జొన్నలగడ్డ శ్రీరామమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జొన్నలగడ్డ శ్రీరామమూర్తి
జననం1952,సెప్టెంబరు 18
ప్రకాశం జిల్లా, మార్టూరు మండలం, వలపర్ల
నివాస ప్రాంతంగుంటూరు జిల్లా, నరసరావుపేట పట్టణం
ఇతర పేర్లుజొన్నలగడ్డ శ్రీరామమూర్తి
వృత్తిసంగీత కళాకారుడు
ప్రసిద్ధిపల్నాటి అన్నమయ్యగా
భార్య / భర్తలక్షీకాంతమ్మ
పిల్లలువిజయ రాఘవేంధ్ర పున్నారావు
సాయిరామ్ అన్నమయ్య.
తండ్రిపున్నయ్య
తల్లిసీతారావమ్మ
పురస్కారాలుఅమృతగాన సుధానిధి
భక్తిగాన ప్రచార్
సంకీర్తనా సుధానిధి
భక్తి గాన సుధానిధి
సంకీర్తానా కౌముది
పల్నాటి అన్నమయ్య

జొన్నలగడ్డ శ్రీరామమూర్తి గుంటూరు జిల్లా,నరసరావుపేట పట్టణంలో 1952, సెప్టెంబరు 18న జన్మించాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు గుంటూరు జిల్లా, ఈపూరు మండలం, బొగ్గరం గ్రామానికి చెందిన కాకుమాను రామేశ్వరరావు, ధనలక్ష్మి దంపతులు. ఇతని దత్తు తల్లిదండ్రులు జొన్నలగడ్డ పున్నయ్య, సీతారావమ్మ. (స్వంత అమ్మమ్మ, తాతయ్య). ఇతని తల్లి వార్కి ఒక్కతే కుమార్తె, మగ సంతానం లేనికారణంగా శ్రీరామమూర్తిని దత్తు కుమార్డుగా స్వీకరించారు. అప్పటి నుండి ఇతని ఇంటిపేరు జొన్నలగడ్డగా మారింది.

బాల్యం, యవ్వనం, విద్య

[మార్చు]

ఇతనికి బాల్యం నుండే సంగీతం,పాటలు అంటే ఎంతో ఇష్టం.చిన్నతనంలోనే తను విన్న సినిమా పాటలు అలవోకగా పాడే అలవాటు ఉంది.స్వయంకృషితో సంగీతంలో పట్టు సాధించాడు. సంగీతంలో ఉన్న ఆపేక్షతో అతను బి.కామ్.చదువుకు మధ్యలో స్వస్తి చెప్పాడు.

వివాహం, సంతానం

[మార్చు]

ప్రకాశం జిల్లా, మార్టూరు మండలం వలపర్ల గ్రామానికి చెందిన కొత్తూరి శేషాచలం, వెంకటసుబ్బాయమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీకాంతమ్మను వివాహమాడాడు.ఈ దంపతుల సంతానం ఇద్దరు కుమారులు. విజయ రాఘవేంధ్ర పున్నారావు, సాయిరామ్ అన్నమయ్య.

సంగీతంలో శిక్షణ, ఆరంగేట్రం

[మార్చు]

ఇతనికి చిన్న తనంలో సంగీతంపై ఉన్న మక్కువతో ప్రముఖ పౌరాణిక నాటక ప్రయోక్త పోలూరి లక్ష్మీ కాంతారావు దగ్గర 1969లో మొదట శిష్యుడుగా చేరాడు. అక్కడ సంగీతంలో, నాటక నిర్వహణలో కొంతకాలం మెలుకువలు తెలుసుకుని సాధన చేసాడు. అంతటితో ఆగకుండా ప్రముఖ సంగీత విద్వాంసులు స్వరసింహ ఆదంసాహేబ్, సి.ఆర్.దాస్,రాజనాల వెంకట్రామయ్యల వద్ద ఎనిమిది సంవత్సరాలు సంగీతంలో శిక్షణ పొందాడు.ఆకాలంలో ఆడియో క్యాసెట్లు విరివిగా విడుదల అయ్యేవి.1982 లో ప్రముఖ సంగీత గాయకులు బాలకృష్ణప్రసాద్, శోభారాజ్ పాడిన అన్నమయ్య కీర్తనల ఆడియో క్యాసెట్ విడదలైయింది.అన్నమయ్య కీర్తనలు అతని మనసుపై ప్రభావితం చూపాయి.దాని ఫలితంగా అతను స్వంతగాకీ బోర్డు, హార్మోనియంలపై అప్పటి నుండి ఆడియో క్యాసెట్ల ద్వారా కీర్తనలు సాధన చేసాడు. సాధనలో అతనికి అన్నమయ్య కీర్తనలుపై అమిత మక్కువ ఏర్పడింది.

అన్నమయ్య కీర్తనలు ప్రజలకు చేరువ

[మార్చు]

అన్నమయ్య కీర్తనలుకు బహుళ ప్రచారం కల్పించి విశ్వవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయాలన్న సంకల్పంతో,సుమారు 500 వందలకు పైగా అన్నమయ్య కీర్తనలపై పట్టు సాధించాడు.అంతేగాదు జయదేవుని అష్టపదులు, రామదాసు కీర్తనలు, త్యాగరాజు కీర్తనలు, నారాయణ తీర్థుల తరంగాలు అలవోకగా ఆలపించే సాధన చేసాడు.ఆ పట్టుదల, సంకల్పంతో తెలుగు రాష్ట్రాలలో,ఇతర రాష్ట్రాలలో మూడు దశాబ్దాలుగా వెయ్యికి పైగా కచేరీలు చేసాడు. ప్రతి మాసంలో ఇప్పటికీ 10 పైగా ఇతని గాన కచేరీలు ఉంటాయి.[1]

సినీ పాటలు గానం

[మార్చు]

సినీ గాయకులు ఘంటసాల,పి.బి.శ్రీనివాస్,ఏ.ఎం.రాజా తదితర పాతతరం గాయకులు ఆలపించిన సినిమా పాటలు, సుమారు 1000కి పైగా ఆలపించగలడు.వివాహాది కార్యక్రమాలలో తెలుగు సంస్కృతి మరుగున పడకుండా సందర్భాన్ని బట్టి పెళ్ళి పాటలు అలవోకగా పాడగలడు.

పౌరాణిక పాత్రలు పోషించిన జొన్నలగడ్డ

[మార్చు]

శ్రీరామమూర్తికి చక్కని సంగీత గాత్రంతో పాటు,మంచి అంగసౌష్టవం తన స్వంతం.ఆ అంగసౌష్టవంతో శ్రీరామమూర్తి పౌరాణిక నాటకాల్లోనూ రాణించాడు.శ్రీ కృష్ణరాయభారంలో నాటకంలో శ్రీకృష్ణుడుగా, సత్యహరిశ్చంద్రలో నక్షత్రకుడిగా, టి.టి.డి.ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వరస్వామి మహాత్యంలో విష్ణుమూర్తి, శ్రీనివాసుడు, ఎరుకలసాని పాత్రలు పోషించాడు. చింతామణి సాంఘిక నాటకంలో బిళ్వమంగళుడి పాత్రలో అభినయించాడు.ఇంకా పలు నాటకాలలో విభిన్నమైన పాత్రలు పోషించి మంచి అనుభవం గడించాడు.

ఉచితంగా అన్నమయ్య కీర్తనల శిక్షణ

[మార్చు]

శ్రీరామమూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలిస్తూనే అన్నమయ్యచార్య కీర్తనలను విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో నరసరావుపేట పట్టణంలో ఉత్సాహమున్న బాల బాలికలకు 100 మందికి పైగా అన్నమయ్య కీర్తనలపై ఉచితంగా శిక్షణ ఇచ్చాడు.

అవార్డులు, బిరుదులు, సన్మానాలు

[మార్చు]

శ్రీరామమూర్తి మూడు దశాబ్దాలుగా కీర్తనలు గానంచేసే కార్యక్రమంలో పలుచోట్ల సన్మానాలు, అవార్డులు, బిరుదులు పొందాడు.

1995లో గుంటూరులో జరిగిన కార్యక్రమంలో విశ్వయోగి విశ్వంజీచే 'అమృతగాన సుధానిధి' బిరుదును, సర్వస్వతి అకాడమీ వారిచే 'భక్తిగాన ప్రచార్' బిరుదును పొందాడు. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు చేతులమీదుగా 'సంకీర్తనా సుధానిధి' బిరుదును అందుకున్నాడు.హిందీ ధర్మ ప్రచార పరిషత్, ఒంగోలు వారిచే 'భక్తి గాన సుధానిధి' బిరుదును, టి.టి.డి.అధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంనందు చిలకపాటి విజయరాఘవాచార్యులు చేతులు మీదుగా 'సంకీర్తానా కౌముది' బిరుదును అందుకున్నాడు.నరసరావుపేట పట్టణ రంగస్థలి తరుపున గౌరవ అధ్యక్షులు కె.వి.కె.రామారావు 2010లో ప్రతిభా పురస్కారం అందుకున్నాడు. శ్రీగోదా విష్ణుసహస్రనామ మండలి, కర్నూలు వారిచే 2014 జనవరి, 24న ఆత్మీయ పురస్కారం ప్రధానములతో పాటు 'పల్నాటి అన్నమయ్య' బిరుదు అందుకున్నాడు. అతని అసలు పేరు మరుగునపడి నరసరావుపేట పట్టణ, పరిసర ప్రాంతంనందు పల్నాటి అన్నమయ్యగా పేరు గడించాడు.నరసరావుపేట పట్టణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరుపున 2015 ఫిబ్రవరి, 24న మహాశివరాత్రి పురస్కారం అందుకున్నాడు. నరసరావుపేట పట్టణ భువనచంద్ర టౌను హాలు సొసైటి తరుపున 2008 మార్చి,23న సన్మానించబడ్డాడు.ఇంకా లెక్కకు మించి సత్కారాలు, అవార్డులు, బిరుదులు పొందాడు.

ముఖ్యమైన ప్రదర్శనలు

[మార్చు]
  • 1990లో అన్నమయ్య జయంతి సందర్భంగా 'శత కీర్తన యజ్ఞం' చేపట్టి 100 కీర్తనలు గానం చేసాడు.
  • నరసరావుపేట పట్టణంలోని శ్రీ పాండురంగస్వామి దేవాలయంలో అన్నమాచార్యుల జయంతి వేడుకల సందర్భంగా అతని ఆధ్వర్యంలో అన్నమయ్య సప్తగిరి కీర్తనలు కార్యక్రమం నిర్వహించాడు.[2]
  • ప్రకాశం జిల్లా పర్చూరులో మహా శివరాత్రి సందర్భంగా 1997లో సాయంత్రం 6 గం.నుండి, ఉదయం 6.గం.ల వరకు ఏకదాటిగా 12 గం.ల.పాటు అన్నమయ్య కీర్తనలతో అశేష ప్రజానీకాన్ని ముగ్దులను గావించి ఔరా అనిపించుకున్నాడు.
  • 2006లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన అన్నమయ్య సప్తాహ కార్యక్రమంలో 150 మందికి పైగా గాయకులతో కలిసి గానం చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాడు.
  • సిలికానాంధ్ర సౌజన్యంతో 70 మంది బాల బాలికలకు శిక్షణ ఇచ్చి, అన్నమయ్య శత సంకీర్తన యజ్ఞాన్ని చేపట్టి,వారితో 108 కీర్తనలు గానం చేయించాడు.
  • నరసరావుపేట పట్టణంలో అతను శిక్షణ ఇచ్చిన 125 మంది విద్యార్థులతో ఒకే వేదికపై 2016 అక్టోబరు,23న భువనచంద్ర టౌనుహాలులో అన్నమయ్య వెన్నల కార్యక్రమం గాన కచేరి శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించాడు.[3]
  • నరసరావుపట్టణం స్థానిక ప్రకాశనగర్లోని సప్తపది కళ్యాణ మండపంలో సుందరకాండ పారాయణ కార్యక్రమం నిర్వహించాడు.

పల్నాడు ప్రాంత భజన గురువుగా నియామకం

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ,ధర్మాదాయ శాఖ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరుపున పల్నాడు ప్రాంత భజన గురువుగా నియమించబడ్డాడు.[4] ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు నరసరావుపేటలోని తన కార్యాలయంలో శ్రీరామమూర్తిని సత్కరించి అభినందనలు తెలిపాడు.[5] పల్నాటి ప్రాంతంలోని పలుగ్రామాలనందు,నరసరావుపేట పట్టణంలో పలు భజన బృందాలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

పారితోషకంతో సేవా కార్యక్రమాలు

[మార్చు]

శ్రీరామమూర్తికి ప్రదర్శనలకు అందిన పారితోషికం నుండి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాడు.10 మందికి పైగా పేదవారికి కంటి ఆపరేషన్లు చేయించాడు. అంతేగాదు, ప్రతి సంవత్సరం పేదలకు వస్త్రదానం చేస్తుంటాడు.ఆర్దికంగా చితికిపోయిన తోటి బీద కళాకారులకు తన వంతు సహాయంగా ఆర్థిక తోడ్పాటు అందిచ్చాడు.సేవా కార్యక్రమంలో ఇతర కళాకారులకు ఆదర్శంగా ఉంటాడు.

సంగీతంపై శ్రీరామమూర్తి సందేశం

[మార్చు]

సంగీత కళాకారులు సున్నిత మనస్సును కలిగి ఉంటారు.అందువలన వీరు ఏ ప్రాణికి హాని తలపెట్టరు.సంగీతం అందరి మనస్సుకు అహ్లాదాన్ని అందిస్తుంది.దాని వలన ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది.పిల్లలకు చిన్నప్పటి నుంచే సంగీతంలో శిక్షణ ఇప్పించటం వలన రాగాలాపనలో ఏకాగ్రత అలవాటుపడి, దాని ద్వారా జ్ఞాపకశక్తి పెంపొందుతుందని, సంగీత కళాకారులకు సమాజంలో మంచి గుర్తింపు, హోదా లభిస్తుందని అతని అభిప్రాయం.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 సాక్షి దినపత్రిక 2014,జులై,10 పేజి నెం.8 (నరసరావుపేట స్థానికం)
  2. సాక్షి దినపత్రిక,నరసరావుపేట ఈస్ట్,పేజీ నెం.5,తేది.08.05.2012
  3. "2017లో నరసరావుపేటలో శ్రీరామమూర్తి నిర్వహించిన అన్నమయ్య కీర్తనలు సంగీత కచేరి".
  4. కమీషనర్, దేవాదాయ,ధర్మాదాయశాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం,గొల్లపూడి,విజయవాడ వారి ఉత్తర్వులు R.c.No.21/HDPT/2016 Dt:22.04.2017
  5. ఆంధ్రజ్వోతి,నరసరావుపేట పేజి నెం.4,తేది.2017 మే 27

వెలుపలి లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.