Jump to content

ఆనందాళ్వార్ తోట

వికీపీడియా నుండి

వెంకటేశ్వరస్వామికి ప్రియభక్తునిగా పేరొందిన అనంతాచార్యులు (ఆనందాళ్వారు) పెంచిన తోటగా చరిత్రకెక్కిన ప్రదేశమిది.

చరిత్ర

[మార్చు]

వైష్ణవ సిద్ధాంతకర్త రామానుజాచార్యులు వేంకటేశ్వర విగ్రహాన్ని విష్ణువు మూర్తేనని యాదవరాజు ఎదుట జరిగిన వాదనలో అప్పటికే నిర్ధారించి తిరుమలలోని ఆలయ వ్యవస్థలను తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ కాలంలో తిరుమల కొండపై తోటలు బాగా తక్కువగా ఉండేవి. వేంకటేశ్వరుడు అలంకారప్రియుడని పేరు ఉంది. పరంపరానుగతంగా ఆయన అలంకారంలో పుష్పాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దాంతో తోటలు తక్కువగా ఉన్న లోటు రామానుజులు తీర్చే ప్రయత్నం చేశారు.తన శిష్యులతో కొండమీద వాసంచేస్తూ నందనవనాన్ని పెంచే స్వామివారి కైంకర్యానికి ఎవరు సిద్ధమని ప్రశ్నించారు. కొండమీద ఆవాసం రామానుజుల కాలంలో చాలా కష్టమైన పని. బాగా చలిప్రదేశం కావడం, దోమలు, విషజ్వరాల బాధ ఉండడం వంటి కారణాలతో ఎవరూ ముందుకు రాలేదు. కాని ఆ శిష్యులలో ఒకరైన అనంతాచార్యులనే శిష్యుడు ఆ సేవను అదృష్టంగా భావించి కొండకు పోయేందుకు సిద్ధమయ్యారు.[1]

లీలలు

[మార్చు]
వేంకటేశ్వరుని చుబుకానికి (గడ్డం) తగిలి రక్తం కారటానికి కారణం అనంతాళ్వార్ విసిరిన గునపం చిత్రం.

కొండమీదికి వచ్చిన అనంతాచార్యులు ఎంతో కష్టపడి నందనవనాన్ని అభివృద్ధి చేశారు. అంతటి వనాన్ని పెంచడానికి నీరు కావాల్సి ఉంటుంది కనుక సరోవరం లాంటి పెద్ద బావి తవ్వేందుకు సంకల్పించారు. ఆ పనిలో గర్భవతియైన భార్య, చిన్న కుమారుడు అవస్థపడుతూ సాయం చేయడంతో స్వామివారు స్వయంగా మారువేషం ధరించి సహకరించే ప్రయత్నం చేశారు. స్వామి వారి కైంకర్యంలో ఇతరుల సహకారం ఎందుకు అనుకుని వ్యతిరేకించగా, స్వామివారు లీలగా ఆలయం వైపు పరుగెత్తారు. అనుమానించిన అనంతాచార్యులు తన చేతిలో ఉన్న గునపాన్ని విసిరారు. ఆ వ్యక్తి (వేంకటేశ్వరుడు) ఆలయంలోకి మాయమయ్యారట.

అనంతాళ్వార్ విసిరిన గునపం దెబ్బ వేంకటేశ్వరుని విగ్రహంలో చుబుకానికి (గడ్డం) తగిలి రక్తం కారడంతో వచ్చినవారు వేంకటేశ్వరుడనే ఎరుక కలిగిందట. తాను వేంకటేశుని కొట్టానని అనంతాచార్యులు ఎంతో విలపించారు. అర్చకులు గాయానికి పుప్పొడి అద్ది ఉపశమనం చేశారు. అనంతాచార్యుని భాధ గమనించి భగవంతుడే బుజ్జగించి ఆ గాయపు గుర్తును శ్రీవత్స చిహ్నంగా భావిస్తానని, తనకు గాయమైన చోట పచ్చకర్పూరం అద్దే వుంచాలని శాసించినట్టు చెప్తారు.[2]

మరో లీలలో భాగంగా శ్రీనివాసుడే పద్మావతీదేవితో కలిసి రాకుమారుడు, రాకుమార్తె వేషాలు ధరించి అనంతాచార్యులు పెంచుతున్న పూదోటలో పూలమొక్కలను చెల్లాచెదరు చేసి అంతా చిందరవందర చేసేవారట. అనంతాచార్యులు కోపంతో అలా ఎవరుచేస్తున్నారో తెలుసుకోలేక ఒక పొదరింట్లో కాపువేశారట. తోట పాడుచేస్తున్న రాజదంపతులను పట్టుకుని సంపెంగ చెట్టుకు కట్టేస్తుండగా శ్రీనివాసుడు తప్పించుకుంటాడు. దొరికిపోయిన పద్మావతీదేవిని సంపంగి చెట్టుకు కట్టేస్తారు. నేను నీ కూతురులాంటి దాన్ని. విడిచిపెట్టు అని కోరినా వదలడు. ఉదయం అర్చకులు ఆలయం తలుపులు తెరచి చూస్తే స్వామివారి వక్షఃస్థలంలో ఉండాల్సిన అమ్మవారు లేరని గమనిస్తారు. అర్చకుల్లో ఒకరికి ఆవహించి స్వామివారు జరిగిన విషయం చెప్తారు. జరిగింది తెలుసుకున్న అనంతాచార్యులు అమ్మవారిని పెళ్ళిపూలబుట్టలో కూర్చోపెట్టి, నెత్తినపెట్టుకుని మోస్తూ ఆలయానికి తీసుకువెళ్ళారట. క్షమాపణ చెప్తున్న అనంతాచార్యులతో నీ పుత్రికను నాకు ఇవ్వు అని అడిగి కంఠంలోని ఒక పూమాలను అనంతాచార్యుని మెళ్ళో వేసి అనుగ్రహించారు స్వామివారు.[3]

పారంపర్యం

[మార్చు]

స్వామివారు రాకుమారుడిగా తోటలోని పద్మావతీదేవిని విడిచి అప్రదక్షిణంగా ఆలయానికి పారిపోయారని ప్రతీతి. దాన్ని ఆధారం చేసుకుని బ్రహ్మోత్సవాల చివరిలో స్వామివారిని అప్రదక్షిణంగా ఆనందాళ్వార్ తోటకు తీసుకువెళ్ళి హడావుడిగా పరుగుపరుగున మళ్ళీ ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం పరంపరాగతంగా కొనసాగుతోంది.[3]

మూలాలు

[మార్చు]
  1. తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:ఆగస్ట్ 2013:పేజీ.73
  2. తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:ఆగస్ట్ 2013:పేజీ.74
  3. 3.0 3.1 తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:ఆగస్ట్ 2013:పేజీ.75