Jump to content

ధృవబేరము

వికీపీడియా నుండి
(తిరుమల శ్రీవారి మూర్తి నుండి దారిమార్పు చెందింది)

తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధృవబేరము అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. ఈ మూర్తి స్వయంభూమూర్తి (అనగా స్వయంగా వెలసినది, ఎవరూ చెక్కి ప్రతిష్ఠించలేదు) అని భక్తుల విశ్వాసం. మూలవిరాట్టు అయిన ధృవబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.

విగ్రహం వర్ణన

[మార్చు]

ధృవబేరం సుమారుగా పది అడుగుల ఎత్తున్న స్వామివారి మూర్తి. <[1] 18 అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు. గురువారం సాయంకాలం, శుక్రవారం నాడు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక, స్వామివారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి.[2]

ధృవబేరం చక్కని ముఖకవళికలతో వెలసి ఉంటుంది. ముక్కు మరీ ఎత్తూ కాదు, చప్పిడీ కాదు. కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి. నుదుటిపై రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంది. నిత్యం పచ్చకర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంతభాగం కప్పివేస్తుంది. నామం రూపం, పరిమాణం వంటి వివరాలు వైఖానస ఆగమంలో చెప్పినవిధంగా కచ్చితంగా పాటిస్తారు. స్వామివారి శిరస్సుపై (నుదుటిపైభాగం వరకు) కిరీటం ఉంది. ఆయన జటాజూటము భుజాలపై పడుతూ ఉంటుంది. కచ్చితమైన కొలతలు తీసికొనబడనప్పటికీ స్వామివారి ఛాతీ వెడల్పు సుమారు 36-40 అంగుళాల మధ్య పరిమాణంలోనూ, నడుము భాగం వెడల్పు 24-27 అంగుళాలు పరిమాణంలోనూ ఉంటుంది. స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది. ఆయన వక్షస్థలం కుడిభాగాన శ్రీలక్ష్మీదేవి రూపం ఉంది. స్వామివారు చతుర్భుజములను కలిగియున్నారు. పై కెత్తిన కుడిచేతిలోనున్న సుదర్శన చక్రము, ఎడమచేతిలోనున్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు. అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు. దిగువనున్న రెండుచేతులలోను కుడిచేయి వరదహస్తము (అరచేయి భక్తులకు కనిపిస్తూ, వరములను ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుంది. తన పాదాలు నమ్ముకోమని సూచన). ఎడమచేయి కట్యావలంబిత ముద్రలో (నడుమువద్ద మడచినచేయి. అరచేయి స్వామివారివైపు ఉంటుంది) ఉంది. నడుము క్రిందభాగంలో స్వామివారు ధోవతి ధరించి ఉంటారు. రెండు మోకాళ్ళూ కొంచెంగా వంగినట్లు కనిపిస్తాయి (స్వామివారు భక్తుల రక్షణకు నడచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా). స్వామివారు ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో ఉండనప్పటికీ స్వామివారి భుజాలపై ధనుర్బాణాల ముద్రలున్నాయి.[2]

వివాదాలు

[మార్చు]

వేంకటేశ్వరునిగా వ్యవహరించే ఈ ధృవభేరం ఏ దేవతామూర్తిది, మొదటి నుంచి ఏ రూపంగా అక్కడ అర్చన కొనసాగింది అన్న విషయంపై తీవ్ర వాదోపవాదాలు సాగాయి. విష్ణుమూర్తి, శివుడు, కుమారస్వామి, శక్తి వంటి వివిధ దేవతారూపాల్లో ఎవరిది అన్న ప్రశ్నపై వేర్వేరు సంప్రదాయాలకు చెందిన భక్తులు వివిధ అభిప్రాయాలు ఏర్పరుచుకున్నారు. సా.శ.11వ శతాబ్దిలో జరిగిన వాదోపవాదాల్లో వైష్ణవ మతాచార్యుడు రామానుజాచార్యుడు ప్రమాణయుతంగా వాదించి విష్ణువు విగ్రహమేనన్న వాదాన్ని గెలిపించి నేడు అనుసరిస్తున్న వైష్ణవ ఆగమాలను స్థిరపరిచినట్లు సాహిత్యాధారాలు చెబుతున్నాయి.

వివిధ ప్రతిపాదనలు

[మార్చు]

విగ్రహాన్ని ఏ ప్రాతిపదికలపై వివిధ సంప్రదాయాల వారు వేర్వేరు దేవీమూర్తులదిగా భావించారన్న విషయం ఇలా క్రోడీకరించవచ్చు:

  • శివుడు: తిరుమలలోని ధృవబేరాన్ని శివునిగా కొందరు భావించడానికి ముఖ్యకారణాలు విగ్రహానికి దీర్ఘకేశాలుండడం, ధనుర్మాసంలో నెలరోజుల పాటుగా బిల్వపత్రపూజ జరగడం వంటివి. విగ్రహం భుజాలపై నాగాభరణాలు ఉండడం కూడా ఈ సందేహానికి బలమిచ్చింది. ఈ పర్వతంపై శివుడు తపస్సు చేసినట్లు పురాణాలు చెప్తూండడమూ ఒక కారణం.
  • కుమారస్వామి: వామన పురాణంలో కుమారస్వామి రాక్షసవధ అనంతరం బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకునేందుకు తిరుమలలో తపస్సు చేసినట్టుగా ప్రస్తావన ఉంది. పవిత్రమైన కొలనులో స్నానమాచరించి పునీతం చేసినట్టుగా ఉంది. తిరుమలలోని మూలవిరాట్టుగా ఆ కుమారస్వామే నిలిచారనే వాదన బలంగా వినిపించారు. తిరుమలలోని వేంకటేశ్వర ఆలయం పక్కనే ఉన్న స్వామి పుష్కరిణి అనే పుణ్య తీర్థంలోని స్వామి అన్న పదం ఏర్పడేందుకు స్వామి పదంతో ప్రసిద్దుడైన సుబ్రహ్మణ్యస్వామి పేరుతోనే ఏర్పడిందని భావించారు. విగ్రహానికి ఉన్న జటాజూటాలు, నాగాభరణాలు కుమారస్వామికి కూడా ఉంటాయని ప్రసిద్ధి.
  • పార్వతీదేవి: తిరుమల మూలవిరాట్టును శక్తిరూపంగా కూడా భావించారు. దీర్ఘమైన కేశాలు ఉండడం, శుక్రవారం పసుపుతో అర్చించడం ఈ ప్రతిపాదనలకు మూలకారణం. ధృవబేరానికి ఆరడుగుల పొడవైన చీరవంటి వస్త్రాన్ని కట్టడం కూడా శాక్తేయులు సమార్థనగా చూపించారు. ఆలయప్రాకారంపై సింహాలున్నాయి. సింహాలు శక్తిపీఠంపైనే ఉంటాయని వాదించారు.
  • ఇతర దైవాలు: విష్ణుమూర్తి నాభిలో కమలం ఉండి ఆ కమలం నుంచి బ్రహ్మ జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. కాగా తిరుమల ఆలయంలోని విగ్రహానికి నాభికమలం లేకపోగా కమలపీఠంపై విగ్రహం ఉండడంతో బ్రహ్మ కూడా కావచ్చని కొందరు, కాలభైరవుని విగ్రహమేమోనని మరికొందరు వాదించారు.

సా.శ.పదకొండవ శతాబ్ది వరకూ విగ్రహానికి శంఖచక్రాలు ఉండేవి కాదు. శంఖమూ, చక్రమూ ధరించినట్టుగా చేతులు ఎత్తి వేళ్లను పైకి చూపిస్తూన్న భంగిమలో ఉండేది తప్ప శంఖచక్రం ఉండేదికాదు. విష్ణుమూర్తి విగ్రహమే అయ్యిఉంటే శంఖచక్రాలు ఉండేవి కదా అన్న వాదన జరిగింది. ధృవబేరానికి వందల సంవత్సరాలుగా వైఖానస ఆగమ పద్ధతులలోనే విష్ణుమూర్తి రూపమనే భావనతో ఆరాధనలు జరుగుతూన్నా శైవులు, శాక్తేయులలో వైష్ణవమూర్తి కాదనే నమ్మకం బలపడి సా.శ.పదో శతాబ్ది నాటికి గందరగోళం నెలకొంది.

రామానుజాచార్యుల ఖండన

[మార్చు]

రామానుజాచార్యులు ధృవబేరం శివుడు, కార్తికేయుడు, శక్తి వంటి దేవతారూపాలు కాదని నిర్ధారణగా శ్రీమహావిష్ణువేనని నిరూపించారు. వేద పురాణ ప్రమాణాలను చూపి శైవుల వాదనలు ఖండించి అప్పటివరకూ కొనసాగుతున్న వైఖానస ఆగమంలో వైష్ణవ పూజా విధానాలు స్థిరపరిచారు.
అంతకుమునుపు శైవులు తమ వాదనలను సా.శ.పదకొండవ శతాబ్ది నాటి స్థానిక యాదవరాజు వద్దకు తీసుకువెళ్ళారు. యాదవరాజుకు తమ ప్రతిపాదనలు, వాదనలు వివరించి శైవారాధనలు ప్రారంభించేందుకు అనుమతించమని కోరారు. అప్పటికే శైవులు, శాక్తేయులు విగ్రహాన్ని ఇతర దేవతావిగ్రహంగా ఆపాదించడమే కాక, ఎవరి సంప్రదాయాలను అనుసరించి వారు రకరకాల పూజలు ఆలయప్రాంగణంలో నిర్వహించుకోవడం, బలులు ఇవ్వడం వంటివి యాదవరాజుల కాలానికి తారాస్థాయికి చేరుకొన్నాయి.[3] ఆ స్థితిగతుల మధ్య విశిష్టాద్వైత భాష్యకారుడు రామాజాచార్యులు తిరుమల ప్రాంతానికి చేరుకుని యాదవరాజు ముందు శ్రుతి (వేదం), పురాణాల నుంచి సాక్ష్యాధారాలను చూపించి వాదించారు. శివుడు, కార్తికేయుడు, శక్తి కాదని, విష్ణుమూర్తి విగ్రహమేనని నిర్ధారణ చేసేలా ప్రమాణయుతంగా నిరూపించారు.

విష్ణుమూర్తి విగ్రహంగా నిరూపణ

[మార్చు]

వేంకటేశ్వరస్వామి విగ్రహం విష్ణువా, కుమారస్వామియా, శివుడా, శక్తియా, కాలభైరవుడా, బ్రహ్మా అన్న విషయంపై జరిగిన నిర్ణయచర్చలో రామానుజులు ఇతర దైవాలన్న వాదనలు ఖండిస్తూ, విష్ణువేనన్న విషయాన్ని సమర్థిస్తూ చేసిన వాదనలోని అంశాలివి. అనంతాచార్యులు రచించిన వేంకటాచల ఇతిహాసమాలలో సా.శ.పదకొండవ శతాబ్దినాడు జరిగిన ఈ వాదన విస్తారంగా వివరించారు.

  • వామనపురాణంలోని 33వ అధ్యాయంలో అగస్త్యుడు, ఇతర మునులు, వసువుతో స్వామి పుష్కరిణికి, వేంకటాచలానికి వెళ్తూ-అది నారాయణునికి ప్రీతిపాత్రమైన విష్ణుమూర్తి క్షేత్రమని ప్రస్తావిస్తారు. వరాహపురాణంలో సూతుని వాక్యాలు, భూ వరాహస్వాముల సంవాదం, పద్మపురాణంలోని శుకుని వాక్యాలు, గరుడపురాణంలో వశిష్ఠుడు అరుంధతికి చేసే బోధ, బ్రహ్మాండపురాణంలో భృగుమహర్షికి నారదుని బోధ వంటివి వైష్ణవ క్షేత్రంగా వేంకటాచలాన్ని అభివర్ణించారు.[4] హరివంశ పురాణంలో భీష్ముడు తాను ఎలా వేంకటాచలానికి వచ్చాడో ధర్మరాజుకు చెప్తూ 'స్వామి పుష్కరిణీ తీరములో సూర్యమండలమువంటి విమానంలో శ్రీనివాసుడు వేంచేసి వున్నారని వర్ణించారు. వరాహపురాణంలో భూదేవి, వరాహమూర్తిల సంభాషణలో వేంకటాచలంపై పుష్కరిణీతీరంపై ఆనందము అనే పేరుగల పుణ్యవిమానంలో నివసిస్తాడని స్పష్టంగా చెప్తారు. పుష్కరిణికి పశ్చిమంగా, వరాహస్వామికి దక్షిణంగా శ్రీనివాసుడు నివసించడాన్ని గురించి పద్మపురాణం, మార్కండేయ, స్కంద, భవిష్యోత్తర పురాణాల్లో విపులవర్ణనలు ఉన్నాయి.[5]
  • స్కందుడు ఈ ప్రాంతానికి వచ్చి తపమాచరించినందున ధృవబేరం ఆయన మూర్తేనన్న వాదన ఖండిస్తూ ఈ పర్వతానికి ఎవరు వచ్చినా శ్రీనివాసుని దర్శించుకుని, ఆయన గురించి తపస్సు చేయడానికో, పాపప్రక్షాళనల కొరకో వచ్చినవారేనని పురాణాలే చెప్తున్నాయని వివరించారు.[6] వామన పురాణంలో తారకాసురుని వధ వల్ల వచ్చిన పాపప్రక్షాళన ఎలా చేసుకోవాలని ప్రశ్నించిన స్కందునితో వేంకటాచల మహాత్మ్యం అక్కడ కొలువైన విష్ణుమూర్తి మహిమలు వివరించి పరమశివుడే వేంకటాచలం పంపినట్టు నారదుడు వాల్మీకితో చెప్పారు. వైష్ణవ మంత్రాల్లోకెల్లా ఉత్తమమైన వైష్ణవమంత్రం ఉపదేశించమని శంభుణ్ణి కోరి ఉపదేశం పొందిన స్కందుడు వేంకటాచలానికి వెళ్ళాడని పురాణం చెప్తోంది.[7] పురాణాల పరంగా ఆదిశేషుడు, వాయుదేవుడూ ఈ పర్వతంపై తపమాచరించారని అంతమాత్రాన ఇది వాయుక్షేత్రమో, శేషుని క్షేత్రమో అవుతుందా అని ప్రశ్నించారు. స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడం వెనుక అది తీర్థాలన్నిటికీ సార్వభౌమమని భగవంతుడు వరం ఇవ్వడమే కారణమని స్పష్టం చేశారు.[4] తపస్సు ఆచరించడానికి వచ్చిన కుమారస్వామి కనుక ఆయుధాలు లేవని శైవుల సమర్థనను వామన పురాణంలో వేంకటాచలం వెళ్ళినపుడు కుమారస్వామి ధనుస్సు, శక్తి ధరించే వెళ్ళినట్టు ఉండడాన్ని గుర్తుచేసి ఖండించారు. ధృవబేరానికి రెండు చేతులు కటిహస్తం, వరదహస్తం కాగా మరో రెండు చేతులూ పైకి ఎత్తి ఆయుధాలు పట్టుకోవడానికి ఎత్తినట్టు ఉంటాయి. శరవణుడే ఐతే ధనుస్సు ఆయుధంగా కల ఆయన అది వదిలారనుకున్నా అలా చెయ్యి ఎత్తిపట్టుకోరు కదా.[8]
  • శంఖ చక్రాలు ధరించకపోవడాన్ని సమర్థిస్తూ పురాణాల్లో చోళరాజుకు ఐదు ఆయుధాలు ఇవ్వడం, రాక్షస సంహారం కోసం తొండమాను చక్రవర్తికి తన శంఖచక్రాలు ఇచ్చినట్టున్న సందర్భాలు వివరించారు. శ్రీనివాసుడు తొండమానుడికి ఆయుధాలు ఇచ్చినప్పుడు వరం కోరుకొమ్మంటే తనకు సహాయంగా శ్రీహరి శంఖచక్రాలు ఇచ్చినట్టు తరతరాలుగా తెలిసేట్టు ఆ ఆయుధాలు ధరించని స్థితిలో ఉండమని కోరాడు. దాన్ని మన్నించి ఆ ఆయుధాలను అవ్యక్తంగా ఉంచేశారనే ఘటన వివరించి సమర్థించారు. తొండమానుడితో సంభాషణలోనే భవిష్యత్ కాలంలో తాను తిరిగి శంఖచక్రాలు ధరిస్తానని తెలిపారట. వీటన్నిటి నేపథ్యంలో వాదనల అనంతరం స్వామి ముందు విష్ణు ఆయుధాలైన శంఖచక్రాలు, సుబ్రహ్మణ్య ఆయుధాలైన శక్తి, శివపార్వతుల త్రిశూలం బంగారంతో చేయించి ముందుంచారు. నీవు ఏ దైవానివైతే ఆ ఆయుధాలు స్వీకరించమని ప్రార్థించి తెల్లవార్లూ ఆలయం చుట్టూ కాపలా ఉండి ఉదయం తెరచి చూశారు. ఖాళీ చేతుల స్థానంలో శంఖ చక్రాలు చేరాయని అదే స్థితిలో నేటికీ ధృవబేరం ఉందని వేంకటాచల ఇతిహాసమాల తెలిపింది.
  • వక్షఃస్థలంపై లక్ష్మీశ్రీవత్సం ఉండడం కూడా వేంకటేశుడే శ్రీనివాసుడని సూచిస్తున్నట్టుగా తెలిపారు.

మూలాలు

[మార్చు]
  1. "Sri Venkateswara, the lord of the seven hills, Tirupati,Page 17,P.Sitapati, 1968". TTD. Retrieved 2007-05-10.
  2. 2.0 2.1 డాక్టర్ ఎన్.రమేశన్ (1981). ది తిరుమల టెంపుల్(The Tirumala Temple). తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానాలు.
  3. తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:2013 ప్రచురణ:పేజీ.13
  4. 4.0 4.1 తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:2013 ప్రచురణ:పేజీ.20
  5. తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:2013 ప్రచురణ:పేజీ.22
  6. తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:2013 ప్రచురణ:పేజీ.18
  7. తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:2013 ప్రచురణ:పేజీ.19
  8. తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:2013 ప్రచురణ:పేజీ.24
"https://te.wikipedia.org/w/index.php?title=ధృవబేరము&oldid=4339908" నుండి వెలికితీశారు