Jump to content

పెద్దమనుషుల ఒప్పందం

వికీపీడియా నుండి
Konda Venkata Ranga Reddy
కె.వి.రంగారెడ్డి

1956లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి - కోస్తా, రాయలసీమ, తెలంగాణా - అన్ని ప్రాంతాల నాయకులూ ఇష్టపడ్డారు. అయితే తెలంగాణా నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అధిక రెవెన్యూ ఆదాయం గల తమ ప్రాంతం, అదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికి కలిగింది. ఇటువంటి ఇతర సందేహాల నివృత్తికై అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి 1956 ఫిబ్రవరి 20 న ఒక ఒప్పందానికి వచ్చారు. దీనినే పెద్దమనుషుల ఒప్పందం అన్నారు. న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు 1956 ఫిబ్రవరి 20 అని కె.వి.రంగారడ్డి స్వీయచరిత్రలో రాసారు. సంతకాలు చేసిన వారు తెలంగాణా తరపున, బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి. నరసింగరావు, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి:

  • కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ రెవెన్యూ వసూళ్ళకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి. తెలంగాణా ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి
  • తెలంగాణాలో విద్యాసంస్థలను అభివృద్ధి చెయ్యాలి. స్థానిక విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషనులు ఇవ్వాలి.
  • సివిలు సర్వీసులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి.
  • ఐదేళ్ళ పాటు పాలనా వ్యవస్థలోను, న్యాయ విభాగం లోను ఉర్దూ వినియోగం కొనసాగాలి.
  • రాష్ట్ర మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం సభ్యులు ఉండాలి. ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి ఇతర ప్రాంతాల నుండి ఉండాలి.
  • ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణా అభివృద్ధి మండలికి ఉండాలి. మండలి సభ్యులు తెలంగాణా ప్రాంతం నుండి ఎన్నికైన శాసన సభ్యులు ఉండాలి.
  • తెలంగాణాలో మధ్యపాన నిషేధాన్ని తెలంగాణా శాసనసభ్యులు కోరిన విధంగా అమలు చెయ్యాలి.
  • తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్ళపాటు నివసించి ఉండాలని నిబంధన రూపొందించాలి.
  • కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.

ఈ ఒప్పందం తరువాత తెలంగాణా నాయకులలో ఉన్న సందేహాలు తొలగి, ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.