భోగ శ్రీనివాసుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భోగ శ్రీనివాసుడు తిరుమల ఆలయంలోని శ్రీవేంకటేశ్వరుని విగ్రహం. ఈ విగ్రహం వెండితో తయారుచేయబడింది. ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు ప్రతిరోజు భోగ శ్రీనివాసునికి ప్రాతఃకాలంలో మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకం జరుగుతుంది. రాత్రిపూట పర్యంకాసనంలో నిద్రపుచ్చుతారు. ఈ దేవాలయంలో ఒక్క ధనుర్మాసంలో తప్ప మిగతా పదకొండు మాసాలు ఏకాంతసేవ జరుగుతుంది. ఈ సేవలో స్వామివారికి శయన మందిరంలోని వెండితో చేసిన ఉయ్యాలలో ఊపుతూ, తాళ్ళపాక కవుల పాటలు శ్రావ్యంగా పాడుతుండగా పాలు మొదలైనవి నివేదించడం జరుగుతుంది.

చరిత్ర[మార్చు]

దేవాలయ ప్రాకారపు ఉత్తరకుడ్యం మీద ఉన్న శాసనం ప్రకారం భోగ శ్రీనివాసుని విగ్రహం క్రీ.శ.966 సంవత్సరంలో శక్తివిటంకన్ రాజు భార్య అయిన కాడవన్ పెరుందేవి లేదా సామవై అనే పల్లవరాణి ప్రతిష్ఠించింది.మహారాజు కొప్పాత్ర మహేంద్ర పన్నార్ యొక్క 14వ పరిపాలనా కాలంలో విగ్రహ ప్రతిష్ఠ జరిపిన సందర్భంలో ప్రతిదినం నాలుగు 'నాళి'ల విరువాముదు (వండిన అన్నం) ను స్వామికి నివేదనకు ఏర్పాటుచేసినది. ఒక నిత్యదీపానికి, రెండు సంక్రాంతి పుణ్యదినాలలో తిరుమంజనానికి, ప్రధాన ఉత్సవం ప్రారంభించడానికి ముందు రెండు రోజులు ముందు పురట్టాసి (బాధ్రపద) మాసంలో ఉత్సవాన్ని తొమ్మిది రోజులు జరిపేందుకు ఏర్పాటు గావించింది. తరువాత ఈ నూతన విగ్రహాన్ని తిరువిళన్ కోయిల్ (గర్భగుడి) లో ప్రతిష్ఠించింది. 47 కళంజుల బంగారు ఆభరణాలను స్వామివారికి బహూకరించింది. ఈ కొత్త కౌతుక బేరానికి 'మనవాళప్పెరుమాళ్' అని నామకరణం గావించింది. ఈ కౌతుక బేరానికి భూములను దానం చేసింది.మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.[1]

మూలాలు[మార్చు]

  • తిరుమల ఆలయము (ధారావాహికం-41), ఆంగ్లమూలం: డా.రమేశన్, తెలుగు అనువాదం: డా.కోరాడ రామకృష్ణ, సప్తగిరి మాసపత్రిక, ఏప్రిల్ 2006 సంచికలో ప్రచురించిన వ్యాసం.
  1. Lua error in మాడ్యూల్:Citation/CS1/Date_validation at line 148: attempt to index field 'quarter' (a nil value).