కోడెల శివప్రసాదరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోడెల శివప్రసాదరావు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2014 - 2019
ముందు ఎర్రం వెంకటేశ్వర రెడ్డి
నియోజకవర్గము సత్తెనపల్లి, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి
పదవీ కాలము
2014 – 2019
గవర్నరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్

నర్సరావుపేట శాసనసభ సభ్యుడు
నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1978-1983
ముందు కాసు వెంకటకృష్ణారెడ్డి
తరువాత కాసు వెంకటకృష్ణారెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం (1947-05-02) 1947 మే 2 (వయస్సు: 72  సంవత్సరాలు)
కండ్లగుంట,నకరికల్లు మండలం, గుంటూరు జిల్లా
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి శశికళ
సంతానము శివరామకృష్ణ, సత్యన్నారాయణ, విజయలక్ష్మి
నివాసము నర్సరావుపేట లో కోట, ఆంధ్రప్రదేశ్
మతం హిందూమతము

డాక్టర్ కోడెల గా అందరికి బాగా పరిచయస్తులు. కోడెల శివప్రసాదరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మరియు ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నుకోబడిన తొలి శాసనసభాపతి. 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలైనా, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశాడు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2వ తేదీన కోడెల శివప్రసాదరావు జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆయన 5వ తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివాడు. కొద్దిరోజులు సిరిపురంలో, ఆ తర్వాత నర్సరావుపేటలో పదవ తరగతి పూర్తి చేసిన ఆయన విజయవాడ లయోలా కళాశాల పీయూసీ చదివాడు. చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆర్ధిక స్తోమత అంతంతమాత్రమే ఉన్న ఆరోజుల్లో వైద్యవిద్య ఆలోచనే ఓ సాహసం. తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించడానికి ముందడుగు వేసాడు. కానీ ఆ మార్కులకు మెడికల్ సీటు రాలేదు. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరాడు. రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇక వారణాసిలో ఎం.ఎస్ చదివాడు. పల్నాడులో కొత్త అధ్యాయం లిఖించడానికి నరసరావుపేటలో హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు. వైద్యవృత్తిని ఎప్పుడూ సంపాదన మార్గంగా చూడలేదు. అందుకే ఆపదలో ఉన్నవారు జేబులో డబ్బు ఉందా లేదా అని ఆలోచించరు. మా డాక్టర్ కోడెల గారు ఉన్నారన్న ధైర్యంతో కోటలోని కోడెల ఆసుపత్రి గడప తొక్కుతారు. ఆయన హస్తవాసి గొప్పదని ఇప్పటికి చెప్పుకుంటారు. అలా పల్నాడులో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరికో పునర్జన్మ ప్రసాదించారు. తిరుగులేని సర్జన్ గా కీర్తిగడించిన డాక్టర్ కోడెలపై అన్న ఎన్టీఆర్ దృష్టి పడింది. పల్నాడులో అప్పటికే రాజ్యమేలుతున్న రాజకీయ అరాచకాలకు డాక్టర్ కోడెల శివప్రసాదరావే దివ్య ఔషదంగా భావించి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్యానించారు. ఇష్టం లేకపోయినప్పటికీ, వైద్యవృత్తి తారాస్థాయిలో ఉన్నప్పటికీ అన్నగారి పిలుపుమేరకు 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరి మొదటిసారిగా అతడు నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే.. మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. కోడెల భార్య శశికళ గృహిణి కాగా, వీరికి ముగ్గురు పిల్లలు (విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ). ముగ్గురు కూడా డాక్టర్ వృత్తిలోనే ఉన్నారు.

వైద్యవృత్తి[మార్చు]

సత్తెనపల్లిలో రావెల వెంకట్రావు అనే వైద్యుడి దగ్గర కొంతకాలం అప్రెంటీస్ గా ప్రాక్టీసు మొదలుపెట్టాడు. అతని దగ్గరకు గ్రామీణులే అధికంగా వచ్చేవారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన కోడెల శివప్రసాదరావు తను చదివిన వైద్యవిద్యతో గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో తన స్వంత ఆసుపత్రిని గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్థాపించాడు. వాళ్ళ అభిమానంతో పల్నాడు ప్రాంతంలో మంచి డాక్టరుగా పేరు తెచ్చుకున్నాడు. అనతికాలంలోనే ఆసుపత్రికి వచ్చిన రోగులపట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపటమే కాకుండా ఉత్తమ ఔషధాలు అందిస్తూ, నమ్మకమైన సేవలందిస్తూ, మంచి సర్జన్‌గా పేరుగావించి, మనస్సున్న మారాజుగా మన్ననలు పొంది, వృత్తి ధర్మానికి న్యాయం చేస్తూ.. డాక్టర్ కోడెల గా గుర్తింపు పొందారు.

రాజకీయ జీవితం[మార్చు]

 • తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావు అప్పట్లో గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు డాక్టర్ కోడెల ఆయన దృష్టిలో పడ్డాడు. అతను పోటీ చేయటానికి ఇష్టపడక పోయినప్పటికీ, నందమూరి తారకా రామారావు 1983 లో ఎన్నికలలో పోటీ చేయటానికి ప్రేరేపించారు. డాక్టర్ కోడెల అప్పటి ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వరుస విజయాలు నమోదు చేశారు డాక్టర్ కోడెల.
 • 2004, 2009 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారానికి దూరమైనప్పుడు వరుస పరాజయాలు చవిచూశాడు.
 • డాక్టర్ కోడెల రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి విజయం సాదించాడు.
 • నర్సరావుపేటలో తాగునీటి వ్యవస్థ అభివృద్ధి చేయబడడంతో, తరువాత ఇరవై సంవత్సరాలకు త్రాగునీటి సమస్యలను పరిష్కరించగలిగాడు.
 • కోటప్పకొండను అభివృద్ది చేయడంలో భాగంగా ఎన్నో నిధులు మంజూరు చేయి౦చి, ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఈ క్షేత్రాన్ని సుందర సౌందర్యముగా అభివృద్ధి చేయడమే కాకుండా, పరమ శివుడే మేధో దక్షిణామూర్తి గా వెలిసిన క్షేత్రం కావడంతో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత స్థితి పొండుతారనే భావంతో, ఈ జ్ఞానప్రదాత సన్నిదిని ఓ సామూహిక అక్షరాభ్యాస కేంద్రంగా తీర్చిదిద్దుటంతో లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. సామూహిక అక్షరాభ్యాస సమయంలో ప్రతి బాలుడికి పెద్దబాలశిక్ష, మేధో దక్షిణామూర్తి రూపులు, కంకణాలు అందిస్తారు.
 • డాక్టర్ కోడెల... కాకలు తీరిన తెలుగుదేశం సీనియర్ నాయకులు. గుంటూరు జిల్లాలో దశాబ్దాలుగా నర్సరావుపేట కేంద్రంగా కోటలో రాజకీయ వ్యూహాలు రచిస్తూ, రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్రవేస్తూ పల్నాటిపులిగా పేరుగాంచి, అభివృద్ధి ప్రదాతగా నిలిచి, స్పూర్తి ప్రదాతగా ఉన్నారు. అభివృద్ధితోనే అంతరాలు తోలుగుతాయని భావిస్తారు డాక్టర్ కోడెల.
 • గ్రామ ఐక్యత, సానుకూల దృక్పధంతో గ్రామాభివృద్ది సాధించవచ్చు అని డాక్టర్ కోడెల శివప్రసాదరావు జన్మభూమిపై మమకారంతో గ్రామస్తులు మరియు దేశ విదేశాలలో స్థిరపడిన వారందరి సహాయ సహకారాలతో గ్రామాభివృద్దే ద్యేయంగా “ఐక్యత–అభివృద్ధి” నినాదంతో గ్రామస్తులందరూ కలసి మెలసి ఒక ప్రణాళికను రూపొందిచుకుని, ముందు ఊరికి గల లోటుపాట్లను ఒక క్రమ పద్దతిలో రాసుకుని, తర్వాత ఒక్కొక్కటిగా పనులను మొదలు పెట్టడానికి ప్రేమ ఆప్యాయతలతో ఓ ప్రత్యేక ఆత్మీయ సమావేశంను "పల్లెకు పోదాం..." అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ రోజు ఆనవాయితీగా జరుపుతారు.

నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు[మార్చు]

చదువు

సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు[మార్చు]

గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం నిరూపించింది. ఇదొక అపూర్వ ప్రయోగం. ఇలా మరెక్కడా జరగలేదు కనుకనే యూనిసెఫ్‌, వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రయోగాన్ని అధ్యయనం చేయటానికి ప్రతినిధులను ప్రచారం లేకుండా పంపించాయి. విదేశీ దౌత్యాధికారులు సైతం ఆసక్తి చూపారు. గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తించింది, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ జాతీయ స్థాయిలో ఒక రికార్డుగా నమోదు చేసింది.

ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ అభివృద్ధిని చేసి చూపించటం ఎలా సాధ్యమైందనేది తెలుసుకోవలసిన వ్యూహం. అభివృద్ధి గురించి మాట్లాడుకొనేటప్పుడు సాధారణంగా మరుగుదొడ్లను గురించి ప్రస్తావనలు రావు. అల్పమైన, అసహ్యకరమైన విషయంగా చాలామంది మనస్సులలో ఒక ముద్ర ఏర్పడి ఉంటుంది. కాని, అది ప్రతి ఒక్కరికి అవసరమైన సౌకర్యం. పట్టణాలలో గృహనిర్మాణం జరిగేటప్పుడే మరుగుదొడ్ల ఆలోచనలు చేసి, తగిన విధంగా సౌకర్యాలు కల్పించుకొంటారు. కాని, గ్రామాలలో ఎప్పటినుంచో ఉన్న పాత ఇళ్లలో, పూరిపాకలలో మరుగుదొడ్ల సౌకర్యం ఉండదు. కాని పల్లెలలోనూ ఇప్పుడిప్పుడే ఒకింత మార్పు వస్తున్నది. కొత్త ఇళ్లల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకొంటున్నారు. కానీ, ఈ మార్పు చాలదు. చాలా ఇళ్లకు, ముఖ్యంగా పేదల పూరిండ్లకు నేటికీ అది అందుబాటులో లేని సౌకర్యమే. కాలకృత్యాల కోసం గ్రామాల్లో చెరువుకట్టకో, రహదార్ల పక్కకో, మరో బాహ్య ప్రదేశానికో పోవటం సర్వసాధారణం.

ముఖ్యంగా ఆడవాళ్లు ఎన్నో అవస్థలు పడుతుంటారు. ఇది స్త్రీల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని పంచాయతీ పెద్దలకూ శాసనకర్తలకూ తెలుసు. ఐనా, అలవాటుపడిపోయిన సమస్యలెమ్మని పట్టించుకోరు. పట్టణాలలోనూ, కొన్ని గ్రామాలలోనూ ఒకటో రెండో ‘సులభ్‌ శౌచాలయాలు’ (పబ్లిక్‌ లెట్రిన్స్‌) కొత్తగా ఏర్పడ్డాయి. కాని, నిర్వహణ లోపం వల్లనేమి అలవాటులేని ప్రజల వైముఖ్యం వల్లనేమి ఎక్కువ భాగం నిరుపయోగంగా ఉంటున్నాయి. మరుగుదొడ్ల ఏర్పాటు మొదటి అంశం.

అసహ్యకరం అనుకొని మరుగుదొడ్లను గురించి మాట్లాడుకోకపోవటం వలెనే, భయంవల్ల కొందరూ, అశుభం అనుకోవటం వల్ల మరికొందరూ శ్మశానాలను గురించి మాట్లాడరు. ప్రతి ఒక్కరు తుదకు చేరవలసిన చోటు అదేనని అందరికీ తెలుసు. ఐనా, శ్మశానాలను బాగుచేసుకొందామనే ఆలోచనలు రావు, వచ్చినా ఎవరికి వారు మనకెందుకు లెమ్మనుకొంటారు. సమష్టి ప్రయత్నాలు చేయరు. ఇది రెండవది.

మరొకటి, పల్లెసీమలో పారిశుద్ధ్యలోపం. మురికి వాతావరణం వల్ల జబ్బులు వస్తుండటం అందరికీ తెలిసిన సంగతే. ఎవరి ఇంటిని వారు శుభ్రంగా ఉంచుకుంటారేమోగాని వీధులు, పరిసరాలను గురించి పట్టించుకోరు.

ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గం మరుగుదొడ్లు, శ్మశానాలు, మురికి తొలగింపులపై ప్రత్యేక దృష్టి సారించారు. మిగతా అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం, శ్మశానాల ఆధునికీకరణ, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనే మూడింటిని ఉద్యమ స్థాయిలో చేపట్టారు. ఉద్యమ రూపకర్త స్థానిక శాసనసభ్యుడైన స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ఈ కార్యక్రమాలను ప్రారంభించే ముందు పెద్ద బహిరంగ సభ జరిపి ప్రజలను చైతన్యపరిచారు. మారని వారెవరైనా ఉంటే స్థానిక నాయకులు ద్వారా చెప్పించి నియోజకవర్గంలో గుణాత్మకమైన మార్పు వచ్చేటట్లు చేసి నియోజకవర్గంలో నవ్య వాతావరణంను నెలకోల్పారు.

కేవలం మూడున్నర నెలల వ్యవధిలో సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో సుమారు ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు ఇరవై ఒక్క వేల మరుగుదొడ్లను నిర్మించారు. ఈ నాలుగు మండలాలూ, ఇంకా నరసరావుపేట, రొంపిచర్ల మండలాలలోనూ 398 శ్మశానాలను ఆధునికీకరించారు. శ్మశానాల రూపురేఖలు మారిపోయాయి. హిందూ శ్మశానాలకు స్వర్గపురాలని పేరుపెట్టారు. అంత్యక్రియలు జరపటానికైనా, తరువాత జరిగే కర్మకాండ కోసమైనా ఉపయోగపడే విధంగా సౌకర్యాలు ఏర్పడ్డాయి. యజ్ఞశాలను పోలిన దహనవాటికలు నిర్మించారు. స్నానాల కోసం నీటి వసతి కల్పించారు, దుస్తులు మార్చుకోవటానికి గది కట్టించారు. ఉద్యానమనిపించే విధంగా చెట్లు, మొక్కలు పెంచారు. శ్మశానం చుట్టూ గోడ, పవిత్రప్రదేశమని స్ఫురింపజేసే ప్రవేశద్వారం నిర్మించారు. ఇవిగాక శ్మశానానికి వెళ్లే దోవను చక్కని రోడ్డుగా మార్చారు. అంత్యక్రియలు చూడవచ్చే బంధుజనం కోసం బెంచీలు ఏర్పాటు చేసారు. ఏ మతంవారి శ్మశానాలు వారికి ఉన్నాయి కనుక అన్నింటినీ వారివారి విశ్వాసాలకు తగిన రీతిలో ఆధునికీకరించారు.

నియోజకవర్గం అంతటా పారిశుద్ధ్య కార్యక్రమం అమలు జరిగింది. స్వచ్ఛమేవ జయతే అంటూ ప్రజలు స్వచ్ఛందంగా అభివృద్ధి కృషిలో పాల్గొన్నారు. స్వచ్ఛ సత్తెనపల్లి రూపొందింది. ఒక విశేషం ఏమిటంటే– ప్రధాన మంత్రి మోదీ జాతీయ స్థాయిలో ప్రకటించిన స్వచ్ఛభారత్‌ ఉద్యమానికి చాలా ముందే సత్తెనపల్లి నియోజకవర్గంలో స్వచ్ఛసాధన కార్యక్రమం మొదలై దేశానికి మార్గదర్శకమైంది. ప్రధానమంత్రి కార్యాలయం ప్రతినిధి ఒకరు నియోజకవర్గాన్ని చూసి వెళ్లారు. మంచి ఎక్కడున్నా ఎవరు చేసినా చూసి హర్షించవలసిందే, అనుసరించవలసిందే.

రక్షిత మంచినీటి సదుపాయం, గ్రామాల్లో సిమెంటు రోడ్లు, వైద్య సౌకర్యాలు, చెరువు పూడిక తీయటం, ఇంకుడు గుంతలు, చెట్లు పెంచటం ఇతర నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంటాయి గాని సత్తెనపల్లిలో అమలు జరిగినవి కొన్ని ప్రత్యేకతలను సంతరించుకొన్నాయి. ఉదాహరణకు పూడికతీయటంతో పాటు చెరువు కట్టలను అందంగా తీర్చిదిద్ది, ప్రజలు సాయంత్రం వేళ వాహ్యాళికి వెళ్లి కూర్చునే విధంగా (హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ నమూనాలో) ఆకర్షణీయం చే‍సారు. ఐదంటే ఐదు రోజుల్లో యాభైవేల ఇంకుడు గుంతలు తవ్వించారు. ప్రతి గ్రామంలోనూ ఆర్.ఓ. (రివర్స్‌ ఆస్మోసిస్‌) యంత్రాలను ఏర్పాటుచేసి త్రాగునీరు వసతి కల్పించారు. గ్రామాల్లో చాలాకాలం నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ, ఎస్టీ కాలనీల కోసం ఒక్కొక్క గ్రామానికి ఇరవై లక్షల రూపాయల వంతున కేటాయించారు. ఇంత భారీ మొత్తాలు మునుపెన్నడూ ఇవ్వలేదు. సత్తెనపల్లి మునిసిపాలిటీ రాష్ట్రం మొత్తంలోకి ఆదర్శ (మోడల్‌) పురపాలక సంఘంగా ఎంపికైంది. చిన్న పట్టణమైనా వీధి దీపాలుగా ఎల్‌ఈడీ లైట్లూ, వాకింగ్‌ ట్రాక్‌, పార్కులు, సర్వత్రా పచ్చదనం, అతిథిగృహాలు, ఆటస్థలం, కళాశాలలకు కొత్త భవనాలు, కొత్తదనంతో వావిలాల ఘాట్‌, వందపడకల ఆస్పత్రి (విస్తరణలో) మొదలైనవి మునిసిపాలిటీకి గుర్తింపు తెచ్చాయి.

ఇన్ని పథకాలకు, కార్యక్రమాలకు డబ్బు లేకపోవటం ప్రతిబంధకం కాలేదు. ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటులు, శాసనసభ్యుడి నియోజకవర్గ నిధులు, ఇవిగాక డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మిత్రుల నుంచి, అభిమానుల నుంచి సేకరించిన విరాళాలు ధనం లేదనే సమస్య తలెత్తకుండా చేసాయి. ఈ కృషిలో ఆయనకు కుటుంబ సహకారం కూడా ఉంది. గ్రామాల్లో ఆర్‌.ఓ. ప్లాంటులను ఏర్పాటు చేసింది డాక్టర్‌ కోడెల సత్యనారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ శివప్రసాదరావు గారి కుమారుడు డాక్టర్‌ శివరామకృష్ణ. ఆయన సత్తెనపల్లిలోనే గాక, శివప్రసాదరావు గారికి దీర్ఘకాలంగా అనుబంధం ఉన్న నరసరావుపేట నియోజకవర్గంలో సైతం గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. వేలాది మందికి చికిత్స జరిగింది. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే పెద్ద ఆస్పత్రులకు పంపేటట్లు సహాయం చేసారు.

ప్రజలు సహకరించటం అంటే అన్ని వర్గాల ప్రజలు సహకరించటమే. ఇంతమందికి ఇలా ఎన్నో విధాల మేలు జరిగింది కనుకనే సత్తెనపల్లి నియోజకవర్గం ప్రత్యేకత సాధించింది. సత్తెనపల్లి విజయంగా ‘అమరావతి మీడియా సొల్యూషన్స్’ సంస్థ తన ప్రచురణలో అభివర్ణించిన ఈ ఘనత– నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుకు చెందుతుంది. సత్తెనపల్లి విజయ సూత్రం, మంత్రం కులమతాలకూ, రాజకీయాలకూ అతీతంగా అన్ని గ్రామాలకూ, అన్ని ఇళ్లకూ, వారాలలోనో, నెలలలోనో పథకాలను అమలుజరిపి అభివృద్ధి ఫలాలను అందించడంతో అభివృద్ధి ప్రదాతగా నిలిచి, అభివృద్ధిలో దేశానికే స్పూర్తి ప్రదాతగా నిలిచారు.

సంక్షేమ కార్యక్రమాలు[మార్చు]

చదువు

హోం మంత్రిత్వ శాఖ[మార్చు]

 • గుంటూరు జిల్లా టీడీపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన కోడెల 1987లో ఎన్టీఆర్ కేబినెట్లో హోం మంత్రిత్వ శాఖను ఆఫర్ చేసాడు. తొలి ప్రయత్నంగా హోం మంత్రిత్వ శాఖను అందించడం దేశంలోనే రికార్డు.

నీటిపారుదల శాఖ మంత్రిత్వ శాఖ[మార్చు]

 • నీటిపారుదల మంత్రి, ఆల్మట్టి సమస్య జాతీయ స్థాయిలో, నేషనల్ ప్రెస్ వద్ద చేపట్టాడు.డాక్టర్ కోడెల. అతను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్.టి. రామరావు చేత పులిచింతల ప్రాజెక్ట్ కొరకు శంకుస్థాపన చేయబడింది.

పంచాయితీ రాజ్[మార్చు]

 • 1995,1999ల్లో చంద్రబాబు పరిపాలనాలో పౌర సరఫరాలు, పంచాయితీ రాజ్, ఆరోగ్యం మరియు ఇరిగేషన్ వంటి చాలా ప్రతిష్టాత్మకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించాడు.
 • పంచాయితీ రాజ్ శాఖలో నాలుగున్నర లక్షల డ్వాక్రా గ్రూపులును స్థాపించి, పరిపూర్ణ వ్యవస్థలగా అభివృద్ధి పరచడంతో గ్రామ పంచాయితీ సర్పంచ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ల నుండి ప్రశంసలు అందుకున్నాడు.

పౌర సరఫరాల శాఖ మంత్రిత్వ శాఖ[మార్చు]

 • పౌర సరఫరాల శాఖలో పంపిణీ వ్యవస్థను దోషరహితంగా తీర్చిదిద్ధటంతో ప్రభుత్వ నుండి తన వాటాను పౌరులు పూర్తిగా పొందగలిగారు.

వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ[మార్చు]

 • ఆరోగ్యం మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయి సేవలందిస్తూ, అత్యంత సరసమైన రీతిలో ప్రజలకు క్యాన్సర్ చికిత్స అందించడంలో అతను కీలక పాత్ర పోషించాచు. ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అప్పటి ప్రధాన మంత్రి వాజపేయి ప్రారంభించాడు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి[మార్చు]

 • స్వచ్చ ఆంధ్రప్రదేశ్లో భాగంగా డాక్టర్ కోడెల శివ ప్రసాద రావు అతని నియోజకవర్గంలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాల్లో చొరవ చూపించి దేశానికే ఈ నియోజకవర్గం ఒక దిక్సూచిగా నిలిపారు.
 • ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్న శ్మశానాలను బాగుచేసుకోవడం కనీస అవసరం అని భావించి, 2015-18 సంవత్సరాలలొ గ్రామీణస్థాయి నేతలూ, ఆయా గ్రామాల ప్రజల చేయూతతో పాటు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యమూ, ఆయన సహకారంతో ప్రారంభించిన ‘స్వర్గపురి’ కార్యక్రమం ద్వారా ఏ-రహదారి, బీ-బోరింగ్‌, సీ- ప్రహరీ నిర్మాణం, డీ- కర్మకాండల నిర్వహణ గది, ఈ- మెరకతోలడం, ఎఫ్‌- దహనసంస్కారాల షెడ్‌, జీ- పచ్చదనం... ఇలా ఆంగ్ల అక్షరమాలలోని ఒక్కో అక్షరాన్నీ శ్మశానంలో చెయ్యవలసిన ఒక్కో పనికి గుర్తుగా పెట్టుకుని స్వర్గపురి కమిటీ, వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నిధుల్ని సమకూర్చే బాధ్యతను డాక్టర్ కోడెల తీసుకుని హిందువుల శ్మశానాలతో పాటు, క్రైస్తవుల సమాధుల తోటల్నీ, ముస్లింల ఖబరస్థాన్‌లనూ పచ్చని చెట్లూ, పూల మొక్కలూ... దేవతా మూర్తుల రూపాలూ అందమైన నిర్మాణాలూ... కొత్తవాళ్లు ఆ చోటుని చూస్తే అదేదో పార్కు అనుకొనేలా.. సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో ఊరూరా శ్మశానంలను అభివృద్ధి చేసి, మహాత్మాగాంధీ పుట్టినరోజైన అక్టోబర్‌ రెండుని ఏటా శ్మశానాలను శుభ్రపరిచే రోజుగా జరుపుకుంటూ.. అక్కడే తమ వంశ పెద్దల్ని స్మరించుకునే దినోత్సవం కూడా ఆరోజే జరుపుకునేలా చేసారు.
 • భారత రాజ్యాంగ దినోత్సవం రోజున గుంటూరు జిల్లా నకరికల్లులో గోదావరి.. పెన్నా నదుల అనుసంధానానికి ఫేజ్‌-1 పనులకు మీట నొక్కి చంద్రబాబు పైలాన్‌ ఆవిష్కరించడంతో పైనుంచి చక్రం తిరుగుతుండగా జలాలు కింద పడుతుండగా శంకుస్థాపన చేశారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం పనులతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగు, సాగునీటి అవసరాలు తీరడమే కాకుండా పారిశ్రామిక అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది.
 • హైదరాబాద్‌ నుంచి అమరావతికి సాఫీ ప్రయాణానికి కొండమోడు.. పేరేచర్ల రహదారి విస్తరణ పనులు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన మూడ్రోజుల్లోపే ముఖ్యమంత్రి అంగీకారం తెలిపి రూ.736 కోట్లు మంజూరు చేసి భారత రాజ్యాంగ దినోత్సవం రోజున శంకుస్థాపన చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అలంకరించి పదవులు[మార్చు]

 • 1983-1985 నర్సరావుపేట శాసనసభ్యుడు
 • 1985-1989 నర్సరావుపేట శాసనసభ్యుడు
 • 1987-1988 హోం మంత్రిత్వ శాఖా మంత్రి
 • 1989-1994 నర్సరావుపేట శాసనసభ్యుడు
 • 1994-1999 నర్సరావుపేట శాసనసభ్యుడు
 • 1996-1997 నీటిపారుదల శాఖ మంత్రిత్వ శాఖ
 • 1997-1999 పంచాయితీ రాజ్ శాఖా మంత్రి
 • 1999-2003 నర్సరావుపేట శాసనసభ్యుడు
 • 2014 సత్తెనపల్లి శాసనసభ్యుడు - ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి, బిజినెస్ ఎడ్ వైజరీ కమిటీ
 • ట్రస్టీ, డాక్టర్ కోడెల సత్యనారాయణ మెమోరియల్ ట్రస్ట్

మానస పుత్రిక కోటప్పకొండ అభివృద్ధి[మార్చు]

చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్యా!...... అంటూ, యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము ఎప్పుడూ నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ భక్తులరాక పరిమితంగా ఉంటూ కేవలం మహాశివరాత్రి సమయంలో మాత్రం కాలు పెట్టే సందుకూడాలేనంతగా భక్తజనంతో నిండిపోతుంది. సౌకర్యాల విషయంలో ఒకప్పటికంటే ఇప్పటి పరిస్థితి బావుంది.

గుంటూరు జిల్లా కోటప్పకొండలో మాట్లాడుతూ… ‘కోటప్పకొండ సభాపతి కోడెల మానస పుత్రిక' అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.

పూర్వం మెట్ల మార్గం ఉండేది. రాను రానూ ఆ మెట్లు ఎక్కలేని భక్తుల కోసం, వాహనాలలో వెళ్ళడానికి 1999లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో కొండమీదకు నిర్మించబడిన ఘాటు రోడ్డులో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకోవడానికి చక్కని ఘాట్ రోడ్డు వేయించారు. ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు, రోడ్డు ఇరువైపులా ఏంటో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, పిల్లలకోసం పార్కు, ఒక సరస్సు మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి ఒక్కచోట ఉంటారు).. ఇలా పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసారు. మార్గమద్యంలో ఉన్న జింకలపార్కు కూడా అభివృద్ధి చేయబడింది. ఈ ఆలయాన్ని ఎంతో శ్రద్ధతో డాక్టర్ కోడెల శివప్రసాదరావు అభివృద్ది చేసారు. నిటారుగా ఉండే ఎలదారిలో కూడా యాత్రికులు ఆలయానికి చేరుకుంటారు. దారి మొత్తం విద్యుద్దీపాలను ఏర్పాటు చేసారు.

సాహిత్య రచనలు[మార్చు]

చదువు

సమాజ సేవ, గిన్నీస్‌ రికార్డు[మార్చు]

 • డాక్టర్ కోడెల శివప్రసాదరావు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలీనివారు ఉండరు... రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నాయకుల్లో ఒకరు... శాసనసభాపతిగా, నియోజకవర్గ ఎమ్మల్యేగా, వివిధ మంత్రుత్వ శాఖల పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు... కోడెల రాజకీయంగానే కాక, అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ, సమాజానికి తనదైన సేవలు అందిస్తూ వస్తున్నారు...
 • ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా, వేడుకలు జరుపుకోకుండా, ఎదో ఒక సామాజిక సేవ చెయ్యటం కోడెల ఆనవాయితీ.
 • పుట్టినరోజు సందర్భంగా 50 వేల ఇంకుడు గుంతలు తవ్వించి అప్పుడుకూడా ఒక చరిత్ర సృష్టించారు.

అవయవదానంలో గిన్నీస్‌ రికార్డు:

 • తన పుట్టినరోజు సందర్భంగా, మరణానంతరం అవయవదానం చేసే అంశంపై ప్రజల్లో చైతన్యం పెరిగే విధంగా, నరసరావుపేటలో మే 2న పదివేల మందికి పైగా అవయవదాన పత్రాలు సమర్పించే సేవా కార్యక్రమం నిర్వహించారు. భారీ ఎత్తున అవయవదానానికి అంగీకారం తెలిపి గుంటూరు జిల్లా ప్రజానీకం గిన్నీస్‌ రికార్డు సృష్టించారు. నరసరావుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో 11,987 మంది అవయవదానానికి అంగీకారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు పుట్టినరోజు సందర్భంగా సమాజహితం కోరి ఆవయవదానం కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు నరసరావుపేట డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణంలో అవయవదాన అంగీకార పత్రంపై గంట వ్యవధిలో ప్రజలు తమ అంగీకారం తెలియజేస్తూ సంతకాలు చేశారు. కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించిన గిన్నీస్‌బుక్‌ ప్రతినిధి డాక్టర్‌ స్వప్నయ్‌ కోడెల శివప్రసాదరావుకు బహిరంగ వేదికపై గిన్నీస్‌ రికార్డు ధ్రువపత్రాన్ని అందజేశారు. దీంతో 200 ఏళ్ల పైచిలుకు చరిత్ర కలిగిన నరసరావుపేట తొలిసారిగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందింది. ఉదయం 9:30 గంటలకే అవయవదానం చేయడానికి వచ్చిన వారితో స్టేడియంలో ఏర్పాపు చేసిన స్టాళ్లు కిక్కిరిశాయి. గంట వ్యవధిలోనే రికార్డు సాధించారు. ఉదయం 10:47 గంటలకు కోడెల సంతకాలు చేసేందుకు బెల్‌ నొక్కారు. తొలి సంతకం ఆయనే చేశారు. 11.27 గంటలకు 10,500 మంది సంతకాలు చేశారు. గంట వ్యవధి పూర్తయ్యే సరికి 11,987 మంది అవయవదానానికి అంగీకరిస్తూ సంతకాలు చేశారని గిన్నీస్‌బుక్‌ ప్రతినిధి డాక్టర్‌ స్వప్నయ్‌ ప్రకటించారు.

కార్తీక వనమహోత్సవం:

 • కోడెల చేస్తున్న మరో మంచి పని, ప్రజల మన్ననలు అందుకుంటుంది... కార్తీకమాస వన సమారాధన అంటే, కులాల వారీగా చేసుకునే కార్యక్రమం అనే ముద్ర అందరిలోనూ ఉంది... కమ్మ అని, రెడ్డి అని, కాపు అని, ఇలా ఎవరకి వారు, కులాల వారీగా విడిపోయి, చేసుకుంటూ వస్తున్నారు... ఈ ట్రెండ్ కు భిన్నంగా, సమాజంలో మార్పు కోసం, మనుషుల్లో నాటుకుపోయిన కుల జాడ్యాన్ని చెరిపేస్తూ, కోడెల కులమతాలకి అతీతంగా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు అందరూ పాల్గునే విధంగా, అక్టోబర్ 22 ఆదివారం నాడు, శరభయ్యగ్రౌండ్స్‌ వేదికగా, కార్తీకమాస వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కుల,మత వర్గాల భావనకు దూరంగా నవసమాజ నిర్మాణమే జీవిత లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిత్యం శ్రమించి అసెంబ్లీ సభాపతి కోడెల ఆధ్వర్యంలో ఆనందంగా ఈ కార్తీక వనమహోత్సవంలో పాల్గొని తామంతా ఒకటే అని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

విదేశీ పర్యటన[మార్చు]

 • 2014 లో యౌండీ, కామెరూన్లో జరిగిన కామన్వెల్త్ స్పీకర్ ల సమావేశంకు హాజరయ్యారు.
 • 27 తేదీ సెప్టెంబర్ నుండి 10 తేదీ అక్టోబర్ 2014 వరకు మారిషస్కు, దక్షిణాఫ్రికా మరియు నైరోబీ, కెన్యాలలో జరిగిన పోస్ట్ కాన్ఫరెన్స్ అధ్యయన పర్యటనకు హాజరయ్యారు
 • ఢాకా, బంగ్లాదేశ్ లో జరిగిన 26వ కామన్వెల్త్ పార్లమెంటరీ సెమినార్ హాజరయ్యారు మరియు 7 తేదీ నుండి 21 మే 2015 వరకు ప్రీ కాన్ఫరెన్స్ పర్యటన లో పాల్గొన్నారు.
 • కువైట్లో 27 నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించిన కువైట్ తెలుగు సంఘం సమావేశంలో పాల్గొన్నారు.
 • సింగపూర్ లో 18 నుండి 20 జూన్ 2015 వరకు జరిగిన స్వచ్చ భారత్ ప్రోగ్రాంలో హాజరయ్యారు
 • లండన్, బ్రిటన్ లో 6 నుండి 10 సెప్టెంబర్ 2015 వరకు జరిగిన చర్చావేదిక " కనెక్ట్ విటి డాట్స్ ప్రోగ్రాం' పై చర్చించటానికి వెళ్లారు.
 • గ్లమన్ కన్సల్టింగ్ మరియు ది భారతదేశం యొక్క కాన్సులేట్ జనరల్, హాంబర్గ్, జర్మనీచే 1 వ నుండి 10 వ నవంబర్ 2015 సంయుక్తంగా నిర్వహంచబడిన 'హాంబర్గ్ ఇండియా-2015' ప్రోగ్రాంకు హాజరయ్యారు.
 • 27 నుండి 29 జనవరి, 2016 వరకు జరిగిన "ఇన్వెస్ట్-ఇన్-ఈస్ట్ -2016" శ్రీలంకలోని కొలంబో లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.
 • ఘనా మరియు ఉగాండాలో 09.04.2016 నుండి 14.04.2016 వరకు జరిగిన CPA సమావేశాలకు హాజరయ్యారు.
 • 2 వ నుండి 9 వ మే, 2016 వరకు బ్రెజిల్లో జరిగిన "82 వ ఎపోజూబు" హాజరయ్యారు.
 • 7 వ నుండి 11 వ ఆగస్టు, 2016 వరకు 'CPA - రాష్ట్ర జాతీయ శాసనసభల శాసనసభ సమావేశం' చికాగో లోని ఇల్లినాయిలో జరిగిన సమావేశాలకు హాజరయ్యారు.

విజయాలు[మార్చు]

చదువు

వివాదాలు, విమర్శలు[మార్చు]

చదువు

కుటుంబం[మార్చు]

 • ఎంబీబీఎస్ చదువుతుండగానే ఆయనకు వివాహమైంది. ఆమె గృహిణి. వారికి ముగ్గురు పిల్లలు. ముగ్గురూ వైద్యులే. అమ్మాయి గైనకాలజిస్టు. పెద్దబ్బాయి క్యాన్సర్ సర్జన్. రెండో అబ్బాయి ఎముకల స్పెషలిస్టు. కానీ రెండో అబ్బాయి ప్రమాదవశాత్తూ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

అభిరుచులు[మార్చు]

 • సాహిత్య పుస్తకాలను చదవడం.
 • సంగీతం వినడం.
 • స్విమ్మింగ్.
 • పేదలకు వైద్య చికిత్స అందించడం.
 • మహిళా సాధికారత మరియు ఆరోగ్య సలహాల వంటి సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం.

చిహ్నాలు[మార్చు]

వనరులు[మార్చు]

 • ఈనాడు దినపత్రిక - 20-06-2014