మాచర్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాచర్ల పార్కు రోడ్డు

మాచర్ల, గుంటూరుకు 110 కి.మీ. దూరంలోను, నాగార్జునసాగర్‌కు 25 కి.మీ. దూరంలో ఉన్న ఒక పట్టణం.ఈ పట్టణం హైదరాబాదు నుండి 160 కి.మీ. దూరంలో ఉంది. వివిధ ప్రాంతాల నుండి మాచర్లను కలుపుతూ రోడ్డు మార్గాలు, రైలు మార్గం (గుంటూరు-మాచర్ల రైలు మార్గం) ఉన్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులే కాక, ప్రైవేటు బస్సులు కూడా నడుస్తూ ఉన్నాయి.ఈ పట్టణంలో హైహవ రాజుల కాలంలో నిర్మించిన చెన్నకేశవస్వామి దేవాలయం ఉంది.పురాతన కాలములో దీనిని మహాదేవిచర్ల అని పిలిచేవారు.[1] ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో ఇక్కడికి దూరప్రాంతాాల నుండి యాత్రికులూ, భక్తులూ వస్తుంటారు. ఈ దేవాలయం 12-13 వ శతాబ్దాలలో నిర్మించబడింది. ఈ దేవాలయము ఎదురుగా ఓ పెద్ద ధ్వజస్తంభం చెక్కతో చేయబడి ఇత్తడితో కప్పబడినదై వెలుగొందుతుంది. గుడికి ఎదురుగా నాలుగు స్తంభాల మంటపాలు ఉన్నాయి.

చరిత్రలో మాచర్ల[మార్చు]

సా.శ. 1182 లో పలనాటి యుద్ధంగా పేరొందిన దాయాదుల పోరు మాచర్ల, గురజాల పట్టణాల మధ్య జరిగింది. ఈ యుద్ధం పల్నాటి హైహయ వంశంతో పాటు తీరాంధ్రలోని రాజవంశాలన్నింటినీ బలహీనపరచి కాకతీయ సామ్రాజ్య విస్తరణకు మార్గం సుగమం చేసింది. హైహయరాజుల కాలంలో ఈ ప్రాంతంలో గొప్పచెరువు వుండేదని, దానిమధ్యలో మహాదేవి ఆలయం వుండడం వలన ఈ ప్రాంతానికి మహాదేవిచర్ల అనే పేరు వాడుకలో మాచర్లగా రూపాంతరం చెందిందని చరిత్రకారుల కథనం. తరువాతికాలంలో బ్రహ్మనాయుడు మలిదేవరాజుకి పల్నాటిరాజ్యంలో కొంతభాగమిప్పించి, గురజాలనుండి విడిపోయి మాచర్ల రాజధానిగా పాలింపజేశాడు.

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

విద్యారంగం[మార్చు]

మాచర్ల, చుట్టు పక్కల గల గ్రామాలకు చెప్పుకోదగ్గ విద్యాకేంద్రం. ప్రాథమికి విద్య నుండి ఇంజనీరింగ్ విద్య వరకూ చదువుకునే సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి ముఖ్యమైన విద్యా సంస్థలు:

 1. శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ కళాశాల (డిగ్రీ కళాశాల)
 2. శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ కళాశాల (జూ. కళాశాల)
 3. ఆర్. సి. యం. ఎలిమెంటరీ పాఠశాల
 4. సెయింట్ ఫ్రాన్సిస్ బాలుర ఉన్నత పాఠశాల
 5. సెయింట్ ఆన్స్ బాలికల ఉన్నత పాఠశాల
 6. జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 2015,డిసెంబరు-28వ తేదీ నుండి, శుద్ధజలం అందించుచున్నారు. మాచర్ల తెలుగుదేశం బాధ్యులు శ్రీ చిరుమామిళ్ళ మధుబాబు, ఈ పథకానికి కావలసిన పరికరాలను వితరణగా అందించారు.
 7. జిల్లా పరిషత్తు ఉన్నత (బాలికల) పాఠశాల (హెచ్.ఎమ్) నాగమణి
 8. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల మాచర్ల పట్టణంలోని సాగర్ రహదారిలోని క్వారీ దగ్గర ఉంది.
 9. న్యూటన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ.
 10. శ్రీ త్యాగరాజ గాత్ర సంగీత శిక్షణాలయం:- ఈ సంగీత కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు శిక్షణ పొంది, అనేక పోటీలలో పాల్గొని బహుమతులు పొందినారు. ఈ కళాశాల 10వ వార్షికోత్సవం 2014,మే-25 ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు.
 11. కస్తూర్బా పాఠశాల.
 12. కిడ్స్ పాఠశాల.

పట్టణం లోని మౌలిక వసతులు[మార్చు]

 • శ్రీ వాసవీ వృద్ధాశ్రమం.
 • స్వామి వివేకానంద అనాథ శరణాలయం.

వ్యయసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

దేవళ్ళమ్మ చెరువు:- పట్టణంలోని 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చెరువు, 58 ఎకరాలలో విస్తరించియున్నది. 1950 వరకు ఈ చెరువు కేవలం మంచినీటి చెరువుగానే ఉపయోగపడినది సాగర్ కుడి కాలువలు నిర్మాణం జరుగక ముందు, ఈ చెరువు పల్నాడులోనే ఒక పెద్ద త్రాగునీటి చెరువుగా గుర్తింపు పొందినది. సాగర్ కాలువ వచ్చిన తరువాత నిరాదరణకు గురై, ప్రస్తుతం ఆక్రమణల పాలై, క్రమేణ కుంచించుకు పోతున్నది. [9]

పట్టణం లోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయం[మార్చు]

స్థానిక రోప్ లైన్ కాలనీలో ఉన్న ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2015,ఆగస్టు-14వ తేదీ శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శనివారం ఉదయం నుండియే భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు.

వీరభద్రేశ్వరాలయం

శ్రీ వీరభధ్రస్వామి ఆలయం[మార్చు]

ఈ ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయం, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ప్రక్కన ఉంది. ఈ దేవాలయం గోడలమీద పురాతన కాలంలో చెక్కిన శిల్పసంపద దాగి ఉంది. [7]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం, స్వామివారి బ్రహ్మొత్సవాలు, వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి రోజూ స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో స్వామివారు ప్రతి రోజూ ఒక్కో అవతారంలో దర్శనమిస్తారు. [3]

శ్రీ రామప్ప దేవాలయం[మార్చు]

ఈ ఆలయంలో 2016,అక్టోబరు-16, ఆదివారంనాడు నూతనంగా నిర్మించిన శివపార్వతుల విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. [11]

శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామివారి ఆలయం[మార్చు]

మాచర్లలో చెన్నకేశవ స్వామి వారి ఆలయము

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, చైత్రమాసంలో స్వామివారి బ్రహ్మొత్సవాలు 15 రోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి రోజూ స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. [4]

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

మాచర్ల పట్టణంలోని నెహ్రూనగరులో వేంచేసియున్న ఈ అలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను, 2015,మే నెల-23వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండియే ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భగా స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. [6]

ఓటిగుళ్ళు[మార్చు]

పలనాడులో బ్రహ్మనాయుడు, మలిదేవుల పాలనకు పూర్వం, జైనులు ఈ ప్రాంతంలో ఓటిగూళ్లను కట్టించారు. మూలవిరాట్‌ లేకుండా దేవాలయం మాత్రమే ఉండే వాటిని ఓటిగుళ్లుగా పిలుస్తారు. ప్రస్తుతం మాచర్ల ఆదిత్యేశ్వర ఆలయంలో శిథిలమైన గుడిని ఓటిగుడిగా ప్రముఖ రచయిత గుర్రం చెన్నారెడ్డి తన పలనాటి చరిత్ర పుస్తకంలో రాశారు. దేవళమ్మ చెరువు సమీపంలోని కట్టడం కూడా ఓటిగుడిగా ఆయన పేర్కొన్నారు.

శ్రీ ఆదిలక్ష్మమ్మ అమ్మవారి అలయం[మార్చు]

మాచర్ల పట్టణంలోని చంద్రవంక వాగు ఒడ్డున నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు, 2015,మే నెల-4వ తేదీ సోమవారం నుండి ప్రారంభమైనవి. సోమ, మంగళవారాలలో వేదపండితులు ప్రత్యేకపూజలు, యాగాలు నిర్వహించి, ఆరవ తేదీ బుధవారంనాడు, అమ్మవారి విగ్రహావిష్కరణ వైభవంగా నిర్వహించారు. [4]

శ్రీ ముత్యాలమ్మతల్లి అలయం[మార్చు]

మాచర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశ్వస్వామివారి ఆలయ సమీపంలో నెలకొనియున్న ఈ ఆలయంలో, ఆలయ పునరుద్ధరణ, కలశ స్థాపన వేడుకలు, 2017,జూన్-4వతేదీ ఆదివారం ఉదయం 8-59 కి ప్రత్యేకపూజా కార్యక్రమాల మధ్య, వైభవంగా నిర్వహించారు. [13]

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు మూడురోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజున శ్రీ సువర్చలా సమేత శ్రీ వీరాంజనేయస్వామివారల కళ్యాణమహోత్సవం కన్నులపండువగా నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహిస్తారు. [5]

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం[మార్చు]

మాచర్ల పాతూరులోని ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-10వతేదీ శుక్రవారంనాడు, మాఘపౌర్ణమి సందర్భంగా, శ్రీ గోపయ్యస్వామి, శ్రీ తిరుపతమ్మ తల్లి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో భక్తులకు భారీగా అన్నసమారాధన నిర్వహించారు. [12]

మండలంలోని ప్రధాన పంటలు[మార్చు]

ప్రత్తి, మిరప, వరి ప్రధాన వాణిజ్యపంటలు. నాణ్యమైన నాపరాయికి ఈ ప్రాంతంలోని క్వారీలు ప్రసిద్ధి. ఇక్కడి నుండి నాపరాయి ఇతర రాష్ట్రాలకూ,విదేశాలకూ ఎగుమతి అవుతుంది.

విశేషాలు[మార్చు]

 • మేజర్ పంచాయతీ స్థాయినుండి పురపాలకసంఘంగా 1987లో రూపాంతరం చెందింది. ప్రస్తుతం పట్టణంలో 29 వార్డులున్నాయి.
 • రామా టాకీసు వీధి: ఈ వీధిలోనే ప్రధాన వాణిజ్యసముదాయాలూ, ఆసుపత్రులూ,మందులషాపులూ, సినిమాహలు వుండడంతో ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూవుంటుంది.
 • కె.సి.పి.సిమెంటు ఫాక్టరీ:1958 లో స్థాపించబడి, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు, శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టుకు సిమెంటు సరఫరా చేసింది. ప్రస్తుతం దక్షిణభారతదేశంలోనే అత్యధికంగా సిమెంటు ఉత్పత్తిచేసే కర్మాగారాల్లో ఒకటిగావుంది.
 • మాచర్లకు దగ్గరలో బ్రహ్మనాయుడు చెరువు ఉంది.

ప్రముఖులు[మార్చు]

 • షేక్ చిన లాలుసాహెబ్ ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు
 • షేక్ పెద లాలుసాహెబ్ ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు
 • షేక్ రంజాన్ సాహెబ్ ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు
 • బ్రహ్మనాయుడు,ది అమరావతి వాయిస్ పత్రిక సంపాదకులు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

 1. The History of Andhra Country, 1000 A.D.-1500 A.D.: Administration, literature and society By Yashoda Devi పేజీ.39 [1]

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=మాచర్ల&oldid=3519439" నుండి వెలికితీశారు