ఆది పర్వము అష్టమాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


అష్టమాశ్వాసం[మార్చు]

ద్రౌపదీ స్వయంవరం తరువాత దృపదుడు పాండవులకు ఆభరణాలను ఏనుగులను గుర్రాలను కానుకగా ఇచ్చాడు. ద్రౌపది కూడా పతివ్రతా ధర్మంతో ఐదుగురు భర్తలకు సేవచేస్తూ ఉంది. కుంతీ దేవి కూడా కోడలిని సకలైశ్వర్య వంతురాలిగా సంతాన వతిగా దీవించింది. ద్వారకా నగరంలో ఉన్న శ్రీకృష్ణుడు పాండవుల వివాహ సమయంలో అనేక కానుకలు పంపాడు. ఆ విధంగా పాండవులు ఒక సంవత్సరకాలం రాజభోగం అనుభవించారు. దుర్యోధనుడు వేగుల వలన మత్స్యయంత్రాన్ని ఛేదించింది అర్జునుడని తెలుసుకుని పాండవులు లక్క ఇంట్లో మరణించ నందుకు చింతించాడు. విదురుడు ఈ విషయం తెలిసి సంతోషించాడు. దృతరాష్టృడు మాత్రం దృపదుని కుమార్తె ద్రౌపదిని చేసుకుని పాండవులు మిత్ర లాభం పొందారని అనుకున్నాడు. ఒకరోజు విదురుడు దృతరాష్ట్రుని వద్ద లేని సమయం చూసి దుర్యోధనుడు కర్ణునితో వచ్చి " తండ్రీ ! పాండవులు బ్రతికి ఉన్నారు. విదురుడు పాండవ పక్షపాతి అని తెలిసి కూడా నీవు అతనికి విలువ ఇవ్వడం దురదృష్టకరం " అన్నాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో " నాయనా ! నేను పైకి పాండవులంటే ఇష్టమున్నట్లు ఉంటాను కానీ అది నిజం కాదు. విదురునికి అది తెలియనీయను. మనం ఒక విషయం మరువ కూడదు. పాండవులకు దైవ బలం ఉంది. మనం వారిని ఏమీ చేయ లేము " అని చెప్పాడు.

సుయోధనుడు తండ్రితో సమాలోచన[మార్చు]

దుర్యోధనుడు " తండ్రీ పాండవులు ఇప్పుడు దృపద రాజ పురంలో ఉన్నారు. వారికి పాంచాల రాజు అండగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు, వృష్టి, అంధక రాజులు తోడుగా వున్నారు. వారిని బలహీనులను చెయ్యాలంటే పాంచాలరాజు నుండి వేరు చెయ్యడం ఒక మార్గం. రెండవది కుంతీ పుత్రుల మధ్య మాద్రీ పుత్రుల మధ్య విభేధం సృష్టించడం. మూడవది అందగత్తె లైన స్త్రీలను ప్రయోగించి పాడవులు ద్రౌపది మధ్య విభేదం సృష్టించడం. నాల్గవది కుటిలో పాయంతో భీముని చంపి పాడవులను నిర్వీర్యులను చేయడం. వీటిలో ఏది మంచిదో మీరే నిర్ణయించండి " అన్నాడు. కర్ణుడు దుర్యోధనునితో " దుర్యోధనా ! సజ్జనులు సత్ప్రవర్తనులు అయిన పాండవులను దృపదుడు వదులుకోడు, ద్రౌపది కోరి పాండవులను వివాహ మాడింది కనుక విభేధం సృష్టించడం సాధ్యం కాదు. భీముని చంపడం సాధ్యమైన పని కాదు. ఇప్పటి వరకూ చేసిన అటువంటి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కనుక దృపదుని ఓడించి పాండవులను పట్టుకు వస్తాము " అన్నాడు. ధృతరాష్ట్రుడు " పెద్దలతో ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాము" అని అన్నాడు.

దృతరాష్ట్రుడు భిష్మాదులతొ సమాలోచన చేయుట[మార్చు]

మరునాడు ధృతరాష్ట్రుడు భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైన వారితో సమావేశమై విషయం వివరించాడు. భీష్ముడు దుర్యోధనునితో " సుయోధనా ! నాకు మీరు పాండు సుతులు సమానమే. పాండవులతో యుద్ధానికి నేను అంగీకరించను. పాండవులు కూడా ఈ రాజ్యానికి వారసులు కనుక వారికి అర్ధ రాజ్యం ఇచ్చి కీర్తిమంతుడివికా " అన్నాడు. ద్రోణుడు " సుయోధనా కర్ణుని మాట వినవద్దు. తాతగారి మాట పాలించు " అన్నాడు. ఈ మాటలు కర్ణునికి ఆగ్రహం కలిగించాయి " సుయోధనా ! వీరిమాటలు వినవద్దు వీరు నీ సంపదను అపహరించి నీకు తలపెడతారు " అన్నాడు. ద్రోణుడు " కర్ణా ! మేము కీడు తలపెట్టు వారమా ? నీవు మేలు తలపెట్టు వాడవా ? నీ వలననే ఈ కౌరవ కులానికి శాంతి లేకుండా పోయింది " కర్ణునితో అన్నాడు. విదురుడు కలుగ చేసుకుని వారిద్దరిని వారించి " పెద్దలైన భీష్మ ద్రోణుల మాటలను పాటించడం నీ ధర్మం. పాండవులు అజేయులు. ఇపుడు దృపద మహారాజు అండ ఉంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వంటి మిత్రుల బలం ఉన్నది. వారిని జయించడం అసాధ్యం. పురోచనునితో లక్క ఇంట్లో పెట్టి తగులబెట్టిన అపకీర్తి పోవాలంటే అర్ధ రాజ్యం ఇవ్వడం ఉచితం " అన్నాడు. గత్యంతరం లేక ధృతరాష్ట్రుడు పాండవులను తీసుకు రావడానికి విదురుని పంపాడు.

విదురుడు దృపదుడి వద్దకు వెళ్ళుట[మార్చు]

పాండవులు కౌరవుల మధ్య మధ్యవర్తిత్వం నెరుపుతున్న శ్రీకృష్ణుడు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం

విదురుడు దృపదునితో " దృపద మహారాజా ! మీతో బంధుత్వం కలసినందుకు భీష్ముడు, ద్రోణుడు, కృపా చార్యాదులు సంతోషిస్తున్నారు. పాండవులను, కుంతీదేవిని, కోడలైన ద్రౌపదిని చూడాలని దృతరాష్ట్రుడు కుతూహల పడుతున్నాడు. మీరనుమతిస్తే పాండవులను నా వెంట హస్థినకు పంపగలరు " అన్నాడు. దృపదుడు విదురునితో " విదురా ! నీవు, భీష్ముడు, ద్రోణుడు, శ్రీకృష్ణుడు పాండవుల శ్రేయస్సును కోరుతుంటారు. మీరి ఏది చేసినా అది వారికి క్షేమమే " అన్నాడు. శ్రీకృష్ణుడు " మనం ఆలోచించనవసరం లేదు. విదురుడు సదా పాండవుల క్షేమం కోరుతుంటాడు. పాండవులు కోరుకున్నది సిద్ధిస్థుంది " అన్నాడు. ధర్మరాజు చేతులు జోడించి " భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మాకు పెద్దలు శ్రీకృష్ణుడు మా శ్రేయోభిలాషి వారి మాట మాకు శిరోధార్యం " అని అన్నాడు. దృపదుని అనుమతి తీసుకుని తల్లీ కుంతీ దేవి, భార్య ద్రౌపది, సోదరులతో సహా విదురుని వెంట హస్థినకు పయనమైయ్యాడు. దుష్టద్యుమ్నుడు శ్రీకృష్ణుడు అంతులేని సైన్యంతో వారి వెంట వచ్చారు. వికర్ణుడు, చిత్రసేనుడు, ద్రోణుడు, కృపా చార్యుడు ఎదురేగి పాండవులకు స్వాగతం పలికారు. హస్థినాపుర ప్రజలు పాండవులకు ఉన్న దైవ బలం వారిని ఆపదలనుండి రక్షించిందని ఇక ధర్మరాజు మనల్ని పరిపాలిస్తాడని సంతోషించారు. పాండవులు అంతఃపురంలో ప్రవేశించి భీష్మునికి, దృతరాష్ట్రునికి, గాంధారికి నమస్కరించారు. ఇలా ఆనందంగా అయిదు సంవత్సరాలు గడిచాయి.

అర్ధరాజ్యాభిషేకం[మార్చు]

ద్రౌపది సమేత పాండవులు

ఒక రోజు భీష్మ, ద్రోణ, విదుర, దుర్యోదనాదులు సమావేశమై ఉండగా శ్రీకృష్ణుని సమక్షంలో ధృతరాష్ట్రుడు పాండవులతో " ధర్మరాజా పెద్దల ఎదుట శ్రీ కృష్ణుని సాక్షిగా మీకు అర్ధ రాజ్యం ఇస్తున్నాను. మీ తండ్రి ఐశ్వర్యం మీకిస్తున్నాను స్వీకరించండి. ఖాడవప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని మీ రాజ్యాన్ని పాలించుకోండి " అని చెప్పి ధర్మరాజుని అర్ధ రాజ్యాభిషిక్తుని చేసాడు. భీష్ముడు, ద్రోణుడు ఇందుకు అంగీకరించారు. పాండవులు తల్లిని, భార్యని, తమ్ములను తీసుకుని ఖాండవప్రస్థానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుడిని పిలిపించి పాండవులకు రాజధాని నిర్మించి ఇవ్వమని చెప్పాడు. ఇంద్రుడు దేవశిల్పి విష్వకర్మ సహాయంతో విలాస వంతమైన నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. పాండవులు శ్రీకృష్ణుడు, వ్యాసుని అనుమతితో నగర ప్రవేశం చేసారు. ధర్మరాజు పట్టాభిషేకం చేసి శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. ధర్మరాజు జనరంజకంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు.

నారద మహహర్షి రాక - సుందుడు ఉపసుందుల వృత్తాంతం[మార్చు]

దస్త్రం:Narada came to see Pandavas.jpg
దేవర్షి నారదుడిని పూజిస్తున్న పాండవులు

ఒక రోజు ఇంద్ర ప్రస్థానానికి నారదమహర్షి వచ్చాడు. ధర్మరాజు ఆయనను సాదరంగా ఆహ్వానించి " మహర్షీ ! మాపూర్వ జన్మ సుకృతంగా మీ దర్శనభాగ్యం లభించింది " అన్నాడు. నారదుడు పాండవులను ఏకాంతానికి పిలిచి " మీకు అన్ని ధర్మాలు తెలుసు. మీకు తెలియని ధర్మం లేదు. ద్రౌపది మీ ఐదుగురి భార్య. ఇది లోక విరుద్ధం, శాస్త్ర విరుద్ధం. కనుక ఈమె వలన మీలో మీకు విరోధం రాకూడదు. స్త్రీ వలన విరోధం రావడం సహజం. సుందోప సుందులనే రాక్షసులకు ఒక స్త్రీ వలన వివాదం వచ్చి వారిలో వారు కొట్టుకుని మృతి చెందారు. నికుంభుడు అనే రాక్షసునికి సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిరువురు బ్రహ్మను గురించి గోరమైన తపమాచరించారు. బ్రహ్మ దేవుని వద్ద వారు కామ గమనం, కామ రూపం, మరణమే రాకుడదని వరాలు కోరారు. బ్రహ్మదేవుడు మిగిలిన వరాలు ఇచ్చి మరణమే రాకుండా వరమివ్వడం మాత్రం సాధ్యం కాదని చెప్పాడు. అప్పుడు వారు వేరే వారి చేతిలో చావు రాకూడదని అడిగారు. బ్రహ్మదేవుడు అందుకు సరేనని అంగీకరించాడు.

దస్త్రం:Story of Sunda Upasunda.jpg
సుంద ఉపసుందుల వృత్తాంతము

వర బలంతో వారు తాపసికులను, రాజులను వేధించ సాగారు. వారంతా బ్రహ్మదేవునికి మొర పెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి వేరే వారి చేతిలో మరణం లేదు కానీ ఒకరి చేతిలో ఒకరు మరణించ వచ్చు కదా అనుకుని విశ్వకర్మని పిలిచి లోకోత్తర సుందరిని సృష్టించమని అడిగాడు. విశకర్మ అంగీకరించి తిలోత్తమ అనే సుందరిని సృష్టించాడు. తిలోత్తమ బ్రహ్మదేవునితో తనను సృష్టించిన కారణమేమిటి? అని అడిగింది. బ్రహ్మదేవుడు ఆమెతో సుందోపసుందుల వృత్తాంతం చెప్పి వారిరువురికి ఒకరిలో ఒకరు కలహించుకుని మరణించేలా చేయమని చెప్పాడు. తిలోత్తమ అలాగేనని బ్రహ్మదేవునికి భక్తితో ప్రదక్షిణ చేసింది. బ్రహ్మదేవుడు ఆమె అందానికి ముగ్ధుడై నలుపక్కల ముఖం తిప్పటంతో అతడు అప్పటి నుండి చతుర్ముఖుడైనాడు. తిలోత్తమ అందానికి దేవేంద్రునికి రెండు కళ్ళు చాలక వళ్ళంతా కళ్ళు పెట్టుకుని చూడటంతో అప్పటి నుండి అతడు సహస్రాక్షుడైనాడు. తిలోత్తమ సుందోపసుందుల కంట పడగానే వారు కామ మోహితులై తిలోత్తమ నాది నాది అని చెరి ఒక చేయి పట్టుకుని లాగుతూ నీకు ఎవరు కావాలి అని అడిగారు. తిలోత్తమ వారితో మీలో ఎవరు బలవంతులో వారిని ప్రేమిస్తాను అని చెప్పింది. విచక్షణ కోల్పోయి వారిద్దరూ పరస్పంరం యుద్ధం చేసికొని ఇద్దరూ మరణించారు. కనుక ఎంతటి బలవంతులకూ, ధైర్యవంతులకూ స్త్రీ కారణంగా విరోధం రావచ్చు" అన్నాడు. నారదుని మాటలోని అంతరార్ధం పాండవులు గ్రహించారు.

అర్జునుని తీర్ధయాత్ర[మార్చు]

అంతఃపురాన్ని దర్శించిన యువరాజు -రాజ్మానామా నుండి ఒక దృశ్యం

నారదుడు మాటలో అంతరార్ధం గ్రహించిన పాండవులు ద్రౌపది విషయంలో ఒక నియమం ఏర్పచుకున్నారు. ద్రౌపది ఒక్కొకరి ఇంట్లో ఒక సంవత్సరం ఉండాలని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంవత్సర కాలం మిగిలిన వారు ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదని పొరపాటున అలా చేస్తే పన్నెండు నెలల తీర్ధ యాత్ర చేయాలని ఒప్పందం చేసుకున్నారు. నారదుని ఎదుట ఒప్పంద చేసుకున్నట్లు నడచుకుంటామని పాండవులు ప్రతిజ్ఞ చేసారు. ప్రతిజ్ఞ చేసినట్లు నడుచు కోసాగారు. ఒక రోజు ఒక బ్రాహ్మణుని ఆవును కొందరు దొంగిలించారు. ఆ బ్రాహ్మణుడు అర్జునిని వద్దకు వచ్చి దొంగలను శిక్షించి గోవును తెచ్చి ఇవ్వమని అడిగాడు. ఆయుధగారంలో ఉన్న తన ధనస్సు తీసుకోవాలంటే అక్కడ ధర్మరాజు ద్రౌపదితో ఆయుధగారంలో ఉన్నాడు. అక్కడకు వెళితే నియమ భంగం ఔతుంది కానీ బ్రాహ్మణుని బాధను నివారించడం తన ధర్మమని భావించి ఆయుధగారానికి వెళ్ళి ధనస్సు తెచ్చి దొంగలను చంపి గోవును తెచ్చి ఇచ్చాడు. నియమభంగం జరిగినందుకు అర్జునుడు తీర్ధయాత్ర చేయాలని నిశ్చయించికున్నాడు. ధర్మరాజు మాత్రం వచ్చింది సత్కార్యం నిమిత్తం కనుక నియమ భంగం జరుగలేదని చెప్పాడు. అర్జునుడు " అన్నయ్యా !ఏదో సాకుతో ధర్మం తప్పడం భావ్యం కాదు కనుక తీర్ధయాత్ర చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి.

అర్జునుడి తీర్ధయాత్ర[మార్చు]

అర్జునుని చూసిన ఉలూచి

బ్రాహ్మణులతో పౌరాణికులతో అర్జునుడు తీర్ధయాత్రకు బయలుదేరి ముందుగా గంగా తీరం చేరాడు. ఒకరోజు ఉలూచి అనే నాగకన్య అర్జునుని చూసి మోహించింది. అర్జునుడు తాను బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నానని అన్నగారి ఆదేశంతో తీర్ధయాత్ర చేస్తున్న నన్ను ఇలా కోరడం భావ్యం కాదని వారించాడు. ఉలూచి అర్జునినితో " మీ గురించి అంతా నాకు తెలుసు. ఇందు వలన వ్రత భంగం కాదు. నా కోరిక తీర్చకుంటే ఆత్మహత్య చేసుకుంటాను. అలా జరిగితే ఎన్ని దానధర్మాలు చేసినా ఆ పాపం పోదు " అన్నది చేసేది లేక అర్జునుడు ఆమె కోరిక తీర్చాడు. ఉలూచి గర్భవతి అయి ఐరావణుడు అనే కుమారుని కన్నది. తతవాత అర్జునుడు గయ, గంగా సాగర సంగమం మొదలైన క్షేత్రాలు సందర్శిస్తూ మణిపురం నగరానికి వెళ్ళాడు. ఆ దేశపురాజు చిత్రాంగదుడు. చిత్రాంగదుని కుమార్తె చిత్రాంగదను అర్జునుడు ప్రేమించాడు. చిత్రాంగదుడు అర్జునినితో " అర్జునా నా కుమార్తెను నీకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. కానీ మా వంశస్తులకు ఒక వారసుడు మాత్రం జనిస్తాడు. నాకు మాత్రం కుమార్తె జనించింది కనుక రాజ్యానికి వారసుడు లేడు. చిత్రాంగదకు పుట్టబోయే కుమారుడు నాకు వారసుడుగా కావాలి. అందుకు అంగీకరిస్తే ఈ వివాహానికి అంగీకరిస్తాను " అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి చిత్రంగదను వివాహం చేసుకున్నాడు. వారికి బబ్రువాహనుడు పుట్టాడు. అర్జునుడు అక్కడి నుండి ద్వారకకు బయలుదేరాడు.

సుభద్రార్జునుల వివాహం[మార్చు]

దస్త్రం:Arjuna meets Krishna at Prabhasakshetra.jpg
ప్రభాస క్షెత్రంలో అర్జునుడిని కలసిన కృష్ణుడు

అర్జునుడు ద్వారకు పోతూనే సుభద్ర గుర్తుకు వచ్చింది. ఆ లోకోత్తర సుందరి అని విన్నాడు. శ్రీ కృష్ణుని దయ ఉంటే సుభద్రను వివాహం చేసుకోవచ్చు అని అర్జునుడు అనుకున్నాడు. యాదవులకు సన్యాసులంటే ప్రీతి కనుక సన్యాసి వేషంలో ద్వారకకు వెళ్ళాడు. ద్వారకను సమీపించగానే శ్రీ కృష్ణునిని భక్తితో తలచుకున్నాడు. శ్రీ కృష్ణుడు అర్జునుని ఆగమనాన్ని తెలుసుకుని అర్జునిని వద్దకు వచ్చాడు. అర్జునిని మాటలలో అతనికి సుభద్ర మీద మనసున్నదని గ్రహించాడు. అర్జునిని ద్వారకకు తీసుకు వచ్చి రైవతకాద్రి గుహలో ఉంచాడు. ద్వారకకు వెళ్ళి యాదవులకు రైవతకోత్సవం చేయాలని ఆదేశించాడు. అందరూ రైవతకాద్రికి బయలు దేరారు. శ్రీ కృష్ణుడు భార్యలతోనూ సుభద్రతోనూ యాదవ ప్రముఖులైన అకృరుడు, ఉద్దవుడు, సాత్యకి, ఉగ్రసేనుడు మొదలైన వారు బయలుదేరారు. సుభద్రకు కూడా అర్జునిని మీద మనసు ఉంది. అర్జునుడు ఎలా ఉంటాడో సుభద్రకు తెలియదు. రైవతకాద్రికి ప్రదక్షిణం చేసే సమయంలో అర్జునుడు సుభద్రను చూసాడు. శ్రీకృష్ణుడు అర్జునినితో " అర్జునా ! నీకు నా చెల్లెలు సుభద్ర మీద మనసుందని తెలుసు. దేవకీ వసుదేవులకు చెప్పి నీ కోరిక సఫలం చేస్తాను. బలరాముడు అర్జునిని నిజమైన

కృష్ణార్జునులు ఉన్న రథాన్ని నడుపుతున్న సుభద్ర

సన్యాసి అనుకుని నమస్కరించి అతని చాతుర్మాస వ్రతం పూత్రి అయ్యేవరకు ద్వారకలో ఉండమని చెప్పాడు. అర్జునుడు అంగీకరించాడు. బలరాముడు సుభద్రను అర్జునినికి సేవలు చేయడానికి నియమించాడు. శ్రీ కృష్ణుడు అర్జునుడు క్షేమంగా ఉన్నాడని ఇంద్ర ప్రస్థానికి సమాచారం పంపాడు. ఒక రోజు సుభద్ర అర్జునిని గురించి చెప్పమని అడిగింది. అర్జునుడు ఇక దాచి ప్రయోజనం లేదని అసలు విషయం చెప్పాడు. అర్జునుడు గాంధర్వ వివాహం చేసుకుంటానని అన్నాడు. సుభద్ర తన వాళ్ళకు ఈ వివాహం ఇష్టం కనుక వాళ్ళే ఈ వివాహం చేస్తారని చెప్పింది. శ్రీ కృష్ణుడు దేవకీ వసుదేవులను వివాహానికి ఒప్పించాడు. బలరాముని కొంత మంది యాదవులను అంతర ద్వీపానికి పంపించి తాను కూడా వారితో వెళ్ళి నట్లు వెళ్ళి వెనుకకు వచ్చాడు. శ్రీ కృష్ణుడు దేవేంద్రుని పిలిపించి అందరి సమక్షంలో సుభద్ర, అర్జునుల వివాహం వైభవంగా జరిపించాడు.

సుభద్రార్జునులు హస్థినకు వెళ్ళుట[మార్చు]

సుభద్రను తీసుకుని రథం మీద ప్రస్థానికి వెళ్ళమని చెప్పాడు. దేవేంద్రుడు కుమారునికి అనేక కానుకలు ఇచ్చాడు. శ్రీ కృష్ణుడు ఏమీ తెలియనట్లు అంతర ద్వీపానికి వెళ్ళాడు. సుభద్రా అర్జునుల వివాహ విషయం తెలియని ద్వార పాలకులు వారిని అడ్డగించారు. అర్జునుడు వారందరిని ఓడించాడు. యాదవులు బలరామునికి ఈ విషయం చెప్పారు. యాదవులు ఉద్రేకపడి అర్జునినితో యుద్ధం చేసి సుభద్రను తీసుకు వస్తామని అన్నారు. బలరాముడు శ్రీ కృష్ణునితో నీకు నిజంగా ఈ విషయం తెలియదా అన్నాడు. శ్రీ కృష్ణుడు తన మేన మరదలిని వివాహం చేసుకున్నాడు.

దస్త్రం:Subhdra in the service of Kunti and Draupadi.jpg
కుంతి ద్రౌపదిలను సేవించుచున్న సుభద్ర

ఇందులో దోషం లేదు. అర్జునిని జయించడం దుస్సాధ్యమని మీకు తెలియనిదా అన్నాడు. బలరాముడు ఏమీ చేయలేక ఊరకున్నాడు. ఇంద్ర ప్రస్థానం వెళ్ళిన అర్జునుడు సుభద్రతో మనం ఇలా వెళితే ద్రౌపది పౌరుషంగా మాట్లాడ వచ్చు కనుక నీవు ముందుగా వెళ్ళి నీ అత్త గారు కుంతినీ ద్రౌపదిని చూసి వారి అనుగ్రహం సంపాదించు. తరువాత అర్జునుడు నగర ప్రవేశం చేసి పెద్దల దీవెనలు పొందాడు. బలరాముడు సుభద్ర, అర్జునలకు అనేక కానుకలు పంపాడు. సుభద్రకు అభిమన్యుడు జన్మించాడు. ద్రౌపదికి పాండవుల వలన ప్రతి వింధ్య్డుడు, శ్రుత సోముడు, శ్రుత కీర్తి, శతా నీకుడు, శ్రుత సేనుడు అను ఐదుగురు ఉప పాండవులు జన్మించారు. వారంతా ధౌమ్యుని వద్ద వేద వేదాంగాలు అర్జునిని వద్ద అస్త్ర, శస్థారాలు నేర్చుకున్నారు.

కృష్ణార్జునులు ఖాండవ వనముకు వెళ్ళుట[మార్చు]

ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణునితో " బావా ! ఇక్కడ ఎండలు అధికంగా ఉన్నాయి. మనం వన ప్రాంతాలకు వెళ్ళి కొన్ని రోజులు గడిపి వద్దామా " అడిగాడు. శ్రీకృష్ణుడు అంగీకరించడంతో అందరూ వన ప్రాంతాలకు వెళ్ళారు. వారిద్దరూ విహరిస్తున్న సమయంలో అగ్ని దేవుడు బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చాడు. కృష్ణార్జునులు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించిన పిమ్మట అతడు " అయ్యా ! బాగా ఆకలి వేస్తుంది. తమరు భోజనం పెట్టగలరా ? " అడిగాడు. అందుకు వారు " విప్రోత్తమా !మీకు ఏది ఇష్టమో చెప్పండి పెడతాము " అన్నారు. అగ్ని దేవుడు నిజస్వరూపం చూపి " కృష్ణార్జునులారా ! నేను అగ్ని దేవుడిని. నేను ఖాండవ వనాన్ని దహించాలి. అందుకు ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు. ఇంద్రుడు మిత్రుడు ఆ వనంలో ఉండటమే అందుకు కారణం. ఇంద్రుడు చేసే ఆటంకం తొలగిస్తే నేను ఖాండవ వనాన్ని నిరాటంకంగా భుజిస్తాను " అని అన్నాడు. అర్జునుడు అగ్ని దేవునితో " అయ్యా నీకు ఖాండవ వనాన్ని దహించాలన్న కోరిక ఎందుకు కలిగింది" అని అడిగాడు.

శ్వేతకి యజ్ఞము[మార్చు]

అందుకు అగ్ని దేవుడు అర్జునునితో " శ్వేతకి అనే రాజర్షి 100 సంవత్సరాల కాలం సత్ర యాగం చేయ సంకల్పించాడు. అంత దీర్గ కాలం జరపడానికి ఏ ఋత్విక్కు ఒప్పుకోలేదు. శ్వేతకి ఈశ్వరుని కొరకు ఘోరంగా తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. దేవా నేను నూరు సంవత్సరాల కాలం చేయ సంకల్పించిన సత్ర యాగానికి నువ్వు ఋత్విక్కుగా ఉండాలి " అని కోరుకున్నాడు. అందుకు ఈశ్వరుడు " శ్వేతకీ! యజ్ఞాలు చేయవలసిన బాధ్యత బ్రాహ్మణులది. అందుకని నీకు దుర్వాసుని యాజ్ఞికునిగా నియమిస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు ఎడతెగని నేతి ధారతో యజ్ఞం చేసి అగ్ని దేవుని తృప్తిపరచుము " అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. ఆ ప్రకారం శ్వేతకి చేత నూరు సంవత్సరాలు నిరాఘాటముగా జరిగిన సత్ర యాగంలో త్రాగిన నెయ్యి నాకు అజీర్ణ వ్యాధిని ఇచ్చింది. ఖాండవ వనంలో ఉన్న ఔషధులను దహిస్తే కానీ ఈ వ్యాధి తగ్గదు అని బ్రహ్మ దేవుడు చెప్పాడు. అందుకని ఖాండవ వనాన్ని దహించాలని అనుకుంటున్నాను " అన్నాడు. అర్జునుడూ " అగ్నిదేవా ! నీకు నెను సహాయము చెయ్యాలంటే మాకు ఆయుధాలు కావాలి కదా ! నా వద్ద ప్రస్తుతము ఆయుధాలు లేవు " అనాడు. అగ్ని దేవుడు " అర్జునా ! నికు ఆ చి౦త వలదు . నీకు కావలసిన ఆయుధాలు నేను సమకూరుస్తాను " అని వెంటనే అగ్నిదేవుడు వరుణుని స్మరించగానే వారి ముందు వరుణ దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. అగ్నిదేవుడు " వరుణదేవా ! నీకు బ్రహ్మ దేవుడు ఇచ్చిన ధనస్సు, అమ్ముల పొది, రథం అర్జునినికి ఇచ్చి, చక్రాన్ని, గదని శ్రీ కృష్ణునికి ఇవ్వు" అన్నాడు. వరుణుడు గాండీవమనే ధనస్సును, అక్షయ తుణీరాన్ని, కపిద్వజంతో కూడిన రధాన్ని అర్జునునకు ఇచ్చాడు. అలాగే సుదర్శనం అనే చక్రాయుధాన్ని, కౌమోదకి అనే గధను శ్రీ కృష్ణునికి ఇచ్చాడు. ఆ అయుధాల సహాయంతో రక్షించమని చెప్పి వారి వద్ద అభయం తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో ఖాండవ వన్నాన్ని దహించడం మొదలు పెట్టాడు.

ఖాండవ వన దహనము[మార్చు]

దస్త్రం:Krishnarjunas fight with Gods.jpg
ఖాండవవన రక్షణకు వచ్చిన దేవతలతో పోరాడుతున్న కృష్ణార్జునులు

కృష్ణార్జునులు ఇరువైపులా రక్షణకు నిలబడ్డారు. అడ్డగించిన వన రక్షకులను సంహరించారు. వనంలోని జంతువులు, పక్షులు, పాముల అగ్నిజ్వాలలో పడి మరణించసాగాయి. దేవతల ద్వారా ఇది తెలుసుకున్న ఇంద్రుడు మేఘాలను పిలిచి ఖాడవ వనంపై కుంభవృష్టి కురిపించమని ఆజ్ఞాపించాడు. ఇంద్రుడు కురిపించే కుంభవృష్టి ఖాడవ వనం మీద పడకుండా బాణాలతో ఒక కప్పు నిర్మించాడు. అగ్ని జ్వాలల నుండి రక్షించుకోవడానికి తక్షకుని కుమారుడైన ఆశ్వసేనుడు తల్లి తోక పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు. ఇది చూసిన అర్జునుడు తన బాణాలతో అశ్వసేనుని కొట్టాడు. అది చూసిన ఇంద్రుడు అర్జునునిపై మోహినీ మాయను ప్రయోగించి అశ్వసేనుని అతని తల్లిని కాపాడాడు. ఇంద్రుడికి అర్జునునికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. కుమారుని పరాక్రమానికి ఇంద్రునికి సంతోషం కలిగినా తక్షకుని రక్షించడానికి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఆకాశవాణి " దేవేంద్రా! వీరు నరనారాయణులు వీరిని జయించడం నీకు సాధ్యం కాదు. తక్షకుడు తప్పించుకుని కురుక్షేత్రం వెళ్ళాడు" అని పలికింది. అది విని ఇంద్రుడు తన సేనలతో దేవలోకానికి వెళ్ళాడు.

ఖాండవ వనము నుండి తప్పించుకున్న వారు[మార్చు]

దస్త్రం:Krishna orders Mayasura to build a palace for the Pandavas.jpg
పాండవులకు సభను నిర్మించమని మయుడిని అడుగుతున్న శ్రీకృష్ణుడు

నముచి అనే రాక్షసుని తమ్ముడు గయుడు అర్జునిని శరణుజొచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇలా మయుడు, అశ్వపాలుడు, అతని తల్లి, నలుగురు శార్జకులు ప్రాణాలతో తప్పించుకున్నారు. కథ వింటున్న జనమేజయుడు " మహాత్మా ! మంద పాలుడు ఎవరు. వారు ఎలా తప్పించుకున్నారు " అని అడిగాడు. పూర్వం మంద పాలుడనే మహా ముని బ్రహ్మచర్యం అవలంబించాడు. మరణానంతరం కుమారులు లేని కారణంగా పుణ్యలోకాలకు వెళ్ళలేక పోయాడు. ఆ కారణంగా త్వరగా సంతానం పొందడానికి పక్షిగా జన్మించి జరితతో చేరి నలుగురు కుమారులను పొందాడు. వారంతా ఖాండవ వనంలో ఉన్నాడు. అగ్ని దేవుడు ఖాండవ వనాన్ని దహించే ముందు మంద పాలుడు తన

దస్త్రం:Indra and Gods give boons to Arjuna and Krishna.jpg
కృష్ణార్జునులకు వరములిస్తున్న ఇంద్రాదిదేవతలు

కుమారులను రక్షించమని అగ్నిదేవుడిని ప్రార్ధించాడు. అందుకు అగ్ని దేవుడు అంగీకరించాడు. మంద పాలుడు తన కుమారుల దగ్గర ఉన్నాడు. కుమారులను కలుగులో దాక్కోమని చెప్పాడు. వారు " తండ్రీ ! కలుగులో దాక్కుంటే ఎలుకలు తింటాయి. ఇక్కడ ఉంటే పవిత్రమైన అగ్నికి ఆహుతి కావడం మంచిది కదా " మంద పాలుడు అందుకు అంగీకరించాడు. జరిత పైకి ఎగిరి పోయింది. శార్జకులు వేద పఠనం చేస్తూ రక్షించమని ప్రార్థించాయి. అది విన్న అగ్ని దేవుడు వారు మంద పాలుని కుమారులుగా గుర్తించి ఆ చెట్టుని వదలి వేసాడు. కుమారులు సురక్షితంగా ఉన్నారని తెలుసుకుని మంద పాలుడు పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు. అగ్ని దేవుడు నిర్విఘ్నంగా ఖాండవ వనాన్ని దహించి తన రోగం పోగొట్టుకున్నాడు. కృష్ణార్జునులను దీవించాడు. దేవేంద్రుడు కుమారుని పరాక్రమానికి మెచ్చి అర్జునునికి వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం ఇచ్చాడు. కృష్ణార్జునులు మయుని వెంట పెట్టుకుని ఇంద్ర ప్రస్థానికి వెళ్ళి ధర్మరాజాదులకు జరిగినది చెప్పి మయుని పరిచయం చేసాడు.

బయటి లింకులు[మార్చు]