శ్రీకృష్ణ రాయబారం (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీకృష్ణ రాయబారం ఆంధ్ర దేశంలో విరివిగా ప్రదర్శించబడే ఒక పౌరాణిక నాటకం.

తిరుపతి వేంకట కవులు రచించిన పాండవోద్యోగం నాటకానికి అద్భుత సృష్టి ఈ శ్రీకృష్ణరాయబారం నాటకం. ఈ నాటకాన్ని ప్రదర్శించని పౌరాణిక నాటక సమాజం ఆంధ్ర దేశం లో లేదంటే అతిశయోక్తి కాదు. పద్య నాటకరంగం లో ప్రాతఃస్మరణీయులనదగిన అబ్బూరి వరప్రసాదరావు, సీఎస్సార్, బందా కనకలింగేశ్వర రావు, షణ్ముఖి ఆంజనేయ రాజు, పీసపాటి నరసింహమూర్తి, టి.కనకం , కళ్యాణం రఘురామయ్య, పృథ్వి వెంకటేశ్వర్లు, ఏ.వి.సుబ్బారావు వంటివారు శ్రీ కృష్ణ పాత్రధారణలో పేరెన్నికగొంటే, అర్జున పాత్రకు పులిపాటి వెంకటేశ్వర్లు, పులిపాక వెంకటప్పయ్య, కలపర్రు వెంకటేశ్వర్లు; దుర్యోధనుడుగా మాధవపెద్ది వెంకట్రామయ్య, వేమూరి గగ్గయ్య, ధూళిపాళ, ఆచంట వెంకటరత్నం నాయుడు; ధర్మరాజుగా పి.సూరిబాబు, అద్దంకి శ్రీరామమూర్తి, కందుకూరి చిరంజీవరావు; భీముడుగా వేమవరపు శ్రీధర రావు వంటివారు పేరుగాంచారు. ఈ నాటకం లోని పద్యాలు సరళమైన భాషలో జనరంజకంగా ఉంటాయి.

కథ[మార్చు]

జరుగబోవు కురుక్షేత్ర మహాసంగ్రామం లో సహాయపడవలసినదని కోరేందుకు సుయోధనుడు శ్రీ కృష్ణుని వద్దకు వెళ్ళి అతని తలవైపున ఉన్న ఆసనం లో కూర్చుంటాడు. ఆ వెనుక వచ్చిన అర్జునుడు భగవానుని పాదాలచెంత కూర్చుంటాడు. నిద్రలేచిన పరమాత్మ ముందు అర్జునుని ఆత్మీయంగా పలకరించి ఆపై సుయోధనుని యథాలాపంగా పలకరించి అతని పక్షాన ఉన్న, కర్ణ, భీష్మ, ద్రోణుల క్షేమాన్ని అడుగుతాడు. రణసహాయం కోరివచ్చినట్లు తెలుపగా, తాను సైన్య విభాగం జరుపుతానని, అందులో పదివేల మంది గోపకులు ఒకవైపు (సంస్కృత వ్యాస భారతంలో ఈ సంఖ్య పది లక్షలుగా ఉన్నది) తాను ఇంకొక వైపు ఉంటానని, అయితే యుద్ధం లో ఆయుధము పట్టనని, యుద్ధము చేయనని తెలుపుతూ, ముందుగా తాను అర్జునుని చూశాడు గనుక కోరుకునే అవకాశం అతనికే ఇవ్వమని దుర్యోధనుని కోరుతాడు. అర్జునుడు కృష్ణుని కోరుకుంటే, మిగిలిన యదువీరులందరినీ సుయోధనుడు గైకొంటాడు. అర్జునుని కోరిక మీద ఉపప్లావ్యం లో ఉన్న పాండవులను కలిసేందుకు పయనమౌతాడు.

ఉపప్లావ్యం లో ఉన్న పాందడవులను కలిసి, ధర్మరాజుతో, ఈ సంధి కుదర్చడం తన తరము కాకున్నా అతని మనసులోని ఆలోచన ఏమిటో తెలపమంటాడు. యుద్ధం వలన జరిగే రక్తపాతాన్ని తాను భరింపలేనని, నెత్తురు కూడు తినజాలనని చెప్పిన ధర్మరాజుతో, క్షత్రియ కుమారునికి నెత్తురుకూడు కాక జోలె కూడు తినుట భావ్యము కాదని, పదుగురున్న సభలో పాంచాలిని పరాభవించిన కౌరవులపట్ల కనికరం చూపడం భావ్యము కాదని అతడిని యుద్ధ సన్నద్ధుడిని చేసే ప్రయత్నం చేయబోగా అకారణంగా భీముడు కల్పించుకొని, తన అన్న తలపు ఒకరకంగా ఉంటే మరో రకంగా ఆలోచించి అనవసర యుద్ధానికి ప్రేరేపించ వద్దని, సభలో ఎవ్వరు ఎట్లు మాట్లాడినా కోపగించక, ధర్మరాజు ఇష్టప్రకారంగా సంధి జరిపే ప్రయత్నం చేయమని కృష్ణున్ని కోరుతాడు. సుయోధనుని తొడలు విరుగగొట్టి చంపుతానని దుశ్శాసనుని రొమ్ము చీల్చి నెత్తురు తాగుతానని ప్రగల్భాలు పలికి పిరికివాడవై సంధికి పురికొల్పుతున్నావు అసలు నీవు భీమసేనుడవేనా ? లేక తిండిపోతువై,యుద్ధానికి బెదరి మాట్లాడుతున్నావా ? అని ఆటపట్టించిన కృష్ణున్ని, నీ వలె నేను ఇంటింటా తిరిగి పాలు పెరుగు వెన్న దొంగిలించి తేలేదని, తల్లిదండ్రులు ఇతరులకు ఇస్తాననుకున్న కన్నెను ఎత్తుకొని వచ్చి పెండ్లాడలేదని, నీవే మాకు దిక్కుగా ఉన్నానని అహంకరించకుమని పరుషంగా అంటాడు భీముడు. అర్జునుడు,నకులుడు తమకు బాసటగా వచ్చిన పరమాత్ముని దూషింపరాదంటే సహదేవుడు, ద్రౌపది మరింతగా అతడిని తప్పుపడతారు. దానితో అలిగిన భీముడు, ఛీ ఛీ కుర్రవానితో గూడా ఇంతలేసి మాటలనిపించుకున్న ఈ దురభిమానపు బతుకెందుకని తన గదతో తల పగలగొట్టుకోబోగా ధర్మరాజు ఆ గదను తీసుకొని తన కారణం గానే ఈ అనర్ధాలన్నీ జరిగాయి గనుక తానే ఆత్మహత్య చేసుకోబోగా వారించిన కృష్ణుడు భీమునకు కోపమలంకారమైనట్లు శాంతముకానేరదని అతనికి కోపము తెప్పించుటకే తాను ఆ ప్రస్తావన తెచ్చినట్టు తెలిపి భీముని చేరబిలిచి అతడుగనుక ఆత్మహత్యకు పాల్బడితే ద్రౌపది శోకాన్ని తీర్చువారుండరని కనుక పౌరుషాన్ని యుద్ధం లో చూపమని గదను అందిస్తాడు. పాండవులందరూ తమ మనసుల్లోని భావాలను తెలిపి పరమాత్ముణ్ణి రాయబారానికి పంపుతారు.

ధృతరాష్ట్రుని సభలో ప్రవేశించిన కృష్ణుడు పాండుపుత్రుల మంచితనాన్నీ వినయశీలతనూ తెలిపి వాళ్ళకు రావలసిన అర్థరాజ్యం కాకున్నా కనీసం అయిదూళ్ళయినా ఇవ్వమన్నారని వారిచే సేవలే చేయిం చుకున్నా, యుద్ధం చేయించినా సంసిద్ధులుగా ఉన్నారని నిర్ణయమేదయినా అతని చేతుల్లోనే ఉందని ధృతరాష్ట్రునికి తెలుపగా మధ్యలో కల్పించుకున్న కర్ణుడు దూతగా వచ్చిన వాడు తాను చెప్పవలసిన మాటలేవో చెప్పాలిగాని అధికప్రసంగము చేయుటకు పెద్దలొప్పుకోరని కృష్ణుని వారింపబోగా, సంధి కుదిర్చేందుకు వచ్చిన పరమాత్ముని నివారించే అధికారం నీకెవ్వరిచ్చారని అశ్వత్థామ ఎదురుతిరుగుతాడు. భీష్మ ద్రోణులు కూడా కర్ణుని ప్రవర్తనను తప్పుపడతారు.రాయబారిముందు వాదులాడుకోవడం తగదని సుయోధనుని పిల్చి దాయాద ద్వేషము మానివేసి పాండవుల కోరిక ప్రకారంగా వారికిరావలసిన రాజ్యభాగమిమ్మని ధృతరాష్ట్రుడు చెప్పగా అందుకు ఒప్పుకోని సుయోధనుడు అయిదూళ్ళివ్వకుంటే యుద్ధము తప్పదని కబురుపంపిన దాయాదులతో సంధిపొసగదని, రాజ్యభాగమివ్వనని అంటాడు. భీష్మద్రోణులు, విదురుడు తుదకు గాంధారి చెప్పినా వినక కర్ణుడు తన అండనుండగా కృష్ణునితో సహా పాండవులను యుద్ధం లో చంపుతాననడంతో.. ఈ సూతనందనునితో స్నేహమే తన కులానికి చేడ్పాటు తెచ్చిందని మూర్చపోతాడు మహారాజు. మళ్ళీ భీష్మ ద్రోణులు హితవచనాలు చెప్పబోగా, పాండవపక్షపాతం తో వ్యవహరింపక యుద్ధం లో తన పక్షాన పాల్గొనమంటాడు. తనంతటివాడు వెంట ఉండగా ఆ ముసలివాళ్ళను ఎందుకు ప్రాధేయపడతావని కర్ణుడంటే యుద్ధానికి రాజుగారు పిలిచినప్పుడే వెళ్ళుదాం ఇంకా ఇక్కడెందుకని తండ్రిని మేనమామను తీసుకొని సభనుండి బయటికి వెళ్ళబోగా వారించిన పరమాత్మ సుయోధనునికి రానున్న కురుక్షేత్ర సంగ్రామం లో అర్జునుని బాణాలను కర్ణుడు నిలు వరించలేడని, భీముడు తొడలు విరుగగొట్టి, దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం త్రాగుతుంటే కాపాడగలవాడు ఎవ్వడూ ఉండడని కనుక సంధి చేయమని చివరమాటగా చెపుతాడు. కృష్ణుని మాటలు మితిమీరుతున్నాయని అతని గర్వాన్ని అణచుదామని దుష్టచతుష్టమయిన దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు తాళ్ళతో కట్టివేయ ప్రయత్నిస్తే ఆ బంధనాలను ఛేదించుకున్న పరమాత్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ఎవ్వరెంత చెప్పినా వినక దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధపడ్తున్నాడని ఇక యుద్ధం అనివార్యమని రాయబారాన్ని ముగిస్తాడు.

మూలములు[మార్చు]

తిరుపతి వెంకటకవుల పాండవోద్యోగం నాటకము.