కాకతీయుల కళాపోషణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాకతీయ సామ్రాజ్యం
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
కాకతీయ పాలకులు
కాకతి వెన్నయ 750-768
మొదటి గుండయ 769-824
రెండవ గుండయ 825-870
మూడవ గుండయ 870-895
ఎఱ్ఱయ 896-925
మొదటి బేతరాజు 946-955
నాల్గవ గుండయ 956-995
గరుడ బేతరాజు 996-1051
మొదటి ప్రోలరాజు 1052-1076
రెండవ బేతరాజు 1076-1108
దుర్గరాజు 1108-1115
రెండవ ప్రోలరాజు 1116-1157
గణపతి దేవుడు 1199-1262
రుద్రమ దేవి 1262-1289
ప్రతాపరుద్రుడు 1289-1323

‡ రాణి

ఇతరులు
మాలిక్ మక్బూల్
నిర్మాణాలు
*వరంగల్ ఖిల్లా
*వేయి స్తంభాల గుడి
*రామప్ప దేవాలయం
మార్చు

ఆంధ్రుల చరిత్రలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ఓరుగంటి కాకతీయ చక్రవర్తులు సా.శ. 1050 మొదలు 1350 వరకు దాదాపు 300 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు.[1] ఆంధ్ర దేశ చరిత్రలో కాకతీయులు వర్థిల్లిన కాలం మహోజ్యలమైంది. కాకతీయ చక్రవర్తులు అనేక మహమ్మదీయ దండ యాత్రలకు ఎదురు నిల్చి పోరాడి విశాల సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆంధ్ర జాతికి ఒక కర్తవ్యాన్నీ, విశిష్టతనూ చేకూర్చారు. వీరి పరిపాలనా కాలాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.

సా.శ.1000–1158 వరకూ కొంతకాలం తూర్పు చాళుక్య రాజులకూ, మరి కొంతకాలం పశ్చిమ చాళుక్య రాజులకూ సామంతులుగా వుండి చిన్న చిన్న రాజ్యాలను ఓడించి చివరకు చాళుక్య రాజ్యాన్ని కూడా ఓడించి స్వతంత్ర ప్రభువులుగా రూపొంది, 150 సంవత్సరాల కాలంలో నలుగురు రాజులు పరిపాలించారు. వీరిలో చివరి వాడైన రెండవ ప్రోలరాజు అతి ప్రసిద్ధుడు.

మహోన్నత వీరులు[మార్చు]

తరువాత దశలో క్రీ. శ. .1159- 1261. వరకు తెలంగాణాను పునాదిగా చేసుకుని ఆంధ్ర దేశాన్నంతా జయించారు. ఈ దశలో మొత్తం ముగ్గురు రాజులు పరిపాలించారు. వీరిలో ప్రసిద్ధు లైన కాకతీయ గణపతి దేవుడు దీర్ఘ కాలం (1193 --- 1262) వరకు పరిపాలించి కాకతీయ రాజ్యాన్ని విస్తరింప జేశాడు. ఆ తరువాత దశలో 1262 నుండి 1323 వరకూ పరాయి రాజుల దండ యాత్రల నుండి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడిన వారు రుద్రమదేవి. ప్రతాప రుద్రుడు. రుద్రమ దేవి అనేక మంది సామంత రాజుల తిరుగు బాట్ల నోడించి సమర్థ వంతంగా రాజ్య పాలన చేసింది. రెండవ రాజైన ప్రతాప రుద్రుడు అల్లావుద్దీన్ దండ యాత్రల్ని అనేక సార్లు త్రిప్పి కొట్టి చివరకు ఓడి పోయి బందీగా చిక్కి భరింప లేని కారాగార జీవితంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కాకతీయ చక్రవర్తుల లలితకళల్నీ, సారస్వతాన్నీ పోషించి వాటికి నూతన వికాసాన్ని కలిగించారు. వీరి కాలంలో నాట్య కళ బహుముఖాల విజృంబించి నట్లు అనేక శాసాల వల్లనూ, ఆనాటి శిల్పకళ వల్లనూ, సాహిత్యం వల్లనూ విదితమౌతోంది.

కళాకారులకు ఘన సత్కారాలు[మార్చు]

దేవాలయ కైకర్యం చేశే నర్తకీ మణులకు, మృదంగ విద్వాసులకు, గాయకులకూ, గృహ దానాలు చేసినట్లు పిల్లమఱ్ఱి శాసనంలో ఉదహరించ బడింది. పానుగల్లు శాసనంలో మైలాంబ గాయకులకు, నర్తకీమణులకు పై విధమైన గృహదానాలు చేసినట్లుంది. ధర్మ సాగర శాసనంలో జలబకరండ మనే అపూర్వ మైన వాద్య ప్రశంస ఉంది. ఈ కరండ వాద్య కారులకూ పది మంది, నాట్య కత్తెలకూ కొన్ని వివర్తనాల భూమిని ఇచ్చి నట్లు వ్రాయ బడివుంది. చేబ్రోలు శాసనంలో కాకతి గణపతి దేవుడు నృత్తరర్నావళి రచయిత జాయప సేనాని పదహారు మంది ఆట కత్తెలకు గృహ దానాలు చేసినట్లుంది.

మాన్యాలు, సమ్మానాలు[మార్చు]

గుంటూరుజిల్లా, గుంటూరు తాలూకా, మంచారమనే (నేటి మందిడం) మల్కాపురం శాసనంలో 1183 లో కాకతీయ మహారాణీ రుద్రమదేవి విశ్వేశ్వర శివా చార్యుడు స్థాపించిన గోళకీ మత విద్యాస్థానానికి దేవాలయంలో పదిమంది నర్తకులకూ, ఎనిమిది మంది మార్థంగికులలూ, కాశ్మీరు గాయకునికీ, పద్నాలుగురు గాయనీ మణులకూ, కరడా వాద్యంలో ఆరితేరిన కళాకారులు ఆరుగురికీ, వృత్తి మాన్యాలిచ్చి నాట్య సంగీతాలకు పోష కల్పించి నట్లుంది. శాసనాలతో పాటు కాకతీయ చక్రవర్తులు కట్టించిన అనేక దేవాలయాల మీద నాట్య సాంప్రదాయలను ప్రతిబింబించే అనేక మైన నాట్య శిల్పాలున్నాయి. అనేక దేవాలయాలు, శిల్పాలు తురుష్కుల దండ యాత్రల్లో చిన్నా భిన్నమైనాయి.

రామప్పగుడిలో రమణీయ నృత్యాలు[మార్చు]

శిల్పకళా విశిష్టతతో నిర్మితమైన రామప్ప గుడి వరంగల్ జిల్లా ములుగు తాలూకాలో ఉంది. ఇది వరంగల్లుకు నలబై మైళ్ళ దూరంలో ఉంది. ఈ గుడిని 1162 లో రుద్రసేనానీ అనే రాజు కట్టించాడు. రామప్ప గుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచ నలవి కానివి. ఈ కాకతీయ శిల్ప చాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది. రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి ఉన్నాయి. జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదహరించిన నాట్యశిల్ప మంతా రామప్ప గుడిలో తొణికిస లాడుతూ ఉంది.

ముద్దుగుమ్మల మద్దెల ధ్వనులు[మార్చు]

పాలంపేట లోని రామప్ప చెరువు కట్ట తూర్పు చివర నున్న దేవాలయం లోపలి భాగంలో స్త్రీలు మద్దెల వాయిస్తూ వుండగా, వివిధ భంగిమలలో నృత్యం చేస్తున్న అనేక మంది ఆటకత్తెల శిల్పా లున్నాయి. అదే దేవాలయం పడమటి వైపు ద్వార బంధాల మీద మార్థంగికు రాండ్ర శిల్పాలున్నాయి. వరంగల్లు రుద్రమదేవి కోట ద్వార బంధంపై రాతి పలక మీద మార్థంగికు రాండ్ర శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆ కోటలోనే స్వంభూ దేవాలయలో ఒక చిన్న శివ తాండవ నృత్య శిల్పముంది. హనుమ కొండ వెయ్యి స్తంభాల గర్బగుడి ద్వార బంధాలమీడ వివిధ నాట్యాల నృత్య భంగిమలలో స్త్రీల శిల్పాలున్నాయి. కాకతీయ యుగంలో నాట్య బహుళ ప్రచారంలో వున్నట్లు ఆ నాటి సంస్కృత గ్రంథాలలో ఉదహరింపబడి ఉంది. జాయన రచించిన అపూర్వ నృత్యశాస్త్ర గ్రంథం (నృత్తరత్నావళి) (సంస్కృత గ్రంథం) ఆనాటిదే.

జాయపసేనాని కత్తి వీరుడే కాక కళాప్రియుడైన సేనాని[మార్చు]

కాకతి గణపతి దేవ చక్రవర్తి కటాక్షానికి పాత్రుడైన జాయప తన స్వయంశక్తి వల్ల సేనాని కాగలిగాడు. ఈ యన వీరుడే గాక, కళాకారుడు కూడాను. నృత్యాలంటే జాయనకు అత్యంత అభిమానం. స్వయంగా నృత్తరత్నావళిని రచించాడు. ఈ వృత్తరత్నావళి భారతీయ నృత్య సంపదకు ఆభరణమని నృత్య విద్యావేత్తల అభిప్రాయం. సంస్కృత భాషలో ఆంధ్రుల రచించిన మొట్ట మొదటి నృత్యశాస్త్ర గ్రంథం ఇదేనని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు తెలియ జేశారు ఒక వ్యాసంలో. దీనిని రచించిన జాయప సేనాని అసలు పేరు జాయన. ఈ అయ్యకుల సంజాతుడు. పిల్ల చోడన పుత్రుడు. తాతముత్తాతలది వెలనాడులోని క్రొయ్యూరు. చందవోలు రాజధానిగా ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన వెలనాటి మహీపతుల వద్ద ఈతని తండ్రీ, తాతా సేవలు చేశారు. జాయన ఆయచమూపతి, జాయనేనాధినాథుడు, గజసాహిణి జాయన, గజ సైన్యాధినాథుదు అనే పేర్లాతో పిలువ బడుతూ వుండేవాడు. గణపతి దేవ చక్రవర్తి జాయప యందు అత్యంత అభినామంతో అతనికి సకల విద్యలనూ, కళలను నేర్పించాడు. ఆ తరువాతనే జాయన అత్యుత్తమ మైన నృత్తరత్నావళి రచనను పూనుకుని సా.శ. 1253–54 ప్రాంతంలో పూర్తి చేశాడు.

నృత్తరత్నావళి జానపదకళారూపాల వర్ణన[మార్చు]

నృత్తరత్నావళిలో మార్గ, దేశి నృత్యాలు రెండూ కలిపి కట్టుగా నడిచాయి. ఇందులో ఎనిమిది ఆద్యాయా లున్నాయి. మొదటి ఆధ్యాయం నర్తన వివేకం, రెండవ ఆద్యాయం అంగనిరూపణ., . మూడవ ఆద్యాయం, మండల లక్షణం, నాలుగవ ఆద్యాయం, కరణాంగ హార వివేచానికి సంబంధించి నది. ఐదవ ఆద్యాయం దేశి, స్థానక, కరణ, భ్రమరీ లక్షణాలను తెలుపుతూ ఉంది. ఆరవ ఆధ్యాయం దేశ పాట, చారీలాస్యాంగగతి లక్షణమనే పేరు గలది. 6--7--8 ఆద్యాయాలు ఆ నాటీ ఆంధ్రదేశంలో వాడుకలో వున్న దేసి, నృత్తపద్ధతులన్ని వివరించేవిగా వుండి గ్రంథ ప్రాముఖ్యాన్ని ఎంత గానో చాటుతున్నాయి. జాయన నృత్తరత్నావళిలో తన కాలంలో ప్రచారంలో వున్న దేశీ నృత్యాలన్నింటినీ అమూలంగా చిత్రింఛాడు. ఎనిమిది ఆధ్యాయాలు గల ఈ గ్రంథంలో కడపటి మూడు ఆద్యాలూ దేశి నృత్య సంప్రదాయాలైన వేరణి, ప్రేంఖణం, రాసకం, చర్చరి, నాట్య రాచకం, దండ రాచకం, శివప్రియం, చిందు, కందుకం, ఖాడిక్కం, ఘంటనరి, చరణము, బహురూపం, కోలాటం, మొదలైన ప్రాంతీయము లైన అనేక ఆనపద నృత్యాలను వివరించాడు.

జాయన నృత్తరాత్నావళిని పరికించి చూస్తే భరతముని ప్రసాదించిన భరత నాట్యశాస్త్ర గ్రంథంలోనూ, భరత నాట్యంపై ఆభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానం తోనూ జాయనకు పరిపూర్ణ పరిచయం వున్నట్లు తోస్తూవుందని సా.శ.ే. మల్లంపల్లి వారు అదే వ్వాసంలో వ్రాశారు. జాయన నృత్యరత్నావళిలో నృత్యానికి అనుగుణమైన సంగీత రత్నావళిని గూడ అనుబంధంగా అరచించాడట. కాని దురదృష్ట వశాత్తూ అది లభ్యం కాకుండా పోయింది. జాయన 1213 వ సంవత్సరం నాటికే సాల నాట్య వైదిక మణి అనీ, కవి సభాశిఖామణి అనీ పేరొందాడు. జాయన నృత్తరత్నావళిని 1253–54 నాటికి రచిందడం వలన దాదాపు 60 సంవత్సరాల వయసులో వ్రాసి వుండ వచ్చు. ఏమైనా ఈ నాడు ఆంథ్రుల గర్వించ దగిన పురాతన నృత్యశాస్త్ర గ్రంథాలలో నృత్తరత్నావళి మణి భూషణం.

కాకతీయుల శిల్పము[మార్చు]

కాకతీయుల మొదటి బేతరాజు కొడుకు మొదటి ప్రోలుడి కాలానికి హనుమకొండ కోటమాత్రమే ఉండేది. కట్టడాలేవీ అతడు లేపినట్లులేదు.అతని రాణి తన ఇష్టదైవము పాంచాల రయుణ్ణి ప్రతిష్ఠించి ఆలయమూ పల్లే నిర్మించింది.ఈప్రోలుని కొడుకు రెండోబేతరాజు బేతేశ్వరము అనే ఆలయము కట్టించాడు.హనుమకొండ కోటకున్న ఎత్తైన రాతి ద్వారా తోరణాలు ఈయన పెట్టించి ఉండవచ్చును.రెండోప్రోలరాజు రెండో బీతరాజు కొడుకు.ఈతని యుద్ధ విజయోత్సాహానికి ఉత్తరాదినుండి వలసవచ్చిన శైవాగమ పండితులు శివాలయ నిర్మాణానికి, పద్మాక్షి దేవాలయానికి అనుమతిచ్చాడు.అప్పటి శివాలయాలలో చెప్పుకోదగ్గ శిల్పాలు వెలయలేదు.కాని పద్మాక్షి గుట్టమీది జైనస్థావర శిల్పానికి మంచి ప్రోత్సాహము చేకూరింది.అక్కడి పార్స్వనాధుడు మైలమ్మ బేతన శిల్పాలు ఈకాలంలోనే చెక్కారు.ఇనుగుర్తి జలంధర భైరవుడు కాళేశ్వరపు అన్నపూర్ణా విగ్రహాలు ఈకాలానివే. ఓరుగల్లు కోటలోని ఏకశిల పైని ఆలయము జైనుంది-ఈకాలానిదే.

రెండొ ప్రోలరాజు కొడుకు రుద్రదేవుడు రాజ్యానికి వచ్చేకాలానికి కాకతి రాజ్యము స్థిరపడినది. ఈయన కాశీబుగ్గ, అయిననోలు, మొగలిచర్ల దేవాలయాలు కట్టించాడు.మొదటి రెండింటి శిఖరాలూ కోటలోని శంభుని గుడి శిఖరాలవలె మెట్లు మెట్లుగానే ఉన్నాయి.రుద్రదేవుడికి వర్ధమానములో దండయాత్ర చూచిన త్రికూటాలాయము దొడ్డగడ్డవల్లి లక్ష్మీదేవి ఆలయము నమూనాలోది వచ్చింది.తన విజయయాత్రాననంతరము ఆరూపముతో హనుమకొండలో వేయిస్తంభాల గుడి నిర్మించాడు.ఈ ఆలయ నిర్మాణముతో కాకతీయ శిల్పానికి కాళ్ళు వచ్చినవి.ఈ ఆలయము మొత్తం హోయసాలుల సోమనాధాలయము పద్ధతిలో మూడు చిన్న ఆలయాలు-పొయ్యగడ్డలు పేర్చినట్లుగా కూర్చడమువలన ఏర్పడింది.హోయసాలుల ఆలయాలు పెట్టెలవలె కనిపిస్తాయి, మండపాలలో చీకటి.కాకతీయుల ఆలయాలు వెలుగుగా ఉంటాయి.హోయసాలుల శిల్ప వ్యక్తులు బొద్దుగా పొట్టిగా ఉంటారు, కాకతీయుల శిల్ప వ్యక్తులు సన్నము, పొడవూ.వారికి అలంకారభారము జాస్తి. వీరి అలంకారాలు బరువులుకాదు.అక్కడ లతల చిక్కములు ఎక్కువ, ఇక్కడ లేవు.అక్కద కథా శిల్పము తక్కువ, ఇక్కడ ఎక్కువ.

రుద్రదేవుని తరువాత కొద్దికాలము ఆతని తమ్ముడు మహాదేవుడు కాకతి రాజ్యము పాలించాడు.ఇతడు యాదవులతో పోరాడి యుద్ధములో మరణిస్తే ఈయన్ కొడుకు గణపతిని బంధించి ఉంచి కొంతకాలనికి విడిచె నంటారు. గణపతి ఓరుగల్లుకు వచ్చి తాను లేనప్పుడు రాజ్య సమైక్యతను కాపాడిన సేనానులకు పెద్ద పెద్ద భూభాగాలిచ్చాడు.వారు అడవులు నరికొంచి ఆమేరలకు సుక్షేత్రాలుగా తీర్చి చెరువులు కట్టించి, ఆలయాలు నిర్మించారు.పాలంపేట రుద్రేశ్వరాలయము, కటాక్షపుర శివాలయము, నగునూరు త్రికూటాలయమూ, నాగూలపాడు శివాలయమూ, ఓరుగల్లు కోటలోని కేశవ శ్రీస్వయంభూ దేవాలయాలూ గణపతిదేవుని కాలంలోనే నిర్మిచబడినాయి.బసవేశ్వరుని నిర్యాణముతో విజృంభించిన శైవము గణపతిదేవుని రాజధానిలోనూ ఆయన దండయాత్ర దారులలోనూ ప్రళయ నృత్యము చేసింది. అప్పుడే జైన తీర్ధంకురుల విగ్రహాల తలలు నరకబడినాయి.

గణపతిదేవుని తరువాత ఆయన కూతురు రుద్రమదేవి సా.శ.1260లో రాజ్యానికి వచ్చింది.ఈమెకు మతగురువు శివ దేవయ్య.ఆయన ప్రోత్సాహముతో నీమె పుష్పగిరి మఠమూ, ఇతర శైవ మఠాలూ స్థాపించింది.అక్కడి శిల్పాలు మైలారు వీరగాధల్నీ శపథాల్నీ కాక జైన సంహారాన్నీ చూపిస్తున్నాయి.వీటికి తోడు శ్రీ చక్రాలూ, శివ యోగుల శిల్పాలూ ఈకాలంలో వచ్చాయి.ఇవీ ప్రజాశిల్ప పుష్పదళాలే. రుద్రమ్మ కాలంలో ప్రత్యేకంగా వ్యాపించినవి కాకతమ్మ విగ్రహాలు.ఈము నాలుగు చేతులతోనూ వరుసగా డమరుకమూ త్రిశూలమూ కత్తె రక్తపాత్రా ధరించే యముని శక్తి చాముండీ, సప్తమాతృకల లోనిది.నక్క ఈమె చిహ్నము.శవము ఆసనము.గద్ద ధ్వజము.హనుమకొండ భద్రకాళి కాకతీయే.

రుద్రమ్మ తరువాత ప్రతాపరుద్రుడు రాజ్యానికి వచ్చాడు. స్తంభాలు పేర్చి నిలబెట్టి కట్టిన వేయిస్తంభాల గుళ్ళు అనేవి ఈతడు కొలనుపాకలోనూ మంథని లోనూ ఇతర స్థలాలోనూ నిర్మించాడు.ఈతని సేనానులు త్రికూటాలు నిర్మించారు.మంథని గౌతమేశ్వరుని ఆలయము ఈయన కాలానిదే.దీనిపైన జైన తీర్ధంకురుల బొమ్మలూ ఉన్నాయి.ప్రతాపరుద్రుడు శైవ జైన వైష్ణవాలను సమంగా గౌరవించాడు. ఓరుగల్లు కోటలో నిల్చిఉన్న జైనాలయాలు ఈయన కాలంలోనే వచ్చి ఉంటాయి.

యివి కూడా చూడండి[మార్చు]

సూచికలు[మార్చు]

  1. Gribble, J.D.B., History of the Deccan, 1896, Luzac and Co., London

వనరులు[మార్చు]

  • Ventakaramanayya, N. The Early Muslim Expansion in South India, 1942
  • A History of India, H. Kulke and D. Rothermund, 1998, Routledge, p. 160, ISBN 0415154820
  • A Social History of the Deccan: 1300-1761, R. M. Eaton, 2005, Cambridge University Press, pp. 16–20, ISBN 0521254841
  • ఆంధ్రుల చరిత్ర - డాక్టర్ బి యస్ యల్ హనుమంతరావు
  • తెలుగువారి జానపద కళారూపాలు రచయిత డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి
  • భారతి మాస పత్రిక- 1974 వ్యాసము కాకతీయుల శిల్పము-వ్యాసకర్త- శ్రీపాద గోపాలకృష్ణమూర్తి.