Jump to content

ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 16°11′N 80°21′E / 16.183°N 80.350°E / 16.183; 80.350
వికీపీడియా నుండి
ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)
పటం
ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా) is located in ఆంధ్రప్రదేశ్
ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)
ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)
అక్షాంశ రేఖాంశాలు: 16°11′N 80°21′E / 16.183°N 80.350°E / 16.183; 80.350
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలంప్రత్తిపాడు
విస్తీర్ణం22.55 కి.మీ2 (8.71 చ. మై)
జనాభా
 (2011)[1]
14,305
 • జనసాంద్రత630/కి.మీ2 (1,600/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు7,103
 • స్త్రీలు7,202
 • లింగ నిష్పత్తి1,014
 • నివాసాలు3,841
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522019
2011 జనగణన కోడ్590326

ప్రత్తిపాడు, గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన గుంటూరు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3841 ఇళ్లతో, 14305 జనాభాతో 2255 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7103, ఆడవారి సంఖ్య 7202. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3089 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 513. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590326.[2]

సమీప గ్రామాలు

[మార్చు]

జనాభా గణాంకాలు

[మార్చు]
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 13279, పురుషుల సంఖ్య 6741, మహిళలు 6538, నివాస గృహాలు 3276, విస్తీర్ణం 2255 హెక్టారులు

గ్రామ చరిత్ర

[మార్చు]

19వ శతాబ్దిలోనే ఆంగ్ల విద్యాలయాలు నెలకొన్న గ్రామాలలో ఇది ఒకటి. ప్రత్తిపాడులో పెన్సిల్వేనియా సీనెడ్ సొసైటీకి చెందిన రెవ. సి. ఎఫ్. హయర్ పాఠశాల నెలకొల్పాడు. ఇది గుంటూరు జిల్లాలోకెల్లా మొదటి ఆంగ్లేయ పాఠశాలల్లో ఒకటి.[3]

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

పూర్వం ఈ గ్రామాన్ని "భక్తులవాడ"గా పిలిచేవారని చరిత్ర కథనం. అనంతరం అది "భక్తిపాడు"గా మారిందని, ప్రత్తి పంట బాగా పండేది కనుక తొలుత "ప్రత్తిపాడు"గా మారిందని శాసనాలు చెపుతున్నాయి

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది. పాఠశాలల జాబితా

  • భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
  • బి.సి.బాలుర వసతి గృహం.
  • బి.సి.బాలికల వసతి గృహం.
  • ఇండియన్ ఉన్నత పాఠశాల.
  • అక్షయ విద్యాలయం.
  • శ్రీనివాస స్కూల్.
  • నిర్మల కాన్వెంట్.
  • సరోజిని విద్యాలయం.

సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల గుంటూరులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ గుంటూరులో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రత్తిపాడులో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో8 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

  • ఈ గ్రామంలో మూడు వడపోత బావులున్నవి.
  • త్రాగునీటి బావి:- ప్రత్తిపాడు గ్రామములోని జెట్టిమిట్ల బజారులో శిథిలమైన నేల బావిని, దాత శ్రీ బృందావనం జనార్ధనాచర్యులు, తన తల్లిదండ్రులు రమణమ్మ, శ్రీ శ్రీనివాస వెంకటాచార్యుల ఙాపకార్ధం, ఒక లక్ష రూపాయల వ్యయంతో పునర్నిర్మించారు. వృధా నీటి వలన కోతకు గురికాకుండా చుట్టూ ఏడడుగుల ఎత్తయిన గోడ నిర్మించారు.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ప్రత్తిపాడులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

బ్యాంకులు

[మార్చు]
  1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:- గ్రామములో ఈ బ్యాంక్ శాఖను 1982,సెప్టెంబరు-27వ తేదీనాడు ప్రారంభించారు. [15]
  2. ఆంధ్రా బ్యాంకు
  3. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు.
  4. జీడిసీసీ బ్యాంకు.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 22 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ప్రత్తిపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 35 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 1 హెక్టార్లు
  • బంజరు భూమి: 472 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1744 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2207 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 10 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ప్రత్తిపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 8 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ప్రత్తిపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

ప్రత్తి, మిరప, వరి

మౌలిక సదుపాయాలు

[మార్చు]

వైద్య సదుపాయం

[మార్చు]
  • సామాజిక ఆరోగ్య కేంద్రం:- ఈ ఆసుపత్రిలో 30 పడకలుగలవు. 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇది రిఫరల్ ఆసుపత్రి.
  • సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రం (ఐ.సి.డి.ఎస్):- సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రం (ఐ.సి.డి.ఎస్):- 20012 లో కొత్తగా ఏర్పడిన ఈ కేంద్రం పరిధిలో, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కొరకు, ప్రత్తిపాడు ఎస్.టి.కాలనీలో, ఒక నూతన భవన నిర్మాణానికై, 2015, సెప్టెంబరు-17వ తేదీనాడు, భూమిపూజ నిర్వహించెదరు. ఈ భవన నిర్మాణం పూర్తి అయినచో, ప్రత్తిపాడు, పెదనందిపాదు, వట్టిచెరుకూరు మండలాలలోని 135 మంది అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలకు సమావేశాలు నిర్వహంచడానికీ, సరకులు నిలువ ఉంచడానికీ సౌకర్యాగ ఉంటుంది.
  • ప్రభుత్వ హోమియో వైద్యశాల:- ఈ వైద్యశాలకు ప్రతిరోజూ, ప్రత్తిపాడు మండలంనుండియే గాక, పెదనందిపాదు, వట్టిచెరుకూరు, గుంటూరు, పరుచూరు, ఇంకొల్లు మందలాలనుండి 100 మందికి పైగా రోగులు వస్తుంటారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  • ఈ గ్రామ పంచాయతీ 1953లో ఏర్పడింది. 1955లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన తొలి ఎన్నికలలో అప్పటి బి.వి.రెడ్డి పాఠశాల భవనాల నిర్మాణ కమిటీ ఛైర్మనుగా ఉన్న గుజ్జుల చెన్నారెడ్డిని సర్పంచిగా ఎన్నుకోవడానికి నాటి మునసబు గింజుపల్లి బాపయ్య చౌదరి గ్రామస్తులను ఒప్పించి, ఈయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన సర్పంచి కాగానే పంచాయతీ కార్యాలయానికి స్వంత భవనం నిర్మించి అద్దె గృహం నుండి స్వంతభవనం లోనికి మార్చారు. గ్రామానికి విద్యుద్దీకరణ, అంతర్గత రహదారులను ఏర్పరచారు. నాడు చెన్నారెడ్డి చేతులమీదుగా రూపుదిద్దుకున్న పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం వివిధ దేశాలలో ఉన్నత స్థాయిలో స్థిరపడినారు. నేటికీ 700 మంది విద్యార్థులతో ఈ పాఠశాల కళకళలాడుతున్నది. ఆయన సేవలను గ్రామస్థులు ఇప్పటికీ స్మరించుకుంటున్నారు.
  • 1966లో ఈ గ్రామ సర్పంచిగా ఎన్నికయిన శ్రీ బోలే పరమేశ్వరుడు యాదవ్, గ్రామపంచాయితీ భవనానికి 48 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇవ్వటమేగాక, భవననిర్మాణానికి కృషిచేశారు. ప్రస్తుతం ఈ భవనంలో, పంచాయతీ పాలనావ్యవహారాలతోపాటు, రైతులు, పొదుపు మహిళలూ సదస్సులు ఇక్కడే నిర్వహించుకొనుచున్నారు. తూర్పుపాలెం వెళ్ళేటందుకు కాలువకట్టపై రహదారి నిర్మాణం, రామవాగుపై లోతట్టు చప్టా ఏర్పాటుకు, కృషి చేశారు.
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కారసాల శశిరేఖ సర్పంచిగా ఎన్నికైనారు. తరువాత వీరు ప్రత్తిపాడు మండల సర్పంచులసంఘం సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి నుదురుపాటి సుశీల ఎన్నికైనారు.
  • రావిపాటివారిపాలెం గ్రామం, తూర్పుపాలెం (మాదిగ పల్లె) గ్రామాలు ప్రత్తిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామాలు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

[మార్చు]

శ్రీ గంగాపార్వతీ సమేత దండేశ్వర స్వామి ఆలయం

[మార్చు]

ఈ ఆలయం అతి పురాతనమైనది. దీనిని చోళరాజుల కాలంలో నిర్మించారు. పూర్వం ఈ ప్రాంతం అరణ్యంగా ఉన్న సమయంలో గౌతమ మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు చెపుతారు. ఈ ఆలయంలో భక్తులు, ఉదయం నుండి రాత్రి వరకు, నిరంతరం పూజలు చేస్తూనే ఉంటారు. సోమవారాలలో రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది.

పూర్వం ఈ ఆలయాన్ని, "గండేశ్వరస్వామివారి ఆలయం" అని పిలిచేవారు. ఎవరికైనా ఆపద వస్తే, ఇక్కడకు వచ్చి స్వామివారిని తలచుకుంటే పోతుందని, "గండాలు" తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే వివిధప్రాంతాలనుండి భక్తులు ఇక్కడకు పెద్దసంఖ్యలో తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుంటారు.

నాడు భక్తులవాడగా

[మార్చు]

పురాతనకాలంలో ఈ ఆలయం దండకారణ్యంలో భాగంగా ఉండేది. గౌతమ మహర్షి ఇక్కడ ఘోరతపస్సు చేసి, శివదర్శనం పొంది శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ సమయంలోనే విదర్భరాజకుమార్తె సీమంతిని భర్తను, నాగకుమారులు బంధించి నాగలోకానికి తీసికొని వెళ్ళినారు. భర్తను వెతుకుతూ ఆ రాజకుమారి, గౌతమ మహర్షి ఆశ్రమం వద్ద ఉన్న శివాలయానికి చేరుకున్నది. తన భర్తను రక్షించి ఇంటికి చేర్చమని పరమశివుని ప్రార్థించింది. శివుడు ఆమెను మన్నించి, ఆమె భర్తను తిరిగి స్వస్థలానికి చేర్చి, "గండం" నుండి రక్షించాడు. దీనితో స్వామివారు, "గండేశ్వరస్వామి"గా ప్రసిద్ధి పొందినారు. ఇదే సమయంలో ఈ గ్రామాన్ని, "భక్తులవాడ"గా పిలిచేవారని చరిత్ర కథనం. నందిస్తంభం వద్ద సీమంతిని తల్లిదండ్రులు, సీమంతిని దంపతులు, వారి బంధువుల విగ్రహాలు నేటికీ కనిపిస్తుంటవి.

పుట్టను త్రవ్వి ప్రతిష్ఠించిన శివలింగం

[మార్చు]

పురాధీశుడైన పరిశ్ఛేది కుసుమరాజు చోళదేశంపై దండయాత్రచేసి తిరిగి వెళుతూ ఒక రాత్రి ఇక్కడ విడిది చేసిసినాడు. స్వామివారు ఆరోజు రాత్రి కుసుమరాజుకు కలలో కనిపించి, దగ్గరలోని చెట్టుక్రింద ఉన్న పుట్టలో తాను ఉన్నట్లు ఆనవాలు తెలిపినారు. తెల్లవారుఝామున కుసుమరాజు, తన మంత్రి, సామంత, సైనికులతో ఆ పుట్టను త్రవ్వించాడు. ఆ పుట్టలో శివలింగం కనిపించడంతో, సా.శ. 1144 వ సంవత్సరంలో, ఇక్కడ దేవాలయాన్ని కట్టించినాడని చారిత్రిక ఆధారాలు తెలియజేయుచున్నవి.

దేవాదాయశాఖ పరిధిలోనికి

[మార్చు]

కొండవీటి సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల ఆధీనంలో ఉన్నప్పుడు, ప్రత్తిపాడు మండలాధిపతి గింజుపల్లి అచ్చినాయుడు ఈ ఆలయ దక్షిణ ముఖ మండపాన్ని నిర్మించాడు. అనంతరం శ్రీకృష్ణదేవరాయల సోదరుడు సదాశివరాయలు పాలనలో 1476 లో పార్వతీదేవి అమ్మవారి విగ్రహన్ని ప్రతిష్ఠించారు. ఆంగ్లేయుల పాలనలో ఈ ఆలయం చిలకలూరిపాడు (నేటి చిలకలూరిపేట) జమీందారులైన వెంకటకృష్ణును అధీనంలోనికి వచ్చింది. వారి పాలనలో "శ్రీ మహా గండేశ్వరస్వామి ఆలయం"గా పిలుచుచూ సకల ఉత్సవాలు జరిపించేవారు. అనంతరం దేవాదాయశాఖ పరిధిలోనికి వచ్చింది. నేడు "శ్రీ గంగా పార్వతీ సమేత దండేశ్వరస్వామి"గా పిలువబడుచూ స్వామివారు పూజలందుకొనుచున్నారు.

నిత్యపూజలు

[మార్చు]

ఈ ఆలయంలో ప్రతిదినం నిత్య పూజలు నిర్వహిస్తుంటారు. ప్రతి సోమవారం భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి, దోషాల నివారణకు ప్రత్యేకపూజలు చేయించుకుంటారు. దసరా నవరాత్రులు, కార్తీక మాసంలో సోమవారం, కార్తీక పౌర్ణమితోపాటు నెల పొడవునా అభిషేకాలు నిర్వహించెదరు. శివరాత్రికి కళ్యాణం, ముక్కోటి ఏకాదశికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు.

శ్రీ సీతా రామ లక్ష్మణ ఆంజనేయస్వామి వార్ల ఆలయం

[మార్చు]

ప్రత్తిపాడు గ్రామంలో, శ్రీ పరమేశ్వర స్వామి ఆలయ సమీపంలో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2014,జూన్-20న నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో భాగంగా, 16వ తేదీన, వేదస్వస్థితో గ్రామ ప్రదక్షిణ, ఆలయ యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ తదితర పూజలు నిర్వహించారు. 19వ తేదీతో మండప దేవతా పూజలు, నీరాజన మహిమంత్రపుష్పాలతో ముగింపుకు చేరుకొనును. 20వ తేదీన యంత్రస్థాపన, విగ్రహాల ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ, దిష్టికుంభం, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు.

శ్రీ వేణుగోపాల సీతారామస్వామివారి ఆలయం

[మార్చు]

విశిష్టత గల ఈ పురాతన ఆలయాన్ని, అప్పటి ప్రభుత్వంలో జమీందారుగా ఉన్న, చిలకలూరిపేటకు చెందిన శ్రీ కొరుగంటి వెంకటరెడ్డి, 1364లో, గ్రామం మధ్యలో నిర్మించారు. అప్పటి రోజులలో వీరు గ్రామంలోని దండేశ్వరస్వామివారికి సకల ఉత్సవాలు నిర్వహించేవారు. మొదట స్వామివారి ప్రక్కన రుక్మిణీదేవి ఉండి, శ్రీ గోపీనాథస్వామిగా పూజలందుకునేవారు. అనంతరం శ్రీనివాస వెంకటాచార్యులవారు సత్యభామ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో, శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామిగా పేరు వచ్చింది. 1760 లో శ్రీ వెంకటకృష్ణమ్మ ఈ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠించారు. 1925 ఏప్రిల్-5 నుండి, ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో ఈ ఆలయ కార్యకలాపాలు నడచుచున్నవి. ఈ అలయంలో స్వామివారి విగ్రహం ఉత్తర ముఖంగా ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారదర్శనానికి ప్రత్యేకత ఉంది.

ప్రత్తిపాడులోని తూర్పుబజారులో ఉన్న ఈ ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయశిఖరం, విగ్రహాల ప్రతిష్ఠ, 2014, జూన్-21, శనివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం మంటపారాధనలకు నిత్యపూజ, గర్తన్యాసము, బీజన్యాసము, రత్నన్యాసము, ధాతున్యాసము, యంత్రప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, సంపాతాజ్యపాతము, కళాన్యాసము, కళాహోమము, పూర్ణాహుతి, ధేనుదర్శనము, కుంభము మొదలగు పూజాకార్యక్రమాలు దంపతులచే నిర్వహించారు. పరిసర గ్రామాలనుండి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి, ఈ ఉత్సవాన్ని తిలకించి, స్వామివార్లను దర్శించుకొని, తీర్ధప్రసాదాలను స్వీకరించారు. అనంతరం భక్తులుకు అన్నదానం నిర్వహించారు.ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2015,జూన్-9వ తేదీ మంగళవారంనుండి, 11వ తేదీ గురువారం వరకు, స్వామివారి బ్రహ్మోత్సవాలు, వైభవంగా నిర్వహించారు. మూడవరోజు గురువారం మద్యాహ్నం, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ ఉత్సవాలకు, పత్తిపాడు గ్రామం నుండియేగాక, భక్తులు సమీప గ్రామాలనుండి గూడా అధికసంఖ్యలో తరలివచ్చారు.

శ్రీ పోతురాజుస్వామివారి ఆలయం

[మార్చు]

గ్రామంలోని మిట్టబజారులోని ఈ ఆలయంలో "కళాపకర్ష" కార్యక్రమాన్ని, 2014,జూన్-14, శనివారం నాడు నిర్వహించారు. ఈ ఆలయ పునర్నిర్మానానికి తీర్మానించడమైనది. ఈ నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. గోపూజ నుండి కదిలించిన పోతురాజుస్వామి విగ్రహాన్ని పునర్నిర్మించేవరకు, అంకమ్మతల్లి ఆలయంలో ఉంచటానికి ఏర్పాటుచేసారు.

శ్రీ గంగమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవం సందర్భంగా, 2015,మే-29వ తేదీ శుక్రవారంనాడు, ఆలయంలో ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పెద్ద యెత్తున బిందెలతో జలం తీసికొనివచ్చి, అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పొంగళ్ళు వండి, మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి పలు గ్రామాలనుండి భక్తులు పెద్దయెత్తున తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసారు. అనంతరం నిర్వహించిన కోలాటప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది.

శ్రీ అద్దంకమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ప్రత్తిపాడు గ్రామంలో, రెడ్ల రామాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2016,మార్చి-1వ తేదీ మంగళవారంనాడు అద్దంకమ్మ తల్లి విగ్రహాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. 3వ తేదీ గురువారంనాడు ఉదయం 7 గంటలకు అద్దంకమ్మ, గోపయ్యస్వామివారల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితుల ఆధ్వర్యంలో, హోమాలు, మంటపారాధన, మహా కుంభం, పూర్ణాహుతి, కంకణ విసర్జన తదితర పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం 2017,మార్చి-3వతేదీ శుక్రవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్చీకరించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో భజన కార్యక్రమం జరిగింది.

నిదానంపాటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ప్రత్తిపాడులోని రాంనగర్ కాలనీలో వేంచేసియున్న ఈ అమ్మవారి ఆలయంలో, వార్షిక తిరునాళ్ళు, 2017,ఏప్రిల్-9వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించినా రు. ఈ సందర్భంగా 8వతేదీ శనివారం రాత్రి, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. ఐ., ప్రసాదరావు. సహాయ నిరాకరణోద్యమంలో గుంటూరు జిల్లా పాత్ర. pp. 10, 11.