కోదండ రామాలయం, తిరుపతి

వికీపీడియా నుండి
(తిరుపతి కోదండరామాలయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కోదండ రామాలయం, తిరుపతి
సప్తగిరి పత్రిక ముఖచిత్రంలో ఉత్సవ మూర్తులు
సప్తగిరి పత్రిక ముఖచిత్రంలో ఉత్సవ మూర్తులు
పేరు
ప్రధాన పేరు :కోదండ రామాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:చిత్తూరు
ప్రదేశం:తిరుపతి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీ కోదండస్వామి
ప్రధాన దేవత:సీతామహాలక్ష్మి
ఉత్సవ దైవం:కోదండరాముడు, లక్ష్మణస్వామి
ఉత్సవ దేవత:సీతాదేవి
పుష్కరిణి:రామచంద్ర పుష్కరిణి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :విజయనగర కాలం నాటిది
ఇతిహాసం
నిర్మాణ తేదీ:శాలివాహన శకం 1402 (సా.శ.1480)
సృష్టికర్త:జాంబవంతుడు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని కోదండ రామాలయం ప్రాచీనమైన, ప్రఖ్యాతమైన హిందూ దేవాలయం. ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఈ ఆలయం ఎదురుగా భక్తాంజనేయస్వామి వెలసియున్నారు.

ఆలయ చరిత్ర[మార్చు]

భవిష్యోత్తర పురాణంలో శ్రీరాముడు సీతాన్వేషణ సఫలమగుటకు శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించినట్లు చెప్పబడింది. ఆ కాలంలో ప్రస్తుతము ఆలయమున్న ప్రదేశంలో ఒక గుహ వెలసి ఉండేదని ప్రతీతి. అందుండి దివ్యమైన తేజస్సు వెలువడుతుండేది. రామాగమన గుర్తుగా ఈ ఆలయాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని తరువాతి కాలంలో జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిరని స్థానికుల అభిప్రాయము. ఈ ఆలయము లోని మూర్తులు 'రామచంద్ర పుష్కరిణి'లో చక్రవర్తికి లభించినట్లు భావిస్తున్నారు.

కోదండ రామ స్వామి వారి రథం:

గోవిందరాజస్వామి ఆలయంలోని కూరత్తాళ్వాన్ మండపం ఉత్తరగోడ లోపలి భాగంలో లభ్యమైన శాసనం ప్రకారం ఈ ఆలయాన్ని శాలివాహన శకం 1402 (సా.శ.1480) లో శఠగోపదాసర్ నరసింహ మొదలియార్, "నరసింహ ఉడయ్యార్" కాలంనాటి సంస్కృతి, సంప్రదాయాల చిహ్నంగా, రఘునాథుడు అనే పేరుతో శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్మించెనని తెలుస్తున్నది. శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ప్రకారం ఈ నరసింహ ఉడయ్యార్ గారే సాళువ నరసింహ రాయలు. 1830లో కాశీయాత్రకు బయలుదేరి దారిలో తిరుపతి ప్రాంతాన్ని దర్శించుకున్న ఏనుగుల వీరాస్వామయ్య అప్పటిలో ఆలయ స్థితిగతుల గురించి వ్రాశారు. 1830ల నాటికి రామస్వామి ఆలయానికి సర్కారు వారి కుమ్మక్కు (అధికారం) లేదని తెలిపారు. ఆలయం మొత్తంగా ఆచార్య పురుషుల చేతిలోనే ఉండేది.[1]

ఆలయ విశేషాలు[మార్చు]

ఈ ఆలయము ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించబడి తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలివుంటుంది. ఆలయపు శిల్పకళ విజయనగర కాలం నాటిదిగా గుర్తించవచ్చును. ప్రతి స్తంభంపై అనేక భాగవత, రామాయణ ఘట్టాలు, దేవతా మూర్తులు దర్శనమిస్తాయి.

శ్రీ కోదండస్వామి వారు, దక్షిణ భాగంలో సీతామహాలక్ష్మి, వామ భాగంలో లక్ష్మణస్వామి స్థానక భంగిమలో ఆర్చామూర్తులుగా వెలసి ఉన్నారు. ఇలా దక్షిణభాగంలో అమ్మవారు ఉండడం వైఖానస ఆగమశాస్త్ర నియమం. ఇలా కుడి ప్రక్కన అమ్మవారు ఉండేలా దర్శించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని పూర్వీకుల నమ్మకం.

కోదండ రామ స్వామి వారి ఆలయ రాజ గోపురము

గర్భగుడి ద్వారములు సువర్ణమయమై ముందుగా జయవిజయులు ద్వారపాలకులై సాక్షాత్కరిస్తారు. ఈ ఆలయంలో పంచబేరమూర్తులు ఉన్నారు. ఈఆలయ ప్రధాన గోపురమునకు ఎదురుగా కొంత దూరములో శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న గుడి ఉంది. దాని కెదురుగా ఆంజనేయ స్వామివారి స్తంభమున్నది.

మూలాలు[మార్చు]

  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  • శ్రీ కోదండ రామాలయం, తిరుపతి; తలుపూరు రామరమేశ్ కుమార్, మన దేవాలయాలు, సప్తగిరి మాసపత్రిక, 2006 ఏప్రిల్ సంచికలో ప్రచురంచబడిన వ్యాసం.