రాళ్ళబండి కవితాప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాళ్లబండి కవితాప్రసాద్
Rallabandi-Kavita-Prasad-Photo.jpg
రాళ్లబండి కవితాప్రసాద్
జననంవేంకటేశ్వర ప్రసాదరాజు
1961, మే 21
కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం, నెమలి గ్రామం
మరణం2015, మార్చి 15
హైదరాబాద్
ప్రసిద్ధిఅవధాని, కవి
మతంహిందూ
సంతకంRkpsign.jpg

రాళ్ళబండి కవితాప్రసాద్ (మే 21, 1961 - మార్చి 15, 2015) ప్రముఖ తెలుగు అవధాని, కవి.

జీవిత విశేషాలు[మార్చు]

కవితాప్రసాద్ కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం, నెమలి గ్రామంలో 1961, మే 21వ తేదీన జన్మించాడు. ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వేంకటేశ్వర ప్రసాదరాజు. కవిత్వం పట్ల మోజుతో తన పేరును కవితాప్రసాద్‌గా మార్చుకున్నాడు. ఈయన తండ్రి కోటేశ్వర రాజు గారు తెలుగు పండితులు. తల్లి పేరు రత్నవర్ధనమ్మ. సత్తుపల్లిలో గణితశాస్త్రం ఐచ్చిక అంశంగా పట్టభద్రుడయ్యాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అవధానవిద్యపై మసన చెన్నప్ప పర్యవేక్షణలో పి.హెచ్.డి. చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతడు గ్రూప్-1 అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖలో సేవలను అందించాడు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖకు రెండు పర్యాయాలు సంచాలకుడుగా పనిచేశాడు. ఇతని పర్యవేక్షణలో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగాయి. ఇతడు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. మంత్రి కడియం శ్రీహరి వద్ద పీయస్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇతడు 2015 మార్చి 15న హైదరాబాదులోని బంజారా హిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో హృద్రోగంతో మరణించాడు.

సాహిత్య సేవ[మార్చు]

ఇతడు 500కు పైగా అవధానాలను చేశాడు. వాటిలో అష్టావధానాలతో పాటుగా శతావధానాలు, ద్విశతావధానాలు ఉన్నాయి. సంప్రదాయ అవధానంతో పాటు కథ, వచనకవిత, గణితం వంటి అనేక ప్రక్రియలను అవధానంలో చొప్పించాడు. ఒకసారి 25 నిమిషాలలో విచిత్ర అష్టావధానం చేసి పండితుల మెప్పు పొందాడు. వరంగల్లోని భద్రకాళి దేవాలయంలో ఏకదిన శతకరచన ధార అనే కార్యక్రమాన్ని చేపట్టి ఒకే రోజులో ఆశువుగా శతకాన్ని చెప్పాడు. ఆశుకవితా ఝరి పేరుతో గంటకు 500 పద్యాలు ఆశువుగా చెప్పాడు.

రచనలు[మార్చు]

  1. అగ్నిహంస
  2. ఒంటరి పూలబుట్ట
  3. దోసిట్లో భూమండలం
  4. కాదంబిని
  5. సప్తగిరిధామ శతకం
  6. పద్యమండపం
  7. ఇది కవిసమయం
  8. అవధానవిద్య ఆరంభ వికాసాలు

అవధానాలలో పూరణలు[మార్చు]

ఇతడు చేసిన అవధానాలలో కొన్ని పూరణలు మచ్చుకు -

1. సమస్య: గీతను నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!

పూరణ:

జాతికి దారిచూపి, దృఢసత్త్వము నిచ్చి, మనస్సు నందునన్
భీతిని పారద్రోలి పలువేదనలన్ పరిమార్చు గీత,దు
ర్నీతులబద్ధమిద్దియని నిందలతో పరిహాసమాడినన్
గీతను, నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!

2. సమస్య: కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!

పూరణ:

భీతమృగాక్షి యొక్కతె వివేచన కోల్పడె చర్మబాధచే,
నాతికి పెండ్లికాదని, వినాశనమౌనని నేస్తులెంచుచున్
జాతకముల్ గుణింపగ, భిషక్కుని సాయము పొంది మందొ, మా
కో, తిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!

3. సమస్య: గురువుకు పంగనామములు గుట్టుగ పెట్టనివాడు శిష్యుడే!

పూరణ:

గురువుల చిత్రమొక్కటి అకుంఠిత రీతిని వ్రాసి దానిలో
మరచెను పంగనామములు, మానితమైన ప్రదర్శనంబునం
దరసినవారు దోషము తామయి చూపకముందె, తానుగా
గురువుకు పంగనామములు గుట్టుగ పెట్టనివాడు శిష్యుడే!

మూలాలు[మార్చు]