కొలువు శ్రీనివాసుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిరుమల వెంకటేశ్వర ఆలయం లో ఉన్న విగ్రహం కొలువు శ్రీనివాసుడి విగ్రహం. ఇది మూలవిరాట్టును పోలి ఉండే వెండి విగ్రహం [1] కొలువు శ్రీనివాసుడు ఆలయ సంరక్షక దేవత. ఈ విగ్రహాన్ని బలిబేరం అని కూడా పిలుస్తారు. బలిబేరం నిర్వహించే విధులు గృహస్థు విధుల్లాగా ఉంటాయి. ప్రతిరోజు ప్రాతఃకాలంలో తోమాల సేవ తరువాత తిరుమామణి మండపంలో కొలువు లేదా ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారిని బంగారు ఛత్రం క్రింద రజత సింహాసనంపై ఆసీనుని గావిస్తారు. ప్రధాన మూర్తికి బదులుగా కొలువు శ్రీనివాసుడు విగ్రహం అధ్యక్షతన ఇక్కడి కార్యక్రమం జరుగుతుంది. ఈయన అన్నివిధాల మూలదైవాన్ని పోలివుంటాడు. దేవాలయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు, ఆదాయ వివరాలను పర్యవేక్షిస్తుంటాడు. ప్రతిరోజు ఆనాటి తిథి వార నక్షత్రాది వివరాలతో కూడిన పంచాంగ శ్రవణం ఈ మూర్తికి వినిపిస్తారు. అర్చకులకు మాత్రదానంగా ఇచ్చే బియ్యం, వారివంతునకు వచ్చే భాగం ఇక్కడ ఇవ్వబడుతుంది. బలిపీఠంలో గరుడుడు, హనుమంతుడు, విశ్వక్సేనులకు బలిని సమర్పించే ముందు బలిబేరం అనుమతి కోరతారు. బలిబేరం ఆలయ అంతర్భాగం లోని 16 స్తంభాల తిరుమామణి మంటపం దాటి బయటికి వచ్చిన దాఖలాలు లేవు. [2]

కొలువు, రోజువారీ సేవలు[మార్చు]

ఉదయం తోమాలసేవ లేదా అభిషేకం జరిగిన తరువాత, ముందు రోజు నాటి ఖాతాలను మూసివేసి, స్వామికి సమర్పిస్తారు. ఈ కర్మను కొలువు అని పిలుస్తారు. దీనిని దర్బార్ అని కూడా పిలుస్తారు. కొలువు శ్రీనివాసుని తిరుమామణి మంటపానికి (గర్భగుడి లోపల) తీసుకువచ్చి, వెండి పూతతో కుర్చీపై, మైసూరు మహారాజా సమర్పించిన బంగారు ఛత్రం కింద కూర్చోబెడతారు. [3] ఈ కర్మను ఏకాంతంలో నిర్వహిస్తారు. పూజారులు. తితిదే అధికారులూ మాత్రమే ఉంటారు. కింది ఆచారాలు జరుగుతాయి:

  • వేయించిన నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని ప్రభువుకు అర్పిస్తారు.
  • వేదాలు, విష్ణు సూక్తం, తమిళ దివ్య ప్రబంధాలను పఠిస్తారు
  • అప్పుడు పూజారి "పంచాంగం అగమ్యతాం" అని చెప్పి పంచాంగం వినమని ప్రభువును అభ్యర్థిస్తారు. ఆ రోజున చేపట్టబోయే కార్యకలాపాలతో పాటు మరుసటి రోజు కార్యకలాపాలను ప్రభువుకు నివేదిస్తారు. తిరుమల ఆలయంలోని ఉత్సవాలు, ఆచారాల వివరాలతో పాటు, తిరుపతిలోని గోవిందరాజ స్వామి, కోదండరామ స్వామి ఆలయాల వద్ద, తిరుచనూరు పద్మావతి దేవి ఆలయం వద్ద, శ్రీ కాళహస్తి శ్రీ కాళహస్తీశ్వర ఆలయం వద్ద, సమీపంలోని అనేక ఆలయాల వద్ద జరిగిన ఉత్సవాల వివరాలు చదువుతారు.
  • ఒక తితిదే అధికారి, మునుపటి రోజు హుండీ వివరాలను తేదీ, ఉదయం సేకరణ మొత్తం, మధ్యాహ్నం సేకరణ మొత్తం, సేకరించిన చిల్లరతో సహా చదువుతారు. ఈ వివరాలలో విరాళాలు, అర్జితం, ఇతర ఆదాయ వనరులూ ఉండవు. చివరికి, ఈ మొత్తం సొమ్మును శ్రీవారి భాండాగారానికి జమ చేసినట్లు ప్రకటిస్తారు.
  • మాత్రదానం : శ్లోకాలు, ప్రబంధాలను పఠించిన అర్చకులకు బియ్యం, అల్లం వగైరాలు దానమిస్తారు.

వార్షిక సేవ: పుష్ప పల్లకీ[మార్చు]

ఆర్థిక సంవత్సరం చివరలో (జూలైలో వస్తుంది) జరిగే ఆణివార అస్థానం అనేది ఒక వార్షికాచారం. దేవాలయ వార్షికాదాయ లెక్కలను భగవంతునికి సమర్పిస్తారు. ప్రధాన అధికారులందరి కార్యాలయ చిహ్నాలను ప్రభువుకు నివేదించి తిరిగి తీసుకుంటారు. ఆ విధంగా ఆయా కార్యాలయాలు నిర్వహించడానికి వారు తగినవారేనని ప్రభువు ఆమోదించినట్లు ఇది సూచిస్తుంది. వచ్చే ఏడాది లెక్కలు రాసేందుకు కొత్త పుస్తకాలు జారీ అవుతాయి. ఈ కార్యక్రమం ముగింపులో, దేవాలయ అధికారుల పట్ల ప్రభువుకున్న సంప్రీతికి సూచికగా ప్రధాన పూజారి ప్రధాన అధికారులందరికీ తాంబూలం ఇస్తాడు.

ఈ కర్మ ఏకాంతంలో జరుగుతుంది. ప్రజలకు ఇది అందుబాటులో ఉండదు. కర్మ తరువాత, ఉత్సవ మూర్తిని భార్యలతో సహా, పువ్వులతో అలంకరించిన పల్లకీలో ఊరేగిస్తారు. ఈ వేడుక ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

మూలాలు[మార్చు]

  1. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
  2. Ramesan, Dr N (1981). The Tirumala Temple. Tirumala: Tirumala Tirupati Devasthanams.
  3. Ramesan, Dr N (1981). The Tirumala Temple. Tirumala: Tirumala Tirupati Devasthanams.

తిరుమల ఆలయము (ధారావాహికం-41), ఆంగ్లమూలం: డా.రమేశన్, తెలుగు అనువాదం: డా.కోరాడ రామకృష్ణ, సప్తగిరి మాసపత్రిక 2006 ఏప్రిల్ లో ప్రచురించిన వ్యాసం.