Jump to content

కొలువు

వికీపీడియా నుండి

ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిపే నిత్య ఆరాధనలో భాగంగా 'యాత్రాసనం' అనే కొలువు నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పంచ మూర్తులలో ఒకరైన కొలువు శ్రీనివాసుని ఈ కొలువులో విశేష ఆరాధన, ఉపచారములను సమర్పిస్తారు. ఈ కొలువులో మొదట, శ్రీవారిని ఒక స్వర్ణ సింహాసనంలో వేంచేపు చేసి, తర్వాత వైఖానస అర్చక స్వామి ముందుగా ఘంటానాదం చేసి, తర్వాత 'యాత్రాసనం' ఉపచారాన్ని ప్రారంభించేందుకు సంకల్పం చేసుకుంటారు. తర్వాత కొలువు శ్రీనివాసుడు లేక 'బలి బేర మూర్తికి ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమన, ధూప, దీప మొదలైన షడుపచారములను సమర్పించి తర్వాత 'మాత్రాదానం' అనే వైదిక ప్రక్రియ నిర్వర్తిస్తారు. మాత్రాదానంలో భాగంగా, శ్రీవారి నుండి శ్రీ వైఖానస అర్చక స్వామి 'తండులా దానం' (బియ్యం) స్వీకరించి, శ్రీవారిని 'నిత్యైశ్వర్యో భవ' అని ఆశీర్వదిస్తారు. తర్వాత శ్రీవారికి నువ్వులచిమ్మిరిని నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత ఏకాంగి స్వామి క్లుప్తంగా దివ్య ప్రభంధ పాశురాలు శ్రీవారికి వినిపిస్తారు. తర్వాత శ్రీవారికి ఆ రోజు తిథి వార నక్షత్ర వివరాలతో పంచాంగ శ్రవణం చేస్తారు. ముందు రోజు హుండి జమా ఖర్చుల వివరాలను విన్నవించి, నవనీత హారతిని ఇవ్వడంతో కొలువు కార్యక్రమాన్ని ముగిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కొలువు&oldid=4182660" నుండి వెలికితీశారు