ఆచంట వెంకటరత్నం నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆచంట వెంకటరత్నం నాయుడు
Aachanta Venkatarathnam Naidu.JPG
జననంజూన్ 28, 1935
కొండపల్లి, కృష్ణా జిల్లా
మరణంనవంబర్ 25, 2015
తాడేపల్లిగూడెం
ఇతర పేర్లుఆచంట వెంకటరత్నం నాయుడు
ప్రసిద్ధిరంగస్థల నటులు
తండ్రివెంకటేశ్వర్లు నాయుడు

ఆచంట వెంకటరత్నం నాయుడు (జూన్ 28, 1935 - నవంబర్ 25, 2015) పద్యనాటక పరిమళాలను తెలుగువారికి తన గళంద్వారా, నటనాకౌశలం ద్వారా అందించిన మహానటుడు.

జననం[మార్చు]

ఈయన 1935, జూన్ 28 వ తేదీన కృష్ణాజిల్లా, కొండపల్లిలో జన్మించారు. వెంకటరత్నం నాయుడుగారి తండ్రి ఆచంట వెంకటేశ్వర్లు నాయుడు గారు రంగస్థల కళాకారుడు. అదే వారసత్వంగా ఈయనకు అబ్బింది. గుంటూరు హిందూ స్కూల్లో ఎస్.ఎస్.ఎల్.సి. పాసైన ఆచంటగారు కొంతకాలం ఆయుర్వేద మందులకి రిప్రెజెంటేటివ్‌గా పనిచేసి, వృత్తికీ, ప్రవృత్తికీ సమన్వయం కుదరక వృత్తిని వదులుకొని నాటకాలలో ప్రవేశించారు.

తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే నీతిశాస్త్రంలో శ్లోకాలు, పద్యాలు కంఠస్థం చేసి, స్పష్టమైన వాచికంతో, చక్కటి గాత్రంతో పాడుతుంటే స్కూల్లో ఉపాధ్యాయులు ప్రశసించేవారు. కేవలం పద్యనాటకమేకాక అనేక సాంఘిక నాటకాల్లో కూడా ఆచంట తమ ప్రతిభా పాటవాలను తెలుగు దేశ ప్రజలకి తెలియజేశారు. గుంటూరు నాట్యసమితి ప్రదర్శించిన రామరాజు, నాయకురాలు, అపరాధి వంటి నాటకాలతో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. తనకంటూ ఓ ముద్ర నేర్పరుచుకున్న నాయుడి ప్రతిభ చూసిన పలు నాటక సంస్థలు ఆయనకి పౌరాణిక చారిత్రక నాటకాల్లో కూడా ప్రధాన పాత్రలను ఇచ్చి ప్రోత్సహించాయి.

ఆంధ్ర లలిత కళాపరిషత్ ప్రదర్శించిన బొబ్బిలి నాటకంలో హైదర్‌జంగ్, తులాభారం నాటకంలో వసంతకుడు, సక్కుబాయి నాటకంలో కాశీపతి, రామాంజనేయ యుద్ధం లో యయాతి, హరిశ్చంద్ర లో విశ్వామిత్ర మొదలైన పాత్రలతో విజయదుందుభి మోగించారు.

మయసభ ఏకపాత్రాభినయం నాయుడిగారి నట జీవితంలో ఒక మైలురాయి. సాత్విక పాత్రలకంటే తామస పాత్రలు ఆయనకి ఎంతో ఇష్టం. ఆయనప్రతిభకు మెచ్చిన అనేక సంస్థలే కాక రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సన్మానాలు, సత్కారాలతో ఆయనని అభినందించింది. ఈలపాట రఘురామయ్య, షణ్ముఖి ఆంజనేయ రాజు, ఎ.వి. సుబ్బారావు, మాధవపెద్ది సత్యం, పీసపాటి నరసింహమూర్తి మొదలైన ఉద్ధండులైన 40 మంది నటులతో ఒక టీమ్‌గా తులసీజలంధర నాటకం ప్రదర్శిస్తే కనకవర్షం కురిసిందట. నాటకాన్ని నమ్ముకుని బతకలేమన్న మాటకి ఆచంటగారు చెప్పిన ఓ ఉదాహరణ ఇది.

డి.వి. సుబ్బారావు (హరిశ్చంద్ర పాత్రధారి) నెలకి 4 నాటకాలు ప్రదర్శించి, కళాకారులకు నెలకి కచ్చితంగా జీతాలిచ్చేవారట. దేనికైనా క్రమశిక్షణ, పట్టుదల, శ్రద్ధ ముఖ్యం అంటారు ఆచంట. బురదనాయుడు సతీసావిత్రిలో ఒరిజినల్ దున్నపోతుమీద వచ్చేవారట. విజయవాడకి సుమారు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘నున్న’ ప్రాంతంలో ఒక చిల్డ్రన్ నటశిక్షణాలయం స్థాపించి భావితరాలకు పద్యనాటక కళాకారులను తీర్చిదిద్దారు.

నటించిన నాటకాలు[మార్చు]

 1. శ్రీకృష్ణ రాయబారం
 2. శ్రీకృష్ణ తులాభారం
 3. బొబ్బిలి యుద్ధం
 4. రామరాజు
 5. నాయకురాలు
 6. అపరాధి
 7. రామాంజనేయ యుద్ధం
 8. సక్కుబాయి
 9. హరిశ్చంద్ర
 10. తులసీ జలంధర

నటించిన పాత్రలు[మార్చు]

 1. కరండకుడు
 2. దుర్యోధనుడు
 3. జలంధర
 4. జరాసంధ
 5. ద్రోణుడు
 6. అశ్వత్థామ
 7. గయుడు
 8. హైదర్‌జంగ్
 9. వసంతకుడు
 10. కాశీపతి
 11. యయాతి
 12. విశ్వామిత్ర
 13. తాండ్రపాపారాయుడు మొదలైనవి

పురస్కారాలు[మార్చు]

నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేత సన్మానితుడైన ఆచంట వెంకటరత్నం నాయుడు
 • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే హంస అవార్డు (2000)
 • తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు (2002)
 • సి.హెచ్‌.సాంబయ్య స్మారక పురస్కారం (2009)
 • ఎన్.టి.ఆర్. రంగస్థల పురస్కారం (2001)

మరణం[మార్చు]

తెలుగు పౌరాణిక నాటక రంగానికి విశేషమైన సేవలను అందించిన ఆచంట వెంకటరత్నం నాయుడు తన 81వ యేట 2015, నవంబర్ 25, బుధవారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెంలో కుమార్తె గృహంలో మరణించాడు.[1]

మూలాలు[మార్చు]

 • రంగస్థల నటుడు ఆచంట కన్నుమూత