ప్రభల సంస్కృతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విధ్యుత్ ప్రభ
విధ్యుత్ ప్రభ
Electrical Prabha
విధ్యుత్ ప్రభ
Electrical Prabha
ప్రభ
ప్రభ
Prabha
ప్రభ
Prabha
ప్రభ
ప్రభ
Prabha
ప్రభ
Prabha
ప్రభ
ప్రభ
Prabha
ప్రభ
Prabha

ప్రభల సంస్కృతి[1]గుంటూరు జిల్లా, ముఖ్యంగా పల్నాడు (ఆంగ్లం:Palnadu) ప్రాంతంలో కనిపించే ఒక గొప్పసంస్కృతీ. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహా శివరాత్రి నాడు గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ (ఆంగ్లం:Kotappakonda), క్వారీ బాలకోటేశ్వరస్వామి, సత్రశాల ప్రాంతాలలో ఈ ప్రభల సంస్కృతి కనిపిస్తుంది.

కోటప్పకొండ

[మార్చు]

కోటప్పకొండ[2] గుంటూరు జిల్లా, నర్సరావుపేట (ఆంగ్లం:Narasaraopet) కు 10 కి.మీ. దూరం ఉంది. ఇది ప్రముఖ శైవ క్షేత్రం. కొండపై త్రికూటాద్రి (కోటయ్యస్వామి) కొలువై ఉన్నాడు. ప్రతి ఏడాది మహా శివరాత్రి పర్వదినాన రాష్ట్ర నలుమూలలు నుంచి భక్తులు కొండకు తరలివస్తారు. శివరాత్రి నాడు కోటప్పకొండకు 30 కి.మీ దూరంలో ఉన్న అన్ని గ్రామాల వారు ప్రభలు కట్టుకొని కొండకు వెళ్లటం ఇక్కడి సంస్కృతిలో భాగం. కోటప్పకొండ శివరాత్రి తిరునాళ్ళలో ప్రభలే ప్రత్యాక ఆకర్షణ.ఈ ప్రభల వైభవాన్ని చూడాలే కాని వర్ణించలేము. విద్యత్ ప్రభల థగధగ కాంతులన నడుమ ఆ రాత్రి సమయంలో కోటయ్యస్వామి కొలువైన కోటప్పకొండ మెరిసిపోతుంది. గ్రామాల నుంచి పెద్ద సంక్యలో భక్తులు ఎద్దుల బండ్లు, టాక్టర్ల ఫై కొండకు వస్తారు. కొందరు భక్తులు ప్రభలు వెంట బండ్లు కట్టుకుని కొండకు వెళతారు.

చరిత్ర

[మార్చు]

కోటప్పకొండ సమీపంలోని కొండ కావూరు గ్రామానికి చెందిన ఆనందవల్లి అనే గొళ్లభామ పరమశివ భక్తురాలు. ఆమె ప్రతిరోజు కొండపై చేరుకొని పాత కోటయ్యస్వామికి పూజలు చేసేది. ఒక నాడు తాను ఒయోభారంతో కొండ ఎక్కలేక పోతున్నాను స్వామిని వేడుకోగా స్వామి ప్రత్యక్షమై ముందు నీవు వెనుజూడకుండా కిందకు నడువు నీ వెనుక నేను వస్తానని చెప్పాడు. గొల్లభామ కిందకు దిగుతూ స్వామి వెనుక వస్తున్నారో లేదో అని వెనుదిరిగి చూడటంతో స్వామి శిళగా మారాడు. దీంతో గొల్లభామ తిరిగి ఆ స్వామిని వేడుకోగా కొండకు కోటీనొక్క ప్రభలు వస్తే అప్పడు కొండదిగి కిందకు వస్తానిని చెప్పాడు. దీంతో ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు కోటప్పకొండకు సమీపంలోని అన్ని గ్రామాల వారు ప్రభలు, విద్యత్ ప్రభలు కట్టుకుని కోటప్పకొండకు వస్తారు[1]. ముఖ్యంగా నర్సరావుపేట, చిలుకలూరి పేట, అమీన్ సాహిబ్ పాలెం, గంగనపాలెం, కోమటినేనివారిపాలెం, గోవిందపురం, కమ్మవారిపాలెం, కావూరు. అప్పాపురం, పురుషోత్తపట్టణం, ఉప్పల నపాడు, నకరికల్లు, దేచవరం, గామాలపాడు, ఈవూరు, బొమ్మరాజుపల్లి గ్రామాలు,పట్టణాలు నుండి భారీ ప్రభలులతో పాడు వివిధ గ్రామాల నుంచి చిన్న, మద్య తరహా ప్రభలు కొండకు వస్తాయి. ఈ సాంప్రదాయం వందల ఏళ్లనుంచి నడుస్తుంది.

ప్రభ తయారీ

[మార్చు]

ప్రతి గ్రామానికి సోంతగా ప్రభ నిర్మాణానికి కావలిసిన వస్తు సామాగ్రి ఉంటుంది. శివరాత్రికి 15 రోెజుల ముందు ఒక మంచి రోజున ప్రభ తయారీ మొదలు పెడతారు. ఆయా గ్రామాల్లో గ్రామస్థులు గ్రామ కంసాలి సహాయంతో ప్రభలు కడతారు. ముందుగ వెదురు బొంగులతో ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకొస్తారు. వెదురు బొంగులు ఒకదానికి ఒకటి కలిసే చోట కొబ్బరి పీచు తాడుతో గట్టిగ కడతారు. ఆ ఆకారానికి తడికలు కడతారు. తరువాత వాటి పై రంగు రంగుల కాగితాలు, కాగితాలతో చేసిన పూలు మైదా పిండి, సన్న ఇనుప వైరుతో అంటిస్తారు. దీంతో ప్రభకు ఒక రూపు వస్తుంది. రూపుదిధ్దుకున్న ప్రభకు వందల సంఖ్యలో విద్యత్ దీపాలను చిలుకలూరి పేట, నర్సారావు పేటకు చెందిన సాంకేతిక నిపుణులు అమర్చుతారు. చిన్న ప్రభలు 6 అడుగుల నుంచి 60 అడుగులు వరకు కడతారు. వీటిలో కొన్ని సాదా, కొన్ని విద్యుత్ ప్రభలు ఉంటాయి. పెద్ద ప్రభలు మాత్రం ఒక్కొక్క ప్రభ 60 అడుగుల నుంచి 100 అడుగుల ఎత్తు వరకు కడతారు. ప్రభలకు అమర్చిన విద్యత్ దీపాలను వెలిగించటానికి రెండు పెద్ద డైనుమో జనరేటర్లు వాడతారు. ప్రభల ఎత్తు, డిజైన్ విషయంలో గ్రామాల మధ్య తీవ్ర పోటీ ఉండేది. ప్రభ తయారికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. గ్రామాల్లో స్థానిక ప్రజలు ఏడాదికి ఒక వర్గం చొప్పున వంతులు వారీగా చందాలు వేసుకుని ప్రభల నిర్మాణం చేపడతారు. పురుషోత్తమపట్నం గ్రామంలో పోటా పోటీగా మూడు, నాలుగు విద్యుత్ ప్రభలు కడతారు.

ప్రభ తరలింపు

[మార్చు]

కోటప్పకొండకు 20 కి.మీ. ఆ పై దూరంగల గ్రామాల లోని విద్యుత్ ప్రభలు కొండకు చేర్చటానికి శివరాత్రికి ఒక రోజు ముందే గ్రామం నుంచి ప్రభ బయలు దేరుతుంది. ముందుగా ప్రభను రాతి చక్రాలతో కూడిన చెక్కరథం పై ఉంచుతారు. ఆ రథాన్ని ముందుగా సాంప్రదాయబద్దంగా కోడెగిత్తలు (ఎడ్లు) ద్వారా లాగుతారు. ఆ తరువాత వీటి స్థానంలో టాక్లరు లాగుతుంది. ఓక్కోక్క ప్రభను తరలించటానికి రథానికి 50 నుంచి 100 జతలు గిత్తలు కట్టి రథాన్ని లాగించేవారు. ప్రస్తుతం కొన్ని ప్రభల రథాలను టాక్టర్లు లాగుతున్నాయి. ప్రభ పడిపోకుండ బ్యాలన్స్ చేయ్యటానికి ప్రభకు పమ్మ తాడులు ఉంటాయి. ప్రభకు కింద నుంచి పై వరకు కనీసం 80 తాడులు పైనే కడతారు. ప్రభ కదిలే సమయంలో ఓక్కొక్క తాడును ఐదు నుంచి 10 మంది పట్టుకుంటారు. పమ్మతాడులు పట్టుకునే వారు . చేదుకో.. కోటయ్య.. అని ఆ కోటయ్య స్వామిని స్మరిస్తూ తాడులు పట్టకుని ప్రభ పడిపోకుండా జాగర్తగా ప్రభని ముందుకు నడుపుతారు. ప్రభ రోడ్డు పైన ఉంటే దాని తాడులు పట్టుకున్నవారు పక్కన పొలాలు, ముళ్ల కంపల వద్ద ఉండే వారు, ఆ సమయంలో కాళ్లకు ముళ్ళుదిగి, ముళ్ల కంపలు గీచుకొని చిన్నచిన్నగాయాలు అవుతాయి. కొండకు ప్రభ చేరేలోపు కనీసం రెండు సార్లు అయినా రథం ఇరుసు ఇరుగుతుంది. ఇరుసులు రెడీగా ఉంటాయి. కానీ దాన్ని మార్చటానికి రెండు మూడు గంటలు సమయం పడుతుంది. ఇలా అనేక ప్రయాసలు పడి ఒక రోజు ముందు బయలు దేరినా శివరాత్రి రోజున రాత్రి 8 గంటల సమయానికి చేరుకుంటుంది. మరీ ఎక్కవ ఇబ్బందులు ఎదురైతే మాత్రం ప్రభ ఓక్కొక్క సారి 1 గం. 2 గం.లకు తెల్లవారుజామున చేరుకుంటాయి. ప్రభలు ఇరిగిపోయిన సంఘటనలు, విద్యుత్ షార్ట్ అయ్యి ప్రభలు కాలిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రభలను గ్రామాలలో కట్టుకొని కొండకు తీసుకెళటం అనేది ఓక్క కొటప్పకొండలో మాత్రమే కనపడుతుంది[3].

సాంప్రదాయం

[మార్చు]

కోటప్పకొండ సమీపంలోని గ్రామాల్లో అన్నిపండుగల కన్నా మహాశివరాత్రి పర్వదినాన్నే పెద్ద పండుగగా సాంప్రదాయ బద్దంగా చేసుకుంటారు, పండుగకు ఇతర గ్రామాల వారితో వివాహం జరిపిన తమ ఆడపిల్లలను, అళ్లుళ్ళను గ్రామస్థులు తమ గ్రామాలకు తీసుకురావటం ఇక్కడి సాంప్రదాయం. వేరు వేరు కారణాలతో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు కుటుంబసమేతంగా పండుగలకు మూడు రోజుల ముందే తమ స్వగ్రామాలకు చేరుకుంటారు. మొక్కుబడులు ఉన్నవారు శివరాత్రి ఉదయం పూటనే కొండకు చేరుకొని తలనీళాలు అర్పించి మొక్కు తీర్చుకుంటారు.

సందడి

[మార్చు]

కోటప్పకొండ సమీపంలోని గ్రామాలలో మహాశివరాత్రికి 15 రోజుల ముందు నుంచే సందడి మెదలు అవుతుంది. ఆయా గ్రామాలలో ప్రభల తయారీ మెదలైన దగ్గర నుంచి సగం గ్రామం ప్రభల దగ్గరే ఉంటుంది. బంధువులు,కొడుకులు,కోడళ్లు,ఆడబిడ్డలు,అళ్ళుళ్లు,మనవలు,మనవరాండ్రులతో లోగిళ్లు కళకళలాడుతుంటాయి.పిండివంటల సువాసనలతో గ్రామం అంతా గుమగుమలాడుతుంటుంది. ప్రభ నిర్మాణం పూర్తిఅయ్యిన తరువాత శివరాత్రికి మూడు రోజుల ముందుగా గ్రామాలలో ప్రభల పై సాంఘిక, పౌరాణిక నాటికలు, నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. వీటని గ్రామీణులు ఎంతోఆసక్తితో తిలకిస్తారు.యువతి, యువకులు నూతన పరికిణి, పంచలతో వీధుల్లో తిరుగాడుతుంటే ఎంతో సందడిగా ఉంటుంది. మేలు జాతి గిత్తలు, వాటి కాళ్ళకు కట్టిన గజ్జెల సవ్వడి, మెడకు కట్టిన గంటల మోతలు, వాటిని అదిలించటానికి చండ్రకోళ్ల గాలిలో ఊపుతుంటే వచ్చే శబ్దం, కోలాట విన్యాశాల నడుమ, కనకతప్పెట్ల కోలాహలం మధ్యన ప్రభ కదిలి వెలుతుంటే గ్రామాలలో సందడే సందడి.

ఇతర ప్రాంతాల్లో

[మార్చు]

కోటప్పకొండ ప్రాంతంలోనే కాకుండా పల్నాడు ప్రాంతంలోని ఇతర గ్రామాల్లో జరిగే తిరునాళ్లలో ప్రభల సంస్కృతి కనపడుతుంది. కోటప్పకొండ తరహాలో ప్రభలను ప్రదర్శనగా కొండలకు తరలించం అనేది ఇతర ప్రాంతాల్లో కనిపించదు. ఇక్కడ తిరునాళ్లు జరిగే ప్రదేశంలోనే ప్రభలు కడతారు. మాచర్ల ప్రాంతంలోని ఒప్పిచర్ల, అడిగొప్పల, నిదానంపాడు, ముట్టుకూరు,మండాది, కొత్తపల్లి, తాళ్ళపల్లి, గురజాల ప్రాంతంలోని గురజాల, జంగమహేశ్వరపురం, పులిపాడు, దైద తదితర గ్రామాల తిరునాళ్లలలో ప్రభలు నిర్మిస్తారు.[4]

కోటప్పకొండ ప్రభల విన్యాసం

[మార్చు]

గుంటూరు జిల్లా నర్సారావు పేటకు దగ్గరా వున్న కోటప్ప కొండ, శైవ క్షేత్ర మైన పుణ్య క్షేత్రం. ప్రతి శివరాత్రికీ బ్రహ్మాండమైన ఉత్సవం జరౌగుతుంది. తిరుపతి కొండకు వెళ్ళి మ్రొక్కులు తీర్చు కున్నట్లే ఇక్కడ కూడా వేలాది మంది మ్రొక్కులు తీర్చు కుంటారు. ఎవరికి వారు మ్రొక్కులు తీర్చు కోవడానికి వస్తూ పెద్ద పెద్ద ప్రభలను కట్టి వాటిని ఎంతో అందంగా అలరించి ఒకరిని మించి ఒక పోటీలు పడి ఈ ప్రభలను నిర్మిస్తారు.

ముద్దుల ఎద్దుల అలంకారం

[మార్చు]

ప్రభల బండ్లకు కావలసిన ఎడ్లను ఎంతో ముద్దుగా పెంచుతారు. అందు కోసం వాటికి మంచి తిండి తయారు చేస్తారు. కన్న బిడ్డలను సాకి నట్లు సాకుతారు. వాటికి మెడలో మువ్వల పట్టెడ, గంటల పట్టెడ, మూతికి అందమైన శికమార్లు, నడుంకు తోలు బెల్టు, ముఖానికి వ్రేలాడే కుచ్చులు, కొమ్ములకు రంగులు, కాళ్ళకు గజ్జెలు, వీపుమీద రంగు రంగుల గుడ్డలు అలంకరిస్తారు. ప్రభలు బయలుదేరి వస్తూ వుంటే ఈ ఎడ్ల సౌందర్యాన్ని చూడడానికి జనం మూగుతారు. ప్రభలు వారి వారి శక్తి కొలది పెద్ద పెద్ద ప్రభలను తీసుకు వస్తారు. ఆ ప్రభలను రంగు రంగుల గుడ్డలతో, రంగుల కాగితాలతో, ఫోటోలతో అలంకరిస్తారు. శక్తి కలవారు జనరేటర్ పెట్టి ప్రభలకు ఎలెక్ట్రిక్ బల్ల్బులను అమర్చుతారు[5].

ప్రభల విన్యాసం

[మార్చు]

అలంకార శీభిమ మైన ఈ ప్రభలు వూరేగింపుగా బయలు దేరితే, మ్రొక్కుబడులున్న వారు భక్తి శ్రద్ధలతో ప్రభ ముందు నడుస్తారు. ప్రభ ముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ వుంటే వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు ఠీవిగా నడుస్తూ వుంటే, అలంకరించిన మువ్వల, గజ్జల, గంతల మ్రోతలు తాళానికి అనుగుణంగా మ్రోగి నట్లుంటుంది. ఉత్సాహంతో ఠీవిగా నడిచే ఎద్దులు అప్పుడప్పుడు రంకెలు వేస్తూ వుంటే, సంగీత శాస్త్రంలో ఎద్దు వేసే రంకెను, సప్త స్వరాలలో రెండవది అయిన (రిషభం) అని నిర్ణయించారని కీ||శే|| డా. కే.యస్. కేసరి గారు వారి చిన్ననాటి ముచ్చట్ల గ్రంథంలో ఉదహరించారు. రిషభ స్వరం ద్వారా వీర రసం, అద్భుత రసం, రౌద్ర రసం వెలువడతాయని వివరించారు.

కోడె గిత్తలతో నడుప బడే ఈ ప్రభలను నడిపే వారు యుక్త వయస్సులో వున్న యువకులు, చెర్నాకోలను చేతిలో ధరించి తలకు మంచి తలపాగాను అందంగా చుట్టి ఆహాహై చో చో అంటూ ఎడ్లను అదిలిస్తూ కోర మీసం దువ్వుతూ చలాకీగా ఎడ్లను తోలుతూ వుంటే పౌరుషంతో కోడె గిత్తలు ముందుకు సాగి పోతాయి. ఇలా బయలు దేరిన ప్రభల బండ్లు ఆయా గ్రామాల గుండా ప్రయాణించే టప్పుడు గ్రామస్థులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వార పోయగా, పురుషులు కత్తి చేత బట్టి, దండకాలను చదువుతారు. ఇలా చదివేవారు జంగాలు, ఆరాధ్య బ్రాహ్మణులు.

శరభ శరభ

[మార్చు]

శైవులు, వీర శైవులు పలు సఆందర్భాలలో దక్షయజ్ఞ దండకం చదివినట్లె ఇక్కడా చదువుతారు. ఇలా చదివేటప్పుడు ఖడ్గధారులు ప్రభ ముందు నిలబడి వెనకకూ ముందుకు నడుస్తూ ఎగిరెగిరి గంతులు వేస్తూ పరవళ్ళు త్రొక్కుతూ వుంటే పక్క నున్న వాళ్ళు బుంజ వాయిద్యాన్ని తప్పెట వాయిద్యాన్ని వాయిస్తూ, కొమ్ము బూరగాలనూ, కాహశాలనూ ఊది దండకం చదువరిని వుత్తేజ పరుస్తారు.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 http://www.youtube.com/watch?v=uR3EgZeRVjs
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2014-11-05.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-06. Retrieved 2015-02-16.
  4. తెలుగువారి జానపద కళారూపాలు (1992) రచించినవారు మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి. గ్రంథంలో ప్రభల గురించి
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-06. Retrieved 2015-02-16.

వెలుపలి లంకెలు

[మార్చు]