Jump to content

నరసరావుపేట

అక్షాంశ రేఖాంశాలు: 16°14′10″N 80°03′14″E / 16.236°N 80.054°E / 16.236; 80.054
వికీపీడియా నుండి
(నర్సారావుపేట నుండి దారిమార్పు చెందింది)
పట్టణం
పటం
Coordinates: 16°14′10″N 80°03′14″E / 16.236°N 80.054°E / 16.236; 80.054
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండలంనరసరావుపేట మండలం
విస్తీర్ణం
 • మొత్తం7.65 కి.మీ2 (2.95 చ. మై)
జనాభా
 (2011)[3]
 • మొత్తం1,16,250
 • జనసాంద్రత15,000/కి.మీ2 (39,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి977
ప్రాంతపు కోడ్+91 ( 08647 Edit this on Wikidata )
పిన్(PIN)522601 Edit this on Wikidata
Websitehttp://narasaraopet.cdma.ap.gov.in/en Edit this on Wikidata

నరసరావుపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా ముఖ్య పట్టణం. ఈ పట్టణం 1797 లో స్థాపించబడింది. పలు విద్యాలయాలకు, ధార్మిక సంస్థలకు ప్రసిద్ధి.

చరిత్ర

[మార్చు]

నరసరావుపేట పట్టణ నిర్మాణం జరగకముందు ఈ ప్రాంతంలో "అట్లూరు" అనే చిన్న గ్రామం ఉండేది.ఈ గ్రామానికి కటికనేని నారయ్య,కటికినేని రామయ్య జాగీరుదారులుగా ఉండేవారు. నాటి అట్లూరు గ్రామం ఇప్పటి నరసరావుపేటకు పశ్చిమ భాగాన ఉండేది.అదే ఇప్పడు 'పాతూరు'గా పిలువబడుతుంది.ఈ ప్రాంతాన్ని పరిపాలించే జమీందారు రాజా మల్రాజు వేంకట పెదగుండారాయణిం సా.శ.పూ.1797 పింగళి నామ సంపత్సరం,శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారం నాడు అతని తండ్రి నరసారావుపేరుతో కోట,పేటల కట్టుబడికి నిర్మాణం చేపట్టి, కోటకు నరసరావుపేట రాజావారి కోట అని, పేటకు నరసారావుపేట అని నామకరణం చేసాడు. అదే నరసరావుపేటగా అవతరించింది.నాటి రాజావారి కోట ఆ తరువాత రాజావారి కోటగా వాడుకలోకి వచ్చింది కోట,పేటల నిర్మాణానికి అట్లూరు జాగీరుదారులైన నారయ్య,రామయ్యలకు అట్లూరుకు బదులుగా పెట్లూరివారిపాలెంను జాగీరుగా ఇచ్చి అట్లూరును గుండారాయణిం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.తొలుత అట్లూరుగా మొదలైన ప్రస్థానం, తరువాత నరసరావుపేటగా అవతరించి అంచెలంచెలుగా పట్టణస్థాయికి ఎదిగింది. పట్టణ ద్విశతాబ్థి వేడుకలు 1997 జూన్ 27 నుండి 29 వరకు విర్వహిండబడ్డాయి. 1915లో నరసరావుపేట పురపాలక సంఘంగా ఆవిర్భవించింది.నరసరావుపేట పురపాలక సంఘం వంద సంవత్సరాల వేడుకలు 2015, డిసెంబరు -11,12,13 తేదీలలో జరిగాయి.[4] దీనిని పల్నాడు ప్రాంతానికి ముఖద్వారం అని వ్యవహరిస్తుంటారు.5 వ శతాబ్దంలో పల్లవుల పరిపాలనా కాలంలో కాంచీపురం రాజధానిగా ఉండేది.గుంటూరు, నర్సరావుపేట, వినుకొండ ఈ ప్రాంతాలను కలిపి కర్మ రాష్ట్రం అని పిలిచేవారు.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం 1,16,250. అందులో పురుషులు 59,464 కాగా,స్రీలు 58,065. అక్షరాస్యత శాతం పురుషులు 86.08 కాగా, స్త్రీలు 72.07 శాతం. ఈ పట్టణ భౌగోళికం 7.65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది.[5][6]

పట్టణ పరిపాలన

[మార్చు]

నరసరావుపేట పురపాలకసంఘం 1915 మే 18న ఆవిర్భవించింది.మొదటి గ్రేడ్ పురపాలక సంఘంగా 1980 ఏప్రిల్ 28న ప్రభుత్వంచే గుర్తించబడింది. పురపాలక సంఘం చైర్ పర్సన్ గా నాగసరపు సుబ్బరాయ గుప్తా (16 వ వార్డు కౌన్సిలర్) 2014 జూలై 1 నుండి పదవీ బాధ్యతలు స్వీకరించి పరిపాలన సాగించుచున్నాడు.వైస్ చైర్ పర్సన్ గా షేక్ మీరావలి (4 వ వార్డు కౌన్సిలర్) వ్యవహరించుచున్నాడు. పురపాలక సంఘం 34 మంది వార్డు కౌన్సిలర్లు, ముగ్గురు కో-అప్సన్ సభ్యులుతో పరిపాలన కొనసాగుతుంది.

సమీప పట్టణాలు

[మార్చు]

రవాణా సౌకర్యాలు

[మార్చు]
నరసరావుపేట రైల్వే స్టేషన్

ఈ పట్టణం మొత్తం రోడ్డు పొడవు 157.08 km (97.60 mi). నరసరావుపేట బస్ స్టేషన్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణాసంస్ద బస్సులు నడుపుతుంది.ఇక్కడ నుండి రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకు చెందిన పట్టణాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా రవాణా సదుపాయం ఉంది.ఇక్కడకు సమీప విమానాశ్రయం విజయవాడ. నరసరావుపేట రైల్వే స్టేషన్ నల్లపాడు - నంద్యాల విభాగంలో ఉంది. నరసరావుపేట రైల్వే స్టేషనును దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉంది. దీనిని గుంటూరు రైల్వే డివిజనుచే నిర్వహించబడుతుంది.మండలంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణాసంస్ద బస్సుల ద్వారా రవాణా సౌకర్యం ఉంది.

పేరొందిన వీధులు

[మార్చు]
  • ఏనుగుల బజారు:విద్యుత్ బోర్డు ఆఫీసు నుండి సత్తెనపల్లి రోడ్ వరకు గల వీధిని ఏనుగుల బజారని అంటారు. పెద్దల ద్వారా పరంపరంగా వస్తున్న సమాచారం ప్రకారం లోగడ రాజా వేంకట గుండారాయునికి 99 ఏనుగుల ఉండేవని, వాటిని కట్టివేసే స్థలానికే ఈ పేరు వచ్చిందని తెలుస్తుంది. ఈ ఏనుగులలో ఖండేరావు అనే పట్టపు ఏనుగు ఉండేది. సా.శ.పూ.1816 యువ నామ సంవత్సరం ఫాల్గుణ మాసంలో మరాటి దండు దాడి చేసినప్పుడు కోటలోనివారు,మపురజనులు కోటలోపల ఉండి తలుపులు వేసుకొని ప్రధాన ద్వారం వద్ద ఖండేరావు పట్టపు ఏనుగును నిలబెట్టగా దాని ఘీంకార, భీకర ధ్వనులకు దండు భయపడి పారిపోయిందని చెెపుతారు.
  • మానికల బావి వీధి: కుసుమ హరనాథ్ మందిర్ నుండి వేంకటేశ్వర టాకీస్ వరకు ఉన్న వీధిని మానికల బావి వీధి అని పిలుస్తారు.మల్రాజులు కూర్చునేందుకు అప్పట్లో ఒక విలాసవంతమైన వేదిక కోటలో ఉండేది.వారు కూర్చొనినప్పడు పైనుండి సన్నని నీటి తుంపరలు పూలవానలాగా కురిసే విధంగా జల యంత్రశాల కోటకు వెలుపల వాయవ్య భాగంలో ఏర్పరచారు.ఈ యంత్రాలకు నీటిని అందించే బావి మేడ వెనుక వీధిలో ఉంది.ఈ బావి ఉన్న బజారను మానికల బావి వీధి అని పేరుపడింది.
  • కోటబజారు:మల్రాజుల సంస్థానానికి 100 ఒంటెలు, 500 గుర్రాలు, కార్బలం నాయకులు, దాస, దాసీ జనులుండేవారు.వారి పరివారం అంతా నివసించే గృహాలు ఈ వీధిలో ఉండేవి. అందువలన ఈ బజారుకు కోట బజారు అను పేరు వచ్చింది.ఈ బజారు మానికల బావి నుండి సత్తెనపల్లి రోడ్డు వరకు విస్తరించి ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాల

[మార్చు]

శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాల,1950లో అప్పటి వెనుకబడిన పల్నాడు, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతో నరసారావుపేటలో ఒక చిన్న సంస్థగా తొలుత రైల్వే స్ఠేషన్ ఎదురుగా ఉండే కాటన్ ప్రెస్‌కంపెనీలో ప్రారంభించింది.తదుపరి కళాశాల 34 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన శాశ్వత భవనాలలోకి మారింది. కళాశాల మొదటి ప్రిన్సిపల్ ఇలింద్ర రంగనాయకులు.ఈ కళాశాల ప్రిన్సిపల్‌గా రాకపూర్వం గుంటూరు హిందూ కళాశాలలో గణితశాస్ర ఆచార్యుడుగా పనిచేశాడు.మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది.తరువాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా మారింది.ఇది వివిధ విద్యా రంగాలలో పరిమాణాత్మక విస్తరణ, గుణాత్మక మెరుగుదలల ద్వారా మంచి పురోగతిని సాధించిందించిదని అంటారు.2019 నాటికి కళాశాల కమిటీ ప్రెసిడెంటుగా కపిలవాయి విజయ కుమార్, సెక్రటరీ, కరస్పాండెంట్‌గా నాగసరపు సుబ్బరాయ గుప్తా, ప్రిన్సిపాల్‌గా సోము మల్లయ్య వ్యవహరిస్తున్నారు.

శ్రీ యస్.కె.ఆర్.బి.ఆర్.జూనియర్ కళాశాల.

[మార్చు]

శ్రీమతి కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి జూనియర్ కళాశాల 1972 సంవత్సరంలో 23.5 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడింది. ఈ కళాశాల పల్నాడు రోడ్డులో పట్టణం నడిబొడ్డున ఉంది. కళాశాల శాశ్వత భవనాలను కలిగిఉంది.విద్యార్థుల విద్యా రంగంలో అభివృద్ధిని సాధించటానికి అన్ని విధాల సౌకర్యాలను కలిగి ప్రశాంత వాతావరణంతో కలిగిన విశాలమైన లైబ్రరీ, పూర్తిస్థాయి ప్రయోగశాలలు,విద్యా వాతావరణానికి అనుకూలంగా ఉన్నాయి.క్రీడా ప్రాంగణంలో, వ్యాయామశాలలో వివిధ సౌకర్యాలు ఉన్నాయి.ఎప్పటికప్పుడు చురుకైన యన్.సి.సి, యన్.యస్.యస్, సాంస్కృతిక క్లబ్‌లు సంవత్సరవారీ జరుగవలసిన కార్యక్రమాల వాతావరణాన్ని జాగ్రత్తగా చూసుకుంటాయి. విద్యార్థులు ఎల్లప్పుడూ కార్యకలాపంలలో లేదా మరొక పనిలో నిమగ్నమై ఉండే విధంగా తగు పర్వేక్షణ ఉంటుంది.విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవటానికి, ఉపన్యాసాలు ఇచ్చే స్థాయి విద్యార్థులలో కలిగింపచేయాలనే కోరిక ప్రస్తుతం యాజమాన్యానికి ఉంది.కళాశాల లక్ష్యం కష్టపడి పనిచేయడం, మాంటిస్సోరిని మాస్టర్స్ అంతకు మించి ఒకే గొడుగు క్రిందకు తీసుకురావలనే ఆకాంక్షతో ఉంది.విద్యలో ఆధునిక పోకడలతో పోటీ పడటానికి సరికొత్త కోర్సులు, మార్పుల నిరంతరం జోడించబడ్తుంటాయి.కళాశాల వ్యవస్థాపక సెక్రటరీ, కరస్పాండెంట్ నరసరావుపేట మాజీ యం.యల్.ఎ. దొండేటి కృష్ణారెడ్డి.వ్యవస్థాపక ప్రిన్సిపాల్ యస్.వెంకటేశ్వరరావు.ప్రస్తుత సెక్రటరీ,కరస్పాండెంట్ గా కాసు మహేశ్వరరెడ్డి, ప్రస్తుత ప్రిన్సిపాల్ గా టి.జె.చంద్రశేఖర్ బాబు పనిచేస్తున్నారు.కళాశాల ప్రాంగణంలోని బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సేవలు అందిస్తుంది.

పి.యన్.సి. & కె.ఆర్.విద్యా సంస్థలు

[మార్చు]
పాలడుగు నాగయ్య చౌదరి & కొత్త రఘురామయ్య కళాశాల ప్రాంగణం,నరసరావుపేట
నూతన భవన ప్రారంభోత్సవం శిలాఫలకం
కళాశాల వ్యవస్థాపకులు శివలింగప్రాదరావు, అన్నపూర్ణమ్మ

కొత్త రఘురామయ్య జూనియర్ కళాశాల:1975లో నరసరావుపేటలో కేవలం రెండు కళాశాలలు మాత్రమే ఉన్నాయి. వెనుకబడిన పల్నాడు ప్రజల అవసరాలను తీర్చడానికి మరికొన్ని కళాశాలలు అవసరమయ్యాయి.ఆ పరిస్థితులలో నరసరావుపేట,పల్నాడు ప్రాంతాల పరిసర గ్రామాలలో ధన,ధాన్యరూపాలలో విరాళాలు సేకరించి, కొత్త రఘురామయ్య రెండు దశాబ్దాల పాటు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 1975 ఆగస్టు 1 న అతని పేరు మీద ‘కొత్త రఘురామయ్య జూనియర్ కళాశాల’ అనే పేరుతో స్థాపించబడింది.పల్నాడు ప్రాంతంలోని అన్ని వర్గాలకు చెందిన పేద గ్రామీణ ప్రజలకు సహాయం చేయడానికి ‘ఏ బహుమతి విద్య యొక్క బహుమతికి సమానం కాదు’ అనే ఉద్దేశ్వంతో మంచి విద్యను అందించే ఉద్దేశంతో స్థాపించబడింది. కొత్త లక్ష్మీ రఘురామ్, అప్పటి జిల్లా కలెక్టరు కత్తి చంద్రయ్యలచే కళాశాల ప్రారంభించబడింది. కళాశాల వ్యవస్థాపక ప్రెసిడెంటు నల్లపాటి వెంకట్రామయ్య చౌదరి. వ్యవస్థాపక ప్రిన్సిపల్ తోటకూర వెంకటేశ్వరరావు. సెక్రటరీ, కరస్పాండెంట్ కూడా ఇతనే.1975 ఆగస్టు 4న క్లాసులు ప్రారంభమయ్యాయి.

కళాశాల శాశ్వత భవనాలు 1984 డిశెంబరు 4న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుచే ప్రారంభించబడ్డాయి. మాజీ మంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ మాజీ స్పీకరు కోడెల శివప్రసాదరావు ప్రారంబోత్సవ సమావేశం అధ్యక్షుడుగా, మేదరమెట్ల శివలింగప్రసాదరావు సెక్రటరీ, కరస్పాండెంట్ ఆహ్వాన సంఘఅధ్యక్షుడుగా వ్యవహరించారు.

పాలడుగు నాగయ్య చౌదరి డిగ్రీ కళాశాల:ఇదే ఆవరణలో ఈ కళాశాల మేదరమెట్ల శివలింగ ప్రసాదరావు, అన్నపూర్ణమ్మ దంపతులు డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులుగా “పాలడుగు నాగయ్య చౌదరి, కొత్త రఘురామయ్య కళాశాల” (పి.యన్.సి. & కె.ఆర్ డిగ్రీ కళాశాల అనే పేరుతో 1991.92 సం.లో నాగార్జున విశ్వ విద్యాలయం అనుభంధ కళాశాలగా రూపాంతరం చెందింది. డిగ్రీ కళాశాలకు గాలి సుబ్బారావు వ్యవస్థాపక ప్రిన్సిపాల్ గా వ్యవహరించాడు. డిగ్రీ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవం 1995 మే 16న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుచే ప్రారంభించబడింది. శ్రీ పి.ఎన్.సి, కె.ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, శ్రీ.వి.పి.యన్.సి. & కె.ఆర్. ఎడ్యుకేషనల్ సొసైటీ, మేదరమెట్ల అంజమ్మ, మస్తానరావు బి.ఇడి; కళాశాలలు ఈ కళాశాల అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయి.

నరసరావుపేట ఇంజనీరింగు కళాశాల

[మార్చు]
నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్

యన్.ఇ.సి. గాయత్రీ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సొసైటీ (జిఇడిఎస్) వ్యవస్థాపకుడు మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావుచే 1998 లో స్థాపించబడింది. కాకినాడలోని జెఎన్‌టియుకు శాశ్వత అనుబంధంతో, గాయత్రి ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సొసైటీ (స్వయం ప్రతిపత్తి సంస్థ) ఆధ్వర్యంలో ఈ కళాశాల నడుపబడుతుంది.ఈ సంస్థను న్యూ డిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆమోదం పొందబడి, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అండ్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ నుండి ‘ఎ’ గ్రేడ్‌తో గుర్తింపు పొందింది.ఇది గుంటూరు జిల్లాల పల్నాడు ప్రాంతంలో ఏర్పడిన మొదటి సాంకేతిక విద్యా సంస్థ.ఈ కళాశాల ఐయస్ఒ 9001: 2008 తో ధ్రువీకరించబడింది. గత రెండు దశాబ్దాలలో ఈ ప్రాంతంలోని ఇంజనీర్లు, బ్యూరోక్రాట్లు, నాయకులును ఈ కళాశాల ఉత్పత్తి చేసింది.ఈ కళాశాల ఆవిష్కరణ, పరిశోధన, వ్యవస్థాపకతకు కేంద్రంగా పనిచేస్తుంది. దీనిని విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తల బృందం నిర్వహిస్తుంది. కళాశాల మేనేజింగ్ కమిటీ ఛైర్మన్‌గా మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, వైస్ ఛైర్మన్‌గా మిట్టపల్లి చక్రవర్తి వ్యవహరిస్తున్నారు.

త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

పట్టణానికి త్రాగు నీరు సమీపంలోని శాంతినగర్ మంచినీటి చెఱువు నుండి పంపిణి జరుగుతుంది.నాగార్జున సాగర్ కుడి కాల్వ నుండి మంచినీటి చెఱువుకు సాగు నీరుతో నింపుతారు.

పేరు తెచ్చిన కట్టడాలు

[మార్చు]
భువునచంద్ర టౌన్ హాల్,నరసరావుపేట

భువనచంద్ర టౌన్ హాలు

[మార్చు]

ఇది స్థానిక ప్రకాశ్‌నగర్‌ వెళ్లు రోడ్డులో రైలుగేటు దాటిన తరువాత కుడివైపు ఉంది.భువనచంద్ర టౌన్ హాలు నిర్మాణం గావించిన స్థలం ఒకనాడు మూగజీవాలకు (పశువుల) ఆసుపత్రి కలిగిన ప్రదేశం.ఇది దాదాపుగా పట్టణం నడిబొడ్డున ఉంది.పశువులు మేపుకునే వారు సామాన్యంగా పట్టణానికి దూరంగా నివాసం ఉంటారు.పశువులకు వైద్యం చేయుంచుకోవటానికి అంత దూరం నుండి తోలుకొచ్చి వాటికి తగిన వైద్యం చేయించి తిరిగి తీసుకుపోవటం వ్యయ ప్రయాసలతో కూడినపని భావించి రైతులుఎక్కువమంది నివసించే పెద్ద చెరువు ప్రాంతానికి తరలించి, ఆ ప్రదేశంలో అన్ని హంగులతో ఒక సమావేశమందిరం నిర్మిస్తే బాగుంటుంది కదా! అని వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే 'భువనచంద్ర టౌనుహాలు'. క్రమక్రమంగా నరసరావుపేట పట్టణానికే అది సాంస్కృతిక కేంద్రంగా ఎదిగింది.2004 లో అదే ప్రాంగణంలో నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రారంభం అవటంతో టౌన్ హాలుకు పరిపూర్ణత చేకూరింది.

కన్యల ఆసుపత్రి

[మార్చు]

పేరు తెచ్చిన ప్రాంతాలు

[మార్చు]

మల్లమ్మ సెంటరు

[మార్చు]
మల్లమ్మ సెంటరు వద్ద పట్టణం ఏరియల్ వ్యూ

నరసరావుపేట పట్టణంలో, చుట్టు ప్రక్కల గ్రామాలలో, ఒకసారి నరసరావుపేట దర్శించిన ఇతర ప్రాంతాలవారెవరికైనా మల్లమ్మ సెంటరు అంటే తెలియనివారు ఉండరు.జమీందారీ పరిపాలనకు అద్దం పట్టిన రాజాగారి కోటకు అతి దగ్గరలో వినుకొండ, సత్తెనపల్లి, పల్నాడు, గుంటూరు వెళ్లే నాలుగు మార్గాలు కలిసే కూడలినే 'మల్లమ్మ సెంటరు' అని అంటారు. ఒక రకంగా చెప్పాలంటే పట్టణంలో ఇది ప్రధాన కూడలి.వీధులకు,పట్టణాలకు,ఇలాంటి జంక్షన్లకు రాచరికపు కుటుంబాలకు చెందిన వ్యక్తుల, జమీందారీ వంశీయులకు చెందిన వ్యక్తుల, స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టడం సాధారణమే. అలాంటి ఏకోవకు చెందని సామాన్య వక్తి పేరుతో ఒక కూడలికి మల్లమ్మ సెంటర్ అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం వెనుక ఒక మహిళ ఉందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు.ఈమె కేవలం చిన్న స్వీటు షాపు నడిపిన వ్యాపారి మాత్రమే.ఆమె పేరు చందనం మల్లమ్మ,భర్త కోటయ్య.ఈనాలుగు రోడ్డుల కూడలిలో గుంటూరు, సత్తెనపల్లి వెళ్లు రోడ్డుల కార్నర్ లోని ఒక చిన్న పెంకుటింటిలో 1945 ఫిబ్రవరిలో మిఠాయి దుకాణం ప్రారంభించారు. పట్టణంలో అప్పట్లో మొత్తం ఆరు మిఠాయి దుకాణాలు మాత్రమే ఉండేని.ఈమె దుకాణం నుండే రాజాగారికోటకు అవసరమైన మిఠాలు వెళ్లేవి.జమీందారు తనకు అవసరమైన మిఠాయి ఈ దంపతుల ద్వారా చేయుంచుకునేవారని తెలుస్తుంది.అంతేగాదు వీరు తయారు చేసే మిఠాయి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు గుర్రపు బండ్లపై వచ్చి తీసుకు వెళ్లటంతో మల్లమ్మ షాపు ప్రజలకు చాలా దగ్గర అయింది.ఆ తరువాత పెద్ద బజారుగా ఉన్న కూడలికి 1970  ఆ ప్రాంతం నుండి మల్లమ్మ సెంటరుగా పేరు వాడుక పడింది. 85 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు ఆమె షాపును నిర్వహించింది.వద్దాప్యంతో ఈమె 1990లో మృతి చెందగా, భర్త కోటయ్య 1980లో మృతి చెందాడు.ఇప్పటికీ అదే పేరుతో ఆమె వారసులు అదే సెంటరులో స్వీటు షాపులు నడుపుతున్నారు.  

  • శివుడి బొమ్మ సెంటరు
  • గడియారపు స్తంభం సెంటరు
  • రాజా గారి కోట సెంటరు
  • గాంధీ పార్కు సెంటరు

దర్శనీయ దేవాలయాలు

[మార్చు]
శివుడి బొమ్మ

శ్రీ భీమలింగేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వరస్వామివారి ఆలయం స్థానిక పాతూరులో 11వ శతాబ్దిలో ప్రతిష్ఠించిన ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులు, 2014,ఫిబ్రవరి-28న శిలాన్యాసం చేసి, ప్రారంభించారు. 2015 లో పూర్తి చేయాలని నిశ్చయించారు. ఈ ఆలయ శిల్పకళలో ద్రావిడ, చోళ రీతులకు విశిష్టస్థానం ఉంది. దేశంలోని పురాతన ఆలయాలన్నీ ఆయా శైలిలోనే నిర్మించారు. పూర్తిగా రాతితో ఆలయనిర్మాణం చేస్తున్నారు. అందుకుగాను బెంగళూరులో స్తంభాలు, ఇతర శిలలను తయారుచేస్తున్నారు. తెలుపు, గ్రే వర్ణాలు మిళితంగా ఉండే గ్రానైటు రాతిని నిర్మాణంలో ఉపయోగించుచున్నారు. ఆలయం పునాదులనుండి పైకప్పు వరకు రాతితోనూ, ఆపైన విమానశిఖరం తదితర నిర్మాణాలను సిమెంటుతోనూ తయారు చేస్తారు. పైకప్పు వరకు 15 పొరలుగా నిర్మాణం చేపట్టినారు. ఆలయం ఎత్తు 42 అడుగులు, పొడవు 52 అడుగుల వరకు ఉంటుంది. ప్రస్తుతం పైకప్పు వేసే స్థాయికి నిర్మించారు. కిటికీలు, ఆలయ రాతిగోడలకు అమర్చిన స్తంభాలు శిల్పుల నైపుణ్యానికి అద్దం పడుతున్నవి. తమిళనాడుకి చెందిన దేవాలయ నిర్మాణ నిపుణులు 10 మంది వరకు, ఈ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో, నిర్దేశించిన నియమాలు పాటించుచూ నిర్మాణం చేస్తున్నారు.[7]

శృంగేరి శంకరమఠం

[మార్చు]

స్థానిక ప్రకాశనగర్ వెళ్లు రోడ్డులో పూర్వపు రైలుగేటుకు ముందు ఎడమవైపున ఉంది.దీనిని పట్టణంలో నడయాడిన శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామిచే నిర్మించబడింది. అభినవ విద్యాతీర్థ మహాస్వామిజీ, భారతి తీర్థ మహాస్వామి ఆశీర్వాదాలతో, 1985 ఆగస్టు 25 న అప్పటి టిటిడి చైర్మన్ శ్రీ సత్యనారాయణ రాజు ఆలయ సముదాయానికి పునాదిరాయి వేశారు.[8] శంకరమఠం ప్రారంభ ఉత్సవాలు 1989 మే 17 నుండి 21 వరకు ఐదు  రోజులపాటు జరిగాయి.కార్యక్రమాలు ఐదు రోజులపాటు నిర్విరామంగా జరగటానికి పర్వేక్షణకుగాను శృంగేరి,బెంగుళూరు,మద్రాసు,బొంబాయి,హైదరాబాదు పట్టణాల నుండి 500 మంది శృంగేరిపీఠం శిష్యగణం తరలివచ్చి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీ శారదా శంకరుల మూర్తి ప్రతిష్ఠ,,కుంభాభిషేక మహోత్సవం, హోమగుండం కార్యక్రమాలు సకాలంలో చివరిరోజు 21వ తేది ఆదివారం భారతీతీర్ధ మహాస్వామి చేతులమీదుగా జరిగాయి.[9] ఈ సందర్భంగా భారతీతీర్ధ మహాస్వామి భక్తులను ఉద్దేశించి ప్రియభాషణ చేస్తూ ఆదిశంకరుల కోరికమేరకు శృంగేరిలో వెలసిన శ్రీ శారదాదేవి నరసరావుపేట భక్తజనుల అభీష్ఠం నేరవేరుస్తుందని చెప్పాడు. నరసరావుపేటకు చెందిన లంకా రామనాధం సోదరులు, మిన్నెకల్లుకు చెందిన కేతినేని వీరబ్రహ్మాలు శంకర మఠం నిర్మాణానికి భూదానం చేశారు.

నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్

[మార్చు]
ఇస్కాన్ ఆలయం, నరసరావుపేట

(ప్రధాన వ్యాసం:నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్)

స్థానిక బరంపేటలో ప్రస్తుతం ఇస్కాన్ టెంపుల్ నిర్మించిన ప్రదేశంలో 2019 నాటికి 40 సంవత్సరంల క్రిందట నుండి "రాధా కృష్ణ వాసుకి క్షేత్రం" అని పిలవబడే మందిరం ఉంది.2000 సంవత్సరంలో ఇస్కాన్ ఈ ప్రదేశంలో అందమైన ఆలయాన్ని నిర్మించే ప్రాజెక్టు ప్రారంభించి అన్ని హంగులతో 2012 మార్చి నాటికి పూర్తిచేసి, 2012 మార్చి 25న జయ పాథస్వామి గురు మహారాజ్ చే దేవతలను ఏర్పాటుచేసి ఆలయాన్ని ప్రారంభించుట జరిగింది. ఇక్కడ దేవతలు కిషోరభావాల్తో ఉన్నాయి. కాబట్టి అవి యవ్వనంగా, అందమైనవిగా కనిపిస్తాయి. యువతను ముఖ్యంగా పిల్లలను చాలా ఆకర్షిస్తాయి. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి రోజు రాధారాణి ఆవిర్భావదినోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.ఆసందర్భంగా అ రోజున రాథారాణి నిజపాద దర్శనం ఉదయం 8-30 నుండి రాత్రి వరకు, అనుమతిస్తారు.

ఇతర దేవాలయాలు

[మార్చు]
  • శ్రీ నీలా వేంకటేశ్వరస్వామివారి ఆలయం
  • శ్రీ విజయ చాముండేశ్వరీ దేవస్థానం
  • శ్రీ పాండురంగస్వామివారి ఆలయం
  • శ్రీ రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగస్వామివారి ఆలయం
  • శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం
  • శ్రీ ఆయ్యప్పస్వామివారి ఆలయం:ఈ ఆలయం సత్తెనపల్లి వెళ్లు రహదారిలో ఉంది.ఆలయం ముఖద్వారంతో నిర్మించారు.
  • శ్రీ ఆంజనేయస్వామివారి దేవాలయం:శ్రీ ప్రసన్నఆంజనేయస్వామివారి దేవాలయం స్థానిక బరంపేటలో1932 సంవత్సరంలో నిర్మించబడింది.

సమీప దర్శించతగిన పుణ్యక్షేత్రాలు

[మార్చు]

శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం (కోటప్పకొండ)

[మార్చు]

ప్రధాన వ్యాసం:కోటప్పకొండ

గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలంలోని శైవక్షేత్రం. (కోటప్పకొండ)
త్రికోటేశ్వరుని ప్రధాన ఆలయం ముఖ ద్వారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరుపొందిన శైవక్షేత్రాలలో కోటప్పకొండ ఒకటి.ఇది పట్టణానికి 12 కి.మీదూరంలో ఉంది.ఈ ఆలయం కొండపైన ఉంది.ఇక్కడి స్వామి ఆలయం శ్రీ మేధా దక్షిణామూర్తి అవతార రూపమైన త్రికోటేశ్వరునికి ఆవాసం.ఇంకా భక్తులు స్వామిని కోటయ్య స్వామి భక్తులు కొలుస్తుంటారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ తిరునాళ్ల వైభవంగా జరుగుతుంది.పూర్వం నుండి శివరాత్రి రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి భక్తులు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం కొండ పైకి వెళ్లుటకు మెట్ల మార్గమే కానీ వావానాలు వెళ్లటానికి రోడ్డు సౌకర్యం ఉండేదికాదు. వృద్ధులుతో సైతం భక్తులు కష్టపడి మెట్ల మార్గంలో నడకతో వెళ్లవలసి వచ్చేది.మెట్లపై వెళ్లేటప్పుడు ఉత్సాహంతో హరహరా చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్యా అంటూ త్రికోటేశ్వరుని దర్శనానికి వెళ్లేవారు.గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేని కాలంలో గ్రామాల నుండి ప్రభలు కట్టుకుని పుష్టి కలిగిన ఎద్దుల జతలతో ప్రత్యేకంగా కలిగిన బండిపై ప్రభలను ఏర్పాటు చేసుకోని భక్తులు శివనామస్మరణ చేస్తూ ఊరేగింపుగా డప్పు వాయిద్యాలు,డ్యాన్సులతో ఒకరోజు ముందుగా బయలుదేరి శివరాత్రి ఉత్సవానికి వచ్చేవారు.విద్యుత్ స్తంబాల ప్రభావం వలన క్రమంగా ప్రభలు కట్టుకునే వచ్చే సంప్రదాయం తగ్గుతూ వచ్చింది. జాతీయోద్యమకాలంలో జాతీయ నేతల చిత్రపటాలతో, మతసామరస్యాన్ని, జాతీయ సమైక్యతను ప్రతిబింభించే చిత్రపటాలతో కుల మతాలకు అతీతంగా ప్రభలను అలంకరించుకుని ఉత్సవాన్ని వచ్చేవారు.కొండ పైకి వెళ్ళే దారిలో మెట్ల దారి దగ్గర విఘ్నేశ్వరుడి గుడి ఉంది.కొండ మీద గొల్లభామ గుడి ఉంది.పెద్ద శివుని విగ్రహం ఉంది. రాజా మల్రాజు వంశీయులలో ఒకరైన నరసింహరావు దేవస్థానం ధర్మకర్తగా పనిచేసిన కాలంలో 740 మెట్లతో మార్గాన్ని నిర్మించబడింది.మల్రాజు వంశీయుల జమీందార్లు ఆలయానికి భూములు దానంగా ఇచ్చారు.ఇప్పటికీ (2019 నాటికి) ఆలయ ధర్మకర్తలుగా మల్రాజు వంశీయులే కొనసాగుచున్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి (విభజనానంతరం) కోడెల శివప్రసాదరావు చేసిన కృషితో రాష్ట్రంలోనే పోరొందిన ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా కొటప్పకొండ అభివృద్ధి చెందింది.

శ్రీ కపోతేశ్వరస్వామి ఆలయం (చేజర్ల)

[మార్చు]

ఈ ఆలయం సమీప నకిరకల్లు మండలానికి చెందిన చేజర్ల గ్రామంలో ఉంది.ఇది నరసరావుపేటకు సుమారు 30 కి.మీ.దూరంలో ఉంది.ఈ ఆలయాన్ని కపోతేశ్వరాలయం అని అంటారు.ఈ ఆలయానికి ఆ పేరుతో పిలవటానికి మహా భారతం ప్రకారం ఒక కథ ఉంది. మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు ఇద్దరు సోదరులు.మేఘదాంబరుడు శిబిచక్రవర్తి అనుమతితో అతని పరివారంతో తీర్ధయాత్రలకు బయలుదేరతాడు. ఒక కొండపై అతడు  కొందరు యోగులతో కలసి తపస్సు చేస్తూ కాలం చేస్తాడు. కొండపై అతని పార్థీవ శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది.మేఘదాంబరుడు తిరిగి రానందున అన్నను వెదుకుతూ జీమూతవాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండవద్దకు వస్తాడు. అన్నకు జరిగిన విషయం విని ఆకొండపైనే తపమాచరించి అతనూ మరణించాడు. తమ్ముళ్ళును వెతుక్కుంటూ శిబి చక్రవర్తి అక్కడికి వచ్చి రెండు లింగాలను చూసి, తన్మయం చెంది అక్కడ నూరు యజ్ఞాలు చేయ సంకల్పించాడు. నూరవ యాగం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షీస్తారు. పరీక్షలో భాగంగా శివుడు వేటగానిగా, బ్రహ్మ విల్లు బాణంగా, విష్ణువు కపోతంగానూ ఆ ప్రాంతానికి వస్తారు.వేటగానితో తరమబడిన పావురం శిబి చక్రవర్తిని రక్షించవలసిందిగా శిబి చక్రవర్తి అభయమిస్తాడు. అక్కడికి వేటగాడు వచ్చి ఆపావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను, తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని శిభిచక్రవర్తిని వేడుకుంటాడు. శిబి ఇరకాటంలో పడ్డాడు. చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగానిని ఒప్పించి, త్రాసులో పావురాన్ని ఒక వైపు ఉంచి, తన శరీరంలో కొంత మాంసాన్ని రెండవవైపు ఉంచాడు. సరి తూగలేదు. చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టించాడు. అతని త్యాగ శీలతకు మెచ్చి దేవతలు అతనిని పునరుజ్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు. తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకొన్నాడు. పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు. అలా తల లేని శిబి చక్రవర్తి మొండెమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం.దీని మీద ఇతరత్రా కథనాలు కూడా ఉన్నాయి

పీఠాధిపతుల నిలయం

[మార్చు]

భారతీ తీర్థ మహాస్వామి (శృంగేరి పీఠాధిపతి)

[మార్చు]
భారతీ తీర్థ మహాస్వామి.శృంగేరీ పీఠాధిపతి

శృంగేరీ శారదా పీఠం 36వ పరమాచార్యులు భారతీ తీర్థ మహాస్వామి పూర్వీకులు తొలుత గుంటూరు జిల్లా, పల్నాడు ప్రాంతంలో నాగులేరు నదీ తీరాన ఉన్న అలుగుమల్లిపాడు గ్రామానికి చెందినవారు. అలుగు మల్లిపాడు గ్రామంలో తంగిరాల వారిది వైదికాచార కుటుంబం.తల్లిదండ్రులు వెంకటేశ్వరధాని,అనంతలక్ష్మమ్మ.వీరు కృష్ణయజు:శాఖీయులు, ఆపస్తంబసూత్రలు, కుత్సస గోత్రులు.వీరికి మొదట సంతానంగా ఇద్దరు కుమార్తెలు.పుత్ర సంతానం లేని కారణంగా పుత్రుడు కలగాలని శివారాధన చేశారు.పురుష సంతతి కలిగితే నీ పేరు పెట్టుకుంటామని శ్రీరామ చంద్రుడికి మొక్కుకుని, శ్రీరామ నవమి ఉత్సవాలు తొమ్మిది రోజులుపాటు భక్తి శ్రద్ధలుతో నిర్వహించారు.ఆ కాలంలో వెంకటేశ్వరధాని, అనంతలక్ష్మమ్మ దంపతులు మచిలీపట్నంలో ఉండేవారు.వారు కోరుకున్నట్లే భగవదనుగ్రహం వల్ల శ్రీరామ నవమి ఇంకా మూడు రోజులు ఉందనగా భావనామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠినాడు అనగా 1951 ఏప్రియల్ 11న మచిలీపట్నంలో అనంతలక్ష్మమ్మకు మగబిడ్డ కలిగాడు.సీతారాముల అనుగ్రహం వలన కుమారుడు జన్మించాడని భావించి ఆ బిడ్దకు సీతారామాంజనేయులు అని నామకరణం గావించారు.భారతీ తీర్థ మహాస్వామికి సంవత్సరం వయసు నిండీ,నిండకముందే నరసరావుపేటలో తంగిరాల కుటుంబం స్థిర నివాసం ఏర్పరచుకొని స్థానిక రామిరెడ్డిపేటలో నివసించినట్లుగా తెలుస్తుంది.[10] స్వామి చిన్నప్పటి నుండే భక్తిభావాలను ప్రదర్శించేవారు. వేదాధ్యయనం తండ్రిగారి వద్ద ప్రారంభించి, తరువాతి కాలంలో ప్రతాపగిరి శివరామశాస్త్రి వద్ద సంస్కృతాంధ్రాల్ని నేర్చుకున్నాడు.ఇతను ఏకసంథాగ్రాహి.1989 అక్టోబరు 19న 36 వ జగద్గురు శంకరాచార్యగా అతీంద్రియ జ్ఞానం యొక్క సింహాసనం అధిరోహణతో పట్టాభిషిక్తులై శృంగేరి శారద పీఠాధిపత్యాన్ని వహించాడు.[11]

చిదానంద భారతీ స్వామి (శ్రీ భువనేశ్వరీ పీఠాధిపతి)

[మార్చు]

దమ్మాలపాడు గ్రామంలో 1913లో జన్మించిన ఇతని అసలుపేరు దమ్మాలపాటి శేషగిరిరావు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం,దమ్మాలపాడులో 1913లో జన్మించాడు. తిరుపతి యస్.వి. సంస్కృత కళాశాలలో సాహిత్య శిరోమణి - ప్రిలిమనరీ చదివాడు.ఆతరువాత మద్రాసులోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో సాహిత్య శిరోమణిగా ఉత్తీర్ణత పొందాడు. నరసరావుపేట మునిసిపల్ ఉన్నత పాఠశాలలో1952 నుండి 1968 వరకు సృస్కృత పండితులుగా పనిచేశాడు. తరువాత కొంత కాలంగా పట్టణంలోని శ్రీ రామకృష్ణా ఓరియంటల్ కళాశాలలో సంసృత ఉపన్యాసకులుగా పనిచేశాడు.గన్నవరంలోని శృంగేరీ విరూపాక్ష సంప్రదాయానికి చెందిన భువనేశ్వరీ పీఠం పీఠాధిపతిగా 1986లో పట్టాభిషిక్తుడయ్యాడు.[12]

పట్టణంలో పేరొందిన వ్యక్తులు

[మార్చు]

గన్నమనేని లింగమనాయుడు, సీనియర్ పాత్రికేయుడు 1920-2016

.

మూలాలు

[మార్చు]
  1. http://narasaraopet.cdma.ap.gov.in/node/104. {{cite web}}: Missing or empty |title= (help)
  2. ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  3. http://censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=668347. {{cite web}}: Missing or empty |title= (help)
  4. "Narasaraopet Municipality 100 Years Celebrations in Guntur on 11,12,13th Dec". NTv.
  5. "Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.
  6. "Basic Information of Municipality". Municipal Administration & Urban Development Department. Government of Andhra Pradesh. Archived from the original on 17 October 2014. Retrieved 20 June 2015.
  7. ఈనాడు గుంటూరు రూరల్; 2014,సెప్టెంబరు-21; 20వపేజీ
  8. "Narasaraopet". Sringeri Sharada Peetham (in ఇంగ్లీష్). Retrieved 2019-09-25.
  9. నరసరావుపేట శంకరమఠంలో వైభవోపేతంగా ఉత్సవం,1989 మే 22 ఈనాడు దినపత్రిక 8వ పేజి
  10. "భారతీ తీర్థుని పుట్టిల్లు..నరసరావుపేట". web.archive.org. 2019-10-22. Archived from the original on 2019-10-22. Retrieved 2019-10-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  11. "Sri Bharati Tirtha Mahaswamiji - Sringeri Sharada Peetham". web.archive.org. 2019-10-22. Archived from the original on 2019-10-22. Retrieved 2019-10-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  12. మూలం:నరసరావుపేట ద్విశతాబ్థి ఉత్సవాల ప్రత్యేక సంచిక 33వ పేజీ

ఇవి కూడా చూడండి

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]