ఆంధ్రప్రదేశ్ అవతరణ

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
ఆంధ్రప్రదేశ్ చరిత్ర
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌ అవతరణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014

ఆంధ్రప్రదేశ్ అవతరణ అనగా 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా తెలుగు ప్రాంతాలైన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణా కలిపి ఆంధ్రప్రదేశ్ గా అవతరించటం.

చరిత్ర

[మార్చు]

1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పై వత్తిడి పెరిగింది. కాంగ్రెసు, కమ్యూనిస్టులతో సహా అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలూ దీనిని సమర్ధించడంతో విశాలాంధ్ర స్వప్నం నిజమయే రోజు దగ్గరపడింది. 1953 డిసెంబరులో సయ్యద్‌ ఫజల్‌ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషను ఏర్పాటయింది. 1955 సెప్టెంబర్ 30 న తన నివేదిక సమర్పించింది., తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్ధించింది. మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలోను, కన్నడం మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలోను కలిపి తెలుగు మాట్లాడే ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని సూచించింది. అయితే ఐదు సంవత్సరాల తరువాత రాష్ట్ర శాసనసభలో మూడింట రెండు వంతులు సభ్యులు ఒప్పుకుంటే, ఆంధ్రతో విలీనం చెయ్యవచ్చని కూడా సూచించింది. కమిషను సూచనలను ఆహ్వానించి, ప్రత్యేక రాష్ట్రవాదనను సమర్ధించిన వారిలో కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి ప్రముఖులు. హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు ఆంధ్ర ప్రదేశ్‌ను సమర్ధించారు. శాసనసభలో ఈ విషయంపై చర్చ జరిగినపుడు, 103 మంది సభ్యులు ఆంధ్ర ప్రదేశ్‌కు మద్దతు తెలుపగా, 29 మంది మాత్రమే వ్యతిరేకించారు. 15 మంది తటస్థంగా ఉండిపోయారు. ఆంధ్ర ప్రదేశ్‌ను సమర్ధించిన ప్రముఖ నాయకులలో అప్పటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణా రావు, మాడపాటి హనుమంతరావు, స్వామి రామానంద తీర్థ మొదలైనవారు ఉన్నారు. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, హైదరాబాదు శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. కాంగ్రెసు అధిష్ఠానం కూడా ఆంధ్ర ప్రదేశ్‌నే సమర్ధించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. 1956 ఫిబ్రవరి 20 న ఢిల్లీలో రెండు ప్రాంతాల నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణా తరపున బూరుగుల రామకృష్ణా రావు, కె.వి.రంగారెడ్డి (మర్రి చెన్నారెడ్డికి మామ. ఈయన పేరిటే 1978 లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లా ఏర్పాటయింది.), మర్రి చెన్నారెడ్డి, జె.వి.నర్సింగ్ రావు పాల్గొనగా, ఆంధ్ర తరపున బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం 1956 జూలై 19 న వారిమధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది; ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 1956 నవంబర్ 1న అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్‌ ఆవిర్భవించింది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి వరకు హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉన్న బూరుగుల రామకృష్ణా రావుకు కేరళ గవర్నరు పదవి లభించింది. ఆంధ్ర రాష్ట్ర గవర్నరు అయిన సి.ఎం.త్రివేది, ఆంధ్ర ప్రదేశ్‌ తొలి గవర్నరుగా కొనసాగాడు.

ఉపముఖ్యమంత్రి

[మార్చు]

పెద్దమనుషుల ఒప్పందంలోని చాలా ముఖ్యమైన అంశం: రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి ఉండాలి. కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.

కొత్తజిల్లాలు

[మార్చు]

తరువాతి కాలంలో మరో మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. ఆవి: 1970లో ప్రకాశం జిల్లా, 1978లో రంగారెడ్డి జిల్లా, 1979లో విజయనగరం జిల్లా. వీటితో కలిపి మొత్తం 23 జిల్లాలయ్యాయి.ఇంకా విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, నంద్యాల, మంచిర్యాల, అమలాపురం మొదలైనకొత్తజిల్లాలకోసం ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.