అతడి తరువాత అతడి కుమారుడైన నీతికి పట్టాభిషేకం చేసాడు. నీతి మృత్యువు కుమార్తె సునీధను వివాహం చేసుకున్నాడు. వారికి వేనుడు అనే కుమారుడు కలిగాడు. అతడు రాగద్వేషములకు లోనై ప్రజాకంటకుడై మహామునుల హోకారం చేత హతుడయ్యాడు. మహామునులు తరువాత పాలకుడి కొరకు అతడి తొడను దర్భలతో మధించారు. తొడ నుండి ఒక వికృతాకారుడు అయిన అశుచి అనే కుమారుడు జన్మించాడు. మునులు వాడిని చూసి నిరాశపడి " నిషీద నిషీద " ("కూర్చో కూర్చో") అని అన్నారు. అందు వలన అతడు నిషాధు డయ్యాడు. మునులు అతడిని అడవులకు పంపాడు. నిషాధుడి సంతతి నిషాధులై వింధ్యపర్వత శ్రేణులలో అత్యంత క్రూరులై సంచరించ సాగారు. తరువాత మునులు వేనుడి కుడి భుజాన్ని మధించారు. అప్పుడు అతడి భుజం నుండి ప్రకాశించే కవచంతో, ధనుర్భాణాలతో, వేదవేదాంగ, ధనుర్వేద పారంగతుడైన మహాపురుషుడు జన్మించాడు. నీతి శాస్త్రంలో చెప్పబడిన దండనీతి ఆ మహా పురుషుడిని ఆశ్రయించింది. ఆ మహాపురుషుడు మునులకు నమస్కరించి " మహా మునులారా ! నన్ను ఎందుకు సృష్టించారు " అని అడిగాడు. మునులు " ఓ మహాపురుషా ! నీ పేరు వైన్యుడు నీవు అహంకారం, క్రోధం, మోహ, లోభం విడిచి నీతి శాస్త్రమును అనుసరించి ధర్మ రక్షణ చేస్తూ ఈ లోకాన్ని పాలించు. నీ ఇష్టా ఇష్టములకు అతీతంగా ప్రజలను రక్షించు. నీతి శాస్త్రమును అనుసరించి ధర్మమును రక్షించి, వేద వేదాంగములను రక్షించి, వర్ణ సంకరమును అరికట్టు. బ్రాహ్మణులను, నీతిమంతులను రక్షించు " అని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ వైన్యుడు " మహామునులారా ! నేను బ్రాహ్మణుల సహాయంతో మీరు చెప్పిన కార్యములు నెరవేర్చ గలను " అని పలికాడు. అందుకు మహామునులు సంతోషపడి వైన్యుడికి బ్రాహ్మణులను మంత్రులుగా నియమించి ఆ మహామునులు వైన్యుడిని సకల భూమండలానికి పట్టాభిషిక్తుడను అయ్యాను. శుక్రుడిని పురోహితుడిగా నియమించారు. వాల ఖిల్యులలో సారస్వతులను మంత్రులుగా నియమించాడు. గర్గుడిని జ్యోతిష్యుడుగా నియమించారు. ఇంద్రుడు, కుబేరుడు అత్యధిక సంపదలను ఇచ్చారు. వైన్యుడు ఈ భూమండలానికి రాజై నీతిశాస్త్రము చెప్పిన రీతిగా దండనీతిని అమలు చేస్తూ రాజ్యపాలన చేయసాగాడు. వైన్యుడి పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు.

క్షత్రియుడు

[మార్చు]

ధర్మరాజా ! ప్రజలను, బ్రాహ్మణులను రక్షించాడు కనుక క్షత్రియుడయ్యాడు, ప్రజలను రంజింప చేసే వాడు కనుక రాజు అయ్యాడు. వైన్యుడి సంతతి వారు క్షత్రియులయ్యారు. రాజరికం వహించి దండ నీతిని అమలు చేస్తూ రాజులయ్యారు. కనుక రాజులంతా విష్ణువు అంశలే. ప్రజారక్షణ చేస్తూ పాలించే వాడు విష్ణాంశ సంభూతులు. అందు వలన రాజుల చేతిలో ప్రజా రక్షణాశక్తి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఫాలభాగం నుండి ఉద్భవించిన లక్ష్మి (సిరి) ధర్మమును ఆశ్రయించి అతడికి భార్య అయి అర్ధము అనే కుమారుడిని కన్నది. అందువలన ధర్మము, సిరి, అర్ధము రాజును ఆశ్రయించుకుని ఉంటాయి. ధర్మరాజా ! అందుకని రాజు సామాన్యుడు కాదు. అతడు పుణ్యాత్ముడు. అతడు స్వర్గలోకముకు పోవడానికి అర్హుడు. దండనీతిని అమలు చేస్తూ ప్రజాపాలన చేయడానికి స్వర్గం నుండి ఈ భూమి మీదకు విష్ణాంశ సంభూతుడు. కనుక వర్ణాశ్రమ ధర్మాలు, అచారవ్యవహారాలు, వేదములు, పురాణములు, ఇతిహాసములు రాజుల ఆధీనంలో ఉంటాయి. విష్ణుమహిమ వలన రాజు సౌందర్యము, శౌర్యము, చతురత మొదలైన సుగుణములు కలిగి ఉంటాడని ప్రజలు అనుకుంటారు. అందుకే రాజు దేవతలతో సమానుడని ప్రజలు అనుకుంటారు. ధర్మరాజా ! నీకు ఇంకా సందేహాలు ఉంటే అడుగు " అని చెప్పాడు భీష్ముడు.

చతుర్వర్ణాలు

[మార్చు]

భీష్ముడి మాటలకు బదులుగా ధర్మరాజు " పితామహా ! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే నాలుగు వర్ణాలు, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు వర్ణాశ్రమములు - వాటిని ఆచరించు విధానములు, ఈ ప్రపంచంలో అనుసరించు రాజధర్మములు వివరించండి " అని కోరాడు. భీష్ముడు " ధర్మనందనా ! కోపం లేకుండా ఉండడం, సత్యం పలుకడం, తన భార్య యందు అనురక్తుడై ఉండటం, రాజ్యమునకు సంబంధించిన రహస్యములను కాపాడడం, పరుల ఎడ ద్రోహచింతన లేకుండుట మొదలైన ఉత్తమగుణములు రాజు పాటించాలి. బ్రాహ్మణుడికి ఇంద్రియ నిగ్రహం అత్యంత అవశ్యం. బ్రాహ్మణుడు రోజూ వేధాధ్యయనం చేయాలి. కరుణ, శాంతస్వభావం కలిగి ఉండాలి. బ్రాహ్మణుడు చెడు ప్రవర్తన విడనాడాలి. బ్రాహ్మణుడికి లభించిన సంపదను తన సంతానం కొరకు పరుల కొరకు వినియోగించాలి. క్షత్రియధర్మం ఏమంటే అతడు యజ్ఞ యాగాదులు చేయ్యడం, వేదాధ్యయనం చెయ్యడం, దుర్మార్గులను కఠినంగా శిక్షించడం, ప్రజలను అనురాగంతో పాలించడం, యుద్ధంలో పరాక్రమం చూపడం క్షత్రియధర్మం. అన్నిటికంటే యుద్ధం చెయ్యడం క్షత్రియుడికి పరమ ధర్మం. వైశ్యధర్మములు చెప్తాను. వైశ్యుడు వేదాధ్యయనం చేయాలి, యజ్ఞ యాగములు చెయ్యాలి, న్యాయంగా ధనార్జన చెయ్యాలి. ధనం కూడబెట్టాలి. పశు పోషణ, రక్షణ చేయాలి. ఇది వైశ్యుడు పాటించవలసిన ఉత్తమ ధర్మాలు. పైన చెప్పిన మూడు వర్ణాలకు కావలసిన కార్య సహాయం చేయడం శూద్రధర్మం. శూద్రుడు రాజానుమతితో ధనసంపాదన చేయ వచ్చు. కాని దాన, ధర్మాలు చెయ్యడానికి రాజానుమతి లేకుండా చెయ్య వచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు యజ్ఞ యాగాదులు పరమ ధర్మం.

ఆశ్రమ ధర్మాలు

[మార్చు]

తరువాత భీష్ముడుఆశ్రమ ధర్మాలు చెప్పసాగాడు " ధర్మజా ! బ్రహ్మచర్యాశ్రమంలో బ్రహ్మచారి గురుశుశ్రూష చెయ్యడం, ఆగమ శాస్త్రములు అభ్యసించడం, బాహ్య అలంకారముల మీద ఆసక్తి విడవడం, బిక్షుక వృత్తితో జీవించడం, ఎవరి మీద ప్రేమ కానీ ద్వేషం కాని చూపక పోవడం, ఎప్పుడూ మంచి పనులు మాత్రమే చెయ్యడం బ్రహ్మచారి ఆచరించ తగిన ధర్మాలు. గృహస్థు తన భార్య మీద మాత్రమే అనురక్తుడై ఉండాలి. కరుణ, సత్యనిష్ఠ, ఓర్పు, సజ్జన సాంగత్యం, దేవకార్యములు, పితృ కార్యములు శ్రద్ధతో నిర్వహించడం, నిత్యాగ్ని హోత్రం చెయ్యడం, అతిథులను ఆదరించడం గృహస్థాశ్రమ ధర్మాలు. ఒంటరిగాకాని భార్యతోగాని అడవులకు వెళ్ళడం, మానావమానములను వదలడం, ఇంద్రియ నిగ్రహం పాటించడం, జడధారియై వేదాధ్యయనం చెయ్యడం, సజ్జనులతో గోష్టి సల్పడం వానప్రస్థాశ్రమ ధర్మం. సన్యాసి ఒక ప్రదేశంలో ఉండడు. ఆకలి వేసినప్పుడు దొరికింది తింటాడు. రాత్రి సమయం అయినప్పుడు ఎక్కడైనా నిద్రిస్తాడు. సన్యాసి అగ్నికార్యములు చేయ వలసిన అవసరంలేదు. తనకు తానుగా ఏమీ కోరక ఇచ్చినది పుచ్చుకొనుట, ఇంద్రియ నిగ్రహం పాటించుట, వినయంతో ప్రవర్తించుట సన్యాసి ఆచరించ వలసిన ధర్మాలు. ఈ నాలుగు ఆశ్రమాలు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు ఆచరించ వచ్చు. శూద్రుడు మొదటి మూడు ఆశ్రమాలను ఆచరించ వచ్చు కాని సన్యాసం స్వీకరించ రాదు. ధర్మ పరుడైన బ్రాహ్మణుడు యజ్ఞ యాగములలో దానమును స్వీకరించడానికి అర్హుడు. అటువంటి బ్రాహ్మణుడికి దానం చేసిన రాజు కీర్తిమంతుడు ఔతాడు. రాజు ప్రజల చేత ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఆచరింపజేసి సిద్ధి పొందుతాడు. సకల ధ్రర్మములు రాజధర్మానికి లోబడి ఉంటాయి. రాజు దండ నీతిని విస్మరిస్తే య్జ్ఞయాగములకు విజ్ఞం కలుగుతుంది. ప్రజలకు కీడు కలుగుతుంది. రాజు దండనీతిని అమలు పరుస్తూ ప్రజలను దయతో పాలిస్తే ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు. ధర్మాలలో కెల్లా రాజ ధర్మం గొప్పది. రాజధర్మమును ఆచరించు రాజు దైవసమానుడు.

మాంధాత

[మార్చు]

వర్ణాశ్రమ ధర్మాలు, ఆశ్రమధర్మాలు చెప్పిన భీష్ముడుధర్మరాజుతో " పూర్వం మాంధాత అనే రాజు విష్ణువును గురించి తపస్సు చేసాడు. మాంధాతకు ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యి తనకు నమస్కరించిన మాంధతతో " మాంధాతా ! నువ్వు విష్ణువును ప్రసన్నం చేసుకోవడం అంత సులభంకాదు. అందుకని నేను ప్రత్యక్షం అయ్యావు. నీ కోరిక ఏమిటో నేను నెరవేరుస్తాను " అని అన్నాడు. మాంధాత " మహేంద్రా ! నాకు ఈ సంసారం మీద విరక్తి కలిగించి బిక్షుకవృత్తి మీద ఆసక్తి కలిగించు " అని కోరాడు. అప్పుడు ఇంద్రుడు మాంధాతతో " ఓ మహారాజా ! అన్ని ధర్మములలోకి రాజధర్మం గొప్పది. రాజు కామక్రోధములు విడిచి దండనీతిని అమలు చేస్తూ రాజ్య పాలన చేయాలి. అప్పుడు రాజుకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. అలాంటి మహారాజైన నీకు భిక్షుక వృత్తి ఆచరణ యోగ్యం కాదు. ప్రజలను రక్షించడం, యుద్ధంలో మరణించడం క్షత్రియధర్మం. భిక్షుకవృత్తి రాజధర్మం కాదు. మానవులలో రాజు శ్రేష్టుడు అని వేదములు ఘోషిస్తున్నాయి. అన్నాడు. ధర్మబద్ధమైన దండనీతికి సాటి అయినది వేరే లేదని పెద్దలు చెప్పారు కదా ! కనుక ఓ మహారాజా ! నీవు కామక్రోధములు విడిచి పెట్టి దండనీతిని అమలు చేస్తూ రాజ్యం చెయ్యి. అంతే కాని భిక్షుకవృత్తి నీకు సరికాదు " అని మాంధాతతో ఇంద్రుడు చెప్పాడు. కనుక ధర్మనందనా ! అతిథులను, దీనులను, పేదవారిని దయతో చూడు. సంతోషమూ, అహంకారమూ, దుఃఖం నీ దరికి రానీక నిర్మలమనస్కుడవై ఉండు. స్వార్ధాన్ని విడిచి పెట్టి ప్రజా రక్షణకు పాటుపడు. అదే పరమ ధర్మం " అన్నాడు భీష్ముడు.

ప్రజాధర్మం

[మార్చు]

ధర్మరాజు భీష్ముడితో " భీష్మపితామహా ! రాజులు ఆచరించవలసిన ధర్మముల గురించి చెప్పారు. ప్రజలు ఏ ధర్మం ఆచరించి సుఖంగా జీవించగలరు " అని అడిగాడు. భీష్ముడు " ధర్మరాజా ! ప్రజలు తమకు ఒక రాజును నియమించుకుని ఆయనను అభిషిక్తుడిని చేసి ఆయన పాలనలో ప్రజలు సుఖంగా జీవిస్తున్నారు. అలా పాలించే రాజు లేకున్న ప్రజలు ధర్మంతప్పి ఒకరి ధనమును, భార్యను ఒకరు అపహరించుతూ, ఒకరి సొత్తును ఒకరు దోచుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ప్రజా జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించడానికి రాజు కావాలి లేకున్న ప్రజాజీవితం అస్తవ్యస్థం ఔతుంది. వ్యవసాయము, వ్యాపారం, గోరక్షణ మొదలైన వృత్తులు నాశనం ఔతాయి. ఒకానొక సమయమున రాజు లేక దొంగతనం, అక్రమప్రవర్తన, దుర్మార్గం పెచ్చుమీరి ప్రజలజీవితం కల్లోలితం అయింది. అప్పుడు సాధారణ ప్రజలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తమకు రాజును ప్రసాదించమని బ్రహ్మదేవుడిని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి 'మనువును రాజుగా నియమించాడు. మనువు అసత్యం పలికే వారికి, దుర్మార్గులకు తాను రాజుగా ఉడలేనని చెప్పాడు. అప్పుడు ప్రజలు " పశువులలో బంగారంలో సగభాగం పన్ను కింద చెల్లిస్తాము. పండించిన పంటలో పదవభాగం ఇస్తాము. వాటితో మంచి సైన్యమును సమకూర్చుకుని నీ పరాక్రమంతో దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ రాజ్యపాలన చెయ్యండి. ప్రజలంతా నీ ఆజ్ఞలకు లోబడి ప్రవర్తిస్తాము. అధర్మ వర్తనులు నీ చేత శిక్షించబడతారు. ధర్మాత్ముల పుణ్యంలో ఆరవవంతు నీకు చెందుతుంది. ఇంద్రుడు దేవతలను రక్షించినట్లు మీరు మమ్ము రక్షించండి " అని వేడుకున్నారు. కనుక ధర్మరాజా ! రాజాజ్ఞను పాలించడం ప్రజల కర్తవ్యం. ప్రజలు రాజును దైవంలా పూజించాలి రాజు ఎప్పుడైనా ధర్మం తప్పి ప్రవర్తిస్తే ప్రజలు దానిని సహించాలి. ప్రజలు ఆ విధంగా ప్రవర్తిస్తేనే శత్రువులు కూడా రాజును చూసి భయపడతారు. ప్రజలే రాజును గౌరవించనప్పుడు శత్రువులు అతడిని అలక్ష్యం చేస్తారు. కనుక ప్రజలు రాజుపట్ల భయభక్తులు చూపడం ఉచితం. రాజుకు ఉత్తమమైన సింహాసనం, వాహనములు, మంచి నివాసగృహం, రుచికరమైన ఆహారపదార్ధములు, ఆడంబరమైన వస్త్రములు, అంగరక్షకులను సమకూర్చడం అత్యవసరం. వాటిని సమకూర్చడం ప్రజలకర్తవ్యం " అని భీష్ముడు చెప్పాడు. భీష్ముడు ఇంకా " ధర్మజా! లోకంలో ధర్మములకు రాజు మూలము. రాజు లేని రాజ్యం నీరులేని సరస్సు వంటిది. రాజ్యపాలన లేకున్న సూర్యరశ్మి లేనట్లు ప్రజలు బాధను అనుభవిస్తారు. ప్రజలు రాజు లేకున్న తమతమ సంపదను ప్రశాంతంగా అనుభవించ లేరు. రాజు లేకున్న ప్రజలు భయాందోళనకు లోను ఔతారు. రాజు రక్షణలోనే ప్రజలు యజ్ఞయాగాదులు నిర్వహించగలరు. రాజు శత్రువులను జయించిన సంపదను తన్నాశ్రయించిన వారికి దానం ఇస్తాడు. రాజు చారచక్షుడిగా ప్రవర్తించినప్పుడు సూర్యుడిగా ప్రవర్తించాలి. దుర్మార్గులను శిక్షించునప్పుడు యముడిలా ప్రవర్తించాలి. అందు వలన ప్రజలు రాజును దైవంలా భావించి విరాట్, సామ్రాట్ అని పిలుస్తారు. ఇంద్రియ నిగ్రహం పాటించి రాజును సేవించిన వారిని రాజు సకల సందలతో సత్కరిస్తాడు. రాజుకు ప్రజలు శరీరం వంటి వారు. ప్రజలకు రాజు ఆత్మ వంటి వాడు. ప్రజలు రాజును పూజించాలి. రాజు ప్రజలను రక్షించాలి. పై విషయాలన్నీ బృహస్పతి వసుమనుడు అను రాజుకు చెప్పాడు. వసుమనుడు వాటిని పాలిస్తూ రాజ్య పాలన చేసాడు.

రాజ్యపాలన

[మార్చు]

అప్పుడు ధర్మరాజు " పితామహా ! రాజు జనపద పాలనము, శత్రు సంహారం ఎలా చెయ్యాలో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! రాజైన వాడు ముందు తనను తాను గెలవాలి. తరువాత శత్రువును గెలవాలి. తనను తాను గెలువని వాడు శత్రువును ఎలా గెలువగలడు ? ధర్మనందనా ! తనను తాను గెలవడము అంటే తన లోని కామ, క్రోధ, మద, మాత్సర్యములను గెలుచి జితేంద్రుడు అగుట. అరిషడ్వర్గాలను గెలిచిన రాజు శత్రువులను సహితం గెలువ గలడు. రాజు తన రాజ్యంలోని సరిహద్దులను, రాజ్యములోని జనసంచార స్థలములను, దుర్గములను, అంతఃపురములను తగిన రక్షకభటులను నియమించి రక్షించాలి. రాజు చారచక్షువుగా ప్రవర్తించాలి. రాజ్యమంతా, శత్రురాజుల వద్ద, అంతఃపురంలో చారులను నియమించి ఎప్పటికప్పుడు విషయశేకరణ చేస్తుండాలి. రాజు తాను బలహీను డైనప్పుడు ఆ విషయం శత్రురాజులు పసికట్టక ముందే మరొక బలవంతుడైన మిత్ర రాజుతో సంధి చేసుకొన వలెను. శత్రు రాజుకు కప్పం కట్టి అయినా తన రాజ్యమును రక్షించుకో వలెను. శత్రు రాజు బలహీనుడైనప్పుడు అతడు మైమరచి ఉండగా అతడి మీద దాడి చేయాలి. విషప్రయోగం చేత కాని, అగ్నిని ప్రయోగించి కాని అతడి రాజ్యాన్ని చిన్నాభిన్నం చేయాలి. అలా అని ఎవరితో తానుగా శత్రుత్వం వహించి కయ్యానికి కాలు దువ్వ కూడదు. ముందు మంచి మాటలు చెప్పి చూడాలి. తరువాత శత్రురాజులలో విభేదాలు కల్పించి లొంగదీసుకోవాలి. ఆఖరి అస్త్రంగా యుద్ధంచేయాలి. రాజు తన ప్రజలను కన్న తండ్రి వలె పాలించాలి. ప్రజల ఆదాయంలో ఆరవ వంతు మాత్రమే పన్నుగా స్వీకరించాలి. ఆదాయపు వనరులు సమృద్ధిగా లభించే ఆటవీ సంపద, గోవులూ, గనులు మొదలైన వాటిని సమర్ధులైన అధికారులను నియమించి అభివృద్ధి చేయాలి. తన రాజ్యంలో జరిగే అన్ని అభివృద్ధి పనులను రాజు ఒక కంటితో గమనిస్తూ ఉండి అభివృద్ధి సాధించాలి. రాజు తన కోటను ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉండాలి. పశువులకు గడ్డి, గుర్రములకు దాణా, ప్రజలకు కావలసిన ఆహార పదార్ధాలు, నూనెలు, నెయ్యి, ఔషధములు, యంత్రములను ఎప్పుడూ సమృద్ధిగా ఉంచుకొనవలెను. మంచి నీటికి బావులను తవ్వించ వలెను. సమర్ధులైన వారిని సైన్యములో నియమించ వలెను. శత్రువు తన మీదకు దండెత్తి రావడం పసికట్టి వారు వచ్చు త్రోవలో వారికి వారి సైన్యముకు ఆహార పదార్ధములు, నీరు దొరకకుండా జాగరూకత వహించాలి. రాజ్యములో రాజును, మంత్రులను, జన పదములను, కోశాగారమును, దుర్గమును, మిత్రరాజులను జాగ్రత్తగా చూసుకోవాలి. రాజతంత్రమును సమర్ధవంతముగా నడపాలి. ధర్మము, అర్ధము, కామము అను పురుషార్ధములను పాటించాలి. సత్వ, తమో, రజస్సు గుణాలను సమపాళ్ళలో పాటించాలి. ప్రమాదవశాత్తు అర్ధము కామము బలహీనమైనా ధర్మము తప్పరాదని అంగీరసుడు, భరద్వాజుడు చెప్పారు. రాజైన వాడు ఇంద్రియములకు వశుడు కాక వాటిని జయించాలి. కామము చేత వశుడై వాటి చేత ప్రేరేరింపబడి జూదం, స్త్రీ సంభోగం, మద్యపానం, ధనమును విచ్చల విడిగా ఖర్చు చేయడం, ఇతరులను అనవసరంగా దండించడం, క్రోధితుడై దురుసుగా మాట్లాడడం మొదలైన గుణములను విడవాలి. వేదాధ్యనము, యజ్ఞములు, యాగములు, దాన ధర్మములు చేయాలి. తనకు తనకు హాని తలపెట్టే వారు చెప్పే కుటిలమైన మాటలను నమ్మ కూడదు. నీతిమంతులైన వారితో దైవచింతన కలిగి సుపరిపాలన సాగించాలి. దేవతలను, బ్రాహ్మణులను పూజించాలి. పితృదేవతలకు తర్పణములు క్రియలు చేయాలి. అశుభమును పారద్రోలి నిత్యం శుభమైన కార్యములు చేస్తూ రాజ్యపాలన చేయాలి. అటువంటి రాజు ఈ లోములోనే కాక పరలోకములో కూడా సిద్ధి పొందగలడు " అని భీష్ముడు చెప్పాడు.

దండనీతి

[మార్చు]

తరువాత ధర్మరాజు " పితామహా ! రాజు దండనీతిని ఎలా అమలుచేయాలో తెలియచెయ్యండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! కృతయుగం నుండి రాజు దండనీతిని ధర్మమైన పద్ధతిలో అమలు చేస్తున్నాడు. రాజు దండనీతిని ధర్మబద్ధంగా ఆచరించడం వలన ధర్మనిరతి పెరుగుతుంది. మనం చేసే కర్మలు సత్ఫలితాలను ఇస్తాయి. ఋతువులు చక్కగా శుభం చేకూరుస్తాయి. ప్రజల జీవితకాలం పెరుగుతుంది. దున్నకుండానే భూమి ఫలసాయం అందిస్తుంది. తరువాత వచ్చిన త్రేతాయుగంలో ధర్మం క్షీణిస్తూ వచ్చి మూడు పాదాలతో నడుస్తుంది. ప్రజలు దానితోనే సంతృప్తి పడతారు. ఇక ద్వాపరయుగంలో రాజు ధర్మాన్ని రెండు పాదాలతో మాత్రమే నడుపుతాడు. ప్రజలు దానితో సంతృప్తి పడతారు. ఇక రాబోవు కలి యుగంలో రాజులో ధర్మాచరణ మీద శ్రద్ధ క్షీణిస్తుంది. ప్రజలలో అధర్మం పెరుగుతుంది. వర్ణాశ్రమధర్మాలు గతి తప్పుతాయి. ఇదంతా కాలగతిలో జరిగే మార్పులను అనుసరించి జరుగుతుంది కాని రాజైన వాడు రాజు ధర్మాన్ని కృతయుగంలో లాగా ఆచరించిన ధర్మంవర్ధిల్లి నాలుగు పాదములతో నడుస్తుంది. లేకున్న కాలగతిలో క్రమక్రమంగా క్షీణిస్తుంది. రాజు ప్రజలు చేసే తప్పులను జాగ్రత్తగా పశీలించాలి. ఎవరైనా తనను తాను పొగొడుతున్నాడంటే అతడికి మదము, అహంకారం, లోభము, దుర్మార్గం ఎక్కువగా ఉంటుందని తెలుసు కోవాలి. అవి లేని వాడు తనను తాను పొగుడుకొనడు. సజ్జనుడైన రాజు నియమ నిబద్ధంగా జీవిస్తాడు. అతడికి పరాక్రమం ఉంటుంది కాని గర్వం ఉండదు. అతడు పరస్త్రీని కోరడు, కోపించడు, సామంతులను ధనం కొరకు వేధించడు. రాజుకు వేదవేదాంగ పారతుడైన పురోహితుడు అవసరం. పురోహితుడు ఎప్పుడూ పురంలో ఉంటూ పురం క్షేమం కోరుతూ రాజును సక్రమ మార్గంలో నడిపించాలి. సామంత రాజుల నుండి కప్పం, కానుకలు స్వీకరించే పనిని రాజు దయ, కరుణ, చతురత కలిగిన మంత్రులకు అప్పగించాలి. రాజు పన్నుల కొరకు ప్రజలను పీడించడం ఆవు పొదుగును కోయడంతో సమానం. తోటమాలి చెట్ల నుండి పండ్లు కోసినంత సున్నితంగా రాజు ప్రజల నుండి పన్నులను వసూలు చేయాలి. ముందు ప్రజలకు అవసరమైన సౌకర్యములు, రక్షణ కల్పించిన తరువాత ప్రజల నుండి పన్నులు గ్రహించాలి. అది రాజుకు ముఖ్యమైన బాధ్యత. ఎన్ని యజ్ఞ, యాగములు దానితో సరి తూగవు.

బ్రాహ్మణ క్షత్రియులు

[మార్చు]

తిరిగి భీష్ముడు " ధర్మనందనా ! ఇలాదేవికి పురూరవుడు అనే కుమారుడు ఉన్నాడు. అతడు ఈ భూమినంతా పాలించాడు. అతడు ఒక నాడు వాయువును " భూమి బ్రాహ్మణ, క్షత్రియులలో ఎవరి సంపదగా విరాజిల్లుతుంది " అని అడిగాడు. వాయుదేవుడు " బ్రహ్మముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించారు. ఉత్కృష్టమైన ముఖం నుండి జన్మించిన బ్రాహ్మణుడు ఈ భూమి మీద ఉన్న సకలసంపదలను అనుభవించుటకు వాటిని దానం చేయుటకు అర్హుడు. దండనీతిని అమలుచేయుటకు క్షత్రియుడిని, సహజంగా శాంతి కాముకుడైన బ్రాహ్మణుడిని అతడి పురోహితుడిగా నియమించాడు. అటువంటి పురోహితుడికి సకల సంపదలను సమకూర్చి అతడి అడుగు జాడలలో రాజ్యపాలన చేయు రాజు ఈ లోకంలో పరలోకంలో సుఖసంతోషాలు పొందగలడు. ప్రజల యొక్క భయమును పోగొట్టి రక్షించడమే రాజు యొక్క పరమధర్మం " అని వాయుదేవుడు పురూరవునికి చెప్పాడు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

బ్రాహ్మణ ధర్మం

[మార్చు]

తరువాత భీష్ముడు " ధర్మనందనా ! పూర్వం శుక్రాచార్యుడు పురోహితుడికి చెప్పిన మాటలు నేను నీకు చెప్తాను. రాజు పురోహితుడి ఆధ్వర్యంతో యజ్ఞ, యాగాదులు చేసి దేవతలను, గరుడ, గంధర్వ, విద్యార్ధులను తృప్తిపరచవలెను. పురోహితుడు లేని రాజ్యాన్ని రాక్షసులు, పిశాచాలు పీడిస్తాయి. రాజుకు అను దినము కలిగే అశుభములను పురోహితుడు శాంతి హోమములతో రక్షించి శత్రు రాజులను పురోహితుడు మంత్ర తంత్రములతో నాశనం చేస్తారు. కనుక ధర్మనందనా ! నీవు ఉత్తముడైన పురోహితుడిని నియమించి రాజ్యపాలన చెయ్యి " అన్నాడు భీష్ముడు. కాని పరిశుద్ధుడు కాని పురోహితుడు రాజుకు హాని కలిగించి తానూ నాశనం ఔతాడు. కనుక రాజు బుద్ధిమంతుడు, ఆరోగ్యవంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు అయిన బ్రాహ్మణుడిని నియమించుకోవాలి. సకల కార్యములలో రాజు, పురో హితుడు ఒకే మాట మీద నిలిచి ఆ కార్యమును నిర్వర్తించాలి. ధర్మనందనా ! దీని గురించి ఒక ఇతిహాసం చెప్తాను విను. బ్రాహ్మణుడికి క్షత్రియుడికి ఉన్న సంబంధం గురించి కశ్యప ప్రజాపతి ఇలుడికి ఇలా చెప్పాడు. క్షత్రియుడు బ్రాహ్మణుడి నుండి పుట్టాడు. బ్రాహ్మణుడు క్షత్రియుడి వలన నియమించ బడతాడు. కనుక బ్రాహ్మణుడు, క్షత్రియుడు ఒకరి మీద ఒకరు ఆధార పడి జీవిస్తారు. రాజు పురోహితుడు ఒకరిని ఒకరు గౌరవించుకుంటే ప్రజలు వారిని గౌరవిస్తారు. అధర్మం ప్రజ్వరిల్లుతుంది. రాజు పురోహితుల మధ్య సఖ్యత లేకున్న రుద్రుడు ఆగ్రహిస్తాడు. రుద్రుడు ఆగ్రహిస్తే ప్రపంచం సర్వనాశనం ఔతుంది.

ముచికుందుడు

[మార్చు]

భీష్ముడు ఇంకా ఇలా చెప్పాడు " కుబేరుడు పురోహితుడు ఎలా ఉండాలన్న విషయం ముచికుందుడు తో ఇలా చెప్పాడు. పూర్వకాలంలో ముచికుందుడు అనేరాజు రాజ్య కాంక్షతో కుబేరుడి మీద దండెత్తాడు. కుబేరుడు తన సైన్యమును పంపి ముచికుందుడిని ఓడించాడు. ముచికుందునికి కోపం వచ్చి తన ఓటమికి కారణం పురోహితుడని అనుకుని అతడిని నిందించాడు. ముచికుందుడి పురోహితుడు ముచికుందుడి చేత హోమములు, పూజలు, తపస్సు చేయించి తన మంత్రశక్తితో ముచికుందుడి సైన్యాలకు బలపరాక్రమాలను చేకూర్చాడు. ముచికుందుడు తిరిగి తన సైన్యముతో కుబేరుడి మీదకు దండెత్తాడు. అప్పుడు కుబేరుడు ముచికుందుడితో " నీవు నీ పురోహితుడి మంత్రశక్తితో, తపో బలంతో నా మీద యుద్ధానికి వచ్చావు కాని నీ స్వశక్తితో రాలేదు " అని అవహేళన చేసాడు. అప్పుడు ముచికుందుడు కుబేరునితో " బ్రాహ్మణుడు, క్షత్రియుడు వేరు వేరు కాదు. ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు అని " ఆ బ్రహ్మ అనుగ్రహించాడు. మారు మాటాడక నాతో యుద్ధానికి రా " అన్నాడు. కుబేరుడు " నీతో నేను యుద్ధం చేయను. నీకు కావలసింది నా రాజ్యమే కదా ! దానిని తీసుకో " అన్నాడు. ముచికుందుడు " నీ దయాబిక్షతో వచ్చే రాజ్యం నాకు వద్దు. నిన్ను జయించి నీ రాజ్యం తీసుకుంటాను " అన్నాడు. ముచికుందుడి పరాక్రమానికి సంతోషించిన కుబేరుడు " నేను ఓడాను " అని అంగీకరించాడు. ముచికుందుడు సంతోషించి ఈ సమస్త భూమండలాన్ని అనేక సంవత్సరాలు పాలించాడు. కనుక ధర్మనందనా ! నీవు ఎల్లప్పుడూ ఈ ప్రజలకు అభయ హస్తమిచ్చి, రక్షించి ఈ భూమిని పాలించుటయే రాజధర్మం " అని భీష్ముడు చెప్పాడు.

బ్రాహ్మలను దండించే విధానం

[మార్చు]

ధర్మరాజుభీష్ముడితో " పితామహా ! బ్రాహ్మణులు మొదలైన వారు తమ తమ వృత్తి ధర్మములు కుల ధర్మములు విడిచి ప్రవర్తించిన ఏమి చేయవలెను. వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఆపదలు సంభవించిన సమయంలో ఏ కులము వారైనా తమ తమ కుల ధర్మములను విడిచి ప్రవర్తించిన వారికి ఏ పాపం అంటదు. కాని క్షత్రియుడు పట్టవలసిన కత్తి బ్రాహ్మణుడు పడితే అతడు తన బ్రాహ్మణత్వం కోల్పోయి క్షత్రియుడౌతాడు. అలాగే బ్రాహ్మణుడు తన కులధర్మం వదిలి వైశ్యధర్మమైన వ్యాపారం చేపడితే అతడు వైశ్యుడు ఔతాడు. అలాగే బ్రాహ్మణుడు ధనార్జన నిమిత్తం ఒకరికి ఊడిగం చేసిన అతడు శూద్రుడు ఔతాడు. ఇలాగే తక్కిన వారు కూడా వారి ధర్మం వీడి పరధర్మం ఆచరించిన కులహీనులు ఔతారు. అటువంటి వారు మరలా తమతమ కర్మలను ఆచరించుటకు అర్హులు కారు. రాజు ఈ విషయములు అన్ని తెలుసుకుని ఎవరూ తమ ధర్మం తప్పకుండా చూడాలి. ప్రజలు సంపాదించుకున్న పుణ్యములో కాని పాపములో కాని నాలుగవ వంతు రాజుకు చేరుతుంది. కనుక వర్ణాశ్రమ ధర్మములు తప్పి చరించిన పాపములో నాల్గవవంతు రాజుకు చేరుతుంది కనుక రాజు అనుభవించాలి " అన్నాడు.

ధర్మరాజు సందేహ నివృత్తి

[మార్చు]

ధర్మరాజు " పితామహా ! నాకు రాజ్యము చేపట్టాలని కాని రాజ్యసుఖములు అనుభవించాలని కాని లేదు. కాని నేను రాజ్య పాలన చేపట్టి ధర్మరక్షణ, ప్రజారక్షణ నిర్వర్తించగలనా ! అని సందేహం కలుగుతుంది. ఈ రాజ్యం పాప భూయిష్టం. పైగా ప్రజల మీద దండనీతి ప్రయోగించి వారి ఆగ్రహానికి గురి కావాలి. అందుకని ఈ రాజ్యభారం నాకు అక్కరలేదు. మరలా అడవులకు వెడతాను " అన్నాడు. భీష్ముడు నవ్వి " ధర్మనందనా ! క్షత్రియుడవైన నీవు వైరాగ్యం కోరుకునుట రాజధర్మం కాదు. నీ మనసు చాలాసున్నితం. ఇది క్షత్రియలక్షణం కాదు. నీకు బుద్ధిమతి చెప్పుటకు నీ తండ్రి పాండురాజు కాని నీ తాత విచిత్రవీర్యుడు కాని, నీ ముత్తాత శంతనమహారాజు లేడు కనుక నామాట విను. ఈ సందర్భంలో నీకు ఒక ఇతిహాసం చెప్తాను విను. పూర్వము కేకయరాజు వేదాధ్యనం కొరకు అడవులకు వెళ్ళాడు. అక్కడ అతడిని ఒక రాక్షసుడు పట్టుకున్నాడు. కేకయరాజుకు ఆ రాక్షసుడిని ఎదిరించే బలం లేదు. కేకయరాజు రాక్షసుడితో " ఓ దానవేంద్రా ! నా రాజ్యంలో దొంగతనం లేదు, అక్రమ సంబంధాలు లేవు. నా రాజ్యంలో బ్రాహ్మణులు వేదాధ్యయనం, యజ్ఞయాగములు నిరంతరం చేస్తుంటారు. రాజులు బ్రాహ్మణులను ఆరాధిస్తుంటారు. జనయాగాదులు చేస్తున్నారు. వైశ్యులు గోరక్షణ వ్యాపారం చేస్తూ తమ విధులు నిర్వర్తిస్తున్నారు. పై మూడు జాతులను సేవిస్తూ శూద్రులు జీవనం సాగిస్తున్నారు. ఈ రాజ్యాంలో నాలుగు వర్ణాలు తమధర్మం చక్కగా పాటిస్తున్నారు. నేను నా ప్ర్తజలు ఏం పాపం చేస్తున్నామని నన్ను ఇలా నిర్బంధిస్తున్నావు " అని నిలదీసాడు. కేకయరాజు మాటలకు ఆ రాక్షసుడు సంతోషపడి రాజును ప్రశంశించి విడిచి పెట్టాడు. కనుక ధర్మరాజా ! కేకయ రాజు లాగా రాజు ధర్మం తప్పక రాజ్యపాలన చేసిన అతడికి ఏ పాపం అంటదు " అన్నాడు.

బ్రాహ్మణ వృత్తి

[మార్చు]

ధర్మరాజు భీష్ముడిని " పితామహా ! రాజాశ్రయం దొరకని బ్రాహ్మణుడు కష్టకాలంలో ఎలా జీవించాలి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మజా ! బ్రాహ్మణుడు తన వృత్తి ధర్మంలో జీవించడం దుర్భరం అయినప్పుడు ఆపద్ధర్మంగా వైశ్య వృత్తిని స్వీకరించ వచ్చు. కాని ఎక్కువ ధనాశతో ఉప్పు, నువ్వులు, మాంసం, ఆవు, ఎద్దు, అన్నము, నెయ్యి, మద్యము, నూనెలు మొదలైన వ్యాపారాలు చేయరాదు " అని చెప్పాడు. " పితామహా ! యజ్ఞములు ఏ విధంగా ఆచరించాలి " అని ఆడిగాడు. ధర్మనందనా ! యజ్ఞములు శ్రద్ధ ముఖ్యము, మిధ్యాచారంగా యజ్ఞములు చేయకూడదు. వేదములను అపహాస్యం చేయ కూడదు. యజ్ఞ యాగాదులలో బ్రాహ్మణులకు దక్షిణలు సమర్పించి తృప్తిపరచ వలెను. యజ్ఞయాగాదుల కంటే తపస్సు అధికమైనది. తప్పస్సు వలన ప్రసన్నత, అహింస, సత్యం పలకడం, దయ కలిగి ఉండడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం అలవడుతుంది . ధర్మరాజు " పితామహా ! రాజు ఎలాంటి స్నేహితులను నమ్మాలి ? నమ్మకమైన స్నేహితులు లేని రాజు రాజ ధర్మమును నెరవేర్చ లేడు కదా ! అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! రాజు ఎవరినీ అతిగా నమ్మ కూడదు. అలాగని ఎవరినీ నమ్మకుండా నమ్మకుండా ఉండ కూడదు. నమ్మీ నమ్మనట్లు ఉండి కార్యం సాధించాలి. రాజుకు ఎల్లప్పుడూ మేలు చేసే వాడే నిజమైన స్నేహితుడు. అతడి స్నేహం వలన రాజుకు సమస్త శుభములు సమకూరుతాయి. ఎప్పుడూ అప్రమత్తుడై ఉండే మిత్రుడి వలన తలచిన కార్యం సఫలం ఔతుంది, పాపచింతన లేక సుఖదుఃఖములు సమంగా ఎంచి కృషి చేసే స్నేహితుడిని రాజు సముచితంగా గౌరవించాలి. అటువంటి మిత్రుడిని మంత్రిగా చేసుకొనిన అతడు కామ, క్రోధ, మోహ వశుడు కాక తన విద్యుక్త ధర్మములు చక్కగా నెరవేర్చ గలడు. రాజుకు అన్నదమ్ములు అవసరం ఎంతో ఉంది. వారు మంచి వారు కాకున్నా రాజు వారిని గౌరవించాలి. బంధు మిత్రులు అన్నదమ్ముల వలన రాజుకు బలం పెరుగుతుంది. అటువంటి రాజు వైపు శత్రువులు కన్నెత్తి కూడా చూడ లేరు. అంగ బలం లేని రాజును శత్రువులు చులకన చేస్తారు. బంధు మిత్రులతో, అన్నదమ్ములతో బేధాభిప్రాయాలు ఉన్నా రాజు వాటిని బయటకు చూపక గంభీరంగా ఉండి అందరితో కలిసి ఉండడం రాజుకు క్షేమకరం. కొంత మంది రాజును పైపైన పొగడుతూ లోపల అతడికి వ్యతిరేకంగా నడుచు కుంటారు. అటువంటి వారు రాజుకు ఎటువంటి హాని అయినా తలపెట్టగలరు. అటువంటి వారిని గుర్తించి రాజు వారిని నాశనం చేయుట క్షేమకరం " అన్నాడు.

రాజు ధనార్జన

[మార్చు]

ధర్మరాజు " పితామహా ! రాజు ధనార్జన ఎలా చేయాలో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! రాజుకు ధనార్జన చేయు వ్యక్తి ఎంతో అవసరం. అలాంటి వ్యక్తిని ప్రజలు సహించరు కనుక అతడిని రక్షించవలసిన బాధ్యత రాజుది.దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం చెప్తాను విను. పూర్వం కాలకవృక్షీయుడు అనే ముని ఉండే వాడు. ఆ ముని ఒక కాకిని ఒక పాంజరంలో పెట్టి అది త్రికాల వేది అని అందరికీ చెప్పే వాడు. ఆ కాకిని తీసుకుని ఆ ముని కోసల దేశాధీశుడైన క్షేమదర్శి వద్దకు వెళ్ళి " మహారాజా ! నీవు ధనార్జన పట్ల ఏమరుపాటుగా ఉన్నావు. అందు వలన నీకు ఆపద రానున్నది. ఈ కాకి నీ రాజ్యంలోని దొంగలను పట్టి ఇస్తుంది " అని చెప్పాడు. రాజు అతడిని సాదరంగా ఆదరించి తన మందిరంలో విడిది చేయించాడు. ఆ రోజు కొందరు రాజోద్యోగులు ఆ కాకిని పట్టుకుని చంపేసారు. మరునాడు కాలకవృక్షీయుడు ఆ విషయం రాజుకు చెపుతూ " రాజా నా పేరు కాలకవృక్షీయుడు. నేను నీ తండ్రికి మంచి మిత్రుడను. మీ తండ్రి గారు మరణించిన తరువాత ఈ రాజ్యంలోఉండ లేక తపసు చేయడానికి అరణ్యాలకు వెళ్ళాను. నీ తండ్రి గారి తరువాత నీవు రాజువు అయ్యావు. నీ పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి నీ రాజ్యం అంతా తిరిగాను. నీ రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పటికీ కొందరి అధముల కుయుక్తి కారణంగా నీ రాజ్యం ఆపదలో ఉందని తెలుసు కున్నాను. ఆ విషయం నీకు చెప్పడానికి వచ్చాను. నాతో తీసుకు వచ్చిన కాకి సాధారణమైనది. దానికి ఎలాంటి మహిమలు లేవు. కాని మహిమలు ఉన్నట్లు అందరిని నమ్మిఆంచాను. అది నిజం బయట పెడుతుందన్న భయంతో దానిని ఆ దుర్మార్గులు చంపారు. కనుక అంతఃపురంలోనే అన్యాయం జరుగుతుంని అర్ధం ఔతుంది. ముందు నన్ను నమ్మనట్లు నటించి నన్ను వెళ్ళగొట్టు. తరువాత ఆ దుర్మార్గులను నేర్పుగా కనిపెట్టి వారిలో వారికి విరోధములు కల్పించి వారిని శిక్షించు. ఆ రాజు అతడి మాట ప్రకారం దుర్మార్గులను శిక్షించి సుఖంగా రాజ్యపాలన చేసాడు. కనుక మిత్రుడు అలా ఉండాలి " అని చెప్పాడు.

మంత్రి

[మార్చు]

ధర్మరాజు " పితామహా ! మంత్రి ఎలా ఉండాలి ? " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మంత్రి అనే వాడు జ్ఞానవంతుడై ఉండాలి. పుర జనులకు బంధువుగా మెలిగే వాడుగా ఉండాలి. కార్యశూరుడై ఉండాలి. ధైర్యవంతుడు, శౌర్యవంతుడై ఉండాలి. కౄరత్వం లేకుండా పరిశుద్ధమైన మనసుకలవాడై ఉండాలి. రాజు పట్ల భక్తి శ్రద్ధలు, అనురాగమూ కలిగి ఉండాలి. సుఖము, దుఃఖంలను సమానంగా చూసేవాడై ఉండాలి. తన చెమటను నెత్తురుగా భావించి పని చేయాలి. ఏ సందర్భంలోనైనా రాజు తన మీద నేరం మోపి, ఆగ్రహించి తిట్టినా కోపించక రాజుతో సంబంధ బాంధవ్యాలను చెడనీయక నిజానిజాలు రాజుకు ఎరుకపరిచే ప్రయత్నం చేయాలి. తనలోని లోపములు కప్పి పుచ్చుకుంటూ ఇతరుల లోపాలను కనిపెట్టి తగురీతిన ప్రవర్తించాలి. పైలక్షణాలు కలవాడే మంత్రిగా ఉండడానికి అర్హుడు. రాజు కూడా మంత్రులను ఆదరించి మృదుమధురమైన వాక్కులతో, చిరునవ్వుతో సంతోషం కలిగించాలి. కేవలం దానధర్మం చేసినందు వలన, ప్రియంగా మాట్లాడినందువలన మాత్రమే ప్రజలకు సంతోషం కలుగదు. రాజు ఎదుటి వారి మనసెరిగి పొందికగా మాట్లాడి వారిని నొప్పించక ప్రవర్తించాలి.

పాపపరిహారం

[మార్చు]

ధర్మరాజు భీష్మునితో " పితామహా ! ప్రజలమధ్య వివాదములు పరిష్కరించే సమయంలో రాజుకు పాపం అంట కుండా ఉండే విధం చెప్పండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! రాజుకు తీర్పు చెప్పే సమయంలో స్వచ్ఛత, నిజాయితీ, నిష్పక్షపాతం ఎంతో అవసరం. ఆ తీర్పులు ధర్మబద్ధమై ఉండాలి. తీర్పులు చెప్పేసమయంలో నిత్య సత్యవ్రతులైన బ్రాహ్మణుల సహాయం తీసుకోవాలి. ఇరు పక్షముల వాదనలు శ్రద్ధగా ఓపికగా విని న్యాబద్ధమైన, ధర్మబద్ధమైన తీర్పును చెప్పాలి. ధనవంతులకు ఒక మాదిరి పేద వారికి ఒక మాదిరి తీర్పులు చెప్పకూడదు. నేరముకు తగిన శిక్షలు విధించాలి. రాజులు తీర్పులు చెప్పటంలో పక్షపాతం వహించిన ప్రజలు వివాదములు రాజు దృష్టికి తీసుకు రావాలి. ఉరి శిక్ష విధించడం, నేరస్తుల ఆస్తులు జప్తు చేయడం, కారాగారంలో బంధించడం వంటి శిక్షలు విధించే సమయంలో న్యాయబద్ధంగా వ్యవహరించాలి. ఇతర రాజుల వద్ద నుండి దూతలు వచ్చిన సమయంలో వారు తమ రాజులు పంపిన వర్తమానం ఉన్నది ఉన్నట్లు చెప్పినప్పుడు రాజు దూతమీద ఆగ్రహించ కూడదు. దూతను చంపుట మహా పాపం, నరకం సంప్రాప్తమౌతుంది. ఇక దూతకు ఉండ వలసిన లక్షణములు చెప్తాను విను. దూత ఉత్తమ కులజుడై ఉండాలి. మంచి శీలవంతుడై ఉండాలి. చెప్పదలచిన సందేశం లౌక్యంగా, నేర్పుతో కార్యం సిద్ధించేలా పొందికగా చెప్పాలి. దూతకు కార్యదక్షత సమయస్పూర్తి ఉండాలి. ఇక సైన్యాధ్యక్షుడికి కావలసిన లక్షణాలు విను. సైన్యాధ్యక్షుడికి దుర్భేద్యమైన వ్యూహములు పన్నేనేర్పు ఉండాలి. యుద్ధముకు కావలసిన యంత్రముల తయారీలో నేర్పు, ఆయుధప్రయోగంలో నేర్పు, యుద్ధంచేయుటలో నేర్పు ఉండాలి. రాజు ఎవరినీ అతిగా నమ్మ కూడదు. తన కుమారులనైనా అతిగా నమ్మితే తన సర్వస్వం కోల్పోయే ప్రమాదం ఉంది. రాజు అందరినీ నమ్మినట్లే నటించాలి కాని ఎవరినీ నమ్మ కూడదు. అదియే రాజధర్మం " అని చెప్పాడు.

రాజధాని

[మార్చు]

ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! రాజధాని ఎలా ఉండాలి? ఎలా ఉంటే బాగా ఉంటుంది ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మరాజా ! కోటచుట్టూ లోతైన కందకం ఉండాలి. విశాలమైన వీధులు, రెండు వైపులా గృహములు, దుకాణములు ఉండాలి. దుకాణాలలో సమస్త వస్తువులూ లభించాలి. రాజధానిలో సమస్త ధాన్యములు, ఆహారపదార్ధములు సమృద్ధిగా ఉండాలి. నెయ్యి, అన్ని రకాల నూనెలు, ద్రవ్యములు నిలువ ఉంచాలి. పురరక్షణకు ఆయుధాగారములు, అందు సకలవిధ ఆయుధసామాగ్రి, యంత్రములు, రణవిశారదులైన యోధులు ఉండాలి. ప్రజ్ఞావంతులైన పండితులు, విలాసినులు, పరిచారికలు, పరిజనం ఉండాలి. అలాంటి పురంలో ఉన్న ప్రజలకు వారి ఆస్తులకు, రత్నములకు, బంగారముకు, పదార్ధములకు, బంధుమిత్రులకు రక్షణ కల్పించడం రాజుబాధ్యత. రాజు తన రాజ్యంలోని ముఖ్యపట్టణాలలో విశ్వాసవంతులైన ఉన్నతోద్యోగులను, న్యాయాధికారులను మంచి జీతములు ఇచ్చి నియమించి వర్ణాశ్రమ ధర్మాలకు విఘాతం కలుగకుండా రాజ్యపాలన సాగించాలి. రాజు తన రాజ్యములో చోరభయం, దుండగులభయం, జారుల భయం లేకుండా ప్రజలను పాలించ వలెను. రాజు తన రాజ్యంలో పశుసంపదను వృద్ధి చేయాలి. వాణిజ్యం, పశుసంపద, వ్యవసాయం వృద్ధి పొందునట్లు తగిన చర్యలు తీసుకోవాలి. రాజు తన రాజ్యంలో పన్నులు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వసూలు చేయాలి. అధికంగా వసూలు చేస్తే దూడకు పాలు వదలకుండా పాలు మొత్తంగా పితికి దూడ మరణానికి కారకులైనట్లు ఔతుంది. కనుక , వ్యాపారషుల మీద, రైతుల మీద, సామంతరాజుల మీద సముచిత పన్నులు విధించి ధానాగారం నింపాలి. ధర్మనందనా ! ధనాగారం నింపడానికి రాజు ధర్మమార్గం అనుసరించాలి. కపటోపాయంతో అధికంగా రాజు ధనం సేకరించడం మంచిది కాదు. ఆ ధనమును అర్హులైన వారికి దానం చేసినప్పుడే ధనసంపాదనకు సార్ధకత లభిస్తుంది. ధర్మనందనా ! పైన చెప్పినట్లు నడుచుకుంటే ప్రజలు సుఖిస్తారు, ధనాగారం నిండుగా ఉంటుంది. యుద్ధంలో శత్రుసంహారం చెయ్యి. శాంతిగా ఉన్నప్పుడు యజ్ఞ యాగాదులు చెయ్యి.

మాంధాత

[మార్చు]

ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు మాంధాతకు ఉతధ్యుడు చెప్పిన మాటలు చెప్తాను " రాజు ధర్మరక్షణకే జన్మించాడు కనుక రోషం, క్రోధం, కామము వదిలి ధర్మనిరతుడు కావాలి. ఎందుకంటే ధర్మము వలన ప్రజలు వృద్ధి చెందుతారు. ధర్మం బ్రాహ్మణుల నుండి జనించింది కనుక రాజు బ్రాహ్మణులను గౌరవించి ఆదరించాలి. సంపదకలుగగానే అహంకారం వస్తుంది. దేవతలైనా మునీశ్వరులైనా అహంకారంతో నశిస్తారు. కనుక రాజు అహంకారి, పరస్త్రీ కాముకుడు కాకూడదు. ధర్మం తప్పిన రాజ్యంలో వర్షాలు కురవవు. వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. రాజు పరాక్రమం నశిస్తుంది. రాజును బంధుమిత్రులు వదిలి వేస్తారు. ప్రజలు దీనత్వం పొందుతారు. శత్రువులు దండెత్తుతారు. కనుక రాజు ధర్మవర్తనుడైన బంధుమిత్రులతో సుఖిస్తాడు. ప్రజలను రక్షిస్తాడు " అని చెప్పాడు " అని భీష్ముడు చెప్పాడు.

రాజు వృద్ధి చెందుట

[మార్చు]

ధర్మరాజు " పితామహా ! రాజు ధర్మమార్గంలో ఎలా వృద్ధి చెందగలడు. భీష్ముడు "ధర్మనందనా ! పూర్వం కోసలాధీశుడు వసుమనుడు అనే రాజుకు వామదేవుడు అనే ముని ఇలా చెప్పాడు " రాజుకు ధనసంపాదన కంటే ధర్మనిరతి ఎంతో ముఖ్యం. దాని వలన, శాశ్వతకీర్తి సకల సిద్ధులు లభిస్తాయి. ధనసంపాదనకు అధర్మంగా ప్రవర్తిస్తే ఆ సంపాదన నిలువదు. అంతే కాక అతడికి అపకీర్తి, నరకము ప్రాప్తిస్తాయి. రాజుకు అత్యధిక సంపాదన కావాలంటే ఇంకా ఇంకా ధర్మనిరతి కావాలి. రాజు తన సైన్యమును ఎప్పుడూ సంతృప్తి పరచాలి. శత్రువులు దండెత్తినప్పుడు అది ఎంతో సహకరిస్తుంది. రాజుకు ఎప్పుడూ పరాయి దేశముల మీదకు దండెత్తి వారి సంపదలను హరించాలన్న కోరిక ఉండకూడదు. రాజు ఇరుగు పొరుగు రాజులతో సఖ్యతగా ఉండి తన రాజ్యమును వీలైనంత శత్రురహితం చెయ్యాలి. శత్రురాజులు దండెత్తినా సాధ్యమైనంత వరకూ ఉపాయంతో పరిష్కరించాలి కాని యుద్ధానికి పాలడరాదు. తన సైన్యంలో అంతఃకలహాలు చెలరేగినప్పుడు వారితో యుద్ధముకు దిగక సంధి కొరకు ప్రయత్నించాలి. సామ, దాన, బేధ, దండోపాయాలతో ప్రయత్నించి విఫలమైన శుక్రనీతిని ప్రదర్శించాలి. అంటే ముల్లును ముల్లుతోటే తీయాలి అన్నట్లు శత్రువును ఉపేక్షించాలి " అన్నాడు.

యుద్ధనీతి

[మార్చు]

ధర్మరాజు " పితామహా ! యుద్ధ సమయంలో అనుసరించ వలసిన నీతి ఏమిటి? " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! యుద్ధంలో సమాన నీతిని శత్రువు పట్ల ప్రదర్శించాలి. శత్రువు చతురంగబలంతో వస్తే రాజు చతురంగబలంతో యుద్ధం చేయాలి. శత్రువు ఒంటరిగా వస్తే ఒంటరిగా పోరాడాలి. శత్రువు మాయోపాయాలు, కపటోపాయాలు ఉపయోగిస్తే నీవూ అదే ఉపాయాలు ప్రయోగించాలి. వెను తిరిగి పోతున్న వారిని, ప్రమాదంలో ఉన్న వారిని, కత్తి, ధనస్సు విరిగిన వారిని, గుర్రము మీద నుండి పడిన వారిని, మరొకరితో యుద్ధం చేస్తున్న వారిని, శరణుజొచ్చిన వారిని చంపరాదు. శత్రువును అధర్మ మార్గంలో చంపడం కంటే ధర్మమార్గంలో మరణించడం మేలు. రాజెప్పుడు పడక మీద చావడం కంటే యుద్ధంలోచావడమే ఉత్తమం. విషపూరిత ఆయుధమును ప్రయోగించిన వాడు నరకానికి పోతాడు. శత్రువు మీదకు దండెత్తి అతడి పట్టణం ముట్టడించి, ప్రజలను హింసించడం మహాపాపం. రాజుకు అంతటి కాఠిన్యం తగదు. బ్రాహ్మణుల ఇళ్ళను దేవాలయాలను దోచుకోకూడదు " అని చెప్పాడు.

పరిహారం

[మార్చు]

ధర్మరాజు "పితామహా ! అందుకే రాజధర్మం కంటే మహాపాపం మరొకటి లేదు కదా ! ఎలాగైనా రాజుకు అధోగతి తప్పదు కదా ! " అన్నాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీవు చెప్పినది నిజమే అయినా ఇందుకు పరిహారం ఉంది. తనను శరణుజొచ్చిన వారిని రక్షించి ఆదరించడం, యుద్ధంలో గాయపడిన వారికి చికిత్స చేయించడం. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడం, బ్రాహ్మణులను ఆదరించడం, యజ్ఞయాగాదులు చెయ్యడం వంటి కార్యములతో పరిహారం చేసుకోవచ్చు. రాజు ధర్మపాలన చేస్తే ఉత్తమ గతులుప్రాప్తిస్తాయి " అని చెప్పాడు.

వీరులకు ఉత్తమ లోక ప్రాప్తి

[మార్చు]

ధర్మరాజు " పితామహా యుద్ధంలో వీర మరణం చెందిన వారికి ఎలాంటి లోకములు ప్రాప్తిస్తాయి ? " అని అడిగాడు. భీష్ముడు అంబరీష ఇంద్రుల మధ్య ఈ విషయంలో జరిగిన సంవాదం వినిపించాడు " ధర్మనందనా ! పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి పుణ్యం సంపాదించి మరణానంతరం స్వర్గలోకం వెళ్ళాడు. స్వర్గలోకంలో తన దగ్గర పరిచారకుడు సుదేవుడు ఉజ్వలమైన విమానం ఎక్కి తిరగడం చూసి దేవేంద్రుడిని చూసి " దేవేంద్రా ! నా దగ్గర పరిచారకుడు ఎటు వంటి యజ్ఞయాగములు చెయ్యకనే ఎలా నా కంటే అధికంగా స్వర్గసుఖములు అనుభవిస్తున్నాడు " అని అడిగాడు. ఇంద్రుడు " సుదేవుడిని గురించి ఇలా చెప్పాడు " పూర్వం శృతశృంగుడు అనే రాక్షసునికి సదముడు, వదముడు, దముడు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు నీ మీద దండెత్తినప్పుడు నీవు సుదేవుడిని వారితో యుద్ధం చెయ్యడానికి పంపుతూ " వస్తే విజయంతో రా లేకుంటే ప్రాణంతో తిరిగి రాకు " అని చెప్పావు. వారి గురించి చారుల వలన తెలుసుకున్న సుదేవుడు వారి మాయోపాయములను గురించి తెలుసుకుని వారిని జయించడం సాధ్యం కాని పని అని తలచి సైన్యమును వెనుకకు పంపి శివుని స్మరించి తన తలను శివుడికి అర్పించడానికి ఉద్యుక్తుడై కత్తి పైకెత్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై " మహావీరా! నీ వంటి వాడికి ఇది తగదు. ఎందుకిలా చేస్తున్నావు " అని అడిగాడు. సుదేవుడు " శంకరా ! శత్రువు బలం ముందు నా పరాక్రమం పనికిరాదని తెలుసుకుని జననష్టం కావడం ఇష్ట పడక ఇలా చేసాను " అన్నాడు. అప్పుడు శివుడు అతడికి దివ్యరధమును, దివ్యధనస్సును, దివ్యమైన అంబుల పొదిని ఇచ్చి ఏ మాత్రం కాలు కింద పెట్టకుండా శత్రుసంహారం చెయ్యమని చెప్పాడు. సుదేవుడు ఉత్సాహంగా వెళ్ళి సదుముడు, దముడిని యుద్ధంలో సంహరించాడు. సోదరుల మరణానికి కోపోద్రేకుడైన విదముడిని ఎదుర్కోవాలని శివుడు చెప్పిన మాట మరచి రధము దిగి విదముడిని ఎదుర్కొని ఒకరిని ఒకరు కత్తితో నరిక్కుని ఇద్దరూ చని పోయారు. రాక్షససైన్యం చెదిరి పోయింది నీకు విజయం చేకూరింది. ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా వీర మరణానికి సాటి రావు " అని ఇంద్రుడు అంబరీషుడికి చెప్పాడని " భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ధర్మనందనా ! ఒక సారి జనకుడికి ప్రత్యర్ధుడికి యుద్ధం సంభవించింది. అప్పుడు జనకుడు తన సైన్యముతో " మహా వీరులారా ! మీకు వీరమరణం చెందిన వారికి ప్రాప్తించే సకల సుఖాలకు స్థానమైన స్వర్గం కావాలా ! లేక పిరికి వారికి కలిగే నరకం కావాలా !"అని అడిగాడు. జనకుని అంతర్యం తెలుసుకున్న వీరులు ప్రాణాలకు తెగించి పోరాడి జనకునికి విజయం సాధించి పెట్టారు. కనుక ధర్మనందనా ! వీరుడికి స్వర్గద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి " అని భీష్ముడు చెప్పాడు.

వనరులు

[మార్చు]