Jump to content

కృపాచార్యుడు

వికీపీడియా నుండి
కృపాచార్యుడు శిఖండి మధ్య పోరాటం

కృపాచార్యుడు శతానంద మహర్షి మనుమడు. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు గురువు. మహాభారత యుద్ధమందు కౌరవుల తరపున యుద్ధం చేసాడు. యుద్ధం ముగిసిన తరువాత బ్రతికిఉన్న వారిలో ఇతడు ఒకడు. సప్త చిరంజీవులలో ఒకడు. యుద్ధం తరువాత అర్జునుడి మనుమడైన పరీక్షిత్తుకు ఆచార్యునిగా నియమింపబడ్డాడు.

జననం

[మార్చు]

గౌతమ మహర్షి కుమారుడైన శతానంద మహర్షికి సత్య ధృతి అనే కుమారుడున్నాడు. సత్య ధృతి జన్మించడమే విల్లంబులతో జన్మించాడు కనుక శరధ్వంతుడు అనే పేరుతో పిలువబడసాగాడు.. ధనుర్విద్య ఇతనికి పుట్టుక తోనే ప్రాప్తించింది. ఇతనికి చిన్నతనం నుంచే వేదాల మీద కన్నా అస్త్ర విద్యలపైన ఎక్కువగా ఆసక్తిని కనబరచసాగాడు. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడైనాడు. దీన్ని గమనిస్తున్న దేవతలు, ముఖ్యంగా ఇంద్రుడు కలవరపడసాగాడు. ఇంద్రుడు అద్భుత సౌందర్య రాశియైన జలపది అనే దేవకన్యను ఆయన బ్రహ్మచర్యాన్ని ఆటంకపరచేందుకు నియమించాడు. ఆమె శరధ్వంతుడి వద్దకు వచ్చి వివిధ రకాలుగా ఆకర్షించడానికి ప్రయత్నించింది. మహా సౌందర్యవతి అయిన ఆమెను చూచినదే సత్యధృతి చేతిలోని విల్లమ్ములు జారి క్రిందపడ్డాయి. అది గ్రహించి తన కామోద్రేకమును నిగ్రహించుకొనెను. కాని, అతనికి తెలియకుండకుండా రేతః పతనమై అది రెల్లుగడ్డిలో పడెను. అది రెండు భాగములై అందులోనుంచి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించారు. కొంతకాలమునకు శంతన మహారాజు వేటాడుచు అక్కడికి వచ్చి వారిని చూచి తన బిడ్డలుగా పెంచుకొన్నాడు. వారికి జాతక కర్మాది సంస్కారములు గావించి తనచే కృపతో పెంచబడ్డారు కావున వారికి కృపుడు, కృపి అని నామకరణము చేయించాడు. ఈ సంగతి గ్రహించిన సత్యధృతి శంతనునితో తన సంగతి చెప్పి కృపునకు చతుర్విధ ధనుర్వేదములును నానా విధ శాస్త్రములను నేర్పాడు. అతడే విలువిద్యయందు పరమాచార్యుడై భీష్ముని ప్రార్ధనమున కౌరవ పాండవులకు గురువు అయ్యాడు.