తిరుమల తిరుపతి దేవస్థానములు
సంకేతాక్షరం | టిటిడి |
---|---|
స్థాపన | 1932 |
రకం | ట్రస్టు |
కేంద్రీకరణ | తిరుమల ఆలయ పాలకమండలి |
ప్రధాన కార్యాలయాలు | తిరుమల, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
అధికారిక భాష | తెలుగు |
చైర్మన్ | బి.ఆర్.నాయడు |
కార్యనిర్వాహక అధికారి | జె.శ్యామలరావు |
అనుబంధ సంస్థలు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
బడ్జెట్ | ₹5,141.74 crore (2024–2025)[1] |
తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయమైన తిరుమల వెంకటేశ్వరుని ఆలయాన్ని నిర్వహించే ఒక స్వతంత్ర సంస్థ. ఇది దేవాలయం బాగోగులు చూడడమే కాక వివిధ సామాజిక, ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, విద్యా సంబందమైన కార్యక్రమాలను భారతదేశం నలువైపులా నిర్వహిస్తుంటుంది. 1933లో టీటీడీ పాలకమండలి ఏర్పాటైంది.[2] ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి, ₹1925 కోట్ల వార్షిక బడ్జెట్, వేలాది సిబ్బంది, సామాజికసేవ, కల్యాణమస్తు, దళితగోవిందం లాంటి ఎన్నెన్నో బృహత్తర కార్యక్రమాల నిర్వహణ... వెరసి అదొక మహావ్యవస్థ. ఇందులో సుమారు 14,000 మంది ఉద్యోగులు ఉంటారు. వీరు దేవస్థానం నిర్వహించే 12 ఆలయాలను, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు.
ఇది వాటికన్ తరువాత అత్యధిక ఆర్థిక వనరులు కలిగిన సంస్థ. 1830ల నాటికే తిరుమల ఆలయంలో భక్తులు చెల్లించే సొమ్ము నుంచి ఈస్టిండియా కంపెనీ వారికి సంవత్సరానికి ₹1 లక్ష వచ్చేది.[3] స్వామి వారి ఆభరణాల నిర్వహణకు బొక్కసం సెల్‌ను తితిదే ఏర్పాటు చేసింది. సహాయ కార్యనిర్వాహణాధికారి పర్యవేక్షణలో ఇది కొనసాగుతుంది. ఆభరణాల కోసం తితిదే 19 రికార్డులను నిర్వహిస్తోంది.[4]
స్థాపన
[మార్చు]ధర్మకర్తల మండలి: తిరుమల ఆలయ పాలనా బాధ్యతలు నిర్వర్తించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1933లో... కమిషనర్ల నేతృత్వంలో నడిచే పాలకమండలి వ్యవస్థను ఏర్పాటు చేసింది. మళ్లీ 1951లో చేసిన హిందూ మత చట్టం ప్రకారం కమిషనర్లందరినీ కార్యనిర్వాహక అధికారులు (ఈవో) గా మార్చింది. అంతేకాదు, తితిదేకు ఓ ధర్మకర్తల మండలిని ఏర్పాటుచేసి దానికి అధ్యక్షుడిని నియమించారు. ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో ఈవో ఆలయ పరిపాలన నిర్వహిస్తారని చట్టంలో పేర్కొన్నారు.
తితిదే పాలక మండలి ఏర్పాటైన తర్వాత ఏడున్నర దశాబ్దాల్లో తిరుమల అంతటా సర్వతోముఖాభివృద్ధి జరిగింది. భక్తుల సౌలభ్యం కోసం రూ.26 వేల ఖర్చుతో మెట్ల మార్గాన్ని నిర్మించడంతో ఆ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది మండలి. వారు తలపెట్టిన రెండో ప్రాజెక్టు ఘాట్ రోడ్డు. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలూ పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఇన్ని కార్యక్రమాలను చేపట్టి విజయవంతం చేసిన ఘనత తొలి ఈ.వో. చెలికాని అన్నారావుదే[2]
నిర్మాణాలు నిర్వహణ
[మార్చు]- భక్తుల సౌలభ్యం కోసం ₹26 వేల ఖర్చుతో మెట్ల మార్గాన్ని నిర్మించడం
- ఘాట్ రోడ్డు: 1944 ఏప్రిల్ పది నాటికి మెలికలు తిరిగే అందమైన రోడ్డు సిద్ధమైంది.
- కొండమీదకు బస్సు: ఘాట్‌రోడ్డు పుణ్యమాని 1956 నాటికి భక్తుల సంఖ్య ఐదారు రెట్లు పెరిగి ఐదారొందలకు చేరుకుంది.
- శ్రీవారి ఆలయంలో పరకామణి వ్యవహారాలను క్రమబద్ధీకరించి రోజూ హుండీ ఆదాయాన్ని లెక్కించే విధానాన్ని ప్రవేశపెట్టారు
- దాతల భాగస్వామ్యంతో అనేక కాటేజీలు నిర్మాణం.
- 1978 నాటికి రెండో ఘాట్ రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయి.
- 1978 - 82 కాలంలో కార్యనిర్వహణాధికారిగా ఉన్న పీవీఆర్కే ప్రసాద్ అభివృద్ధి కార్యక్రమాల్ని మరింత వేగవంతం చేశారు.
- తిరుమల ఆలయ ధ్వజస్తంభాన్ని పునరుద్ధరించడం,
- మాడవీధులను విస్తరించడం,
- అన్నదాన భవన నిర్మాణం
- ఎందరికో ఉపాధినిచ్చిన అన్నమాచార్య, దాససాహిత్య, వేదరికార్డింగ్ ప్రాజెక్టులను నెలకొల్పడం
- కోకిలమ్మ ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఆలపించిన వెంకటేశ్వర సుప్రభాతం నేల నలుచెరగులా వినిపించింది అప్పుడే.
1983లో ఎన్టీ.రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత తిరుమల-తిరుపతికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడంతో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కింది. అతని హయాంలో
- వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిర్మించారు
- ఉచిత అన్నదాన పథకాన్ని ప్రారంభించారు
- తిరుమలలో మిరాశీ వ్యవస్థను రద్దుచేశారు[2]
- కల్యాణకట్టలో ఉచితంగా తలనీలాలు తీసే విధానాన్ని ప్రవేశపెట్టారు
- తిరుమలలో అధునాతన రోడ్లను నిర్మించారు.
- కాలినడకమార్గాన్ని ఆధునీకరించి పూర్తిగా పైకప్పు వేయించారు.
- తిరుమలకు తెలుగు గంగ నీటిని తరలించారు.[2]
- కొండమీద విద్యుత్తుకోత లేకుండా విధాన నిర్ణయం తీసుకున్నారు
- తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి స్విమ్స్ నిర్మించారు[2]
- ఎముకల సంబంధ వ్యాధుల ఆసుపత్రి బర్డ్.
- శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం[2]
- మహాతి సభా మందిరం నిర్మించారు
కార్యక్రమాలు
[మార్చు]- నల్లరాతిశోభతో మెరిసే తిరుమల ఆలయానికి బంగారుపూతతో పసిడి వన్నెలద్దింది
- తిరుమలలో పలుప్రాంతాల్లో ప్రైవేటు క్షురకులు తలనీలాలు తీసేవారు. ఆ పద్ధతికి స్వస్తి చెప్పి వారికంటూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి ఒకేచోట తలనీలాలు తీసే విధానాన్ని అమలులోకి తెచ్చారు.
- శ్రీవారి బ్రహ్మోత్సవాలను దేశవ్యాప్తంగా ఉన్న అశేషభక్తులకు నేత్రపర్వం కలిగించేలా 1995లో దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు
- 1999 - 2000 నడుమ తిరుమలేశుని దర్శన విధానంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. శ్రీవారి సులభ దర్శనం కోసం 'సుదర్శనం కంకణాల' విధానానికి రూపకల్పనచేసి అమల్లోకి తెచ్చిందప్పుడే. ఈ విధానం వల్ల భక్తులకు రోజుల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడాల్సిన అగత్యం తప్పింది.[2]
- శ్రీవారి కోసమే ప్రత్యేకంగా ఓ ఛానెల్‌ను ప్రారంభించింది తితిదే. అదే శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఈ ఛానెల్ ద్వారా 2008 జూన్ నుంచే ప్రసారాలు ప్రారంభమై భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడిస్తున్నాయి[2]
సేవలు
[మార్చు]- ఆర్జితసేవలు
- సుప్రభాతం సేవ
- అర్చన
- తోమాల సేవ
- అభిషేకం
- కల్యాణోత్సవం
కొద్ది సంవత్సరాల క్రితం వరకు కల్యాణకట్ట ఎదురుగా ఉన్న అన్నదాన సత్రంలో ఒకేసారి 1000 మంది మాత్రమే భోజనం చేసే సౌకర్యం ఉండేది. తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరగడంతో ఈ రద్దీని తట్టుకునేందుకు, వరాహస్వామి అతిథిగృహం సమీపంలో రెండో అన్నదాన సత్రాన్ని తితిదే నిర్మించండం జరిగింది. అలాగే అన్నదానానికి గతంలో ఉన్న టోకెన్ పద్ధతిని ఎత్తివేస్తూ ఇటీవల ప్రారంభించిన సర్వజన భోజనం పథకం భక్తుల ప్రసంసలు అందుకుంటుంది[5]
సామాజికసేవ
[మార్చు]- విద్యాభివృద్ధి కోసం తిరుపతిలో ప్రాచ్య పరిశోధనా సంస్థ,
- ఎస్వీ ఆర్ట్స్ కళాశాల
- సంగీత, నృత్య కళాశాల
- బధిరుల పాఠశాల
- రుయా ఆసుపత్రి
- కుష్టురోగుల ఆసుపత్రి
- తిరుమలలో అశ్వని ఆసుపత్రిని నిర్మించారు
- కల్యాణమస్తు:పేద జంటలకు ఉచితంగా కల్యాణం జరిపించటం. వధూవరులకు నూతన వస్త్రాలూ మంగళసూత్రాలూ ఇచ్చి జరిపిస్తున్న ఇలాంటి కార్యక్రమం ఆలయాల చరిత్రలోనే ప్రథమం.
- దళిత గోవిందం: స్వామి చెంతకు చేరుకోలేని వారందరికోసం ఆయనే వాడవాడలా పర్యటించే అపురూపదృశ్యం.
- మత్స్యగోవిందం: మత్స్యకారులకు వైదిక కర్మల్లో శిక్షణనిచ్చి సర్వమానవ సమానత్వాన్ని చాటుతోంది.
- ఉపకార వేతనాలు: పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన వెయ్యి మంది పేద విద్యార్థులకు నెలకు ₹300 చొప్పున ఉపకార వేతనాలు ఇవ్వాలనేది ఇటీవల తీసుకున్న నిర్ణయం.
- రైలుగోవిందం: బాలాజీ దర్శన గోవిందం... తితిదే-, భారత రైల్వే ఆహార, పర్యాటక సంస్థ (ఐఆర్‌సిటిసి) నడుమ కుదిరిన ఒక ప్యాకేజీ ఒప్పందం పేరిది. ఈ పథకంలో భాగంగా వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తితిదే. శ్రీనివాసం విడిదిగృహంలో బస నుంచి అర్చనానంతర, సెల్లార్ దర్శన టిక్కెట్ల వరకూ అన్నీ చక్కగా అమరుస్తోంది..
- విజయవాడ నుంచి
ప్రతిరోజూ మధ్యాహ్నం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం మొదలవుతుంది. గూడూరులో భోజనం. రాత్రి తిరుపతిలోని శ్రీనివాసం విడిదిగృహంలో బస. మర్నాడు తెల్లవారుజామున నాలుగింటికి కొండపైకి తీసుకెళ్లి అర్చనానంతర దర్శనం చేయిస్తారు. అనంతరం శ్రీకాళహస్తి, అలివేలు మంగాపురం ఆలయాల సందర్శన. మధ్యాహ్న భోజనం అయ్యాక శ్రీనివాస మంగాపురం, కాణిపాకం క్షేత్రాల్లో దర్శనం. చంద్రగిరి కోట సందర్శన. రాత్రికి మళ్లీ తిరుపతి శ్రీనివాసంలో బస. మర్నాడు తెల్లవారుజామునే విజయవాడకు తిరుగుప్రయాణం. ఉదయం ఫలహారం, రెండుపూటలా భోజనం రైల్లోనే. థర్డ్‌క్లాస్ ఏసీ రుసుము పెద్దలకు ₹2800, పిల్లలకు (5-11) ₹2400. స్లీపర్‌క్లాస్‌లో అయితే పెద్దలకు ₹2100, పిల్లలకు ₹1950.
- సికింద్రాబాద్ నుంచి
వారాంతాల్లో తిరుమలలో సెల్లార్ దర్శనం ఉండదు. కాబట్టి సికింద్రాబాద్ నుంచి వారానికి ఐదురోజులు మాత్రమే ఈ ప్యాకేజీ ఉంటుంది. ఆదివారం నుంచి గురువారం వరకూ. ఈ ఐదురోజుల్లో రోజూ రాత్రి ఎనిమిదింటికి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం మొదలవుతుంది. మర్నాడు పొద్దున్న ఆరింటికి తిరుపతికి చేరాక శ్రీనివాసంలో బస, ఫలహారం. అక్కణ్నుంచి కొండమీదకు తీసుకెళ్లి సెల్లార్ దర్శనం చేయిస్తారు. కొండ దిగాక మధ్యాహ్నభోజనం. అనంతరం అలివేలుమంగాపురంలో అమ్మవారి దర్శనం. సాయంత్రం మళ్లీ నారాయణాద్రిలోనే తిరుగు ప్రయాణం. ఆ రాత్రికి భోజనం రైల్లోనే. థర్డ్‌క్లాస్ ఏసీ రుసుము పెద్దలకు ₹3,400, పిల్లలకు ₹2,400. స్లీపర్‌క్లాస్‌లో పెద్దలకు ₹2,000, పిల్లలకు ₹1,600.
కల్యాణమస్తు
[మార్చు]2006 వ సంవత్సరంలో బోర్డు ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి ఈ పథకానికి రూపకల్పన చేశారు. 2007 ఫిబ్రవరి 21 న దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అంకురార్పణ జరిగింది. సరాసరి ఒక్కో జంటకు ₹7 వేల వరకు వ్యయం అవుతున్నది. ఇప్పటివరకూ 34,017 జంటలను ఒక్కటి చేసిన టిటిడికి అయిన ఖర్చు సుమారు ₹24 కోట్ల రూపాయలు.స్వామిని దర్శించి, ముడుపులు చెల్లించే వారిలో తమిళనాడు, కర్నాటక, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారుకూడా ఉన్నారు కనుక కళ్యాణమస్తును దేశ వ్యాపితం చేయాలని కొందరు వాదిస్తున్నారు. బంగారపు తాళిబొట్టు, వెండి మట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్ళిసామాగ్రి, మంగళ వాయిద్యాలు, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధుమిత్రులకు పెళ్ళి భోజనాలు ఉచితంగా కల్పిస్తున్నది. వివాహాలు జరిపించలేని పేద, మధ్య తరగతి కుటుంబాలవారు, తల్లిదండ్రులు లేని అనాథలు కూడా ఈ కార్యక్రమంవల్ల లబ్ధిపొందుతున్నారు. కానీ చౌకగా జరిగే ఇలాంటి మూకుమ్మడి కళ్యాణాలకు గౌరవంతక్కువ అనే భావంతో ప్రజలనుండి తగినంత స్పందన లేదు. రాష్ట్ర వ్యాపితంగా ఈ కార్యక్రమాన్నిఏడాది పొడవునా కాకుండా ఏడాదికి ఒక్క రోజుమాత్రమే చేపట్టటంతో నిరాశ చెందుతున్నారు. గోదాదేవి లాగానే బీబీ నాంచారి అనే ముస్లిం స్త్రీ కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది. వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి మతాంతర వివాహాలుకు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని సుబ్బన్న శతావధాని చెప్పారు.
ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా పేరు గాంచిన మన వడ్డి కాసుల వాడి ఆలయానికి నిత్యం వేలాది భక్తులు వస్తుంటారు. పర్వ దినాలలో వారి సంఖ్య లక్షలకు చేరుతుంది. ఈ స్వామి వారి వార్షికాదాయం ఏడు వందల యాబై కోట్ల రూపాయల పైమాటే. ఈ స్వామి వారికి మూడు వేల కిలోల బంగారు డిపాజిట్లున్నాయి. ఇంకా వెయ్యి కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లున్నాయి. ఈ ఆలయానికి ఏటా సరాసరిన మూడు వందల కోట్ల రూపాయలు, మూడు వందల కిలోల బంగారు ఆబరణాలు, ఐదు వందల కిలోల వెండి ఆబరణాలు కానుకలుగా వస్తుంటాయి. ఈ స్వామి వారికి జరిగే ఉదయాస్తమాన సేవ టికెటు ధర పది లక్షల రూపాయలు. అయినా ఆ టికెట్లు రాబోయె ముప్పై ఏళ్ళ వరకు బుక్ అయి పోయాయి. మొత్తంమీద ఈ ఆలయం సంపద విలువ ముప్పైమూడు వేల కోట్ల రూపాయలు. ఈ ఆలయం వలన లక్షకు పైగా ప్రజలు ఉపాది పొందుతున్నారు.
తిరుమల శ్రీనివాసుని ఆదాయం విషయానికొస్తే:.... ఏటా భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా వంద కోట్లు ఆ దాయం వస్తున్నది. బ్యాంకుల్లో వుండే ఫిక్సుడు డిపాజిట్ల పై వడ్డీ ₹140 కోట్లు వుంటుంది. ఈ స్వామి వారి చెంత నున్న బంగారం సుమారు ఐదు టన్నులు. విదేశాలలో వున్న స్థిరాస్తుల విలువ సుమారు 33 వేల కోట్లు.
ఈ ఆలయ పాలన అంతా 1952 వరకు మహంతులు, మిరాసీ దారుల చేతుల్లో వుండేది. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి చేతుల్లోకి వచ్చింది. తి.తి.దే ఏర్పడ్డాక కూడా మిరాసి విధానమె కొనసాగింది. అనగా పూజారులు వంశ పారంపర్య హక్కు కలిగి వుండే వారు. అర్చకులకు వేతనాలకు బదులు శ్రీవారి ప్రసాదాల్లో వటా ఇచ్చేవారు. తయారు చేసిన ప్రతి 51 లడ్డులకు 11 లడ్డులను మిరాసి కింద అర్చకులకిచ్చేవారు. వాటిని అర్చకులు అమ్ముకునేవారు. 1987 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు /మిరాసి విధానాన్ని రద్దు చేశారు. కాని అర్చకులు కోర్టు కెల్లారు. 1996 నాటి కోర్టు తీర్పు తర్వాత తి.తి.దే మిరాసి పద్ధతిని పూర్తిగా రద్దు చేసింది. అర్చకులకు వేతనం ఇచ్చే పద్ధతిని ప్రారంబించారు. కాని ఇప్పుడు మిరాసి విధానాన్ని పునరుద్దరించాలని అర్చకులు పోరాడుతున్నారు. కారణం ఏమంటే?............ తి.తి.దే ప్రస్తుతం రోజుకు 4 లక్షల లడ్డులను తయారు చేస్తున్నది. మిరాసి విధానం ప్రకారం ప్రతి 51 లడ్డులకు 11 లడ్డులను అర్చకులకివ్వాలి. అనగా రోజుకు 86274 లడ్డులను అర్చకులకివ్వాలి. ప్రస్తుతం ఒక లడ్డు ధర 25 రూపాయలు. ఆ లెక్కన మిరాసి ధారులకు రోజుకు 21,56,000 రూపాయలను చెల్లించాలి. ఇంత ఆదాయాన్ని వదులు కోడానికి వారికి రుచించ లేదు.
శ్రీవారు 2011 వ సంవత్సరంలో ఆదాయం: ₹1700 కోట్ల రూపాయలు ...... రాగా వివిధ జాతీయ బ్యాంకుల్లో వున్న డిపాజిట్లకు వడ్డీ ద్వారా ......, వివిధ రకాల పూజా కార్యక్రమాల ద్వారా రోజు వారి టికెట్ల విక్రయం ద్వారా మరో 200 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇవి గాక భక్తులు సమర్పించిన వజ్రాలు, బంగారం, వెండి, వంటి ఆభరణాలు సమర్పించారు. ఈ ఏడాది అనగా 2012 లో 2.2 కోట్ల మంది భక్తులు స్వామి వాని దర్శించు కున్నారు.[6] 7 వ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ఆలయానికి 125 కిలోల బంగారాన్ని విరాళముగా ఇచ్చారు.[7][8]
వేంకటేశ్వరుని పూజావిశేషాలు
[మార్చు]వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. అవి: ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.
సుప్రభాతం: నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకు ముందే... ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు (సన్నిధిగొల్ల) దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెకోలను, తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబురా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ, గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొలుపుతుంటాడు. అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొలుపుతారు. పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతి నిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు.
శుద్ధి: సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.
- అర్చన: శ్రీవారికి ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది) నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధ్రువబేరం నుంచి భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి, అలంకారాసనం సమర్పిస్తారు. అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.
- తోమాలసేవ: తమిళంలో 'తోడుత్తమాలై' అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై 'తోమాల'... తోమాలసేవ అయి ఉండవచ్చు. దీన్నే భగవతీ ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాలసేవ చేస్తారు.
- కొలువు: తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందురోజు హుండీ ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ, నాణాలు సహా (డినామినేషన్ ప్రకారం) మొత్తం విలువ తెలియజేస్తారు. అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు.
- సహస్రనామార్చన: ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి వేయినామాలనూ స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసిదళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో మిరాశీదారు వరాహ పురాణం లోని లక్ష్మీసహస్రనామాలను పఠిస్తారు. తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.
- మొదటిగంట, నైవేద్యం: మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి (పడికావలి) కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.
- అష్టోత్తర శతనామార్చన: ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు.
- రెండో గంట, నైవేద్యం: అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.
- రాత్రి కైంకర్యాలు: ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి. ఈ సమయంలో మూడో గంట మోగుతుంది. దీని తర్వాత మళ్లీ సర్వదర్శనం.
- ఏకాంతసేవ: రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసి పాలు, పళ్లు, బాదంపప్పులు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండిగిన్నెలలో ఉంచుతారు. ఏడుకొండల వాడిని నిదురపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు. (ఏకాంతసేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగశ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది.) దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.
గుడిమూసే ప్రక్రియ
[మార్చు]రాత్రి రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు.
ప్రత్యేక సేవలు
[మార్చు]రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమల వాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, గురువారం సడలింపు, పూలంగిసేవ, తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం. స్వామికి రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉత్సవమూర్తులకు జరిగేవి.
- సడలింపు: గురువారం ప్రాతఃకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు. కర్పూర నామాన్ని తగ్గిస్తారు. దీంతో శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి. అనంతరం శ్రీవారికి 24మూరల పట్టు అంచు ధోవతి, 12 మూరల ఉత్తరీయాన్నీ కడతారు. సువర్ణపాదాలు, హస్తాలు, శంఖచక్రాలు, కర్ణాభరణాలు, స్వర్ణసాలగ్రామహారాలు సమర్పించి తలుపులు తెరుస్తారు. దీన్నే సడలింపు అంటారు.
- పూలంగిసేవ: ఆపాదమస్తకం స్వామివారిని పుష్పమాలాలంకృతుల్ని చేయడమే పూలంగి సేవ. తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్యమనోహర విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది.
- తిరుప్పావడ: భారీసంభారాలతో స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ, దోసె, పాయసం, జిలేబి తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు.
- అభిషేకం: శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలోకి విశిష్టమైంది ప్రతిశుక్రవారం ఉదయం జరిగే అభిషేకం. ఈ సేవ ప్రాశస్త్యం ఏమిటంటే అభిషేక సమయంలో నిత్య కల్యాణశోభితుడైన స్వామివారి నిజరూప దర్శనభాగ్యం భక్తులకు లభిస్తుంది. గురువారం రాత్రి పూలంగి సేవ తరువాత దర్శనంలోనూ, శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ, అభిషేకానంతర దర్శనకాలంలో తప్ప మిగతా అన్ని రోజులూ స్వామి వెడల్పాటి తెల్లని కర్పూరనామంతో దర్శనమిస్తాడు. ఈ మూడు సందర్భాల్లో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్రదర్శనం, నిజపాద దర్శనం అంటారు.
అలంకరణ
[మార్చు]- స్వామికి అలంకరించి తీసిన పూలు భక్తులకు ఇవ్వబడవు.
సమీప పర్యాటక ప్రదేశాలు
[మార్చు]తల కోన :తిరుపతి నుండి సుమారు యాబై కిలోమీటర్ల దూరంలో వున్నది తలకోన. తిరుపతి నుండి చాల బస్సులుంటాయి. ఇక్కడ అటవీ శాఖవారి, పర్యాటక శాఖ వారి, దేవాదాయ శాఖవారి అతిథి గృహాలున్నాయి. వసతి భోజన సదుపాయాలున్నాయి. అడవి అందాలను తిలకించడానికి వాచ్ టవర్లను, చెట్లపై కర్ర వంతెనలు ఏర్పాటు చేశారు. తిరుమల ఏడు కొండల వరుసలో తల భాగాన వున్నందున ఈ కొండకు తల కోన అని పేరు వచ్చింది. ప్రకృతి రమణీయతకు ఇది ఆలవాలము. చూడ చక్కని జలపాతాలకు ఇది నెలవు. అడవిలో సాహస యాత్ర చేయ దలచిన వారికిదిఎంతో ఉత్సాహానిస్తుంది. ఇన్ని హంగులున్నందునే ఇక్కడ అనేక సినిమాల చిత్రీకరణ జరిగింది. ఈ అటవీ ప్రాంతంలో అనేక ఔషధ మొక్కలకు కూడా ప్రసిద్దే, అందుకే ఇక్కడున్న చెట్లకు వాటి పేర్లు/ వాTi శాస్త్రీయ నామాలను కూడా రాసిన బోర్డులు వేలాడ దీశారు. గిల్లి తీగ వంటి అనేక ఔషధ మొక్కలకు ఇది కేంద్రము. అందుకే ఈ ప్రదేశము బొటానికల్ టూర్ చేసే వారికి సరైన ప్రదేశము. మద్ది, జాలాది, చందనం, ఎర్రచందనం మొదలైన చెట్లకు కూడా ఇది నిలయము. అరుదైన అడవి జంతువులకు కూడా ఇది కేంద్రమే. అడవి కోళ్లు, నెమళ్లు, దేవాంగ పిల్లి, ముచ్చు కోతి, ఎలుగ బంట్లు, వంటి వన జీవ జాతికి ఈ ప్రాంతం పెట్టింది పేరు. ఇక్కడ ముఖ్య ఆకర్షణ ఇక్కడున్న అనేక జలపాతాలు. రెండు కొండల మధ్యనుండి సుమారు మూడు వందల ఎత్తునుంచి పడే జలపాతాన్ని చూస్తుంటే మనసు ఉరకలేస్తుంది. దీన్ని శిరోద్రోణ తీర్థం అంటారు. ఈ నీటిలో అనేక ఔషధ గుణాలుంటాయి. దీనికి దిగువన నెల కోన అనే ప్రాంతం ఉంది. అక్కడే సిద్దేశ్వర ఆలయమున్నది. శివ రాత్రి పర్వదినాన భక్తులు సుదూర ప్రాంతాలనుంచి ఇక్కడికి వస్తారు.
ప్రస్తుతం టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితా
[మార్చు]తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలిని 24 మంది సభ్యులతో 2024 అక్టోబరు 30న నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.[9]
- బీ. ఆర్. నాయుడు - ఛైర్మన్
- జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
- వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
- ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
- పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
- జాస్తి పూర్ణ సాంబశివరావు
- అక్కిన ముని కోటేశ్వరరావు
- శ్రీసదాశివరావు నన్నపనేని
- జంగా కృష్ణమూర్తి
- కృష్ణమూర్తి వైద్యనాథన్ (తమిళనాడు)
- వైద్యం శాంతారామ్ (చిత్తూరు జిల్లా)
- మల్లెల రాజశేఖర్ గౌడ్
- పి.రామ్మూర్తి
- జానకీ దేవి తమ్మిశెట్టి
- నరేశ్‌కుమార్ (కర్ణాటక)
- జస్టిస్ హెచ్‌ఎల్ దత్ (కర్ణాటక)
- దర్శన్. ఆర్.ఎన్ (కర్ణాటక)
- బూరగాపు ఆనందసాయి (తెలంగాణ)
- నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
- సుచిత్ర ఎల్ల (తెలంగాణ)
- అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)
- బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ)
- శ్రీసౌరబ్ హెచ్ బోరా (మహారాష్ట్ర)
- అదిత్ దేశాయ్ (గుజరాత్)
మూలాలు
[మార్చు]- ↑ https://www.thehindu.com/news/national/andhra-pradesh/ttd-pegs-its-budget-for-2024-25-at-514174-crore/article67788738.ece#:~:text=The%20Tirumala%20Tirupati%20Devasthanam%20(TTD,pegged%20at%20%E2%82%B91%2C167%20crore.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 ఈనాడు దిన పత్రికలో సేవా గోవిందం Archived 2008-07-10 at the Wayback Machine వివరాలు 2008 జులై 08 న సేకరించబడినది.
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
- ↑ ఈనాడు దిన పత్రికలో శ్రీవారు 'బంగారు' కొండ ఆభరణాల వివరాలు జులై 08, 2008 న సేకరించబడినది.
- ↑ V N, Praveen. "Tirumala Vengamamba Anna Prasadam Centre Timings Today". Prayanamam. Prayanamam. Retrieved 17 August 2022.
- ↑ "ఈనాడు" 31.12.10 న కథనం
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-07. Retrieved 2019-07-29.
- ↑ missiontelangana.com/nizam-gave-funding-for-temples-and-hindu-educational-institutions
- ↑ Andhrajyothy (30 October 2024). "టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు." Retrieved 31 October 2024.