కోట సామ్రాజ్యము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పరిచయం[మార్చు]

ధరణి కోట వంశము
సామ్రాజ్యము
1100 – 1400
రాజధాని ధరణికోట (గుంటూరు)
భాష(లు) తెలుగు
మతము జైన మతం
Government సార్వభౌమ(ఏకవ్యక్తి) పాలన
చరిత్ర
 - ఆవిర్భావం 1100
 - పతనం 1400
గండభేరుండం

చాళుక్య, చోళ సామ్రాజ్యాలు అస్తమించిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం స్థాపించబడువరకూ గడచిన మధ్య కాలంలో సామంతరాజులు స్వతంత్రులైయ్యారు. అట్టి వారిలో కోట వంశీయులు ఒకరు. వీరు ధరణికోటను రాజధానిగా చేసుకొని ద్రాక్షారామం (తూర్పుగోదావరి జిల్లా), త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా), తాడికొండ (గుంటూరు జిల్లా), యనమదల (తూర్పు గోదావరి జిల్లా), నటవాడి (నెల్లూరు జిల్లా) ప్రాంతాలను 12వ శతాబ్దం నుండి సుమారు 400 సంవత్సరాల పాటు పాలించారు. వీరు చంద్రవంశంలో ధనుంజయ గోత్రానికి చెందినవారు [1][2]. కోట సామ్రాజ్యాన్ని తూర్పుచాళుక్య వంశస్థుడైన హరిసీమ కృష్ణుడు స్థాపించాడు[1].

విశేషాలు[మార్చు]

కోట రాజులు మొదట్లో జైన మతాన్ని ఆచరించినా తర్వాత కాలంలో చాళుక్యుల వలె హిందూ మతాన్ని కూడా ఆచరించారు. శైవ తత్వాన్ని కూడా ప్రోత్సహించారు. వీరికి తూర్పు చాళుక్యులతోను, సూర్యవంశీయులైన కాకతీయులతోను వివాహ సంబంధాలుండేవి. కాకతీయ గణపతి దేవుని రెండవ కుమార్తె అయిన గణపాంబను కోట బేతరాజు వివాహమాడాడు. మంగళగిరి ఆనంద కవి వ్రాసిన 'విజయనందన విలాసము' లో హరిసీమ కృష్ణుడు చంద్రవంశానికి చెందినవాడని వ్రాయబడినది [3]. క్రీస్తు శకము 1182 ప్రాంతంలో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సహాయం చేయడానికి కాకతీయ రుద్రదేవరాజు కొంత సైన్యాన్ని పంపాడు. ఈ సైన్యం ధరణికోటను ముట్టడించి జయించింది. కోట దొడ్డభీమరాజు మరణించాడు. ఆనాటి నుండి కోట వంశీయులు కాకతీయులకు సామంతులయ్యారు. 1323 వ సంవత్సరంలో మహమ్మదీయుడైన ఉయిన్ ఖాన్ కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మూలించాడు. ఆ సందర్భంలో కోట వంశం కూడా రాజ్యం కోల్పోయింది. ఈ వంశం వారు చెదిరిపోయి దాట్ల, పాకలపాడు, చింతలపాడు, జంపన వంటి గ్రామాలకు వెళ్ళిపోయారు [4].

కోట సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు:

 • భీమరాజు 1 - క్రీస్తు శకం 1108-1127
 • బేతరాజు 2 - క్రీస్తు శకం 1127-1148
 • బేతరాజు 3 - క్రీస్తు శకం 1148-1156
 • భీమరాజు 2 - క్రీస్తు శకం 1156-1188
 • కేత రాజు 1 - క్రీస్తు శకం 1182-1231 - ఇతడు కాకతీయ గణపతి దేవుడి రెండవ కుమార్తె గణపాంబను వివాహమాడాడు.
 • భీమరాజు 3 - క్రీస్తు శకం 1231-1234
 • కేతరాజు 2 - క్రీస్తు శకం 1234-1240
 • గణపతిదేవ - క్రీస్తు శకం 1240-1262
 • భీమరాజు 4 - క్రీస్తు శకం 1262-1268
 • దేవరాజు - క్రీస్తు శకం 1268
 • దంతులూరి గన్నభూపాలుడు - క్రీస్తు శకం 1400.

ఇతర విషయములు[మార్చు]

కోట రాజులు ఈ క్రింది బిరుదు గద్యమును ఉత్సవ సందర్భాల్లో ఉచ్చరించేవారు:

స్వస్తి సమస్త పంచ మహా శబ్ద మహామండలేశ్వర| రాజ పరమేశ్వర| ఈశ్వర పదవీ విరాజమాన| విజయవినోద| .... మల్ల చోళ సింహ చోళ, శార్దూల| మత్త మాతంగ| హరిరాయాస్తాన గజసింహ| బౌద్ధకండకుద్దాల| పాండియరాయమగ| ధనుంజయ గోత్ర పవిత్ర| ... రాజు పేరు జగమొచ్చు గండండు| బంటు పేరు పగమెచ్చు గండండు| ఖడ్గం పేరు కాలమృత్యువు| రేవు పేరు పాప వినాశనంబు| నదిపేరు కృష్ణవేణి| దేవర పేరు అమరేశ్వర దేవుండు| పట్టణంబు పేరు ధరణాల కోట| వాటి పేరు ధన్య వాటి| వీటి పేరు గండరగండ వీడు| పడగ పేరు గండభేరుండ| .... అంబ దేవర భూపాలుండు మొదలైన శ్రీ కోట రాజుల అన్వయ ప్రశస్తి| విజయీభవ| దిగ్విజయీభవ !! [5]

గండభేరుండ పక్షి బొమ్మను రాజముద్రగా చాళుక్యులు వాడినట్టే, వీరు కూడా వాడారు. శ్రీనాధుడు తాను వ్రాసిన ధనుంజయ విజయాన్ని దంతులూరి గన్నభూపాలుడికి అంకితం చేశాడు. మహాముని కావ్య కంఠ గణపతి శాస్త్రి తన పుస్తకంలో గన్నభూపాలుడు తన కుమార్తె సురంబికను అద్దంకి, ధరణికోట, కొండవీడు ప్రాంతాలను పాలిస్తున్న అనవేమా రెడ్డికి ఇచ్చి వివాహం చేసాడని, ఇదే క్షత్రియ కులానికి మరియు రెడ్డి కులానికి మధ్య జరిగిన మొదటి వివాహమని వ్రాశాడు. సుమారు 17 వ శతాబ్దములో మంగళగిరి ఆనంద కవి తాను వ్రాసిన విజయనంద విలాసమును కోట సామ్రాజ్య వంశస్తుడైన దాట్ల వెంకటకృష్ణమ రాజును కీర్తిస్తూ వ్రాశాడు [3]. విశాఖపట్నం జిల్లా వీరవల్లి తాలూకా చోడవరం గ్రామంలో ఉన్న కేశవస్వామి ఆలయ స్తంభం పై చెక్కిన శిలాశాసనం (No. 741. (A. R. No. 54 of 1912.) భూపతిరాజు వల్లభరాజు మహాపత్రమని చెబుతున్నది. ఈ సామ్రాజ్యపు రాజులు నిర్మించుకొన్న కోటల ఆనవాళ్ళు నేడు లేవు. బహుశా వీరు మట్టి కోటలు నిర్మించుకొనివుంటారని, అవి కాలక్రమేణా నేలమట్టమై కాలగర్భంలో కలిసిపోయాయని చరిత్రకారుల ఊహ. ఈస్టు ఇండియా కంపెనీ వారు భారత దేశాన్ని పాలించు కాలములో కోట వంశానికి చెందిన దాట్ల, దంతులూరి, చింతలపాటి, భూపతిరాజు వంటి ధనుంజయ గోత్రపు గృహనామాల జమీందారులు రెవిడి, మద్గోలు, గోలుగొండ, ఉరట్ల, దార్లపూడి ప్రాంతాలను పరిపాలించారు. భారతదేశం సార్వభౌమ అధికార దేశంగా అవతరించిన తర్వాత జమీందారీ వ్యవస్థ అంతరించింది.

అపోహ[మార్చు]

కోట రాజులు కమ్మ కులస్తులకు పూర్వీకులని కొంతమందిలో భావం ఉంది. కోట అనే పదం గృహనామంగా కమ్మ కులస్తులలో ఉండటం వల్ల ఈ భావం ఉండవచ్చును. ఇందులో వాస్తవం లేదు. కోట వంశము వారిది ధనుంజయ గోత్రం. ఈ గోత్రం కమ్మ కులస్తులలో లేదు. గృహనామాలు ఊరి పేరుని బట్టి ఏర్పడినప్పుడు ఒక కులంలో ఉన్న గృహనామం మరొక కులంలో కూడా ఉండవచ్చు.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము - బుద్దరాజు వరహాలరాజు, 1970
 2. హిస్టరీ ఆఫ్ ఆంధ్రా కంట్రీ (క్రీస్తు శకం 1000 - 1500) - శ్రీమతి యశోదా దేవి
 3. 3.0 3.1 విజయనందన విలాసము - రచన: మంగళగిరి ఆనందకవి, ముద్రణ: 1919, రామవిలాస ముద్రాక్షర శాల, చిత్రాడ
 4. శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము - బుద్ధరాజు వరహాలరాజు, 1970
 5. స్టడీస్ ఇన్ సౌత్ ఇండియన్ జైనిజం, పార్ట్ 2: ఆంధ్ర - కర్ణాటక జైనిజం, బి. శేషగిరి రావు - 1922, పేజీలు 24, 25; Printers ; Hoe & Co ,

ఇంకా చదవండి[మార్చు]

లంకెలు[మార్చు]